పోరుపాటకు రంగులద్దిన ఆటో గ్రీబల్
‘‘ మేలుకోండి పేద ప్రజలారా
మేలుకోండి నలు దిశలా
శ్రామికులు చూపిరి మార్గం
లేచిందోయ్ విముక్తి పథం
తరతరాల కుటిలాచారం
చెయ్యాలిక పూర్తి హతం
తుడిచేయ్ జన దీనాలాపం
జీవన్-మరణమని పోరి
తుదిపోరు ఇది ఓ కామ్రేడ్స్
కలవండోయ్ ఏకంగా
ఇంటర్నేషనల్
ఒకటౌదాం - మానవులం
కలవండోయ్ ఏకంగా
ఇంటర్నేషనల్
ఒకటౌదాం – మానవులం’’
కవాతు
పాటలా సాగే అంతర్జాతీయ శ్రామిక గేయం.. అన్ని భాషల్లో ఒకే బాణీతో ఒకే ఊపుతో పోటెత్తే
ఆ రణన్నినాదానికి ఒక రూపమిస్తే ఎలా ఉంటుంది? దోపిడీపీడనలను తుదముట్టించేందుకు
నలుమూలల నుంచి నడుం కట్టి, భుజం కలిపి, కదం తొక్కుతున్న నానాదేశాల, నానా జాతుల శ్రమజీవులు
శత్రువుల గుండెలు పగిలేలా కంఠనాళాలు తెంచుకుని పాడే ఆ పాట కళ్లముందు రంగురేఖల్లో
కదలాడితే ఎలా ఉంటుంది? అచ్చం ఆటో గ్రీబల్ బొమ్మకట్టిన ‘ఇంటర్నేషనల్’లా తప్ప మరోలా
ఉండదు.
ఇంటర్నేషనల్
పాట స్ఫూర్తితో జర్మన్ చిత్రకారుడు గ్రీబల్ 1928, 30 మధ్య అదే పేరుతో
తైలవర్ణచిత్రాన్ని వేశాడు. కొలతలు దాదాపు 130 సెంమీ x 190 సెంటీమీటర్లు. బెర్లిన్ లోని
డ్యూషే జీసిస్త్ మ్యూజియంలో ఉంది. ఫ్రెంచివిప్లవకారుడు ఈజిన్ పాటియర్ 1871లో
ఫ్రెంచి కమ్యూన్ కాలంలో రాసిన ఈ మంటల పాటను స్త్రీలు, పురుషులు, యువతీయువకులు, వృద్ధులు, నల్లవాళ్లు, తెల్లవాళ్లు..
నానాజాతుల శ్రామికులనేకమంది పాడుతున్నట్లు చిత్రించాడు గ్రీబల్. చిత్రంలోని జనం
నిల్చున్నట్లు కనిపిస్తున్నా వాళ్లందరూ కెరటంలా లేచిన విముక్తి పథంలో కవాతులా
సాగుతున్నట్లూ గోచరిస్తుంది. అందరి కళ్లలో దైన్యపు తడిమధ్యనే జీవన్మరణపు తుదిపోరులో
అమీతుమీ తేల్చుకోవాలన్న సంకల్పమూ ఉంది. గ్రీబల్ కు వాళ్ల ఈతిబాధలు, ఆశలు,
ఆకాంక్షలు బాగా తెలుసు కనుకే మహాసంగ్రామానికి కదులుతున్న ఆ శ్రామిక జనావళిని అంత
శక్తిమంతంగా పొడగట్టాడు. వాళ్లకు సంఘీభావంగా చిత్రంలో తననూ రూపుగట్టుకున్నాడు.
చిత్రంలో కుడి నుంచి రెండో మనిషి అతడే. నీలికోటు తొడుక్కున్న గ్రీబల్ తనపక్కనున్న
గని కార్మికుడి భుజంపై నీవెంటే నేనూ అన్నట్టు చెయ్యేశాడు.
జర్మన్ నవ్యవాస్తవికతా కళకు గొప్ప దోహదం
చేసిన గ్రీబల్ 1895లో శాక్సనీలోని మీరాన్ లో పుట్టాడు. తండ్రి బ్రూనో ఇళ్లకు వాల్
పేపర్లు అంటించడంలో నిష్ణాతుడు. గ్రీబల్ స్కూలు చదువయ్యాక గ్లాస్ పెయింటింగ్ లో శిక్షణ
పొందాడు. డ్రెస్డెన్ వెళ్లి పెయింటింగ్ లో
మెలకువలు నేర్చుకున్నాడు. లోకపు దుర్మార్గాలను వాంతికొచ్చేలానే కాకుండా, రక్తం
మరిగేలానూ చూపిన ఎక్స్ ప్రెషనిస్ట్ చిత్రకారులు మ్యాక్స్ బెక్ మాన్, ఆటో డిక్స్
లతో పరిచయమైంది. బూర్జువా భావాలపై రోత పుట్టింది. కార్మికవర్గ రాజకీయాలు
ఒంటబట్టాయి. 1915లో మొదటి ప్రపంచ యుద్ధంలో వలంటీర్ గా చేరాడు. యుద్ధంలో తీవ్రంగా
గాయపడ్డంతో ఇంటికి పంపారు. తిరిగి కళాసాధన చేశాడు. తొలినాళ్లలో క్యూబిజం, డాడాయిజాలపై
మనసు పారేసుకున్నా తేరుకుని రియలిజంపై మళ్లాడు. కాల్పనిక ఎక్స్ ప్రెషనిజం వద్దని
శక్తిమంతమైన, ప్రత్యక్ష కార్యాచరణకు ఉసిగొల్పే న్యూ ఆబ్జెక్టివిజంలోకి
ప్రవేశించాడు. గని కార్మికులను, ఓడ బాలయిర్లలో బొగ్గేసేవాళ్లను, హమాలీలను.. సమస్త వృత్తుల కార్మికులను విరివిగా చిత్రించాడు.
రెచ్చగొట్టే వేశ్యలను, మనసు కరిగించే బిచ్చగాళ్లనూ వేశాడు. వీమార్ రిపబ్లిక్ ప్రవచించిన నవ్యకళావాదాలను
తలదాల్చి బూర్జువాలను, వాళ్ల విలాసాలను బొమ్మల్లో భయంకరంగా ఎండగట్టాడు. 1919లో
జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ(కేడీపీ)లో చేరి కార్మిక సంఘాలకు పోస్టర్లు, పత్రికలకు
బొమ్మలు వేశాడు. యంగ్ రీన్ లాండ్, డ్రెస్డెన్ సెషెషన్, నవంబర్, రెడ్ వంటి అనేక
విప్లవ కళాకారుల సంఘాల స్థాపనలో పాలుపంచుకున్నాడు. వేరే వాళ్లు స్థాపించినవాటిలో
సభ్యుడిగా చేరాడు. 1924లో మాస్కోలో జరిగిన
అంతర్జాతీయ కార్మిక ప్రదర్శనలో చిత్రాలు ప్రదర్శించాడు.
అవి
హిట్లర్ కు కోరలు మొలుస్తున్న రోజులు. గ్రీబల్ సైన్యాన్ని విమర్శించాడని పోలీసులు
విచారణ జరిపారు. నాజీల వేధింపులు పెరిగాయి. బలవంతంగా సైన్యంలో చేర్చారు. 1933లో
గెస్టపో(నాజీల రహస్య పోలీసు విభాగం) పోలీసులు గ్రీబల్ ఇంటిని సోదా చేసి, అతన్నిఅరెస్ట్
చేశారు. చాలా బొమ్మలను జప్తు చేశారు. మ్యూజియాల్లోంచి అతని బొమ్మలను తీసేశారు. వాటిని
‘క్షీణకళ’ ప్రదర్శనలో పెట్టి గేలిచేశారు. చివరకు కళాకారుల నిరసనతో అతన్నివదిలేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో గ్రీబల్ ను మళ్లీ సైన్యంలోకి బలవంతంగా తీసుకుని పోలండ్
పంపారు. గ్రీబల్ తార్నో కాన్ సంట్రేషన్ క్యాంపు నుంచి ఇరవై మంది యూదులను మిత్రులతో
కలసి తప్పించాడు. తనూ సైన్యం నుంచి పారిపోయాడు. 1944, 45లో అక్షరాజ్యాలు
డ్రెస్డెన్ పై విమానాల నుంచి జరిపిన బాంబు దాడుల్లో గ్రీబల్ ఇల్లు నేలమట్టమైంది.
బొమ్మలు నాశనమయ్యాయి. ఆ బాధలో ‘తగలబడుతున్న
డ్రెస్డెన్’ పేరుతో పది బొమ్మలు వేశాడు. గ్రీబల్ వేసిన ఇంటర్నేషనల్ చిత్రం పోలీసు
దాడుల్లో కనిపించకుండాపోయింది. 1945లో యుద్ధానంతరం పోలండ్ లో తేలి తిరిగి అతని
చెంతకు చేరింది. హిట్లర్ ఓడిపోయాడు. గ్రీబల్ జర్మనీలోని సోవియట్ మిలటరీ విభాగంలో పనిచేశాడు. డ్రెస్డెన్ ఆర్ట్ స్కూళ్లలో పాఠాలు చెప్పాడు.
ఎర్ర కళాకారుల సంఘాల్లో పనిచేశాడు. 1972 మార్చి 7న డ్రెస్డెన్ లోనే కన్నుమూశాడు. అతని
జీవితానుభవాలు ‘నేను వీధి మనిషిని’ పేరుతో వచ్చిన పుస్తకంలో ఉన్నాయి.
గ్రీబల్
వాస్తవికతకు తీవ్రత జోడించాడు. సామ్యవాద వాస్తవికతా కళకు కొత్తమెరుగులు దిద్దాడు.
మూసల్లో ఒదగకుండా ప్రయోగాలు చేశాడు. అతని కార్మికులు మడతలు పడ్డ బలమైన ముఖాలతో
తీవ్రంగా చూస్తుంటారు. వాళ్లకు తలకిందుల వ్యవస్థపై మహా నిరసన, అసహనం. తిరగబడేందుకు
సిద్ధంగా ఉంటారు. దైన్యంతో అంతర్ముఖులుగా కనిపిస్తున్నాతరతరాల కుటిలాచార లోకపు పునాదులనే
పెకళించే మహాశక్తి వాళ్లలోపల సుడులు తిరుగుతూ ఉంటుంది. అతని బలిష్టమైన ‘ఓడ
కార్మికుడు’ కదిలిస్తే చాలు కొట్టేలా ఉంటాడు. ‘పాటగాడు’ బావురుమనే కాంక్రీటు అరణ్యంలో
క్షతగాత్ర గీతాన్ని ఆలపిస్తుంటాడు.
గ్రీబల్ నిబద్ధ కళాకారుడు. జీవితాంతం ప్రజా
ఉద్యమాల వెంట నడిచాడు. జనదీనాలాపాలు లేని, మానవులంతా ఒకటయ్యే లోకం కోసం త్యాగాల
నెత్తుటిదారిలో సాగే పోరువీరుల పాటకు రంగులద్ది అరుణారుణ స్మృతిచిత్రంలా నిలిచిపోయాడు.
పి.మోహన్
No comments:
Post a Comment