Friday 18 December 2015

వ్యాన్గో కుర్చీ



వ్యాన్గో కుర్చీ..
చాలా మామూలుది
నాలుగు కర్రలూ కాస్త నులకా.. అంతే
కానీ, ఎందుకలా ప్రాణంతో జ్వలిస్తూ.. 
రంగుల హోరై, రేఖల పాటై
రారమ్మని పిలుస్తూ..
వ్యాన్గో.. మైడియర్ మ్యాడ్ బోయ్.. !
నువ్వు నిజంగా వెర్రివాడివే బ్రదరూ..
లేకపోతే,
దేహాన్నీ, ఆత్మనూ ఇంతగా కరిగించుకుని
ప్రేమగా రంగరించుకున్న ఈ నీ పేద ప్రేమసింహాసనంలో
ఒక రుతువు కూడా కూర్చోకుండానే
నీ కృశించిన తనువును ఇందులో
కాసేపైనా ఊరడించకుండానే
ఏం తరుముకొచ్చిందని వెళ్లిపోయావ్..?
ఆర్ల్స్ పట్టణంలోని నీ పచ్చఇంటిలో
నీతోపాటే బిక్కుబిక్కుమని వేలాడిన ఈ జ్వలాతోరణాన్ని
నీ పాలిపోయిన ఆకుపచ్చ కనుపాపల్లో వెలిగిన ప్రేమపీఠాన్ని
వెర్రివాడా, కుర్రవాడా.. ఎందుకురా గిరవాటేసి వెళ్లిపోయావ్?
వ్యాన్గో.. మైడియర్ ఆత్మాహుతి రంగుల బాంబరూ..!
లోకంతో కళాలోకంతో
అంతులేని నీ పోరాటంలో
ఓడి గెలిచిన విజయదరహాసంతో
ఆవర్స్ పొలిమేరలో ఆ సంధ్యాసమయంలో
నీ డొక్కలో నువ్వు గుండు పేల్చుకుని పోయాక..
నీ ప్రియమైన ఈ కుర్చీ కంఠనాళాలు తెగేలా
పాడిన విషాదగీతం
నీకు వినిపించకపోయినా..
నాకు వినిపిస్తోంది..
కాలిపోతున్న ఇంద్రధనుస్సు చిటపటల్లా..
విన్సెంట్ వ్యాన్గో 1889లో వేసిన కుర్చీ బొమ్మ తలపోతలో..

No comments:

Post a Comment