Saturday, 17 October 2015

అతిశయోక్తి అందాలు


మొక్కపాటి కృష్ణమూర్తి చెప్పిన వ్యాన్గో కథ





తెలుగు కుంచె సత్తా చాటిన మొక్కపాటి కృష్ణమూర్తి(1910-1962) చిత్రకారుడు మాత్రమే కాదు, కవీ, కళావిమర్శకుడు కూడా. ఆయన పద్యాలు, కళావిమర్శ వ్యాసాలు భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో వచ్చేవి. విన్సెంట్ వ్యాన్గోపై మొక్కపాటి రాసిన ఈ వ్యాసం 1960 జనవరి భారతి సంచికలో వచ్చింది. దీనికి ఇర్వింగ్ స్టోన్ ‘లస్ట్ ఫర్ లైఫ్’ నవల ఆధారమని గట్టిగా చెప్పొచ్చు. ఈ వ్యాసం కూడా నవల్లోని క్రమంలో సాగుతుంది, స్టోన్ కల్పించిన కొన్ని సన్నివేశాలతో సహా. 










Friday, 16 October 2015

లేపాక్షి కళాస్వాదనలో గాడిచెర్ల


గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

గాడిచెర్ల హరిసర్వోత్తమరావు(1883-1960) కలం బలంతో బ్రిటిష్ వాడి గుండెల్లో నిద్రపోయిన సింహం. ఒక వ్యాసానికి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. స్వరాజ్య పత్రిక తో సమరనాదం చేశాడు. ఆ గాడిచెర్ల ఆంధ్రుల కళాపీఠం లేపాక్షిపై చేసిన రేడియో ప్రసంగం ఇది. ఇది భారతి పత్రిక 1941 నవంబర్ సంచికలో వచ్చింది. దీనికి ఇప్పటి కలర్ ఫొటోలు జత చేస్తున్నాను. మధ్యలో నా సొద కూడా కాస్త.. నేను 2003-005 మధ్య  పనిపై లేపాక్షికి మూడు నాలుగుసార్లు వెళ్లాను. పని సంగతేమో కానీ ఆ బొమ్మలను, ఆ మహా నందిని చూడ్డంతోనే సరిపోయింది.











Thursday, 15 October 2015

పల్లవుల చిత్రసంపద


ఇప్పటి తెలుగు వార, మాస పత్రికల్లో ఆర్ట్ విషయాలు కళ్లుచించుకున్నా కనబడవు కాని,  70, 80 ఏళ్ల కిందట అంటే 1930, 1940ల దశకాల్లో భారతి, ఆంధ్రపత్రిక వంటి ప్రసిద్ధ పత్రికలే కాకుండా చిన్నపాటి పత్రికల్లోనూ లలితకళలపై చాలా వ్యాసాలు వచ్చేవి. క్యూబిజం, సర్రియలిజాల గురించి 1920లలోనే వివరించిన కళావిమర్శా చరిత్రి తెలుగువాళ్ల సొంతం. ఇప్పడదంతా గతం. కానీ ముందుకు వెళ్లాలంటే వెనక్కి తిరిగి ఒకసారి గతాన్ని చూడాలి. ఆ ప్రయత్నమే ఇది. పల్లవుల చిత్రకళ గురించి కో. రామమూర్తి రాసిన ఈ వ్యాసం 1949 భారతి నవంబరు సంచికలో వచ్చింది. తమిళనాడులోని పనమలైలో ఉన్న కుడ్యచిత్రాల గురించి ఆయన చెబుతున్నారు. దీనికి నెట్ లోంచి కలర్ ఫొటోలు తీసి జతచేస్తున్నాను. పనమలై చిత్రాలకు అజంతా చిత్రాలు దగ్గరగా ఉన్నాయి చూండడి.(ఇమేజ్ లపైన క్లిక్ చేసి సేవ్ చేసుకుని చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి.. ఆసక్తి ఉంటే..)



పనమలైలోని పార్వతి చిత్రం

పనమలై పార్వతి
అజంతా వయ్యారి 

Monday, 12 October 2015

కవి వట్టికోట ఆళ్వారుస్వామి!

కవి వట్టికోట ఆళ్వారుస్వామి!


‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి రచయిత, ఉద్యమకారుడు, ప్రచురణ కర్త.. మరెన్నో. కానీ ఆయన చక్కని కవి కూడా అన్న సంగతి ఇటీవలే తెలిసింది. ‘బృందావని’ పక్షపత్రిక(16.5.1954) సంచికలో వచ్చిన ఈ కవితను చూశాక సంభ్రమాశ్చర్యంతో పొంగిపోయాను. ప్రజల మనిషి కన్ను సాలార్జంగ్ కళానిలయంపై ప్రసరించడం ఒక కళాభిమానిగా నాకు తెగనచ్చేసింది.
‘సాలార్జంగ్ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం..‘ అంటూ వట్టికోట కళాతత్వం గురించి ఏం చెబుతున్నాడో కళాసాహితిలో చూడండి. ఈ చారిత్రక రికార్డును వెలికి తీసిన ఘనత నాదేనన్న వినయగర్వంతో షేర్ చేస్తున్నాను..