Saturday, 12 December 2015

తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడు తెలుగువాడే!

-పి.మోహన్

బ్రహ్మస్వామి స్వీయచిత్రం?


తెలుగు వ్యాకరణ దీపం చిన్నది అంటారు. వ్యాకరణానికి కనీసం అదైనా ఉంది. తెలుగు కళకు అసలు ఏ దీపమూ లేదు. మనం సాహిత్యాన్ని పట్టించుకున్నంతగా కళను, దాని చరిత్రను పట్టించుకోలేదు. దాన్ని కాపాడుకోనూ లేదు. దక్షిణ భారతానికే వన్నెతెచ్చిన లేపాక్షి వర్ణచిత్రాలు పెచ్చులూడిపోతున్నా, మ్యూజియాల్లో భద్రంగా ఉండాల్సిన శిల్పాలు ఇళ్లకు పునాదిరాళ్లవుతున్నా మనకు ఈగ వాలినట్టు కూడా ఉండదు. చరిత్ర పట్టించుకోని వాడికి చరిత్ర ఉండదు

ఈ వలపోతను పక్కన పెట్టి నేరుగా విషయంలోకి వస్తాను. చరిత్రలో కలిసిపోయిన ఒక అపురూపమైన మన తెలుగు చిత్రకారుణ్ని పరిచయం చేస్తాను. చరిత్ర తిరిగిన మలుపుల్లో అతడెట్లా కనుమరుగైపోయిందీ నిమిత్తమాత్రుణ్నయిన నేను అతన్ని అనుకోకుండా ఎట్లా బయటికి తీసిందీ వివరిస్తాను.
చిత్రకళపై ఆసక్తి, అభిరుచితో ఇంటర్నెట్ నుంచి కొన్ని చారిత్రక ప్రాధాన్యమున్న పెయింటింగులను సేకరిస్తూ, ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తుండగా ఒక పెన్నిధి ఆచూకీ లభించింది. రచయిత బొల్లోజు బాబా గారు పారిస్ లోని ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం( Bibliothèque nationale de France) వెబ్ సైట్ http://gallica.bnf.frగురించి చెప్పారు. అందులో చారిత్రక ప్రాధాన్యమున్న వేలాది పుస్తకాలను స్కాన్ చేసి పెట్టారు. వెబ్ సైట్  ఫ్రెంచి భాషలో ఉంది. అర్థం కాలేదు. గూగుల్ ట్రాన్స్ లేటర్, ఇతర మార్గాల్లో తిప్పలుపడి మన బొమ్మలు దొరుకుతాయేమోనని గాలిస్తుండగా దొరికాడు మన కథానాయకుడు. పేరు బ్రహ్మస్వామి. 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని స్వస్థలం నూటికి తొంభై తొమ్మిది శాతం తమిళనాడులోని తంజావూరు. తెలుగు కుంచెలు హోళీ ఆడిన చారిత్రక వర్ణనగరి అది. ఆ మిగిలిన ఒక్క శాతం కలంకారీ కాళహస్తి కాని, బందరు కానీ కావొచ్చు.

ఈ వ్యాసంలో నేను అనే ప్రస్తావన తీసుకురావద్దనుకున్నాను కాని సాధ్యం కాలేదు. నాకు చిత్రకళపై ఆసక్తి. కాస్తో కూస్తో తెలుసని అనుకుంటున్నాను. అందుకే, నాకు తెలిసిన వివరాల ఆధారంగా బ్రహ్మస్వామి మనకు తెలిసిన తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడని సగర్వంగా ప్రతిపాదిస్తున్నాను. తెలుగునేలకు సంబంధించి ఒక చిత్రకారుడి పేరు చరిత్రలో నమోదు కావడం కూడా బ్రహ్మస్వామితోనే మొదలనుకుంటా. జక్కన్న, ఏకోజీ, వెంకోజీ వంటి శిల్పుల పేర్లు చరిత్రలో నమోదై ఉన్నాయి. చిత్రకారుల పేర్లు కూడా వాటిలో ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు. కానీ ససాక్ష్యంగా మనకు పట్టుబడినవాడు బ్రహ్మస్వామే.

పైన పేర్కొన్న వెబ్ సైట్ లో బ్రహ్మస్వామి వేసినట్టు చెప్పే బొమ్మల ఆల్బమ్ లు రెండున్నాయి. వాటి సూచీలో ఆయన పేరును brahame svami  అని రాశారు. స్వామి సరిగ్గా ఉంది. బ్రహమ్ నూటికి తొంభై తొమ్మిది శాతం బ్రహ్మే. ఆనాటి ఫ్రెంచి వాడకంలో బ్రాహ్మణులను బ్రామిన్, బ్రహమ్ అనేవాళ్లు. బ్రహ్మస్వామి ఆల్బమ్ లను చాలా జాగ్రత్తగా, ఖాళీ పేజీలను కూడా వదలిపెట్టకుండా స్కాన్ చేసి ఉంచారు వెబ్ సైట్లో. ఒకటిదేవతల బొమ్మలు, వాటిపై తెలుగులో వాళ్ల పేర్లు రాసిన ఆల్బమ్. మరొకటితెలుగువాళ్ల వృత్తులు, అవేమిటో తెలుగులోనే శీర్షికలు రాసిన ఆల్బమ్. ఈ రెండు అల్బమ్ లలోని బొమ్మల రంగురేఖలను పోలిన బొమ్మలున్న మరో ఆల్బమ్ కూడా ఉంది. కానీ అది బ్రహ్మస్వామి బొమ్మల ఆల్బమ్ అని దానిపైన రాయలేదు. బొమ్మల్లో సారూప్యత.. అంటే దేవుళ్ల కిరీటాలు, కంకణాలు, రుషుల జటాజూటాలు, బట్టలు వంటివి ఒకేలా ఉండడాన్ని బట్టి ఆ అల్బమ్ కూడా బ్రహ్మస్వామి సృజనే అని నిర్ధారణ అవుతోంది. ఈ మూడు అల్బమ్ లు ఆనాడు మన తెలుగు, తమిళ దేశాల్లో ఫ్రెంచి సైన్యాధికారులుగా పనిచేసిన వాళ్లు వేయించుకున్నారు. వాళ్ల గురించి, బ్రహ్మస్వామి కాలం గురించి తర్వాత వివరిస్తాను. 
    దేవతల ఆల్బమ్ వెన్నుపై స్వామి పేరు

దేవతల బొమ్మలున్న బ్రహ్మస్వామి తొలి ఆల్బమ్ లో అట్టలు, ఖాళీ పేజీలు కలుపుకుని 423 పేజీలు ఉన్నాయి. 200 బొమ్మలున్నాయి. బొమ్మల వెనకవైపు ఖాళీ వదిలేశారు. ఇవన్నీ నీటిరంగుల చిత్రాలు. 11వ పేజీలో ఈ బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు Dessinateur(డిజైనర్) బ్రహ్మస్వామి అని, దాని పక్కన 1780 అని రాశారు. దానికింద ఆల్బమ్ 1784వ సంవత్సరంలో అందిందని(లైబ్రరీకి?) రాశారు. మత్స్యావతారం తొలి బొమ్మ. దశావతారాలు, కృష్ణలీలలు, విష్ణువు వాహనాలు, లక్ష్మి, మన్మథుడు ఇతర దేవతలు, ఒక గుడి తదితర బొమ్మలు ఉన్నాయి. ఆశ్వికుడి విగ్రహాన్ని మోసుకెళ్తున్న బోయీల బొమ్మ చివరిది. గుర్రంపై ఉన్నది దేవుడా, ఓ పాలెగాడా అన్నది స్పష్టం కావడం లేదు. బొమ్మ ఎవరిదో చెబుతూ తెలుగులో వాటి పేర్లు రాశారు. మచ్చవతారం, బవుద్ధావతారం, రాముడూ, బలబద్రం, వేణుగోపాలం, గొల్ల క్రిష్ణుడు, పంచపాండవులు, తిరుపతి వెంక్కటేశ్వరుడూ, కాళహస్తీశ్వరుడూ, శెదంబ్బరం(చిదంబరం), గెరుడ వాహనంపై వైకుట్టవాసులు, వెంటక్రిష్ణస్వామి, చెళ్లపిళ్ల గోవిందుడు, తిల్లగోవిందుడు కొమలవల్లి, పుట్టసన్యాసి వంటి పేర్లున్నాయి. బ్రహ్మ బొమ్మపై మాత్రం కోణ(గోన?) అని తమిళం పేరుంది.

ఈ బొమ్మలు తెలుగు చిత్రకళ అందచందాలకు అద్దం పడుతున్నాయి. వర్ణలేపనం, రేఖావిన్యాసం సంప్రదాయిక శైలిలోనే ఉన్నా ఆధునిక రీతికూడా గోచరిస్తుంది. నేపథ్యాన్ని ఖాళీగా వదిలేయడం, కొన్నిచోట్ల లోతును, అంటే.. మూడో ఆయతనాన్ని(త్రీ డైమన్షన్) చూపడం, చూపే ప్రయత్నం, రంగులపూతలో అతి నైపుణ్యం.. ఇవన్నీ మొగ్గుతొడుగుతున్న నవ్యతకు ఉదాహరణ.  బ్రహ్మస్వామి ఆల్బమ్ లు ఫ్రెంచి వాళ్లు వేయించుకున్నవని చెప్పాను. 17వ శతాబ్ది నుంచి 1870 ప్రాంతాల వరకు మన దేశంలో బ్రిటిష్, ఫ్రెంచి, డచ్చి పాలకులు వివిధ ప్రాంతాలను పాలించారు. ఆ దేశాల సైన్యాధికార్లలో, గవర్నర్లలో కొందరు మన కళలు, సంప్రదాయాలపై ఆసక్తి చూపారు, బ్రౌన్ దొర మన తెలుగు సాహిత్యంపై చూపినట్టు. మన దేవతల బొమ్మలను, కుమ్మరం, కమ్మరం వంటి మన వృత్తులను చూపే బొమ్మలు వేయించుకున్నారు. వాటికి తమ దేశాల కళాసంప్రదాయాలను జోడించీ వేయించుకున్నారు. రంగులూ, కుంచెలూ, కాగితాలూ వాళ్లే ఇచ్చారు. ఈస్టిండియా కంపెనీ, ఫ్రెంచి, డచ్చి కంపెనీల పాలనలో ఇవి తయారయ్యాయి కనక వీటిని కంపెనీ పెయింటింగులు అని, ఆల్బమ్ లలో వేశారు కనక ఆల్బమ్ పెయింటిగులని వ్యవహరిస్తున్నారు. వీటిని ఆ పరాయి దొరలు భద్రంగా తమ దేశాలకు తీసుకెళ్లారు. బ్రహ్మస్వామి బొమ్మలు అలా పారిస్ చేరుకున్నాయి.

బ్రహ్మస్వామి దేవుళ్ల ఆల్బమ్ నాటి కంపెనీ ఆల్బమ్ లతో పోలిస్తే దానంతట అది గొప్ప కాకపోవచ్చు కానీ, అది తెలుగునేల కళాచరిత్రలో మాత్రం ఒక మలుపు. అతడు తన చుట్టూ ఉన్నా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, తన ఊహకు అందినట్టు నిజాయతీగా చిత్రించాడు. ఇప్పుడు మనం చూస్తున్న హిందూ దేవుళ్ల తలల వెనక కనిపించే పవిత్ర వలయాలు(హాలో) ఈ బొమ్మల్లో ఎక్కడా కనిపించవు. బ్రహ్మస్వామి పూర్వీకులనదగ్గ లేపాక్షి రంగరులు వేసిన బొమ్మల్లోనూ అవి లేవు. అవి మనకు కొత్తగాదు గాని, పాశ్చాత్యుల మేరీ, క్రీస్తుల రాకతో మన దేవుళ్ల వెనక మరింత ఎక్కువగా చేరాయి.

ఇక  బ్రహ్మస్వామి రెండో ఆల్బమ్ గురించి. కళలో అతని ఆధునిక దృక్పథానికి ఇది రుజువు. అట్టలు కలుపుకుని 151 పేజీలున్న ఈ అల్బమ్ లో 69 చిత్రాలు ఉన్నాయి. అయితే దీనిపై  పైన చెప్పుకున్న దేవతల అల్బమ్ లో ఉన్నట్టు తేదీ వివరాలు లేదు. వడ్డెర కార్మికుని చిత్తరువుతో మొదలై ‘పినిగెను యెత్తుక పోవ్వుట’ అని చిత్రంతో ముగుస్తుంది. మధ్యలో రైతుకూలీలు, చేనేత కార్మికులు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, చాకలి, మేదరి, కల్లుగీ కార్మికుడు, గాజులవాడు, మాదిగ కులస్తుడు వంటి మరెందరో శ్రమజీవులు తారసపడతారు. మహిషాసుర మర్దని, ఆలయం వద్ద దేవదాసీ నాట్యం వంటి బొమ్మలూ ఉన్నా ఇది ప్రధానంగా భారతీయుల వృత్తులను, కట్టుబొట్లను పరిచయడానికి తీర్చిదిద్దిన ఆల్బమ్. అందుకే మరీ పట్టిపట్టి వేసినట్టు కాకుండా అలవోకగా వేసినట్టు ఉన్నాయి. ‘మాదిగెవాడు’ బొమ్మ దీనికి చక్కని ఉదాహరణ. ఎలాంటి అలంకారాలూ లేకుండా కేవలం అతని పనినే చూపుతుంది. ముఖాన్ని వాస్తవికంగా పరిచయం చేస్తుంది. భారతీయ కులవృత్తుల చిత్రాలను 17, 18, 19వ శతాబ్దాల్లో అంటే.. కంపెనీ పెయింటింగు దశలో దక్షిణాదితోపాటు, ఉత్తర భారతంలోనూ విరివిగా చిత్రించారు. చాలావాటిలో అందానికి అలంకారాలకే ప్రాధాన్యం. బ్రహ్మస్వామి రూపుగట్టిన వృత్తుల్లో మాత్రం అతిమామూలు వాస్తవికతే ప్రాధాన్యం. ఇదంతా అతడు చైతన్యంతో చేసింది కాదని గుర్తించుకోవాలి. పరిసరాలను వాస్తవికంగా దర్శించాడు, అంతే. కానీ, మిగతా కళాకారుల బాటలో కాకుండా తను ఎంచుకున్నబాటలో నడిచాడు. అతడు సంప్రదాయాన్ని చైతన్యంతో నిరాకరించి ఉండకపోయినా దాన్నుంచి బయటపడ్డాడు కనక ఆధునికత వైపు అడుగులు వేసినట్టే. సంప్రదాయాన్ని పాటించేవాళ్లు తమకు తెలియకుండా ఆధునికతకు బాటలు పరచిన వైనం కళాచరిత్రలో నమోదైంది. ప్రాచీన ఈజిప్టు చిత్రకారులు, శిల్పులు, ఆఫ్రికన్ కళాకారులు ఆవిష్కరించిన అనేకానేక ధోరణులు, వాటితో ప్రేరణ పొందిన కళావాదాలు ఈనాటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిమ ఆఫ్రికన్ కళ క్యూబిజానికి దారి తీసింది. సంప్రదాయ జనం తమకు తెలియకుండానే ఆధునిక కళకు ఊపిరిపోస్తారని అంటుంది రాజకీయాల్లో, చరిత్రలో ఆరితేరిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని గోల్దా మీర్(The public history of modern art is the story of conventional people not knowing what they are dealing with- Golda Meir). ఫ్రెంచి కళావిమర్శకుడు షార్ల్ బోదలేర్ కూడా.. ఆధునితక అనేది సంభావ్యమైన, అనిశ్చితమైన వ్యవహారం అని అంటాడు(By modernity I mean the transitory, the fugitive, the contingent)ఆధునికత అనేది గుణాత్మకమైందే కానీ, కాలక్రమానుగతమైంది కాదని థియోడర్ అదోర్నో కూడా వాదిస్తాడు(Modernity is a qualitative, not a chronological, category).బ్రహ్మస్వామిని తొలి భారతీయ ఆధునిక చిత్రకారునిగా ప్రతిపాదించడం విపరీతంగా అనిపించొచ్చు. అసలు పాశ్చాత్య దేశాల్లో ఆధునిక చిత్రకళ ప్రారంభమైందే 1860లలో అయినప్పుడు, వెనకబడ్డ మన దేశంలో అంతకుముందు వందేళ్ల కిందట ఆధునికత్వం ఎలా వచ్చింది అని అడగొచ్చు. బ్రహ్మస్వామి చిత్రాల్లో వాస్తవికత ప్రతిఫలనం, వాటి వెనక నామమాత్రమే అయినా పాశ్చాత్యకళా సంప్రదాయ నేపథ్యం, అన్నిటికీ మించి స్థానికతకు ఒక విశ్వజనీన విలువను అందించే ప్రయత్నం.. ఇవన్నీ కలిపి అతణ్ని మసకతెరల మాటునైనా ఆధునిక వేగుచుక్కగా నిలబెడతాయి. ఆధునిక భారతీయ చిత్రకారుడని వివాదాస్పద భుజకీర్తిని తగిలించుకున్న రవివర్మ కూడా పాశ్చాత్యకళోపాసన చేయడం, చేసినా మళ్లీ తన గడ్డపైని దేవుళ్లతోనే ఆ పేరు గడించడం గమనించాలి. తను వేసిన వృత్తుల చిత్రాల్లో బ్రహ్మస్వామి మిగతావాళ్లకు భిన్నంగా ఎలా నడిచాడో ఒక ఉదారహణ చూపుతాను.
గొల్ల క్రిష్ణుడు

బ్రహ్మస్వామి స్వామి రూపుట్టిన ‘మాదిగెవాడి’నీ, అతని దక్షిణాది సమకాలికుడో, తర్వాతి తరం చిత్రకారుడో వేసిన చర్మకారుని చిత్రాన్నీ చూద్దాం. ఈ రెండో బొమ్మ కూడా భారత్ లోనే తయారై, పారిస్ చేరిన ఆల్బమ్ లోని బొమ్మే. బ్రహ్మస్వామి చిత్రంలో అలంకారత లేదు. నేపథ్యం ఖాళీ. రంగురేఖల్లో దూకుడు ఉంది. ఎవర్ని చూపాలని అనుకుంటున్నాడో వాళ్లకే ప్రాధాన్యం. రెండోదాంట్లో మాత్రం అలంకారత ఎక్కువ. బ్రహ్మస్వామి దళితుడు కటికనేలపై చెప్పులు కుడుతున్నాడు, అవి ఆనాటి మామూలు చెప్పులు. రెండో బొమ్మలో అందుకు భిన్నం. అలంకారత, నేపథ్యమంతా పాచిరంగు ఉంది. రంగురేఖలను జాగ్రత్తగా తీర్చిదిద్దారు. చర్మకారుని ముఖం ప్రశాంతంగా ఉంది. పక్కనే ఉన్న అతని భార్యా కుందనపు బొమ్మే. చెప్పులు కూడా బ్రహ్మస్వామి చిత్తరువులో మాదిరి కాకుండా పరాసు దొర బూట్లు. నల్లగా నిగనిగలాడుతున్నాయి. మన చెప్పులను కాకుండా తాము వాడే బూట్లను వెయ్యమని కోరి ఉంటాడు దొర. రెండో చిత్రమున్న ఆల్బమ్ లోని శ్రామిక చిత్రాలను, మన బ్రహ్మస్వామి వేసిన చిత్రాలతో పోలిస్తే ఇలాంటి తేడాలు చాలా చెప్పుకోవచ్చు. ఇంకా చిత్రంగా.. అతని దేవుళ్ల బొమ్మల్లోని ఆడవాళ్లు అచ్చం నేటి తెలంగాణ కుంచెకారుల రూపచిత్రకళ(ఫిగరేటివ్)లోని వాళ్లలా ఉంటారు.
‘మాదిగెవాడు’

బ్రహ్మస్వామి సమకాలికుడు వేసింది
అదిసరే గాని, బ్రహ్మస్వామి కచ్చితంగా తెలుగువాడే అని ఎలా చెప్పగలం? అతని బొమ్మలపై తెలుగు పేర్లున్నంత మాత్రాన అతడు తెలుగువాడవుతాడా? ఈ ప్రశ్నలకు అతని దేవతల ఆల్బమ్ లో ఒక ఆధారముంది. అది 1784లో లైబ్రరీకి అందింది. దీన్ని తీగలా పట్టుకుని డొంకను కదిలిద్దాం. బ్రహ్మస్వామి ఆల్బమ్ లతోపాటు తెలుగునేలపై పురుడుపోసుకున్న మరికొన్ని బొమ్మల ఆల్బమ్ లు అదే లైబ్రరీలో ఉన్నాయి. వాటిలోని బొమ్మలపైనా తెలుగు పేర్లున్నాయి. 1720-30 ప్రాంతంలో తయారైనట్టు చెప్పే అలాంటి ఒక ఆల్బమ్ షార్ల్ అద్రియన్ పికార్డ్ (Charles-Adrien Picard) అధీనంలో ఉండేదని దాని వివరాల్లో ఉంది.  పికార్డ్ 1779లో చనిపోయాడనీ ఉంది. అందులోని తిరుపతి వెంకటేశ్వరుడు వంటి దేవతల బొమ్మలపైనా, కృష్ణదేవరాయలు, రఘునాథనాయకుడు వంటి పాలకుల, పాలెగాళ్ల బొమ్మలపైనా వాళ్ల పేర్లను తెలుగు రాశారు. పికార్డ్ భారత్, చైనా, మలయా వంటి తూర్పు దేశాల నుంచి సేకరించిన పుస్తకాలను, కళాఖండాలను అతడు చనిపోయిన మరుసటి ఏడాది వేలం వేశారు. దీని ఆధారంగా షార్ల్ పేరున్న ఆల్బమ్ కచ్చితంగా తెలుగునేలపైనే రూపుదిద్దుకుందని చెప్పవచ్చు. ఈ వివరాలను దృష్టిలో ఉంచుకుని మరో ఆల్బమ్ ను తెరుద్దాం.  బ్రహ్మస్వామి శైలి బొమ్మలున్న మరో ఆల్బమ్.. అంటే దేవతలది, వృత్తులది కాని మూడో ఆల్బమ్ ఇంచుమించు 1770-1785  ప్రాంతంలో తయారైందని దాని సూచీలో ఉంది. అందులో తెలుగుపేర్లు లేకున్నా తెలుగుదనం ఉట్టిపడే చిత్రాలున్నాయి. బ్రహ్మస్వామి అని పేరున్న దేవతల బొమ్మల ఆల్బమ్ పైనా 1784 అనే వివరముందని చెప్పుకున్నాం. ఈ వివరాలను క్రోడీకరిస్తే బ్రహ్మస్వామి పేర్లున్న రెండు ఆల్బమ్ లు, అతని శైలి బొమ్మలున్నా అతని పేరులేని ఆల్బమ్.. మూడూ ఒకే చోట ఉండినట్టు భావించొచ్చు. మూడో ఆల్బమ్ లో తెలుగు పేర్లు లేకపోవడానికి కారణముంది. ఆ బొమ్మలు ఆల్బమ్ పేజీల్లో వేసినవి కావు. వేరే కాగితంపై వేసి, ఆల్బమ్ లో అతికించినవి. వాటికింద ఫ్రెంచిలో వివరాలున్నాయి. బొమ్మలు వేయించుకున్న దొర అభిరుచికి అనుగుణంగా వేసి ఉండొచ్చు. 
ఆ మూడింటిలోని బొమ్మల్లో తెలుగు దేవుళ్లున్నారు. తిరుపతి వెంకటేశ్వరుని నుంచి మధురమీనాక్షమ్మ వరకు ఉన్నారు. బొమ్మలు వేసినవాడే సాధారణంగా అందులో ఉన్నదెవరో రాసి ఉండేదానికి అవకాశం ఎక్కువ. పైగా పేర్లు చిత్రంపైనే పెద్దగా ఉన్నాయి. వివరాలు బొమ్మకింద ఫ్రెంచిలో చిన్నగా ఉన్నాయి. బ్రహ్మస్వామి తంజావూరు వాడై ఉండేందుకు ఎక్కువ అవకాశముంది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత అక్కడి తెలుగు చిత్రకారులు తంజావూరు, మధురలకు వలస వెళ్లారు. తంజావూరు వెళ్లినవాళ్లు సొగసైన తమ చిత్రకళతో ఆ ఊరికే పేరు తెచ్చారు. తంజావూరు కళాకారుల్లో అత్యధికం తెలుగువాళ్లే. రవివర్మ కూడా వాళ్ల పంచ ఆశ్రయించినవాడే. రామస్వామినాయుడనే తెలుగు చిత్రకారుడు ట్రావెన్ కోర్ సంస్థానంలో ఉన్నప్పుడు రవివర్మ అతని బొమ్మలను దొంగచాటుగా చూసి నేర్చుకున్నాడంటారు. అంతెందుకు.. గత శతాబ్ది నుంచి, ఇప్పటివరకు హిందువులు పూజిస్తున్న పటాల్లోని దేవతల్లో చాలామంది తమిళనాడువాడైన కొండయ్య రాజు(1898-1976) అనే తెలుగు తంబి కుంచెలోంచి వచ్చినవాళ్లే. తమిళ, తెలుగు దేవుళ్ల బొమ్మలేసి, గొల్ల క్రిష్ణుడు, పినిగె, వడ్లుదంచేది అంటూ పరమ తెలుగు పేర్లు పెట్టిన బ్రహ్మస్వామి వాళ్లలో ఒకడని సులువుగా తేల్చేయొచ్చు. అతన్ని బొమ్మలు వేసివ్వమని ఏ ఫ్రెంచి గవర్నరో, సైన్యాధికారో కోరి ఉంటాడు. బ్రహ్మస్వామి ఆల్బమ్ ల వివరాల ప్రకారం అతడు 1770-85 మధ్య తీరికలేకుండా పనిచేశాడు. 1770ల నాటికి అతనికి ఒక అంచనా కింద 30-40 ఏళ్లు ఉన్నాయనుకుంటే అతడు 1730-40 దశకంలో పుట్టి ఉంటాడు. ఆనాడు జీవన ప్రమాణం తక్కువ కనక తనువెప్పుడు చాలించాడో చెప్పడం కష్టం.
 వడ్లు దచెది


  బ్రహ్మస్వామి మూడో ఆల్బమ్ లోనిది

మరి, కళాకారుడైన బ్రహ్మస్వామి ఎలా ఉండేవాడు? తన రూపాన్ని చిత్రించుకోలేదా? అంటే.. ఈ ప్రశ్నలకూ అంచనాతో జవాబు చెప్పొచ్చు.. చిత్రించుకున్నాడని. వృత్తుల ఆల్బమ్ లోని బొమ్మల్లో ఒకదాంట్లో దాదాపు ఒకే రూపురేఖలతో ఉన్న ముగ్గురు కలంకారీ కళాకారులు ఉన్నారు. స్వర్ణకారుని పనిని చూపే మరో చిత్రంలోని కళాకారునికి వీళ్లతో పోలికలున్నాయి. గాజుల తయారీ వంటి మరొకొన్నిబొమ్మల్లోని హస్తకళాకారులతోనూ కలంకారీ మనిషి పోలికలున్నాయి. వీటి ఆధారంగా కలంకారీ చిత్రంలోని ముగ్గురి బొమ్మలూ బ్రహ్మస్వామి స్వీయచిత్రాలని అంచనాకు రావొచ్చు. ఆ కాలంలో మన దేశ కళాకారుల్లో.. ముఖ్యంగా మొగల్ శైలి కళాకారుల స్వీయచిత్రాలు ఇదే ధోరణిలో కనబడతాయి. బ్రహ్మస్వామి తెలుగువాడే అనేందుకు ఈ కలంకారీ కళాకారుని బొమ్మ కూడా ఒక గట్టి ఆకరం. ఇప్పుటి కలంకారీ బొమ్మలు వేసే విధానంలోనే అతడూ బొమ్మలేస్తున్నాడు. కలంకారీ తెలుగు కళ కనక ఆ లెక్కన అతడు కచ్చితంగా తెలుగువాడే అవుతాడు.

ఇక బ్రహ్మస్వామి బొమ్మలను తెలుగు సీమలో పనిచేసిన ఫ్రెంచి దొరలు వేయించుకుని ఉండొచ్చని చెప్పే ఆధారానికి వెళ్దాం. లైబ్రరీలో లూయీ లారెంత్ డి ఫెదర్బ్ మొదావ్(Louis Laurent de Féderbe Modave 1725-1777) అనే ఆసామికి చెందిన మరికొన్ని తెలుగు, తమిళ ప్రాంతాల ఆల్బమ్ లు ఉన్నాయి. మొదావ్ ఫ్రెంచి సైన్యాధికారి. భారత్ లో ఫ్రెంచి సైన్యం తరఫునా, ఈస్టిండియా కంపెనీ తరఫునా పనిచేశాడు. పుదుచ్చేరిలోని కారైక్కాల్ కు గవర్నర్ గా ఉన్నాడు. కలంకారీ కళకు నెలవైన మచిలీపట్నంలో చనిపోయాడు. మన సంప్రదాయాలపై ఆసక్తి. ఇతనికి పిల్లనిచ్చిన మామ అబ్రహామ్ పీయెర్ పోషెర్ డె వూల్షెస్ (Abraham Pierre Porcher des Oulches) కూడా మచిలీపట్నంలో పనిచేశాడు. కారైక్కాల్ పాలెగాడిగానూ ఉన్నాడు. ఇతనికీ మన బొమ్మల ఆల్బమ్ లు, పుస్తకాలు సేకరించే వ్యసనం ఉండేది. అవి అల్లునికి వారసత్వంగా దక్కాయి. మొదావ్ కు సాహిత్యం, కళలు అంటే ఇష్టం. ఫ్రెంచి భావవిప్లవకారుడు ఓల్టేర్ కు స్నేహితుడు. ఇద్దరూ బోలెడు ఉత్తరాలు రాసుకున్నారు. వేదాలు, సతీసహగమన దురాచారాలపై చర్చించుకునేవాళ్లు. మొదావ్ ఓల్టేర్ కు రాసిన ఓ లేఖలో.. ‘వీళ్ల(భారతీయుల) మూఢనమ్మకాలు చూస్తుంటే నాకు చిర్రెత్తుతోంది. మనిషి వివేకానికి వీళ్లు కళంకం. కానీ ఈ లోకంలో వివేకం మూఢనమ్మకంతో కలుషితం కాని చోటంటూ ఉందా?’ అని వాపోయాడు. బ్రాహ్మణులకు తన మాటగా చెప్పమని ఓల్టేర్.. మొదవ్ తో ఓసారి ఏదో చెప్పాట్ట. బ్రాహ్మణాచారాల, మంత్రతంత్రాల వివరాలను మొదావ్ ఓల్టేర్ కు పూసగుచ్చినట్టు చెప్పేవాడు. ఓల్టేర్ తాత్విక నవల ‘జేదిగ్’లో బ్రాహ్మణ ఆచారాలపై విమర్శలున్నాయి. ఈ అంచానా కింద మొదావ్ కానీ, అతని మామ కానీ, తెలుగుసీమలో పనిచేసిన మరో ఫ్రైంచి అధికారి కానీ బ్రహ్మస్వామితో  బొమ్మలు వేయించుకుని తన దేశానికి తీసుకెళ్లాడని ఖాయంగా చెప్పొచ్చు.


తను నమ్మిన దేవుళ్లతోపాటు, తన కాలం నాటి తెలుగు జనాన్ని తనకు తెలియకుండానే వైవిధ్యంగా, కొత్తపోకళ్లలో రూపుగట్టిన బ్రహ్మస్వామి బొమ్మలను పరాయి దేశం అపురూప సంపదలా పదిలంగా దాచుకుంది. ఘనమైన కళాసంస్కృతికి వారసులైన మనం మాత్రం వాటి ఛాయలను కూడా గుర్తించలేనంత గుడ్డివాళ్లమైపోయాం. అలనాటి అమరావతీనగర అపురూపశిల్పాలే కాదు, చరిత్ర పదిలం చేసిన సమీప బ్రహ్మస్వామిలాంటి కళాసంపదనూ.. ఇన్ని దౌత్యవిజయాల తర్వాత, ఇన్ని అంతర్జాతీయ ప్రభావాలను భయంకరంగా వేసిన తర్వాత కూడా తెలుసుకోలేని, తెలుసుకున్నా తిరిగి తీసుకురాలేని సుసంపన్నమైన దౌర్భాగ్యులం మనం!! 

***

No comments:

Post a Comment