17వ
అధ్యాయం
ఒరైలన్ల తండా పొలిమేర దాటగానే కకంబో తన యజమానికి మార్గదర్శనం చేశాడు.
‘‘ఈ కొత్త ప్రపంచం పాతదానికంటే ఏమంత మంచిగా లేదు. వీలైనంత త్వరగా
అడ్డదారిలోపడి తిరిగి యూరప్ చేరుకుందాం.’’
‘‘కానీ మనం అక్కడికి ఎలా వెళ్లాలి? అసలు ఎక్కడికని వెళ్లాలి? తిరిగి మా దేశానికి వెళ్లామనుకో, అక్కడ బల్గర్లు, అబర్లు గొంతులు కోసుకుంటున్నారాయె.
పోర్చుగల్‌కు పోదామా అంటే, నన్నక్కడ బతికుండగానే తగలబెడతారు. ఇక ఎక్కడికీ పోకుండా ఇక్కడే ఉండిపోదామా
అంటే వీళ్లు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని దారుణంగా చంపేస్తారు. ఏదేమైనా క్యూనెగొండ్ ఉన్న
ఈ గడ్డను విడిచి నేనెక్కడికి పోగలను చెప్పు?’’
‘‘మరైతే కేనీకి వెళ్దాం. అక్కడ ఫ్రెంచి దేశదిమ్మర్లు కొందరుంటారు. మనకేదైనా
సాయం చేస్తారు. దేవుడు మనల్ని కరుణిస్తాడు.’’
అయితే కేనీకి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. వాళ్లకు అసలు దారే
తెలియదు. ఎటు వెళ్లినా కొండలో, నదులో, వాగులో, లోయలో మరేదైనా ఉపద్రవవెూ అడ్డొస్తాయి. బందిపోట్లూ అడ్డుకోవచ్చు. వాళ్ల
గుర్రాలు అలసటతో అప్పటికే చచ్చిపోయాయి. తిండి కూడా అయిపోయింది. నెలపాటు అడవిలో ఆకులలములు,
కందమూలాలు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. చివరికి ఓ నది ఒడ్డుకు చేరుకోగలిగారు.
దాని ఇరు తీరాలూ కొబ్బరిచెట్లతో పచ్చగా కళకళలాడుతున్నాయి. ఇద్దరి ప్రాణాలు
తెప్పరిల్లుకున్నాయి. ఉత్సాహమూ ఉరకలెత్తింది.
ఆ ముసలమ్మ మాదిరి చక్కని సలహాలు ఇచ్చే కకంబో మళ్లీ దారి చూపాడు.
‘‘ఇక మనం ఒక్క అడుగు కూడా ముందుకేయలేం. ఇప్పటికే చాలా దూరం నడిచాం.
ఒడ్డున ఓ పడవ కట్టేసి ఉంది. దాన్నిండా కొబ్బరికాయలు వేసుకుని ప్రవాహం వాలులో పడి వెళ్లిపోదాం.
నది ఎప్పుడూ జనావాసాలకే తీసుకెళ్తుంది. అక్కడ సంతోషించదగ్గదేదీ లేకపోయినా కనీసం
కొత్తదాన్నయినా చూస్తాం కదా!’’
‘‘సరే, అలాగే వెళ్దాం. భారమంతా ఆ దేవుడిదే.’’
ఆ ప్రవాహం వాళ్లను చాలా మైళ్ల దూరం వెూసుకెళ్లింది. దాని తీరం కొన్నిచోట్ల
మెత్తగా, రకరకాల పూలతో కనువిందుగా.. మరికొన్నిచోట్ల
రాళ్లురప్పలతో దయనీయంగా, భయంకరంగా ఉంది. నది పోయేకొద్దీ పొయేకొద్దీ వెడల్పవుతూ
చివరకు ఆకాశాన్ని తాకే భీకరమైన కొండల కిందున్న గుహలో అంతుబట్టకుండా మాయమైంది. పడవ
కొండల కిందనుంచి పోతున్నా ప్రయాణికులు గుండైధైర్యంతోనే ఉన్నారు. నది ఉన్నట్టుండి
మళ్లీ సన్నబడింది. భయంకరమైన వేగంతో హోరుమంటూ వాళ్లిద్దర్నీ గుంజుకుపోతోంది.
ఒకరోజు గడిచాకగానీ పగటికాంతి కనిపించలేదు. కానీ పడవ అప్పటికే బండలకు గుద్దుకుని
ముక్కచెక్కలైంది. ఇద్దరూ బండలు పట్టుకుని పాక్కుంటూ మూడు మైళ్లు దాటారు. తర్వాత
విశాలమైన మైదానంలో అడుగుపెట్టారు. చుట్టూ దుర్భేద్యమైన కొండలున్నాయి. అక్కడ రైతూ, రైతుకూలీ ఒకే మాదిరి తీరికలేకుండా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కటీ కనుల
పండువలా ఉంది. దారులు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. ఖరీదైన సామగ్రితో చేసిన ధగధగలాడే అందమైన బండ్లు కనిపించాయి. వాటిని గుర్రాలంత ఉన్న ఎర్ర
గొర్రెలు (లామాలు) జాతిగుర్రాలకంటే వేగంగా లాగుతున్నాయి. వాటిలో అసమాన
సౌందర్యవంతులైన స్త్రీపురుషులు కూర్చుని
ఉన్నారు.
‘‘ఇది వెస్ట్ ఫాలియాకంటే మంచి దేశంలా ఉంది’’ కాండీడ్ దగ్గర్లోని
పల్లెవైపు నడుస్తూ అన్నాడు.
వాళ్లు గ్రామంలో ముందుకు సాగుతుండగా కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపించారు.
అందరూ బంగారు జలతారు బట్టలు వేసుకున్నారు. ఆగంతకులు వాళ్లను కళ్లార్పకుండా చూశారు.
ఆ పిల్లల ఆటవస్తువులు గుండ్రంగా ఉండి జిగేల్మని మెరిసిపోతున్నాయి. కొన్ని
పసుప్పచ్చ,
ఆకుపచ్చ, ఎర్రరంగుల్లో ఉన్నాయి. బాటసారులు ఆసక్తి అణచుకోలేక వాటిలో కొన్ని
తీసుకుని పరిశీలించారు. అవి బంగారు గుండ్లూ, పచ్చలూ, కెంపులూ. వాటిలో అతి చిన్నది
కూడా మొగల్ సింహాసనానికే వన్నెతెచ్చేలా ఉంది.
‘‘వీటితో ఆడుకుంటున్నారంటే ఈ పిల్లలు నిస్సందేహంగా ఈ దేశ రాకుమారులే
అయ్యుంటారు’’ కకంబో అన్నాడు.
ఇంతలో ఆ గ్రామ బడిపంతులు ఆ పిల్లల్ని తిరిగి బడిలోకి తీసుకెళ్లడానికి
వచ్చాడు.
‘‘ఆయన కచ్చితంగా రాచబిడ్డలకు విద్య నేర్పే గురువే అయ్యుంటాడు’’ కకంబో
అన్నాడు.
పిల్లలు ఆటలు కట్టిపెట్టి ఆటవస్తువులను, బొమ్మలను నడివీధిలో ఎక్కడున్నవాటిని అలా వదిలేసి వెళ్లిపోయారు.
కాండీడ్ వాటిని జాగ్రత్తగా ఏరుకుని గబగబా బడిపంతుల వద్దకు వెళ్లి, వీలైనంతగా వంగి దండం పెట్టి..
‘‘రాచబిడ్డలు ఈ విలువైన వస్తువులను మరచిపోయార’’ని చెప్పి చేతికందించాడు. బడిపంతులు
నవ్వేసి, వాటిని నేలపైన విసిరిపారేశాడు.
కాండీడ్‌ను ఒక క్షణం ఆశ్చర్యంతో తేరిపార చూసి వెళ్లిపోయాడు.
కాండీడ్, కకంబోలు బంగారు గుండ్లను, పచ్చలను, కెంపులను ఒక్కటి కూడా వదలకుండా ఏరుకున్నారు.
‘‘మనమిప్పుడు ఎక్కడికెళ్లాలి? ఈ రాకుమారులు బంగారాన్ని,రత్నాలను ఇలా తృణీకరిస్తున్నరంటే వీళ్లను
చక్కగా పెంచుతున్నట్టే లెక్క’’ కాండీడ్ నమ్మకంగా అన్నాడు. కకంబో కూడా యజమాని
మాదిరే విస్మయం నుంచి తేరుకోలేకపోతున్నాడు.
తర్వాత ఇద్దరూ ఆ గ్రామంలోనే పెద్దదైన ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇది
యూరప్‌లోని ధనికుల భవనంలా ఉంది. ద్వారం వద్ద జనం బిలబిలలాడుతున్నారు. లోపల అంతకంటే
ఎక్కు మంది ఉన్నారు. శ్రావ్యమైన సంగీతం వినిపిస్తోంది.
కమ్మని వంటకాల వాసనలు గుప్పుమంటున్నాయి. కకంబో ద్వారం వద్దకు వెళ్లాడు. పెరూ భాష
వినిపించింది. అది అతని మాతృభాష. కకంబో అర్జెంటీన్ పల్లెలో పుట్టాడని మీకు
గుర్తుండే ఉంటుంది. అక్కడ ఆ భాష తప్ప మరొకటి మాట్లాడరు.
‘‘ఇంతా చేసి, ఇదో సత్రం. లోపలికి పదండి. మీకు దుబాసీగా ఉంటాను’’
అన్నాడు కకంబో.
ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పరిచారకులు బంగారు
జలతారు బట్టలు వేసుకుని ఉన్నారు. జుట్టును చిన్న గుడ్డముక్కలతో బిగించి కట్టుకున్నారు.
కొత్త బాటసారులను రండిరండని లోనికి ఆహ్వానించి, బల్లముందు కూర్చోబెట్టారు. నాలుగు గిన్నెల్లో చిలక మాంసం ముక్కలతో
అలంకరించిన జావ, రెండువందల పౌండ్ల బరువుగల ఉడకబెట్టిన రాబందు, రెండు బాగా వేయించిన కోతులు, ఒక పళ్లెంలో మూడువందల పావురాలు, మరోదాంట్లో ఆరువందల హమింగ్ పక్షులు, కమ్మని మిఠాయిలను స్ఫటికను
కంచాల్లో వడ్డించారు. చెరకుతో తయారు చేసిన రకరకాల మద్యాలు పోశారు.
అతిథుల్లో చాలామంది వర్తకులు, వాళ్ల బళ్లవాళ్లూ. అందరూ ఎంతో వినయంగా ఉన్నారు. వాళ్లు కకంబోను
బుద్ధిసూక్ష్మంతో కొన్ని ప్రశ్నలు అడిగారు. అతని ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు
కూడా ఇచ్చారు.
విందు పూర్తయ్యాక కాండీడ్, కకంబోలు వీధిలో ఏరుకున్న బంగారు గుండ్లలోంచి రెండింటిని తీసి, భోజనం
ఖరీదు కింద బల్లపై పెట్టారు. ఇది చూసి సత్రం యజమానీ, ఆయన భార్యా పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వారు. కాసేపటికి ఎలాగోలా
తమాయించుకున్నారు.
‘‘అయ్యలాలారా! మీరు కొత్తవాళ్లని తెలిసిపోతూనే ఉంది. మేం విదేశీయులను
ఎరగం. అందుకే వీధిలో దొరికే ఆ చిల్లపెంకులను ఖరీదు కింద ఇవ్వబోతోంటే
నవ్వాపుకోలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. మీ దగ్గర మేం వాడే డబ్బు లేదు. అయినా
మీరు ఇక్కడ తిన్నందుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడి సత్రాలన్నీ
వ్యాపారస్తుల సదుపాయం కోసం నడుపుతున్నారు. సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది
పేదపల్లె కనక మీకు లోటుపాట్లు జరిగాయి. కానీ ఇంకెక్కడికెళ్లినా మీకు తగిన గౌరవాలు జరుగుతాయి’’ అన్నాడు సత్రం యజమాని.
ఈ సంగతులన్నీ కొకంబో సంభ్రమాశ్చర్యాలతో కాండీడ్‌కు తర్జుమా చేసి వినిపించాడు.
కాండీడ్‌దీ అదే పరిస్థితి.
‘‘ఇది ఏ దేశమై ఉంటుందబ్బా?’’ అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.
‘‘చూస్తోంటే
ఇది మిగతా ప్రపంచానికి ఏమాత్రం
తెలియని దేశమై ఉంటుందనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ మనదేశాలలకు భిన్నంగా
ఉంది కనక. బహుశా ఇది అంతా సవ్యంగా సాగిపోయే దేశం కావచ్చు. ఎందుకంటే ఇలాంటిది
ఎక్కడో అక్కడ ఉండితీరాలి కాబట్టి. మా పాంగ్లాస్ ఏం చెప్పినప్పటికీ నాకు మాత్రం
వెస్ట్ ఫాలియాలో ప్రతి ఒక్కటీ తలకిందులుగా, చెడ్డగానే కనిపించింది’’ కాండీడ్
ఆవేదనతో అన్నాడు.
18వ
అధ్యాయం
కకంబో కుతూహల దాహాన్ని తీర్చుకోవడానికి ఆ సత్రం యజమానిని ప్రశ్నలతో ముంచెత్తాడు. అయితే
అతడు మాత్రం, ‘‘అయ్యా..! నాకేమీ తెలియదు. ఇకముందూ
తెలుసుకోవాలనే ఆశేమీ లేదు’’ అని వినయంగా బదులిచ్చాడు. మళ్లీ అందుకుని, ‘‘అయితే ఇక్కడికి దగ్గర్లోనే రాజాస్థానంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న
ఓ వృద్ధుడు ఉన్నాడు. మా రాజ్యంలో ఆయనే
విజ్ఞానవంతుడు. దేన్నయినా విడమరచి చెబుతాడు. ఆయన మీ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులివ్వగలడు’’ అని చెప్పి
కకంబోను ఆ వృద్ధుడి ఇంటికి తీసుకెళ్లాడు. కాండీడ్ తన సేవకుణ్ని అనుసరించాడు. అది
చిన్న ఇల్లు. అందంగా ఉంది. తలుపు వెండిది. లోపలి గదులకు మాత్రం బంగారు తాపడం చేశారు.
నగిషీ అలంకరణలు బంగారం తాపడానికి సాటివచ్చేలా ఉన్నాయి. విశ్రాంతి మందిరంలో గోడలకు
కెంపులు, పచ్చలు పొదిగారు. ఇల్లు
బయటికెంత సామాన్యంగా ఉందో లోపల అంత వైభవంగా ఉంది.
హమింగ్ పక్షుల ఈకలతో తయారుచేసిన పాన్పుపై కూర్చుని ఉన్నాడు వృద్ధుడు. అతిథులను సాదరంగా
ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఇద్దరికీ రత్నపాత్రికల్లో స్వయంగా మధుపానీయం
అందించాడు. అతిథులు తాగేశాక, వాళ్ల సందేహాల నివృత్తికి ఉపక్రమించాడు.
‘‘నాకిప్పుడు నూటాడ్బై రెండేళ్లు. మా నాన్న రాజాస్థానంలో అశ్వశాల
అధిపతిగా పనిచేశాడు. అద్భుతమైన పెరూ విప్లవాలకు ఆయన ప్రత్యక్షసాక్షి. వాటి గురించి
నాకు కథలుకథలుగా చెప్పేవాడు. మేమున్న ఈ రాజ్యంలో ఒకప్పుడు ఇన్కా తెగవాళ్లు
ఉండేవాళ్లు. మూర్ఖత్వంతో కొత్త దేశాన్ని జయించడానికి వెళ్లి స్పెయిన్ వాళ్ల చేతుల్లో హతమైపోయారు. కొద్దిమంది పెద్దలు మాత్రం బుద్ధిగా
ఇక్కడే ఉండిపోయారు. దేశంలోని అందరి అంగీకారంతో ఇక్కడున్నవాళ్లలో ఎవరూ దేశం విడిచివెళ్లకూడదని శాసనం తీసుకొచ్చారు.
అలా మా అమాయకత్వం,
ఆనందం పదిలమయ్యాయి. స్పెయిన్
వాళ్లకు ఈ దేశం అనేది అసలుందా లేదా అనే అనుమానముంది. వాళ్లు దీనికి ఎల్డొరాడో అని
పేరు పెట్టారు. వందేళ్ల కిందట వాల్టర్ రీలీ అనే ఆంగ్లేయ పెద్దమనిషి మా పరిసరాల
వరకూ వచ్చాడు. చుట్టూ దుర్భేద్యమైన కొండలు,
వాగులు ఉండడంతో మేం యూరప్ జాతుల
దురాశాదోపిడీలకు దూరంగా ఉండిపోయాం. వాళ్లు ఇక్కడ దొరికే మట్టి, రాళ్లురప్పలంటే పడిచస్తారు, వాటికోసం మమ్మల్నందర్నీ చంపిపారేస్తారు.’’
సంభాషణ సుదీర్ఘంగా సాగింది. ఎల్డొరాడోలోని ప్రభుత్వం, స్థానిక సంప్రదాయాలు, స్త్రీలపట్ల మెలగే తీరు, పండగలూ పబ్బాలూ, కళలు ప్రస్తావనకు వచ్చాయి.
తత్వజ్ఞానమంటే చెవికోసుకునే కాండీడ్.. ఆ దేశంలో మతమేదైనా ఉందేవెూ
కనుక్కోవాలని కకంబోకు చెప్పాడు.
ముసలాయన ముఖం ఎర్రబడింది. ‘‘మతమా!’’ అని నవ్వుతూ ఆశ్చర్యపోయాడు. మళ్లీ కొనసాగిస్తూ..
‘‘ఉండకేం, ఒక మతమైతే ఉంది. ఇంతకూ మేం
కృతజ్ఞతలేని తుచ్ఛులమని భావిస్తున్నా మీరు?’’
దీంతో కకంబో మరింత వినయంగా ‘‘అయితే అయ్యా, ఆ మతమేంటి?’’ అని అడిగాడు.
ముసలాయన ముఖం మళ్లీ ఎర్రబడింది.
‘‘అయితే, రెండు మతాలుంటాయా ఏమిటీ? మానవులందరి మతమే మా మతం. మేం పొద్దున్నుంచీ రాత్రివరకు భగవంతుణ్ని ఆరాధిస్తాం.’’
‘‘మీరు ఒక్క దేవుడినే కొలుస్తారా?’’ కకంబో అడిగాడడు, కాండీడ్ సందేహాన్ని తర్జుమా
చేస్తూ.
‘‘అవును, అంతే! దేవుడొక్కడే.. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండరు. మీ విదేశీయులు ఎంత చిత్రమైన ప్రశ్నలు అడుగుతారు!’’ మళ్లీ ఆశ్చర్యపోయాడు ఆ తలపండిన
పెద్దాయన.
కాండీడ్ విసుగులేకుండా ముసలాయనకు ప్రశ్నలు సంధించాడు. ఎల్డొరాడోలో
దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తారని అడిగాడు.
‘‘మేమెప్పుడూ ప్రార్థించం. దేవుడు మాకు కావలసినవన్నీ ఇచ్చాడు కనక ఆయన్ను
ఏమీ కోరం. కానీ ఆయనకు అవిరామంగా కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం.’’
కాండీడ్‌కు వాళ్ల మతాచార్యుల్లో కొందరిని చూడాలనిపించింది.
వాళ్లెక్కడ ఉంటారో కనుక్కోమని కకంబోతో అడిగించాడు.
వృద్ధుడు నవ్వి, ‘‘మిత్రులారా! మేమంతా మతాచార్యులమే.
రాజూ, ఈ రాజ్యంలోని కుటుంబాల పెద్దలూ రోజూ పొద్దున
ఐదారువేల మంది వాయిద్యగాళ్లతో కలిసి కీర్తనలు ఆలపిస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు’’ అని వివరించాడు.
‘‘అయితే నీతులు వల్లిస్తూ, రాజ్యాలు ఏలుతూ, కీచులాడుతూ, కుట్రలు పన్నుతూ తమ అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్లను బతికుండగానే తగలబెట్టే
సాధుసన్యాసులు మీకు లేరన్నమాట!’’
‘‘అలాంటి వాళ్లే ఉంటే మేం నిజంగా మూర్ఖులమే కదా! ఇక్కడ మా అందరి అభిప్రాయాలూ
ఒకటే. మతాచార్యులంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు సుమా.’’
ఇవన్నీ విన్న కాండీడ్ పరమానందభరితుడయ్యాడు. ‘‘వెస్ట్ ఫాలియాకు, అక్కడి మా జమీందారు కోటకూ దీనికీ
పొంతనే లేదు. మా పాంగ్లాస్ ఎల్డొరాడోను చూసి ఉంటే థండర్ టెన్ ట్రాంక్ భవనం మాత్రమే
లోకంలోకెల్లా అందమైందని అనేవాడు కాదు. కనక మనుషులు దేశాటనం చేయడం చాలా అవసరమనిపిస్తోంది’’ అని అనుకున్నాడు.
ఈ సుదీర్ఘ సంభాషణ పూర్తయ్యేసరికి ఆ పెద్దాయన ఆరు గొర్రెలు పూన్చిన
బండిని సిద్ధం చేయించాడు. అతిథులిద్దరినీ రాజాస్థానానికి తీసుకెళ్లమని తన సేవకుల్లో
పన్నెండు మందికి పురమాయించాడు.
‘‘మీతోపాటు రాలేకపోతున్నందుకు మన్నించాలి. ఈ పెద్దవయసు నాకు ఆ గౌరవాన్ని
దక్కనియ్యకుండా చేసింది. రాజుగారు మిమ్మల్ని ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు.
ఒకవేళ మీకు ఈ దేశాచారాలు నచ్చకపోతే రాజుగారు మీకు తగిన గౌరవమర్యాదలు చేస్తారు’’ నొచ్చుకున్నాడు వృద్ధుడు.
కాండీడ్, కకంబోలు బండిలో కూర్చున్నారు.
గొర్రెలు వాయువేగంతో దౌడు తీశాయి. నాలుగు గంటల వ్యవధిలోనే రాజధానిలో ఓ చివర ఉన్న
రాజాస్థానానికి చేరుకున్నారు. ముందు వసారా ఎత్తు రెండు వందల అడుగులు, వెడల్పు వంద అడుగులు. దాన్ని దేనితో
కట్టారో చెప్పడం కష్టం. అయితే అందుకు వాడినవి మనం బంగారం, మణిమాణిక్యాలు అని పిలిచే మట్టి, గులకరాళ్ల కంటే వైభవంగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు.
పరదేశీ బాటసారులు బండి దిగగానే అప్సరసల్లాంటి ఇరవై మంది యువతులు
వాళ్లను ఆహ్వానించి లోనికి తీసుకెళ్లి స్నానం చేయించారు. హమింగ్ పక్షి ఈకలతో తయారు చేసిన
వస్త్రాలతో నిలువెల్లా అలంకరించారు. అవి ఈ రాచరికపు దుస్తులు. తర్వాత రాజాస్థానంలోని
ఆడామగా ముఖ్యులు కాండీడ్, కకంబోలను రాజదర్శనానికి సంప్రదాయం ప్రకారం రెండువైపులా
చెరో వెయ్యిమంది వాయిద్యగాళ్లు బారులుతీరిన వరసల మధ్య నుంచి తీసుకెళ్లారు. రాజుగారి
గది చేరువకాగానే
కకంబో రాజును ఎలా గౌరవించాలో తెలియక
పక్కనునున్న ఆస్థాన ముఖ్యుడొకడిని పిలిచి, ‘‘రాజుగారిని ఎలా గౌరవించాలి? నడుము
వంచాలా లేక వెూకరిల్లాలా, లేక సాష్టాంగపడాలా? చేతులను తలపై పెట్టుకోవాలా, వీపు వెనక పెట్టుకోవాలా? నేలపైపడిపోయి దుమ్ము నాక్కోవాలా? ఏం చెయ్యాలి?’’
అని అడిగాడు.
‘‘అవేమీ చేయొద్దు. రాజును కౌగిలించుకుని, ఆయన బుగ్గలను ముద్దాడితే చాలు’’
చెప్పాడు ఆ ముఖ్యుడు.
ఆ ప్రకారంగా కాండీడ్, కకంబోలు రాజు మెడను చుట్టేసుకుని
ఆ తతంగం ముగించారు. అతడు వీళ్లిద్దరినీ సాదరంగా గౌరవించి, రాత్రి భోజనానికి ఆహ్వానించాడు.
భోజనం వేళ వరకు కాలక్షేపం కోసం ఇద్దరినీ నగరంలో తిప్పారు. ప్రజాభవనాలు
ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. విపణి సముదాయాలు బారులు తీసిన స్తంభాలతో అట్టహాసంగా
ఉన్నాయి. సువిశాలమైన కూడళ్లలో మంచినీటి, పన్నీటి కొళాయిలు, చెరకు మధువుల కొళాయిలు, నిరంతరాయంగా ధారలు కడుతున్నాయి. వీధుల్లో
విలువైన రాళ్లను పరచారు. వాటి నుంచి లవంగం,
దాల్చినచెక్క వాసనలు వస్తున్నాయి.
కాండీడ్ న్యాయస్థానాలను చూపాలని అడిగాడు. అలాంటివేమీ లేవని, అసలు అవేమిటో తమకు తెలియదని బదులిచ్చారు. చెరసాలలు ఉన్నాయా అని
అడగ్గా అవీ లేవన్నారు. గణిత,భౌతిక శాస్త్రాల పరికరాలతో కొలువుదీరిన రెండువేల అడుగుల పొడవు గల
ప్రదర్శనశాల ఉన్న విశాలమైన విజ్ఞానశాస్త్ర భవనం అన్నిటికంటే ఆశ్చర్యచకితులను
చేసింది.
అప్పటికి సాయంకాలమైంది. వాళ్లు నగరంలో వెయ్యోవంతు కూడా చూడలేదు.
భోజనం వేళ కావడంతో తిరిగి రాజప్రసాదానికి వెళ్లారు. రాజుతో కలిసి విందులో
కూర్చున్నారు.
చాలామంది అంతఃపురకాంతలు కూడా
కూర్చున్నారు. అలాంటి భారీ విందును ఆ బాటసారులు ఇదివరకు కనీవినీ ఎరగరు. రాజు
చమత్కారి. భలే వ్యంగ్యంగా మాట్లాడతాడు. కకంబో ఆయన ఛలోక్తులను తన యజమానికి సారం పోకుండా
తర్జుమా చేసి వినిపించాడు.
కాండీడ్, కకంబోలు రాజభవనంలో నెలరోజులు గడిపారు. కాండీడ్ తన
ప్రియురాలిని తలచుకోని రోజే లేదు. ‘‘నేను పుట్టిన ఆ భవనం ఇక్కడి భవనాలతో పోల్చడానికి
కూడా పనికిరాదు. కానీ.. క్యూనెగొండ్ లేకుండా నాకిక్కడేమీ బావుండడం లేదు. యూరప్‌లో నీక్కూడా
ఒక ప్రియురాలు ఉండనే ఉంటుంది. మనం ఇక్కడే ఉండిపోతే, తినికూర్చోవడం తప్ప మనకూ ఇతరులకూ తేడా ఏముంటుంది? అదే ఈ దేశంలో దొరికే రాళ్లను ఓ పన్నెండు గొర్రెలపై వేసుకుని పోయామంటే
యూరప్ రాజులందరికన్నా మనమే ధనవంతులమవుతాం. మతవిచారణాధికారులకు భయపడాల్సిన పనే ఉండదు.
క్యూనెగొండ్ దొరసానిని సులభంగా విడిపించుకోవచ్చు’’ అని రోజూ సేవకుడితో పోరుతున్నాడు.
కకంబోకు కూడా ఈ వాదన నచ్చింది. కాండీడ్ మాదిరే అతడూ తిరుగుళ్లతో
విసుగెత్తిపోయాడు. తమ ఐశ్వర్యాన్ని మిత్రులకు చూపి ఏడిపించాలని, తమ ప్రయాణాల్లో చూసిన వింతలు
విశేషాలను, వెలగబెట్టిన ఘనకార్యాలను చెప్పాలని పరితపించిపోయారు. సంతోషంగా ఉన్న వాళ్లు అలా సంతోషంగా బతకడం ఇష్టం లేక
రాజుగారి వద్దకు వెళ్లి సెలవు పుచ్చుకున్నారు.
‘‘మీది బుద్ధి తక్కువ నిర్ణయం. అయినా, మా దేశం ఏమంత గొప్పది
కాదనుకోండి. కానీ మనిషి తనకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే ఉండిపోవాలి. అయినా
పరదేశీయులను బలవంతంగా ఇక్కడే ఉంచేసే హక్కు నాకు లేదు. అది నిరంకుశత్వం. అందుకు మా
సంప్రదాయాలూ,
శాసనాలూ ఒప్పుకోవు. మానవులంతా
స్వేచ్ఛాజీవులు. మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్లండి. అయితే వెళ్లడం మాత్రం చాలా కష్టం
సుమా. మిమ్మల్ని ఇంద్రజాలంలా ఆ చీకటి కొండకింది గుహల నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన
ప్రవాహానికి ఎగబాకి వెళ్లడం అసాధ్యం. నా రాజ్యం చుట్టూ పెట్టని కోటల్లా ఉన్న కొండల
ఎత్తు పదివేల అడుగులు. ఒక్కోదాని విస్తీర్ణం ముప్పై చదరపు మైళ్లు. ఒకవేళ మీరు
ఎక్కగలిగినా, మళ్లీ దిగేసరికి ఒళ్లు హూనమైపోతుంది.
అయినా మీరు వెళ్లితీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కనక మిమ్మల్ని సులభంగా
కొండలు దాటించేందుకు ఓ యంత్రాన్ని తయారు చేయాలని మా యంత్రనిర్మాణ శాస్త్రవేత్తలను
ఆదేశిస్తాను. మీరు కొండలపైకి చేరుకున్నాక మా వాళ్లలో ఒక్కడూ మీ వెంట రాడు,
సరిహద్దు దాటబోమని మా వాళ్లు ప్రతినబూనారు కనక. పైగా వాళ్లు ప్రతిజ్ఞాభంగానికి
పాల్పడేంత మూర్ఖులు కూడా కాదు. మీకు మార్గదర్శకులను ఇస్తాను, ఇంకా ఏమైనా కావాలంటే కోరుకోండి..’’ విడమరచి చెప్పాడు రాజు.
‘‘ప్రయాణానికి సరిపడా తిండి పదార్థాలను, మీ దేశంలో దొరికే రాళ్లను, మట్టిని కొన్ని గొర్రెలపై వెూసుకుపోతాం. మేం కోరేదల్లా ఇదే ప్రభూ!’’ కకంబో విన్నవించుకున్నాడు.
రాజు నవ్వేసి, ‘‘మా పచ్చమట్టి అంటే మీ యూరప్
మనుషులు ఎందుకంతగా పడిచస్తారో నాకర్థం కావడం లేదు. సరే, కావలసినంత తీసుకెళ్లండి.
అది మీకెంతో మంచిది’’ అన్నాడు.
ఈ ఇద్దరు అసాధారణ మానవులను తమ దేశం నుంచి దాటించేందుకు యంత్రాన్ని
తయారు చేయాలని రాజు వెంటనే శాస్త్రవేత్తలను ఆదేశించాడు. మూడువేల మంది శాస్త్రవేత్తలు
పదిహేను రోజుల్లో.. ఇరవై వేల పౌండ్ల ఖర్చుతో యంత్రాన్ని
తయారు చేశారు. కాండీడ్, కకంబోలను అందులో
కూర్చోబెట్టారు. కొండలు దాటాక ప్రయాణం కోసం జీన్లు, కళ్లేలు తగిలించిన రెండు పెద్ద ఎర్రగొర్రెలను, తిండిమూటలు కట్టిన ఇరవై గొర్రెలను, వచ్చిన కానుకల్లో తీసుకెళ్లడానికి ఎంచుకున్న వాటిని వెూసేందుకు మరో
ముప్పై గొర్రెలను, బంగారు, మణిమాణిక్యాలను మూటలు
కట్టిన మరో యాభై గొర్రెలను కూడా యంత్రంలో చేర్చారు. రాజు ఇద్దరినీ ఆప్యాయంగా
కౌగిలించుకుని వీడ్కోలు పలికాడు.
వీడ్కోలు, యంత్రంలో ఆ ఇద్దరిని, గొర్రెలను చాకచక్యంగా కొండలపైకి
చేర్చడం కళ్లింతలు చేసుకుని చూడదగ్గ దృశ్యాలు. వాళ్లను అలా భద్రంగా దిగబెట్టాక శాస్త్రవేత్తలు
సెలవు పుచ్చుకున్నారు. ఆ గొర్రెలన్నింటినీ తీసుకెళ్లి క్యూనెగొండ్ దొరసానికి
కానుకగా సమర్పించుకోవాలన్న ధ్యాస తప్ప మరో ధ్యాస లేకపోయింది కాండీడ్‌కు.
‘‘బ్యూనోస్ ఏరీస్ గవర్నర్ డబ్బులిచ్చి క్యూనెగొండ్‌ను విడిపించుకోవాలంటే
వాడి మొహాన కావలసినంత విసిరికొడదాం. తర్వాత కేనీకి వెళ్లిపోయి, ఓడనెక్కేద్దాం. తర్వాత ఏ రాజ్యాన్ని కొనాలో తీరిగ్గా ఆలోచిద్దాం’’ చెప్పుకుంటూ పోతున్నాడు సేవకుడితో.
19వ
అధ్యాయం
ఆసియా, ఆఫ్రికా యూరప్ ఖండాలను కలిపి ఖరీదు కట్టినా అవి తమ సిరిసంపదలతో తూగలేవన్న
ధీమాతో ఇద్దరూ తొలిరోజు జోరుగా ప్రయాణించారు. ఈ ఉత్సాహంలో కాండీడ్ కంటికి కనిపించిన
ప్రతి చెట్టుమీదా క్యూనెగొండ్ పేరు చెక్కాడు. రెండోరోజున రెండు గొర్రెలు అవి మోస్తున్న
మూటలతో సహా బురదగుంటలో పడి మునిగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత మరో రెండు అలసటతో
చచ్చిపోయాయి. మరో ఏడెనిమిది ఎడారిలో ఆకలితో మాడి ప్రాణాలు విడిచాయి. కొన్ని
కొండవాలులో కాలుజారి పడిపోయాయి. వంద రోజుల ప్రయాణం పూర్తయ్యేసరికి రెండంటే రెండు గొర్రెలే
మిగిలాయి.
‘‘మిత్రమా, చూశావా! ప్రాపంచిక సిరిసంపదలు
ఎంత క్షణభంగురాలో.. నీతికంటే శాశ్వతమైనది ఏదీ లేదు. నా క్యూనెగొండ్‌ను మళ్లీ చూడడం
కంటే సంతోషకరమైంది మరొకటి లేదు’’
కాండీడ్ చింతించాడు.
‘‘నిజమే, ఒప్పుకుంటాను. అయితే మన దగ్గర ఇంకా రెండు గొర్రెలు మిగిలే ఉన్నాయి.
వాటిమీదున్న సంపదను స్పెయిన్ రాజు తన జీవితంలో సంపాదించలేడు. దగ్గర్లో ఏదో పట్టణం
కనిపిస్తూ ఉంది. సూరినామే కావచ్చు. మీకు తెలుసుగా అది డచ్చివాళ్లది. ఇక మన కష్టాలు
తీరినట్లే.. ’’ సేవకడు భరోసా ఇచ్చాడు.
వాళ్లు పట్టణానికి చేరువవుతుండగా దారిపక్కన ఒక నీగ్రో పడుండడం చూశారు.
అతని ఒంటిపై నీలి ముతకలాగు తప్ప మరేమీ లేదు. ఎడమకాలు, కుడి చెయ్యి పోయాయి.
‘‘ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా?
ఇంత దయనీయంగా ఉన్నావెందుకు?’’
కాండీడ్
డచ్చి భాషలో అడిగాడు.
‘‘మా యజమాని వాండర్‌డెండర్‌గారి కోసం ఎదురు చూస్తున్నానయ్యా. ఆయనకు
పెద్ద పంచదార పరిశ్రమలు ఉన్నాయి’’ బదులిచ్చాడు నీగ్రో.
‘‘మీ వాండర్‌డెండర్‌గారు మిమ్మల్ని ఇలాగే సంరక్షణ చేస్తారా?
‘‘అయ్యో పాంగ్లాస్! ఇంత దారుణాన్ని నువ్వసలు ఊహించే ఉండవు. కానీ ఇది
మాత్రం నగ్నసత్యం. నీ ఆశావాదాన్ని నేనిక వదులుకోక తప్పదు’’ వాపోయాడు కాండీడ్.
‘‘ఆశావాదమంటే?’’ అడిగాడు కకంబో.
‘‘మనకెప్పుడూ చెడే జరుగుతున్నా అంతా మన మంచికేనని అనుకోవడమే’’ అని, నీగ్రోవైపు చూసి గుడ్ల నీళ్లు కక్కుకున్నాడు కాండీడ్. ఆ కన్నీళ్లతోనే
సూరినామ్‌కేసి దారితీశాడు.
సూరినామ్‌లో అడుగుపెట్టగానే అక్కడి రేవులో బ్యూనోస్ ఏరీస్‌కు వెళ్లే
ఓడ ఏదైనా ఉందా అని విచారించారు. వాళ్లడిగింది ఓ స్పెయిన్ ఓడ కెప్టెన్ను. ప్రయాణ
విషయాలు మాట్లాడుకోవడానికి సత్రానికి రమ్మన్నాడు అతడు. కాండీడ్, కకంబోలు గొర్రెలను తోలుకుంటూ పోలోమని వెళ్లారు.
ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే కాండీడ్ తను వెలగబెట్టిన
ఘనకార్యాలను ఆ కెప్టెన్ కు వివరించి, తాను క్యూనెగొండ్‌ను కాపాడ్డానికి పోతున్నానని చెప్పాడు.
‘‘నేను నిన్ను బ్యూనోస్ ఏరీస్ తీసుకెళ్లే ప్రసక్తే లేదు. అదే గనక
చేస్తే నా తలకాయ ఎగిరిపోతుంది. నీ పనీ అంతే. క్యూనెగొండ్ దొరసాని ఇప్పుడు
ఎవరనుకున్నావు? మా గవర్నర్ గారి ముద్దుల భార్యామణి’’ చావు కబురు మెల్లగా చెప్పాడు
కెప్టెన్.
కాండీడ్ నెత్తిన పిడుగుపడింది. చాలాసేపు వెక్కివెక్కి ఏడ్చాడు. తర్వాత కకంబోను
పక్కకు పిలిచి, ‘‘అబ్బాయ్! మనమొక పని చేద్దాం. మనిద్దరి దగ్గరా చెరో ఐదారు లక్షల
వజ్రాలు ఉన్నాయి కదా. నువ్వు నాకంటే తెలివైన వాడివి. బ్యూనోస్ ఏరీస్‌కు వెళ్లి క్యూనెగొండ్‌ను
తీసుకురా. గవర్నర్ చిక్కలు పెడితే వాడి మొహాన లక్ష వజ్రాలు పడేసేయ్. ఇంకా దారికి రాకపోతే
మరో రెండు లక్షలు ఇచ్చెయ్. నున్వేమీ మతవిచారణాధికారిని చంపలేదు కనక నిన్నెవ్వరూ
అనుమానించరు. నేనిక్కడ మరో ఓడను చూసుకుని వెనిస్‌కు వెళ్లి, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెనిస్ స్వతంత్ర దేశం. బల్గర్లకు, అబర్లకు, యూదులకు, మతవిచారణాధికారులకు భయపడాల్సిన పని ఉండదు’’ అని కర్తవ్య బోధన చేశాడు.
ఈ తెలివైన పథకం కకంబోకు బాగా నచ్చింది. ఆత్మీయ మిత్రుడిగా మారిన
గుణవంతుడైన యజమానిని విడిచివెళ్లడానికి బాధగా అనిపించినా, అతనికి ఉడతాభక్తి సాయమైన చేస్తున్నా గదా అనే సంబరంలో ఆ బాధ
మరచిపోయాడు. ఇద్దరూ కౌగిలించుకుని
కన్నీళ్లు కార్చారు. ముసలమ్మ సంగతి మరచిపోవద్దని గట్టిగా గుర్తుచేశాడు కాండీడ్. కకంబో
అదే రోజు వెళ్లిపోయాడు.
తనను, మిగిలిన గొర్రెలను ఇటలీకి
తీసుకెళ్లే ఓడ కోసం ఎదురు చూస్తూ కాండీడ్ కొన్నాళ్లు సూరినామ్‌లోనే మకాం వేశాడు.
కొంతమంది సేవకులను నియమించుకుని ఆ సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన
సరకూ సరంజామా కొన్నాడు. చివరకు వాండర్‌డెండర్ అనే పెద్ద నౌక కెప్టెన్ కాండీడ్
దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు.
‘‘నన్ను నేరుగా వెనిస్ తీసుకెళ్లడానికి ఎంతివ్వమంటావు? నాకూ, నా సేవకులకూ, సరుకులకూ, ఆ రెండు గొర్రెలకూ కలిపి..’’ అడిగాడు కాండీడ్.
పదివేల పియస్టర్లు ఇవ్వాలన్నాడు కెప్టెన్. సరేనన్నాడు కాండీడ్.
ఓడ కెప్టెన్ కాస్త పక్కకు వెళ్లి.. ‘అబ్బో! ఈ ఆగంతకుడు అడుగుతూనే
బేరమాడకుండా పదివేల పియస్టర్లు ఇస్తానని అన్నాడంటే బాగా డబ్బున్నవాడై ఉండాలి’’ అని మనసులో అనుకున్నాడు. వెంటనే వెనక్కి తిరిగొచ్చి
ఇరవైవేలకంటే తక్కువకు రానన్నాడు.
‘‘అలాగే కానియ్‘‘ అన్నాడు కాండీడ్.
ఓడ కెప్టెన్ మళ్లీ పక్కకెళ్లి.. ‘అయ్య బాబోయ్! తొలుత పదివేలు ఇస్తానన్నాడు.
ఇప్పుడూ అంతే తేలిగ్గా ఇరవైవేలు ఇస్తానంటున్నాడు’ అనుకుంటూ విస్మయంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
తర్వాత మళ్లీ తిరిగొచ్చి ముప్పైలిస్తేనే తీసుకెళ్తానన్నాడు.
‘‘సరే, ముప్పైలే తీసుకో’’ నింపాదిగా అన్నాడు ప్రయాణికుడు.
‘‘అబ్బ! అదృష్టమంటే ఇలా కలసిరావాలి. ఇతనికి ముప్పైవేల పియస్టర్లంటే
ఏమాత్రం లెక్కలేకుండా ఉంది. అనుమానమే లేదు,
ఈ గొర్రెలపై ఉన్నవి ఎంతో
విలువైన సరుకులే అయ్యుంటాయి. ఇక మనం ఎక్కువ అడగకూడదు. ముందు ఆ ముప్పై వేలు ఉన్నాయో
లేవో కనుక్కుందాం. ఉంటే, వాటిని పుచ్చేసుకుని మిగతావాటి సంగతి తర్వాత చూద్దాం’’
అని అనుకున్నాడు కెప్టెన్.
కాండీడ్ రెండు చిన్న వజ్రాలు అమ్మాడు. వాటిలో చిన్నదానికే ఓడ
కెప్టెన్ అడిగినదానికంటే ఎక్కువ మొత్తం వచ్చింది. కాండీడ్ కొంత డబ్బును అతనికి
బయానాగా ఇచ్చాడు. రెండు గొర్రెలను లంగరు వేసిన ఓడలోకి చేర్చారు. కాండీడ్ ఆ ఓడను
చేరుకోవడానికి చిన్న పడవలో బయల్దేరాడు. ఓడ కెప్టెన్ దీన్ని అవకాశంగా తీసుకుని
తెరచాపలు విప్పి లంగరెత్తాడు. గాలి కూడా బాగా
వీయడంతో ఓడ.. రేవును వేగంగా దాటిపోయింది. కాండీడ్ దిగ్భ్రాంతితో, దిగులుతో చూస్తూండిపోయాడు. ఓడ కాసేట్లోనే కనుమరుగైంది.
‘‘దొంగనాకొడుకు! ఈ పాత ప్రపంచంలో అంతా మోసమే’’ అని వాపోయాడు.
తిరిగి తీరానికి చేరుకున్నాడు. ఇరవైమంది చక్రవర్తుల విలువచేసే సొమ్ము
పోవడంతో మనసు ముక్కచెక్కలై పెనువిషాదంలో మునిగిపోయాడు.
ఆ స్థితిలోనే ఫిర్యాదు చేయడానికి డచ్చి న్యాయమూర్తి ఇంటికెళ్లి ఆవేశంతో తలుపు దబదబా బాదాడు. లోనికెళ్లి
బిగ్గరగా అరుస్తూ జరిగినదంతా చెప్పాడు. ముందు కేకలేసి, రభస చేసినందుకు పదివేల పియస్టర్లు జరిమానా కింద కట్టించుకుని, తర్వాత ఓపిగ్గా విన్నాడు న్యాయమూర్తి.
పారిపోయిన ఓడ కెప్టెన్ తిరిగి రాగానే విషయం పరిశీలిస్తానని చెప్పి, ఫిర్యాదును
సావధానంగా విన్నందుకు ఖర్చుల కింద మరో పదివేలు పుచ్చుకున్నాడు.
న్యాయమూర్తి తీరుతో కాండీడ్ మరింత నిరాశానిస్పృహల్లో కూరుకుపోయాడు.
అతడు ఇలాంటి వాటికంటే దారుణమైన కష్టాలే అనుభవించాడు. అయితే న్యాయమూర్తి నిర్లక్ష్యం,
డబ్బు యావ,
తడిగుడ్డతో గొంతు కోసిన ఓడ కెప్టెన్
దగాను తలంచుకుంటూంటే కడుపులో దేవినట్లు అవుతోంది. మానవుడి దుష్టత్వం జడలువిప్పి పరమవికృతంగా
కళ్లముందు నాట్యమాడింది. తీవ్ర నిర్వేదం ఆవరించింది. చివరకు బోర్దాకు బయల్దేరడానికి
సిద్ధంగా ఉన్న ఫ్రెంచి ఓడ కనిపించింది. తన దగ్గర రత్నరాసులేం లేవు కనక మామూలు
రుసుముతోనే ఆ ఓడలో ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణంలో తనతోపాటు కాలక్షేపం
చేసేందుకు నిజాయితీపరుడెవడైనా ముందుకొస్తే అతని ప్రయాణ ఖర్చులు భరించడంతోపాటు
రెండువేల పియస్టర్లు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. అయితే అతడు తీవ్ర అసంతృప్తితో ఉండి, ఆ రాష్ట్రంలోనే అత్యంత దౌర్భాగ్యుడై
ఉండాలని షరతు పెట్టాడు.
ఓడల పటాలంలో సర్దినా పట్టనంతమంది అర్జీదారులు హాజరయ్యారు. సులభంగా
ఎంపిక చేసుకోవడానికి వీలుగా కాస్త కలివిడిగా దౌర్భాగ్యులుగా కనిపించిన ఇరవై మందిని ఒకచోట చేరమన్నాడు కాండీడ్.
తర్వాత వాళ్లందర్నీ తను బస చేసిన సత్రానికి తీసుకెళ్లి తిండి పెట్టించాడు. అందరూ
తమతమ జీవనగాథలను ఉన్నది ఉన్నట్టు చెబుతామని ఒట్టు పెట్టుకోవాలని, వాళ్లలో అత్యంత
దురదృష్టవంతుణ్నే ఎంపిక చేసుకుంటానని, మిగిలిన వాళ్లకు కాస్తోకూస్తో డబ్బు ఇస్తానని షరతు పెట్టాడు.
కథాగోష్టి తెల్లారుజామున నాలుగింటి దాకా సాగింది. ఒక్కొక్కడి
సాహసాలను వింటూంటే కాండీడ్‌కు.. అదివరకు ఓడలో బ్యూనోస్ ఏరీస్‌కు వెళ్తున్నప్పుడు
ములసమ్మ చెప్పిన మాటలూ, జీవితంలో దారుణబాధలు అనుభవించని వాడు ఓడలో ఒక్కడూ ఉండడని ఆమె కట్టిన
పందెమూ గుర్తుకొచ్చాయి.
ఒక్కో కథ వింటున్నప్పుడల్లా పాంగ్లాస్‌ను తలచుకుని, ‘పాపం ఆయన ఇవన్నీ విని ఉంటే తన సిద్ధాంతానికి
గట్టి ఉదాహరణ ఒక్కటైనా దొరక్క తికమక పడిపోయుండేవాడు. ఈ ప్రపంచంలో అంతా సవ్యంగా
సాగేది ఒక్క ఎల్డొరాడోలో మాత్రమే..
మరెక్కడా సాగదు’’ అని నిట్టూర్చాడు.
చివరకు.. ఆమ్‌స్టర్‌డామ్ పుస్తక ప్రచురణకర్తల వద్ద పదేళ్లు గొడ్డుచాకిరీ
చేసిన పేద వృద్ధపండితుణ్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ లోకంలో ఆ పనికంటే కంపరం పుట్టించేది మరొకటి
లేదని తీర్మానించుకున్నాడు.
ఆ పండితుడు మంచివాడూ, నిజాయితీపరుడూ. ఉన్నదంతా పెళ్లాం గుంజుకుంది. కొడుకు
కొట్టాడు. కూతురు పోర్చుగీసువాడితో లేచిపోయింది. తండ్రిని పట్టించులేదు. కడుపుకింత కూడు పెట్టే చిన్న ఉద్యోగమూ ఊడియింది. క్రీస్తు దైవత్వాన్ని
ఒప్పుకోలేదంటూ అతణ్ని సూరినామ్ మతాచార్యుడొకడు నిజంగానే రాచిరంపాన పెట్టాడు. గోష్టిలో
పాల్గొన్న మిగతావాళ్లూ దరిద్రదేవత ముద్దుబిడ్డలే, అష్టకష్టాలూ పడ్డవాళ్లే. అయితే ప్రయాణంలో తత్వవేత్త తోడుంటే మంచి
కాలక్షేపంగా ఉంటుందని కాండీడ్ ఆ పండితుణ్ని ఎంచుకున్నాడు. పండితుని ప్రత్యర్థులు తమకు ఘోరమైన అన్యాయం జరిగిందని
గోల చేయడంతో కాండీడ్ వాళ్లకు ఒక్కొక్కరికి వంద పియస్టర్లు ఇచ్చి సంతోషపెట్టాడు.
(మళ్లీ
వచ్చే శనివారం)
No comments:
Post a Comment