Monday, 28 December 2015

వాడు దోగాడిన చాప..








వాడైనా మిగులుంటే బావుండేది
ఈ దిక్కుమాలిన కొమ్మకు చిన్న ఆసరాగా..
తన కిలకిల నవ్వులతో 
నా వాడిన పెదాల్లో పూలై పూస్తూ..
ఆయనా లేకా, వాడూ లేక
ఎంతకాలమని ఈ ఖాళీ బండి మోత!
నా పిచ్చిగాకపోతే
వలపోసుకోడానికైనా నాకేం మిగులుందని
తొలిసంజెలోనే మలిసంజె మొదలైన బతుకు కదా ఇది..
ఊపిరాడదు కదా ఈ జాలీదయల గోదారులతో
పిచ్చిపిల్లనని, నష్టజాతకురాలినని
ఎన్నెన్ని సున్నితపు కత్తులతో మెత్తగా కోస్తారో...
అయినా గాయాలదేముంది
ఇరవై నిండకమునుపే
ఈ దేహం ఒట్టి కట్టెలా మారాక..
ఈ గర్భానికి మోయలేని శోకం మిగిలాక..
అయినా వాడు నా బిడ్డ కాదేమో
చిన్నప్పుడు నేనాడుకున్న బొమ్మేమో..
పన్నెండేళ్లకు చేసిన పెళ్లికి
రాలిపోయే బొమ్మలే పుడతాయేమో..
నా పిచ్చిగాని నేను మాత్రం బొమ్మను కానా ఏమిటి?
పదేళ్ల కిందట
నా బంగారు కొండ దోగాడిన చాపపై
ఈ సాయంత్రపు వెలుగు వరండాలో కూర్చుని
ఈ బొమ్మను చిత్రిక పడుతున్న నేను
బిడ్డను ఏట్లో పడేస్తున్న ఈ గంగమ్మలా
బండబారిపోయుంటే ఎంత బావుండేది..
తెలిపిలేని నా లోపలి గంగను మోస్తూ
బరువే ఎరగని వెర్రి దేవతలా..
తన బుజ్జాయితో సత్యవాణి(దామెర్ల బంధువులు, వి.కలికావతారం గార్ల సౌజన్యంతో)
(దామెర్ల సత్యవాణి(1907-1991) వేసిన ఈ రంగుల గంగమ్మ బొమ్మ చూశాక. సత్యవాణి ఒక్కగానొక్క కడుపు పంట ఆరునెలలు తిరక్కుండానే చనిపోయాడు. ఆ మరుసటి ఏడు..1925లో భర్త రామారావూ పోయాడు.)



3 comments: