Thursday, 19 February 2015

గోగా.. అందుకే నీకంత గ్లామర్!







నీలి సాగరం మధ్య పచ్చని దీవిలో కలకలం రేగింది. గుట్టమీది పురా సమాధిలోంచి వికటాట్టహాసం బద్దలైంది. సమాధిలోపలి పుర్రె తన చుట్టూ ఉన్నమెత్తటి మట్టిని తొలుచుకుంటూ విరగబడి నవ్వుతోంది. దీవి అంచులను తమకంతో ముద్దాడుతున్నకడలి హోరులో కపాల పరిహాసపు ప్రతిధ్వని. పుర్రె కదిలింది. ఎముకలగూడు లేచింది. సమాధి పగిలింది.



అస్థిపంజరం కొండ దిగింది. ఊర్లోకొచ్చింది. ఇంటర్నెట్ కఫేకు వెళ్లింది. గూగుల్ సెర్చ్ లో కెళ్లింది. కావలసిన దాన్ని క్షణంలో వెతికి పట్టుకుంది. మానిటర్ పై మెరిసిపోతున్న రంగురంగుల బొమ్మను లేని నిలువుగుడ్లేసుకుని చూసింది. కొన్ని నిమిషాల మౌనం. అస్థిపంజరం వణికింది. లేని కళ్లు చెమ్మగిల్లాయి. లేని గుండె బరువెక్కింది. అస్థిపంజరం లేని నోటితో మళ్లీ నవ్వింది. పగలబడి నవ్వింది. లేని పొట్టను పట్టుకుని విరగబడి నవ్వింది. నవ్వీనవ్వీ అలసిపోయి కుర్చీలో జారగిలబడింది. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంది. దగ్గరున్న మనుషులను పలకరించింది. ఎవరూ పలకలేదు. గిల్లింది. ఉలకలేదు. రక్కింది. కదల్లేదు. అరిచింది. వినలేదు. కపాల కనురంధ్రాలు ఎర్రబడ్డాయి. కోపమొచ్చింది. ఏడుపొచ్చింది. నవ్వొచ్చింది. పిచ్చొచ్చింది.
కాసేపటికి అస్థిపంజరం కుదుటపడింది. రెండు ఈమెయిల్ అడ్రస్ లు సృజించుకుని చాటింగ్ లో స్వీయ సంభాషణ మొదలెట్టింది.
‘‘విన్నావా గోగా? నవ్వు బతికున్నప్పుడు ఈ తాహితీ దీవిలోనే 1892లో నువ్వేసిన నువ్వెప్పుడు పెళ్లాడతావే?’ బొమ్మ 1800 కోట్ల రూపాయలకు అమ్ముడుబోయిందట!’’
విన్నాను. అందుకేగా విషయమేంటో కనుక్కుందామని గోరీ బద్దలు కొట్టుకుని మరీ వచ్చాను. ఇంతకూ ఏ మహానుభావుడు కొన్నాడో?’’
‘‘ఖతర్ రాచవంశం వాళ్లని అంటున్నారు’’
‘‘నేనూహించింది నిజమేనన్న మాట! రాజులే కొనుంటారని అనుకున్నాన్లే. అన్ని డబ్బులు రాజుల వద్దేగా ఉంటాయి !’’
‘‘పొరపాటు! ఇప్పడు కిరీటం, రాజదండం గట్రాలేని పెద్దమనుషుల వద్ద కూడా అంతకంటే ఎక్కువ డబ్బులున్నాయి’’
‘‘మరే, లోకం బాగా ముదిరిందన్నమాట! రాజులు కాని వాళ్లు అంత డబ్బెలా సంపాదిస్తారో?’’
‘‘మరీ అంత అమాయకంగా మాట్లాడకు. నువ్వు బతికున్నప్పుడు స్టాక్ ఎక్స్ఛేంచ్ బ్రోకర్ గా పనిచేశావు కదా. డబ్బులెలా పోగపడతాయో తెలీదా ఏంటి?’’
‘‘ చచ్చినా ఈ స్టాక్ ఎక్స్ఛేంచ్ గోలేనా? అదంటే రోసిపోయేగా బొమ్మలపై మనసు పారేసుకుని, పెళ్లాం, పిల్లలను విడిచిపెట్టి, యూరప్ గీరపు వదలి, సముద్రాలు దాటి ఈ దీవికొచ్చి హాయిగా బొమ్మలేసుకుందీ, ఇక్కడి వాళ్లతో కలసిపోయిందీ, ఇక్కడే కన్నుమూసిందీ!’’
‘‘కొయ్ కొయ్ కోతలు! ఇక్కడి వాళ్లతో కలసిపోడానికొచ్చావా, లేకపోతే ఇక్కడి నీ కూతురి వయసున్నకన్నెపిల్లలను ఈ పచ్చని దీవిలో, అందమైన తీరంలో రంజుగా అనుభవించడానికొచ్చావా?’’
‘‘ఛత్. మళ్లీ అవే కూతలు! నేనెవర్నీ బలవంతంగా అనుభవించలేదే, ఎవరి పెళ్లాలనూ లేపుకు రాలేదే! వాళ్ల నాకు నచ్చారు. నేనూ వాళ్లకు నచ్చాను. ఇష్టమున్నన్నాళ్లు కలిసున్నాం, ఇష్టం లేకపోతే విడిపోయాం. డబ్బులపై, కానుకలపై ఆశతో ఇష్టం లేకున్నా ఒళ్లప్పగించే నవనాగరికపు ఆడాళ్లనో, లేకపోతే కడుపు నింపుకోడానికో, పిల్లలను సాకడానికో ఒళ్లప్పగించే వేశ్యలనో అనుభవిస్తే అది పవిత్రప్రేమ అవుతుంది కాబోలు!’’
‘‘అంటే నీది శృంగారం, మిగతా వాళ్లది..’’
‘‘నేనలా అనడం లేదు. నాకు నచ్చింది నేను చేశాను. నా ఇష్టం వచ్చినట్టు బతికాను. ఆత్మవంచన చేసుకోలేదు. కృత్రిమత్వంపై కొట్లాడాను, సహజంగా బతకాను. ఉంటే తిన్నాను, లేకపోతే పస్తున్నాను. రోగాలపాలయ్యాను. క్రుశించాను. అంతేకానీ ఎక్కడా రాజీపళ్లేదు. నాకే అమ్మాయిల పిచ్చుంటే ఆ స్టాక్ ఎక్స్ఛేంచ్ లో కోట్లు సంపాదించి రోజుకో ఆడదాంతోనే గడిపేసుందును కదా. నేను చట్రాల్లో ఇమడలేదు. స్వేచ్ఛ కోసం పలవరించాను. నిష్కల్మషమైన, గాఢమైన ఆదిమప్రేమ కోసం పరితపించాను. అది స్వార్థమే. కానీ అది నా జీవితాన్ని, తనివితీరని నా మనోదేహాలను ఛిద్రం చేసుకుని సుఖించే స్వార్థం! డబ్బుదస్కం, పేరుప్రతిష్టలను కోరే స్వార్థం కాదు!’’
‘‘శభాష్. అందుకేగా నవ్వంటే ఈ పిచ్చిజనానికి అంతిష్టం! నవ్వు చచ్చి వందేళ్లు దాటినా నీ బొమ్మలకు అంత విలువ! నాటి నీ తిరుగుబాటుకు ప్రతిఫలంగా నీ బొమ్మలపై ఇప్పడు కనకవర్షమెలా కురుస్తోందో చూడు!’’
‘‘హు... బతుకున్నప్పడు తన్నితగలేశారు. చిత్రహింసలు పెట్టారు. బొమ్మలేసుకుంటానంటే పెళ్లాం నవ్వింది. తిట్టింది. కొట్లాడింది. పిల్లల్ని తీసుకుని పుట్టింటికిపోయింది. తాగుబోతువంది, తిరుగుబోతువంది. బొమ్మలు మానితేనే కాపురమంది. చివరికి దూరమైపోయింది’’
‘‘పాపం ఆవిడ తప్పేముంది? అందరి ఆడాళ్ల మాదిరే కాపురం నిలుపుకోవాలని ఆరాటపడింది’’
‘‘మరి నా ఆరాటం! నేనేం కోరాను? బొమ్మలేసుకుంటానూ అని అన్నా. అంతేకదా. మూర్ఖపు జనానికి నా బొమ్మల విలువ తెలియకపాయ. ఇప్పుడిన్నికోట్లు పోసి కొంటున్న నా బొమ్మలను ఆనాడు అమ్ముకోడానికి ఎన్ని తిప్పలు పడ్డాను? ఎందరి కాళ్లావేళ్లా పడ్డాను? బొమ్మలు అమ్ముడుపోక, డబ్బుల్లేక, కూడూ గుడ్డాలేక, కడుపు దహించుకుపోయే ఆకలితో, పీక్కుపోయిన దేహంతో, రోగాలతో మంచానికి అతుక్కుపోయి, స్నేహితులు దయదలిస్తే కాసింత రొట్టెముక్క తిని, ఘాటు యాబ్సింత్ ను కడుపులో దింపుకుని మత్తులో చిత్తుగా పడిపోయి, పిచ్చిపచ్చిగా వాగుతూ..’’
‘‘అందుకేగా నీకంత గ్లామర్! అంత గుర్తింపు ఊరకే వస్తుందా మరి!’’
’’చచ్చాక వస్తుందనవోయ్, బావుంటుంది! యథార్థవాది బతుకుంటే లోకవిరోధి. చచ్చాకే వాడికి విలువా, గౌరవమూ. సరేగానీ, ఆ ఇద్దరు ఆడంగుల బొమ్మలో ఏముందనోయ్ అంత డబ్బెట్టి కొన్నారు?’’
‘‘కాంతులీనే రంగులు, సరళ రూపాలు, నిష్కల్మషమైన ఆదిమజాతి అతివల స్వప్నాలు.. కళాచరిత్ర గతినే మార్చేసిన సౌందర్య విలువలూ గట్రా ఏమిటో ఉ..న్నా..య..ట!’’
‘‘ఉ..న్నా..య..ట! ఏంటా ఎత్తిపొడుపు మాటలు! ఏం అవన్నీఅందులో లేవా? నేనాడు వీటి గురించే కదా బుర్రబద్దలు కొట్టుకుంది. క్లుప్తత, సారళ్యం, మటుమాయల పొడలేని స్వచ్ఛవర్ణాల ఉద్విగ్ననగ్ననర్తనం.. మొత్తంగా కళ్ల తెరలపై పదికాలాలపాటు నిలిచిపోయే అపురూప కళాదృశ్యం..’’
‘‘ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాదనను. కానీ వీటితోపాటు నీ విశృంఖల జీవితం, నీ తిరుగుబాటు కూడా నీ పేరుప్రతిష్టలకు కారణం కాదంటావా?’’
‘‘మళ్లీ అదేమాటంటావు! నన్నుకాదు నా బొమ్మలను చూడు. ముదురురంగుల ముక్కవాసనల, టన్నుల భేషజాల హావభావాల, పైపైసొగసుల రోతముసుగుల పక్కన.. నా మహోగ్ర జ్వలితవర్ణాల ఆవరణల్లో మెరిసే కొండల్లో, చెట్లలో, గుడిసెల్లో, పశువుల్లో, పక్షుల్లో, పళ్లలో, రాళ్లలో, ఆదిమ దేవతా విగ్రహాల్లో, కల్లాకపటం తెలియని పరువాల్లో, ప్రణయాల్లో, ప్రసవాల్లో, మెలకువలో, నిద్రలో, తీపికలల్లో, పీడకలల్లో, మరణాల్లో, గోరీల్లో.. తారసపడే నా అజరామర కళాభివ్యక్తిని చూడు..’’
‘‘ఇవన్నీ సరే. వీటితోపాటు నీ బతుకులోనూ కావలసినంత మసాలా ఉంది కదా. అందుకే నీ బొమ్మలకన్ని డబ్బులు’’
‘‘నోర్ముయ్, మూర్ఖుడా! నీ బుర్రను ఈ తాహితీ కొండపై బండరాయితో బద్దలుకొట్టిపారేస్తా.. నీ తోలువొలిచి, దానిపై నీ నెత్తుటితో బొమ్మలేస్తా.. నీ మాంసాన్నిఈ దీవి మృత్యుదేవత ఓవిరీకి నైవేద్యం పెడతా.. నీ ఎముకలపై కొండదేవరల బొమ్మలు చెక్కి ఆడుకొమ్మని దిసమొలల పిల్లలకిస్తా..’’
‘‘అందుకేగా నీకంత గ్లామర్, నీ బొమ్మలకన్ని డబ్బులు..’’
                                                                                                                            
                                                                                                                -వికాస్


(ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడు పాల్ గోగా(Paul Gauguin 1848-1903) తాహితీ దీవిలో ఉన్నప్పుడు Nafea Faa lpoipo(When Will You Marry? పేరుతో వేసిన చిత్రాన్ని ఖతర్ రాజవంశం మొన్న రూ. 1800 కోట్లకు కొన్న విషయం తెలిసి ఒక బొమ్మకు ఇంత ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి)




Thursday, 12 February 2015

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు



రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం
రవి వర్మ వేసిన రాజా వర్మ చిత్రం
చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు పక్కన మౌనంగా నుంచుని అందమైన తేడాలు తప్ప అన్ని తేడాలూ సమసిపోవాలని కోరడం మినహా మరేమీ చెయ్యలేం. అందమైన తేడాలు నిజంగానే అంత బావుంటాయా?
రాజా రాజవర్మ.. అవును రాజా రాజవర్మనే! రాజా రవివర్మ కాదు. రవివర్మ తమ్ముడు. అన్న అనే చిక్కని నీడ కింద పూర్తిగా వికసించకుండానే నేలరాలిన మొగ్గ. అన్నను జీవితాంతం అంటిపెట్టుకుని అతని కంటికి రెప్పలా, చేతికి ఊతకర్రలా బతికిన మనిషి. సోదరుడు పురుడుపోసిన హిందూ దేవతలకు బట్టలు సర్దిన మొనగాడు. అన్న బొమ్మకట్టిన నానా రాజుల, తెల్లదొరల ముఖాల వెనక కంటికింపైన తెరలను వేలాడదీసిన సేవకుడు. రవికి బంటురీతిగా మెలగి, అతని వెంట ఆసేతుహిమాచలం తిరిగి, ఏవేవో పిచ్చికలలు కని, అవి తీరకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయిన ఒక మసక రంగుల జ్ఞాపకం.
మనకు రవివర్మ గురించి తెలుసు. జనం అతని దేవతల బొమ్మలను పటాలు కట్టుకుని పూజించడమూ తెలుసు. అతని నున్నటి వక్షస్థలాల మలబారు, నాయరు అందగత్తెల చూపులకు మన చూపులు చిక్కుకోవడమూ తెలుసు. అతని చిత్రాలు యూరోపియన్ కళకు నాసిరకం నకళ్లని, వాటిలో కవిత్వం, సహజత్వం లేదని, అతనిదంతా క్యాలండర్ ఆర్ట్ అని.. కారణంగానో, అకారణంగానో చెలరేగే విమర్శకుల గురించీ కొంత తెలుసు. ఆ తెలిసిన దాంట్లోంచి అరకొరగా, అస్పష్టంగా కనిపించే అతని తమ్ముడి కథేంటో తెలుసుకుందాం.
ఇద్దరు వర్మలు
ఇద్దరు వర్మలు

బాంబే స్టూడియోలో అన్నదమ్ములు 

రాజవర్మ రవివర్మకంటే పన్నెండేళ్లు చిన్న. 1860 మార్చి 3న కిలిమనూర్ ప్యాలెస్ లో పుట్టాడు. నాటి త్రివేండ్రమైన నేటి తిరువనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కిలిమనూర్. తండ్రి ఎళుమావిల్ నీలకంఠన్ భట్టాద్రిపాద్. బ్రాహ్మణుడు, సంస్కృతంలో పండితుడు. తల్లి ఉమా అంబాబాయి క్షత్రియ. కవయిత్రి, గాయని. వీరికి నలుగురు పిల్లలు, రవివర్మ, గొడవర్మ, రాజవర్మ, మంగళాబాయి. మాతృస్వామ్య వ్యవస్థ కనుక ఉమ పుట్టింట్లోనే ఉండేది. ఆమె సోదరుడి పేరు కూడా రాజా రాజవర్మే. చిత్రకారుడు. ఇంట్లో కథాకళి నాట్యాలు, సంస్కృత నాటకాలు, కచేరీలు సాగేవి. రవివర్మ మేనమామ వద్ద తొలి కళాపాఠాలు నేర్చుకుని పద్నాలుగేళ్లప్పుడు త్రివేండ్రానికెళ్లాడు. రాజాస్థాన చిత్రకారుల వద్ద, అతిథులుగా వచ్చిన పాశ్చాత్య చిత్రకారుల వద్ద నానా తంటాలుపడి తైలవర్ణ చిత్రాలు నేర్చుకున్నాడు. రవివర్మ పెద్ద తమ్ముడు గొడవర్మ సంగీతంలో దిట్ట. చెల్లెలు కూడా బొమ్మలు వేసేది. చిన్నతమ్ముడు రాజవర్మ త్రివేండ్రమ్ లో ఇంగ్లిష్ చదువులు చదువుకున్నాడు. షేక్ స్పియర్, ఆలివర్ గోల్డ్ స్మిత్, బాల్జాక్ రచనలంటే ఇష్టం.
రవివర్మ పేరు దేశమంతటా మారుమోగింది. దేశంలో ఇన్నాళ్లకు పాశ్చాత్యులకు సరితూగే కళాకారుడు పుట్టాడని దేశీ కళాపిసాసులు ముచ్చటపడ్డారు. బొమ్మలు వేయించుకోవడానికి రాజులు, తెల్లదొరలు బారులు తీరారు. చేతినిండా పని. లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్తరాలు నడపడానికి మనిషి కావాలి. ఇంగ్లిష్, దొరల మర్యాదలూ గట్రా తెలిసినవాడు కావాలి. తమ్ముడు నేనున్నానని ముందుకొచ్చాడు. సెక్రటరీ మొదలుకొని నౌకరీ వరకు అన్ని పనులూ చేసిపెడతానన్నాడు. అన్న తమ్ముడికి బొమ్మలు నేర్పాడు.
చిత్రాయణంలో రామలక్ష్మణుల ప్రస్థానం మొదలైంది. రవివర్మ బరోడా రాజు కోసం వేసిన నలదమయంతి, శంతనమత్స్యగంధి, రాధామాధవులు, సుభద్రార్జునులు వంటి పౌరాణిక చిత్రాల రచనలో రాజవర్మ ఓ చెయ్యేశాడు. చెల్లెలు మంగళాబాయి కూడా రంగులు అద్దింది. నైపుణ్యం పెద్దగా అక్కర్లేని బట్టలు, ఆకాశం, నేల, బండలు, ఆకులు, చెట్ల కాండాలు వగైరా వెయ్యడం వాళ్లపని. అన్నకు తీరికలేకుంటే దేవతల ముఖాలపైనా, చేతులపైనా చెయ్యిచేసుకునేవాళ్లు. అన్న వాటిని సరిదిద్దేవాడు. అంతా కుటీరపరిశ్రమ వ్యవహారం.
రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు
రాజా వర్మ వేసిన పరవుర్ చెరువు
పచ్చని కేరళ సీమలోకి తొలుచుకొచ్చిన సముద్రపు కాలవల్లో చల్లని వెన్నెల రాత్రి పడవ ప్రయాణాల్లో అన్నదమ్ములు భారత భాగవత రామాయణాలు చెప్పుకున్నారు. ఏ దేవతను ఏ రూపలావణ్యాలతో కేన్వాసుపైకి తీసుకురావాలో ముచ్చటించుకున్నారు. బొమ్మలు వెయ్యడానికి దేశమంతా తిరిగారు. మద్రాస్, మైసూర్, బాంబే, బరోడా, ఉదయ్ పూర్, ఢిల్లీ, లక్నో, కాశీ, ప్రయాగ, కోల్ కతా, కటక్, హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, విజయవాడ.. అన్నదమ్ములు కాలూనని పెద్ద ఊరుకానీ, స్నానమాడని నది కానీ లేకుండా పోయింది. కొన్ని బొమ్మలను కలసి వేసేవాళ్లు. వాటిపై ఇద్దరూ సంతకాలు చేసేవాళ్లు. కలసి నాటకాలకు, గానాబజానాలకు వెళ్లేవాళ్లు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రికల్లో న్యాపతి సుబ్బారావు పంతులు వంటి కాంగ్రెస్ నేతల రాతలు చదువుతూ దేశ స్థితిగతులు చర్చించుకునేవాళ్లు. బాంబే రెండో ఇల్లయింది. దాదాభాయ్ నౌరోజీ, తిలక్, రనడే, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మహామహులతో కలసి తిరిగేవాళ్లు. కోల్ కతా వెళ్లినప్పుడు టాగూర్ల జొరసొంకో భవంతిలో బసచేశారు. అబనీంద్రనాథ్ టాగూరు బొమ్మలు రవికి నచ్చాయి.
అన్నకు పౌరాణిక గాథలపై మక్కువ. తమ్ముడు ప్రకృతి ఆరాధకుడు. దాని పరిష్వంగంలో పులకరింతలు పోయాడు. ప్రకృతి(ల్యాండ్ స్కేప్) చిత్రాలు భారతీయ కళలో అంతర్భాగం. మొగల్, కాంగ్రా, బశోలీ, రాజ్ పుత్ వగైరా కళాసంప్రదాయాలన్నింటా చెట్టుచేమలు నిండుగా ఉంటాయి. రాజవర్మకు అవి నచ్చలేదు. తనపై పాశ్చాత్య కళాప్రభావం ఉంది కనుక తన దేశ ప్రకృతిని పాశ్చాత్య కళాకారుల్లాగే ఆవిష్కరించాడు. ఆంగ్లేయ ప్రకృతి చిత్రకార దిగ్గజాలు టర్నర్, కాన్ స్టేబుల్ లపై వచ్చిన పుస్తకాలను చదివాడు. రాజవర్మ ప్రకృతి ప్రేమ, కవితా హృదయం అతని డైరీల్లోని ప్రకృతి వర్ణనల్లో గోచరిస్తుంది. రవివర్మ రాజమందిరాల్లో రాచగణాన్ని చిత్రించే వేళ తమ్ముడు చెట్టుచేమా, చెరువులూ కాలవలూ పట్టుకుని తిరిగేవాడు.
పల్లెపడుచు
పల్లెపడుచు
స్టూడియోకు తిరిగొచ్చి వాటిని చిత్రికపట్టేవాడు. ఒడ్డున కొబ్బరి చెట్లతో, లోపల గూటిపడవతో, నారింజరంగు నింగి వెలుతురు ప్రతిఫలించే పరవూర్ సరస్సును, ఆకుపచ్చ నీటి కాలవలను, చెరువుగట్లను ఇండియన్ ఇంప్రెషనిస్ట్ మాదిరి పొడగట్టాడు. ఒంటిపై తడిచిన తెల్లచీర తప్పమరేమీ లేని యువతిని తొలిసంజెలో నెత్తిపై నీళ్లబిందెతో ఓ చిత్రంలో చూపాడు. ‘పంటకోతలు’ చిత్రంలో..
పంటకోతలు
పంటకోతలు
గోచితప్ప మరేమీ లేని మలబారు నల్లలేత పరువాన్ని ఆవిష్కరించాడు. పసుపురంగుకు తిరిగిన పొలం, ఆకాశం, బూడిదాకుపచ్చలు కలసిన కొబ్బరి తోటల నేపథ్యంలో ఆమె చేరో చేత్తో గడ్డిమోపులు పట్టుకుంది. ఫ్రెంచి రొమాంటిస్ట్, రియలిస్ట్ చిత్రకారులు మిలే, లెపెజ్, జూల్ బ్రెతా వంటివాళ్లు వేసిన ఆడరైతుల బొమ్మలకు ఏమాత్రం తీసిపోదీ కేరళకుట్టి. ‘నాటుసారా కొట్టు’ లో సారాకుండ, సీసాల మధ్య స్టూలుపై వయ్యారంగా కూర్చుని బేరం కోసం ఎదురుచూస్తున్న మలయాళీ బిగువు మగువను పరిచయం చేశాడు. అన్న వేసిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ లోంచి కోడిపుంజును అరువుకు తెచ్చుకుని ఆ కొట్టు ముందుంచాడు.
రవివర్మ, రాజవర్మలు సమకాలీన యూరోపియన్ అకడమిక్ కళను చాలా దూరం నుంచే అయినా జాగ్రత్తగా గమనించేవాళ్లు. ‘ది ఆర్టిస్ట్’ పత్రిక తెప్పించుకుని చదివేవాళ్లు. రవివర్మ మూర్తిని రాజవర్మ, రాజవర్మ మూర్తిని రవివర్మ చిత్రించేవాళ్లు. ఆప్త బంధువును కోల్పోయిన దుఃఖపురోజుల్లో నెరిసిన గడ్డంతో ఉన్న అన్నను తమ్ముడు ఓ చిత్రంలో చూపాడు. తమ్ముడు కళ్లద్దాలు పెట్టుకుని కిరోసిన్ దీపకాంతిలో దీక్షగా చదువుకుంటున్నట్లు వేశాడు అన్న.
సారా కొట్టు
సారా కొట్టు
మనదేశంలో ఆడవాళ్లు మోడళ్లుగా ముందుకు రావడం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. అయితే వాళ్లు బట్టలు విప్పడానికి ససేమిరా అనేవాళ్లు. దీంతో అన్నదమ్ములు బ్రిటన్, జర్మనీల నుంచి నగ్నమహిళల ఫొటోలు తెప్పించుకుని వాటితో కుస్తీపడేవాళ్లు. వాళ్ల దేహాలకు చీరలు, రవికలు తగిలించి భారతీయీకరించేవాళ్లు. అందుకే రవివర్మ అందగత్తెలు యూరప్ ఆడాళ్లకు బొట్టుపెట్టి, చీరలు చుట్టినట్లుంటాయనే విమర్శలు ఉన్నాయి. రాజవర్మ 1895 నుంచి 1904 వరకు రాసుకున్న డైరీల్లో అతని జీవితమే కాకుండా రవివర్మ చివరి పదేళ్ల జీవితమూ బొమ్మకట్టినట్లు కనబడుతుంది. అవి ఒకరకంగా రవివర్మ డైరీలు కూడా. రవివర్మకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మిరుమిట్లు గొలిపే అతని కళతోపాటు, రాజవర్మ చేసిపెట్టిన ప్రచారం కూడా సాయపడింది. బొమ్మలు అడిగిన వాళ్లకు అన్న బొమ్మలు ఎంత గొప్పగా ఉంటాయో ఉత్తరాలు రాసేవాడు తమ్ముడు. ఏ సైజుకు బొమ్మకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పడం, వేసిన వాటిని భద్రంగా పార్సిల్ చేసి పంపడం, వచ్చిన డబ్బును బ్యాంకులో వెయ్యడం, రాని బాకీలను వసూలు చెయ్యడం వరకు అన్ని పనులూ పకడ్బందీగా చక్కబెట్టేవాడు. దేశవిదేశాల్లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ల సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుని అన్నవేసిన చిత్రాలను పంపేవాడు.
రవివర్మ తన పెయింటింగులను ప్రజలకు మరింత చేరువ చెయ్యడానికి తపనపడ్డాడు. తన పేరుతో బాంబేలో మిత్రుల భాగస్వామ్యంతో కలర్ లితోగ్రాఫ్ ప్రెస్సును స్థాపించాడు. లావాదేవీలను తమ్ముడికే అప్పగించాడు. భాగస్వామి మోసగించాడు. అన్నదమ్ములు అప్పులపాలయ్యారు. తీర్చడానికి తంటాలు పడ్డారు.
రవివర్మ, రాజవర్మలకు ఆంధ్రదేశంతో తీపి, చేదు అనుభవాలున్నాయి. ఇద్దరూ హైదరాబాద్, కురుపాం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖల్లో బసచేశారు. రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ రైల్వే స్టేషన్ల గుండానే ముంబైకి వెళ్లేవాళ్లు. తాడిపత్రి, రేణిగుంటల్లో కలరా పరీక్షలు చేయించుకున్నామని రాజవర్మ ఓ చోట రాసుకున్నాడు. కురుపాం రాజా వారి ఇంట్లో వడ్డించిన తెలుగు వంటకాలు తమిళ, మలయాళ వంటలకు భిన్నంగా ఉన్నా రుచిగానే ఉన్నాయని రాసుకున్నాడు.
ప్రెస్సుతో ఆర్థికంగా దెబ్బతిన్న అన్నదమ్ములు 1902 తొలి మాసాల్లో హైదరాబాద్ లో బసచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ వంటి మిత్రుల మాటలపై భరోసా పెట్టుకున్నారు. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ తమతో బొమ్మలు వేయించుకుంటాడన్నఆశతో చాన్నాళ్లు పడిగాపులు కాశారు. దేశమంతా గౌరవించిన రవివర్మకు నిజాం మాత్రం ముఖం చాటేశాడు. అధికారులు రేపోమాపో అంటూ తిప్పారు. అన్నదమ్ములు తొలుత సికింద్రాబాద్ లోని దీన్ దయాళ్ ఇంట్లో బసచేశారు. పొరపొచ్చాలు రావడంతో చాదర్ ఘాట్ లో ఇల్లు అద్దెకు తీసుకుని బొమ్మలు మొదలుపెట్టారు. వ్యాహ్యాళికి హుసేన్ సాగర్ తీరానికి వెళ్లేవాళ్లు. చార్మినార్, చౌమొహల్లా, ఫలక్ నుమా ప్యాలెస్ లను, మీరాలం చెరువును చూశారు. ఆడ మోడళ్ల కోసం వాకబు చేశాడు రాజవర్మ. కొంతమంది వేశ్యలు వస్తామన్నారు కానీ మాట తప్పారు. చివరకు ఓ ముస్లిం యువతి ఒప్పుకుందట.
రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్
రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్
రాజవర్మ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హుసేన్ సాగర్ చిత్రాన్నివేశాడు. ఆ చెరువు నీళ్లు వందేళ్ల కిందట ఎంత తేటగా, నీలంగా ఉండేవో ఈ చిత్రం చూపుతుంది. కుడివైపు చెట్ల మధ్య మసీదు గుమ్మటం ఉంది. చెరువు ఒడ్డున గడ్డిలో పశువులు మేస్తున్నాయి. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. చెరువులో పడవలున్నాయి. నేటి కళాప్రమాణాలకు ఇది నిలవకపోవచ్చు కానీ 1903లో మద్రాస్ లో జరిగిన పోటీలో దీనికి బంగారు పతకం వచ్చింది.
రాజవర్మపై పరోక్షంగా నాటి జాతి పునరుజ్జీవనోద్యమ ప్రభావం ఉంది. పరాయి పాలనలో రవివర్మ హిందూదేవతల బొమ్మలను చిత్రించడం, వాటి నకళ్లను వేలకొద్దీ అచ్చుగుద్ది జనంలోకి తీసుకెళ్లడం ఆ ఉద్యమం సామాజిక ఉపరితలాంశంపై వేసిన ప్రభావ ఫలితమే. రాజవర్మకు కపటత్వం నచ్చదు. మూఢాచారాలు గిట్టవు. బాంబేలో బహుశా ఏదో లావాదేవీలో మోసపోయిన సందర్భంలో 1901 ఆగస్ట్ 1న డైరీలో ఇలా రాసుకున్నాడు, ‘ the markets are all great liars and try to take advantage of the ignorance of the strangers.’ నిజాం బొమ్మను కొంటానని చెప్పి, ఆ తర్వాత బేరం తగ్గించిన ఓ హైదరాబాదీపై కోపంతో 1902 జూన్ 8న.. ‘the majority of the Hyderabad nobles and officials are notorious for their dishonesty, want of truthfulness and immoral character‘ అని తిడుతూ రాసుకున్నాడు. జోస్యాలపై నమ్మకం లేదంటూ.. ’I have myself no belief in palmistry, fortune telling etc., for it is my firm conviction that God has not given men the power to pierce into the mystics of the dark future, for the consequences of possessing such a power would be disastrous to the continuance of the world’ అని 1903 అక్టోబర్ 14న రాసుకున్నాడు.
రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం
రాజావర్మ వేసిన రవివర్మ చిత్రం
రాజవర్మ క్షత్రియ నాయర్ పెళ్లిచేసుకున్నాడు. పేరు జానకి. పిల్లలు కలగలేదు. బొమ్మలెయ్యడానికి దేశాలు పట్టుకుని తిరగడం వల్ల భార్యను సరిగ్గా చూసుకోలేకపోయాడు. రవి కూడా అంతే. మాతృస్వామ్యంలో, అందునా దేశదిమ్మర చిత్రకారులు కావడంతో భార్యలకు చుట్టాల్లా మారిపోయారు. భార్యను సరిగ్గా చూసుకోలేకపోయానని రాజవర్మ అంత్యకాలంలో అన్న కొడుకు రామవర్మతో వాపోయాడట. రాజవర్మ 1904 చివర్లో మైసూర్ రాజు కోసం బొమ్మలేసే పనిలో బెంగళూరులో ఉన్నప్పుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. పరిస్థితి విషమించడంతో మద్రాసుకు తీసుకొచ్చారు. పేగుల్లో అల్సర్. ఆపరేషన్ చేసిన కొన్నరోజులకే 1905 జనవరి 4న 45 ఏళ్ల ప్రాయంతో కన్నుమూశాడు. అప్పడు జానకికి ముప్పైమూడేళ్లు. ఆమె చెల్లెలు భగీరథి ప్రసిద్ధ మలయాళ నవలా రచయిత సీవీ రామన్ పిళ్లై భార్య. భగీరథి అంతకు కొన్నేళ్లముందు ఆరుగురు పిల్లలను అమ్మలేని వాళ్లను చేసి వెళ్లిపోయింది. రామన్ ను పెళ్లాడింది జానకి. అతని నవలలకు ఆమె స్ఫూర్తినిచ్చిందంటారు. ఆమె 1933లో కన్నుమూసింది.
రాజా రాజవర్మ
రాజా రాజవర్మ
గాయకుడికి గాత్రసహకారంలా పాతికేళ్లు తన కుంచెకు వర్ణదోహదం అందించి తన కళ్లముందే సెలవంటూ వెళ్లపోయిన తోడబుట్టినవాడి మరణంతో రవివర్మ కుదేలయ్యాడు. పైగా మధుమేహం, మతిమరపు, ప్రేలాపనలు. అప్పటికే రవి భార్య చనిపోయి చాలా ఏళ్లయింది. పెద్ద కొడుకు కేరళవర్మ దురలవాట్లకు లోనయ్యాడు. రవి 1906 అక్టోబర్ 29న తను పుట్టిన కిలిమనూర్ ప్యాలెస్ లోనే ఆఖరి శ్వాస తీశాడు.
ఆ అన్నదమ్ములను బతికి ఉన్నప్పుడూ, పోయిన తర్వాతా ఎందరో ఆడిపోసుకున్నారు. అయితే వాళ్లిచ్చిపోయిన బొమ్మలను జనం ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. తలనిండ పూదండ దాల్చే రవివర్మ అందగత్తె వలువల మడతల్లోనో, అతని సరస్వతి, సీత, శకుంతల, దమయంతులు కూర్చున్న రమణీయ వనాల్లోనో, ఆ వనాల దాపు కొలనుల్లోనో, కొలనులపైని కాంతిగగనంలోనో రాజవర్మ కుంచెపూతలు సంతకాల్లేకుండా తారసపడుతూ ఉంటాయి. ఆ అన్నచాటు తమ్ముడి ప్రకృతి లాలసను, అతనికి అందిన అందాలను లీలగా గుర్తుచేస్తూ ఉంటాయి.
రవివర్మ కుంచెలోంచి జాలువారిన శకుంతల

-పి.మోహన్
FEBRUARY 5, 2015  సారంగ వెబ్ పత్రికలో ప్రచురితం

Tuesday, 10 February 2015

పోరుపాటకు రంగులద్దిన ఆటో గ్రీబల్




పోరుపాటకు రంగులద్దిన ఆటో గ్రీబల్
‘‘ మేలుకోండి పేద ప్రజలారా
మేలుకోండి నలు దిశలా 
శ్రామికులు చూపిరి మార్గం 
లేచిందోయ్ విముక్తి పథం 
తరతరాల కుటిలాచారం 
చెయ్యాలిక పూర్తి హతం 
తుడిచేయ్ జన దీనాలాపం 
జీవన్-మరణమని పోరి 
తుదిపోరు ఇది ఓ కామ్రేడ్స్ 
కలవండోయ్ ఏకంగా 
ఇంటర్నేషనల్ 
ఒకటౌదాం - మానవులం  
కలవండోయ్ ఏకంగా 
ఇంటర్నేషనల్ 
ఒకటౌదాం – మానవులం’’
కవాతు పాటలా సాగే అంతర్జాతీయ శ్రామిక గేయం.. అన్ని భాషల్లో ఒకే బాణీతో ఒకే ఊపుతో పోటెత్తే ఆ రణన్నినాదానికి ఒక రూపమిస్తే ఎలా ఉంటుంది? దోపిడీపీడనలను తుదముట్టించేందుకు నలుమూలల నుంచి నడుం కట్టి, భుజం కలిపి, కదం తొక్కుతున్న నానాదేశాల, నానా జాతుల శ్రమజీవులు శత్రువుల గుండెలు పగిలేలా కంఠనాళాలు తెంచుకుని పాడే ఆ పాట కళ్లముందు రంగురేఖల్లో కదలాడితే ఎలా ఉంటుంది? అచ్చం ఆటో గ్రీబల్ బొమ్మకట్టిన ‘ఇంటర్నేషనల్’లా తప్ప మరోలా ఉండదు.
ఇంటర్నేషనల్ పాట స్ఫూర్తితో జర్మన్ చిత్రకారుడు గ్రీబల్ 1928, 30 మధ్య అదే పేరుతో తైలవర్ణచిత్రాన్ని వేశాడు. కొలతలు దాదాపు 130 సెంమీ x 190 సెంటీమీటర్లు.  బెర్లిన్ లోని డ్యూషే జీసిస్త్ మ్యూజియంలో ఉంది. ఫ్రెంచివిప్లవకారుడు ఈజిన్ పాటియర్ 1871లో ఫ్రెంచి కమ్యూన్ కాలంలో రాసిన ఈ మంటల పాటను స్త్రీలు, పురుషులు, యువతీయువకులు, వృద్ధులు, నల్లవాళ్లు, తెల్లవాళ్లు.. నానాజాతుల శ్రామికులనేకమంది పాడుతున్నట్లు చిత్రించాడు గ్రీబల్. చిత్రంలోని జనం నిల్చున్నట్లు కనిపిస్తున్నా వాళ్లందరూ కెరటంలా లేచిన విముక్తి పథంలో కవాతులా సాగుతున్నట్లూ గోచరిస్తుంది. అందరి కళ్లలో దైన్యపు తడిమధ్యనే జీవన్మరణపు తుదిపోరులో అమీతుమీ తేల్చుకోవాలన్న సంకల్పమూ ఉంది. గ్రీబల్ కు వాళ్ల ఈతిబాధలు, ఆశలు, ఆకాంక్షలు బాగా తెలుసు కనుకే మహాసంగ్రామానికి కదులుతున్న ఆ శ్రామిక జనావళిని అంత శక్తిమంతంగా పొడగట్టాడు. వాళ్లకు సంఘీభావంగా చిత్రంలో తననూ రూపుగట్టుకున్నాడు. చిత్రంలో కుడి నుంచి రెండో మనిషి అతడే. నీలికోటు తొడుక్కున్న గ్రీబల్ తనపక్కనున్న గని కార్మికుడి భుజంపై నీవెంటే నేనూ అన్నట్టు చెయ్యేశాడు.
జర్మన్ నవ్యవాస్తవికతా కళకు గొప్ప దోహదం చేసిన గ్రీబల్ 1895లో శాక్సనీలోని మీరాన్ లో పుట్టాడు. తండ్రి బ్రూనో ఇళ్లకు వాల్ పేపర్లు అంటించడంలో నిష్ణాతుడు. గ్రీబల్ స్కూలు చదువయ్యాక గ్లాస్ పెయింటింగ్ లో శిక్షణ పొందాడు.  డ్రెస్డెన్ వెళ్లి పెయింటింగ్ లో మెలకువలు నేర్చుకున్నాడు. లోకపు దుర్మార్గాలను వాంతికొచ్చేలానే కాకుండా, రక్తం మరిగేలానూ చూపిన ఎక్స్ ప్రెషనిస్ట్ చిత్రకారులు మ్యాక్స్ బెక్ మాన్, ఆటో డిక్స్ లతో పరిచయమైంది. బూర్జువా భావాలపై రోత పుట్టింది. కార్మికవర్గ రాజకీయాలు ఒంటబట్టాయి. 1915లో మొదటి ప్రపంచ యుద్ధంలో వలంటీర్ గా చేరాడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డంతో ఇంటికి పంపారు. తిరిగి కళాసాధన చేశాడు. తొలినాళ్లలో క్యూబిజం, డాడాయిజాలపై మనసు పారేసుకున్నా తేరుకుని రియలిజంపై మళ్లాడు. కాల్పనిక ఎక్స్ ప్రెషనిజం వద్దని శక్తిమంతమైన, ప్రత్యక్ష కార్యాచరణకు ఉసిగొల్పే న్యూ ఆబ్జెక్టివిజంలోకి ప్రవేశించాడు. గని కార్మికులను, ఓడ బాలయిర్లలో బొగ్గేసేవాళ్లను, హమాలీలను.. సమస్త వృత్తుల కార్మికులను విరివిగా చిత్రించాడు. రెచ్చగొట్టే వేశ్యలను, మనసు కరిగించే బిచ్చగాళ్లనూ వేశాడు.  వీమార్ రిపబ్లిక్ ప్రవచించిన నవ్యకళావాదాలను తలదాల్చి బూర్జువాలను, వాళ్ల విలాసాలను బొమ్మల్లో భయంకరంగా ఎండగట్టాడు. 1919లో జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ(కేడీపీ)లో చేరి కార్మిక సంఘాలకు పోస్టర్లు, పత్రికలకు బొమ్మలు వేశాడు. యంగ్ రీన్ లాండ్, డ్రెస్డెన్ సెషెషన్, నవంబర్, రెడ్ వంటి అనేక విప్లవ కళాకారుల సంఘాల స్థాపనలో పాలుపంచుకున్నాడు. వేరే వాళ్లు స్థాపించినవాటిలో సభ్యుడిగా చేరాడు.  1924లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక ప్రదర్శనలో చిత్రాలు ప్రదర్శించాడు.
అవి హిట్లర్ కు కోరలు మొలుస్తున్న రోజులు. గ్రీబల్ సైన్యాన్ని విమర్శించాడని పోలీసులు విచారణ జరిపారు. నాజీల వేధింపులు పెరిగాయి. బలవంతంగా సైన్యంలో చేర్చారు. 1933లో గెస్టపో(నాజీల రహస్య పోలీసు విభాగం) పోలీసులు గ్రీబల్ ఇంటిని సోదా చేసి, అతన్నిఅరెస్ట్ చేశారు. చాలా బొమ్మలను జప్తు చేశారు. మ్యూజియాల్లోంచి అతని బొమ్మలను తీసేశారు. వాటిని ‘క్షీణకళ’ ప్రదర్శనలో పెట్టి గేలిచేశారు. చివరకు కళాకారుల నిరసనతో అతన్నివదిలేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో గ్రీబల్ ను మళ్లీ సైన్యంలోకి బలవంతంగా తీసుకుని పోలండ్ పంపారు. గ్రీబల్ తార్నో కాన్ సంట్రేషన్ క్యాంపు నుంచి ఇరవై మంది యూదులను మిత్రులతో కలసి తప్పించాడు. తనూ సైన్యం నుంచి పారిపోయాడు. 1944, 45లో అక్షరాజ్యాలు డ్రెస్డెన్ పై విమానాల నుంచి జరిపిన బాంబు దాడుల్లో గ్రీబల్ ఇల్లు నేలమట్టమైంది. బొమ్మలు నాశనమయ్యాయి.  ఆ బాధలో ‘తగలబడుతున్న డ్రెస్డెన్’ పేరుతో పది బొమ్మలు వేశాడు. గ్రీబల్ వేసిన ఇంటర్నేషనల్ చిత్రం పోలీసు దాడుల్లో కనిపించకుండాపోయింది. 1945లో యుద్ధానంతరం పోలండ్ లో తేలి తిరిగి అతని చెంతకు చేరింది. హిట్లర్ ఓడిపోయాడు. గ్రీబల్ జర్మనీలోని సోవియట్ మిలటరీ విభాగంలో పనిచేశాడు.  డ్రెస్డెన్ ఆర్ట్ స్కూళ్లలో పాఠాలు చెప్పాడు. ఎర్ర కళాకారుల సంఘాల్లో పనిచేశాడు. 1972 మార్చి 7న డ్రెస్డెన్ లోనే కన్నుమూశాడు. అతని జీవితానుభవాలు ‘నేను వీధి మనిషిని’ పేరుతో వచ్చిన పుస్తకంలో ఉన్నాయి.

గ్రీబల్ వాస్తవికతకు తీవ్రత జోడించాడు. సామ్యవాద వాస్తవికతా కళకు కొత్తమెరుగులు దిద్దాడు. మూసల్లో ఒదగకుండా ప్రయోగాలు చేశాడు. అతని కార్మికులు మడతలు పడ్డ బలమైన ముఖాలతో తీవ్రంగా చూస్తుంటారు. వాళ్లకు తలకిందుల వ్యవస్థపై మహా నిరసన, అసహనం. తిరగబడేందుకు సిద్ధంగా ఉంటారు. దైన్యంతో అంతర్ముఖులుగా కనిపిస్తున్నాతరతరాల కుటిలాచార లోకపు పునాదులనే పెకళించే మహాశక్తి వాళ్లలోపల సుడులు తిరుగుతూ ఉంటుంది. అతని బలిష్టమైన ‘ఓడ కార్మికుడు’ కదిలిస్తే చాలు కొట్టేలా ఉంటాడు.  ‘పాటగాడు’ బావురుమనే కాంక్రీటు అరణ్యంలో క్షతగాత్ర గీతాన్ని ఆలపిస్తుంటాడు.

 గ్రీబల్ నిబద్ధ కళాకారుడు. జీవితాంతం ప్రజా ఉద్యమాల వెంట నడిచాడు. జనదీనాలాపాలు లేని, మానవులంతా ఒకటయ్యే లోకం కోసం త్యాగాల నెత్తుటిదారిలో సాగే పోరువీరుల పాటకు రంగులద్ది అరుణారుణ స్మృతిచిత్రంలా నిలిచిపోయాడు.
                                                                   పి.మోహన్