Sunday, 20 December 2015

డావిన్సీ.. కళ-జీవితం




అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ







ఎన్ వేణుగోపాల్


ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలూ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ పరిశీలకుడూ సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లెయొనార్దొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలనీ, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్థాలు అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.
ప్రపంచానికంతా తెలిసిన మహానుభావులమీద ఉద్వేగభరితమైన నవలలు రాసిన ఇర్వింగ్ స్టోన్ తన కథానాయకుల జీవితం సమస్తాన్నీ కళ్లకు కట్టే పదబంధాలను సృష్టించి ఆ నవలల శీర్షికలుగా మలిచాడు. ఆ నవలలో ఒకటి పదహారో శతాబ్దపు చిత్రకారుడు మైకెలాంజెలో జీవితకథ అగొనీ అండ్ ఎక్ స్టసీ. ఆ పదబంధం ఆ నవలానాయకుడు మైకెలాంజెలోకు ఎంతగా సరిపోతుందో గాని, ఆయన కన్న ఇరవై ఏళ్లు పెద్దవాడు, చిత్రకళలో ఆయనకు ప్రత్యర్థి, డా విన్సీ అనే పొరపాటు పిలుపుతో ప్రఖ్యాతుడైన లెయొనార్దొ ద వించి కి అక్షరాలా సరిపోతుంది. లెయొనార్దొ జీవితమంతా అంతులేని వేదన, అద్భుత సంరంభం.
వివాహేతర సంబంధపు సంతానంగా, దాదాపు అనాథగా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం తోసుకువచ్చి ఎక్కడా నిలకడగా ఉండనివ్వని నిరంతర జీవన అస్థిరత. చిన్నచిన్న రాజ్యాల మధ్య యుద్ధాలతో ఆ ప్రభువులను నమ్ముకున్న కళాకారుడిగా ఉత్థాన పతనాలు. బాల్యంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, సోదరుల ప్రేమను పొందడానికేమో శిష్యులతో మెలగిన తీరుకు తప్పుడు వ్యాఖ్యానాలతో స్వలింగ సంపర్క నేరారోపణలు, విచారణలు, ఖైదు. తనకందిన పనుల్లో అనేకం బద్దకం వల్లనో, పరిపూర్ణతా భావనతోనో పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ ప్రజ్ఞ,…. ఆయన జీవితమంతా అంతులేని వేదనే.
మరొకపక్క చిన్ననాటి నుంచే ఆయన వేళ్లకొసలనుంచి జాలువారిన అద్భుత కళానైపుణ్యం. దేశదేశాల రాజుల, మతాధిపతుల, కళాభిమానుల, కళా విమర్శకుల ఆదరణ చూరగొన్న ప్రతిభా వికాసం, ఎప్పుడూ చుట్టూరా ఎంతో మంది శిష్యులు, అభిమానులు, ఒక్క చిత్రకళ మాత్రమే కాదు, దాదాపు ఆధునిక విజ్ఞానశాస్త్ర అన్వేషణలెన్నిటికో బీజరూప వ్యక్తీకరణలు – ఆయన జీవితమే అద్భుత సంరంభానికి ఎత్తిపట్టిన పతాక.
ఏదో ఒక శాస్త్రంలో, ఒక రంగంలో, ఒక చిన్న శాఖలో నైపుణ్యంతో మహా మేధావులుగా పేరు తెచ్చుకోగలుగుతున్న వర్తమాన స్థితితో పోల్చినప్పుడు యూరప్ లో భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానానికి సమాజం పరివర్తన పొందుతున్న యుగంలో మేధావులు ఎన్ని శాస్త్రాలలో, ఎన్ని రంగాలలో, ఎంత లోతయిన కృషి చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లెయొనార్దొ ఆ నాటికి శాస్త్రవేత్త, కళావేత్త. ఇవాళ్టి శాస్త్రాల, కళల పరిభాషలో చెప్పాలంటే గణితశాస్త్రజ్ఞుడు, నిర్మాణశాస్త్ర నిపుణుడు, మానవ శరీరశాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త, భూ పటాల చిత్రకారుడు, వృక్షశాస్త్రవేత్త, చిత్రకారుడు, శిల్పి, వాస్తుశిల్పి, నీటిపారుదల వ్యవహారాల నిపుణుడు, సంగీతకారుడు, రచయిత. పునరుజ్జీవన యుగపు మానవుడికి మూర్తీభవ రూపం అని, అతనిది తీరని కుతూహల దాహం అనీ, అతనంత సర్వవ్యాపిత బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞా కలవారు లేరనీ ఎన్నెన్నో విశేషణాలున్నాయి. లెయొనార్దొను అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన స్థల కాలాలను అర్థం చేసుకోవాలి.
పద్నాలుగో, పదిహేనో శతాబ్దపు ఇటలీ తొలి పునరుజ్జీవన సంస్కృతికి వేదిక. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యపు కరడుగట్టిన విలువలను తోసి రాజంటూ, రాజకీయ స్వాతంత్ర్యం, పట్టణ జీవితం, కళారాధన వంటి వ్యక్తి ప్రధాన, హేతుబద్ధ జీవిత విధానాలను ప్రవేశపెడుతోంది. రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన ఐదో శతాబ్ది నుంచీ ఈ కదలికలు మొదలయిన పద్నాలుగో శతాబ్దం దాకా దాదాపు ఒక సహస్రాబ్ది యూరప్ చీకటిలో మగ్గిపోయిందని ఆ నాటి మేధావులు భావించారు. వాటిని మధ్యయుగాలు అని పిలిచారు. రోమన్ సామ్రాజ్యంలో గొప్ప కళా వికాసం పరిఢవిల్లిందని, అది మళ్లీ తలెత్తుతోందని, అది పునరుజ్జీవనమని వాళ్లు భావించారు. ఇదంతా సంప్రదాయం నుంచి ఆధునికతకు, బర్బరత్వం నుంచి నాగరికతకు ప్రయాణమని అనుకున్నారు. రోమన్, గ్రీక్ నాగరికతలలో లాగ మళ్లీ ఒకసారి పట్టణాలకు ప్రాధాన్యత వస్తున్నదని వాళ్లు వాదించారు. పూర్వీకులు వించి అనే గ్రామం నుంచి వచ్చినప్పటికీ, లెయొనార్దొ పుట్టినదీ, ఎక్కువకాలం గడిపినదీ ఫ్లారెన్స్ నగరంలోనే. ఆ నగరం 1460 నాటికే వర్తక కేంద్రం. అప్పటికే అక్కడ ముప్పై మూడు బ్యాంకులు ఉండేవి. బట్టల వ్యాపారం జోరుగా సాగేది. 270 ఉన్ని దుకాణాలు, ఎనబై ఎనిమిది వడ్రంగి దుకాణాలు, ఎనబై మూడు పట్టుబట్టల అంగళ్లతో యాభైవేల జనాభాతో అలరారుతుండిన నగరం అది.
ఈ చారిత్రక నేపథ్యమే లెయొనార్దొ జీవితాన్ని నిగూఢమూ చేసింది, సుసంపన్నమూ చేసింది. అప్పుడప్పుడే ఒక పెట్టుబడిదారీ వర్గం తలెత్తుతూ, అంతకు ముందరి భూస్వామిక రాచరిక మత కట్టుబాట్ల స్థానంలో లిఖితపూర్వక ఒప్పందాలు, ఆస్తి ఘర్షణలు మొదలవుతున్నప్పుడు పుట్టుకొచ్చిన నోటరీల, న్యాయవాదుల కుటుంబానికి చెందినవాడు లెయొనార్దొ. ఆయన తాత వ్యవసాయంలోకి దిగాడు గాని అంతకు ముందు మూడు తరాలు నోటరీలే. ఆయన తండ్రీ నోటరీయే, అలా ఆయన ఇంట్లోనే కొత్తవిలువల బతుకుకు పునాది ఉంది.
ఇక బైట సమాజంలో, కనీసం ఆలోచనాపర వర్గాలలో ఒక గొప్ప మేధో మథనం, సామాజిక సంచలనం సాగుతున్నది. అదంతా పునరుజ్జీవనమని ఆ నాటి మేధావులు భావించారు గాని మోహన్ అన్నట్టు “నిజానికి సామాన్య మానవుల విషయంలో మధ్యయుగాలకు, పునరుజ్జీవనానికి మధ్య ఎలాంటి తేడా లేదు. కేవలం కవులు, కళాకారులు, మేధావులకు మాత్రమే ఈ విభజన రేఖ పనికొస్తుంది. …పునరుజ్జీవన భావన కేవలం గుప్పెడు మంది కళాకారులకు, ధనిక వ్యాపార, కులీన, పాలక వర్గాలకు సంబంధించిన ఒక తాత్విక లోకం మాత్రమే.”
అయితే పునరుజ్జీవన భావన శిష్ట వర్గాలదే అయినా, పునాదిలో వస్తున్న మార్పులు గాలిలో కొత్త భావాలను వీచాయి. తూర్పు భళ్లున తెల్లవారింది, పాతలోకం కదలబారింది. వ్యక్తి వికాసం మొదలయింది. మానవచరిత్రలో ఇదివరకెన్నడూ లేనట్టుగా, వ్యక్తికి తన సామర్థ్యంపై తనకు అపార విశ్వాసం మొదలయింది. తన శక్తి సామర్థ్యాలు భగవద్దత్తమో, విధిలిఖితమో కాదని, తాను తలచుకుంటే తన భవిష్యత్తును తానే రూపుదిద్దుకోగలనని మనిషికి ఆత్మవిశ్వాసం మొదలయింది. సకల కళల్లో ఆరితేరిన విశ్వనరులు రూపొందాలని మనుషులు తలపోశారు. భూస్వామ్యం, మతం, సంప్రదాయం విధించిన బంధనాలను కూలదోసే వ్యక్తి స్వేచ్ఛా భావనలు తలెత్తాయి. లెయొనార్దొ చనిపోయినాక యాభై ఏళ్లకు పుట్టిన ఇంగ్లిష్ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ “సమస్త జ్ఞానాన్నీ నా అధీనంలోకి తీసుకున్నాను” అని వ్యక్తీకరించిన ఆత్మవిశ్వాస ప్రకటన ఈ పునరుజ్జీవన భావనకు, ఆ భావన విస్తరణకు సూచికే.
సామాజిక పరివర్తన జరుగుతున్న ఆ పునరుజ్జీవన యుగం గొప్ప సంచలనాలకు, ఉద్వేగాలకు, అన్వేషణలకు ఆలవాలమైన కాలం. ఈ పునరుజ్జీవనం పారిశ్రామిక విప్లవానికి మూలమూ విస్తరణా కూడ. ఆ ప్రవాహంలో నుంచే ఆధునికత, వ్యక్తి ప్రాధాన్యత, హేతుదృష్టి, శాస్త్రవిజ్ఞానం, కాల్పనికత, ప్రకృతి సౌందర్యారాధన, మనిషి కూడ యంత్రమేననే ఆలోచన వంటి ఎన్నో కొత్త భావనలు, ధోరణులు పుట్టుకొచ్చాయి. పారిశ్రామిక విప్లవం యంత్రంలో చలనాన్ని సాధించింది. సమాజంలో చలనానికి కారణమైంది. ఆ కొత్తగాలులు వీచడం చూసిన మనుషులు తమ చుట్టూ చలనంతో పాటు తమ లోలోపలి చలనాల్ని కూడ గుర్తించారు. ఈ మూడు స్థాయిల చలనాలు పరస్పర అన్యోన్య ప్రభావాలతో మరింత విస్తృతమయ్యాయి. అందువల్లనే యూరప్ లో ఆ యుగం అత్యంత ప్రతిభావంతులైన, బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞలు కలిగిన మేధావులెందరినో సృష్టించింది. ఆ మేధావుల సుదీర్ఘ జాబితాలో తొలి తరం నాయకులలో ఒకరు లెయొనార్దొ.


చిన్నతనంలో లాటిన్, రేఖాగణితం, గణితం నేర్చుకున్న లెయొనార్దొ పద్నాలుగో ఏట చిత్రకళను అభ్యసించడానికి వెరాకియో స్టుడియోలో చేరాడు. అక్కడ సైద్ధాంతిక శిక్షణతో పాటు ఆచరణాత్మకంగా వైవిధ్యభరితమైన కళానైపుణ్యాలు నేర్చుకుని ఉంటాడని, ఆ సాంకేతిక నైపుణ్యాలలో రచన, రసాయనశాస్త్రం, లోహశాస్త్రం, లోహ వస్తువుల తయారీ, నమూనాల తయారీ, తోలు పని, యంత్రశాస్త్రం, వడ్రంగం, చిత్రకళ, శిల్పకళ వంటివి ఉండి ఉంటాయని చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఇరవయో ఏట లెయొనార్దొ ఆనాటి వైద్యుల, కళాకారుల గిల్డ్ అయిన గిల్డ్ ఆఫ్ సేంట్ లూక్ లో సభ్యుడయ్యాడు. ఇటువంటి కళాకారుల, చేతివృత్తిదారుల గిల్డ్ లే  భూస్వామ్య బందిఖానా నుంచి శ్రామికులను విడుదల చేసి, పట్టణాలలో వారికి పని కల్పించాయి. నవనవోన్మేష అన్వేషణకూ, ఇతోధిక ఉత్పాదకతకూ మార్గం సుగమం చేసి చరిత్ర గమనానికి గొప్ప చోదకశక్తిగా అత్యద్భుతమైన పాత్ర నిర్వహించాయి.
అలా ఇటు సొంత ఇల్లు, పట్టణం కల్పించిన వాతావరణం, అటు సమాజంలో చెలరేగుతున్న సంచలనాలు కలిసి లెయొనార్దొ అనే వ్యక్తి వికాసానికి తగిన వనరులను సృష్టించిపెట్టాయి. అయితే, లెయొనార్దొ వంటి అపురూప వ్యక్తి రూపు దిద్దుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఆనాటి సామాజిక జీవనం పునాది అయితే, ప్రత్యేకించి కళా ప్రతిభకు కారణమేమై ఉంటుందని ఈ నాలుగు శతాబ్దాలలో చాల అన్వేషణ జరిగింది. కళా చరిత్రకారుల నుంచి కాల్పనిక రచయితల దాకా, రసాయన శాస్త్రవేత్తల నుంచి నేరపరిశోధనా శాస్త్రవేత్తల దాకా, మనస్తత్వశాస్త్రవేత్తల నుంచి సామాజిక శాస్త్రవేత్తల దాకా ఎందరెందరో ఇటు తొంగిచూశారు. లెయొనార్దొ ఫలానా చిత్రంలోని ఫలానా రేఖ, రంగు ఇందుకు సూచన అన్న దగ్గరి నుంచి, ఆయన బాల్యంలో అనుభవించిన ఫలానా సంఘటన, ఆయన బాల్యం నుంచి గుర్తున్న ఫలానా సన్నివేశం, ఆయన రచనలోని ఒక ఖండం ఆయనను ఎలా తీర్చిదిద్దాయో చాల వివరణలు వచ్చాయి.
ఆయన “…బాల్యం సంక్లిష్ట, సంఘర్షణాత్మక అనుభవాలతో గడిచింది. పల్లెలో తల్లి పెంపకం, వించీలో పెంపుడు తల్లి ఆలనా పాలనా, ఏ లోటూ రానివ్వకుండా చూసుకునే తండ్రి, అన్ని కష్టాలతో సతమతమయ్యే తల్లి, సవతి తండ్రి, సమాజంలో అక్రమ సంతానమనే ముద్ర, మరోపక్క గుండెలపై ఆనించుకునీ, భుజాలపై కూర్చోబెట్టుకునీ ముద్దుచేసే చిన్నాన్న. పెరిగి పెద్దయ్యే వయసులో కారుమబ్బులా ఆవరించిన ఒంటరితనం. ఈ అనుభవాలే అతని భావి జీవితానికి, కళకు ధాతువులయ్యాయి. అతని వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు పరిచాయి” అని మోహన్ అంటాడు.
నానమ్మ లూసియా వైపు కుండలు తయారు చేసేవాళ్లు. ఆ కుండల మీద చక్కని లతలు, జ్యామితీయ ఆకృతులు ఉండేవి. లెయొనార్దొకు ఆ కళావారసత్వం వచ్చి ఉంటుందనీ మోహన్ అంటాడు. “డావిన్సీది పక్కా జానపదుడి హృదయం. ప్రకృతి అతని ఆరాధ్య దేవత” అని బాల్యంలో వించీ చుట్టుపక్కల చూసిన జీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వడ్రంగులు, పశువుల కాపర్లు ఎట్లా లెయొనార్దొ చిత్రాలలోకి ఎక్కారో వివరిస్తాడు. పల్లెల్లోని నూనె గానుగలను బాల్య కుతూహలంతో కళ్లింత చేసుకుని చూసిన లెయొనార్దొలో ఆ యంత్రాలే బీజం వేశాయనీ అతని నోటు పుస్తకాల్లో వందలకొద్దీ మొక్కలు, చెట్లు, పళ్లు కనిపిస్తాయనీ లెయొనార్దొ అనే అద్భుత వ్యక్తి తయారయిన మూల కారణాల సంక్లిష్టతను అర్థం చేయించడానికి మోహన్ ప్రయత్నిస్తాడు.
“దేన్నయినా సరే చూసి, విని, తాకి, శోధించి నిర్ధారణకు రావడం డావిన్సీ సిద్ధాంతం” అటాడు మోహన్. ఇది మొత్తంగానే పునరుజ్జీవన యుగపు సిద్ధాంతం. పెట్టుబడిదారీ అన్వేషణలకు మూలమైన సిద్దాంతం. బైబిల్ చెప్పిందనో, చర్చి చెప్పిందనో దేన్నీ అంగీకరించకు. పంచేంద్రియాలు ఉపయోగించి, హేతుబుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో అని మనిషి మీద మనిషికి విశ్వాసం కలిగించిన విలువలు అవి. మనిషిని విధి చేతిలోని కీలుబొమ్మలా కాక క్రియాశీల, సృజనాత్మక  ఉత్పత్తి శక్తిగా చూడకపోతే పెట్టుబడిదారీ విధానం లేచి నిలవడమే సాధ్యమయ్యేది కాదు. ఆ తొలిరోజుల, విప్లవాత్మక పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించాయి. కాని అతి త్వరలోనే ఆ ప్రగతిశీల, ఉదాత్త, సర్వమానవ సౌభ్రాతృత్వ ధోరణి అంతా మణగిపోయింది. పెట్టుబడిదారీ విధానం మనిషిని విడుదల చేయదని, మనిషిని మనిషి దోపిడీ చేసే, పీడించే సాంఘికధర్మాన్ని బలోపేతం చేస్తుందని అర్థమయింది. పెట్టుబడిదారీ విధానం, పునరుజ్జీవన ఆధునికత ఈ వైరుధ్యాల పుట్ట.
పెట్టుబడిదారీ విధానం ఎదుగుతున్న క్రమంలో ఈ వైరుధ్యాలు అంతకంతకూ ఎక్కువగా బహిర్గతం కావడం మొదలయింది గాని ఒక సున్నిత సునిశిత మేధావిగా లెయొనార్దొ జీవితంలోనే ఈ వైరుధ్యాల బీజాలు గోచరిస్తాయి. “…యుద్ధంలో సైనికులను ఊచకోత కోయడానికి చరిత్ర ఎరుగని మారణ యంత్రాలను కూడా ఊహించి వాటికి కాగితాలపై రూపమిచ్చాడు. గుర్రాల వెన్నుతట్టి వాటి హృదయంతో సంభాషించిన డావిన్సీ, వాటిని పొడవాటి పదునైన కత్తుల రథానికి పూన్చి బొమ్మ వేయడానికి వెనుకాడలేదు. రంగుల్లో ప్రేమ జీవననాదాన్ని హృద్యంగా పలికించిన అతడు మనుషుల ఉసురు తీసే రోమాంచిత ఊహల్లోనూ తేలిపోయాడు….” అనీ, “పూలను, గడ్డిపోచలను ముగ్ధమనోహరంగా చూపిన డావిన్సీ ఈ కుత్తుకలు తరిగే మారణ యంత్రాలకు ఊపిరిపోయడం పెద్ద వైచిత్రి” అనీ అంటూనే “ఈ వైరుధ్యం, వైచిత్రి డావిన్సీ వైయక్తికమైంది మాత్రమే కాదు, నాటి సమాజం, రాజకీయాలు సృష్టించిన పరిస్థితులది కూడా” అంటాడు మోహన్.
అయితే లెయొనార్దొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ. అది ప్రకృతి గురించీ కావచ్చు, జంతువుల గురించీ కావచ్చు. నీటి ప్రవాహాల గురించీ కావచ్చు.  కొత్త యంత్రాల గురించీ కావచ్చు, మానవ శరీరం గురించీ కావచ్చు, సమూహంలో వైవిధ్య భరితమైన మానవ ప్రవర్తన గురించీ కావచ్చు. మత భావనల చిత్రీకరణలలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాలన్నీ రంగరించాడు, రంగుల్లోకి దించాడు. రంగుల్లో కుదించాడు. ఆరు దశాబ్దాలు దాటిన ఆ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ ఈ పుస్తకంలో అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు.
నిజానికి ఇది ముందుమాట గనుక, దీనికి నిడివి పరిమితి ఉంది గనుక ఇంక ఎక్కువ రాయను, ఎన్నెన్నో భాగాలను యథాతథంగా ఉటంకించాలనే కోరికను అణచుకుంటున్నాను.
మిలాన్ పాలకుడు లుడొవికో దగ్గర కొలువు కోసం తనకు ఏయే కళలు వచ్చునో లెయొనార్దొ రాసిన లేఖ, లెయొనార్దొ మిగిల్చి పోయిన దాదాపు ఆరువేల పేజీల నోట్స్, లెయొనార్దొ వేసిన చిత్రాలలో చాల భాగం చెడిపోవడంలో కాలం పాత్ర, మనిషి పాత్ర, మిలాన్ సమీపంలో ఆల్ప్స్ పర్వతాలలో నదుల గురించి లెయొనార్దొ చేసిన అన్వేషణలు, లెయొనార్దొ రాసిన చిత్రకళా బోధిని, చేసిన యంత్రాలు, యంత్ర భాగాలు, మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మృతదేహాలపై లెయొనార్దొ చేసిన ప్రయోగాలు, ప్రకృతి, ఖగోళ శాస్త్ర అన్వేషణలు, అద్దాలపై, కటకాలపై అన్వేషణలు, మతభావనలు, వృద్ధాప్యపు కల వంటి అనేక సందర్భాలలో మోహన్ రచన పాఠకులను సమ్మోహితులను చేస్తుంది, ఐదువందల ఏళ్ల వెనక్కి, ఆ నాటి సామాజిక సాంస్కృతిక వాతావరణంలోకి తీసుకుపోతుంది. ఇక చిత్రాల గురించి – మరీ ముఖ్యంగా జినిర్వా, జెరోమ్, సెయింట్ ఆన్, ఆంగియారి, మోనాలిసా, సెయింట్ జాన్, సిసిలియా, లుక్రీజియా వంటి ఎన్నో చిత్రాల – వివరణలైతే ఒక వచన రచయిత, కళా విమర్శకుడు మాత్రమే చేయగలిగేవి కావు. స్వయంగా చిత్రకారుడు, రంగుల, రేఖల స్వభావ స్వరూపాలు కూలంకషంగా తెలిసిన కళా మర్మజ్ఞుడు మాత్రమే రాయగలిగినవి.
“డావిన్సీ చిత్రకళా సృజనను పక్కనపెడితే అతడు ఇంజనీరింగ్, వాస్తు వగైరా రంగాల్లో కంటే అనాటమీలోనే ఘన విజయాలు సాధించాడు. సుతిమెత్తని కుంచెలు పట్టుకున్న చేతుల్తోనే కరకు కత్తులు పట్టుకుని మృత మానవ దేహాలను రక్తమంటిన చేతులతో శోధించాడు. మానవ గుండెను కుడిచేత్తో పట్టుకుని రక్తపు మరకలంటిన కాగితంపై ఎడమ చేత్తో దాని రూపాన్ని చిత్రించాడు… మనిషి బయటి, లోపలి నిర్మాణాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, నిర్దుష్టంగానే కాకుండా కళాత్మకంగా కూడా చూపిన తొలి అనాటమీ కళాకారుడు డావిన్సీనే. అతడు తన అనాటమీ చిత్రాలతో కళాకారుడికి, శాస్త్రవేత్తకు మధ్య ఉన్న తేడాను చెరిపేశాడు…. అతని జ్ఞానపిపాసను మతం అడ్డుకోలేకపోయింది” అనీ, “కళ్ల కదలికలకు కారణమేంటి? కనుబొమలు ఎలా ముడిపడతాయి? కనురెప్పలు ఎందుకు మూతపడతాయి? ముక్కుపుటాలు, నోరు, పెదవులు తెరచుకోవడం, మూసుకోవడం వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఉమ్మడం వెనుక మతలబేంటి? ఎందువల్ల నవ్వుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం అని డావిన్సీ ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నలను ఓ పుర్రెబొమ్మ వేసిన కాగితం వెనక రాసుకున్నాడు. చీదడం, ఆకలి, నిద్ర, మైథునం, చెమట, కండరాల కదలికలకు కారణమేంటో తెలుసుకోవాలని రాసుకున్నాడు” అనీ అంటాడు మోహన్.
నిజానికి మోహన్ రచనలో ఇటువంటి ఆర్ద్ర, సున్నిత, కాల్పనిక, కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించగల శక్తి లెయొనార్దొ జీవితంలోనే ఉంది. స్వయంగా లెయొనార్దొ మనకోసం వదిలిపెట్టిపోయిన రచనలలో కూడ ఉంది. ఉదాహరణకు, “ఆత్మికోద్వేగాలను భంగిమల ద్వారా చెప్పగలిగితేనే చిత్రానికి విలువ ఉంటుంది”, “నా శ్రమతో ప్రకృతిలోని రహస్యాలు బట్టబయలవుతాయి”, “ఒకసారి అధ్యయనం చేసిన వాటి గురించి రాత్రిపూట ఆలోచిస్తే మంచిదని స్వానుభవంతో చెబుతున్నా. మనం పడుకున్నప్పుడు రాత్రి నిశ్శబం వల్ల ఆలోచన పదునెక్కుతుంది. దాంతో మనం సృజించిన వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దగలం”, “పోషకులు మొదట్లో నిన్ను ఆకాశానికెత్తేస్తారు. తర్వాత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత విశ్వాసహీనంగా ప్రవర్తిస్తారు. ఆపై నిన్ను నిందిస్తారు”, “అచ్చేసిన పుస్తకాల మాదిరి చిత్రాలకు పెద్దసంఖ్యలో నమూనాలు ఉండకూడదు. ఒక చిత్రం ఒక చిత్రంగానే ఉండాలి. పిల్లల్ని పుట్టించగూడదు. అప్పుడే అది ప్రత్యేకంగా, మిగతా వాటికంటే గొప్పగా భాసిల్లుతుంది”, “పక్షి గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే యంత్రం. ఆ యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. అయితే అతని యంత్రానికి పక్షికున్నంత శక్తి ఉండదు. పక్షి హృదయమూ ఉండదు. కనుక మనిషి ఆ లోపాన్ని యంత్రానికి తన హృదయాన్ని అందించి అధిగమించాలి” వంటి ఆణిముత్యాలెన్నో లెయొనార్దొ రచనల్లో ఉన్నాయి.
“చిత్రకారుడు సమస్త జీవజాలపు, ప్రకృతి సారాంశం. జంతువులు, మొక్కలు, పళ్లు, మైదానాలు, శిఖరాలు, భయం గొల్పే ఆవరణలతో పాటు ఆహ్లాదకర ప్రాంతాలు, గాలి వాలుకు తూలిపోయే రంగురంగుల పూలతో కూడిన పొదలు, ఎత్తయిన పర్వతాల నుంచి బలంగా కిందికి దూకే నదులు, వాటిలో కొట్టుకుపోయే రాళ్లు, చెట్ల వేళ్లు, మన్ను, నురగ, ఝంఝామారుతంతో ఎదురొడ్డి పోరాడే తుపాను కడలి సారాంశం… చిత్రకారుడు… మానవుల్లోని సౌందర్యం నశిస్తుంది. కాని కళలోని సౌందర్యం నశించదు” అన్నాడు లెయొనార్దొ ద వించి.
ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలు గడిచింది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహన గానం ఈ పుస్తకం. చదవండి.
Da Vinci – 1/8 demy, 264+8 pages, Rs. 150, Kaki Prachuranalu
For copies: All leading book shops/
Kaki Prachuranalu, Plot No. 304, H.No. 3-5-118/15, Second Floor, GPR Nilayam, Krishnanagar, Hyderguda, Rajendranagar, Hyderabad 500048, Ph: 9949052916

1 comment: