‘‘ఎప్పుడూ ఆ పాడుబొమ్మలేమిట్రా.. కూటికొస్తాయా, కురాక్కొస్తాయా?’’
నేను చిన్నప్పుడు బొమ్మలేసుకునేప్పుడు ఇంట్లోవాళ్లు చిన్నాపెద్దా తేడా లేకుండా తరచూ ఇచ్చిన ఆశీర్వాదమిది. చిన్నప్పుడే కాదు పెద్దయి, పెళ్లయ్యాక కూడా ఇవే దీవెనలు. కాకపోతే దీవించేవాళ్లే మారారు. నాకు బొమ్మలు వెయ్యడం రాదని నాకే కాకుండా మా వాళ్లందరికీ గట్టి నమ్మకం మరి.
‘‘ఎప్పుడూ ఆ పాడు పుస్తకాలేమిట్రా.. క్లాసు పుస్తకాలు చదువుకో, బాగుపడతావు!’’
చిన్నప్పుడు చందమామ, బాలమిత్రలు, పెద్దయ్యాక స్వాతి, ఆంధ్రభూమి వగైరా పత్రికలు, ఇంకొంచెం పెద్దయ్యాక శ్రీ శ్రీ, ఆరుద్ర, చలం పుస్తకాలు చదువుకునేప్పుడు అందిన మరో ఆశీర్వాదం.
‘‘ఎప్పుడూ ఆ పిచ్చిబొమ్మల పుస్తకాలు చదవకపోతే డీఎస్సో గీయస్సో రాయొచ్చుగా. ఈ పాడు రేత్రి ఉజ్జోగం ఇంకెన్నాళ్లు?’’
బొమ్మలు రావని తెలిసి బొమ్మలేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇల్లాలు చేస్తున్న హితబోధ ఇది. వచ్చే జన్మంటూ ఉంటే జర్నలిస్టును పెళ్లి చేసుకోనని ఆమె మంగమ్మ శపథం పట్టింది.
వాళ్లకు జీవితానుభవం మెండు. రియలిస్టు చిత్రకారుల్లాంటి వాళ్లు. మరి నేను?
నేను భూమ్మీదపడి ముప్పైయారేళ్లు. ఊహ తెలియని రోజులు తప్ప ఊహ తెలిసిన కాలమంతా పుస్తకాలు, బొమ్మలే లోకం. అలాగని నేను పండితుడినీ కాను, కళాకారుడినీ కాను. నిజానికి సృజనలోకంటే ఆస్వాదనలోనే చాలా సుఖముంది. రచయితలూ, కళాకారులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. మనం వాటిని హాయిగా కూచుని, ఎలా పడితే అలా పడుకుని, నుంచుని ఆస్వాదించొచ్చు. తినడం కంటే వండడం కష్టం కదూ, అదీ రుచిగానూ.
ఎందుకో తెలియదు కానీ బొమ్మల్లేని పుస్తకాలు నచ్చవు నాకు. కవితయినా, కథయినా, నవలైనా, వ్యాసమైనా బొమ్మ ఉంటే దాని అందం వేరు. బొమ్మలేని పుస్తకం ఉప్పులేని కూర. అక్షరాలకు బొమ్మ తోడుంటే పఠనం విసుగెత్తించదు. వాక్యాలు ఇబ్బందిపెట్టినప్పుడు బొమ్మ ఊరటనిస్తుంది. పిండారబోసిన వెన్నెల్లో చందమామలాంటిది బొమ్మ. ఉడుకుడుకు రాగిసంకటి ముద్దలో కాసింత నేతిబొట్టు, వెల్లుల్లికారం పూసిన ఎండుచేప లాంటిది బొమ్మ. నీది పిల్లతనం అంటారు మిత్రులు. తెలివిమీరిన పెద్దతనానికంటే అదే మంచిదంటాను నేను. చిన్నప్పుడు కథల కోసం కాకుండా బొమ్మలు చూడ్డానికే చందమామ, బాలమిత్రలు కొనేవాడిని, చిరుతిళ్లు మానుకుని. కథ కోసం కాకుండా బొమ్మల కోసమే సినిమాలకు వెళ్లేవాడిని.
నాకు తెలియకుండానే బొమ్మలకు బానిసనయ్యాను. దేన్ని చూసినా, దేన్ని చదివినా రంగురూపాల తపనే. ఎంత పిచ్చో ఒక ఉదాహరణ చెబుతాను. కాళహస్తీశ్వర మాహత్మ్యంలోని విచిత్ర సరోవర సందర్శనం విభాగంలో ఓ వచనం నాకు అచ్చం ఎంసీ ఈషర్ వేసిన చేపలు పక్షులుగా మారే చిత్రాన్ని గుర్తుకు తెచ్చింది. ఆ వచనం చదవండి..
నత్కీరుడు ఓ మర్రిచెట్టు కిందికెళ్లి.. ‘తదీయ శాఖాశైత్యంబున కత్యంత సంతోషంబునొంది, కూర్చుండి, తద్వటంబుననుండి రాలిన పండుటాకులు బట్టబయటఁ బడినయవి విహంగంబులు, జలంబునం బడినయవి మీనంబులునైపోవ, నందొక్క పలాశంబు జలాశయంబున సగమును, దట ప్రదేశంబున సగమును బడి, మీనపక్షిత్వంబులఁ గైకొని, లోపలికిన్వెలుపలికిం దివియు చమత్కారంబు నత్కీరుండు చూచి, యద్భుతరసపరవశుండై యుండె..’’
ఇప్పుడు ఈ వ్యాసంలోని ఈషర్ బొమ్మను చూడండి. ధూర్జటి వచనంతో పోల్చుకోండి!!
మా ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఊరిలో ఓ బక్కపల్చని ముస్లిం(మతంతో గుర్తింపునిచ్చే నా నిమిత్తం లేని నా మెజారిటీతనానికి సిగ్గుపడుతున్నా) తోపుడు బండిలో పాతపుస్తకాలు అమ్మేవాడు. నాకప్పుడు పన్నెండేళ్లనుకుంటా. మూడు రూపాయలిచ్చి రామకృష్ణ పరమహంస జీవితచరిత్ర కొన్నాను. మూడునాలుగు వందల పేజీల పుస్తకం. అందులో చక్కని నలుపుతెలుపు ఫొటోలు.. పరమహంసవి, శారదమాతవి, వివేకానందుడివి చాలా ఉన్నాయి. బొమ్మలున్నాయి కనుకే కొన్నాను. నా జీవితంలో చూసిన అతి పెద్ద తొలి పుస్తకం. ఎంతో గర్వంతో స్కూలుకు తీసుకెళ్లి క్లాసులో అందరికీ చూపించాను. గుర్తులేదు కానీ, వెర్రివాడినన్నట్టే చూసుంటారు. ఆ పుస్తకాన్ని డిగ్రీకి వచ్చేంతవరకు జాగ్రత్తగా దాచుకున్నా, కాలేజీ రోజుల్లో ఆలోచనలు మారి, ఆ పుస్తకంతో ఏకీభావం లేకపోయినా. మాకు సొంతిల్లు లేదు కనుక ఇళ్లు మారడంలో అదెక్కడో పోయింది. లేకపోతే ఇంట్లోవాళ్లు పడేసుంటారు.
విశాలాంధ్ర వాళ్ల వ్యాను మా ఊరికీ వచ్చేది. అదొచ్చిందంటే కాళ్లు నిలిచేవికావు. దాచుకున్న, ఇంట్లో దోచుకున్న డబ్బులు, స్కాలర్ షిప్ డబ్బులు పట్టుకెళ్లి కొనేసేవాడిని. బొమ్మల పుస్తకాలకే ప్రాధాన్యం. తెలుగులో అలాంటివి చాలా తక్కువ కనుక సోవియట్ పుస్తకాలపై పడేవాడిని. దిండులాంటి రష్యన్ కథలూ గాథలూ, ప్రాచీన ప్రపంచ చరిత్ర, కుప్రీన్ రాళ్లవంకీ, నొప్పి డాక్టరు, మొసలి కాజేసిన సూర్యుడు, లెనిన్ జీవిత చరిత్ర.. ఇంకా గుర్తులేని బొమ్మల పుస్తకాలు కొని చాటుమాటుగా ఇంటికి తెచ్చేవాడిని. సంగతి తెలియగానే తిట్లు, శాపనార్థాలూ. తొమ్మిదిలోనో, పదిలోనో ఉండగా, పాతపుస్తకాలాయన వద్ద మార్క్సూ, ఎంగెల్స్ లపై వాళ్ల మిత్రుల స్మృతుల పుస్తకం దిండులాంటిదే ఇంగ్లిష్ ది దొరికింది. అప్పటికి మార్క్స్ ఎవరో, ఎంగెల్స్ ఎవరో తెలియదు. ఆ పుస్తకంలో చక్కని ఇలస్ట్రేషన్లు, ఫొటోలు ఉన్నాయి కనుక కొన్నాను అంతే. జీవితపు అసలు రుచి చూపిన ఆ మహానుభావులు తొలిసారి అలా తారసపడ్డారు బొమ్మల పుణ్యమా అని. అయితే ఇలాంటి ‘పిచ్చి’ పుస్తకాలు ఎన్ని చదివినా పరీక్షలకు రెండు మూడు నెలల ముందు మాత్రం క్లాసు పుస్తకాలు దీక్షగా చదువుతూ క్లాసులో ఫస్ట్ వస్తూ ఉండడం, ఏడు, పదిలో స్కూలు ఫస్ట్ రావడం, ఇంటర్, డిగ్రీ, పీజీల్లో ఫస్ట్ క్లాసులో పాసవడంతో ఆ తిట్ల తీవ్రత తగ్గుతూ వచ్చేది.
తర్వాత రాజకీయాలు ముదిరి లెఫ్ట్ ను మించిన లెఫ్ట్ లో ‘పక్కదోవ’ పట్టాక బొమ్మల పిచ్చి మరింత ఎక్కువైంది. ఎస్వీ యూనివర్సిటీలో కామర్స్ పీజీ చేస్తున్నప్పుడు నా చిత్రలోకం పెద్దదైంది. స్కాలర్ల రిఫరెన్స్ విభాగంలోకి పగలు పీజీ వాళ్లను రానిచ్చేవాళ్లుకారు. అందుకే సాయంత్రం ఆరుకెళ్లి రాత్రి మూసేవరకు ఫైనార్ట్స్ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని. అప్పటికి అరకొరగా తెలిసిన డావిన్సీ, మైకెలాంజెలో, రాఫేల్, పికాసో, డాలీలు మరింత దగ్గరయ్యారు. కూర్బె, మిలే, డామీ వంటి రియలిస్టులు, మానే, మోనే వంటి ఇంప్రెషనిస్టులు, వాన్గో, గోగా, సెజాన్ వంటి పోస్ట్ ఇంప్రెషనిస్టులు, ఫావిస్టులు, క్యూబిస్టులు, డాడాయిస్టులు, సర్రియలిస్టులు, ఫ్యూచరిస్టులు, సోషల్ రియలిస్టులు.. నానాజాతి కళాకారులు దోస్తులయ్యారు. పనిపైన హైదరాబాద్ కు వచ్చినప్పుడు సండే మార్కెట్లో అందుబాటు ధరకొచ్చిన ఆర్ట్ పుస్తకాన్నల్లా కొనేవాడిని. అనంతపురం ఎస్కే వర్సిటీలో ఉంటున్నప్పుడు స్నేహితులను చూడ్డానికి బెంగళూరుకు వెళ్లేవాడిని. హైదరాబాద్ లో దొరకని పుస్తకాలు కనిపించేవి. సిగ్గు వదిలేసి డబ్బులడుక్కుని కొనేవాడిని.
తెలుగు సాహిత్యం చదువుకుంటూనే, బొమ్మలూ అర్థం చేసుకుంటూ ఉండేవాడిని. అదొక ఒంటరి లోకం. కథలూ కాకరకాయలపై మాట్లాడుకోవడానికి బోలెడంత మంది. కానీ బొమ్మల గురించి మాట్లాడుకోవడానికి ఎవరున్నారు? పుస్తకాల్లో చూసిన ఇంప్రెషనిస్టుల చెట్లను, దృశ్యాలను వర్సిటీ ఆవరణలోని, అడవుల్లోని చెట్లతో, కొండలతో పోల్చుకుని వాటితో ముచ్చటించేవాడిని. చేతకాకున్నా ఉద్యమ పత్రికల కోసం ‘ఎర్ర’ బొమ్మలను వేసేవాడిని. చిత్రంగా అప్పుడు చూసిన చిత్రాలు, చదివిన ఆర్ట్ పుస్తకాలు దాదాపు అన్నీ పాశ్చాత్య కళవే. జపాన్, చైనాలవి ఉన్నా తక్కువే. భారతీయ కళవి అయితే రెండోమూడో. అవి కూడా నేషనల్ బుక్ ట్రస్ట్, లలితకళల అకాడెమీ వాళ్లు వేసినవి. ఎస్కే వర్సిటీలోని తరిమెల నాగిరెడ్డి పుస్తకాల్లో ఆయన సంతకంతో చైనా చిత్రకళపై పుస్తకం కనిపించడం ఒక వింత.
‘పక్కదోవ’లో నడిచే ధైర్యం లేక ‘సరైన దారి’కి మళ్లాకా బొమ్మల పిచ్చి పోలేదు. తిండితిప్పలు మానేసి, వేల రూపాయలు అప్పులు చేసి ఆర్ట్ పుస్తకాలకు తగలేసిన సందర్భాలు అనేకం. ఒకప్పుడు నావద్ద నాలుగైదు వందల తెలుగు సాహిత్య పుస్తకాలు, ఐదో ఆరో ఆర్ట్ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఆ అంకెలు తారుమారయ్యాయి. ఊళ్లు మారడం వల్ల చాలా తెలుగు పుస్తకాలను లైబ్రరీలకు, మిత్రులకు ఇచ్చేశాను. ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు రెండు మూడువందలున్నాయి. వాటి మధ్యన తెలుగు పుస్తకాలు ఐదో పదో బిక్కుబిక్కుమంటున్నాయి. కళపై, కళాకారులపై నేను రాసిన వ్యాసాలు, సొంతంగా అచ్చేసిన ‘పికాసో’, ‘డావిన్సీ’ పుస్తకాలు నా జ్ఞానానికో, అజ్ఞానానికో ఉదాహరణలు.
ఇప్పుడు.. అంటే సాహిత్యం, బొమ్మలూ పరిచయమై, అనుభవంలోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… నా సాహిత్య ప్రయాణం, కళాధ్యయనం కలసి సాగినట్టు అనిపిస్తోంది. బొమ్మల జోలికి వెళ్లకపోయుంటే సాహిత్యంలో నాకంటూ ఓ స్థానం దక్కేదేమోననిపిస్తోంది. అయినా చింతలేదు. మహా రచయితల పుస్తకాల్లోని సారాంశాలను మహాచిత్రకారుల బొమ్మల్లో పట్టుకోగల దారి నాకు ఆర్ట్ పుస్తకాలు చూపించాయి. సాహిత్యం చూపలేని నానా దేశాల, నానా జాతుల నిసర్గ సౌందర్యాన్ని అవి నాకు పరిచయం చేశాయి.
బొమ్మ రాతకంటే ముందు పుట్టింది. అది సర్వమానవాళి భాష. వెయ్యిపేజీల పుస్తకం చెప్పలేని భావాన్ని అది చక్కగా చెబుతుంది. ఒకవేళ బొమ్మ చెప్పలేని భావాన్ని చెప్పే పుస్తకం ఉంటేగింటే, దానికి బొమ్మ కూడా జతయితే ఇక అర్థం కానిదేమీ ఉండదు.
నింగికి, నేలకు మధ్య హద్దులు చెరిపేసిన ఫుజీ మంచుకొండ ముందు, వాగుపై వాలిన ఒంటరి చెట్టుపై కూచుని పిల్లనగోవి ఊదుతున్న హొకుసాయ్ జపాన్ కుర్రకుంకనూ, ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన రష్యన్ రాజకీయప్రవాసిని మాటలకందని ఆశ్చర్యానందంతో చూస్తున్న రెపిన్ మనుషులను, రోరిక్ కుంచెలో రంగులద్దుకుని మెరిపోయే హిమాలయాలను, హిమాలయాల పాదపీఠంలో పేదరికంతో మగ్గే, చలితో ముడుచుకుపోయే అమృతా షేర్గిల్ పల్లె పడచులను, కడుపుతీపిని, కడుపుకోతను గుండెలు చెదిరేలా చూపే క్యాథే కోల్విజ్ జర్మన్ తల్లులను, దేవుడంటూ ఒకడుంటే, అతనికంటే అద్భుతమైన కళాసృజన చేసిన ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారులను, ఆత్మలను ముఖాలపైకి తెచ్చుకుని చీకట్లో కాంతిపుంజాల్లా తొంగిచూసే రెంబ్రాంత్ డచ్చి జనాన్ని, కళ్లు తిప్పనీయని ప్రాచీన గ్రీకు శిల్పాలు, నమ్మశక్యంకాని ఈజిప్ట్ పిరిమిడ్లు, స్తంభాలు, పురాతన ఉద్వేగాలను అంటిపెట్టుకున్న ప్రీకొలంబియన్ కుండలను… ఇంకా ఎన్నింటినో ఆర్ట్ పుస్తకాలు నాకు పరిచయం చేశాయి. నా చేతులు పట్టుకుని ఆదిమానవులు ఎద్దుల, మేకల బొమ్మలు గీసిన లాక్సా గుహల దగ్గర్నుంచి నవనాగరిక ఇన్స్ స్టలేషన్ కర్రల, కడ్డీల ఆర్ట్ వరకు నడిపిస్తూ ఉన్నాయి.
-పి. మోహన్
No comments:
Post a Comment