Friday 18 December 2015

నా కుర్చీ







నా కుర్చీ
ఒత్తిడితో చొరబడే నా దేహపు బరువును
ప్రేమగా తెరిచిన చేతులతో
నెమ్మదిగా తనలోకి మోసుకుంటూ 
మరింతగా బరువెక్కి మురిసిపోతూ
నా కుర్చీ.. అలుపెరగని ప్రియసఖి పరిష్వంగం..
హాలైనా, పడగ్గదైనా, బాల్కనీ అయినా..
పగలైనా, రాత్రయినా ఏ వేళైనా
మా ఇద్దరిదీ సిగ్గూశరమూ లేని బహిరంగ రాసలీల
నా కుర్చీ స్వైరిణి మాత్రమే కాదు సుమీ..
అనుదిన వియోగం తర్వాత
వెయ్యి దృశ్యాదృశ్య మోతల భారంతో
బూమరాంగ్ లా ఇంట్లోకి దూసుకొచ్చే నన్ను
ఒడిలోకి లాక్కుని మెత్తగా ఓదార్చే జోజో అమ్మ కూడా..
అటకపైని పుస్తకాలు
అందని ద్రాక్షలయ్యే వేళ
ఫ్యాను గాలి అలిగిన వేళ
అందని ఎత్తులకై ఆశపడే మరెన్నో వేళల
నా కుర్చీ నన్ను వాటంగా పైకెత్తి
జర భద్రం కొడుకో అని నవ్వే నేస్తం కూడా..
అంతేకాదు సుమీ..
బంగారు సింహానాలు
బలితీసుకున్న బతుకుల తలపోతలో
నా దేహం ఉలిక్కపడే నిశీథి వేళల
తనూ తల్లడిల్లి, ఒక కాలు తొట్రుపడి
మళ్లీ వింతసవ్వడితో కుదుటపడి
నా కుర్చీ.. నా ప్రాణదీపానికి పంచ గూడు
*
విన్సెంట్ వ్యాన్గో వేసిన అతని కుర్చీ, గోగా కుర్చీలపై కవితల్లాంటివి రాశాక, నా కుర్చీ కూడా తనపై
రాయమంటేనూ..ఇక, ఈ బొమ్మా నేను వేసిందే. పెన్సిల్ తో గీసి, రంగులంటకుండా ఫొటోషాపులో ముస్తాబు చేశానన్నమాట. ఈ రంగులే ఎందుకంటే ఇష్టమన్నమాట. రంగులు కావాలంటే మార్చేసుకోవచ్చు.

No comments:

Post a Comment