Wednesday 13 January 2016

కాండీడ్- 9వ భాగం





20వ అధ్యాయం

ముసలి పండితుడు మార్టిన్ కాండీడ్‌తో కలసి బోర్దాకు బయలుదేరాడు. ఇద్దరూ చాలా చూసినవాళ్లే, చాలా కష్టాలు అనుభవించిన వాళ్లే. ఓడ ఒకవేళ సూరినామ్ నుంచి గుడ్ హోప్ అగ్రం మీదుగా జపాన్‌కు పోవాల్సి వచ్చినా ఇద్దరూ దారంట సమస్త నైతిక, ఐహిక దుర్మార్గాలపై ఎడతెగకుండా మాట్లాడుకుంటూనే ఉండిపోయేవాళ్లు.

కాండీడ్‌కు తిరిగి క్యూగొండ్‌ను చూస్తాననే ఆశ ఇంకా చావలేదు. మార్టిన్‌కు ఆ ఆశ అణుమాత్రం కూడా లేదు. ఇద్దరికీ ఇదే తేడా. కాకపోతే కాండీడ్ వద్ద ఇంకాస్త బంగారమూ, వజ్రాలూ ఉన్నాయి. అమూల్యమైన సంపదను వెూసుకొచ్చిన వంద గొర్రెలు పోయినా, డచ్చి ఓడ కెప్టెన్ నయవంచనను మరచిపోలేకపోయినా.. జేబులోనివీ, దూరాన ఉన్న క్యూనెంగొండూ గుర్తుకొచ్చినప్పుడల్లా కాండీడ్‌కు పాంగ్లాస్ సిద్ధాంతంపై మరింత మక్కువ పొంగుకొచ్చేది.

‘‘అయ్యా, దీనంతటి గురించీ మీరేమనుకుంటున్నారు? నైతిక, ఐహిక దుర్మార్గాలపై మీ అభిప్రాయాలేంటి?’’ అడిగాడు కాండీడ్.

‘‘అయ్యా! క్రీస్తు దైవత్వాన్ని నిరాకరించానని ఆ సూరినామ్ మతాచార్యుడు నన్ను హింసించాడు. మనిషి దుష్టశక్తుల సృష్టేకానీ దేవతల సృష్టి కాదని నా నిశ్చితాభిప్రాయం’’ మార్టిన్ కుండబద్దలు కొట్టాడు.

‘‘మీరు పరిహాసమాడుతున్నారు. ఈ మాటలను జనం నమ్మరు.’’

‘‘నమ్మకపోతే నేనేం చేసేది? అయితే నా అభిప్రాయం మటుకు అదే.’’

‘‘అయితే మీలోనూ దుష్టశక్తి ఉండి తీరాలి’’ కవ్వించాడు యువకుడు.



‘‘ఆ దుష్టశక్తి ఈ ఐహిక విషయాలన్నింటిలోనూ కల్పించుకుంటూ ఉంటుంది. అది నాలోనే కాదు ప్రతిచోటా ఉటుంది. ఈ భూలోకాన్ని తరచి చూస్తే దేవుడు దీన్ని దెయ్యం మానాన వదిలేశాడా అనిపిస్తుంది. మీరు చెబుతున్న ఎల్డొరాడో ఒక్కటే దీనికి మినహాయింపు కావచ్చనుకోండి. పక్క పట్టణాన్ని నాశనం చెయ్యాలని అనుకోని పట్టణం కానీ, పక్క కుటుంబాన్ని నాశనం చెయ్యాలని అనుకోని కుటుంబం కానీ నాకెక్కడా తగల్లేదు. బలహీనులు బలవంతులను ద్వేషిస్తారు. అయితే వాళ్లముందు మాత్రం నక్కవినయాలు చూపుతారు. బలవంతులు వాళ్లను మాంసం, బొచ్చు కోసం తెగనమ్మే గొర్రెలను తన్నినట్టు తంతుంటారు. పదిలక్షల మంది హంతకులు మహా క్రమశిక్షణతో సుసంఘటితంగా యూరప్‌లో ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రజల గొంతులు కోస్తూ, దోపిడీలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు అంతకంటే మెరుగైన జీవనోపాధి లేదు కనక. ఇక శాంతితో, కళలతో వర్ధిల్లే నగరాల సంగతికొస్తే అక్కడి వాళ్లూ.. యుద్ధపీడిత పట్టణాల ప్రజల కంటే విపరీతంగా ఆయాసపడుతూ, ఈర్ష్యాసూయలతో, ఆందోళనతో బతుకుతుంటారు. ఎందుకంటే తెలియని కష్టాలు తెలిసిన కష్టాలకంటే దారుణంగా ఉంటాయి కనుక. ఇంతెందుకు గాని, ఒక్కమాటలో సరిపెడితే.. నా అనుభవాలను బట్టి మనిషికి మూలం చెడేనని అనుకుంటున్నాను.’’

‘‘మరి ఉన్నదంతా చెడేనంటారా? మంచి కాస్తోకూస్తో కూడా లేదా?’’.

‘‘చాలా వరకూ చెడే ఉంది. మంచిదనేది నాకింతవరకు తారసపళ్లేదు.’’

వాళ్లిలా చర్చల్లో మునిగితేలుతుండగా ఫిరంగి పేలుళ్లు వినిపించాయి. ఆ శబ్దాలు అంతకంతకూ పెరిగాయి. దూరదర్శిని నుంచి చూడగా మూడు మైళ్ల దూరంలో రెండు ఓడలు ఒకదానిపై ఒకటి ఫిరంగులు పేల్చుకుంటున్నాయి. ఆ నౌకలు గాలివాటున వీళ్లున్న ఓడకు దగ్గరగా రావడంతో ప్రయాణికులకు ఆ పోరును నింపాదిగా చూసి ఆనందించే మహద్భాగ్యం దక్కింది. ఆఖరిపోరులో ఒక నౌక తన ఫిరంగులన్నింటితో ఒక్కసారిగా శత్రునౌకను పేల్చిపారేసింది. ఓడిన ఓడ తూట్లుపడి మునిగిపోసాగింది. దాంట్లోని వందమందికిపైగా జనం చేతులు పైకెత్తి హృదయవిదారకరంగా ఆర్తనాదాలు చేస్తూ మునిగిపోవడం కాండీడ్, మార్టిన్‌లు కళ్లారా చూశారు. కొద్దిసేపటికే బాధితులందరూ కడలి కడుపులో కలసిపోయారు.

‘‘చూశారా.. మనుషులు ఒకళ్లనొకళ్లు ఎంత గొప్పగా గౌరవించుకుంటున్నారో!’’ ఎత్తిపొడిచాడు మార్టిన్.

‘‘అవును, దారుణంగానే ఉంది.’’

ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, తమ ఓడవైపు ఎర్రగా మెరుస్తున్న వస్తువేదో ఈదుకుంటూ రావడం కాండీడ్ కంటబడింది. అదేంటో చూడ్డానికి ఓడలోంచి డింగీని కిందికి దించారు. ఆ ఈదుకుంటూ వస్తువు కాండీడ్ పోగొట్టుకున్న గొర్రె. వంద గొర్రెలు కోల్పోయిన విచారం దాన్ని చూడగానే ఎగిరిపోయింది.

నౌకాయుద్ధంలో గెలిచిన ఓడ కెప్టెన్ స్పెయిన్ వాడు అని, ఓడిపోయిన ఓడ కెప్టెన్ డచ్చి సముద్రపు దొంగ అని తెలిసింది. కాండీడ్‌ను సూరినామ్ రేవులో వెూసగించి గొర్రెలను ఎత్తుకుపోయింది ఆ ఓడినవాడే. వాడినీ, వాడు దోచుకున్న రత్నరాశులనూ  కడలి మింగేసింది. ఈ ఒక్క గొర్రె మాత్రం బతికి బయటపడింది.

‘‘చూశావా మార్టిన్! కొన్నిసార్లు నేరానికి శిక్ష దానంతట అదే పడుతుంది. ఆ దుర్మార్గపు డచ్చివాడికి తగిన శాస్తే జరిగింది’’ కాండీడ్ గొప్పగా అన్నాడు.

‘‘నిజమే. అయితే పాపం మరి, ఆ ప్రయాణికులు ఉత్తిపుణ్యానికి ఎందుకు జలసమాధి కావాల్సి వచ్చింది? దేవుడేవెూ ఆ దుర్మార్గుణ్ణి శిక్షించాడు, దెయ్యమేమో మిగిలినవాళ్లను ముంచేసింది’’ తేల్చేశాడు పండితుడు.

తమ ఫ్రెంచి ఓడ, స్పెయిన్ ఓడ వేటి దారిన అవిపోతూంటే కాండీడ్ మార్టిన్‌తో మాటల్లో మునిగిపోయాడు. వాళ్ల చర్చలు పక్షం రోజులు సాగినా చివరకు ఎక్కడ మొదలుపెట్టారో మళ్లీ అక్కడికే వచ్చారు. అయితే కులాసాగా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని, సాంత్వన చెప్పుకున్నామని సంతోషపడ్డారు.

కాండీడ్ గొర్రెను ముద్దుగా తడుతూ, ‘‘నిన్ను దొరికించుకున్నట్టే క్యూనెగొండ్ నూ చిక్కించుకుంటాలే’’ అన్నాడు. 





 



                                21వ అధ్యాయం


వాళ్లకు కనుచూపుమేరలో ఫ్రెంచి తీరం కనిపించింది.

‘‘మీరెప్పుడైనా ఫ్రాన్స్ వెళ్లారా?’’ అడిగాడు కాండీడ్.

‘‘వెళ్లా. అక్కడ చాలా రాష్ట్రాలు తిరిగా. కొన్ని రాష్ట్రాల్లో సగం మంది మూర్ఖులు. ఇంకొన్ని చోట్ల గుంటనక్కలు. కొన్నిచోట్ల దద్దమ్మలు, వెర్రినాయాలళ్లు.. కొన్నిచోట్ల తెలివిమంతులమన్నట్టు నటిస్తారు. ఫ్రాన్స్ లో  మీరెక్కడికైనా వెళ్లండి, అక్కడి వాళ్లకు ప్రధానంగా మూడే మూడు వ్యాపకాలు. ఒకటి.. ప్రేమకలాపాలు, రెండు.. చెవులు కొరుక్కోవడం, మూడు.. నానాచెత్తా వాగడం.’’

‘‘మరైతే ప్యారిస్ గురించి ఏమంటారు? దాని సంగతి తెలుసా?’’

‘‘ఓ.. తెలియేకం! ప్యారిస్ మహబాగా తెలుసు. అక్కడ అన్ని రకాలవాళ్లూ కనిపిస్తారు. అంతా అస్తవ్యస్తం. అందరూ సుఖం కోసం ఎగబడతారుగానీ ఒక్కడికీ అది దక్కదు. నేనక్కడ కొన్నాళ్లున్నాలెండి. తొలిసారి అక్కడికి చేరుకోగానే జెర్మయిన్ స్వాముల తిరుణాలో నా దగ్గరున్న డబ్బుకాస్తా జేబుదొంగలు కొట్టేశారు. దానికితోడు అధికారులు నేనే జేబుదొంగననే అనుమానంతో పట్టుకెళ్లి వారం రోజులు ఖైదు చేశారు. ఆ తర్వాత కాలినడక పోలండ్‌కు తిరిగెళ్లడాఁకి అవసరమైన దారిభత్యం సంపాదించుకోవడానికి ఓ ముద్రణాలయంలో అక్షరాల తప్పులు దిద్దేవాడిగా చేరాను. నగరంలో ఏ మూలకు వెళ్లినా కుట్రలూ, కుతంత్రాలూ, మౌఢ్యాలూ జడలువిప్పి నాట్యమాడుతూ కనిపిస్తుంటాయి. కొంతమంది సజ్జనులు కూడా ఉన్నారంటారు. ఏమో, ఉంటే ఉండొచ్చు.’’

‘‘నా మటుకు నాకు ఫ్రాన్స్ ను  చూడాలనే ఆసక్తి బొత్తిగా లేదు. ఎల్డొరాడోలో నెలరోజులు గడిపినవాడికి ఈ భువిలో మరిదేన్నీ చూడాలనే ఆసక్తి ఉండదు, ఒక్క క్యూనెగొండ్‌నును చూడాలన్నది మినహాయిస్తే. దీన్ని మీరు సులువగా ఊహించగలరు. నేను వెనిస్‌కు వెళ్లి ఆమె కోసం ఎదురుచూస్తూ ఉండాలి. అక్కడికి వెళ్లాలంటే ఫ్రాన్స్ దాటాలిగా. మీరు కూడా నాతో వస్తారా?’’

‘‘తప్పకుడా, దానికేం భాగ్యం! కానీ వెనిస్ వెనిస్ పెద్దమనుషులదేనని, బయటి వాళ్లెవరయినా వెళ్తే బాగా డబ్బుంటేనే తప్ప ఆదరణ ఉండదని అంటుంటారు. నేను పెద్దమనిషినీ కాను, ధనవంతుణ్నీ కాను. అయినా మీదగ్గర బాగా డబ్బుంది కనక మీరెక్కడి రమ్మన్నా వచ్చేస్తాను’’ సంసిద్ధత వ్యక్తం చేశాడు మార్టిన్.

‘‘మరోమాట. మన ఓడ కెప్టెన్ దగ్గరున్న ఆ పెద్దపుస్తకం చూశారు కదా. ఒకప్పుడు ఈ భూమి అంతా జలమయమేనని అందులో ఉంది. దీన్ని మీరు నమ్ముతారా?’’ కాండీడ్ పిచ్చి ఆసక్తితో అడిగాడు.

‘‘అస్సలు నమ్మను. ఈ మధ్య ఇలాంటి వెర్రిమాటలను విపరీతంగా అచ్చేసి వదులుతున్నారు. వీటిని నేనసలు లెక్క చేయను.’’

‘‘అయితే మరి ఈ ప్రపంచం ఎందుకు సృష్టించబడినట్టు?’’

‘‘మనల్ని పిచ్చివాళ్లను చెయ్యానికి.’’

‘‘కోతులను ప్రేమించిన ఆ ఇద్దరు ఒరైలన్ ఆడపిల్లల కథ చెప్పా కదా. అది మీకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదా?’’


‘‘లేదు. అది నాకేం విపరీతంగా అనిపించలేదు. అంతకంటే అసాధారణమైన వాటిన్నెన్నింటినో చూశాను కనక నా మటుకు నాకు ఏదీ వింతగా తోచదు.’’

‘‘మనుషులు ఇప్పుడే కాదు అనాదీ నుంచి ఒకళ్లనొకళ్లు చంపుకుంటున్నారన్న మాటను మీరు నమ్ముతారా? వాళ్లు  అబద్ధాలకోరులుచ మోసగాళ్లు, ద్రోహులు, కృతఘ్నలు, బలహీనులు, నీచులు, చపలచిత్తులు, అసూయాపరులు, ఆశపోతులు,దురాశాపరులు, తాగుబోతులు, తిండిపోతులు, బాధామయులు, పిసినిగొట్లు, క్రూరులు, జారులు, చోరులు, దుష్టులు, మౌఢ్యులు, కపటులు, మూర్ఖులు అని నమ్ముతారా?’’ కాండీడ్ ఎకరువు పెట్టి అడిగాడు.

‘‘డేగలు తమ కంటబడిన పావురాలను తింటాయా, తినవా?’’ ఎదురు ప్రశ్నించాడు మార్టిన్.

‘‘తింటాయి, అందులో సందేహమేముంది?’’

‘‘డేగలకే  ఆ స్వభావం ఉన్నప్పుడు మనుషులు మాత్రం తమ నైజాన్ని మార్చుకుంటారన్న భ్రమ మీకెందుకు?’’

‘‘కానీ దానికీ దీనికీ చాలా తేడా ఉంది కదా! ఎందుకంటే స్వయం నిర్ణయం..’’
బోర్దా చేరేవరకు వాళ్లలా వాదించుకుంటూనే ఉన్నారు.





22వ అధ్యాయం

కాండీడ్ బోర్దాలో కొన్ని రోజులే ఉన్నాడు. ఎల్డొరాడో నుంచి తెచ్చిన రాళ్లలో కొన్నింటిని అమ్మేసి.. తనూ, మార్టినూ  కూర్చోవడానికి అనువుగా ఉన్న జట్కాబండి కొనుక్కున్నాడు. తన కొత్త తత్వవేత్త మార్టిన్ తోడు లేకుండా అతడెక్కడికీ వెళ్లలేడు కదా మరి. కాండీడ్ తన గొర్రెను బోర్దాలోని విజ్ఞానశాస్త్ర అధ్యయన సంస్థకు పరిశోధనల కోసం అప్పగించాడు. దాన్ని విడిచివెళ్తున్నందుకు ఎంతో కలతచెందాడు. ఆ సంస్థ ఆ గొర్రె బొచ్చు ఎందుకు ఎర్రగా ఉందనే దానిపై వ్యాసరచన పోటీ పెట్టింది. ‘ఏ’, ‘బీ’లను కూడి, ‘సీ’ని తీసేసి ‘జెడ్’తో భాగించాలన్న సూత్రం ప్రకారం ఆ గొర్రె ఎర్రగా ఉందని  నిరూపించి, అది తెగులుతో చచ్చిపోవడం ఖాయమని తేల్చిచెప్పిన ఉత్తరాది మేధావికి బహుమతి అందజేశారు.

కాండీడ్‌కు బోర్దా సత్రాల్లో, వీధుల్లో తగిలిన ప్రయాణికులందరూ ‘మేం ప్యారిస్ పోతున్నాం, ప్యారిస్ ’ అని బడాయిగా చెబుతూ హడావుడి చేశారు. దీంతో అతనికీ రాజధాని నగరాన్ని చూడాలన్న కుతూహలం కలిగింది. వెనిస్ దారిలో ప్యారిస్‌కు వెళ్లే దారి ఏమంత చుట్టుదారి కూడా కాదు కనక పయనం కట్టేశాడు. మార్టిన్‌తో కలిసి ప్యారిస్ శివారులోని సెయింట్ మార్సూలో అడుగుపెట్టాడు. కాండీడ్‌కు తాను వెస్ట్‌ ఫాలియాలోని కంపుగొట్టే పల్లెలో ఉన్నట్టు అనిపించింది.

ప్రయాణ బడలిక వల్ల కాండీడ్ పారిస్ సత్రంలో చేరీచేరగానే కాస్త జబ్బుపడ్డాడు. అతని చేతికి దర్జాగా విలువైన పెద్ద ఉంగరమూ, సామాన్లలో బరువైన ఇనప్పెట్టే ఉండడంతో పిలవకుండానే ఇద్దరు వైద్యులు, కొంతమంది ప్రాణస్నేహితులు మూగారు. ఇద్దరు ఆడవాళ్లు మహాశ్రద్ధగా జావకాచి పోశారు.

‘‘నేను తొలిసారి ప్యారిస్ కు వచ్చినప్పుడు జబ్బుపడిన సంగతి గుర్తుకొస్తోంది. అప్పుడు నేను పేదవాణ్ని. వైద్యుల్లేరు, మిత్రుల్లేర్లు, ఇలాంటి దయగల ఆడవాళ్లూ లేరు. అందుకే త్వరగా కోలుకున్నా’’ అన్నాడు మార్టిన్.

మందులూ, మాకుల మూలంగా కాండీడ్ ఆరోగ్యం మరింత దిగజారింది. ఇంతలో ఓ క్రైస్తవ మతబోధకుడు ఆత్రంగా వచ్చి, పరలోకంలో శిక్ష తప్పించుకోవడానికి పాపపరిహార పత్రం కొనుక్కోమని ఎంతో మర్యాదగా అడిగాడు. కానీ యువకుడైన కాండీడ్‌కు వాటి అవసరం లేదు. అయితే అది కొత్త ఆచారమని ఆ స్త్రీలు నచ్చజెప్పారు. తాను జంబాలకుపోయే రకం కాదని కాండీడ్ బదులిచ్చాడు. గొడవ చేస్తే కిటికీలోంచి తోసిపారేస్తానని ఆ మతబోధకుణ్ని హెచ్చరించాడు మార్టిన్. కాండీడ్‌ చస్తే అతణ్ని ఖననం చేయనని అతడూ బెదిరించాడు. వచ్చిన దారిన వెళ్లకపోతే నిన్ను నేనే పాతరేస్తానన్నాడు మార్టిన్. గొడవ ముదిరింది. మార్టిన్ అతని జబ్బ పుచ్చుకుని బయటికి గెంటేశాడు. అది పెద్ద నేరమైపోయింది. న్యాయస్థానంలో వ్యాజ్యం మొదలైంది.



కాండీడ్ క్రమంగా కోలుకోసాగాడు. కాలక్షేపం కోసం కొంతమంది నవనాగరికులను విందుకు పిలిచాడు. వాళ్లు  పేకాట మొదలుపెట్టారు. తనకు ఒక్కసారైనా ఆసు ముక్క రాకపోవడంతో కాండీడ్ విస్తుబోయాడు. మార్టిన్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు.

కాండీడ్‌కు పారిస్ నలుమూలలనూ చూపినవాళ్లలో బైరాగి ఒకడు. పారిస్‌మీదుగా పోయే పర్యాటకుల నానా అవసరాలు తీర్చి, నగర విశేషాలు వివరించి, వినోదం ఇతరత్రా ఏర్పాట్లు చేసే బాపతు. సొంతూరు పెరిగార్డ్. అతడు కాండీడ్, మార్టిన్‌లను తొలుత నాటకశాలకు తీసుకెళ్లాడు. అక్కడ కొత్త విషాదాంత నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అతడు కులాసారాయుళ్ల పక్కన కూర్చున్నప్పటికీ నాటకంలో విషాద దృశ్యాలు వచ్చినప్పుడల్లా భోరుమంటూ ఏడ్చాడు. పక్కనే కూర్చున్న విమర్శకుడొకడు విశ్రాంతి సమయంలో కాండీడ్‌తో ముచ్చట్లు పెట్టుకున్నాడు. 

‘‘మీరు అనవసరంగా ఏడ్చారు. ఆ నటి చెత్తగా ఉంది. నటుడు అంతకంటే చెత్త. వీళ్లద్దరికంటే నాటకం పరమచెత్త. నాటక రచయితగాడికి ఒక్క అరబిక్ ముక్కా రాదు. అయినా ఒక సన్నివేశం అరేబియాలో సాగుతుంది. వాడికి స్వతస్సిద్ధ భావాల్లో నమ్మకం లేనట్లుంది. వీడి చెత్తనాటకంపై రేపు ఇరవై సమీక్షలు తీసుకొస్తా, అన్నీవ్యతిరేకంగానే’’ ఆవేశంతో అన్నాడు విమర్శకుడు.

కాండీడ్ బైరాగి వైపు తిరిగి, ‘‘ఫ్రెంచిలో మొత్తం ఎన్ని నాటకాలున్నాయి’’ అని విచారించాడు.  

‘‘అయిదారు వేల దాకా.’’

‘‘హబ్బో! చాలా ఎక్కువే. అందులో మంచివి ఎన్నుండొచ్చు?’’

‘‘పదిహేనో, పదహారో.’’

‘‘అక్కడికీ చాలా ఎక్కువే’’ మధ్యలో అందుకున్నాడు మార్టిన్.

ఆ నిస్సార విషాదాంత నాటకంలో ఎలిజబెత్ రాణి పాత్ర పోషించిన నటి నటనావైదుష్యాన్ని కాండీడ్ తెగ మెచ్చుకున్నాడు.

‘‘ఆమె మతిపోగొట్టేలా ఉంది. క్యూనెగొండ్‌ను గుర్తుకుతెస్తోంది. ఆమెను అభినందించాలనిపిస్తోంది’’ ఉత్సాహం తట్టుకోలేక అన్నాడు మార్టిన్‌తో.

ఆమె ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తానన్నాడు బైరాగి.

కాండీడ్ జర్మనీలో పుట్టిపెరిగినవాడు కావడంతో ఈ శిష్టజనుల మర్యాదలు, రీతిరివాజులపై ఆరా తీశాడు. ఇంగ్లండ్ రాణులను ఫ్రాన్స్ లో ఎలా గౌరవిస్తారని అడిగాడు.

‘‘అది ఆయా ప్రాంతాలను బట్టి  ఉంటుంది. రాష్ట్రాల్లోనైతే వాళ్లను సత్రాలకు తీసుకెళ్తారు. అదే  ప్యారిస్ లో అయితే అందంగా ఉన్నప్పుడు ఎక్కడాలేని మర్యాదలు చేస్తారు. చచ్చిపోతే చెత్తకుప్పపైన పారేస్తారు.’’

‘‘రాణులను చెత్తకుప్పపైన పారేయడమా?’’ విస్తుబోయాడు కాండీడ్.

మార్టిన్ అందుకున్నాడు, ‘‘అవును. మనోడు చెప్పింది పచ్చి నిజం. వెూనిమియా దొరసాని(ఒక నటి అంత్యక్రియల ప్రస్తావన) చనిపోయినప్పుడు పారిస్‌లోనే ఉన్నాను. వీళ్లంతా గౌరవప్రద అంత్యక్రియలు చెప్పుకునేవాటిని ఆమెకు నిరాకరించడంతో ఆమెను బిచ్చగాళ్ల పీనుగులతోపాటు దరిద్రపుగొట్టు వల్లకాటికి పంపారు. అయినవాళ్లందరికీ దూరంగా బర్డండీ వీధిలో ఓ మూల పాతిపెట్టారు. బతికున్నప్పుడు ఎంతో గొప్పగా మంచి ఆలోచనలతో బతికిన ఆమె ఆత్మ ఈ దిక్కుమాలిన పూడకానికి ఎంతగా ఘోషించి ఉంటుందో!’’

‘‘ఇది చాలా అనాగరికం!’’

‘‘అంతకంటే ఏమాశిస్తాం? ఇక్కడ మనుషులు అట్టా తయారవుతారు. ఊహకందే అన్ని వైరుధ్యాలూ, విడ్డూరాలూ వీళ్ల ప్రభుత్వంలో, న్యాయస్థానాల్లో, చర్చీల్లో, ఈ మొత్తం అసంబద్ధ జాతిలో సాక్షాత్కరిస్తాయి’’

‘‘ప్యారిస్ వాసులు నిత్యం నవ్వుతూ తుళ్లుతూ సంతోషంగా ఉంటారా?’’

‘‘అవును. కానీ విసుగొచ్చి నవ్వుతారు. ప్రతిదానికీ పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వుతారు. ఘోర నేరాలనూ నవ్వుతూనే చేస్తారు’’ చెప్పాడు బైరాగి.

‘‘నటుల నటనాకౌశలంతో నన్నలరించి, నాతో కన్నీళ్లు  పెట్టించిన ఆ నాటకాన్ని అంత కటువుగా విమర్శించిన ఆ మొరటుమనిషి ఎవడు?’’ మళ్లీ నాటకం గోలలో పడ్డాడు కాండీడ్.

‘‘వాడా! వాడో నీచుడులెండి. ప్రతి పుస్తకాన్నీ, ప్రతి నాటకాన్నీ పరమబూతులు తిట్టి.. పొట్టపోసుకుంటూ ఉంటాడు. కొజ్జాలు ప్రేమవిజేతలను ద్వేషించినట్ల్లు, అతగాడు జనం మెచ్చిన ప్రతి రచయితనూ ద్వేషిస్తుంటాడు. వాడు బురదా, విషమూ తిని బతికే సాహిత్యసర్పం. కరపత్రం రాయుడు’’ విశేషణాలతో తిట్టిపోశాడు ఆబీ.

‘‘కరపత్రం రాయుడు అంటే?’’

‘‘వెర్రి పత్రికలవాడు.. పాత్రికేయుడు!’’

నాటకం ముగిశాక కాండీడ్ జతగాళ్లు మెట్లపై నిలబడి మాట్లాడుకుంటూ ఇళ్లకు వెళ్లిపోతున్న ప్రేక్షకులను చూడసాగారు.

‘‘క్లయిరాన్‌గారి నటన నాకెంతో నచ్చింది. క్యూనెగొండ్‌ను చూడాలని ఎంతగా తపనపడుతున్నానో, క్లయిరాన్‌తో కలిసి భోంచేయాలనీ అంతగా తపనపడుతున్నాను’’ కాండీడ్ పలవరించాడు.

అయితే బైరాగి.. ఉన్నత వర్గానికి చెందిన క్లెయిరాన్‌ను పరిచయం చేయగల స్థాయి గలవాడు కాదు.

‘‘ఆమెకు ఈ సాయంత్రం ఏదో పనుంది. కానీ మీకు అంతకంటే సలక్షణమైన ఇంకొకామెను పరిచయం చేస్తాను. ఆమె ఇంట్లో మీకు నాలుగేళ్ల పారిస్ అనుభవం వస్తుంది’’ అని వేరే బేరం చెప్పాడు.

కాండీడ్ సహజంగానే కుతూహలప్రాణి కనక తీసుకెళ్లమన్నాడు. ఆ సలక్షణవంతురాలు సెయింట్ హనోర్ ప్రాంతంలో ఉంటోంది. వీళ్లు వెళ్లేసరికి పేకాట జోరుగా సాగుతోంది. పన్నెండు మంది ఆత్రంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆటగాళ్ల ముఖాలు పాలిపోయి ఉన్నాయి. ఆటకు డబ్బులు అరువిచ్చే షావుకారి ముఖమూ ఆందోళనగా ఉంది. ఇంటి యజమానురాలు అతని పక్కనే కూర్చుని పిల్లికళ్లతో పేకముక్కల వంక కన్నార్పకుండా చూస్తోంది. జూదగాళ్లు పడేసిన ముక్కలను తిప్పిచూస్తూ ముఖంలో ఆందోళన కనిపించకుండా జాగ్రత్తపడుతోంది. లేకపోతే ఆమె వ్యాపారం దెబ్బతింటుంది గా మరి. ఆమె తనను పరోలిగ్నాక్ జమిందారిణి అని గౌరవంగా పిలవాలని చెబుతూ ఉంటుంది అందరితో. ఆమె పదిహేనేళ్ల కూతురు ఆటగాళ్లతోపాటే కూర్చుంది. ఆటగాళ్లెవరయినా తమ జాతక చక్రాలకు తగిన మరమ్మతు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ సంగతిని కనుసైగలతో తల్లికి చేరవేస్తోంది. బైరాగి, కాండీడ్, మార్టిన్‌లు గదిలోకి ప్రవేశించినా ఎవరి ముక్కల్లో వాళ్లు మునిగిపోయి ఉండడంతో ఎవరూ లేవలేదు, కనీసం పలకరించనూ లేదు, పట్టించుకోనూ లేదు.


‘‘మా థండర్ టెన్ ట్రాంక్ జమీందారిణికి ఇంతకంటే మంచి మర్యాదలు తెలుసు’’ కాండీడ్ వెటకరించాడు.

దీంతో బైరాగి యజమానురాలి దగ్గరికెళ్లి చెవిలో గొణగ్గానే ఆమె చప్పున కుర్చీలోంచి లేచి చిరునవ్వుతో కాండీడ్‌కు మర్యాద చేసింది. తలను ఠీవీగా ఊపి మార్టిన్నూ గౌరవించింది. కాండీడ్‌ను కూర్చోబెట్టి పేకముక్కలు అందించారు. రెండు ఆటల్లో యాభైవేల ఫ్రాంకులు పోగొట్టుకున్నాడు. దీంతో బుద్ధిగా ఆటకట్టిపెట్టి భోజనానికి లేచారు. అంత డబ్బు పోగొట్టుకున్నా కాండీడ్ కాస్త కూడా బాధపడకపోవడం చూసి అందరికీ ఆశ్చర్యమేసింది. ‘‘ఈ ప్రభువులవారు కచ్చితంగా ఆంగ్లేయ ప్రభువులవారై ఉంటారు సుమీ’’ అని చెప్పుకున్నారు ఇద్దరు సేవకులు తమదైన దాసభాషలో.

భోజనం పారిస్ పద్ధతిలాగే సాగింది. తొలుత నిశ్శబ్దం, తర్వాత అస్పష్టమైన మాటల రొద, పేలవమైన ఛలోక్తులు, అవాకులు చవాకులు, కాస్త రాజకీయాలు, చాడీలు, బూతు కూతలు వగైరా. పుస్తకాలపైనా మాట్లాడుకున్నారు.

‘‘గాషా పండితుని కొత్త నవల చూశారా?’’అడిగాడు బైరాగి.

‘‘ఆ. కానీ దాన్ని పూర్తిచెయ్యడం నావల్ల కాలేదు బాబూ. ఈ రోజుల్లో వరదలా వెల్లువెత్తుతున్న చెత్త పుస్తకాల్లో అదొకటి. వాటిలోనూ పరమచెత్త పుస్తకం. ఈ పుస్తకాలతో విసుగెత్తే ఇక్కడికొచ్చి పేకాడుతున్నా’’ అన్నాడు ఒకతను.

‘‘మరి కేనన్ టీ వ్యాసాలు! వాటిపై మీ అభిప్రాయం?’’ మళ్లీ బైరాగే అడిగాడు.

యజమానురాలు అందుకుని, ‘‘అబ్బ! అవి మరీ తలనొప్పి. అందరికీ తెలిసినవాటి గురించి చెప్పడానికి ఆయన ఎంత అల్లాడిపోతాడో. మాటవరసకు కూడా చెప్పుకోని వాటిపై ఊదరగొట్టి చంపేస్తాడు. ఇతరుల ఛలోక్తులను కాజేయడం ఒకటైతే, వాటిని మళ్లీ వప్పజెప్పేటప్పుడు అసలు సంగతే జారవిడడం మరొక దరిద్రం. అలా దొంగిలించిన వాటినీ పాడుచేసి పారేస్తున్నాడు మహానుభావుడు. ఆయన రాతలతో జబ్బుపడిపోయాను బాబూ. ఇకపై ఆ ప్రమాదముండదు లెండి. ఆయన పుస్తకంలో నాలుగు పేజీలు చదివితే చాలు సరిపోతుంది’’ అంది.

కాస్త చదువుకున్న ఓ పెద్దమనిషి ఆమెను వెనకేసుకొచ్చాడు. చర్చ విషాదాంత నాటకాల వైపు మళ్లింది. ఒక్కడూ చదవని కొన్నివిషాదాంతాలు రంగస్థలంపైకి ఎలా దూసుకొస్తున్నాయబ్బా అని ఆశ్చర్యపోయిందామె. సరుకు లేని చెత్త నాటకాలు ప్రేక్షకులకు ఎలా ఆసక్తి కలిగిస్తాయో విశదీకరించాడు పెద్దమనిషి. ఏ నవల నుంచో రెండు సన్నివేశాలు తీసుకుని చొప్పిస్తే సరిపోదని నిరూపించాడు.

‘‘నాటకకర్త భావాలు కొత్తగా, ఉదాత్తంగా, సహజంగా ఉండాలి, విపరీతంగా కాదు. అతడు మానహృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, దానితో మట్లాడించేలా ఉండాలి. గొప్ప కవి కూడా అయి ఉండాలి. అయితే తన పాత్రలను కవిత్వంతో ముంచెత్తకూడదు.. భాషను బాగా అర్థం చేసుకుని స్వచ్ఛంగా, శ్రావ్యంగా అర్థాన్ని పాడుచేసే యతిప్రాసల జోలికిపోకుండా రాయాలి...
ఈ సూత్రాలను అతిక్రమించేవాడు ప్రేక్షకులు హర్షించే ఒకటి, రెండు విషాదాంతాలను రాయగడేవెూ కానీ , ఎన్నటికీ మంచి రచయిత కానే కాలేడు. మంచి విషాదాంతాలు కొన్నే ఉన్నాయి. వాటిలోనివి చిన్నసంగతులే అయినా బాగా రాశారు. కొన్ని రాజకీయసిద్ధాంతాలతో దట్టించి ఉన్నాయి. చూస్తే చాలు నిద్ర ముంచుకొస్తుంది. కొన్ని గోరంతల్ని కొండంతలు చేసి చూపిస్తాయి. పిచ్చి వాగుళ్లు, అర్థపర్థం లేని సన్నివేశాలు, బండ శైలి, దేవుళ్లపై చాంతడంత దండకాలు.., మనుషులతో మాట్లాడే పద్ధతి తెలియదు కనక.. తప్పుడు వ్యాఖ్యానాలతో కొన్ని తలనొప్పి పుట్టిస్తాయి’’ వివరించాడు పెద్దమనిషి.

కాండీడ్ ఇందతా శ్రద్ధగా విని, ఆ పెద్దమనిషి చాలా గొప్పవాడని అనుకున్నాడు. ఇంతలో యజమానురాలు తన పక్కన కూర్చోవాలని అడగడంతో.. కాస్త చొరవ తీసుకుని అంత బాగా మాట్లాడిన ఆ పెద్దమనిషి ఎవరని అడిగాడు.

‘‘ఆయన పండితుడు. పేకాడడు. బైరాగి అప్పుడప్పుడూ భోజనానికి తీసుకొస్తుంటాడు. ఆయన విషాదాంతాలను, ఇతర పుస్తకాలను బాగా చదివాడు. స్వయంగా ఒక విషాదాంతం రాశాడు కూడా. దాన్ని ప్రదర్శించినప్పుడు పెద్ద గొడవ చేశార్లే. ఆయన ఒక పుస్తకం అచ్చేశాడు కూడా. నాకు ఇచ్చిన ఒక్క ప్రతి తప్ప దాన్ని నేను ఏ అంగట్లోనూ చూడలేదు’’ చెప్పింది యజమానురాలు.

‘‘నిజంగా గొప్పవాడే. మరో పాంగ్లాస్!’’ అన్నాడు కాండీడ్.


తర్వాత ఆ పండితునివైపు తిరిగి, ‘‘అయ్యా! ఈ ఐహిక, భావ ప్రపంచాల్లోని ప్రతీదీ మన మంచికోసమేనని, భిన్నంగా ఉండడానికి వీల్లేదని మీరు నమ్ముతారా?’’ అని అడిగాడు.

‘‘నేను మటుకు అలా అనుకోవడం లేదండి. మనకు ఏదీ సవ్యంగా జరగడం లేదని అనుకుంటున్నాను. సంఘంలో తన స్థానమేమిటో, తనేకది సరైన ఉద్యోగమో ఒక్కడికీ తెలియదు. ఏదో అప్పుడప్పుడూ ఇలా సందడిగా, జనం కలివిడిగా కనిపించే విందులను మినహాయిస్తే, మన మిగతా సమయమంతా.. అర్థంపర్థం లేని కొట్లాటలు, వెూలినిస్టులతో జాన్సెనిస్టుల గొడవలు, చర్చితో పార్లమెంటు గొడవలు, పండితుల తగవులు, ఉండుపుగత్తెల జట్టుపీకుళ్లు, న్యాయస్థానాల్లో ఒకడిపై ఒకడి దావాలు, జనంతో రుణదాతల కొట్లాట, మొగుళ్లతో పెళ్లాల పోట్లాట, బంధువులతో తగవులు.. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్యుద్ధంలో గడిపేస్తున్నామనుకోండి’’ వివరించాడు పెద్దమనిషి.

‘‘నేను కూడా ఈ ఘోరాలను చూశాను లెండి. అయితే ఇవన్నీ మన మంచికేనని, వాటిలో గొప్ప ఔచిత్యం ఉందని ఒక విజ్ఞాని నాకు చెప్పాడు. ఇవన్నీ మంచి చిత్రపటంలోని నీడల్లాంటివని బోధించాడు. పాపం అతడిప్పుడులేడు లెండి. ఉరితీశారు.’’

‘‘అయితే, ఆయన ప్రపంచమ్మీదే పెద్ద ఛలోక్తి విసిరాడన్నమాట. మీరు చెప్పిన ఆ నీడలు ఉత్తినీడలు కావు, మానవజాతికి మహా కళంకాలు.’’

‘‘వాటిని తెచ్చేది మనుషులేగాని, మరొకళ్లు కాదు కదా!’’

‘‘అయితే అది వాళ్ల తప్పు కాదు.’’

అక్కడి జూదగాళ్లలో చాలా మందికి ఈ చర్చ బొత్తిగా అర్థంకాకపోవడంతో మధుభాండాలను ఖాళీ చేస్తూ కూర్చున్నారు. మార్టిన్ ఆ పండితుడితో వాదిస్తుండగా, కాండీడ్ యజమానురాలికి తన సాహసకృత్యాల్లో కొన్ని వివరించాడు.

భోజనాలు ముగిశాక ఆమె కాండీడ్‌ను తన గదిలోకి తీసుకెళ్లి దివానంపై కూర్చోబెట్టింది.

‘‘అయితే మీరింకా ఆ థండర్ టెన్ ట్రాంక్ జమీందారు బిడ్డ క్యూనెగొండ్ దొరసానినే ప్రేమిస్తూ ఉన్నారన్నమాట’’ అందామె.

‘‘అవునండీ.’’

ఆమె చిరునవ్వు నవ్వింది.

‘‘మీరింకా వెస్ట్‌ ఫాలియా యువకుడి మాదిరే చెబుతున్నారు. అదే మా ఫ్రెంచి కుర్రాడైతేనా, ‘నేనొకప్పుడు క్యూనెగొండ్ దొరసానిని ప్రేమించినమాట జిజమే. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక, ఆమెపైకి ఇక మనసు ఏమాత్రం పోవడం లేదు’ అని చెప్పి ఉండేవాడు.’’

‘‘అలాగా. సరే మీకు నచ్చినట్టే బదులిస్తా.’’

‘‘క్యూనెగొండ్ చేతిరుమాలిని పైకి తీసినప్పట్నుంచి ఆమెపై మీకు వలపు కలిగింది. ఆ రకంగానే ఇప్పుడు నా మేజోడును కూడా విప్పి పట్టుకోండి.’’

‘‘హృదయపూర్వకంగా..’’ అంటూ ఆమె తొడదాకా ఉన్న మేజోడును విప్పాడు కాండీడ్.

‘‘ఇప్పుడు దాన్నితిరిగి తొడిగితే ఎంతో సంతోషిస్తా.’’

కాండీడ్ అలాగే చేశాడు.

‘‘మీరు ఇక్కడికి కొత్త. నా ప్యారిస్ ప్రేమికులను నేను కొన్నిసార్లు పక్షం రోజులకు వరకు ఉవ్విళ్లూరించేదాన్ని. అయితే మీరు వెస్ట్‌ ఫాలియా యువకులు కావడంతో మిమ్మల్ని గౌరవించడం మా దేశధర్మం కనక తొలి పరిచయంలోనే మీకు లోబడుతున్నాను’’ అందామె వగలు పోతూ.


కాండీడ్ చేతిలో మిరుమిట్లుగొలుపుతున్న రెండు వజ్రపుటుంగరాలను ఆ నెరజాణ తెగ పొడిగేసింది. మరుక్షణంలో అవి ఆమె వేళ్లను అలంకరించాయి.

తర్వాత కాండీడ్ బైరాగితో కలిసి సత్రానికి తిరిగి వెళ్లగానే క్యూనెగొండ్‌కు నమ్మకద్రోహం చేశానని తెగ పాశ్చాత్తాపపడ్డాడు. బైరాగి దీన్ని గమనించి కాండీడ్‌కు తగ్గట్లు ధోరణి మార్చాడు. కాండీడ్ పేకాటలో పోగొట్టుకున్న యాభైవేల ఫ్రాంకులు, పేకాట యజమానురాలు లాగేసుకున్న వజ్రపుటుంగరాల్లో బైరాగికి నామమాత్రం వాటానే ముట్టింది. కాండీడ్ నుంచి వీలైనంత ధనం లాగాలని ఎత్తువేశాడు. క్యూనెగొండ్ గురించి పదేపదే మాట్లాడసాగాడు. ఇది కనిపెట్టలేని వెర్రిబాగుల కాండీడ్ మాటల్లో పడిపోయి తాను క్యూనెగొండ్‌ను వెనిస్‌లో కలుసుకున్నాక  క్షమాపణ కోరతానని బైరాడితో అన్నాడు.

దీంతో బైరాగి మరింత ముఖాన్ని మరింత వినయంగా పెట్టి, చెవులను మరింత రిక్కించాడు. కాండీడ్ తన ఘనకార్యాలేంటో వివరించడంతోపాటు, ఇకపై ఏం చేయాలనుకున్నదీ బయటపెట్టాడు. 

‘‘అయితే మీరు క్యూనెగొండ్ దొరసానిని వెనిస్లో కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నరన్నమాట’’ బైరాగి అన్నాడు.

‘‘అవును. నేనక్కడకు వెళ్లి తీరాలి’’ చెప్పాడు యువకుడు.

ప్రియురాలి ముచ్చట్లను చెప్పే ఆనందంలో కాండీడ్ తన సహజ ధోరణిలో పడిపోయి ఆమెతో తన ప్రేమాయాణాన్ని కూలంకషంగా బయటపెట్టాడు.

‘‘అయితే దొరసాని బహుచమత్కారి అనుకుంటాను. ఆమె రాసిన లేఖలు అద్భుతంగా ఉండాలి’’ బైరాగి ఆరా తీశాడు.

‘‘అబ్బే. ఆమె నాకెప్పుడూ లేఖలు రాయలేదు. నన్ను ఆ ఇంట్లోంచి వెళ్లగొట్టాక నేనూ ఆమెకు లేఖ రాయలేదు. తర్వాత కొంతకాలానికి ఆమె చనిపోయిందని తెలిసింది.  తర్వాత మళ్లీ కలుసుకున్నాను. మళ్లీ విడిపోయాం. ఇక్కడికి నాలుగువేల మైళ్ల దూరంలో ఉన్న ఆమె దగ్గరకు సేవకుణ్ని పంపి ఎదురుచూస్తూ ఉన్నాను.’’

బైరాగి ఆందోళనపడుతున్నట్టు, విస్తుబోతున్నట్టు ముఖం పెట్టి అంతా జాగ్రత్తగా విన్నాడు. తర్వాత కాండీడ్, మార్టిన్‌లను కౌగిలించుకుని సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు. మర్నాడు. పొద్దున లేచేసరికి కాండీడ్‌కు ఓ లేఖ అందింది.

‘‘ప్రియసఖా! నేను వారం రోజుల నుంచి ఈ పట్టణంలో జబ్బుతో పడున్నాను. నువ్విక్కడే ఉన్నావన్న సంగతి ఇప్పుడే తెలిసింది. నేను కాస్త కదిలే స్థితిలో ఉండుంటే రెక్కలు కట్టుకుని వచ్చి నీ ఒడిలో వాలేదాన్ని. నీ బోర్దా ప్రయాణం గురించి విని.. కకంబోను, ముసలమ్మను అక్కడే వదిలేసి వచ్చాను. వాళ్ల త్వరలోనే వస్తారు. బ్యూనోస్ ఏరీస్ గవర్నర్  నా సర్వస్వాన్నీ లాగేసుకోగలిగాడు కానీ నా మనసులో మాత్రం ఇప్పటికీ నువ్వే పదిలంగా ఉన్నావు. వెంటనే రావాలి. నువ్వొస్తే పోతున్న ప్రాణాలు తిరిగొస్తాయి. నువ్వు రాకపోతే సంతోషంగా తనువు చాలిస్తా..’’ అని లేఖలో ఉంది.  

ప్రేమపరిమళం విరజిమ్ముతూ ఊహించని విధంగా ఈ లేఖ రావడంతో కాండీడ్ ఆనందానికి పగ్గాల్లేకుండా పోయాయి. అయితే ప్రియురాలికి జబ్బుగా ఉందని తెలిసి ఎంతో బాధపడ్డాడు. బాధ, సంతోషాల మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ తన వద్దున్న బంగారం, వజ్రాలు తీసుకుని ఉన్నపళంగా మార్టిన్‌తో కలసి క్యూనెగొండ్ బస చేసిన సత్రానికి వెళ్లాడు. ఉద్వేగంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. మాట తడబడుతోంది. గది చీకటిగా ఉండడంతో ఆత్రం తట్టుకోలేక పడక తెరను సర్రున లాగబోయాడు.

‘‘జాగ్రత్త! ఏంటి మీరు చేస్తోంది? వెలుతురు సోకితే ఆమె ప్రాణాలు పోతాయి’’ అంటూ పరిచారిక తెరను వెనక్కి లాగింది.

‘‘అయ్యో, ప్రియతమా! నీకెలా ఉంది? నన్ను చూడలేకపోతే కనీసం మాట్లాడనైనా మాట్లాడకూడదా’’ విలపించాడు కాండీడ్.

‘‘ఆమె ప్రస్తుతం మాట్లాడేస్థితిలోనూ లేదు అంది పరిచారిక. తర్వాత పడకపై నుంచి లావుపాటి చెయ్యిని లాగి కాండీడ్ చేతికందించింది. అతడు దాన్ని కన్నీటితో తడిపేశాడు. తర్వాత ఆ చేతినిండా వజ్రాలు పోశాడు. బంగారం మూటను కుర్చీలో ఉంచాడు.

ఇంతలో ఓ అధికారి, బైరాగి, కొంతమంది భటులు లోనికొచ్చారు.

‘‘వీళ్లేనా ఆ అనుమానాస్పద ఆగంతకులు?’’ అంటూనే ఆ అధికారి కాండీడ్, మార్టిన్‌లను బంధించి చెరసాలకు తీసుకెళ్లాలని భటులను ఆదేశించాడు.

‘‘ఎల్డొరాడోలో ప్రయాణికులను ఈ విధంగా మాత్రం గౌరవించరు’’ చింతించాడు కాండీడ్.

‘‘మనిషి చెడ్డవాడనే విషయం మాత్రం నాకిప్పుడు మరింత బాగా తెలిసొచ్చింది’’ మార్టిన్ రెచ్చగొట్టాడు.

‘‘అయితే, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?’’ అడిగాడు కాండీడ్.

‘‘ఎక్కడికా? చీకటి కొట్లోకి’’ చెప్పాడు అధికారి.

మార్టిన్ తేరుకుని పరిస్థితిని అంచనా వేశాడు. క్యూనెగొండ్‌లా నటించిన మహిళ, కాండీడ్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న బైరాగీ,ఆ అధికారీ వెూసగాళ్లని, వాళ్లను తేలిగ్గా వదలించుకోవచ్చనుకుని కాండీడ్‌కు ఓ సలహా ఇచ్చాడు. 

న్యాయస్థానానికెక్కి అల్లరిపాలవడం ఇష్టంలేకా, మరోపక్క క్యూనెగొండ్‌ను వెంటనే చూడాలన్న తహహతతోనూ కాండీడ్ ఆ సలహాను చక్కగా పాటించాడు. ఒక్కొక్కటి మూడువేల పియస్టళ్ల విలువచేసే మూడు చిన్న వజ్రాలను అధికారికి ఎర వేశాడు.

‘‘బావుంది, బావుంది. గతంలో మీరెన్ని ఘోరనేరాలు చేసినా ఈ ప్రపంచంలో ఇప్పటికి మీరే గుణవంతులు. అయ్య బాబోయ్, మూడు వజ్రాలే! ఒక్కొక్కటికీ మూడువేల పియస్టళ్లే! మిమ్మల్ని కటకటాలపాలు చేస్తానా, చావనైనా చస్తాను గానీ. ఇక్కడ కొత్తవాళ్లందరీశీ ఖైదు చేస్తారు. అయితే ఆ సంగతి నాకొదిలేయండి. నార్మండీలోని డీప్పీలో నా సోదరుడు ఉన్నాడు. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. వాడికో వజ్రం ఇచ్చారంటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతాడు’’ అన్నాడా అధికారి.

‘‘సరే. మరైతే కొత్తవాళ్లందర్నీ ఖైదు చేయడమెందుకో?’’ కాండీడ్ మళ్లీ అడిగాడు.

ఈ సారి బైరాగి జవాబిచ్చాడు. ‘‘ఆర్టోస్ నుంచి వచ్చిన ఓ బిచ్చగాడు కొంతమంది ఏదో చెత్త మాట్లాడుకోవడం విని, ఆవేశం తట్టుకోలేక ఖూనీ చేశాట్ట. అయితే అది 1610 మే నాటి ఖూనీ లాంటిది కాదు, 1594 డిసెంబర్ నాటి హత్యాయత్నం లాంటింది. తర్వాత కాలంలో చాలా మంది బిచ్చగాళ్లు జనం చెత్తవాగుళ్లను విని చాలా హత్యలు చేశారు.’’

అధికారి దీన్ని మరింతగా విశదీకరించాడు.

కాండీడ్ యథావిధిగా విస్తుబోయాడు. ‘‘ఎంత రాక్షసం! అయితే గానాబజానాలంటే పడిచచ్చే వాళ్లే ఇలాంటి దారుణాలకు ఒడిగడతారనా మీరనేది? పులులను కోతులు భయపెట్టే ఈ రాజ్యం నుంచి సాధ్యమైనంత తొందరగా వెళ్లిపోవడం ఉత్తమం. మా దేశంలో నేనూ ఎలుగుబంట్లను చూశాను. కానీ మనుషులంటే ఎల్డొరాడో మనుషులే. అయ్యా, అధికారీ.. దయచేసి మమ్మల్ని వెనిస్ తీసుకెళ్లండి. నేనక్కడ నా క్యూనెగొండ్ కోసం ఎదురు చూడాలి’’ ప్రాధేయపడ్డాడు ప్రేమార్తుడు.

‘‘మిమ్మల్ని దిగువ నార్మండీ వరకే తీసుకెళ్లగలను’’ అధికారి తేల్చేశాడు.

తర్వాత కాండీడ్, మార్టిన్‌ల చేతిసంకెళ్లు తీయించాడు. తాను పొరపడ్డానని చెప్పి తన భటులను అక్కడి నుంచి పంపేశాడు. కాండీడ్, మార్టిన్‌లను డీప్పీకి తీసుకెళ్లి తన సోదరునికి అప్పగించాడు. అక్కడి రేవులో చిన్న డచ్చి ఓడ బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. కాండీడ్ తన కొత్త సంరక్షకుడికి మూడు వజ్రాలు ఇచ్చి అందులో ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ఓడ నిజానికి ఇంగ్లండ్‌లోని పోర్ట్స్‌ మత్‌కు పోతోంది. అది వెనిస్ దారి కాకపోయినా తక్షణం ఈ నరకం నుంచి బయటపడితే చాలని, తర్వాత అక్కడి నుంచి వెంటనే వెనిస్ కు వెళ్లొచ్చని అనుకున్నాడు కాండీడ్.




(సశేషం) 





2 comments:

  1. So nice..I am reading from the middle but still very easy to follow and get connected to some incidents in life...Beauty of this writing is without fail everyone get connected to it while reading. Truth of life...Show must go on...I am so eager to know whether he met that gal or not...:)

    ReplyDelete