Thursday, 12 February 2015

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు



రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం
రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం
చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు పక్కన మౌనంగా నుంచుని అందమైన తేడాలు తప్ప అన్ని తేడాలూ సమసిపోవాలని కోరడం మినహా మరేమీ చెయ్యలేం. అందమైన తేడాలు నిజంగానే అంత బావుంటాయా?
రాజా రాజవర్మ.. అవును రాజా రాజవర్మనే! రాజా రవివర్మ కాదు. రవివర్మ తమ్ముడు. అన్న అనే చిక్కని నీడ కింద పూర్తిగా వికసించకుండానే నేలరాలిన మొగ్గ. అన్నను జీవితాంతం అంటిపెట్టుకుని అతని కంటికి రెప్పలా, చేతికి ఊతకర్రలా బతికిన మనిషి. సోదరుడు పురుడుపోసిన హిందూ దేవతలకు బట్టలు సర్దిన మొనగాడు. అన్న బొమ్మకట్టిన నానా రాజుల, తెల్లదొరల ముఖాల వెనక కంటికింపైన తెరలను వేలాడదీసిన సేవకుడు. రవికి బంటురీతిగా మెలగి, అతని వెంట ఆసేతుహిమాచలం తిరిగి, ఏవేవో పిచ్చికలలు కని, అవి తీరకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయిన ఒక మసక రంగుల జ్ఞాపకం.
మనకు రవివర్మ గురించి తెలుసు. జనం అతని దేవతల బొమ్మలను పటాలు కట్టుకుని పూజించడమూ తెలుసు. అతని నున్నటి వక్షస్థలాల మలబారు, నాయరు అందగత్తెల చూపులకు మన చూపులు చిక్కుకోవడమూ తెలుసు. అతని చిత్రాలు యూరోపియన్ కళకు నాసిరకం నకళ్లని, వాటిలో కవిత్వం, సహజత్వం లేదని, అతనిదంతా క్యాలండర్ ఆర్ట్ అని.. కారణంగానో, అకారణంగానో చెలరేగే విమర్శకుల గురించీ కొంత తెలుసు. ఆ తెలిసిన దాంట్లోంచి అరకొరగా, అస్పష్టంగా కనిపించే అతని తమ్ముడి కథేంటో తెలుసుకుందాం.
ఇద్దరు వర్మలు
ఇద్దరు వర్మలు

బాంబే స్టూడియోలో అన్నదమ్ములు 

రాజవర్మ రవివర్మకంటే పన్నెండేళ్లు చిన్న. 1860 మార్చి 3న కిలిమనూర్ ప్యాలెస్ లో పుట్టాడు. నాటి త్రివేండ్రమైన నేటి తిరువనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కిలిమనూర్. తండ్రి ఎళుమావిల్ నీలకంఠన్ భట్టాద్రిపాద్. బ్రాహ్మణుడు, సంస్కృతంలో పండితుడు. తల్లి ఉమా అంబాబాయి క్షత్రియ. కవయిత్రి, గాయని. వీరికి నలుగురు పిల్లలు, రవివర్మ, గొడవర్మ, రాజవర్మ, మంగళాబాయి. మాతృస్వామ్య వ్యవస్థ కనుక ఉమ పుట్టింట్లోనే ఉండేది. ఆమె సోదరుడి పేరు కూడా రాజా రాజవర్మే. చిత్రకారుడు. ఇంట్లో కథాకళి నాట్యాలు, సంస్కృత నాటకాలు, కచేరీలు సాగేవి. రవివర్మ మేనమామ వద్ద తొలి కళాపాఠాలు నేర్చుకుని పద్నాలుగేళ్లప్పుడు త్రివేండ్రానికెళ్లాడు. రాజాస్థాన చిత్రకారుల వద్ద, అతిథులుగా వచ్చిన పాశ్చాత్య చిత్రకారుల వద్ద నానా తంటాలుపడి తైలవర్ణ చిత్రాలు నేర్చుకున్నాడు. రవివర్మ పెద్ద తమ్ముడు గొడవర్మ సంగీతంలో దిట్ట. చెల్లెలు కూడా బొమ్మలు వేసేది. చిన్నతమ్ముడు రాజవర్మ త్రివేండ్రమ్ లో ఇంగ్లిష్ చదువులు చదువుకున్నాడు. షేక్ స్పియర్, ఆలివర్ గోల్డ్ స్మిత్, బాల్జాక్ రచనలంటే ఇష్టం.
రవివర్మ పేరు దేశమంతటా మారుమోగింది. దేశంలో ఇన్నాళ్లకు పాశ్చాత్యులకు సరితూగే కళాకారుడు పుట్టాడని దేశీ కళాపిసాసులు ముచ్చటపడ్డారు. బొమ్మలు వేయించుకోవడానికి రాజులు, తెల్లదొరలు బారులు తీరారు. చేతినిండా పని. లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్తరాలు నడపడానికి మనిషి కావాలి. ఇంగ్లిష్, దొరల మర్యాదలూ గట్రా తెలిసినవాడు కావాలి. తమ్ముడు నేనున్నానని ముందుకొచ్చాడు. సెక్రటరీ మొదలుకొని నౌకరీ వరకు అన్ని పనులూ చేసిపెడతానన్నాడు. అన్న తమ్ముడికి బొమ్మలు నేర్పాడు.
చిత్రాయణంలో రామలక్ష్మణుల ప్రస్థానం మొదలైంది. రవివర్మ బరోడా రాజు కోసం వేసిన నలదమయంతి, శంతనమత్స్యగంధి, రాధామాధవులు, సుభద్రార్జునులు వంటి పౌరాణిక చిత్రాల రచనలో రాజవర్మ ఓ చెయ్యేశాడు. చెల్లెలు మంగళాబాయి కూడా రంగులు అద్దింది. నైపుణ్యం పెద్దగా అక్కర్లేని బట్టలు, ఆకాశం, నేల, బండలు, ఆకులు, చెట్ల కాండాలు వగైరా వెయ్యడం వాళ్లపని. అన్నకు తీరికలేకుంటే దేవతల ముఖాలపైనా, చేతులపైనా చెయ్యిచేసుకునేవాళ్లు. అన్న వాటిని సరిదిద్దేవాడు. అంతా కుటీరపరిశ్రమ వ్యవహారం.
రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు
రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు
పచ్చని కేరళ సీమలోకి తొలుచుకొచ్చిన సముద్రపు కాలవల్లో చల్లని వెన్నెల రాత్రి పడవ ప్రయాణాల్లో అన్నదమ్ములు భారత భాగవత రామాయణాలు చెప్పుకున్నారు. ఏ దేవతను ఏ రూపలావణ్యాలతో కేన్వాసుపైకి తీసుకురావాలో ముచ్చటించుకున్నారు. బొమ్మలు వెయ్యడానికి దేశమంతా తిరిగారు. మద్రాస్, మైసూర్, బాంబే, బరోడా, ఉదయ్ పూర్, ఢిల్లీ, లక్నో, కాశీ, ప్రయాగ, కోల్ కతా, కటక్, హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, విజయవాడ.. అన్నదమ్ములు కాలూనని పెద్ద ఊరుకానీ, స్నానమాడని నది కానీ లేకుండా పోయింది. కొన్ని బొమ్మలను కలసి వేసేవాళ్లు. వాటిపై ఇద్దరూ సంతకాలు చేసేవాళ్లు. కలసి నాటకాలకు, గానాబజానాలకు వెళ్లేవాళ్లు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రికల్లో న్యాపతి సుబ్బారావు పంతులు వంటి కాంగ్రెస్ నేతల రాతలు చదువుతూ దేశ స్థితిగతులు చర్చించుకునేవాళ్లు. బాంబే రెండో ఇల్లయింది. దాదాభాయ్ నౌరోజీ, తిలక్, రనడే, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మహామహులతో కలసి తిరిగేవాళ్లు. కోల్ కతా వెళ్లినప్పుడు టాగూర్ల జొరసొంకో భవంతిలో బసచేశారు. అబనీంద్రనాథ్ టాగూరు బొమ్మలు రవికి నచ్చాయి.
అన్నకు పౌరాణిక గాథలపై మక్కువ. తమ్ముడు ప్రకృతి ఆరాధకుడు. దాని పరిష్వంగంలో పులకరింతలు పోయాడు. ప్రకృతి(ల్యాండ్ స్కేప్) చిత్రాలు భారతీయ కళలో అంతర్భాగం. మొగల్, కాంగ్రా, బశోలీ, రాజ్ పుత్ వగైరా కళాసంప్రదాయాలన్నింటా చెట్టుచేమలు నిండుగా ఉంటాయి. రాజవర్మకు అవి నచ్చలేదు. తనపై పాశ్చాత్య కళాప్రభావం ఉంది కనుక తన దేశ ప్రకృతిని పాశ్చాత్య కళాకారుల్లాగే ఆవిష్కరించాడు. ఆంగ్లేయ ప్రకృతి చిత్రకార దిగ్గజాలు టర్నర్, కాన్ స్టేబుల్ లపై వచ్చిన పుస్తకాలను చదివాడు. రాజవర్మ ప్రకృతి ప్రేమ, కవితా హృదయం అతని డైరీల్లోని ప్రకృతి వర్ణనల్లో గోచరిస్తుంది. రవివర్మ రాజమందిరాల్లో రాచగణాన్ని చిత్రించే వేళ తమ్ముడు చెట్టుచేమా, చెరువులూ కాలవలూ పట్టుకుని తిరిగేవాడు.
పల్లెపడుచు
పల్లెపడుచు
స్టూడియోకు తిరిగొచ్చి వాటిని చిత్రికపట్టేవాడు. ఒడ్డున కొబ్బరి చెట్లతో, లోపల గూటిపడవతో, నారింజరంగు నింగి వెలుతురు ప్రతిఫలించే పరవూర్ సరస్సును, ఆకుపచ్చ నీటి కాలవలను, చెరువుగట్లను ఇండియన్ ఇంప్రెషనిస్ట్ మాదిరి పొడగట్టాడు. ఒంటిపై తడిచిన తెల్లచీర తప్పమరేమీ లేని యువతిని తొలిసంజెలో నెత్తిపై నీళ్లబిందెతో ఓ చిత్రంలో చూపాడు. ‘పంటకోతలు’ చిత్రంలో..
పంటకోతలు
పంటకోతలు
గోచితప్ప మరేమీ లేని మలబారు నల్లలేత పరువాన్ని ఆవిష్కరించాడు. పసుపురంగుకు తిరిగిన పొలం, ఆకాశం, బూడిదాకుపచ్చలు కలసిన కొబ్బరి తోటల నేపథ్యంలో ఆమె చేరో చేత్తో గడ్డిమోపులు పట్టుకుంది. ఫ్రెంచి రొమాంటిస్ట్, రియలిస్ట్ చిత్రకారులు మిలే, లెపెజ్, జూల్ బ్రెతా వంటివాళ్లు వేసిన ఆడరైతుల బొమ్మలకు ఏమాత్రం తీసిపోదీ కేరళకుట్టి. ‘నాటుసారా కొట్టు’ లో సారాకుండ, సీసాల మధ్య స్టూలుపై వయ్యారంగా కూర్చుని బేరం కోసం ఎదురుచూస్తున్న మలయాళీ బిగువు మగువను పరిచయం చేశాడు. అన్న వేసిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ లోంచి కోడిపుంజును అరువుకు తెచ్చుకుని ఆ కొట్టు ముందుంచాడు.
రవివర్మ, రాజవర్మలు సమకాలీన యూరోపియన్ అకడమిక్ కళను చాలా దూరం నుంచే అయినా జాగ్రత్తగా గమనించేవాళ్లు. ‘ది ఆర్టిస్ట్’ పత్రిక తెప్పించుకుని చదివేవాళ్లు. రవివర్మ మూర్తిని రాజవర్మ, రాజవర్మ మూర్తిని రవివర్మ చిత్రించేవాళ్లు. ఆప్త బంధువును కోల్పోయిన దుఃఖపురోజుల్లో నెరిసిన గడ్డంతో ఉన్న అన్నను తమ్ముడు ఓ చిత్రంలో చూపాడు. తమ్ముడు కళ్లద్దాలు పెట్టుకుని కిరోసిన్ దీపకాంతిలో దీక్షగా చదువుకుంటున్నట్లు వేశాడు అన్న.
సారా కొట్టు
సారా కొట్టు
మనదేశంలో ఆడవాళ్లు మోడళ్లుగా ముందుకు రావడం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. అయితే వాళ్లు బట్టలు విప్పడానికి ససేమిరా అనేవాళ్లు. దీంతో అన్నదమ్ములు బ్రిటన్, జర్మనీల నుంచి నగ్నమహిళల ఫొటోలు తెప్పించుకుని వాటితో కుస్తీపడేవాళ్లు. వాళ్ల దేహాలకు చీరలు, రవికలు తగిలించి భారతీయీకరించేవాళ్లు. అందుకే రవివర్మ అందగత్తెలు యూరప్ ఆడాళ్లకు బొట్టుపెట్టి, చీరలు చుట్టినట్లుంటాయనే విమర్శలు ఉన్నాయి. రాజవర్మ 1895 నుంచి 1904 వరకు రాసుకున్న డైరీల్లో అతని జీవితమే కాకుండా రవివర్మ చివరి పదేళ్ల జీవితమూ బొమ్మకట్టినట్లు కనబడుతుంది. అవి ఒకరకంగా రవివర్మ డైరీలు కూడా. రవివర్మకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మిరుమిట్లు గొలిపే అతని కళతోపాటు, రాజవర్మ చేసిపెట్టిన ప్రచారం కూడా సాయపడింది. బొమ్మలు అడిగిన వాళ్లకు అన్న బొమ్మలు ఎంత గొప్పగా ఉంటాయో ఉత్తరాలు రాసేవాడు తమ్ముడు. ఏ సైజుకు బొమ్మకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పడం, వేసిన వాటిని భద్రంగా పార్సిల్ చేసి పంపడం, వచ్చిన డబ్బును బ్యాంకులో వెయ్యడం, రాని బాకీలను వసూలు చెయ్యడం వరకు అన్ని పనులూ పకడ్బందీగా చక్కబెట్టేవాడు. దేశవిదేశాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ల సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుని అన్నవేసిన చిత్రాలను పంపేవాడు.
రవివర్మ తన పెయింటింగులను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి తపనపడ్డాడు. తన పేరుతో బాంబేలో మిత్రుల భాగస్వామ్యంతో కలర్ లితోగ్రాఫ్ ప్రెస్సును స్థాపించాడు. లావాదేవీలను తమ్ముడికే అప్పగించాడు. భాగస్వామి మోసగించాడు. అన్నదమ్ములు అప్పులపాలయ్యారు. తీర్చడానికి తంటాలు పడ్డారు.
రవివర్మ, రాజవర్మలకు ఆంధ్రదేశంతో తీపి, చేదు అనుభవాలున్నాయి. ఇద్దరూ హైదరాబాద్, కురుపాం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖల్లో బసచేశారు. రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ రైల్వే స్టేషన్ల గుండానే ముంబైకి వెళ్లేవాళ్లు. తాడిపత్రి, రేణిగుంటల్లో కలరా పరీక్షలు చేయించుకున్నామని రాజవర్మ ఓ చోట రాసుకున్నాడు. కురుపాం రాజా వారి ఇంట్లో వడ్డించిన తెలుగు వంటకాలు తమిళ, మలయాళ వంటలకు భిన్నంగా ఉన్నా రుచిగానే ఉన్నాయని రాసుకున్నాడు.
ప్రెస్సుతో ఆర్థికంగా దెబ్బతిన్న అన్నదమ్ములు 1902 తొలి మాసాల్లో హైదరాబాద్ లో బసచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ వంటి మిత్రుల మాటలపై భరోసా పెట్టుకున్నారు. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ తమతో బొమ్మలు వేయించుకుంటాడన్నఆశతో చాన్నాళ్లు పడిగాపులు కాశారు. దేశమంతా గౌరవించిన రవివర్మకు నిజాం మాత్రం ముఖం చాటేశాడు. అధికారులు రేపోమాపో అంటూ తిప్పారు. అన్నదమ్ములు తొలుత సికింద్రాబాద్ లోని దీన్ దయాళ్ ఇంట్లో బసచేశారు. పొరపొచ్చాలు రావడంతో చాదర్ ఘాట్ లో ఇల్లు అద్దెకు తీసుకుని బొమ్మలు మొదలుపెట్టారు. వ్యాహ్యాళికి హుసేన్ సాగర్ తీరానికి వెళ్లేవాళ్లు. చార్మినార్, చౌమొహల్లా, ఫలక్ నుమా ప్యాలెస్ లను, మీరాలం చెరువును చూశారు. ఆడ మోడళ్ల కోసం వాకబు చేశాడు రాజవర్మ. కొంతమంది వేశ్యలు వస్తామన్నారు కానీ మాట తప్పారు. చివరకు ఓ ముస్లిం యువతి ఒప్పుకుందట.
రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్
రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్
రాజవర్మ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హుసేన్ సాగర్ చిత్రాన్నివేశాడు. ఆ చెరువు నీళ్లు వందేళ్ల కిందట ఎంత తేటగా, నీలంగా ఉండేవో ఈ చిత్రం చూపుతుంది. కుడివైపు చెట్ల మధ్య మసీదు గుమ్మటం ఉంది. చెరువు ఒడ్డున గడ్డిలో పశువులు మేస్తున్నాయి. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. చెరువులో పడవలున్నాయి. నేటి కళాప్రమాణాలకు ఇది నిలవకపోవచ్చు కానీ 1903లో మద్రాస్ లో జరిగిన పోటీలో దీనికి బంగారు పతకం వచ్చింది.
రాజవర్మపై పరోక్షంగా నాటి జాతి పునరుజ్జీవనోద్యమ ప్రభావం ఉంది. పరాయి పాలనలో రవివర్మ హిందూదేవతల బొమ్మలను చిత్రించడం, వాటి నకళ్లను వేలకొద్దీ అచ్చుగుద్ది జనంలోకి తీసుకెళ్లడం ఆ ఉద్యమం సామాజిక ఉపరితలాంశంపై వేసిన ప్రభావ ఫలితమే. రాజవర్మకు కపటత్వం నచ్చదు. మూఢాచారాలు గిట్టవు. బాంబేలో బహుశా ఏదో లావాదేవీలో మోసపోయిన సందర్భంలో 1901 ఆగస్ట్ 1న డైరీలో ఇలా రాసుకున్నాడు, ‘ the markets are all great liars and try to take advantage of the ignorance of the strangers.’ నిజాం బొమ్మను కొంటానని చెప్పి, ఆ తర్వాత బేరం తగ్గించిన ఓ హైదరాబాదీపై కోపంతో 1902 జూన్ 8న.. ‘the majority of the Hyderabad nobles and officials are notorious for their dishonesty, want of truthfulness and immoral character‘ అని తిడుతూ రాసుకున్నాడు. జోస్యాలపై నమ్మకం లేదంటూ.. ’I have myself no belief in palmistry, fortune telling etc., for it is my firm conviction that God has not given men the power to pierce into the mystics of the dark future, for the consequences of possessing such a power would be disastrous to the continuance of the world’ అని 1903 అక్టోబర్ 14న రాసుకున్నాడు.
రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం
రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం
రాజవర్మ క్షత్రియ నాయర్ పెళ్లిచేసుకున్నాడు. పేరు జానకి. పిల్లలు కలగలేదు. బొమ్మలెయ్యడానికి దేశాలు పట్టుకుని తిరగడం వల్ల భార్యను సరిగ్గా చూసుకోలేకపోయాడు. రవి కూడా అంతే. మాతృస్వామ్యంలో, అందునా దేశదిమ్మర చిత్రకారులు కావడంతో భార్యలకు చుట్టాల్లా మారిపోయారు. భార్యను సరిగ్గా చూసుకోలేకపోయానని రాజవర్మ అంత్యకాలంలో అన్న కొడుకు రామవర్మతో వాపోయాడట. రాజవర్మ 1904 చివర్లో మైసూర్ రాజు కోసం బొమ్మలేసే పనిలో బెంగళూరులో ఉన్నప్పుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. పరిస్థితి విషమించడంతో మద్రాసుకు తీసుకొచ్చారు. పేగుల్లో అల్సర్. ఆపరేషన్ చేసిన కొన్నరోజులకే 1905 జనవరి 4న 45 ఏళ్ల ప్రాయంతో కన్నుమూశాడు. అప్పడు జానకికి ముప్పైమూడేళ్లు. ఆమె చెల్లెలు భగీరథి ప్రసిద్ధ మలయాళ నవలా రచయిత సీవీ రామన్ పిళ్లై భార్య. భగీరథి అంతకు కొన్నేళ్లముందు ఆరుగురు పిల్లలను అమ్మలేని వాళ్లను చేసి వెళ్లిపోయింది. రామన్ ను పెళ్లాడింది జానకి. అతని నవలలకు ఆమె స్ఫూర్తినిచ్చిందంటారు. ఆమె 1933లో కన్నుమూసింది.
రాజా రాజవర్మ
రాజా రాజవర్మ
గాయకుడికి గాత్రసహకారంలా పాతికేళ్లు తన కుంచెకు వర్ణదోహదం అందించి తన కళ్లముందే సెలవంటూ వెళ్లపోయిన తోడబుట్టినవాడి మరణంతో రవివర్మ కుదేలయ్యాడు. పైగా మధుమేహం, మతిమరపు, ప్రేలాపనలు. అప్పటికే రవి భార్య చనిపోయి చాలా ఏళ్లయింది. పెద్ద కొడుకు కేరళవర్మ దురలవాట్లకు లోనయ్యాడు. రవి 1906 అక్టోబర్ 29న తను పుట్టిన కిలిమనూర్ ప్యాలెస్ లోనే ఆఖరి శ్వాస తీశాడు.
ఆ అన్నదమ్ములను బతికి ఉన్నప్పుడూ, పోయిన తర్వాతా ఎందరో ఆడిపోసుకున్నారు. అయితే వాళ్లిచ్చిపోయిన బొమ్మలను జనం ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. తలనిండ పూదండ దాల్చే రవివర్మ అందగత్తె వలువల మడతల్లోనో, అతని సరస్వతి, సీత, శకుంతల, దమయంతులు కూర్చున్న రమణీయ వనాల్లోనో, ఆ వనాల దాపు కొలనుల్లోనో, కొలనులపైని కాంతిగగనంలోనో రాజవర్మ కుంచెపూతలు సంతకాల్లేకుండా తారసపడుతూ ఉంటాయి. ఆ అన్నచాటు తమ్ముడి ప్రకృతి లాలసను, అతనికి అందిన అందాలను లీలగా గుర్తుచేస్తూ ఉంటాయి.
రవివర్మ కుంచెలోంచి జాలువారిన శకుంతల

-పి.మోహన్
FEBRUARY 5, 2015  సారంగ వెబ్ పత్రికలో ప్రచురితం

No comments:

Post a Comment