Thursday, 16 July 2015

కళాయోధుడికి వందేళ్లు


చిత్తప్రసాద్ కు జాతకాలపై నమ్మకం లేదు. తను బతికి ఉండగా పట్టని అదృష్టం చచ్చాక పడుతుందన్న భ్రమ అసలే లేదు. దున్నపోతులు పాలించే ఈ దేశం తన పిచ్చి బొమ్మలను గుర్తించుకుని, తన వందేళ్ల బర్త్ డే జరుపుకుని, నివాళి అర్పిస్తుందన్న వెర్రి ఆశ అసలే లేదు. అయినా చిత్తప్రసాద్ ఇప్పుడు ఎవడిక్కావాలి? మదరిండియాను ‘మేకిన్ ఇండియా’ కంతల గుడిసెలో ఎఫ్డీఐల కాషాయ పడకపై అంకుల్ శామ్, చైనా డ్రాగన్, యూరప్ గద్దలకు ఏకకాలంలో తార్చేస్తున్న స్వదేశీ జాగరణ మహావానరాలకు ఆ ఆ కల్తీలేని ఎర్ర దేశభక్తుడి పుట్టిన రోజుతో ఏం పని? కళ్లే కాదు సర్వాంగాలూ లొట్ట పోయిన గోతికాడి నకిలీ ఎర్రమనుషులకు ఆ ఒకనాటి తమ సహచరుడి సమరస్వప్నాలు ఏ జూదానికి పనికొస్తాయి? నిమిషానికి కాదు క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లులు అతగాడి బ్లాక్ అండ్ వైట్ నిప్పుల జెండాలను ఏం చేసుకుంటాయి?
కానీ, చిత్తప్రసాద్ మహామోహంతో, నరనరానా ప్రేమించిన ఈ లోకంలో దున్నపోతులు, మహావానరాలు, నక్కలు, ఊసరవెల్లులే కాదు.. మనుషులు కూడా ఉన్నారు. అతని మాదిరే సాటి మనిషి కష్టానికి కన్నీరుమున్నీరయ్యేవాళ్లు, కళ మార్కెట్ కోసం కాదని, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకని నమ్మేవాళ్లు, నమ్మకం కోసం నునువెచ్చని నెత్తుటిని ధారపోస్తున్నవాళ్లూ ఉన్నారు. చిత్తప్రసాద్ వాళ్లకు అవసరం! చెప్పలేనంత అవసరం. శత్రువు గుండెను గెరిల్లా బాంబులా పేల్చే అతని బొమ్మలు వాళ్లకు కావాలి. కలలను, కన్నీళ్లను, అక్కసును, ఆక్రోశాన్ని, కసిని, క్రోధాన్ని మహోగ్రంగా వెళ్లగక్కే ఆ నిప్పుకణికలు వాళ్లకు కావాలి. వాటి కథలూ, గాథలూ వాళ్లకు కావాలి. చిత్తను తెలుసుకోవడమంటే మన గుండెతడిని మనం పరీక్షించుకోవడం. మన భయాన్ని, పిరికితనాన్ని, నంగితనాన్ని వదలించుకుని మన పిడికిళ్లను మరింతగా బిగించడం. వందేళ్ల చిత్త బతుకు చిత్రాల గ్యాలరీని నేటి మన చివికిన బతుకు కళ్లతో చూద్దాం రండి!
1 (3)
చిత్త ఆధునిక భారతీయ కళాసరోవరంలో పూచిన ఒకే ఒక ఎర్రకలువ. దాని రేకులు ఎంత మెత్తనో అంత పదును. ఒక్కో రేకుది ఒక్కో పరిమళం. ఒకటి బొమ్మలు వేస్తుంది, ఒకటి పాడుతుంది. ఒకటి కవితలు, కథలు రాస్తుంది. అది జనం పువ్వు. కష్టజీవుల కళల పంట. అది వాళ్లు నవ్వితే నవ్వుతుంది, దుఃఖపడితే కలతపడుతుంది. ఆగ్రహిస్తే కత్తుల పువ్వయిపోయి వాళ్ల చేతుల్లో ఆయుధంలా మారిపోతుంది. అందుకే బడాబాబులకు అదంటే గుండెదడ. బడుగుజీవులకు గోర్వెచ్చని గుండెపాట.
కళను అర్థం చేసుకోకూడదని, అనుభవించాలని అంటారు మహానుభావులు. చిత్త విషయంలో ఈ మాటకు అర్థం లేదు. అతని చిత్రాలు అర్థం, అనుభవాల మేలుకలయిక.
‘..నేను చెప్పేది నీకర్థం కావడం లేదని అనుకుంటున్నానమ్మా! అయినా, మాటలు ప్రతిభావాన్నీ చేరవేస్తాయా? ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, మిత్రుడు ఎరిక్ మాట్లాడే డేనిష్.. అందరినీ అడిగి చూశాను.. మనుషుల ప్రగాఢమైన సుఖదుఃఖాలను, తృప్తి, అసంతృప్తులను, శాంతిని, క్రోధాన్ని సరిగ్గా చేరవేయగల మార్గాలను ఇంతవరకూ ఏ భాషా కనుక్కోలేదు’ అని అమ్మకు రాసిన లేఖలో అంటాడు చిత్త. భాషలు చెయ్యలేని ఆ పనిని అతని చిత్రాలు చేశాయి. 
చిత్తప్రసాద్ 1915 జూన్ 21న పశ్చిమ బెంగాల్ లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో నైహాతిలో పుట్టాడు. తల్లిదండ్రులు ఇందుమతీ దేవి, చారుచంద్ర భట్టాచార్య. చారుచంద్ర ప్రభుత్వోద్యోగి. పియానో వాయించేవాడు. ఇందుమతి కవిత్వం రాసేది, పాటలూ పాడేది. పుస్తకాలంటే పిచ్చిప్రేమ. ఈ పిచ్చి కొడుక్కీ సోకింది. పుస్తక సేకరణ సామ్రాజ్య నిర్మాణం వంటిదంటాడు చిత్త. అతనికి తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా అంతకుమించిన సాహితీసంస్కారాన్ని, బీదలపట్ల సానుభూతిని, నమ్మిన విలువల కోసం రాజీలేనితనాన్ని అందించారు. చిత్తకు ఒక చెల్లెలు. పేరు గౌరి. ‘దాదామోషి’ ఆ పిల్లను చెల్లి అని కాకుండా ముద్దుగా అక్కాయ్ అని పిలిచేవాడు. చారుచంద్ర ఉద్యోగరీత్యా మిడ్నపూర్, చిట్టగాంగ్ లలో కాపురమున్నాడు. చిత్త ఇంటర్, డిగ్రీ చిట్టగాంగ్ ఆ ఊళ్లలోనే పూర్తి చేశాడు.
 బెంగాల్ విద్యావేత్త  ప్రొఫెసర్ జోగేశ్ చంద్ర రాయ్(1859-1952) లైబ్రరీ చిత్తకు చిత్రలోకాన్ని పరిచయం చేసింది. కుర్రాడు సాయంత్రం పూట జోగేశ్ పుస్తకాలను తుడిచి, సర్దిపెట్టేవాడు. అందుకు ప్రతిఫలంగా ఆ పెద్దాయన ‘ప్రభాషి’, ‘భరతబర్ష’ వంటి పత్రికల్లో వచ్చే బొమ్మలను ఇచ్చేవాడు. ఓ రోజు వాటర్ కలర్స్ బాక్సు కానుకగా ఇచ్చాడు. చిత్త బొమ్మల్లో మునిగి తేలాడు. జోగేశ్ తనను సొంత మనవడిలా చూసుకున్నాడని అంటాడు చిత్త.
3 (4)
1930వ దశకంలో బెంగాల్ విప్లవాగ్నులతో కుతుకుత ఉడుకుతుండేది. చిట్టగాంగ్ ఆయుధాగారంపై సమర్ సేన్ దండు ముట్టడి, తర్వాత విప్లవకారులను బ్రిటిష్ వాళ్లు వేటాడి చంపడం.. బ్రిటిష్ తొత్తుల ఇళ్లపై అనుశీన్ సమితి దాడులు… ఇవన్నీ చిత్త చుట్టుపక్కలే జరిగాయి. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఫాసిస్టులు బెంగాల్ పొరుగున ఉన్న బర్మాను ఆక్రమించారు. చిట్టగాంగ్, కలకత్తాలపై బాంబులు వేశారు. చిత్త రాజకీయాల్లోకి రాక తప్పలేదు. రహస్య కమ్యూనిస్టు రైతు సంఘాలతో పరిచయమైంది. జపాన్ దాడిని వ్యతిరేకిస్తూ చిత్త వేసిన పోస్టర్లను గ్రామం పక్కన పొలంలో కర్రలు పాతి, తడికలకు అతికించి ప్రదర్శించారు. అక్షరమ్ముక్క తెలియని జనం కూడా వాటిని చూసి మెచ్చుకున్నారు. అది అతని తొలి ఎగ్జిబిషన్. కొండంత స్ఫూర్తని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వేడుక.
చిత్త నిజానికి శిల్పికావాలనుకున్నాడు. కానీ ఆ కళాశిక్షణా గట్రా ఖరీదు వ్యవహారం కావడంతో చిత్రకళతో సరిపెట్టుకున్నాడు. బొమ్మల పిచ్చితో కలకత్తా వెళ్లాడు. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ చేశాడు. రాజకీయాల్లో తలదూర్చనని హామీ ఇస్తేనే సీటిస్తానన్నాడు. చిత్త నిరాకరించి బయటికొచ్చేశాడు. తన ఆరాధ్యుడైన నందలాల్ బోస్ కళాపాఠాలు బోధిస్తున్న శాంతినికేతన్ కు వెళ్లాడు. రవీంద్రనాథ్ టాగూర్ ముందు కూర్చుని అతని బొమ్మను చకచకా గీసిచ్చాడు. టాగూరు, నందలాల్ ఇద్దరూ భేష్ అన్నారు. ‘నీకు మేం నేర్పేదేమీ లేదు, కాలం వృథా చెయ్యకుండా వెళ్లిపో, మమ్మల్ని మించిపోతావు!’ అని భుజం తట్టారు. చిత్త స్వయంకృషితో కళాసాధన చేశాడు. ఉడ్ కట్లు, లినోకట్లు, ఆయిల్స్, వాటర్ కలర్స్.. ఏది పట్టుకున్నా కళ్లు చెదిరే బొమ్మ తయారై బోలెడు ముచ్చట్లు చెప్పేది. చిత్త 1938లో రంగుల్లో వేసుకున్న స్వీయచిత్రంలో అతని నవకాశల యువపేశల స్వప్నకాంతులను చూడొచ్చు.
2 (4)
చిత్త 1937-38 లో కమ్యూనిస్టులకు మరింత దగ్గరయ్యాడు. బ్రాహ్మణ్నని గుర్తుచేసే భట్టాచార్య తోకను కత్తిరించుకున్నాడు. జంధ్యప్సోసను తెంచేశాడు. అవసరమున్నప్పుడు జంధ్యప్సోసను, నగానట్ర, పట్టుచీరలను బహు అందంగా తగిలించుకుని, అవసరం లేనప్పుడు బీరువాల్లో అతి జాగ్రత్తగా దాచుకుంటూ, తోకలను, కొమ్ములను భద్రంగా మోసుకు తిరిగే నేటి ‘వీరవిప్లవ కమ్యూనిస్టులు’ చిత్తను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదా ?
40వ దశకంలో దేశం విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలతో కోట్ల వాల్టుల ఎర్రలైటులా ప్రకాశించింది. ఒక పక్క క్విట్ ఇండియా రణన్నినాదాలు.. మరోపక్క తెభాగా, పునప్రా వాయలార్, తెలంగాణా సాయుధ పోరాటాలు బ్రిటిష్ వాళ్లకు, వాళ్ల తొత్తు కుక్కలకు చుక్కలు చూపించాయి. సాంస్కృతిక కళారంగాల్లోనూ కొత్త విలువలు, ఆదర్శాలు పురివిప్పి నాట్యమాడాయి. ఫాసిస్టు వ్యతిరేక రచయితల, కళాకారుల సంఘం(ఏఎఫ్ డబ్ల్యూఏ), అభ్యుదయ రచయితల సంఘం(పీడబ్ల్యూఏ), భారత ప్రజానాట్యమండలి(ఇప్టా) అన్నీ నూతన మానవుడిని కలగంటూ పలవరింతలు పోయాయి. చిత్త కూడా రూపారూపాల్లో కలలుగన్నాడు. కమ్యూనిస్టుల దళపతి పీసీ జోషి చిత్తలోని కార్యకర్తనే కాక కళాకారుడినీ గుర్తించాడు.  పూర్తికాలం కార్యకర్తగా బాంబేకి పంపాడు.
కమ్యూనిస్టు పార్టీ పత్రికలైన ‘పీపుల్స్ వార్’, ‘జనయుద్ధ’లకు, బులెటిన్లకు ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం, రైతు, కార్మిక సంఘాలకు పోస్టర్లు రూపొందించడం చిత్త పని. ‘ప్రచార కళే’ అయినా కళావిలువల్లో ఎక్కడా రాజీపడకపోవడం చిత్త సాధించిన అరుదైన విజయం. ‘ప్రచార కళ’ అనేది మోటుగా చెప్పాలంటే తప్పుడుమాట. ఎందుకంటే కళను ప్రచారం కోసమే సృజిస్తారు కాబట్టి. ప్రచార కళా, మామూలు కళా అని రెండు రకాలు ఉండవు. కళకు కళాసౌందర్యవిలువలే ప్రమాణం. కళ ఎక్కడున్నా కళే. ‘ప్రచారం’లో ఉన్నంత మాత్రాన కళ కళ కాకుండా పోదు. మనిషి కళను ఎరిగింది మొదలు దాని లక్ష్యమంతా ప్రచారమే. ఆదిమానవులు గుహల్లో గీసిన బొమ్మలు, అధునిక మానవులు గుళ్లలో వేసిన బొమ్మలు, నవాధునిక మానవులు ఎక్కడెక్కడో వేస్తున్న బొమ్మలు.. వీటన్నింటి ఉద్దేశం తమ భావాలను ఎదుటి మనిషికి చెప్పుకోవడం. కాఫ్కాలు, వైల్డులు, డాలీలు, పొలాక్ లు తమ రచనలను, చిత్రాలను సృజించిది నేలమాళిగల్లో, భోషాణాల్లో ఎవరికంటా పడకుండా దాచిపెట్టుకోవడానికి కాదు. చిత్త బొమ్మలు బండగా, అందవికారంగా ఉంటాయని పైకి చెప్పకున్నా కొంతమంది కళాభిమానుల లోపలి అభిప్రాయం. ‘కళలో గుణం(కేరక్టర్) లేకపోవడం ఉంటుంది కానీ అందవికారమనేది అసలుండదు’ అని అంటాడు ఫ్రెంచి మహాశిల్పి అగస్త్ రోదా.
కళాకారులందరి లక్ష్యం జనాన్ని చేరుకోవడం. చిత్త లక్ష్యం వారిని చేరుకోవడమే కాకుండా చైతన్యవంతం చేయడం కూడా. కనుక అతని మార్గం భిన్నం. పునజ్జీవనం పేరుతో పాత కథలకు కొత్త మెరుగులద్ది తృప్తిపడిపోయే నాటి బెంగాల్ కళాశైలి అతనికి నచ్చలేదు. జనానికి అర్థం కాని సొంతగొడవల, డబ్బాశల పాశ్చాత్య వాసనల బాంబే, కలకత్తా శైలులు అసలే నచ్చలేదు. తన బొమ్మలు జనబాహుళ్యానికి అర్థం కావాలి, తను చెప్పేదేమిటో వాళ్ల మనసుల్లోకి నేరుగా వెళ్లాలన్నదే అతని సంకల్పం. ‘ఒక చిత్రం గురించి నువ్వూ నేనూ ఏమనుకుంటున్నాం అనేదానికి కాకుండా, ఎక్కువమంది ఏమనుకుంటున్నారనే దానికి ప్రాధాన్యమివ్వడమే అభ్యుదయ మార్గం’ అన్న లెనిన్ మాట దివిటీ అయ్యింది. అందుకే జనానికి కొరుకుపడని పిచ్చిప్రయోగాలవైపు, గ్యాలరీలకు పరిమితమయ్యే ఆయిల్స్, వాటర్ కలర్స్, వాష్ వంటివాటివైపు కాకుండా జనంలోకి ఉప్పెనలా చొచ్చుకెళ్లే ప్రింట్లకు మళ్లాడు.
ప్రజాకళాకారులకు ప్రింట్లకు మించిన ఆయుధాల్లేవు. ఆయిల్ పెయింటింగ్ వేస్తే, అది కళాఖండమైతే ఒక ఇంటికో, గ్యాలరీకో పరిమితం. ప్రింట్లు అలా కాదు. కొద్దిపాటు ఖర్చుతో ఇంటింటికి, ప్రతి ఊరికి, లోకానికంతటికీ పంచి, జనాన్ని కదం తొక్కించొచ్చు. ఒక్కోటీ ఒక్కో కళాఖండం. అందుకే అవి రష్యా, చైనా, మెక్సికన్ విప్లవాలకు పదునైన ఆయుధాలు అయ్యాయి. జర్మనీలో కేథే కోల్విజ్, హంగరీలో గ్యూలా దెర్కోవిట్స్, మెక్సికోలో సికీరో, ఒరోజ్కో, లేపోల్దో మెందెజ్,  చైనాలో లీ కున్, అమెరికాలో చార్లెస్ వైట్.. అనేక దేశాల్లో అనేకమంది జనచిత్రకారులు ప్రింట్లతో సమరశంఖాలు పూరించారు. వాళ్లకు ముందు స్పెయిన్లో గోయా యుద్ధబీభత్సాలపై, మతపిచ్చి వెధవలపై లితోగ్రాఫులతో ఖాండ్రించి ఉమ్మేశాడు. ఎడ్వర్డ్ మంక్, పికాసో, మతీస్.. ప్రింట్లతో చెలరేగిపోయారు. వీళ్లందరికంటే ముందు యూరప్ లో ద్యూరర్, బ్రూగెల్, రెంబ్రాంత్ లు ప్రింట్లలో కావ్యాలు చెక్కితే.. హొకుసాయ్, హిరోషిగే వంటి అమరకళావేత్తలు రంగుల ప్రింట్లతో తూర్పుకళ సత్తా చాటారు. చిత్తపై వీళ్లందరి ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుంది. కానీ అతని కళ భారతీయతకు ఎన్నడూ దూరం కాలేదు. కాళీఘాట్ వంటి బెంగాలీ జానపద కళాశైలులు, మొగల్ సూక్ష్మచిత్రాలు, ప్రాచీన భారత కుడ్యచిత్రాల్లోని, శిల్పాల్లోని సరళత, స్పష్టత అతని చిత్రాల్లో కొత్త సొగసులు అద్దుకున్నాయి.
chitta1
ప్రింట్ల శక్తి, సౌలభ్యాలన్నింటిని చిత్త పూర్తిగా వాడుకున్నాడు. తర్వాత వాటిని అంత బలంగా వాడుకున్నవాడు చిత్తకంటే ఆరేళ్లు చిన్నవాడైన హరేన్ దాస్ ఒకడేనేమో. కరువుకాటకాలు, విప్లవం, శాంతి, ప్రణయం, ప్రసవం, పసితనం.. ప్రతి బతికిన క్షణాన్నీ చిత్త తన ప్రింట్లలో నిండైన భావసాంద్రతతో బొమ్మకట్టాడు. కరువుపై అతని ప్రింట్ల పుస్తకాలను బ్రిటిష్ వాళ్లు తగలబెట్టారంటే అతని కళాశక్తి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.
చిత్త అనగానే తొలుత ఎవరికైనా గుర్తుకొచ్చేది అతని పోరాట చిత్రాలు, బెంగాల్ కరువు చిత్రాలే. కరువు పీడితులను అతనంత బలంగా ప్రపంచంలో మరే కళాకారుడూ చూపలేదు. అతని కరువు చిత్తరువులు ఆకలి పేగుల ఆర్తనాదాలు, ఆరిపోయిన కన్నీటి చారికలు.
 1943-44 నాటి బెంగాల్ కరువు 30 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రకృతి విపత్తు, మనిషి స్వార్థం కలగలసి కరాళనత్యం చేశాయి. 1942లో వచ్చిన తుపానులో పంటలు దెబ్బతిన్నాయి. రోగాలు పెచ్చరిల్లాయి. మరోపక్క.. రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాపై దాడి చేసి బెంగాల్ సీమలోకి చొచ్చుకొస్తున్న జపాన్ ఫాసిస్టులపై పోరాడుతున్న సైనికులకు బళ్లకొద్దీ తిండిగింజలు తరలించారు. బర్మా నుంచి బియ్యం సరఫరా ఆగిపోయింది. దేశభక్తులు కొందరు తమ పంటను బ్రిటిష్ వాడికి అమ్మకుండా నదుల్లో పడేశారు, కాల్చేశారు. కొందరు దేశీవ్యాపారులకు అమ్మేశారు. నల్లబజారు జడలు విప్పింది. పోలీసులు, అధికారులు కొమ్ముకాశారు. జనం పిడికెడు తిండిగింజల కోసం పొలాలు, బొచ్చెలు బోలెలు అమ్ముకున్నారు. అడుక్కుతిన్నారు, వలస పోయారు. ఏదీ చేతకాకపోతే దొంగతనాలకు, కరువు దాడులకు పాల్పడ్డారు. అవి చేతగాని ఆడకూతుళ్లు ఒళ్లు అమ్ముకున్నారు. లక్షల మంది మంచినీళ్లు దొరక్క మలేరియాతో చచ్చిపోయారు. ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన వంగదేశపు పల్లెసీమల్లో ఎక్కడ చూసినా పీనుగులు, ఆకలి కేకల సజీవ కంకాళాలే కనిపించాయి. కరువును దగ్గరగా చూసి రిపోర్ట్ చేయాలని పార్టీ చిత్తను నవంబర్ లో మిడ్నపూర్ కు పంపింది. చిత్త ఆ శవాల మధ్య, ఆకలి జీవుల మధ్య తిరుగాడి మానవ మహావిషాదాన్ని నిరసనాత్మక నలుపు రూపాల్లోకి తర్జుమా చేశాడు.
2 (5)
సంచిలో కాసిన్ని అటుకులు, స్కెచ్ ప్యాడు, పెన్నుతో కాలినడకన క్షామధాత్రిలో తిరిగాడు. కనిపించిన ప్రతి ఆకలిజీవినల్లా పలకరించి, బొమ్మ గీసుకున్నాడు. కూలిన గుడిసెలను, నిర్మానుష్య పల్లెలనూ గీసుకున్నాడు. ‘ఈ బొమ్మలతో వాళ్లను నేనేమాత్రం ఆదుకోలేనని తెలుసు. కానీ, అవి కళ అంటే విలాసమని భావించేవాళ్లకు ఒక పచ్చినిజాన్ని చాటి చెబుతాయి’ అన్నాడు. చిత్త అలా తిరుగుతున్నప్పుడే అతని తండ్రి కరువు సహాయక కార్యక్రమాల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడినుంచో దాతలు పంపిన తిండిగింజలు దారిలోనే మాయమైపోతున్నాయని, బాధితులకు దొరుకుతున్నది పిడికెడేనని కొడుక్కి చెప్పాడు. చిత్త ఆ కరువు సీమలో ఎలా తిరిగాడో అతని చెల్లి ‘ఒంటరి పరివ్రాజకుడు’ వ్యాసంలో రాసింది. ‘అన్నయ్య ఊర్లు తిరిగి చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో, చెప్పులతో ఇంటికి వచ్చేవాడు. బోలెడన్ని బొమ్మలు గీసుకుని తెచ్చేవాడు. అమ్మ గదిలో కూర్చుని తను చూసిన ఆకలి జనం బాధలను రుద్ధకంఠంతో గంటలకొద్దీ వివరించేవాడు.’
chitta2
చిత్త కరువు నీడలను చిత్రించడంతోపాటు తన పర్యటన అనుభవాలను వివరిస్తూ ‘పీపుల్స్ మార్చ్’ ప్రతికలో సచిత్ర వ్యాసాలూ రాశాడు. కరువులో కాంగ్రెస్, హిందూమహాసభల కుళ్లు రాజకీయాలను ఎండగట్టాడు. ఆ రుద్రభూమిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆస్తులు పోగేసి కొత్త మేడ కడుతున్న వైనాన్ని, ఆ కామందును తిడుతూ ఊరివాళ్లు కట్టిన పాటనూ పరిచయం చేశాడు ‘అభివృద్ధి’ పేరుతో ఈ నేలమీది సమస్త వనరులనూ దేశవిదేశీ పెట్టుబడి దెయ్యాలకు కట్టబెడుతూ, ‘సొంత అభివృద్ధి’ చూసుకుంటున్న నేటి జనసంఘీయులను చిత్త చూసి ఉంటే బొమ్మలతో చావచితగ్గొట్టి ఉండేవాడు.
మిడ్నపూర్ పర్యటన అనుభవాలతో, బొమ్మలతో చిత్త 1943లో ‘హంగ్రీ బెంగాల్’ పేరుతో ఓ చిన్న పుస్తకం అచ్చేశాడు. ఆకలి వ్యథలను కేవలం సాక్షిలా కాకుండా ఆర్తితో, ఆక్రోశంతో వినిపించాడు. ఓపిక ఉంటే, వినండి అతడు బొమ్మచెక్కిన ఆ అభాగ్యుల దీనాలాపనలను…
‘‘ఓ రోజు దారి పక్కన ఇద్దరు ముసలి ఆడవాళ్లు, ముగ్గురు నడీడు వితంతువులు, ఒక యువతి కనిపించారు. ఎక్కడినుంచో తెచ్చుకున్న కాసిని తిండిగింజలను మామిడి చెట్టుకింద పొయ్యి వెలిగించి వండుకుంటున్నారు. వితంతువుల్లో ఒకామె చేతిలో 11 రోజుల పసికందు ఉంది. మరొకామె గర్భిణి. వాళ్లకు తిరిగి తమ ఊళ్లకు వెళ్లాలని ఉంది. దగ్గర్లో ఓ కామందు వస్త్రదానం చేస్తున్నాడని, అందుకోసం ఆగిపోయామని చెప్పారు. ‘రేపు మా అన్నయ్య ఎడ్లబండిలో వస్తాడు, ఊరికి వెళ్తాను’ అని బాలింత చెప్పింది.. పక్షం రోజు తర్వాత అదే దారిలో రిక్షాలో వెళ్లాను. ఓ పోలీసు ఇద్దరు చింపిరి యువకులతో, ఇదివరకు నేను మాట్లాడిన యువతితో గొడవ పడుతున్నాడు. రిక్షావాలా చెప్పాడు.. ‘ఈ ఆడాళ్లు ఒళ్లు అమ్ముకోవడం మొదలుపెట్టారు. పాపం ఇంకేం చెయ్యగలరు? రోజుల తరబడి, వారాల తరబడి తిండి లేకపోతే మానం మర్యాదలకు విలువేముంటుంది బాబూ?’..
chitta3‘‘కరువుపై సభ పెట్టడానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పార్టీ కామ్రేడ్లు చెప్పారు. పార్టీ పోస్టర్లను ఓ సీఐడీ చింపేసి జనాన్ని భయపెట్టాడు. ఈ ప్రాంతంలో మళ్లీ పోస్టర్లు కనిపిస్తే చావగొడతామని బెదిరించాడు.. ఇంతకూ ఆ పోస్టర్లో ఏముంది? కరువును ఎదుర్కోడానికి అందరూ ఏకం కావాలన్న పిలుపు, దేశనాయకులను విడుదల చేయాలన్న డిమాండ్, మా భూమిని మేం కాపాడుకుంటామన్న ప్రకటన..
‘‘కుదుపుల బస్సులో ఇబ్బంది పడుతూ మధ్యాహ్నానికి కాంతాయ్ చేరుకున్నాం. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో ఒంట్లో నలతగా ఉంది. కాంతాయ్ లో ఆ రోజు సంత. బియ్యం ఎక్కడా కనిపించలేదు. పప్పు దినుసుల అంగళ్ల వద్ద జనం మూగి ఉన్నారు. అయితే స్వర్ణకారుడి వద్ద, పాత్రల అంగళ్ల వద్ద అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో అంగడి వద్ద పది, పదిహేను మంది రైతులు తమ వంటసామాన్లను అమ్మడానికి వరుసగా నిల్చుని ఉన్నారు.  ఇత్తడి కంచాలు, గిన్నెలే కాదు దీపపు కుందీలు, దేవుడి గంటలు, హారతి పళ్లేలు వంటి పూజాసామగ్రినీ అమ్మడానికి తెచ్చారు. ఒకచోట బెనారస్ లో తయారైన శ్రీకృష్ణుడి కంచుబొమ్మ కూడా కనిపించింది. అది రెండు రూపాయల 12 అణాల ధర పలికింది. ఈ దేవుళ్లు తమ పేదభక్తులను వదలి బానపొట్టల హిందూవ్యాపారుల చెంతకు చేకుంటున్నారు…  మధ్యాహ్నం రెండుకల్లా అంగళ్ల నుంచి జనం వెళ్లిపోయారు. అదే రోజు ఓ ఓడ సంతలో అమ్మిన వంటసామాన్లతో కోలాఘాట్ కు బయల్తేరింది. రెండు పడవల్లో కూడా పాత్రలు తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి ఇదే తంతట.. రైతులు ఒక్క పాత్రకూడా ఉంచుకోకుండా అన్నింటినీ తెగనమ్మడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది..
3 (4)
‘‘ఓ రోజు పల్లె పొలిమేరలో నడుస్తున్నాం. ‘అదిగో, అటు చూడు, వరిపొలంలో ఏదో కదులుతోంది!’ అన్నాడు తారాపాద. ఓ ఆరేళ్ల పిల్లాడు పండిన పొలం మధ్య మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఏపుగా పెరిగిన పొలం నీడలో ఆ పిల్లాడి తెల్లకళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. మాటలకందని దృశ్యం అది. ఆ పిల్లాడు మేం పిలవగానే వచ్చాడు. ఎముకలతో తయారైన చిన్ననల్లబొమ్మలా ఉన్నాడు. అతని చిట్టికథ తెలుసుకున్నాం. అతని తండ్రి జ్వరంతో, తల్లి మలేరియాతో చనిపోయారు. పెద్దన్న చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. పదేళ్లున్న మరో అన్న.. జనం వదిలిపోయిన ఆ గ్రామంలోని ఓ బ్రాహ్మడి ఇంట్లో పాలేరు. ఆ ఇంటివాళ్లు పెట్టే తిండిని అన్నదమ్ములు పంచుకుని తినేవాళ్లు. అయితే కొన్ని రోజులుగా ఇతనికి తిండిపెట్టడం లేదు. అన్నం కావాలని ఏడిస్తే కొట్టారు. ఇప్పటికీ చెయ్యి నొప్పెడుతోంది. చివరికి ఇతన్ని ఇంట్లోంచి గెంటేశారు.. మళ్లీ మీ అన్నదగ్గరికి వెళ్తావా అని అడిగాడు తారాపాద. అతడు తలను గట్టిగా అటూ ఇటూ ఊపి, పోను అన్నాడు. గంజిపోసి, బట్టలిచ్చే అనాథాశ్రమం దగ్గర్లో ఉందని అతనికి అర్థమయ్యేలా చెప్పి, వెళ్తావా అని అడిగాం. సరేన్ననాడు. అతని పేరు అనంత. నిన్ను ఎత్తుకుని నడుస్తాం అని చెప్పాం. అతడు టక్కున ఉహూ అన్నాడు..
‘‘సాయంత్రం అయిదవుతుండగా జనుబాషన్ గ్రామానికి వెళ్లాం. ఐదు గుడిసెలే ఉన్నాయి.. ఊరి ఆనవాళ్లే లేవు. చిన్నసంచి, రెండుమూడు మట్టికుండలతో ఎక్కడికో వలసపోతున్న భార్యాభర్తలు కనిపించారు. ఆడమనిషి కొత్త ముతక చీరకట్టుకుని ఉంది. దాన్ని దగ్గర్లోని గంజికేంద్రంలో ఇచ్చారట. భర్త తుండుగుడ్డకంటే కాస్త పెద్దగా ఉన్న ధోవతీ కట్టుకుని ఉన్నాడు. వాళ్ల దీనగాథ అడిగాం. ఆ పల్లెలో మూడువందల మంది ఉండేవాళ్లట. తుపానులో వందమంది, మలేరియా, ఆకలితో మరికొందరు పోయారట. బతికినోళ్లు పట్నానికి వెళ్లగా, వీళ్లిద్దరే మిగిలిపోయారట. ఇప్పుడు వీళ్లూ వెళ్తున్నారు. ‘సరేగాని, ఈ మునిమాపున ఎందుకు వెళ్తున్నారు?’ అని అడిగాం. దొంగల భయం వల్ల అని చెప్పారు. పది రోజుల కిందట ఓ రాత్రి వీళ్లు అడుక్కుని తెచ్చుకున్న బియ్యం వండుకుంటుండగా 40 మంది బందిపోట్లు వచ్చిపడ్డారట. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారట. భర్త రెండు రోజులపాటు పైకి లేవలేదట. దొంగలు సగం ఉడికిన అన్నంతోపాటు, వీళ్ల దగ్గర మిగిలున్న రెండు ఇత్తడిపాత్రలను, చివరికి మురికి గుడ్డలను కూడా దోచుకెళ్లారట. ఈమెకు ఒంటిపై కప్పుకోవడానికి రెండు రోజులపాటు గుడ్డకూడా లేదట..
chitta6
‘‘గోపాల్ పూర్ లో రోడ్డు పక్కన ఓ వితంతువు శ్యామా గడ్డి విత్తనాలు సేకరిస్తోంది. మూడు గంటలు కష్టపడితే పిడికెడు గింజలు దక్కాయి. ఆమెకు ఆ పూటకు అవే భోజనం..
‘‘అతని పేరు క్షేత్రమోహన్ నాయక్, అందరి మాదిరే రైతు. భార్యాబిడ్డలు ఆకలి, మలేరియాలతో చనిపోయారు. వాళ్ల అంత్యక్రియలు పూర్తికాకముందే అతనికీ మలేరియా సోకింది. మేం అతన్ని చూసేసరికి అతని కళేబరం కోసం కుక్కలు, రాబందులు కాట్లాడుకుంటున్నాయి. దహనం కోసం ఆ శవాన్ని నిన్న రాత్రి శ్మశానానికి తీసుకొచ్చారు. చితి వెలిగించేలోపు అక్కడున్నవారికీ జ్వరం కమ్మేసింది. శవాన్ని అలాగే వదిలేసి ఇళ్లకు పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ల  శవాలను మోసుకెళ్లడానికి ఎవరైనా మిగిలి ఉంటారా?.. క్షేత్రమోహన్ కు పట్టిన దుర్గతి బెంగాల్ జిల్లాల్లో అసాధారణమైందేమీ కాదు. కానీ.. క్షేత్రమోహన్ నోటికాడి కూడు లాక్కుని, బోలెడు లాభాలు కూడబెడుతున్నవాళ్లను మనమింకా క్షమించడమే కాదు ప్రోత్సహిస్తున్నాం కూడా..’’
ఇలాంటి మరెన్నో మింగుడుపడని నిజాల ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం సంగతి తెల్లదొరలకు తెలిసింది. అచ్చేసిన ఐదువేల కాపీలనూ తగలబెట్టారు. చిత్త తన తల్లికి పంపిన ఒక పుస్తకం మాత్రం భద్రంగా మిలిగింది. పార్టీ పత్రికలకు చిత్త వేసిన బొమ్మల బ్లాకులు కూడా పోయాయి. అతన్ని పోలీసులు పట్టుకుపోతారనే భయంతో పత్రికల నిర్వాహకులే వాటిని నాశనం చేశారు.
మిడ్నపూర్ కరువు ప్రాంతాల పర్యటన తర్వాత చిత్త 1944లో జూన్-ఆగస్టు మధ్య మరో కరువు సీమకు వెళ్లాడు. బిక్రమ్ పూర్, కాక్స్ బజార్, మున్షీగంజ్, చిట్టగాంగ్ లలో కరువు దెబ్బకు సర్వం కోల్పోయిన జనం బొమ్మలు గీశాడు. వాటి వెనక వాళ్ల పేర్లు, ఊళ్లు, వాళ్ల కష్టాలను నమోదు చేశారు. జాలరి అబ్బుల్ సత్తార్, రైతు అలీ అక్బర్, నేతగాడు గనీ, రోగిష్టి హలీషహర్, వేశ్యగా మారిన చిట్టగాంగ్ బట్టల వ్యాపారి భార్య అలోకా డే, ఆస్పత్రితో అస్థిపంజరంలా పడున్న ముసలి మెహర్జెన్, ఒంటికింత బట్టలేక తనకు వీపులు తిప్పి ఇంట్లోకి వెళ్లిపోయిన బాగ్దీ కుటుంబం.. అన్నింటిని గుండెబరువులో ఆవిష్కరించాడు. ‘ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపా’న్నీ జడుసుకునేలా చూపాడు. ఆకలి తాళలేక పిచ్చెక్కి రాయి గురిపెట్టిన బాలుడి బొమ్మచూస్తే కన్నీళ్లూ, క్రోధమూ వెల్లువెత్తిపోతాయి.
బెంగాల్ కరువును చిత్త మిత్రులైన సోమనాథ్ హోరే, జైనుల్ అబెదిన్ లతోపాటు గోపాల్ ఘోష్, గోవర్ధన్ యాష్ వంటి ఇతర బెంగాల్ చిత్రకారులు కూడా వేశారు. అయితే వాళ్ల బొమ్మలు చిత్త బొమ్మలంత శక్తిమంతంగా కనిపించవు. నందలాల్ బోస్, గోపాల్ గోష్ వంటి బెంగాల్ స్కూల్ వాళ్లకు ఆ కరువు కలిపురుషుడి బీభత్సమైతే, చిత్తకు అది మనిషి స్వార్థం సృష్టించిన మృత్యుకాండ. అందుకే అతని చిత్రాల్లో అంత మానవతా, భావగాఢతా, కన్నీరూ. ‘మనిషి తన మానవతకు పట్టే నీరాజనమే కళ’ అని అంటాడు ప్రముఖ కళావిమర్శకుడు హెర్బర్ట్ రీడ్. ఆధునిక భారతంలో ఆ నీరాజనం పట్టిన పిడికెడు మందిలో చిత్త ఒకడు.
కరువు బొమ్మల తర్వాత చిత్తప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలాడు. ఢంకను వాయిస్తున్న మనిషి బొమ్మతో ‘ఇప్టా’కు లోగో వేశాడు. 1943లో లెనిన్ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘం తరఫున 43 మంది దేశవిదేశ కమ్యూనిస్టు యోధుల చిత్రాలతో ఓ ఆల్బమ్ తయారు చేసి పార్టీకి అందించాడు. ఇందులో మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో మొదలుకొని, పుచ్చలపల్లి సుందరయ్య వరకు ఉన్నారు.
1944 మార్చి 12, 13న విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభకు చిత్త హాజరయ్యాడు. ఎన్నో చిత్రాలు గీశాడు. ఎర్రజెండాలు కడుతున్నవాళ్లను, వంటలు వండుతు వాళ్లను, లంబాడాల నాట్యాలను.. ప్రతి సందర్భాన్నీ చిత్రిక పట్టాడు. తెలుగు రైతుల హావభావాలను, ఆశనిరాశలను తెలుగువాడే వేశాడని భ్రమపడేలా పరిచయం చేశాడు. సభలను విహంగవీక్షణంలో చూపుతూ గీసిన స్కెచ్చులో ఓ బ్యానర్ పై ‘కయ్యూరు కామ్రేడ్స్ గేట్’ అని తెలుగులో రాశాడు. కయ్యూరు అమరవీరులపై చిత్త అంతకుముందే ఓ బొమ్మ వేశాడు. కేరళలోని కయ్యూరు గ్రామంలో 1942లో భూస్వాములపై కమ్యూనిస్టుల నాయకత్వలో రైతాంగం తిరగబడింది. ఓ పోలీసు చనిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచేసింది. నలుగురు యువ రైతునాయకులను ఉరితీసింది. చిత్త ఆ నలుగురిని ఉరితీస్తున్న దృశ్యాన్ని ఒకపక్క.. నేలకొరిగిన వీరుడి చేతిలోని జెండాను చేతికి తీసుకుని సమున్నతంగా పట్టుకున్న మహిళను మరోపక్క చిత్రించాడు. చిత్రం మధ్యలో ఆ వీరుడికి కమలంతో నివాళి అర్పిస్తూ, అతని పోరు వారసత్వాన్ని ఆవాహన చేసుకుంటున్న బాలుడిని నుంచోబెట్టాడు.
R0189P049-011-2318KB

భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి(1946 -51) చిత్త చిత్ర హారతులు పట్టాడు. యావద్దేశానికి ఆశాకిరణంలా జ్వలించిన ఈ పోరాటంపై వేసిన బొమ్మల్లో వర్గకసి నిప్పులను కురిపించాడు. కాయకష్టంతో చేవదేరిన తెలంగాణ రైతు ధిక్కారాన్ని, త్యాగాన్ని నలుపు తెలుపుల్లోనే ఎర్రజెండాల్లా రెపరెపలాడించాడు. బ్రిటిష్ పాలకులు, వాళ్ల కీలుబొమ్మ నిజాం, అతగాడి రజాకార్ ముష్కరులు, యూనియన్ సైన్యం కలసికట్టుగా సాగించిన దారుణమారణకాండలో నెత్తురోడిన తెలంగాణను గుండెల్లోకి పొదువుకుని దాని వేదనను, ఆక్రోశాన్ని రికార్డు చేశాడు. సంకెళ్లు తెంచుకుంటున్న రైతులను, శత్రువు గుండెకు గురిపెడుతున్న గెరిల్లాలను, సుత్తీకొడవలి గురుతుగ ఉన్న జెండాలతో సాగిసోతున్న ఆబాలగోపాలాన్ని, రజకార్ల, యూనియన్ సైనికుల అకృత్యాలకు, అత్యాచారాలకు బలైన పల్లెజనాన్ని.. పోరాటంలోని ప్రతి సందర్భాన్నీ చిత్త ఒక నవలాకారుడిలా రూపబద్ధం చేశాడు.
ఒక చిత్రకారుడు సాయుధ గెరిల్లాలతో కలసి తిరిగి బొమ్మలేయడం మన దేశ కళాచరిత్రలో అపూర్వఘట్టం. నాటి తెలుగు ప్రజాచిత్రకారులకు చిత్త ఒక ఆదర్శం. మాగోఖలే, గిడుతూరి సూర్యం తదితరులు వేసిన తెలంగాణ సాయుధరైతు పోరాట చిత్రాలకు, కార్టూన్లకు చిత్త బొమ్మలే స్ఫూర్తి. ఈ పోరాటాన్ని గానం చేసిన గంగినేని వెంకటేశ్వరావు ‘ఉదయిని’కి చిత్త ఆరు చిత్తరువులు అందించాడు. చిత్తకు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ తెలియకున్నాఅందులోని చాలా కవితలకు అతడు చిత్రానువాదం చేశాడు! చిత్త బొమ్మలు నాటి ‘అభ్యుదయ’, ‘నవయుగ’ వంటి తెలుగు పత్రికల్లోనూ వచ్చాయి.
abyudaya
అభ్యుదయ పత్రిక 1948 ఆగస్టు సంచిక చిత్త వేసిన శ్రామికజంట ముఖచిత్రంలో వెలువడింది. అందులో ఆ బొమ్మ గురించి, చిత్త కళాసారాంశం గురించి ఇలా రాశారు.. ‘స్త్రీ పురుషుల సమిష్టి కృషి ఫలితంగా మానవ జీవితం సుఖవంతమూ, శోభావంతమూ ఔతుంది. పరిశ్రమలో, ఫలానుభవంలో సమాన భాగస్వాములైన స్త్రీపురుషులు ఒకవంక ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకుంటారు. గనులు త్రవ్వుతారు. పంటలు పండిస్తారు. తాము శాస్త్రజగత్తును శోధించి సృష్టించిన యంత్రాల సహాయంతో తమ శ్రమశక్తిని సద్వినియోగం చేస్తారు. తమ హృదయాన్ని, మేధస్సును విశ్వంలోని గుప్తరహస్యాలను గ్రహించటానికి ప్రయోగిస్తారు. జంతువైన నరుడు, జగత్తునిండా వ్యాపించి, మానవుడుగా దివ్యమూర్తిగా వికసించటానికి చేసే సమిష్టి కృషికి, ప్రపంచాభ్యుదయానికి చిహ్నంగా ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ ఈ చిత్రాన్ని రచించాడు.’
చిత్తకు తెలుగువాళ్లతో 1950ల తర్వాత కూడా అనుబంధం కొనసాగింది. 1959లో ముత్యం రాజు, సంజురాజే అనే ఇద్దరు తెలుగు గిరిజనుల బొమ్మలను చిత్త స్పాట్ లో గీశాడు. ఆ బొమ్మలున్న కాగితంపై వాళ్లు తెలుగుప్రాంత గిరిజన వైద్యులు, వేటగాళ్లు అని, గోండులు కావచ్చని రాసుకున్నాడు.
joy
చిత్త 1946 నుంచి బాంబేలో స్థిరపడ్డాడు. పరాయి పాలకులను గడగడలాడించిన 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటును, దాన్ని ఉక్కుపాదంతో అణచేసిన వైనాన్ని బొమ్మకట్టాడు. సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ మాత్రమే మద్దతిచ్చినా, ఇది దేశ సమస్య కాబట్టి కాంగ్రెస్, ముస్లిం లీగులు కూడా కలసి రావాలని ఆ చిత్రాల్లో సుత్తీ కొడవలి జెండాల పక్కన వాటి జెండాలనూ అమర్చాడు. వీటిలోనే కాదు చాలా సమ్మెల చిత్రాల్లో చిత్త ఈ మూడు పార్టీల ఐక్యత అవసరాన్ని గొంతు చించుకుని చెప్పాడు. గాంధీ రాజకీయపరంగా బద్ధశత్రువైనా అతని జనాకర్షణ శక్తి చిత్తనూ లాక్కుంది. గాంధీ నిరాయుధ మార్చింగ్  దృశ్యాలను, అతని ధ్యానదృశ్యాలను చిత్త రాజకీయ శత్రుత్వం, వ్యంగ్యం, వెటకారం గట్రా ఏవీ లేకుండా అత్యంత మానవీయంగా చూపాడు. అతి సమీపం నుంచి చూసిన నేవీ తిరుగుబాటు అతన్ని చాలా ఏళ్లు వెంటాడింది. 1962లో దీనిపై ఓ పెద్ద వర్ణచిత్రం వేశాడు. హార్బర్లో నేలకొరిగిన వీరులు, పోలీసుల దమనకాండ, మౌనంగా చూస్తున్న సామాన్య జనంతో ఆ చిత్రం నాటి పోరాటాన్ని మాటలు అక్కర్లేకుండా వివరిస్తుంది.
1946 నాటి చరిత్రాత్మక పోస్టల్ సమ్మె, 1975 నాటి రైల్వే సమ్మె, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం.. ఇలా ప్రతి చారిత్రక జనోద్యమాన్నీ చిత్ర బొమ్మల్లోకి అనువాదం చేశాడు. హోంరూల్, జలియన్ వాలాబాగ్, క్విట్ ఇండియా వంటి భారత స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ‘పీపుల్స్ ఏజ్’ పత్రికలో ‘ఇండియా ఇన్ రివోల్ట్’ బొమ్మల్లో చూపాడు. చేయిపట్టుకుని కవాతు చేయించే ఈ బొమ్మలతోపాటు శత్రుమూకలను తుపాకులకంటే ఎక్కువ జడిపించే కార్టూన్లనూ వందలకొద్దీ గీశాడు. శ్రమజీవుల కష్టఫలాన్ని తన్నుకుపోయే దేశవిదేశాల గద్దలు, వాటికి కాపలాకాసే పోలీసు జాగిలాలు, గాంధీ టోపీల కుర్చీ తోడేళ్లు, నల్లబజారు పందికొక్కులు.. నానా పీడకజాతులను బట్టలను విప్పదీసి నడిరోడ్డుపైన నిలబెట్టాడు. దామీ, డేవిడ్ లో, థామస్ నాస్త్, జార్జ్ గ్రాజ్ వంటి విశ్వవిఖ్యాత కార్టూనిస్టుల, కేరికేచరిస్టుల ప్రభావం చిత్త కార్టూన్లలో మనవైన భావభౌతిక దరిద్రాలను, దాస్యాలను అద్దుకుని వెక్కిరిస్తుంది.
chitta
1947లో దేశం పెనంలోంచి పొయ్యిలో పడింది. స్వాతంత్ర్యం మామిడిపళ్లు పెదబాబుల ఇళ్లకే చేరాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చేవచచ్చి, శాంతియుత పరివర్తన అగడ్తలోకి జారిపోయాయి. చాలామంది కమ్యూనిస్టులు రంగులమారి నెవురయ్య సోషలిజం మాయలో పడిపోయారు. చిత్త తెగ ఆరాధించిన పీసీ జోషి కూడా మెత్తబడ్డాడు. 1948లో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభల్లో రణదివే వర్గం జోషిని పక్కన పెట్టేసి సాయుధ పోరాటమే తమ మార్గమంది. ఈ వ్యవహారం కుట్రపూరితంగా, కక్షగట్టినట్టు సాగడంతో చిత్త చలించిపోయాడు. రణదివేను కూడా తర్వాత అతివాద దుస్సాహసికుడంటూ పార్టీ నాయకత్వం నుంచి తప్పించారు. పార్టీలో ఇలాంటి తడబాట్లు, ఆధిపత్య రాజకీయాలు, అభ్యుదయ కళాకారుల సంఘాల్లోకి పిలక బ్రాహ్మణుల, స్వార్థపరుల చేరికలు, సినిమాల్లోకి అభ్యుదయ కవిగాయకనటకుల వలసలు, దేశవిభజన నెత్తుటేర్లు, మతకలహాలు.. చిత్త సున్నిత హృదయాన్ని కోతపెట్టాయి. పార్టీతో అనుబంధం తగ్గించుకున్నాడు.
కానీ పార్టీ రాజకీయాలపై విశ్వాసం రవంత కూడా సడల్లేదు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అదివరకటికంటే జోరుగా సాగుతున్న దోపిడీపీడనలపై మరింత కసి రేగింది. ‘యే ఆజాదీ జూటా హై’ అన్న నమ్మకం బలపడిపోయింది. ‘బాబ్బాబూ, మా గడ్డకు స్వాతంత్ర్యం ఇవ్వండయ్యా అని కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వాడిని దేబిరించిన కాలం ఎంత పాడుకాలం! దీనికి బదులు స్వాతంత్ర్యాన్ని ఎదురుబొదురుగా కొట్లాడి, చచ్చి తెచ్చుకుని ఉండుంటే అదేమంత పెద్ద పొరపాటు, అమానవీయం అయ్యేదా?’ అని తల్లికి రాసిన లేఖలో ఆక్రోశించాడు. ‘రెండు నాలుకల నాయకులు రాజ్యమేలుతున్నారు. ఈ దేశానికి చరిత్రపై ఇంకెంతమాత్రం ఆసక్తి లేదు, ఒట్టి గాసిప్ లపై తప్ప. అబ్బాస్ ఏదో సినిమా కథను కాపీ కొట్టాడని మొన్న వార్తలొచ్చాయి. గాసిప్ చాలు. ఇక ఉంటాను’ అని లక్నోలోని ఆప్తమిత్రుడు మురళీ గుప్తాకు రాసిన లేఖలో చీదరించుకున్నాడు.
రెండో ప్రపంచ యుద్ధంతో గుణపాఠం నేర్చుకున్న ప్రపంచం తర్వాత శాంతిమంత్రం పఠించింది. అయితే అన్నిరోగాలకూ అదే మందని ప్రచారం చేశారు. వర్గపోరాటాన్ని చాపచుట్టేశారు. 1952లో కలకత్తాలో ఇండియన్ పీస్ కాంగ్రెస్ జరిగింది. చిత్త ఆ ఉద్యమంలోని రాజకీయాలకు కాకుండా సందేశానికే ఆకర్షితుడయ్యాడు. లోకమంతా శాంతిసౌభాగ్యాలు విలసిల్లాలని బోలెడు బొమ్మలు గీశాడు. 1950 దశకం నాటి అతని చాలా చిత్రాల్లో వీరోచిత పోరాటాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. వాటికి బదులు రెక్కలు విప్పిన శాంతి పావురాలు, మతసామరస్య సందేశాలు, పిల్లాపెద్దల ఆటపాటలు, ఆలుమగల కౌగిళ్లు, తల్లీపిల్లల ముద్దుమురిపాలు, పాడిపంటలు, పశుపక్ష్యాదులు చేరి చూపరుల మనసు వీణలను కమ్మగా మీటాయి. ఆ కల్మషం లేని మనుషులు ఇంతలేసి కళ్లతో మనవంక చూస్తూ మీరూ మాలాగే పచ్చగా బతకండర్రా బాబూ అని చెబుతుంటారు.

 ‘లవర్స్’ పేరుతో చిత్త చెక్కిన ప్రణయ గాథలు అపురూపం. స్త్రీపురుష సంగమాన్ని ప్రింట్లలోనే కాదు, పెయింటింగుల్లోనూ అంతనంత ప్రేమావేశంతో చిత్రించిన భారతీయ చిత్రకారులు అరుదు. ఆ లినోకట్లలోని వలపులు ఒట్టి దైహిక కలయికలు కావు, రెండు మనసుల గాఢ సంగమాలు. ఒకచోట తెలినలుపుల గదిలో ఊపిరాడని కౌగిలింతల్లో, ముద్దుల్లో లోకం మరచిపోయిన జంట కనిపిస్తుంది. మరోచోట పచ్చికబయళ్లలో పడుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపిస్తుంది. మరోచోట.. కడుపుతో ఉన్న సహచరిని దగ్గరికి తీసుకుంటున్న మనిషి కనిపిస్తాడు. మరోచోట కడుపుపంటను తనివితీరా చూసుకుంటూ మురిసిపోతున్న జంట తారసపడుతుంది. సిగ్గులేని శృంగారం, ఆత్మాభివ్యక్తి పేర్లతో నేటి కళాకారులు కుబేరులకు వేలం వేసి అమ్ముకుంటున్నమర్మాంగాల బొమ్మలను చూసి తలదించుకునేవాళ్లు.. చిత్త ప్రణయచిత్రాలను తల ఎత్తుకుని సగర్వంగా చూడగలరు. చిత్త కల్మషం లేని కళాభివ్యక్తికి ఇది నిదర్శనం. తన చిత్రసుందరులను కూళలకిచ్చి అప్పుడప్పుడు  కూడు తినని కమ్యూనిస్టు పోతన.. చిత్త.
cartoon
చిత్త వలపు చిత్రాల్లో చాలా వాటిలో అతని పోలికలున్న పురుషుడు కనిపిస్తాడు. పెద్ద నుదరు, పొడవాటి ముక్కు, విల్లుల్లాంటి కనుబొమలు, అనురాగ దరహాసాలు.. అన్నీ చిత్తపోలికలే. అతడు చిత్త అయితే మరి అతని ప్రేయసి ఎవరు? ప్రేమాస్పదుడైన చిత్తను ఇష్టపడని ఆడమనిషి ఉండదని అతని మిత్రులు గుంభనంగా చెబుతారు. అతడు ఒకామెను గాఢంగా ప్రేమించాడని, అయితే ఆమె పెళ్లి చేసుకుని యూరప్ వెళ్లిపోయిందని అంటారు. పెళ్లి చేసుకోని చిత్త కూడా ఏమంటున్నాడో మురళికి రాసిన ఉత్తరంలోంచి వినండి.. ‘నేను సునీల్, దేవీ(మిత్రులు) వంటి వాడిని కానని నాకు తెలుసు. తండ్రి ఆస్తిపై బతికే పరాన్నభుక్కూనూ కాను. దుఃఖమన్న సౌఖ్యానికి కూడా నోచుకోలేదు నేను. ఓ గ్లాసు మందుతోనో, తాత్కాలిక ప్రేయసితోనే వెచ్చపడే సుఖమూ లేదు. అయితే నేను సన్యాసిని కూడా కాను. నాకు మా అమ్మంటే, మానవత అంటే, ఈ దేశమంటే తగని ప్రేమ. నేను ఈ దేశపు స్త్రీని ప్రేమిస్తాను. నా దేశంలోని ఎంతోమంది స్నేహితులను గాఢంగా ప్రేమిస్తాను. పెయింటింగ్ వేయడాన్ని, పెయింటింగులను చూడడాన్ని ప్రేమిస్తాను..’
అతనికి పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ల కోసం చిట్టిపొట్టి కథలు రాసి బొమ్మలేశాడు. ‘రసగుల్లా కింగ్ డమ్’ పేరుతో బడాబాబులకు చురుక్కుమనిపించే కథలు రాశాడు. కొన్ని బెంగాలీ కథలను  తిరగరాసి, బొమ్మలేశాడు. కల్లాకపటం తెలియని పిల్లల ఆటపాటలపై చిత్రాలతో పద్యాలు అల్లాడు. ఆ బుజ్జికన్నలను కాగితప్పడవలతో, సంతలో కొన్న ఏనుగు బొమ్మలతో, లక్కపిడతలతో ఆడించాడు. ఆవుపైకెక్కించి పిప్పిప్పీలను ఊదించాడు. పావురాలతో, చేపలతో ఆడించాడు. వాళ్లతో లేగదూడలకు ముద్దుముద్దుగా గడ్డిపరకలు తినిపించి కేరింతలు కొట్టాడు. వీళ్లంతా కష్టాల కొలిమి సెగ సోకని పిల్లలు. ఆ సెగలో మాడిమసైపోయే పిల్లలూ చిత్త లోగిళ్లలో కన్నీటి వరదలై కనిపిస్తారు. తిండిలేక బక్కచిక్కిన పిల్లలను, ఆకలి కోపంతో పిచ్చెత్తి రాయి గురిపెట్టిన చిన్నారిని, బూటుపాలిష్ తో కనలిపోయే చిట్టిచేతులను, చిరుదొంగతనాలతో జైలుకెళ్తున్న బాల‘నేరస్తుల’ను, తల్లిదండ్రులు పనికెళ్లగా, పసికందులను చూసుకుంటూ వంటావార్పుల్లో మునిపోయిన ‘పెద్ద’లను, ఇళ్లులేక ఫుట్ పాత్ లపై పడుకున్న చిన్నారులను, మశూచితో అల్లాడుతున్న పసిదేహాలను.. కళ్లు తడయ్యేలా చూపాడు. అంతేనా.. గోడలపై క్విట్ ఇండియా నినాదాలు రాసి, తెల్లోడి పోలీసులను హడలగొట్టే చిచ్చుబుడ్లను, తల్లిదండ్రుల వెంట సుత్తీకొడవళ్లు, ఎర్రజెండాలు పట్టుకుని కదిలే బాలయోధులను కూడా బొమ్మకట్టాడు.
beedi
చిత్త బాలకార్మికుల చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధం.  ‘చిల్ర్డన్ వితౌట్ ఫెయిరీ టేల్స్’ పేరుతో చేసిన ఈ లినోకట్లు పిల్లల ప్రపంచాన్ని పెద్దలు ఎంత కర్కశంగా కాలరాస్తున్నారో చెబుతాయి. అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు బీడీలు చుట్టడం, తల్లిఒడిలో నిదురపోవాల్సిన పిలగాడు బూట్ పాలిష్ తో అలసి రోడ్డుపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలు విదూషకులై పొట్టకూటికి కోతిని ఆడించడం, సాముగరిడీలు చేయడం.. చందమామ కథలకెక్కని ఇలాంటి మరెన్నో వ్యథాగాథలకు చిత్త రూపమిచ్చి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిఫెన్స్ ఆఫ్ చిల్డ్రన్స్’ కు అంకితం చేశాడు. వీటిని యూనిసెఫ్ డెన్మార్క్ కమిటీ 1969లో పుస్తకంగా తీసుకొచ్చింది. డెన్మార్క్, చెకొస్లవేకియా, టర్కీ.. మరెన్నో దేశాల రచయుతలు భారత్ పై రాసిన పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మలు అందించాడు.
చిత్తకు మూగజీవులన్నా ప్రాణం. పిల్లులను, కుక్కలను పెంచుకునేవాడు. అవీ మనలాంటివేనని ముద్దు చేసేవాడు. ‘నికార్సైన బాధ, సంతోషం, శాంతి మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. ఆకలిదప్పికలు, రాగద్వేషాలు జీవరాసులన్నింటికి  ప్రకృతి సహజమైనవి. అందుకే మనం జంతువుల సుఖదుఃఖాలను, మొక్కల దాహార్తిని, పూల ఉల్లాసాన్ని సహానుభూతితో గ్రహించగలం.. అవి కూడా మనలాగే జీవితంలో ఒక క్షణకాలాన్ని కోల్పోయినా భోరున విలపిస్తాయి.. వాటిలో ఏదీ ఈ అందమైన లోకం నుంచి వెళ్లాలని అనుకోదు..’ అని తల్లికి రాశాడు చిత్త.
bezwada sabha
పార్టీ పనులు లేకపోవడంతో చిత్త కు అనేక వ్యాపకాలు మొదలయ్యాయి. అంధేరీ మురికివాడలోని రూబీ టెర్రేస్ లో అంధేరా ఒంటరి గది చిత్త ఆవాసం. అందులోనే వేలాది లినోకట్లు, పేస్టల్స్, పెయింటింగులూ వేశాడు. కవితలు, కథలు, నాటకాలు రాశాడు. కిటికీ ముందు రెండుమూడు పూలకుండీలు, కిటికీ పక్కన చెక్కపై పుస్తకాలు, దానికింది చెక్కపై కీలుబొమ్మలు, భయపెట్టే ఇండోనేసియా డ్యాన్స్ మాస్కులు, ఓ మూల మంచం, వంటసమయంలో మంచం కింది నుంచి బయటి, వంటయిపోయాక మంచం కిందికి వెళ్లే  వంటసామాన్లు, చిత్రాలు, ఓ పిల్లి, పంచలో రెండు కుక్కలు, పక్కిళ్ల వాళ్లతో కలసి వాడుకునే బాత్రూమ్, ఇంకాస్త బయట కాస్త పసిరిక.. చుట్టుపక్కల అతిసామాన్య మానవులు.. ఇవీ చిత్త బతికిన పరిసరాలు.
telengana
తెలంగాణా
రేషన్ షాపులో గోధుమపిండి, కిరసనాయిల్, చిరిగిన బనీను, లుంగీ, రెండు జతల బట్టలు, వారానికో అప్పు, అప్పుడప్పుడు ఎండుచేపలు, ఉర్లగడ్డల కూర, కాస్త డబ్బుంటే గ్లాసెడు మందుచుక్క, డబ్బుల్లేనప్పుడు పస్తులు, ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు, పుస్తకపఠనం, మిత్రులతో కబుర్లు, వాళ్లతో కలసి ‘బ్రిడ్జ్ ఆఫ్ రివర్ క్వాయ్’, ‘పథేర్ పాంచాలి’ లాంటి సినిమాలకు వెళ్లడం, తల్లికి, చెల్లికి రాజకీయాలు, సాహిత్యం రంగరించి రాసే మమతల లేఖలు, సోమరి ఉదయాల్లో పోస్టమేన్ కోసం ఎదురుచూపులు.. చిత్త జీవితం కడవరకూ సాగిపోయిందిలా.
చిత్తప్రసాద్ స్నేహశీలి. దేశంలోనే కాదు నానా దేశాల్లో బోలెడు మంది మిత్రులు. డెన్మార్క్ వామపక్ష కవి ఎరిక్ స్టీనస్, చెకొస్లవేకియా ఇంజినీరు ఇంగ్ ఫ్రాంటిసెక్ సలబా, ప్రాగ్ లోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మిలోస్లావ్ క్రాసా, సీపీఐ కార్యకర్త తారా యాజ్ఞిక్, ఆమె భర్త, పిల్లలు, పీసీ జోషి సహచరి కల్పనా దత్తా, బెంగాల్ కరువును, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కెమెరాలో బంధించిన సునీల్ జనా, లక్నో ‘బ్రదర్’ మురళీ గుప్తా, ఎంఎఫ్ హుస్సేన్.. ఇలాంటి కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో చిత్త కలసి తిరిగేవాడు. వీళ్లలో చాలామంది కలిగినవాళ్లు. చిత్త నోరు తెరిచి అడగాలేకానీ వేలు గుమ్మరించగలవాళ్లు. కానీ చిత్త ఎన్నడూ అలా గుమ్మరించుకోలేదు. చిత్తకు కొండంత అత్మాభిమానమని, డబ్బు సాయం చేస్తామంటే చిన్నబుచ్చుకునేవాడని, జాలిపడితే కోపగించుకునేవాడని మిత్రులంటారు.
‘నేను తొలిసారి చిత్త లినోకట్లు చూడగానే ముగ్ధుడిని అయిపోయాను. వాటిలో మతగాథల బొమ్మలు కాకుండా సాదాసీదా బతుకు, పేదల బాధలు ఉన్నాయి. ఇక అప్పట్నుంచి ఏ వారాంతమూ నేను అతన్ని విడిచి ఉండలేదు. అతని గదికి వెళ్లేవాడిని, లేకపోతే మా ఇంటికి పిలిచేవాడిని. కానీ అతడు దుర్భర పేదరికంతో బాధపడుతున్నాడని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని చాలా నెలల తర్వాత తెలిసింది. ఆత్మాభిమానంతో అతడు ఆ సంగతిని బయటపడనివ్వలేదు. తన బొమ్మలను నాకు అమ్మడానికీ ప్రయత్నించలేదు. నేనే అతని పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని బొమ్మలను కొనడానికి ప్రయత్నించేవాడిని. కానీ అతడు మొండివాడు. బొమ్మల ఖరీదు చెప్పకపోవడంతో పెద్ద చిక్కొచ్చేది. అందుకే నాకు తోచినంత చ్చేవాడిని. అతని జేబులో కాసిని డబ్బులు కుక్కడానికి నానా యాతనా పడేవాడిని.. కొన్నిసార్లు తలప్రాణం తోకకొచ్చేది. డబ్బుసాయంతో మన స్నేహాన్ని కించపరుస్తావా అని కేకేలేసేవాడు..’ అని చెప్పాడు మిత్రుడు సలబా.
‘డబ్బు సంపాదించడానికే బాంబేకి వచ్చి ఉంటే ఎప్పుడో సంపాదించి ఉండేవాడినమ్మా. మార్కెట్ ప్రకారం నడిచే ఉద్యోగాలు నాకు సరిపడవు కనుకే ఉద్యోగం చేయలేదు… చాలామంది కేవలం పెయింటింగులు వేసే మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బాంబేల్లో ఇళ్లు, కార్లు కొనిపడేస్తున్నారు. దీని వెనక ఉన్న మతలబు ఏంటంటే, ధనికులకు తగ్గట్టు మారిపోవడం, ఆత్మగౌరవాన్ని మంటగలుపుకోవడం, కళాసృజనలో దగా చేసుకోవడం. నాకు ఆ దారి తొక్కాల్సిన అగత్యం లేదు..’ అని తల్లికి రాశాడు చిత్త. అతని మదినిండా బొమ్మలు.. బొమ్మలు.. అవికూడా బాధల పాటల పల్లవిని వినిపించే గాఢమైన నలుపుతెలుపు బొమ్మలు..  ఆ బొమ్మలతోనే తను బతకాలి. బొమ్మల్లో రాజీపడకూడదు. కానీ వాటితోనే బతకాలి. ఎంతొస్తే అంత. చేతికష్టంతో నిజాయితీగా బతకాలి. ముంబై పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ కు, బెంగాల్, డెన్మార్క్, చెకొస్లవేకియాల్లోని పబ్లిషింగ్ కంపెనీలకు బొమ్మలు వేశాడు. బాంబేలోని లిటిల్ బ్యాలే ట్రూప్ కు స్క్రీన్లు, క్యాస్ట్యూములూ అందించాడు. బిమల్ రాయ్ కళాఖండం ‘దో బీగా జమీన్’ సినిమాకు లోగో వేశాడు. 1958లో ఎవరో అడిగితే పాల్ రాబ్సన్ జయంతికి నిలువెత్తు పెయింటింగ్ వేశాడు. ఏది వేసినా తనకిష్టమైందే వేశాడు.
struggle
చిత్త వర్ణచిత్రాలు కూడా అతని లినోకట్లంత శక్తిమంతంగా ఉంటాయి. 1938నాటి స్వీయచిత్రంలో ఆలోచనామగ్నుడై కనిపిస్తాడు(ఈ చిత్రం ఈ వ్యాసం తొలిభాగంలో ఉంది). పార్టీ పరిచయాల్లోకి వస్తున్న ఆ యువకుడి ముఖంలో, నేపథ్యంలో అరుణకాంతి అలుముకుపోయింది. వర్ణచిత్రాల్లోనూ అతడు శ్రమైక జీవన సౌందర్యానికే పట్టంగట్టాడు. పోరాటాలనే కాకుండా సంతాల్, కాశ్మీరీ అతివల నృత్యాలను, బాంబే రేవు పడవలను, నగర శివార్లలోని పచ్చిక బయళ్లనూ పరిచయం చేశాడు. చిత్త రంగుల ఆడాళ్ల బొమ్మలు క్యూబిజం, ఫావిజం ప్రభావాలతో పికాసో, మతీస్ లను గుర్తుకుతెస్తాయి. కానీ ఆ మనుషుల హావభావాల్లో అసలుసిసలు భారతీయ ఉట్టిపడుతుంటుంది. చిత్త పంటపొలాలు, పూలగుత్తుల బొమ్మలు అతనివని తెలుసుకోకుండా చూస్తే వ్యాన్గో వేసిన చిత్రాలేమో అనిపిస్తుంది. కానీ చిత్తకు తాను వ్యాన్గోను కానని తెలుసు. ‘నా గురించి నేను ఎక్కువ ఊహించుకుంటున్నానని నువ్వు పొరపడొద్దు మిత్రమా! నేనందుకు పూర్తి భిన్నం. నేను వ్యాన్గో అంత ప్రతిభావంతుడిని కానన్న సంగతి అందరికంటే నాకే బాగా తెలుసు. కాను కనుకే నా జీవితం, మనసూ ఈ దేశ విప్లవపోరాటాల్లో నిమగ్నమైపోయాయి..’ అంటూ మురళికి తనను ఆవిష్కరించుకున్నాడు.
1950 దశకం మధ్యలో చిత్త పపెట్ షోలపై మళ్లాడు. వ్యాపారంపై బాంబేకి వచ్చిన చెక్ మిత్రుడు సలబా పపెట్ షోలు వేస్తుండేవాడు. చిత్తకూ నేర్పాడు. తన దేశానికి వెళ్లిపోతూ పపెట్ సామగ్రినంతా చిత్తకు ఇచ్చేశాడు. చిత్త కూడా కొబ్బరి చిప్పలు, గుడ్డపేలికలు వంటి వాటితో కీలుబొమ్మలు(పపెట్స్) సొంతంగా తయారు చేసుకున్నాడు. తన ట్రూప్ కు ‘ఖేలాఘర్’ అని పేరుపెట్టుకున్నాడు. షోల కోసం కథలూ, పాటలూ రాసుకున్నాడు. ఈ బొమ్మలాట కోసం చుట్టుపక్కలున్న మురికివాడల పిల్లలు చిత్త చుట్టూ మూగేవాళ్లు. చిత్త వాళ్లకు కూడా బొమ్మలాడించడం నేర్పాడు. వాళ్లకు కథలు వినిపిస్తూ ఆ బొమ్మలు ఆడించి, నవ్వుల్లో తేలించేవాడు. వచ్చే కాస్త డబ్బునూ ఈ షోలకు ఖర్చుపెట్టేసి ఉత్త చేతులతో మిగిలిపోయేవాడు. ‘నా దగ్గర ఓ మంచి టేప్ రికార్డర్ ఉండుంటే ఈ షోలలో నాకింక అడ్డేముంది’ అని అన్నాడు చిత్త. అతడు తన బొమ్మలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడని అంటాడు సునీల్ జనా. చిత్త ఫొటోలు కూడా తీసేవాడు. మిత్రులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. కొండకోనల్లో మిత్రులను నుంచోబెట్టి ఫొటోలు తీసేవాడు.
puppets
చిత్త భారతదేశ చరిత్రలో కీలక ఘట్టాలను చూపుతూ బొమ్మలతో పుస్తకం తేవాలనుకున్నాడు. చాలా చిత్రాలు వేశాడు. పబ్లిషర్లు ముందుకురావడం, ముందుకొచ్చిన వాళ్లు డబ్బులివ్వకపోవడంతో ఆ పని ఆగిపోయింది. సలబా సాయం చేస్తానన్నాడు. అయితే వరదల్లో ఆ బొమ్మలు కొట్టుకుపోవడంతో చరిత్ర బొమ్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. రామాయణాన్ని బొమ్మలకెత్తే పనికూడా డబ్బు కష్టాలతో ఆగిపోయింది. రామాయణాన్ని ఒక కథలాగే చూసిన చిత్త ఆ బొమ్మలను చాలా సరళంగా, జానపద చిత్రాల శైలిలో వేశాడు. ఇన్ని కష్టాల నడుమ.. తను ఆరాధించే నందలాల్ బోస్ తన లినోకట్లను చూసి మెచ్చుకోవడం, మురికివాడల పిల్లలకు చిట్టిపొట్టి కథలు చెప్పించి నవ్వించడం, ఆడించడం వంటి అల్పసంతోషాలూ ఉన్నాయి.
పార్టీకి దూరమై ఇలాంటి ఎన్ని కళావ్యాసంగాల్లో మునిగినా రాజకీయాలు ఎప్పటికప్పుడు విశ్వరూపంలా ముందుకొచ్చి నిలిచేవి. ఇక మళ్లీ బొమ్మల్లో కార్మికకర్షకులు, రిక్షావాలాలు, విప్లవకారులు ప్రత్యక్షమయ్యేవాళ్లు.
‘జీవితాన్నిపూర్తిగా కళకు అంకింతం చేసి, రాజకీయాలను పక్కకు నెట్టాలని ఎంత బలంగా ప్రయత్నిస్తున్నానో అంత బలంగా ఈ దేశప్రజల రాజకీయాలు తిరిగి నన్ను పట్టుకుంటున్నాయి. అదంతే. కళాకారుడు మనిషి. అంతకు మించి మరేమీ కాదు. తను పుట్టినగడ్డకు అతడు బద్ధుడు. ఈ సంగతి అతనికి తెలిసినా, తెలియకపోయినా అతడు ఈ దేశజనుల జీవితంలో భాగం.. ప్రతి కళాకారుడూ త్వరగానో, ఆలస్యంగానో, తెలిసో  తెలియకుండానో తన నైతిక, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసి తీరతాడు. నైతికవాదుల, రాజకీయ సంస్కర్తల సంప్రదాయాన్ని నేను నా కళలో ఆచరించి చూపాను. ప్రజలకు అండగా నిలబడ్డమంటే కళకూ అండగా నిలబడ్డమే. కళావ్యాసంగం అంటే మత్యువును బలంకొద్దీ తిరస్కరించమే… రెండో ప్రపంచ యుద్ధం నన్ను సంప్రదాయకళల ప్రభావం నుంచి బయటికి రప్పించింది. నా కుంచెను పదునైన ఆయుధంలా తయారు చేసుకునేలా మార్చింది. నా కళా ఆశయాలు సమకాలీన ప్రపంచంతో సంలీనమయ్యాయి. కళ అనేది నా ఒక్కడి ఆయుధం, కళాకారుడి స్వీయ అభివ్యక్తి ప్రకటన సాధనం మాత్రమే కాదని, అతడు జీవిస్తున్న సంఘపు ఆయుధం కూడా అని అర్థం చేసుకున్నాను. ఆ సంఘంలో అతనితోపాటు, తోటి మనుషుల స్వీయ అభివ్యక్తులు కూడా ఉంటాయి’ అంటాడు చిత్త.
తలకిందుల వ్యవస్థపై అతని ధిక్కారం కేవలం బొమ్మలకే పరిమితం కాలేదు. ఓసారి శివసేన కార్యకర్తలు బాంబేలో బందు చేసి, అంగళ్లను మూయించడానికి చిత్త ఉంటున్న వీధికి వచ్చారు. అతడు కోపంతో వాళ్లముందుకు దూసుకెళ్లాడు. ‘ఏమిటీ దౌర్జన్యం? బందులతో జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ముందు ఇక్కన్నుంచి వెళ్లిపోండి’ అని కేకేలేశాడు. వాళ్లు నోరుమూసుకుని వెళ్లిపోయారు. మరో ముచ్చట చిత్త మాటల్లోనే వినండి. 1959లో ‘‘రక్షణమంత్రి మీనన్ ఎన్నికల ప్రచారం కోసం మా వీధికి వచ్చాడు. దేశం కోసం పనిచేయాలంటూ జనానికి అర్థం కాని ఇంగ్లిష్ లో ఊదరగొట్టాడు. ‘అయ్యా, మీరు చెప్పేది బాగానే ఉంది కానీ, ఈ గడ్డు పరిస్థితుల్లో మేమెలా పనిచెయ్యాలో చెప్పండి’ అని అడిగాను. ‘నీతో తర్వాత మాట్లాడతా’ అని చెప్పి మళ్లీ ఉపన్యాసం దంచేశాడు. తర్వాత ఓ పోలీసు ‘అతడు కమ్యూనిస్టు సర్’ అని మీనన్ కు బిగ్గరగా చెప్పాడు. మీనన్ ముఖంలో భయపు ఛాయలు. ఉపన్యాసం అయిపోయాక కారులో తుర్రుమన్నాడు..’
girl
చిత్తప్రసాద్ అంటే సంతోషంగా ఉండేవాడని అర్థం. ఈ చిత్తప్రసాద్ సార్థకనామధేయుడు కాదు. తన సంతోషాన్ని తృణప్రాయంగా ఎంచి సామాన్యుల ఈతిబాధలను బొమ్మకట్టడానికి తన బతుకును కొవ్వొత్తిలా కరిగించుకుని అసమాన కళాకాంతులు వెదజల్లాడు. మనిషి మనిషిగా బతకాలని సమసమాజ స్వప్నాల్లో పలవరింతలు పోయి తన బాగోగులను మరచిపోయాడు. ‘ప్రకృతి కోతిని మనిషిగా మారుస్తూ.. మానవజాతిని నిరంతరం పునర్నవం చేస్తోంది. అయితే మానవజాతి ఇప్పటికీ కోతిలా వ్యర్థవ్యాపకాలనే ఇష్టపడుతోంది. ఒక పనిచేసే ముందు కాస్త ఆగి, ఆలోచించే ఓపిక లేదు దానికి. దానికి అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ కావాలి.. తనకు దక్కిన దానితో అది తృప్తిడడం లేదు. ప్రతిదాన్నీ కొరికి అవతల పడేస్తోంది. గబగబా మింగింది అరగడం లేదు, అయినా నిరంతరం ఆకలే దానికి. మనిషి మనసులో అసంతృప్తి అనే అజీర్తి ఉంది. స్వార్థపరుడికి రెండే రోగాలు.. దురాశ, అసంతృప్తి.. ’ అని తల్లితో వాపోయాడు చిత్త.
నిత్యదరిద్రం, నిర్నిద్ర రాత్రులు, అనారోగ్యం, ప్రతిదానికి కలతపడిపోవడం, ఇల్లు ఖాళీ చేయాలంటూ యజమాని హెచ్చరికలు.. అన్నీకలసి చిత్తను శారీరకంగా కుంగదీశాయి. అసలు వయసుకంటే పది, పదిహేనేళ్లు పెద్దగా కనిపించేవాడు. 70వ దశకంలో తిండికి చాలా ఇబ్బందిపడ్డాడు. అదివరకు బొమ్మలకొచ్చిన డబ్బుల్లో పదోపరకో తల్లికి పంపుతుండేవాడు. ఇప్పుడు తనకే కష్టంగా ఉంది. ఆదుకునేవాళ్లున్నారు కానీ ఏనుగంత ఆత్మాభిమానం కనుక ఆకలికేకలు రూబీ టెర్రేస్ గది నుంచి బయటికి వినిపించేవి కావు. అరకొరా పనులతోనే కాలం వెళ్లబుచ్చేవాడు. డబ్బు విషయంలో చిత్త ఎంత ‘మొండివాడో’ చూడండి..
chittaprosadఓసారి ప్రముఖ కళావిమర్శకుడు, రచయిత ముల్క్ రాజ్ ఆనంద్.. చిత్త బొమ్మలను అతనికి తెలియకుండా  ఏదో విదేశీ పత్రికకు పంపాడు. అవి అచ్చయ్యాయి. చిత్తకు సంగతి తెలిసి కడిగేశాడు. ఆ పత్రిక పేరున్న పత్రిక కనుక అడిగి డబ్బులిప్పించమన్నాడు. ముల్క్ రాజ్ ‘వాళ్లివ్వరుగాని నా జేబులోంచి ఈ వంద ఇస్తున్నా, తీసుకో’ అని మనియార్డర్ పంపాడు. చిత్త తిప్పికొట్టాడు. తనకు రావాల్సింది ఐదొందలని, కక్కి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. ఇదే చిత్త చెకొస్లవేకియా పబ్లిషింగ్ కంపెనీకి మరోరకంగా షాకిచ్చాడు. ఆ కంపెనీ చిత్తతో కవర్ పేజీలు, ఇలస్ట్రేషన్లు వేయించుకుని చెక్కు పంపింది. చిత్త ఆ మొత్తాన్ని చూసి నిప్పులు తొక్కి వెనక్కి తిప్పిపంపాడు. తనకు రావాల్సినదానికంటే పదింతలు ఎక్కువిచ్చారని, తను తీసుకోనని రాసి పంపాడు. కంపెనీ తలపట్టుకుంది. తమ దేశంలోని మార్కెట్ ప్రకారమే డబ్బు ఇచ్చామని, అంతకంటే తక్కువిస్తే మోసం చేశారంటూ అధికారులు తమను ఇబ్బందిపెడతారని రాసింది. చిత్త వెనక్కి తగ్గలేదు. చివరికి అతడు బొమ్మలను వాపసు తీసుకుంటాడనే భయంతో కంపెనీ ఏవో తంటాలు పడి చిత్త అడిగిన తక్కువ డబ్బు ఇచ్చేసింది. ఇంత అమాయకుడు ఇప్పుడు తన బొమ్మలకు లక్షలు విలువకడుతున్న నేటి ఆర్ట్ మార్కెట్ ను చూసుంటే గుండెపగిలి చచ్చుండేవాడు.
చిత్త చిత్రాలను మనవాళ్లకన్నా విదేశీయులే ఎక్కువ కొన్నారు. చిత్త ఊరికే డబ్బిస్తే తీసుకోడు కనుక కొందరు బొమ్మలను వేరేవాళ్లకు అమ్మిపెడతామని చెప్పి తామే ఉంచుకుని డబ్బులిచ్చారు. అతని చిత్రాలు మన దేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ ఉన్నాయని ఒక అంచనా. అతడు బతికుండగా జరిగిన రెండే రెండు సోలో ఎగ్జిబిషన్లలో మొదటిది 1956లో చెకొస్లవేకియా రాజధాని ప్రాగ్ లోనే జరిగింది, నాటి మన తోలుమందం పాలకుల పరువు తీస్తూ. రెండోది 1964లో కలకత్తాలో జరిగింది. 1972లో చిత్త జీవితం, కళపై చెక్ దేశీయుడు పావెల్ హాబుల్ ‘కన్ఫెషన్స్’ పేరుతో 15 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. అందులో చిత్త తన కళ, రాజకీయాలు, సమాజం గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. శాంతి ఉద్యమానికి ఇది దోహదమంటూ డాక్యుమెంటరీకి వరల్డ్ పీస్ కౌన్సిల్ అవార్డు కూడా వచ్చిది.
చెకొస్లవేకియా వాసులు చిత్తను తమవాడే అన్నంతగా అభిమానించారు. చేవచచ్చిన స్వతంత్ర భారతావనిలో అతని కళకు గౌరవం దక్కకున్నా, నిత్యం పోరాటాలతో వెల్లువెత్తిన తూర్పు యూరప్ దేశాల్లో అతని బొమ్మలకు జనం గుండెల్లో దాచుకున్నారు. అతని బొమ్మలను పత్రికల్లో అచ్చేసుకున్నారు. తమ పుస్తకాలకు ఎక్కడో దేశాల అవతల ఉన్న అతన్ని వెతికిపట్టుకుని బొమ్మలు వేయించుకున్నారు. అతని కవితలను అనువదించుకుని మురిసిపోయారు. అతన్ని ఎలాగైనా తమ దేశానికి తీసుకెళ్లాలని సలబా విశ్వప్రయత్నాలు చేశాడు. చిత్తతో పపెట్ షో ఇప్పించేందుకు ప్రయత్నించాడు. క్రాసా డబ్బు సర్దాడు. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ చిత్తకు చెక్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఖర్చులు పెట్టడానికి హామీదారు కావాల్సి వచ్చింది. సలబా బాంబేలో తనకు తెలిసిన ఒకతన్ని హామీదారుగా ఉండమన్నాడు. అతడు సరేనన్నాడు.
 డాక్యుమెంట్లపై సంతకాల కోసం చిత్తను అతని దగ్గరికి పంపాడు సలబా. ఆ హామీదారు మాటల మధ్యలో ‘నా దయవల్లే నువ్వుపోతున్నావు..’ ధోరణిలో కించపరచేలా మాట్లాడ్డంతో చిత్త సర్రున అక్కన్నుంచి వచ్చేశాడు. ప్రయాణం ఆగిపోయింది. మరోసారి 1965లో చెక్ పపెట్రీ గ్రూప్ ‘రోదోస్త్’ కళాకారిణి ఇవా వోడికోవా ద్వారా ప్రయత్నించాడు సలబా. ఆమె భారత్ కు వచ్చినప్పుడు చిత్తను కలసి ప్రయాణానికి ఏర్పాట్లు, అనుమతులు అన్నీ సిద్ధం చేసింది. ఆమె ఏదో పనిపై ఇండోనేసియా వెళ్లి విమానంలో తిరిగొస్తూ కైరోలో విమానం కూలడంతో చనిపోయింది. తను చెక్ ను చూసే భాగ్యానికి నోచుకోలేదంటూ సలబాకు లేఖ రాశాడు చిత్త. సలబా చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ప్రయాణానికి అన్నీ సిద్ధమయ్యాక ప్రయాణించాల్సినవాడు లోకంలో లేకుండా పోయాడు.
1976 ప్రాంతంలో చిత్తకు బ్రాంకైటిస్ సోకింది. దాదాపు 32 ఏళ్లపాటు బాంబేలో బతికి, అక్కడి మనుషుల సుఖదుఃఖాలు పంచుకుని, వాటిని బొమ్మల్లోకి తర్జుమా చేసిన ఆ అపురూప కళావేత్తను పట్టించుకునే నాథుడే లేకపోయాడు ఆ మహానగరంలో. చెల్లి గౌరి బాంబే వచ్చి అన్నను కలకత్తా తీసుకెళ్లింది. తన దేశప్రజల ఆరాటపోరాటాలను నాలుగు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా చిత్రికపట్టి, కన్నీటి వరదలు పారించి, గుండెనెత్తురులు ఉప్పొంగించి.. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వన్ అండ్ ఓన్లీ చిత్త 1978 నవంబర్ 13న కలకత్తాలోని శరత్ బోస్ రోడ్డులో ఉన్న రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్ జనరల్ హాస్పిటల్లో 63వ ఏట పరమ అనామకంగా కన్నుమూశాడు.
1979లో ప్రాగ్ లో, కలకత్తాలో అతన్ని స్మరించుకుంటూ ఎగ్జిబిషన్లు పెట్టారు. తర్వాత ప్రాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లలో అతని బొమ్మలు ప్రదర్శించారు. 2011లో ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ అతని చాలా బొమ్మలను సేకరించి ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఎగ్జిబిషన్లు పెట్టింది.
చిత్త దేశానికి ఇచ్చినదానితో పోలిస్తే దేశం అతనికిచ్చింది శూన్యం. ‘నా పెయింటింగులను ఇంట్లో ఉంచుకోవడం నీకు కష్టమవుతుందమ్మా. వాటిని గంగానదిలో వదిలెయ్’ అని చిత్త తన చెల్లితో అన్నాడంటే ఈ దేశం అతని కళను అతడు బతికి ఉన్నప్పుడు ఎంత గొప్పగా గౌరవించిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ కరువుకు బలైన మిడ్నపూర్ లోని స్వాతంత్ర్య వీరులను తలచుకుంటూ చిత్త తన ‘ హంగ్రీ బెంగాల్’లో.. ‘నిన్న మన స్వాతంత్ర్యం కోసం తెగించి పోరాడిన దేహాలను ఇప్పుడు కుక్కలు, రాబందులు పీక్కుతుంటున్నాయి. ఒక దేశం తన యోధులకు అర్పించే నివాళి ఇదేనా?’ అని ఆక్రోశించాడు.
చిత్త చరిత్రను, అని ప్రజాకళాసంపదను కన్నెత్తి చూడదల్చుకోని నేటి మన పేరుగొప్ప ప్రజాస్వామ్య పాలకులు అతనికి అర్పిస్తున్న నివాళి అంతకంటే ఘనంగా ఉందా? రవీంద్రనాథ్ టాగూరు వందో జయంతినే కాకుండా 150వ జయంతినీ కోట్లు ఖర్చుపెట్టి జరుపుకుని, అతని ‘వెర్రిమొర్రి’ బొమ్మలను దేశమంతటా తిప్పారు మూడేళ్లకిందట యూపీఏ పాలకులు. దేశజనుల బాహ్యాంతరంగాలను, దారిద్ర్యాన్ని, మౌనవేదనను ఉట్టిపడే భారతీయతతో అనితరసాధ్యంగా వర్ణమయం చేసిన అమృతమూర్తి అమృతా షేర్గిల్ శత జయంతి పండుగను అతిజాగ్రత్తగా మరచిపోయారు. అమృత బొమ్మలకంటే ప్రమాదరకమైన బొమ్మలు సంధించిన చిత్త వందో జయంతిని అతడు నరనరానా ద్వేషించిన నాగపూర్ నాజీ పాలకులు పట్టించుకుంటారనుకోవడం భ్రమ.
blue flowers
చిత్త పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. బడుగుజీవుల సుఖసంతోషాల కోసం తపనపడ్డాడు. తన కళతో వాళ్ల కన్నీరు తుడిచి, వాళ్లతో జెండాలు, బందూకులు పట్టించి దోపిడీపీడకుల గుండెలపైన కదం తొక్కించాడు. చిత్త ఆదర్శాలు, విలువలు ఏమాత్రం ‘గిట్టుబాటు’ కాని వ్యవహారాలు కనుక అతనికి వారసులు లేరు. ‘భారత్ లో గ్రాఫిక్ కళలు, ఇప్పటికీ నిరాశాపూరితంగా, బలహీనంగా ఉన్నాయి. ప్రచారం, ఆదర్శాల వంటివాటిపై కళాకారులు మొగ్గుచూపకపోవడం కారణం కావచ్చు’ అని చిత్త 1958లో అన్నాడు. నేటికి తేడా ఏమైనా ఉందా? చిత్త రాజకీయ విశ్వాసాలు, వాటిపట్ల అతని నిబద్ధత వల్లే అతనికి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ‘మెయిన్ స్ట్రీమ్ ఆర్ట్’ లో ఎన్నడూ చోటు దక్కలేదు.
చిత్త కలలు ఇంకా ఫలించలేదు. ఆన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం, కరువంటూ కాటకమంటూ కనుపించని కాలాలు చాలా చాలా దూరంలో ఉన్నాయి. లినోలపై, కేన్వాసులపై చిత్త గొంతుచించుకుని శఠించిన దుర్మార్గాలు, దోపిడీపీడనలు ప్రజాస్వామ్యం, దేశభక్తి ముసుగుల కింద కోట్లరెట్లు పెచ్చరిల్లి జనాన్ని కాల్చుకుతింటున్నాయి. ఆనాడు ఒక్క బెంగాల్లోనే కరువైతే, నేడు దేశమంతా తిండిగుడ్డనీడల కరువులు. ‘96 కోట్ల సెల్ ఫోన్లు’,   అధికారిక దొంగలెక్కల ప్రకారమే 40 కోట్ల మంది నిత్యదరిద్రులు ఉన్న ఘన భారతావనిలో ఈ కరువులతో నల్ల, తెల్ల కుబేరులను బలుపెక్కిస్తూ మన జీడీపీ, తలసరి ఆదాయం తెగ వాచిపోతున్నాయి. చిత్త తుపాకులు, గొడ్డళ్లు ఎక్కుపెట్టిన విదేశీగద్దలు నల్లదొరల ఆహ్వానాలతో మందలుమందలుగా ఎగిరొచ్చి మాయారూపాల్లో ఈ గడ్డ సరిసంపదలను తన్నుకుపోతున్నాయి.
అతడు తిరుగాడి బొమ్మలు వేసిన బెజవాడ నేలతల్లిని ‘రాజధాని’ మంత్రగాడు చెరపట్టాడు. చిత్తను రగిలించి, మురిపించిన సాయుధపోరుసీమలో నయా నిజాంలు తుపాకుల అండతో కొత్త గడీలు కడుతున్నారు. నైజాము సర్కరోన్ని గోల్కండా ఖిల్లా కింద గోరీ కడతామని యుద్ధగీతికలతో గర్జించిన ప్రజాకవుల, కళాకారుల వారసులు పెరుగన్నం కోసం కొత్త నిజాం పంచన చేరి అతన్ని స్తోత్రపాఠాలతో ముంచెత్తుతూ మహోన్నత పోరాట వారసత్వాన్ని పెంటకుప్పలో బొందపెడుతున్నారు. చిత్త ద్వేషించిన నిరంకుశ, స్వార్థకపటాల క్రీనీడలు మరింత ముదిరి మదరిండియా అంతటా గాఢాంధకారం అలుముకుంది.
మరి ఈ చీకటి తొలగిపోదా? అడుగు కదిపితే చాలు కత్తులు దూసి నెత్తురోడిస్తున్న ఈ తిమిరానికి అంతం లేదా? చిత్త తన నిశాగంధి(‘నైట్-కాక్టస్) కవితలో ఏమంటున్నాడో వినండి..
‘ఈ కటికచీకటి రాత్రి కదలబారుతుంది
అంతవరకు నేనిక్కడ చేయాల్సిందొకటే
ఈ తిమిరాన్ని వెలిగించి
పరిమళాలతో ముంచెత్తడం.. ‘
*

No comments:

Post a Comment