Thursday, 19 February 2015

గోగా.. అందుకే నీకంత గ్లామర్!







నీలి సాగరం మధ్య పచ్చని దీవిలో కలకలం రేగింది. గుట్టమీది పురా సమాధిలోంచి వికటాట్టహాసం బద్దలైంది. సమాధిలోపలి పుర్రె తన చుట్టూ ఉన్నమెత్తటి మట్టిని తొలుచుకుంటూ విరగబడి నవ్వుతోంది. దీవి అంచులను తమకంతో ముద్దాడుతున్నకడలి హోరులో కపాల పరిహాసపు ప్రతిధ్వని. పుర్రె కదిలింది. ఎముకలగూడు లేచింది. సమాధి పగిలింది.



అస్థిపంజరం కొండ దిగింది. ఊర్లోకొచ్చింది. ఇంటర్నెట్ కఫేకు వెళ్లింది. గూగుల్ సెర్చ్ లో కెళ్లింది. కావలసిన దాన్ని క్షణంలో వెతికి పట్టుకుంది. మానిటర్ పై మెరిసిపోతున్న రంగురంగుల బొమ్మను లేని నిలువుగుడ్లేసుకుని చూసింది. కొన్ని నిమిషాల మౌనం. అస్థిపంజరం వణికింది. లేని కళ్లు చెమ్మగిల్లాయి. లేని గుండె బరువెక్కింది. అస్థిపంజరం లేని నోటితో మళ్లీ నవ్వింది. పగలబడి నవ్వింది. లేని పొట్టను పట్టుకుని విరగబడి నవ్వింది. నవ్వీనవ్వీ అలసిపోయి కుర్చీలో జారగిలబడింది. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంది. దగ్గరున్న మనుషులను పలకరించింది. ఎవరూ పలకలేదు. గిల్లింది. ఉలకలేదు. రక్కింది. కదల్లేదు. అరిచింది. వినలేదు. కపాల కనురంధ్రాలు ఎర్రబడ్డాయి. కోపమొచ్చింది. ఏడుపొచ్చింది. నవ్వొచ్చింది. పిచ్చొచ్చింది.
కాసేపటికి అస్థిపంజరం కుదుటపడింది. రెండు ఈమెయిల్ అడ్రస్ లు సృజించుకుని చాటింగ్ లో స్వీయ సంభాషణ మొదలెట్టింది.
‘‘విన్నావా గోగా? నవ్వు బతికున్నప్పుడు ఈ తాహితీ దీవిలోనే 1892లో నువ్వేసిన నువ్వెప్పుడు పెళ్లాడతావే?’ బొమ్మ 1800 కోట్ల రూపాయలకు అమ్ముడుబోయిందట!’’
విన్నాను. అందుకేగా విషయమేంటో కనుక్కుందామని గోరీ బద్దలు కొట్టుకుని మరీ వచ్చాను. ఇంతకూ ఏ మహానుభావుడు కొన్నాడో?’’
‘‘ఖతర్ రాచవంశం వాళ్లని అంటున్నారు’’
‘‘నేనూహించింది నిజమేనన్న మాట! రాజులే కొనుంటారని అనుకున్నాన్లే. అన్ని డబ్బులు రాజుల వద్దేగా ఉంటాయి !’’
‘‘పొరపాటు! ఇప్పడు కిరీటం, రాజదండం గట్రాలేని పెద్దమనుషుల వద్ద కూడా అంతకంటే ఎక్కువ డబ్బులున్నాయి’’
‘‘మరే, లోకం బాగా ముదిరిందన్నమాట! రాజులు కాని వాళ్లు అంత డబ్బెలా సంపాదిస్తారో?’’
‘‘మరీ అంత అమాయకంగా మాట్లాడకు. నువ్వు బతికున్నప్పుడు స్టాక్ ఎక్స్ఛేంచ్ బ్రోకర్ గా పనిచేశావు కదా. డబ్బులెలా పోగపడతాయో తెలీదా ఏంటి?’’
‘‘ చచ్చినా ఈ స్టాక్ ఎక్స్ఛేంచ్ గోలేనా? అదంటే రోసిపోయేగా బొమ్మలపై మనసు పారేసుకుని, పెళ్లాం, పిల్లలను విడిచిపెట్టి, యూరప్ గీరపు వదలి, సముద్రాలు దాటి ఈ దీవికొచ్చి హాయిగా బొమ్మలేసుకుందీ, ఇక్కడి వాళ్లతో కలసిపోయిందీ, ఇక్కడే కన్నుమూసిందీ!’’
‘‘కొయ్ కొయ్ కోతలు! ఇక్కడి వాళ్లతో కలసిపోడానికొచ్చావా, లేకపోతే ఇక్కడి నీ కూతురి వయసున్నకన్నెపిల్లలను ఈ పచ్చని దీవిలో, అందమైన తీరంలో రంజుగా అనుభవించడానికొచ్చావా?’’
‘‘ఛత్. మళ్లీ అవే కూతలు! నేనెవర్నీ బలవంతంగా అనుభవించలేదే, ఎవరి పెళ్లాలనూ లేపుకు రాలేదే! వాళ్ల నాకు నచ్చారు. నేనూ వాళ్లకు నచ్చాను. ఇష్టమున్నన్నాళ్లు కలిసున్నాం, ఇష్టం లేకపోతే విడిపోయాం. డబ్బులపై, కానుకలపై ఆశతో ఇష్టం లేకున్నా ఒళ్లప్పగించే నవనాగరికపు ఆడాళ్లనో, లేకపోతే కడుపు నింపుకోడానికో, పిల్లలను సాకడానికో ఒళ్లప్పగించే వేశ్యలనో అనుభవిస్తే అది పవిత్రప్రేమ అవుతుంది కాబోలు!’’
‘‘అంటే నీది శృంగారం, మిగతా వాళ్లది..’’
‘‘నేనలా అనడం లేదు. నాకు నచ్చింది నేను చేశాను. నా ఇష్టం వచ్చినట్టు బతికాను. ఆత్మవంచన చేసుకోలేదు. కృత్రిమత్వంపై కొట్లాడాను, సహజంగా బతకాను. ఉంటే తిన్నాను, లేకపోతే పస్తున్నాను. రోగాలపాలయ్యాను. క్రుశించాను. అంతేకానీ ఎక్కడా రాజీపళ్లేదు. నాకే అమ్మాయిల పిచ్చుంటే ఆ స్టాక్ ఎక్స్ఛేంచ్ లో కోట్లు సంపాదించి రోజుకో ఆడదాంతోనే గడిపేసుందును కదా. నేను చట్రాల్లో ఇమడలేదు. స్వేచ్ఛ కోసం పలవరించాను. నిష్కల్మషమైన, గాఢమైన ఆదిమప్రేమ కోసం పరితపించాను. అది స్వార్థమే. కానీ అది నా జీవితాన్ని, తనివితీరని నా మనోదేహాలను ఛిద్రం చేసుకుని సుఖించే స్వార్థం! డబ్బుదస్కం, పేరుప్రతిష్టలను కోరే స్వార్థం కాదు!’’
‘‘శభాష్. అందుకేగా నవ్వంటే ఈ పిచ్చిజనానికి అంతిష్టం! నవ్వు చచ్చి వందేళ్లు దాటినా నీ బొమ్మలకు అంత విలువ! నాటి నీ తిరుగుబాటుకు ప్రతిఫలంగా నీ బొమ్మలపై ఇప్పడు కనకవర్షమెలా కురుస్తోందో చూడు!’’
‘‘హు... బతుకున్నప్పడు తన్నితగలేశారు. చిత్రహింసలు పెట్టారు. బొమ్మలేసుకుంటానంటే పెళ్లాం నవ్వింది. తిట్టింది. కొట్లాడింది. పిల్లల్ని తీసుకుని పుట్టింటికిపోయింది. తాగుబోతువంది, తిరుగుబోతువంది. బొమ్మలు మానితేనే కాపురమంది. చివరికి దూరమైపోయింది’’
‘‘పాపం ఆవిడ తప్పేముంది? అందరి ఆడాళ్ల మాదిరే కాపురం నిలుపుకోవాలని ఆరాటపడింది’’
‘‘మరి నా ఆరాటం! నేనేం కోరాను? బొమ్మలేసుకుంటానూ అని అన్నా. అంతేకదా. మూర్ఖపు జనానికి నా బొమ్మల విలువ తెలియకపాయ. ఇప్పుడిన్నికోట్లు పోసి కొంటున్న నా బొమ్మలను ఆనాడు అమ్ముకోడానికి ఎన్ని తిప్పలు పడ్డాను? ఎందరి కాళ్లావేళ్లా పడ్డాను? బొమ్మలు అమ్ముడుపోక, డబ్బుల్లేక, కూడూ గుడ్డాలేక, కడుపు దహించుకుపోయే ఆకలితో, పీక్కుపోయిన దేహంతో, రోగాలతో మంచానికి అతుక్కుపోయి, స్నేహితులు దయదలిస్తే కాసింత రొట్టెముక్క తిని, ఘాటు యాబ్సింత్ ను కడుపులో దింపుకుని మత్తులో చిత్తుగా పడిపోయి, పిచ్చిపచ్చిగా వాగుతూ..’’
‘‘అందుకేగా నీకంత గ్లామర్! అంత గుర్తింపు ఊరకే వస్తుందా మరి!’’
’’చచ్చాక వస్తుందనవోయ్, బావుంటుంది! యథార్థవాది బతుకుంటే లోకవిరోధి. చచ్చాకే వాడికి విలువా, గౌరవమూ. సరేగానీ, ఆ ఇద్దరు ఆడంగుల బొమ్మలో ఏముందనోయ్ అంత డబ్బెట్టి కొన్నారు?’’
‘‘కాంతులీనే రంగులు, సరళ రూపాలు, నిష్కల్మషమైన ఆదిమజాతి అతివల స్వప్నాలు.. కళాచరిత్ర గతినే మార్చేసిన సౌందర్య విలువలూ గట్రా ఏమిటో ఉ..న్నా..య..ట!’’
‘‘ఉ..న్నా..య..ట! ఏంటా ఎత్తిపొడుపు మాటలు! ఏం అవన్నీఅందులో లేవా? నేనాడు వీటి గురించే కదా బుర్రబద్దలు కొట్టుకుంది. క్లుప్తత, సారళ్యం, మటుమాయల పొడలేని స్వచ్ఛవర్ణాల ఉద్విగ్ననగ్ననర్తనం.. మొత్తంగా కళ్ల తెరలపై పదికాలాలపాటు నిలిచిపోయే అపురూప కళాదృశ్యం..’’
‘‘ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాదనను. కానీ వీటితోపాటు నీ విశృంఖల జీవితం, నీ తిరుగుబాటు కూడా నీ పేరుప్రతిష్టలకు కారణం కాదంటావా?’’
‘‘మళ్లీ అదేమాటంటావు! నన్నుకాదు నా బొమ్మలను చూడు. ముదురురంగుల ముక్కవాసనల, టన్నుల భేషజాల హావభావాల, పైపైసొగసుల రోతముసుగుల పక్కన.. నా మహోగ్ర జ్వలితవర్ణాల ఆవరణల్లో మెరిసే కొండల్లో, చెట్లలో, గుడిసెల్లో, పశువుల్లో, పక్షుల్లో, పళ్లలో, రాళ్లలో, ఆదిమ దేవతా విగ్రహాల్లో, కల్లాకపటం తెలియని పరువాల్లో, ప్రణయాల్లో, ప్రసవాల్లో, మెలకువలో, నిద్రలో, తీపికలల్లో, పీడకలల్లో, మరణాల్లో, గోరీల్లో.. తారసపడే నా అజరామర కళాభివ్యక్తిని చూడు..’’
‘‘ఇవన్నీ సరే. వీటితోపాటు నీ బతుకులోనూ కావలసినంత మసాలా ఉంది కదా. అందుకే నీ బొమ్మలకన్ని డబ్బులు’’
‘‘నోర్ముయ్, మూర్ఖుడా! నీ బుర్రను ఈ తాహితీ కొండపై బండరాయితో బద్దలుకొట్టిపారేస్తా.. నీ తోలువొలిచి, దానిపై నీ నెత్తుటితో బొమ్మలేస్తా.. నీ మాంసాన్నిఈ దీవి మృత్యుదేవత ఓవిరీకి నైవేద్యం పెడతా.. నీ ఎముకలపై కొండదేవరల బొమ్మలు చెక్కి ఆడుకొమ్మని దిసమొలల పిల్లలకిస్తా..’’
‘‘అందుకేగా నీకంత గ్లామర్, నీ బొమ్మలకన్ని డబ్బులు..’’
                                                                                                                            
                                                                                                                -వికాస్


(ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడు పాల్ గోగా(Paul Gauguin 1848-1903) తాహితీ దీవిలో ఉన్నప్పుడు Nafea Faa lpoipo(When Will You Marry? పేరుతో వేసిన చిత్రాన్ని ఖతర్ రాజవంశం మొన్న రూ. 1800 కోట్లకు కొన్న విషయం తెలిసి ఒక బొమ్మకు ఇంత ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి)




No comments:

Post a Comment