Friday, 18 December 2015

కాండీడ్-6వ భాగం

సారంగ సాహిత్య వారపత్రికలో వస్తూ ఉండిన వోల్టేర్ నవల ‘కాండీడ్’ అనువాదం అనివార్య కారణాల వల్ల ఆ పత్రికలో ఆగిపోయింది. ఈ అనువాదం ఇక నుంచి కళాసాహితి బ్లాగులో కొనసాగుతుంది. పూర్వకథను ఆ  పత్రికలో చదువుకోవచ్చు. వీలునుబట్టి ఆ పాత భాగాలనూ ఇందులో పోస్ట్ చేస్తాను.
 -పి.మోహన్


(గడిచిన కథ.. కాండీడ్ అంతా మనమంచికేనని నమ్మే ఆశాజీవి. క్యూనెగొండ్ అతని ప్రియురాలు. కష్టాల్లో చిక్కుకున్న ఆమెను కాండీడ్ కాపాడి, ఆమె దాసి అయిన ముసలమ్మతోపాటు పరాగ్వేకి బయల్దేరతాడు. ప్రయాణంలో ముసలమ్మ తన కథ చెప్పడం మొదలు పెట్టింది..)


11వ అధ్యాయం


అమ్మా, నా కళ్లు ఎప్పుడూ ఇలా చింతనిప్పుల్లా మండేవి కావు. ముక్కు ఇంత ఘోరంగా దిగజారి గడ్డాన్ని తాకేది కాదు. అసలు నేనిలా ఎప్పుడూ దాసిగా ఉండిందే లేదు. నేను పోప్ పదో అర్బన్ కు, పాలస్త్రీనా రాకుమార్తెకు పుట్టాను. పద్నాలుగేళ్లు వచ్చేవరకు అందమైన భవనంలో సుకుమారంగా, ఏ లోటూ లేకుండా పెరిగాను. మీ మొత్తం జర్మన్ జమీందార్ల భవంతులకంటే మా భవనంలోని గుర్రాల పాకలే రమణీయంగా ఉండేవనుకో. మీ వెస్ట్ ఫేలియాను మొత్తం కలిపి విలువ కట్టినా నేను తొడిగి పారేసిన ఒక్క గుడ్డపాటి ఖరీదు చేసేది కాదు. రోజులు గడిచేకొద్దీ అందంగా, నాజూకుగా తయారవసాగాను. మాట చాతుర్యమూ పెరిగింది. రోజులు సంతోషంగా, అశావహంగా గడచిపోయేవి. ఎక్కడికెళ్లినా నీరాజనాలు పట్టి పొగడ్తలతో ముంచెత్తేవాళ్లు. అందరూ నన్ను పొందాలని పరితపించిపోయేవాళ్లు. నా వంపుసొంపులు రోజురోజుకూ ఇనుమడించసాగాయి. రొమ్ములు తీర్చిదిద్దినట్లు పెరిగి, ఎంత అందగా ఉండేవని! తెల్ల లిల్లీపువ్వుల్లా, బిగువుగా, మెడిచీ వీనస్ దేవత బొమ్మ రొమ్ముల్లా మనోహరంగా ఉండేవి. కళ్ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. కనురెప్పలు ఆల్చిప్పల్లా, కనుబొమలు నల్లగా మెరిసిపోతుండేవి. నా కనుపాలల్లోని కాంతి ముందు ఆ నక్షత్రాలు కూడా వెలవెలబోతాయని మా కవిజనం కీర్తించేవాళ్లు. నా చెలికత్తెలు నాకు బట్టలు తొడిగేటప్పుడు, విప్పేటప్పుడు నా దేహసంపదను ముందూ, వెనకా కళ్లింతలు చేసుకుని అలాగే చూస్తుండిపోయేవాళ్లు. వాళ్ల స్థానం ఆక్రమించి నా సేవలో తరించిపోవాలని ఉవ్విళ్లూరని మగాడే లేడనుకోండి.

నన్ను మసా కారారా రాకుమారునికిచ్చి పెళ్లిచేయాలని నిశ్చితార్థం చేశారు. అందులో అతడు నాకు సరిజోడు. సరససల్లాపాల్లో దిట్ట. ప్రేమజ్వరతో నిలువెల్లా కాలిపోయేవాడు. నేను కూడా అంతే, తొలివలపంత గాఢంగా అతన్ని ప్రేమించాను. మా పెద్దలు మా పెళ్లిని ఆకాశమంత పందిరి వేసి, భూలోకమంత పీటలు వేసి ఘనంగా చెయ్యాలనుకున్నారు. ఏర్పాటు మొదలయ్యాయి. విందులు, నాట్యాలు, ఊరేగింపులు.. విరామం లేకుండా సందడిగా సాగుతున్నాయి. ఇటలీ దేశం మొత్తం నాపై పాటులు, పద్యాలు రాయడంతో మునిగిపోయింది. అయితే వాటిలో చెప్పుకోదగ్గది ఒక్కటీ లేదనుకోండి. పెళ్లిలో అలా నా ఆనందం అంబరాన్ని తాకుతుండగా, రాకుమారుని ముసలి దాది అతణ్ని తనతో పాటు కొంచెం చాక్లెట్ పానీయం తాగాలని పిలిచింది. తర్వాత పట్టుమని రెండు గంటలు గడవకముందే అతడు గిలగిలా తన్నుకుని చచ్చిపోయాడు. అయినా నాకు అదేమంత పెద్దదెబ్బ కాదనుకోండి. మొత్తానికి అతని మరణంలో కలతచెందాను. మా అమ్మకూడా దిగాలు పడిపోయింది కాని, నా అంతగా కలవరపడలేదు. ఆ విషాదాన్ని మరచిపోవడానికి ఆమె గేటాలోని తన అందమైన జమీకి వెళ్లిపోవాలని నిర్ణయించింది. రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ చర్చి పూజాపీఠంలా అందంగా అలంకరించిన నావలో బయల్దేరాం. కొన్ని మైళ్లు పోయామో లేదో, మూర్ జాతి సముద్రపు దొంగలు మా ఓడను చెరబట్టారు. మా అంగరక్షకులు ఆత్మరక్షణ కోసం పోప్ అంగరక్షకుల్లా వీరోచితంగా ఆ దొంగల కాళ్లపైపడిపోయి, ఆయుధాలు కిందపడేసి, ప్రాణభిక్ష పెట్టాలని దేబిరించారు.

తర్వాత మా భటులందరికీ గుడ్డలు ఊడదీశారు. వాళ్లు తోకల్లేని కోతుల్లా తయారయ్యారు. మా అమ్మకు, నాకు, మా చెలికత్తెలకు కూడా అంతకుమించిన గౌరవమర్యాలు దక్కలేదనుకోండి. వాళ్లు మా బట్టల్ని రెప్పపాటులో ఊడదీయడం నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. కానీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే, సిరంజి గొట్టం మినహా మరి దేన్నీ అనుమతించని మర్మావయవాల్లో ఆ దొంగలు వేళ్లు పెట్టడం నాకు అంతకంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. అదో వింత ఆచారంలా తోచింది. మనం తొలిసారి స్వదేశాన్ని వదలగానే మనకు తెలియని ప్రతిదాన్నీ వింతగానే భావిస్తాం కదా. మేం జననాంగాల్లో వజ్రాలూ, నగలూ గట్రా దాచుకున్నామేమోననే అనుమానంతో వాళ్లు అలా వెతికారని తర్వాత నాకు అర్థమైంది. పూర్వం సముద్రయానం చేసిన నాగరిక జాతులన్నీ ఈ ఆచారాన్ని పాటించాయట. మాల్టా క్రైస్తవ ధర్మపరిరక్షక వీరయోధులు తురుష్కులను ఖైదీలుగా పట్టుకున్నప్పుడు ఆడామగా తేడాల లేకుండా అందర్నీ ఇలా శోధించేవాళ్లని, దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయసూత్రాల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తవని నాకు తర్వాత తెలిసింది.

దొంగల ఓడలో మొరాకోకు బానిసలుగా వెళ్తున్న ఒక రాకుమారికి, ఆమె తల్లికి ఎంత కష్టంగా ఉంటుందో మీకు విడమరచి చెప్పాల్సిన పనిలేదు. మా అమ్మ అప్పటికింకా అందంగానే ఉండేది. మా పరిచారికలు, ఆయాలు కూడా అందగత్తెలే. మొత్తం ఆఫ్రికాను జల్లెడపట్టినా వాళ్లకు సాటి వచ్చే వాళ్లెవరూ దొరకరు. ఇక నా వరకు వస్తే, నేను కుందనపు బొమ్మను, పైగా కన్యను. కానీ నా కన్యాత్వం ఎంతోకాలం నిలవలేదు. సుందరాంగుడైన మసా కరారా రాకుమారుని కోసం భద్రంగా కాపాడుకున్న నా యవ్వనపుష్పాన్ని ఆ ఓడ దొంగల కెప్టెన్ తెంపేసి, దారుణంగా ఆస్వాదించి, నలిపిపారేశాడు. అతగాడు నీగ్రో, వికృతంగా ఉండేవాడు. ఆ ఘాతుకానికి పాల్పడింది చాలక, అదేదో నాకు పేద్ద గౌరవమన్నట్టు వాగాడు. నేనూ, మా అమ్మా మొరాకో చేరేవరకు ఆ కష్టాలను తట్టుకోగలిగామంటే గుండె ధైర్యమున్నవాళ్లమనే అనుకోవాలి. అయినా అవి మామూలు కష్టాలేలే, చెప్పుకోదగ్గవి కావు.

మేం మొరాకోలో అడుగుపెట్టేసరికి అది నెత్తుటేర్లలో ఓలలాడుతోంది. చక్రవర్తి ములే ఇస్మాయిల్‌కు యాభై మంది కొడుకులు. ఒక్కొక్కడికీ ఒక్కో ముఠా ఉంది. అవన్నీ కలబడ్డంతో ఒక్కసారిగా యాభై అంతర్యుద్ధాలు చెలరేగాయి. నల్లవాళ్లు నల్లవాళ్లతో, గోధుమరంగు వాళ్లతో కలబడ్డారు. గోధుమరంగు వాళ్లు గోధుమరంగు వాళ్లపై కలబడ్డారు. నల్లవాళ్లకు, తెల్లవాళ్లకు పుట్టినవాళ్లు అలాంటివాళ్లపై కత్తులు దూసుకున్నారు. రాజ్యం నలుమూలలా నరమేధం నిరాఘాటంగా సాగింది.

మేం రేవులో దిగీదిగగానే మా ఓడ కెప్టెన్ విరోధులైన నల్లవాళ్ల ముఠా ఓడను దోచుకోవడానికి వచ్చింది. వజ్రాలు, బంగారం తప్పిస్తే అందులో మేమే విలువైన వస్తువులం. ఒకళ్లపై ఒకళ్లు కలబడి దారుణాతిదారుణంగా నరుక్కున్నారు. మన యూరప్‌లో ఎక్కడా అలాంటి రక్తపాతాన్ని చూసెరగమంటే నమ్మండి. ఏదేమైనా ఒక మాట చెప్పుకోవాలి.. మన ఉత్తరాది జాతులకు ఉడుకు రక్తం తక్కువ. మన మగవాళ్లకు మగువలను చూస్తే కోరిక రేగదు. అదే ఆఫ్రికన్లలోనైతే అది కార్చిచ్చులా రగిలిపోతుంది. మన యూరోపియన్ల నాళాల్లో ఉత్తి పాలు మాత్రమే ప్రవహిస్తున్నాయనిపిస్తుంది. అట్లాస్ పర్వతంపైనా, దాని చుట్టుపక్కలా నివసించేవాళ్ల నాళాల్లోనైతే మంటలు, గంధక ద్రఃవణం ప్రవహిస్తూ ఉంటాయి. సరే.. రేవు దగ్గర ఏం జరిగిదంటే.. మమ్మల్ని ఎవరు వశం చేసుకోవాలో తేల్చుకోవడానికి వాళ్లు తమ దేశంలోని  సింహాల్లా, పులుల్లా, కాలనాగుల్లా కొట్లాడుకున్నారు.  ఒక మూర్ మా అమ్మ కుడి భుజాన్ని లాగాడు. మా ఓడ కెప్టెన్ కింద పనిచేసే చిన్న కెప్టెన్ ఎడమ భుజాన్ని పీకాడు. ఒక మూర్ సైనికుడు ఒక కాలు, మరో దొంగ మరో కాలు పట్టుకున్నాడు. ఈ విధంగా మాలో దాదాపు ప్రతి ఒక్కళ్లనూ నలుగురేసి చెరపట్టి తగవులాడుకున్నారు. ఓడదొంగల కెప్టెన్ మాత్రం నన్ను తన వెనకాల బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ తనతో కలియబడినవాడినల్లా తన కత్తికి బలిపెడుతూపోయాడు. నా తల్లితోపాటు ఇటాలియన్ అతివలందర్నీ ఆ దుర్మార్గులు ఆ పాడు పెనుగులాటల్లో కాళ్లూచేతులూ చీల్చేసి, ముక్కలు ముక్కలు చేశారు. చివరాఖరికి అటు బందీలూ, ఇటు బంధించినవాళ్లూ అందరూ ఖతమమయ్యారు.
నా తోటి ఆడవాళ్లు, సైనికులు, సరంగులు, బానిసలు, నల్లవాళ్లు, తెల్లవాళ్లు, సంకరజాతి వాళ్లు, చివరగా దొంగల కెప్టెనూ అందరూ నేలకొరిగారు. నేనొక్కత్తెనూ ఆ పీనుగుల గుట్టపై చావుకు సిద్ధంగా పడి ఉన్నాను. మూడువందల చదరపు లీగుల విస్తీర్ణమున్న ఆ దేశమంతటా ఇలాంటి దృశాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే అక్కడి ప్రజలు మాత్రం మహమ్మద్ ప్రవక్త రోజుకు ఐదుసార్లు చేయమని చెప్పిన నమాజును పొరపాటున కూడా మరచిపోకుండా పూర్తి చేస్తారు.

నెత్తురోడుతున్నఆ శవాలగుట్ట మీంచి అతికష్టంతో కదలి, కాళ్లీడ్చుకుంటూ దగ్గర్లోని ఓ వాగు పక్కన ఉన్న నారింజ చెట్టు నీడకు చేరుకున్నాను. భయం, ఆందోళన, ఆకలి, నిస్సత్తువ ముప్పిరిగొనడంతో కుప్పకూలిపోయాను. మగత కమ్మేసింది. అలా చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉండగా, నా శరీరాన్ని ఎవరో సున్నితంగా ఒత్తుతూ, కదల్చినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూశా. ఎదురుగా ధవళవర్ణ సత్పురుషుడొకడు నిట్టూరుస్తూ, ‘‘మగసిరి కోల్పోవడం ఎంత దురదృష్టం..’’ అని గొణుగుతూ కనిపించాడు.

12వ అధ్యాయం

నా మాతృభాష చెవినబడేసరికి నాకు బోలడంత ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. అతని గొణుగుడు మరింత విస్మయాన్ని రేకెత్తించింది. అతని దురదృష్టంకంటే దారుణమైన కష్టాలు లోకంలో చాలా ఉన్నాయని బదులిచ్చాను. నేను పడిన భయంకర బాధలను క్లుప్తంగా వివరించి మళ్లీ స్పృహ తప్పి పడిపోయాను. అతడు నన్ను దగ్గర్లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి పక్కపై పడుకోబెట్టాడు. తిండి పెట్టి ఓదార్చాడు. నా కంటే అందగత్తెను తానెక్కడా చూడలేదన్నాడు. తాను కోల్పోయినదాన్న భర్తీ చేయడం అసాధ్యమని వగచాడు.

‘‘నేను నేపుల్స్‌లో పుట్టాను. అక్కడ ఏటా రెండు, మూడువేల మంది పిల్లలకు వృషణాలు కోసేస్తారు. కొందరు శస్త్ర చికిత్సలోనే చనిపోతారు. మరికొందరికి స్త్రీలకంటే మధురమైన గాత్రం వస్తుంది. కొందరు ప్రధానమంత్రులవుతారు. నా శస్త్రచికిత్స దిగ్విజయంగా జరిగింది. నేను పాలస్త్రీనా యువరాణి కొలువులో సంగీత విద్వాంసునిలా కుదిరాను’’ అని తన కథ చెప్పాడు.

పాలస్త్రీనా యువరాణికా? అంటే మా అమ్మకా!’ నేను ఆశ్చర్యంతో అడిగాను.

‘‘మీ అమ్మకా! అంటే.. నేను ఆనాడు పాఠాలు నేర్పిన ఆ చిన్నారి రాకుమార్తెవు నువ్వేనా? నీకు ఆరేళ్లొచ్చేవరకు పాఠాలు చెప్పా కదా. అంత చిన్నప్పుడే నువ్వు సౌందర్యరాశిగా తయారవుతానన్నట్టు ఉండేదానివి సుమీ..’’

‘‘ముమ్మాటికీ నిజం! అయితే మా అమ్మ నీకిప్పుడు ఇక్కడికి సరిగ్గా నాలువందల గజాల దూరంలో ముక్కలుముక్కలుగా నరకబడి, పీనుగులదిబ్బ కింద కనిపిస్తుంది’ అని బదులిచ్చాను.

నేనతనికి నా బాధలను, ఘనకార్యాలను వివరించాను. అతడు కూడా తన సాహసాలను వివరించాడు. ఇతర క్రైస్తవ రాజ్యాల వ్యాపారాలను దెబ్బ తీయడానికి మందుగుండు, ఫిరంగులు, యుద్ధనౌకలు ఇచ్చి సాయం చేయాలని ఓ క్రైస్తవ యువరాజు తనను మొరాకో చక్రవర్తి వద్దకు రాయబారిగా పంపాడని చెప్పాడు.

‘‘నా రాయబారం పూర్తయింది. నేను మళ్లీ మన సీటాకు వెళ్తున్నాను. నిన్ను కూడా ఇటలీకి తీసుకెళ్తాను’’ అని హామీ ఇచ్చాడు.   

అతని కారుణ్యానికి కదలిపోయాను. గుడ్ల నీళ్లు కక్కకుని కృతజ్ఞతలు చెప్పాను. అయితే అతడు నన్ను ఇటలీకి తీసుకెళ్లకుండా అల్జీర్స్ కు తీసుకెళ్లి అక్కడి గవర్నర్ కు అమ్మిపారేశాడు. నన్నలా అమ్మేశాడో లేదో,ఇంతలో ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లలో అల్లుకుపోయిన ప్లేగు అల్జీర్స్‌ కు కూడా పాకి ఉధృతరూపం దాల్చింది. అమ్మా! మీకు భూకంపాలెలా ఉంటాయో తెలుసు. కానీ మీకెప్పుడైనా ప్లేగు వచ్చిందా అమ్మా..!

‘’లేదు..’’ బదులిచ్చింది క్యూనెగొండ్.

వచ్చి ఉంటే అది భూకంపం కంటే భయంకరమైందని మీరు ఒప్పుకునితీరేవాళ్లు. అది ఆఫ్రికాలో అతి సామాన్యం. నాకూ సోకింది. పట్టుమని మూడు నెలల వ్యవధిలో దారిద్ర్యం, బానిసత్వం, రోజూ బలాత్కారం, కళ్లముందే తల్లిని ముక్కలుముక్కలుగా నరకడం, కరువు, యుద్ధబీభత్సాలు, ప్రాణం తోడేసే మహమ్మారినీ చవిచూసిన ఒక పోప్ కూతురి, పదిహేనేళ్ల చిన్నదాని  దురవస్థను మీరే ఊహించుకోండి. కానీ నేను మాత్రం చచ్చిపోలేదు. ఆ కొజ్జా, ఆ గవర్నరూ, అల్జీర్స్ జనానాలోని అందరూ ప్లేగులో అంతమైపోయారు.

ఆ మహమ్మారి బీభత్సం కాస్త తగ్గగానే గవర్నర్ బానిసలందరినీ తెగనమ్మేశారు. నన్ను ఓ వర్తకుడు కొనుక్కుని ట్యూనిస్ కు తీసుకెళ్లాడు. అక్కడ మరో వర్తకుడికి అమ్మేశాడు. అతడు మరో వ్యాపారికి అమ్మేశాడు. ఆ వ్యాపారి ట్రిపోలీకి తీసుకెళ్లి అమ్మేశాడు. అలా అలా చేతులు మారుతూ మారుతూ ట్రిపోలీ నుంచి అలెంగ్జాండ్రియాకు, అక్కడి నుంచి స్మిరాకు, కాన్‌స్టాంటినోపుల్‌కు వెళ్లిపోయాను. చిట్టచివరకు అక్కడ టర్కీ సుల్తాన్ అంగరక్షకుల్లోని ఓ దళనాయకుడి చేతుల్లో పడ్డాను. తర్వాత అతణ్ని రష్యన్లను ఎదుర్కోవడానికి అజోవ్‌కు వెళ్లాలని ఆదేశించారు.

ఆ దళనాయకుడు మంచివాడు, యోధుడు. నాతోపాటు తన చిన్న జనానాలోని అందర్నీ అజోవ్‌కు తీసుకెళ్లి సముద్రం మధ్యలోని దీవిలో ఉన్న చిన్న కోటలో ఉంచాడు. ఇద్దరు నల్లజాతి కొజ్జాలను, ఇరవైమంది సైనికులను మాకు కాపలాగా పెట్టారు. యుద్ధంలో తురుష్కులు చాలామంది రష్యన్లను చంపేశారు. మమ్మల్ని మాత్రం పస్తులు పెట్టకుండా దొరికిన తిండినల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్లు. తర్వాత రష్యన్లు పైచేయి సాధించారు. అజోవ్‌ను నామరూపాల్లేకుండా తగలబెట్టారు. ఆడామగా, ముసలీముతకా తేడా లేకుండా అందర్నీ కత్తులతో పొడిచి చంపారు. ఇక మిగిలింది మేమున్న చిన్న కోట మాత్రమే. కోటలోపలికి తిండి అందకుండా చేసి మమ్మల్ని ఆకలితో మాడ్చి చంపాలనుకున్నారు. మా సైనికులు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదని భీకర ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆకలి మాడగట్టడంతో తమ ప్రతిజ్ఞ ఎక్కడ భంగమవుతుందోనని భయపడిపోయి కాపలా కొజ్జాలిద్దరినీ చంపి తినేశారు. తర్వాత మా ఆడవాళ్లను తినాలని నిర్ణయించుకున్నారు.   

మా కోటలో ఓ మహమ్మద్ మతబోధకుడు ఉండేవాడు. అతనికి దైవభక్తీ, దయాగుణమూ మెండు. మమ్మల్నందర్నీ ఒకేసారి చంపితినొద్దని సైనికులకు ఎంతో అద్భుతంగా బోధించాడు. ‘‘ముందు ఒక్కొక్కరికీ ఒక్కో పిర్ర కోయండి. వాటితో పసందైన భోజనం సిద్ధమవుతుంది. సరిపోకపోతే ఇంకో నాలుగు రోజులు పోయాక కావలసినంత కోసుకు తినండి. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలతో అల్లా ఎంతో హర్షిస్తాడు. ఈలోపల ముట్టడి కూడా ముగిసిపోతుంది’’ అని ఉపదేశించాడు.  

అతని గొప్ప  సలహా, చాతుర్యమూ మా సైనికులకు తెగనచ్చేసింది. ఫలితంగా మేం భయానకమైన ఈ శస్త్ర చికిత్సకు గురయ్యాం. చిన్నపిల్లలకు సున్తీ చేశాక రాసే మందును ఆ మతబోధకుడు మాకు రాశాడు. మేమంతా మృత్యువాకిట పడుండిపోయామంటే నమ్మండి. 

తురుష్క సైనికులు మా పిర్రల వంటకాన్ని ఇలా తిన్నారో లేదో రష్యన్ సైనికులు అలా బల్లపడవలపై వచ్చేసి కోటను చుట్టుముట్టేశారు. మా సైనికుల్లో ఒక్కడూ తప్పించుకోలేకపోయాడు. రష్యన్లు మా వంక కన్నెత్తి కూడా చూడలేదు. కానీ, ఈ సువిశాల ప్రపంచంలో మీరెక్కడికెళ్లినా ఫ్రెంచి వైద్యులు కనిపిస్తారు చూడండి.. వాళ్లలో ఒక తెలివిమంతుడు మాపై ఎంతో శ్రద్ధ తీసుకుని, గాయాలు మాన్పాడు. కానీ నయమయ్యాక... అతడు నాతో పడుకుంటావా అని నన్ను అడగడాన్ని మాత్రం ఈ జన్మకు మరచిపోను. అతడు మమ్మల్ని ఓదార్చి, అంతా మంచే జరుగుతుందని చెప్పాడు. ఇలాంటి కోసుకు తినడాలు గతంలో ఎన్నో ముట్టళ్లలో యుద్ధ ధర్మసూత్రాల ప్రకారమే జరిగాయని వివరించాడు.

మాకు నడవడానికి కాస్త శక్తి రాగానే మమ్మల్ని మాస్కోకు పంపారు. నన్ను ఓ రష్యన్ పెద్దమనిషి కొనుక్కుని తోటమాలిగా పెట్టుకున్నాడు. రోజుకు ఇరవైసార్లు కొరడాతో చావగొట్టేవాడు. రెండేళ్ల తర్వాత అతన్ని, మరో ముప్పై మంది పెద్దమనుషులను ఏదో నేరానికి కోర్టు కొరత వేసి చంపింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంట్లోంచి పారిపోయాను. రష్యా అంతటా తిరిగాను. కొన్నాళ్లు రీగాలో ఓ సత్రంలో సారాయి పోశాను. 
తర్వాత  రోస్తోక్, విస్మార్, లీప్జీగ్, కాసెల్, ఉట్రెట్, లీడెన్, హేగ్, రోటర్‌డామ్‌లలో దాసీగా పనిచేశాను. ఈ ఒంటి పిర్రతోనే దుర్భర దారిద్ర్యం, దారుణ అవమానాలను భరిస్తూ ముసలిదాన్నయ్యాను. అయితే నేను పోప్ కూతురిని అన్న సంగతిని ఏనాడూ మరవలేదు సుమా. ఆత్మహత్య చేసుకోవాలని వందలసార్లు అనుకున్నాను. కానీ ఇప్పటికీ నాకు బతుకుపై తీపి చావలేదు. ఈ వెర్రి బలహీనత మనందరిలోనూ ఉండే పాడుబుద్ధుల్లో ఒకటి. ఎందుకంటారా? నేలకు విసిరికొట్టాల్సిన బరువును దిక్కుమాలిన ఉత్సాహంతో మొయ్యడం, ఛీఛీ.. ఇదేం బతుకు అని ఏవగించుకుంటూనే.. దాన్నే పట్టుకుని వేళ్లాడ్డం, కాటేయబోతున్న పాముకు పాలు పొయ్యడంకంటే బుద్ధితక్కువతనం మరొకటి లేదు కనక!

నా తలరాత ప్రకారం అలా నేను తిరిగిన నానా దేశాల్లో, పనిచేసిన సత్రాల్లో.. బతుకుపై రోసిపోయిన వాళ్లను లెక్కలేనంతమందిని చూసి ఉంటాను. కానీ వాళ్లలో కేవలం పట్టుమని పన్నెండుమంది మాత్రమే తమ బాధలను బలన్మరణంతో అంతం చేసుకున్నారు... ముగ్గురు నీగ్రోలు, నలుగురు ఆంగ్లేయులు, నలుగురు స్విస్‌లు, రోబెక్ అనే ఒక జర్మన్ తత్వవేత్తా! ఇప్పటికి నా బతుకు చివరి విడత ఆ యూదు డాన్ ఇసాకర్ ఇంట్లో దాసీగా ముగిసింది. అతడు నీ పరిచర్యల కోసం నన్ను నియమించాడు. ఇప్పుడు నా బతుకు నీ భవితవ్యంతో, సాహసాలతో ముడిపడి ఉంది. నువ్వు నన్నలా కవ్వించకుండా ఉండకపోయినట్లయితే నేను నా ఈతిబాధల గురించి ఏనాటికీ చెప్పి ఉండేదాన్నే కాదు. ఇదొకటైతే, ఓడ ప్రయాణంలో కథలతో కాలక్షేపం చేయడం రివాజు కూడా కనక నా దురవస్థను బయటపెట్టాను. కనక అమ్మా, నేను అనుభవం గల ఆడదాన్ని. లోకం పోకడ ఏమిటో ఎరుగుదును. నీకు కాలక్షేపం కావాలంటే ఈ ఓడలోని ఒక్కొక్క ప్రయాణికుణ్ని అతని కథేంటో అడిగిచూడు. వాళ్లలో బతుకుపై రోయనివాడు, లోకంలో తనకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేనేలేడని చెప్పని వాడు.. ఒక్కడంటే ఒక్కడున్నా సరే నన్ను ఉన్నపళంగా ఈ నడిసముద్రంలో తోసిపారెయ్యి..’ అని చెప్పి తన కథ ముగించింది ముసలమ్మ. 

(మళ్లీ వచ్చే శనివారం)

No comments:

Post a Comment