Thursday, 15 January 2015

కళాస్వాదన


సాయంత్రం ఐదుగంటలు. వరండాలో కూచుని పేపర్ చదువుకుంటున్నాను.
‘ఈ ఆధునిక కళ కొరకరాని కొయ్యండి. ఒక పట్టాన అర్థం కాదు’,  గోపాల్రావు కుర్చీలో కూచుంటూ అన్నాడు.
అతగాడు న్యూస్ పేపర్ కోసం వచ్చాడు. నేరుగా అడిగితే బావుండదని ఈ ఉపోద్ఘాతం.  
‘మరే, మనిళ్ల ముందు వేసే ముగ్గులు మటుకు మీకర్థం అవుతున్నాయా?’ పండగ ఉత్సాహంలో నేనూ అడిగాను, కొంటెగా. అతడు ఆ సంగతి కనిపెట్టలేదు.
‘మహాచక్కగా అర్థం అవుతున్నాయి. గుమ్మడికాయలు, చిలకలు, తీగలు.. అర్థం కానిదేముంది?’ అన్నాడు.
గోపాల్రావు ఇటీవల ఆర్ట్ నేర్చుకుంటున్నాడు. వీధి మొగదల కొత్తగా పెట్టిన ఆర్ట్ స్కూల్లో రోజూ రెండు గంటలు డ్రాయింగు, పెయింటింగు వేస్తున్నాడు. పికాసో, డాలీ వగైరాల పేర్లు గడగడా చెబుతున్నాడు. నాకేమో కళ గురించి బొత్తిగా తెలియదు. మెయిన్ పేపరు తీసి అతనికిచ్చాను. ఆడాళ్ల పేజీలోని సంక్రాంతి ముగ్గువంక తదేకంగా చూసి తలాడించాడు.
‘మనవాళ్లు వొట్టి వెధవాయిలోయ్ అని గిరీశం ఊరకే అన్లేదండి. మనం మనవాళ్ల ప్రతిభను గుర్తించలేని దద్దమ్మలం. చూడండి, ఈ ముగ్గులో రంగులు ఎంత గొప్పగా, కాంతిగా ఉన్నాయో. మాతిస్, మార్క్, మానే, మోనే తతిమ్మా వాళ్లందరూ ఈ ముగ్గేసినావిడ ముందు దిగదిడుపు..’ అన్నాడు.
‘వాళ్లెవరు? ఆడాళ్లా, మగాళ్లా?’ బుర్రగోక్కుంటూ అడిగాను.
గోపాల్రావు కురుక్షేత్రంలో అమాయక ప్రశ్నలడుగుతున్న అర్జునుని వంక కృష్ణపరమాత్మ చూసినట్టు చూశాడు.
‘అందుకే మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని అనింది. వాళ్లెవరంటే మహా కలరిస్టులు. రంగుల్లో ఆరితేరారు’
‘ఏమో బాబూ నాకవన్నీ తెలియవు. మన కళాభిరుచి సినిమా పోస్టర్లను దాటదు’ అన్నాను వినయంగా.
గోపాల్రావు జేబులోంచి రెండు కాయితాలు తీశాడు. మడతలు పెట్టి ఉన్నాయి. మొదటి బొమ్మను విప్పి టేబుల్ పైన పరిచాడు.  ఆ  బొమ్మ ఇదీ.. 

దీన్ని పాలస్ పాటర్ అనే డచ్చి పెయింటర్ 1647లో వేశాడని చెప్పాడు గోపాల్రావు. అంతకుమించి మరేమీ చెప్పలేదు.
ఎందుకు ఈ బొమ్మ చూపాడో నాకర్థం కాలేదు. ఎద్దు, ఆవు, గొర్రెలు, మేఘాల ఆకాశంలో పక్షి.. చాలా బావుందన్నాను మెచ్చుకోలుగా.
గోపాల్రావు ఉత్సాహంతో రెండో బొమ్మనూ విప్పి టేబుల్ పై పరిచాడు. అది ఇదీ.

తమాషాగా అనిపించింది. తొలి బొమ్మను చూస్తున్న ఆవు బొమ్మ ఇది. ఏదో మెల్లగా అర్థమవసాగింది.
గోపాల్రావు ముసిముసిగా నవ్వుతున్నాడు. నన్ను ఎగతాళి చేస్తున్నాడని అర్థమవుతోంది కానీ మాట పెగల్లేదు.
గోపాల్రావుకు మాత్రం మాటలు తన్నుకొస్తున్నాయి.
‘ఈ ఆవు బొమ్మను మార్క్ టెన్సీ అనే అమెరికా పెద్దమనిషి వేశాల్లెండి, 1981లో.  తొలి బొమ్మలోని ఆవును, ఎద్దును ఈ ఆవు గుర్తుపడుతుందా లేదా అని కళానిపుణులు పరీక్ష పెడుతున్నారు.  అదుగో,  ఆ కుడి పక్కనున్న పెయింటింగు మోనే అనే ఇంప్రెషనిస్టు వేసింది. మన బతుకున్న ఆవు ఒకవేళ ఆ జంతువుల బొమ్మ వైపు వెళ్లకుండా, మోనే బొమ్మవైపు వెళ్తుందా అని కూడా మరో టెస్టు. మన ఆవు ఈ ట్విస్టులు, కళాగిళా ఏమీ పట్టించుకోకుండా కేన్వాసులను తినడానికి ఎగబడినా, లేకపోతే  పేడా గీడా వేసేందుకు సిద్ధమయినా అదిలించి, వెళ్లగొట్టడానికి ఒకాయన కర్ర పుచ్చుకుని సిద్ధంగా ఉన్నాడు. కానీ చిత్రంగా మనావు అల్లరి చేయకుండా ఎంచక్కా కళాస్వాదన చేస్తోంది చూడండి. అందుకే పెద్దలన్నారు శిశుర్వేత్తి, పశుర్వేత్తి.. ’
‘అది గానం గురించి అన్నారండి..’
‘చిత్రకళ మాత్రం గానం కాదటండీ.. రంగులు రాగాలు కావా? గీతలు గేయాలు కావా?..’ గోపాల్రావు యతిప్రాసలతో రెచ్చిపోతున్నాడు.
ఇంతలో ఓ ఆవు నిజంగానే వరండాలోకి దూసుకొచ్చింది. పండక్కు కట్టిన మావిడాలను తినడానికి ఎగబడింది. నేను కుర్చీలోంచి లేచి అదిలించాను. అది ఆకులను వదిలేసి గోపాల్రావు చేతిలోంచి న్యూస్ పేపర్ ను నోటితో చటుక్కున లాక్కుంది. గోపాల్రావు జంకకుండా పేపర్ను వెనక్కి గుంజాడు. ఆవు అతడు టేబుల్ పై పరచిన రెండు బొమ్మలనూ అమాంతంగా నాలిక చాచి ఒకటేసారి గుటుక్కుమనిపించింది.
‘నా సంగతేమోకానీ ఈ ఆవుకు మాత్రం  కళాపోసన మాబాగా తెలుసండి..‘ అన్నాను గోపాల్రావుతో.
-వికాస్













No comments:

Post a Comment