Friday, 25 December 2015

కాండీడ్- 7వ భాగం



13వ అధ్యాయం


ముసలమ్మ గాథ అంతా విన్నాక ఆమెను ఆమె అంతస్తుకు, గొప్పతనానికి తగ్గట్టు గౌరవించసాగింది క్యూనెగొండ్. ఆమె సలహా ప్రకారం ఓడలోని ఒక్కో  ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి వాళ్ల బతుకు సంగతులను విచారించింది. ముసలమ్మ చెప్పింది నిజమేనని కాండీడ్, క్యూనెగొండ్ నమ్మక తప్పలేదు.

‘‘అయ్యో.. మనమెంత దురదృష్టవంతులం! పాపం మన పాంగ్లాస్‌ను బలి వేడుకల్లో మామూలు ఆచారానికి భిన్నంగా ఉరితీశారు. ఆయనే కనక బతికుటే మనకు ఈ లోకంలోని సమస్త అవగుణాలపై తన అమూల్యమైన అభిప్రాయాలు చెప్పేవాడు కదా! నేను కూడా వినయంగా ఊకొడుతూ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తేవాణ్ని కదా’’ చింతించాడు కాండీడ్.



ఒక్కో ప్రయాణికుడూ తమ తమ కథలను చెబుతూపోతుండగా, ఓడ కూడా వేగంగా ముందుకుసాగి బ్యూనోస్ ఏరీస్‌కు చేరుకుంది. క్యూనెగొండ్ దొరసాని, దళనాయకుడు కాండీడ్, ముసలమ్మ ఓడ దిగి సరాసరి స్థానిక గవర్నరైన డాన్ ఫెర్నాండో డి ఇబారా వై ఫిగెయోరా వై మాస్కరేనస్ వై లాంపోర్డో వై సూజా దర్శనం కోసం వెళ్లారు. చాంతాడంత బిరుదులు ఉండే మనిషికి ఉండాల్సిన గర్వం, పొగరూ ఆ పెద్దమనిషికి ఏ కొరతా లేకుండా ఉన్నాయి.  అతడు జనంతో పరమ చులకనగా, నీలుక్కుని, ముక్కును ఆకాశంవైపు తిప్పేసి కంఠం పగిలేలా మాట్లాడతాడు. మాటలో నిర్దయ ఉట్టిపడుతూ  ఉంటుంది. దీంతో అతన్ని అభివాదంతో గౌరవించినవాళ్లకు వెంటనే చావచితగ్గొట్టాలని కూడా అనిపిస్తుంది. అతనికి అతివలంటే అమిత వ్యావెూహం. తాను చూసిన ఆడవాళ్లలో క్యూనెగొండే అత్యంత అందగత్తెగా తోచడంతో తొలిమాట కిందే ఆమె దళనాయకుడి భార్యేనా అడిగాడు. ఆ అడిగిన తీరుతో కాండీడ్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆమె తన భార్య కాదు కనక ఔనని ధైర్యంగా చెప్పలేకపోయాడు. సోదరి అన్నది అబద్ధం కనక అలా చెప్పే ధైర్యమూ లేకపోయింది. ప్రాచీనులు బాగా వాడుకున్న ఈ అబద్ధం ఆధునికులకూ ఎంతో ఉపయోగపడేదే అయినప్పటికీ అతని హృదయం స్వచ్ఛమైనది కనక సత్యవధకు ఒప్పుకోలేదు.

‘‘క్యూనెగొండ్ దొరసాని నన్ను పెళ్లాడ్డానికి ఒప్పుకుంది. మా పెళ్లికి రావాలని మిమ్మల్ని ఎంతో వినయంగా అభ్యర్థిస్తున్నాం..’’ అని నిజం చెప్పేశాడు.

డాన్ ఫెర్నాండో డి ఇబారా వై ఫిగెయోరా వై మాస్కరేనస్ వై లాంపోర్డో వై సూజా హేళనగా నవ్వి, మీసాలు మెలేసుకున్నాడు. తర్వాత తన సైనిక పటాలాన్ని ఒకసారి పర్యవేక్షించి రావాలని కాండీడ్‌ను ఆదేశించాడు. కాండీడ్ పాటించాడు. ఇక గవర్నర్, క్యూనెగొండ్ మాత్రమే మిగిలారు. గవర్నర్ తన వాంఛను వెల్లడించాడు. అందగత్తెవు గనక మనసు పడ్డానని, చర్చి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మర్నాడు పెళ్లాడి తీరతానని, ఒప్పుకుని తీరాలని అన్నాడు. ఆలోచించుకోవడానికి పావుగంట గడువు ఇవ్వాలని కోరింది క్యూనెగొండ్. తర్వాత సలహా కోసం ముసలమ్మ దగ్గరికి వెళ్లింది.

‘‘అమ్మా! నువ్వు ఇదివరకు పెద్ద జమీందారు బిడ్డవు అయితే అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం నీ దగ్గర చిల్లిగవ్వ లేదు. దక్షిణ అమెరికాలో ఇంత గొప్ప పెద్దమనిషి, అంత అందమైన మీసాలు గల వాడు నిన్ను పెళ్లాడతానని వెంటపడుతున్నప్పుడు వద్దని నిరాకరిస్తే ఆ తర్వాత నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది. అయినా పాతివ్రత్యం విషయంలో ఏం చూసుకుని అమ్మా, నువ్వు గర్వపడాలి? బల్గర్లు నిన్ను చెరిచారని, ఓ యూదు, ఓ మతవిచారణాధికారి నిన్ను అనుభవించారని మరచిపోకు, కొన్ని కష్టాలు కొన్ని లాభాలను సంపాదించి పెడతాయని తెలుసుకో. నీ స్థానంలో నేనేగనుక  ఉండినట్లయితే తక్షణం గవర్నర్ ను పెళ్లాడేసి, మన దళనాయకుడికి అదృష్టయోగం పట్టించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించేదాన్నే కాను’’ ముసలమ్మ హితబోధ చేసింది.

ములసమ్మ అలా తన వయసు, అనుభవాలతో సాధించిన ప్రాజ్ఞతతో సలహా ఇస్తుండగా, రేవులోకి ఓ చిన్న నౌక వచ్చి చేరింది. అందులో ఒక స్పెయిన్ న్యాయాధికారి, గూఢచచర్య అధికారులు ఉన్నారు.

అసలు ఏం జరిగిందంటే..
కాండీడ్, క్యూనెగొండ్, ముసలమ్మ కేడిజ్‌కు పారిపోతూ బడజాజ్‌లోని సత్రంలో బస చేసినప్పుడు పొడుగు చేతుల అంగీ తొడుక్కున్న సన్యాసి క్యూనెగొండ్ నగలు, నాణేలు దొంగిలించాడని ముసలమ్మ వెళ్లగక్కిన అనుమానం నిజమే అయ్యింది. తస్కరించిన వజ్రాల్లో కొన్నింటిని అమ్మడానికి ఆ సన్యాసి  ఓ నగల వర్తకుడి వద్దకు వెళ్లాడు. ఆ నగలు ఉన్నత మతవిచారణాధికారివి అని ఆ వర్తకుడు పోల్చాడు. వాటిని దొంగిలించానని ఆ సన్యాసి ఉరితీతకు ముందే చెప్పేశాడు. అవి ఎవరివద్ద ఉండేవో వాళ్ల రూపురేఖలను వర్ణించి, వాళ్లు ఏ దారి పట్టుకుపోయారో కూడా బయటపెట్టేశాడు. లిస్బన్ నుంచి క్యూనెగొండ్, కాండీడ్‌లు పలాయనం చిత్తగించడం తెలిసిందేగా. దీంతో అధికారులు వాళ్లను కేడిజ్ దాకా వెంబడించారు. పట్టుకోవడానికి ఒక ఓడను పంపారు. ఇప్పుడు బ్యూనోస్ ఏరీస్‌కు చేరింది అదే. తమ మతవిచారణాధికారిని ఖూనీ చేసిన నేరస్తులను పట్టుకోవడానికి స్పెయిన్ న్యాయాధికారి దిగుతున్నాడనే వార్త చుట్టుపక్కలంతా పాకిపోయింది. ప్రాజ్ఞురాలైన ముసలమ్మకు తక్షణ కర్తవ్యం గోచరించింది.

‘‘అమ్మా! నువ్విప్పుడు తప్పించుకోవడం అసాధ్యం. అయినా ఖూనీ చేసింది నువ్వు కాదు కాబట్టి భయపడాల్సిన పనే లేదు. పైగా గవర్నర్ నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కనక నీపై చెయ్యిపడవివ్వడు. నువ్వు ఉన్నచోటనే ఉండిపో’’ అని క్యూనెగొండ్ కు  చెప్పింది.

తర్వాత వెంటనే కాండీడ్ వద్దకు పరిగెత్తిపోయింది.

‘‘నువ్వు వెంటనే పారిపో! లేకపోతే నిన్ను గంటకూడా గడవకముందే తగలబెట్టి చంపేస్తారు’’ అని హెచ్చరించింది.

యువ కెప్టెన్ కు ఆలోచించే వ్యవధి కూడా లేదు. కానీ అతడు క్యూనెగొండ్ ను విడిచి ఎలా వెళ్లగలడు, ఎక్కడికని వెళ్లగలడు?


14వ అధ్యాయం



తరచూ స్పెయిన్ తీరప్రాంతాల్లో, వలస దేశాల్లో చక్కర్లుకొట్టే  ఓ దేశదిమ్మరిని కాండీడ్ కేడిజ్ నుంచి వచ్చేటప్పుడు సేవకునిగా వెంట తీసుకొచ్చాడు. వాడు సగం స్పెయిన్ జాతివాడు, సగం అర్జెంటీనా జాతివాడు. సరంగు, సేవకుడు, సన్యాసి, బంట్రోతు, వ్యాపారంపైన తిరిగే గుమాస్తా.. ఇలా ఎలా కావాలంటే అలా ఏ పనికైనా బాగా పనికొస్తాడు. పేరు కకంబో. వాడికి తన కొత్త యజమాని ఎంతో మంచివాడు కనక అతనంటే పిచ్చి అభిమానం. ముసలమ్మ తెచ్చిన వార్త చెవినబడగానే రెండు జాతి గుర్రాలకు జీన్లు పూన్చి సిద్ధం చేశాడు.

‘‘అయ్యా, ఆమె మాట విని, వెనక్కి తిరిగి చూడకుండా తక్షణమే కాలికి బుద్ధిచెప్పడం మంచింది’’ అన్నాడు.

కాండీడ్‌కు ఏడుపు తన్నుకొచ్చి, కన్నీళ్లు ధారాపాతంగా కారాయి.

‘‘అయ్యో, నా ప్రియతమా, క్యూనెగొండ్! గవర్నర్ మన పెళ్లికి వస్తానని చెప్పిన మరుక్షణంలోనే నిన్ను విడిచి పోవాల్సిన దుర్గతి పట్టిందే. నిన్ను అంతదూరం నుంచి తీసుకొచ్చాను గదా, ఇప్పుడు నీకే ముప్పు పొంచుకొస్తుందో’’ అని వగచాడు.

‘‘ఆమెకేం కాదు, నిక్షేపంగా ఉంటుంది. ఆడవాళ్లకు ఎప్పుడూ ఏ నష్టమూ జరగదు. దేవుడు వాళ్లను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాడు. ముందు మనం పారిపోదాం పదండి’’ నౌకరు తొందరపెట్టాడు.

‘‘నన్నెక్కడికి తీసుకెళ్తున్నావ్? మనమెక్కడికెళ్లాలి? క్యూనెగొండ్ లేకుండా మనమేం చెయ్యగలం?’’

‘‘కాంపోస్టెలా జేమ్స్ అవధూత దయవల్ల మీరు జెస్యూట్లపై యుద్ధం చేయడానికి వచ్చారు కదా! అయితే మనప్పుడు దానికి బదులు వాళ్ల తరఫునే పోరాడదాం. ఆ దారేదో నాకు తెలుసు. వాళ్ల రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. బల్గర్ సైన్యంలో శిక్షణ పొందిన నాయకుణ్ని నియమించుకోవడానికి వాళ్లూ సంతోషంతో ముందుకొస్తార్లెండి. మీరు నక్కతోక తొక్కారు. మనం కోరుకున్నది ఒకచోట లేనప్పుడు మరోచోట ఉండి తీరుతుంది. కొత్త ప్రదేశాలు, కొత్త సాహసాలు ఎప్పుడూ అక్కున చేర్చుకోవాల్సినవే..’’

‘‘అయితే నువ్వు ఇదివరకు పరాగ్వేలో ఉన్నావా?’’  అడిగాడు కాండీడ్.

‘‘ఔను. అక్కడ అసంప్షన్ మతకళాశాలలో బంట్రోతుగా పనిచేశాను. కేడిజ్ వీధులు ఎంత బాగా తెలుసో, ఇక్కడి జెస్యూట్ల పాలనా వ్యవహారాలూ అంతే బాగా తెలుసు. వాళ్ల ప్రభుత్వం భలే చిత్రంగా ఉంటుందిలెండి. రాజ్యంలో మొత్తం ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి. నిడివి మూడు వందల లీగుల పైనే. భూమి అంతా ఫాదర్లదే, ప్రజలకేమీ ఉండదు. సత్యానికి, న్యాయానికి ఇది పరవెూత్తమ ఉదాహరణ అంటాను. ఈ ఫాదర్ల వంటి సాక్షాత్ భగవత్స్వరూపులను నేనెక్కడా చూసెరగను. వాళ్లిక్కడ స్పెయిన్, పోర్చుగల్ రాజులతో కొట్లాడతారు, యూరప్‌లో మాత్రం వాళ్లను మహా విధేయతతో ఆరాధిస్తారు. ఇక్కడ స్పెయిన్ వాళ్లను హతమార్చి, మాడ్రిడ్‌లో స్వర్గానికి పంపుతారు. చాలా తమాషాగా లేదూ! అద్సరే, మనం ముందుకు సాగాలి. మీ అంత అదృష్టవంతుడు లోకంలో మరొకడు లేడు. బల్గర్ పటాలంలో తర్ఫీదైన నాయకుణ్ని చూస్తే ఈ ఫాదర్లు పండగ చేసుకుంటారు..’’

ఇద్దరూ సరిహద్దులోని తొలి సైనిక తనిఖీ స్థావరానికి చేరుకున్నారు. ఒక దళనాయకుడు మాట్లాడడానికి వచ్చాడని అక్కడి జెస్యూట్ సైన్యాధికారికి తెలపాలని కకంబో కాపలా సైనికుడికి చెప్పాడు. ప్రధాన కార్యాలయానికి ఈ సమాచారం చేరవేసేందుకు హుటాహుటిన ఒక సైనికుణ్ని పంపారు. ఇంకో పరాగ్వే వాడు సైన్యాధికారి వద్దకు పరుగులు తీశాడు. కాండీడ్, కకొంబోలను నిరాయుధులను చేసి, వాళ్ల గుర్రాలను లాక్కున్నారు.  తర్వాత రెండు వరసల్లో నిల్చున్న సైనికుల మధ్య నుంచి నడిపించుకుంటూ వరసల చివరున్న జెస్యూట్ సైన్యాధికారి చెంతకు తీసుకెళ్లారు. ఆ అధికారి పాదాల దాకా వేలాడుతున్న అంగీ తొడుక్కుని నడుం మధ్య తాడు బిగించాడు. తలపై మూడు కోణాల పెద్ద టోపీ ఉంది. చేతిలో చిన్నకత్తి, ఆసనం పక్కన పెద్ద కరవాలం ఉన్నాయి. అతడేదో సైగ చేయగానే ఇరవై నాలుగు మంది సైనికులు కాండీడ్, కకంబోలను చుట్టుముట్టారు. ఇద్దరూ వేచి ఉండాలని, స్పెయిన్ వాళ్లు తన సమక్షంలో తప్ప మరెక్కడా నోరు విప్పకూడదని, తన ప్రాంతంలో మూడు గంటలకు మించి ఉండకూడదని ఆ రాష్ట్ర పూజ్య ఫాదర్ లోగడ ఆదేశాలు జారీ చేసి ఉన్నందున సైన్యాధికారి వాళ్లిద్దరితో మాట్లాడబోడని ఓ సైనికుడు చెప్పాడు.  

‘‘ఇంతకూ పూజ్య ఫాదర్‌గారు ఇప్పుడెక్కడ ఉన్నారో’’ అడిగాడు కకంబో.

‘‘ఇప్పుడే ప్రార్థన ముగించుకుని సైనిక కవాతు పర్యవేక్షణకు వెళ్లారు. మరో మూడు గంటలవరకు మీకు ఆయన అంగీ అంచును ముద్దాడే భాగ్యం దక్కదు’’ బదులిచ్చాడు సైనికుడు.

‘‘కానీ మా నాయకుడు స్పెయిన్ జాతివాడు కాదు, జర్మన్. నాలాగే ఆకలితో మాడిచస్తున్నాడు. పూజ్య ఫాదర్ దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నాం కదా, మాకేమైనా కాస్త తిండి పెడుదురూ..’’

ఈ అభ్యర్థనను సైన్యాధికారికి చేరవేయడానికి వెళ్లాడు సైనికుడు.

‘‘దేవుడికి స్తోత్రం! అతడు జర్మన్ వాడంటున్నావు కనక, నేనతనితో స్వయంగా మాట్లాడతా. పొదరింటికి తీసుకురా’’ ఆదేశించాడు జెస్యూట్ సైన్యాధిపతి.

కాండీడ్‌ను వెంటనే తోటలోని ఓ మూలకు తీసుకెళ్లారు. అది అందమైన వేసవి విడిది భవనం. దారిలో ఆకుపచ్చ, బంగారు రంగు పాలరాతి స్తంభాలు ఉన్నాయి. పంజరాల్లో హమింగ్, గినియా వంటి రకరకాల అరుదైన పక్షులు కిచకిచమంటున్నాయి. బంగారు కంచాల్లో పసందైన అల్పాహారం వడ్డించారు. ఓ పక్క ఆరుబయట ఎర్రటి ఎండలో పరాగ్వేవాసులు కొయ్యబొచ్చెల్లో జొన్నపిండి కూడు తింటుండగా సైన్యాధికారి మాత్రం పచ్చని పందిరి నీడలో సుఖంగా విశ్రమించాడు.

అతడు యువకుడు, స్ఫురద్రూపి. తెల్లటి ఛాయతో మెరిసిపోతున్నాడు. ముఖమూ కళ్లూ గుండ్రంగా, కనుబొమలు విల్లుల్లా ఉన్నాయి. చెవుల చివర్లు ఎర్రగా, పెదవులు సిందూరంలా పొడగడుతున్నాయి. మనిషి గర్విష్టిలా ఉన్నాడు కాని, ఆ పొగరు మాత్రం అటు స్పెయిన్ జాతిదీ కాదు, ఇటు జెస్యూట్లదీ కాదు. కాండీడ్, కకంబోలకు వాళ్ల ఆయుధాలను, గుర్రాలను తిరిగి ఇచ్చేశారు. కకంబో ఆ పొదరింటి పక్కన గుర్రాలకు దాణా తినిపిస్తూ పందిట్లో ఏం జరుగుతోందో ఆందోళనతో చూస్తున్నాడు.

కాండీడ్.. సైన్యాధికారి అంగీ అంచును ముద్దాడి, భోజనం ముందు కూర్చున్నాడు.

‘‘అయితే నువ్వు జర్మన్‌వు అన్నమాట?’’ జెస్యూట్ దళపతి ముచ్చట మొదలుపెట్టాడు.

‘‘అవునండయ్యా..’’

ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఎక్కడాలేని ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఉద్వేగంతో చిత్తయిపోయారు.

‘‘మీది జర్మనీలోని ఏ ఊరు?’’ జెస్యూట్ అడిగాడు.

‘‘ఆ ముదనష్టపు వెస్ట్ ఫాలియా రాష్ట్రంలోని థండర్ టెన్ ట్రాంక్ కోటలో పుట్టాను..’’ కాండీడ్ చిరాగ్గా చెప్పాడు.

‘‘ఓరి దేవుడోయ్! ఇదెలా సాధ్యం’’ జెస్యూట్ నోరెళ్లబెట్టాడు.

‘‘ఎంత చిత్రం!’’ కాండీడ్ కూడా ఆశ్చర్యపోయాడు.

‘‘నువ్వు నిజంగా నువ్వేనా?’’ జెస్యూట్ గొంతులో మరింత విస్మయం.

‘‘ఎంత విచిత్రం..’’

ఇద్దరూ ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆలింగనం చేసుకున్నారు. కన్నీళ్లు కాలువలు కట్టాయి.

‘‘అంటే మీరు.. క్యూనెగొండ్  దొరసాని అన్నగారే కదా? బల్గర్లు మిమ్మల్ని చంపేయలేదూ! మీరు జమీందారు తనయులే కదా? మీరిలా పరాగ్వేలో జెస్యూట్ లా ప్రత్యక్షమవడం బహు చిత్రంగా ఉందే! ఇది పూర్తిగా కొత్త దేశంలా ఉందే. మన పాంగ్లాస్ బతికుంటే ఎంత బావుండేది!’’


ఆశ్చర్యపోవడాల నడుమ కొత్తమంది నీగ్రో బానిసలు, పరాగ్వేవాసులు ఇద్దరి స్ఫటిక మధుపాత్రల్లో ద్రాక్షసారా పోస్తున్నారు. జెస్యూట్ వాళ్లందర్నీ పంపేసి కాండీడ్‌ను మళ్లీ కౌగిలించుకున్నాడు. దేవుణ్ణి, ఇగ్నేషియస్ మహర్షిని తలచుకున్నాడు.  ఇద్దరూ భోరున విలపించారు. ముఖాలు కన్నీళ్లతో తడిచి ముద్దయ్యాయి.
  
‘‘చెరిచేసి, చీల్చేసి చంపేశారంటున్న మీ చెల్లెలు క్యూనెగొండ్ ఇప్పుడు సంపూర్య ఆరోగ్యంతో కులాసాగా ఉందంటే మీరు మరింత ఉబ్బుతబ్బిబ్బు అవుతారు’’ కాండీడ్ శుభవార్త చెప్పాడు.  

‘‘అవునా, నిజమేనా, ఎక్కడుంది?’’

‘‘ఇక్కడికి దగ్గర్లోనే. బ్యూనోస్ ఏరీస్ గవర్నర్ దగ్గర. మరి నేనేమో మీతో యుద్ధం చెయ్యడానికి వచ్చాను.’’

ఈ చాంతాడంత కబుర్లలో వాళ్లకు ఒకటి తర్వాత ఒకటి ఎన్నో కొత్త కొత్త సంగతులు తెలిశాయి. హృదయాలు ఉకలేశాయి. కళ్లు జిగేల్మన్నాయి. వాళ్లు జర్మన్లు కనక పూజ్య రాష్ట్ర ఫాదర్ విచ్చేసేవరకు అలాగే భోజనం ముందు కూర్చుని మాట్లాడుకున్నారు. జెస్యూట్ తన గాథ చెప్పసాగాడు.



15వ అధ్యాయం

‘‘నా తల్లిండ్రుల ఖూనీ, నా చెల్లెలి బలాత్కారం జరిగిన ఆ భయానక దినాన్ని ఈ జన్మకు మరచిపోను. బల్గర్లు వెళ్లిపోయాక నా చెల్లెలు ఎక్కడా కనిపించలేదు. నన్నూ, హతమైపోయిన మా తల్లిదండ్రులను, ఇద్దరు సేవకులను, ముగ్గురు చిన్నపిల్లలను మా ఇంటికి రెండు లీగుల దూరంలోని జెస్యూట్ల మఠంలో పాతిపెట్టేందుకు బండిలో వేసుకుని వెళ్లారు. ఓ జెస్యూట్ మాపై పవిత్రజలాన్ని చిలకరించాడు. అవి ఉప్పు నీళ్లు. కొన్ని చుక్కలు నా కళ్లలో పడ్డాయి. నా కనురెప్పలు కొట్టుకోవడం చూసి ఓ జెస్యూట్ నా గుండెపై చేయి పెట్టి అది పనిచేస్తోంది నిర్ధారించాడు. తర్వాత నాకు సాయం చేశారు. మూడు వారాలయ్యాక పూర్తిగా కోలుకున్నాను.  

నేనెంత అందంగా ఉండేవాడినో నీకు తెలుసు కదా కాండీడ్! నేను మరింత అందంగా తయారయ్యాను. ఆ మఠం పెద్ద ఫాదర్ క్రాస్ట్‌ కు నాపై  బోలెడు అభిమానం కలిగింది. నాకు మతబోధకుడిగా తర్ఫీదు ఇచ్చాడు. కొన్నాళ్లకు ఫాదర్ల పెద్దకు యువ జెస్యూట్లు అవసరమవడంతో నన్నను రోమ్‌కు పంపారు. పరాగ్వే పాలకులు స్పెయిన్ జెస్యూట్లను వీలైనంత తక్కువ మందిని తీసుకుంటారు, ఇతర దేశాల వాళ్లకు ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే వాళ్లయితే చెప్పిన మాట వింటారని. దీంతో ఫాదర్ల పెద్ద నన్ను ఈ ద్రాక్షతోటలో పనిచేసేందుకు పంపించాడు. నాతోపాటు మరో ఇద్దరు కూడా వచ్చారు. ఒకడు పోలండ్ వాడు, మరొకడు టైరోలియన్. రాగానే నన్ను ఉప మతబోధకుడిగా, ఉపసైన్యాధికారిగా నియమించారు. ఇప్పుడు నేను సైన్యాధికారినీ, మతబోధకుడినీ. మేం స్పెయిన్ రాజు సైనికులను అతికష్టమ్మీద భరిస్తున్నాం. వాళ్లను త్వరలోనే తన్ని తగలేస్తారనుకుంటాను. మాకు సాయం చెయ్యడానికి ఆ దేవుడే నిన్నిక్కడికి పంపించాడు. అయితే నా చెల్లెలు క్యూనెగొండ్ ఈ చుట్టుపక్కలే, బ్యూనోస్ ఏరిస్ గవర్నర్ చెంతే ఉందన్నమాట..?’’

అవునని మళ్లీ చెప్పాడు కాండీడ్. ఇద్దరి కళ్లూ మళ్లీ వర్షించాయి.  

చిన్న జమీందారు కాండీడ్‌ను ‘నా సోదరా, నా రక్షకుడా’ అంటూ లెక్కలేనన్నిసార్లు గట్టిగా కౌగిలించుకున్నాడు.

‘‘కాండీడ్! మనం వెంటనే ఆ పట్టణానికి దండెత్తిపోయి నా చెల్లెల్ని కాపాడాలి’’ తొందరపెట్టాడు.

‘‘నాక్కావాల్సిందీ అదే. ఎందుకంటే నేను ఆమెను పెళ్లాడాలని ఆశపడుతున్నాను కనక. ఇప్పటికీ ఆ ఆశ చావలేదు.’’

‘‘ఆరి, దుర్మార్గుడా! అంత గొప్ప జమీందారు బిడ్డయిన నా చెల్లెల్ని పెళ్లాడే యోగ్యత నీకుందనే అనుకుంటున్నావా? పైగా ఆ తలతిక్క మాట నాతోనే చెబుతావా! ఎంత ధైర్యంరా నీకు? నీకసలు సిగ్గెయ్యడం లేదూ ఆ మాట అనడానికి?’’ రంకెలేశాడు చిన్న జమీందారు.

 ఆ అకాల ఆగ్రహానికి కాండీడ్‌కు నోటమాట రాలేదు.


‘‘అయ్యా, తమరు శాంతించండి! లోకంలో ఎంత ఐశ్వర్యమున్నా అందులో గొప్పేమీ లేదు. నీ చెల్లెల్ని నేను ఒక యూదువెధవ బారి నుంచి, ఒక మతవిచారణాధికారి చెర నుంచి కాపాడాను. ఆమె నాకు ఎంతో రుణపడి ఉంది. పైగా నన్ను మనువాడాలని  కోరుకుంటోంది కూడాను. మనుషులంతా సమానమేనని మన గురువు పాంగ్లాస్ చెబుతుంటారు కదా. కనక నేను ఆమెను పెళ్లాడతాను’’ తొణక్కుండా చెప్పాడు కాండీడ్.

‘‘ఆ సంగతి నువ్వు బతికుంటే కదరా నీచుడా!’’ అని అరుస్తూ థండర్ టెన్ ట్రాంక్ జెస్యూట్ చిన్న జమీందారు కాండీడ్ ముఖంపై కత్తిపిడితో అడ్డంగా కొట్టాడు.

కాండీడ్ కూడా క్షణమాలస్యం చెయ్యకుండా ఒరలోంచి కత్తి దూసి జమీందారు కడుపులో సర్రున దించాడు. అయితే కత్తిని వెనక్కి లాగుతుండగా మాత్రం కన్నీళ్లు బొటబొటా కారాయి.

‘‘అయ్యో.. దేవుడా! నేను చేసిందేమిటి? నా యజమానిని, నా స్నేహితుణ్ని, నా బావమరిదినే పొట్టనబెట్టుకున్నానే! నెనంత మంచివాడినైతేనేమి, ఇప్పటికి ముగ్గురిని హతమార్చాను. పైగా అందులో ఇద్దరు మతబోధకులు కూడానూ’’ విలపించాడు కాండీడ్.

దూరం నుంచి ఇదంతా చూసిన కకంబో వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు.  

‘‘ఇక మన ప్రాణాలను వాళ్లకప్పజెప్పడం మినహా చేసేదేం లేదు. వెంటనే లోపలికొస్తారు, మనల్ని చంపిపారేస్తారు.’’

అయితే జీవితంలో ఇలాంటి ఎన్నో సంకటాలు చవిచూవిన కకంబో బుర్ర ఆ క్షణంలో వేగంగా పనిచేసింది. వెంటనే జమీందారు వేసుకున్న జెస్యూట్ అంగీ విప్పేసి కాండీడ్‌కు తొడిగాడు. జెస్యూట్ నలుపలకల టోపీని తీసి తన యజమాని తలకు తగిలించి గుర్రమెక్కించాడు. ఇదంతా రెప్పపాటులో పూర్తి చేశాడు.

‘‘అయ్యా,.. త్వరగా వెళ్దాం పదండి. అందరూ మిమ్మల్ని ఏవో ఫర్మానాలు తీసుకెళ్లే జెస్యూట్ అనుకుంటారు. ఈ జెస్యూట్ల సైనికులు మన వెంటబడకముందే మనం పొలిమేర దాటిపోవాలి’’ అని తొందరపెట్టాడు.

అలా అంటూనే స్పానిష్ భాషలో. ’‘అందరూ దారి ఇవ్వండి, దారి ఇవ్వండి, పూజ్య జెస్యూట్‌గారికి దారి ఇవ్వండి!’’ అని అరిచాడు.



16వ అధ్యాయం


సైనిక స్థావరంలో జర్మన్ జెస్యూట్ హతమయ్యాడని ఎవరూ కనుక్కోకముందే కాండీడ్, కకంబోలు పొలిమేర దాటేశారు. ముందుచూపున్న కకంబో ముందుజాగ్రత్తగా కొన్నిరొట్టెలు, పళ్లు, పందిమాంసం, కొంత చాక్లెట్, కొన్ని సారా సీసాలను సంచిలో తీసుకొచ్చాడు. దీంతో తిండికి మాడకుండా జాతిగుర్రాలపై దౌడు తీస్తూ దారుల్లేని కొత్త ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వాగులున్న అందమైన పచ్చిక బయలు కనిపించింది. గుర్రాలు అలసట తీర్చుకోవడానికి అక్కడ ఆగారు. కాస్త తిండి తినమని యజమానికి చెబుతూ కాండీడ్ తను కొంత తినసాగాడు.

‘‘నీకు బుద్ధుందా? ఈ పరిస్థితిలో తిండి తినమని ఎలా అడుగుతున్నావసలు? జమీందారు బిడ్డను చంపేసి, నా ప్రియతమ క్యూనెగొండ్ ముందు ఇక జీవితంలో తలెత్తుకోని పని చేశానే. ఆమెను ఎడబాసి, నా దుఃఖమయ జీవితాన్ని ఇలా భారంగా వెళ్లదీయడం వల్ల నేను బావుకునేదేముంది? జెస్యూట్ పత్రిక ట్రివోక్స్ ఏమంటుంది?’’ అని విలపించాడు కాండీడ్.

అలా భోరుమంటూనే కడుపునిండా బుక్కసాగాడు. పొద్దుగూకుతుండగా ఈ బాటసారులకు ఏడుపుల్లాంటి కేకలు వినిపించాయి. ఆడగొంతుకల్లా ఉన్నాయవి. అవి బాధతో వేసే కేకలో, సంతోషంతో కొట్టే కేరింతలో సరిగ్గా అర్థం కాలేదు. సాధారణంగా కొత్త దేశం ఎవరికైనా సహజంగానే కుతూహలం రేకెత్తిస్తుంది. అందుకే ఇద్దరూ వెంటనే ఆసక్తితో, కాస్త ఆందోళనతో లేచి వెళ్లారు. పచ్చిక బయలు చివరన కాస్త తూలి నడుస్తున్న ఇద్దరు నగ్నయువతులు ఆ కేకలు వేశారని అర్థమైంది. వాళ్ల వెనక రెండు కోతులు వాళ్ల పిర్రల్ని కొరుకుతూ వెంటపడుతున్నాయి. ఇది చూసి కాండీడ్ తీవ్రంగా కలతచెందాడు. అతడు బల్గర్ సైన్యంలో తుపాకీని గురితప్పకుండా పేల్చడం నేర్చుకుఁన్నాడు. కొమ్మల్లోని కాయను ఆకులు కూడా తగలకుండా పేల్చగలడు. రెండుగొట్టాల స్పెయిన్ బారుతుపాకీ తీసుకుని ఆ రెండు కోతులను గురితప్పకుండా కాల్చిపారేశాడు.   

‘‘పని బాగా పూర్తయింది కదూ కకంబో! ఆ ఇద్దరు అమ్మాయిలను పెద్దముప్పు నుంచి తప్పించాను. మతాధికారిని, జెస్యూట్‌ను చంపడం వల్ల నాకు పాపమేదైనా చుట్టుకుని ఉంటే, ఈ అమ్మాయిలను కాపాడాను కనక పరిహారం చేసుకున్నట్టే. ఈ కన్యామణులు నిస్సందేహంగా గొప్పింటి వాళ్లే. కనక మన ఈ సాహసం మనకు ఈ దేశంలో బాగా పనికొస్తుందనే అనుకుంటా’’ అన్నాడు తుపాకీ వీరుడు.

ఆ ధోరణిలో చెప్పుకుపోతుండగా కళ్లెదుట కనిపించిన దృశ్యం చూసి నోటమాటరాక టక్కున ఆగిపోయాడు. ఆ యువతులిద్దరూ చచ్చిన కోతులను గుండెలకు హత్తకుని భోరున విలపిస్తున్నారు. కళ్లు చెరువులయ్యాయి.  



ఆ ఏడుపు, పెడబొబ్బలను  కాసేపు చూసి కాండీడ్, ‘‘ఈ సృష్టిలో ఇంత మహోదాత్త ఘటనను ఎక్కడా చూడలేదే!’’ అన్నాడు సేవకునితో.

‘‘అయ్యా! మీరన్నది నిజమే. తమరు చంపింది ఆ కన్యల ప్రియులను మరి’’ వివరించాడు కకంబో.

‘‘వాళ్ల ప్రియులా? అసంభవం. నవ్వు నాతో పరాచికాలాడుతున్నావు నీ మాటలను అసలు నమ్మను.’’

‘‘అయ్యా! మీకు ప్రతి ఒక్కటీ వింతగా తోస్తోంది. ఇందులో అంత విస్తుబోవాల్సిందేముంది? ప్రపంచంలో కొన్ని చోట్ల కోతులు స్త్రీల ప్రేమను చూరగొంటాయి. నేను కొంచెం స్పెయిన్ వాడినైనట్టే వాటిలోనూ కొంత మానవ స్వభావం ఉంటుంది.’’  

‘‘నువ్వు చెప్పిందే సరైందేవెూలే! పూర్వం ఇటువంటి సమాగమాలు ఉండేవని, ఫలితంగా నరాశ్వాలు, నరమేషాల వంటి సంకర ప్రాణులు పుట్టుకొచ్చేవని మా పాంగ్లాస్ చెబుతుండేవాడు. పాతకాలం పెద్దల్లో చాలామంది వాటిని చూశారని కూడా చెప్పేవాడు. అయితే అవన్నీ కట్టుకథలని కొట్టిపారేసేవాణ్ని.’’

‘‘మొత్తానికి ఇలాగైనా మీరు నిజమని నమ్మారు. జనానికి సరైన విద్య గరపకపోతే ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలిసొచ్చింది. ఇకపోతే, ఈ ఆడపిల్లలు మనేకదో కీడు తలపెడతారని నాకు భయంగా ఉంది’’ వణికాడు సేవకుడు.  

ఆ మాటలు వినగానే కాండీడ్‌కు ఆ బయలును వదలి పొదల్లో దాక్కోవాలనిపించింది. తర్వాత ఇద్దరూ తిండి బుక్కి, లిస్బన్ మతవిచారణాధికారిని, బ్యూనోస్ ఏరీస్ గవర్నర్ ను, జమీందారు కొడుకును బండబూతులు తిట్టి గుబురు చెట్ల మధ్య పడుకుని గుర్రుకొట్టి నిద్రపోయారు. మెలకువ వచ్చేసరికి అటూ ఇటూ కదల్లేకపోయారు. రాత్రి వాళ్లు మాంచి నిద్రలో ఉన్నప్పుడు స్థానిక ఒరైలన్ ఆటవిక జాతివాళ్లు వాళ్లను తాళ్లతో చెట్టుకు కట్టేశారు. కోతులను చంపారని ఆ ఇద్దరు కన్యలు వెళ్లి చెప్పడంతో ఇలా బంధించారు. నగ్నంగా ఉన్న యాభై మందికిపైగా ఒరైలన్లు రాతి గొడ్డళ్లు, విల్లంబులు, వడిసెలు పట్టుకుని చుట్టుముట్టారు. వాళ్లలో కొంతమంది పొయ్యిపై పెద్ద అండాను వేడి చేస్తున్నాడు. కొందరు కత్తులు నూరుతున్నారు. ‘‘వీడు జెస్యూట్, వీడు జెస్యూట్! పగతీర్చుకుని, మాంచి విందు కుడుద్దాం. వీణ్ని వండుకుని తిందాం’’ అని గట్టిగా అరుస్తున్నారు.    

‘‘అయ్యా! నేను ముందే చెప్పలేదూ, ఆ అమ్మాయిలు మన ప్రాణాలమీదికి తెస్తారని’’ కకంబో అన్నాడు.

‘‘అనుమానమే లేదు! వీళ్లు మనల్ని వేయిస్తారు, లేకపోతే ఉడకబెడతారు’ బదులిచ్చాడు కాండీడ్ మరుగుతున్న అండాను, నూరుతున్న కత్తులను చూస్తూ. అతనికి ఎప్పట్లానే గురువు గుర్తుకొచ్చాడు.

‘‘పాంగ్లాస్ బతికుంటే ఈ అనాగరిక ప్రకృతి చర్యలపై ఏమనేవాడు? నిస్సందేహంగా అంతా మన మంచికేనని అనుండేవాడు. కానీ క్యూనెగొండ్ ను పోగొట్టుకోవడం, ఒరైలన్ల చేతుల్లో దారుణంగా చావడం మటుకు దారుణం అంటాను నేను’’ అని వగచాడు.

అయితే కొకంబో మాత్రం ధైర్యం కోల్పోలేదు.

‘‘మీరు ఊరకే బెంబేలుపడకండి. వీళ్ల భాష నాకు కొద్దిగా తెలుసు. వీళ్లతో మాట్లాడతాను’ అని యజమానిని సముదాయించాడు.  

‘‘మాట్లాడు, మాట్లాడు. అయితే బాగా అర్థమయ్యటట్టు మాట్లాడు. సాటి మనిషిని ఇలా వండుకుని తినడం మహాపాపమని చెప్పు. క్రైస్తవుడెవడూ ఈ పాడుపని చేయడని చెప్పు.’’

కకంబో ఆ ఆటవికులతో మాట్లాడసాగాడు.



‘‘అయ్యలారా! మీరు ఈ రోజున తినబోతున్నది నిజంగానే జెస్యూట్ అనిఃభావిస్తున్నారనుకుంటా. నాకేం అభ్యంతరం లేదు. అంతేకాకుండా, మీ శత్రువులను మీరిలా చెయ్యడం సరైందే. అదీగాక, సాటి ప్రాణులను చంపితినాలని ప్రకృతి ధర్మం కూడా మనకు బోధిస్తోంది. ఇది ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతున్నదే. ఒకవేళ మనం దీన్ని పాటించడం లేదూ అంటే, అంతకంటే మంచితిండి మనకు దొరుకుతుందని అనుకోవాలి. మాకున్న వనరులు మీకు లేవు కాబట్టి మీరు మీ విజయఫలమైన శత్రువులను కాకులకు, గద్దలకు వెయ్యకుండా మీరే ఆరగించడం మంచిది. కానీ అయ్యలారా! మీరు మీ స్నేహితులనే తినెయ్యాలని అనుకోవడం మాత్రం సరికాదు. మీరు ఒక జెస్యూట్ ను చంపబోతున్నామని అనుకుంటున్నారు. కానీ అతడు మీ శత్రువు కాదు, మీ రక్షకుడు. మీ శత్రువులకు శత్రువును మీరు కాల్చబోతున్నారు. ఇక నావరకు వస్తే, నేను ఈ దేశంలోనే పుట్టాను. ఈ పెద్దమనిషి నా యజమాని. జెస్యూట్ కానేకాదు. పైగా అతడిప్పుడే ఓ జెస్యూట్‌ను చంపేసి కూడా వచ్చాడు. అతని బట్టల్నే తొడుక్కుని వచ్చాడు. అందుకే మీరు పొరపడ్డారు. నేను చెప్పింది నిజమేని నిర్ధారించుకోవడానికి ఆ బట్టల్ని దగ్గర్లోని జెస్యూట్ల  రాజ్యం సరిహద్దు తనిఖీ కేంద్రానికి తీసుకెళ్లి, నా యజమాని జెస్యూట్‌ను చంపాడో లేదో కనుక్కోండి.  దీనికెంతో సమయం పట్టదు కూడా. నేను చెప్పింది అబద్ధమని తేలినా మమ్మల్ని తినడానికి మీకు చాలా వ్యవధి ఉంటుంది. నేను చెప్పింది నిజమేనని తేలితే, మీకు అంతర్జాతీయ న్యాయసూత్రాలు బాగా తెలుసు. మమ్మల్ని క్షమించి వదిలేస్తారు.’’

కకంబో వివరణ సహేతుకంగా ఉందని వాళ్లకనిపించింది. వెంటనే తమ నాయకుల్లో ఇద్దరిని నిజం తెసుకు రమ్మని సరిద్దుకు పంపారు. ఇద్దరూ చాకచక్యంగా వ్యవహరించి బంధితులకు శుభవార్త తెచ్చారు. ఒరైలన్లు ఆ ఇద్దరు ఖైదీలను విడుదల చేసి, సకల మర్యాదలూ చేశారు. వాళ్లకు తమ కన్నెపిల్లలను, తినుబండారాలను, పానీయాలను అందించారు. తర్వాత తమ సరిహద్దు వరకు సాగనంపి, ‘‘అతడు జెస్యూట్ కాదు, ముమ్మాటికీ జెస్యూట్ కానే కాదు’’ అని సంతోషంతో కేరింతలు కొట్టారు.

కాండీడ్‌కు ప్రాణగండం తప్పడంతో సంతోషానికి పట్టపగ్గాల్లేకుండాపోయాయి. ‘‘ఎంత మంచి మనుషులు వీళ్లు! ఏం సంస్కృతి! ఏం విజ్ఞానం! నేను కనక క్యూనెగొండ్ అన్నను చంపకపోయి ఉండుంటే నన్ను నిస్సందేహంగా వండుకుని తినేసేవాళ్లు. ఎంతైనా, శుద్ధ అమాయక ప్రకృతిలో చాలా మంచి ఉంది సుమా. ఎందుకంటే, నన్ను తినడానికి ఎగబడిన వీళ్లు, నేను జెస్యూట్‌ను కాదని తెలిసిన మరుక్షణం ఎంత గొప్పగా గౌరవించారు!’’

(సశేషం.. మళ్లీ వచ్చే శనివారం)



No comments:

Post a Comment