Saturday 23 January 2016

కాండీడ్-10వ భాగం




23వ అధ్యాయం

‘‘మా పాంగ్లాస్, క్యూనెగొండ్‌లు ఎన్ని కష్టాలు పడ్డారో విన్నారుగా. మరి, ఈ లోకం గురించి మీ అభిప్రాయమేంటి?’’ అడిగాడు కాండీడ్ డచ్చి ఓడలో ఓపక్క నుంచుని మార్టిన్‌ను.

‘‘అదంతా ఒట్టి బుద్ధి తక్కువ, తలనొప్పి వ్యవహారంలా అనిపిస్తోంది నాకు’’ అన్నాడు మార్టిన్.

‘‘మీరు ఇంగ్లండ్‌ను ఎరుగుదురా? అక్కడి వాళ్లూ ఫ్రెంచి వాళ్ల మాదిరే వెర్రివెధవలేనా?’’

‘‘ఆ! కాకపోతే అది మరో రకం వెర్రిలే. వీళ్లిద్దరూ కెనడా సరిహద్దులోని కాసింత మంచునేల ముక్క కోసం కొట్టుకుని చస్తున్నారు. ఆ సుందరమైన యుద్ధానికి మొత్తం కెనడా విలువకు మించిన డబ్బు తగలేశారు. పిచ్చివాళ్ల శరణాలయానికి పంపేందుకు ఈ రెండు దేశాల్లో ఎక్కడ ఎక్కువ మంది పిచ్చాళ్లున్నారో  తేల్చడానికి నా అల్పజ్ఞానం సరిపోవడం లేదు. ఏదేమైనా మనం చూడబోతున్న ప్రజలు మాత్రం ఎంతో గాంభీర్యులు, విషాదజీవులు అని మాత్రం తెలుసు.’’ 

అలా మాట్లాడుకుంటూ ఉండగా ఓడ పోర్ట్స్ మత్ చేరింది. తీరంలో జనం కిక్కిరిసి ఉన్నారు. ఓ సైనిక నౌక పైభాగంలో వెూకరిల్లిన స్థూలకాయుడికేసి తదేకంగా చూస్తున్నారు అందరూ.  అతని కళ్లకు గంతలున్నాయి.  అతనికెదురుగా నిల్చున్న నలుగురు సైనికులు ఒక్కొక్కడు మూడేసి తూటాలను ఎంతో స్థిమితంగా అతని పుర్రెకు గూరిచూసి పేల్చిపారేశారు. గుంపు సంతృప్తితో చెదరిపోయింది.

‘‘ఏమిటిదంతా? ప్రపంచమంతా ఏ రాక్షసి రాజ్యమేలుతోంది?’’ కాండీడ్ ఆవేదనతో అన్నాడు.

అంత కనులపండుగా హతమైపోయిన ఆ మనిషి ఎవరని అక్కడున్న వాళ్లను అడిగాడు.

‘‘అతడు నౌకాదళాధిపతి.’’

‘‘అయితే చంపడమెందుకు?’’

‘‘అతడు శత్రువులను తగినంత మందిని చంపలేదని! అతడు ఓ ఫ్రెంచి నౌకాదళాధిపతితో యుద్ధం చేశాడు. అయితే అతనికి దగ్గరగా పోలేకపోయాడు.’’

‘‘అయితే కావొచ్చు. కానీ ఇతడు అతనికెంత దూరవెూ అతడూ ఇతనికి అంతే దూరం కదా?’’

‘‘అక్షరాలా నిజం. కానీ, ఈ దేశంలో మిగతా నౌకాదళాధిపతులకు హుషారు తెప్పించడానికి తరచూ ఒక నౌకాదళాధిపతిని చంపడం మంచిదని భావిస్తాం.’’

ఇదంతా చూసి, విన్న కాండీడ్ దిగ్భ్రాంతితో అసలు ఇంగ్లడ్ గడ్డపై కాలు వెూపడానికే వెనకాడాడు. ఆలస్యం చెయ్యకుండా తనను వెనిస్‌కు తీసుకెళ్లమని డచ్చి ఓడ కెప్టెన్ ను కోరాడు, సూరినామ్ రేవులో తన సంపదపే  దోచిన ఓడ కెప్టెన్ లా అతడూ వెూసం చేసే అవకాశమున్నప్పటికీ!

రెండు రోజుల తర్వాత ఓడ కెప్టెన్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఫ్రెంచి తీరం వెంట లిస్బన్ మీదుగా వెళ్లారు. లిస్బన్ అల్లంతదూరాన కనిపించగానే కాండీడ్ నిలువెల్లా వణికిపోయాడు. జలసంధుల మీదుగా మధ్యధరాసముద్రంలో ప్రవేశించి చివరకు వెనిస్‌కు చేరుకున్నారు.

‘‘దేవుడు దయాళువు!’’ అంటూ కాండీడ్ మార్టిన్‌ను కౌగిలించుకుని, ‘‘నా అందాల చెలి క్యూనెగొండ్‌ను ఇక్కడే కలుసుకుంటాను. నాకు కకంబోపైన నమ్మకముంది. అంతా సవ్యంగా సాగుతుంది. మించి శకునాలు కనిపిస్తున్నాయి.  మనం సరైన దారిలో పడ్డాం. భవిష్యత్తు బాగుంటుంది’’ అన్నాడు.  



24వ అధ్యాయం

వెనిస్ చేరగానే కకంబో కోసం అన్వేషణ మొదలైంది. కాండీడ్ ప్రతి సత్రాన్నీ, ప్రతి కాఫీశాలను జల్లెడపట్టాడు. కనిపించిన వేశ్యనల్లా పరీక్షగా చూశాడు. కకంబో ఎక్కడా కనిపించలేదు. ఓడలు దిగుతున్న ప్రయాణికులందర్నీ చూశాడు. సేవకుడి జాడే లేదు.

‘‘చూశారా! ఇప్పటికి ఎంతకాలం ఈ అన్వేషణలో గడిపానో. సూరినామ్ నుంచి బోర్దా వచ్చాను. బోర్దా నుంచి ప్యారిస్ కు, అక్కణ్నుంచి డీప్పీకి, డీప్పీ నుంచి పోర్ట్స్ మత్‌కు. తర్వాత స్పెయిన్, పోర్చుగల్ తీరాల మీదుగా మధ్యధరాసముద్రం గుండా వెనిస్‌కు చేరి చాలా నెలలు గడిపాను. కానీ, నా క్యూనెగొడ్ ఇంకా రాలేదు. ఆమెకు బదులు ఆ ప్యారిస్ భోగందాన్ని, ఆ పెరిగార్డ్ బైరాగి వెధవను కలుసుకున్నాను. అనుమానమే లేదు, క్యూనెగొండ్ చచ్చిపోయింది. నేనూ చచ్చిపోతాను. ఈ శాపగ్రస్త యూరప్‌కు రాకుండా, స్వర్గంలాంటి ఆ ఎల్డొరాడోలోనే ఉండిపోయుంటే ఎంత బావుండేది! మీరు చెప్పింది నిజమే మార్టిన్! ఇక్కడ బాధలు, భ్రమలూ తప్ప మరేమీ లేవు’’ వాపోయాడు కాండీడ్.

అతడు తీవ్ర విచారంలో మునిగిపోయాడు. నాటకశాలలు, వేడుకలు ఉత్సాహాన్ని ఇవ్వలేకపోతున్నాయి.  ప్రియురాలి విరహంలో కాలిపోతున్న ఆ యువకుడు ఆడవాళ్ల వెూహంలో పడతాడన్న ప్రమాదం అసలే లేదు. 

‘‘మీరు నిజంగా ఉత్తి అమాయకులు. జేబులో ఐదారు లక్షలున్న ఆ సంకరజాతి సేవకుడు మీ ప్రియురాలిని లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకునీ, ఇక్కడికి తీసుకొచ్చీ మీకు అప్పగిస్తాడని కలలు కంటున్నారు. మీది ఒట్టి భ్రమ. ఆమే గనక కనిపిస్తే వాడే కట్టేసుకుంటాడు. కనిపించకపోతే మరొకదాన్ని కట్టుకుంటాడు. మీరిక మీ కకంబోను, మీ క్యూనెగొండ్‌ దొరసానిని మరచిపొమ్మని నా సలహా’’ చెప్పాడు మార్టిన్.  

ఆ ఉచిత సలహా కాండీడ్ సాంత్వన కలిగించకపోగా బాధను మరింత ఎక్కువ చేసింది. ఎవరూ వెళ్లలేని ఎల్డొరాడోను మినహాయిస్తే మొత్తం ప్రపంచంలో మంచితనం, సంతోషం అనేవి నామమాత్రమేనని మార్టిన్ రోజురోజుకూ నిరూపించసాగాడు.


ఒకరోజు వాళ్లు ఈ ముఖ్య విషయంపై ఇలాగే చర్చించుకుంటూ, క్యూనెగొండ్ కోసం నిరీక్షిస్తుండగా, సెయింట్ మార్క్ వీధిలో ఓ యువ సన్యాసీ, ఓ యువతీ చేతిలో చెయ్యేసుకుని చట్టపట్టాల్లా పోతూ కనిపించారు. సన్యాసి కాస్త బొద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.  బుగ్గలు గులాబీరంగులో మెరుస్తున్నాయి. ఠీవీగా నడుస్తున్నాడు. ఆమె కూడా అందంగానే ఉంది. నడుస్తూనే పాట పాడుతోంది. మాటిమాటికీ తన ప్రియ సన్యాసి బుగ్గలు గిల్లుతోంది.

‘‘ఈ లోకంలో కనీసం వీళ్లిద్దరైనా సంతోషంగా ఉన్నారని నమ్మండి. నాకిప్పటివరకు కనిపించివాళ్లంతా దౌర్భాగ్యులే, ఒక్క ఎల్డొరాడో మినహా. అయితే ఈమే, ఈమె ప్రియుడూ మాత్రం సంతోషంగా ఉన్నారని పందెం వేస్తా’’ కాండీడ్ తన మాట నెగ్గుతుందనే ఉత్సాహంతో అన్నాడు.

‘‘సంతోషంగా లేరని నేనూ పందెం కడుతున్నా’’ సిద్ధమయ్యాడు మార్టిన్.

‘‘అయితే ముందు వాళ్లను విందుకు పిలుద్దాం. ఆ తర్వాత ఎవరిది పొరపాటో చూద్దురుగానీ’’ కాండీడ్ ఉత్సహం తట్టుకోలేకపోతున్నాడు.

వెంటనే దారినపోతున్న ఆ జంటను పలకరించి, చూడముచ్చటగా ఉన్నారని పొగిడాడు. భోజనానికి రావాలని కోరాడు. పాస్తా, కౌజుపిట్ట మాంసం వంటివి తినిపిస్తానని, సైప్రస్, సవెూస్ మద్యాలు పోయిస్తానని చెప్పాడు. యువతి తెగ సిగ్గుపడిపోయింది. అయితే సన్యాసి ఆహ్వానాన్ని మన్నించడంతో అతణ్ని అనుసరించింది కాండీడ్‌ను ఆశ్చర్యంగా, కంగారుగా చూస్తూ. ఆమె కళ్లలో చివ్వున నీళ్లు చిప్పిల్లాయి. సత్రంలోని కాండీడ్ గదిలోకి అడుగుపెట్టగానే, ‘‘అయితే కాండీడ్ బాబుగారూ! తమరు ఈ దాసిదాన్ని,  పకట్‌నే గుర్తుపట్టలేదన్నమాట’’ అందామె.

క్యూనెగొండ్ ఆలోచనల్లో కూరుకుపోయి, ఆ యువతిని సరిగ్గా గమనించని కాండీడ్ ఆశ్చర్యపోయాడు.

‘‘అయితే నువ్వేనా మహాతల్లీ! పాంగ్లాస్‌కు ఆ ఖర్మ పట్టించించిన పిల్లవు?’’

‘‘అవునండీ! నెనెంతో భయపడిపోయాను. మీకు విషయమంతా తెలుసనుకుంటాను. నా యజమానులకు, ఆ ముచ్చటైన క్యూనెగొండ్ చినమ్మగారికి జరిగిన దారుణాల గురించి విన్నాను. అయితే నా పరిస్థితి అంతకంటే దారుణం బాబుగారూ! నేనప్పుడు చిన్నపిల్లనూ, అమాయకురాలినీ కదా. అందుకే మన గురువు నన్ను సులభంగా బుట్టలో వేసుకుని పాడు చేశాడు. మిమ్మల్ని జమీందారు చావుదెబ్బలు కొట్టి తరిమేశాక నేనూ బలవంతంగా ఇంట్లోంచి బయటపడాల్సి వచ్చింది. ఓ పెద్ద వైద్యుడి చలవతో బతికి కట్టకట్టాను. ప్రాణాలు పోశాడన్న కృతజ్ఞతతో కొన్నాళ్లు ఆయనతో పడుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన కుళ్లుబోతు పెళ్లాం నన్ను రోజూ చావగొట్టి చంపేది. అబ్బ! ఎంత గయ్యాళిగంపో! ఆ వైద్యుడు కురూపి. అతనిపై ప్రేమ లేకున్నా కృతజ్ఞతతో పడుండి అతని పెళ్లాంతో తన్నులు తింటూ ఉండేదాన్ని. ఆ రాక్షసిముండ పీడ భరించలేక ఓ రోజు ఆమెకు చలిజ్వరానికని మందు వేశాడు. అది బాగా పనిచేసి రెండుగంటలు తిరక్కముందే ఆమె నరకయాతన అనుభవించి చచ్చిపోయింది. ఆమె బంధువులు అతనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అతడు పారిపోయాడు. అతనికి బదులు నన్ను ఖైదు చేశారు. అయ్యా! నేను గనక కాస్త అందంగా లేకపోయినట్టయితే నా అమాయకత్వం నన్ను ఏమాత్రం కాపాడేది కాదు. వైద్యుడి స్థానాన్ని తాను తీసుకునే షరతుపైన న్యాయమూర్తి నన్ను విడుదల చేయించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత మరో ముండను చేరదీసి నన్ను వెళ్లగొట్టాడు. చేతిలో చిల్లిగవ్వలేకుడా వీధిలో పడ్డాను. అప్పట్నుంచి ఈ కంపరం పుట్టించే బతుకు బతుకుతున్నాను. అయ్యా! మీ మగవాళ్లకు ఇందులో ఏదో మజా ఉందనిపించొచ్చు కానీ మాకు మాత్రం యమకూపమే. ఈ పాడు బతుకు బతకడానికే వెనిస్ కు వచ్చాను. పడుపుగత్తె బతుకు ఎంత దుర్భరమో, దారుణమో మీకు తెలుసనుకుంటా. కాళ్లు కాటికి చాపుకున్న ముసలి వ్యాపారిపైనా, న్యాయావాదిపైనా, సన్యాసిపైనా, సరంగుపైనా.. ప్రతి అడ్డగాడిదపైనా ఒకేరకమైన ప్రేమ ఒలకబోయాలి. లెక్కలేన్ని కష్టాలు, అవమానాలు పడాలి. తరచూ లంగాను అరువు తెచ్చుకోవాలి, ఏ నికృష్టుడో పైకెత్తడానికి! ఈ రొంపి మధ్యలో న్యాయాధికారుల, రక్షకభటుల వేధింపులు, దందాలు షరా మామూలే. చివరకు దుర్భరమైన ముసలితనం, తర్వాత అనాథ శరణాలయాల్లో, చస్తే ఏ చెత్తకుప్పలోనో తేలడం.. లోకంలో నాకంటే దౌర్భాగ్యురాలు ఇంకొకత్తె  లేదు బాబూ..’’ వాపోయింది పకెట్.





కాండీడ్ గదిలో ఆమె తన మనసు విప్పి చెప్పిన ఆ సంగతులను మార్టిన్ శ్రద్ధగా విన్నాడు.

‘‘చూశారా! నేనప్పుడే సగం పందెం గెలిచాను’’ అన్నాడు కాండీడ్‌తో.

పకెట్ సన్యాసి ప్రియుడు జిరోఫ్లీ మాత్రం పానీయం తాగడానికి ముందు గదిలోనే ఉండిపోయాడు.

‘‘మరైతే, నిన్ను వీధిలో చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నావు.  హుషారుగా పాట పాడుతూ,  సన్యాసితో సరసమాడుతూ, అతడంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు కనిపించావు!’’ అడిగాడు కాండీడ్ పకెట్‌ను.

ఆమె నిట్టూర్చింది. ‘‘ఈ బతుకులో అదో బాధ బాబుగారూ. నిన్ననే ఓ అధికారి నన్ను చావగొట్టి, నా దగ్గరున్నదంతా ఊడబీక్కున్నాడు.  అయినా ఆ దెబ్బలు మర్చిసోయి ఈ రోజు ఈ సన్యాసిని సంతోషపెట్టాడానికి హుషారుగా ఉన్నట్టు కనిపించక తప్పలేదు..’’

కాండీడ్‌కు ఈ సంగతులు సరిపోయాయి. మార్టిన్ చెప్పిందే సరైందని ఒప్పుకున్నాడు.  తర్వాత కాండీడ్, మార్టిన్, పకట్ సన్యాసి భోజనానికి కూర్చున్నారు. అందరూ మనసు విప్పి మాట్లాడుకోసాగారు.

‘‘ఫాదర్! మీరెంతో సంతోషంగా, ఆరోగ్యంగా, అందరికీ అసూయ పుట్టించేలా ఉన్నారు. పైగా సరదా కోసం ఓ చక్కని చిన్నది కూడా మీ పక్కనుంది. చర్చిలో మీకు చాలా సుఖంగా సాగుతోందనుకుంటా’’ అడిగాడు కాండీడ్ ఎప్పట్లాగే కుతూహలంతో.

‘‘అయ్యా! నేనో మాట చెబుతా నమ్మండి. మా సన్యాసులందర్నీ నట్టేట ముంచిపారెయ్యాలన్నంత కసిగా ఉంది నాకు. మా మఠానికి నిప్పెట్టి, ఎంచక్కా ఆ తురుష్కుల్లో కలసిపోవాలని వందలసార్లు అనుకుని ఉంటాను. మా అమ్మానాన్నలు నాకు పదిహేనేళ్లప్పుడు తమ సర్వసంపదనలూ మా అన్నయ్యకు కట్టబెట్టేందుకు నాకు బలవంతంగా ఈ సన్యాసి వేషం కట్టబెట్టారు. మా అన్నగాడు సర్వనాశనం కావాలి! ఇక మఠం అంటారా.. అక్కడ ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు తాండవిస్తుంటాయి. నేను పనికిమాలిన బోధనలతో ఏవో నాలుగు డబ్బులు సంపాదించుకుంటాననుకోండి. అందులో సగం మా మఠాధిపతి లాకున్నా, అమ్మాయిల కోసం కాస్త మిగులుతూనే ఉంటుంది. అయితే సాయంత్రం తిరిగి మఠానికి వెళ్లినప్పుడు మాత్రం తలను గోడకేసి బద్దలుకొట్టుకు చావాలనిపిస్తుంది. నాతోటి సన్యాసులందరిదీ ఇదే పరిస్థితి’’ బాధ వెళ్లగక్కాడు సన్యాసి.


మార్టిన్, కాండీడ్‌వైపు తిరిగి, ‘‘మరైతే నేను పందెం పూర్తిగా గెలిచినట్టేనా?’’ అన్నాడు.  

కాండీడ్ పకెట్ కు  రెండువేల పియస్టర్లు, ఆమె తాత్కాలిక ప్రియుడికి వెయ్యి పియస్టర్లు ఇచ్చాడు.

‘‘ఈ డబ్బుతో వాళ్లిక సుఖపడతారు’’ అన్నాడు మార్టిన్‌తో ధీమాగా.

‘‘నేనలా అనుకోవడం లేదు. పైగా మీరిచ్చిన ఆ డబ్బుతో వాళ్ల బాధలు మరింత ఎక్కువైనా  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’ పండితుడు వైరాగ్యంతో అన్నాడు.

‘‘ఎలా జరగాల్సి ఉంటే అలా జరగనీ. కానీ నాకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది సుమండీ. మనమిక ఎప్పుడూ చూడలేమని అనుకున్నవాళ్లను మళ్లీ కలుసుకుంటున్నాను.  నా ఎర్రగొర్రె తిరిగి దొరికింది. ఇప్పుడు పకెట్ కనిపించింది. ఇలాగే నా క్యూనెగొండ్‌నూ తిరిగి కలుసుకుంటా.’’

‘‘ఆమె ఏదో ఒకరోజు మిమ్మల్ని ఆనందపులకితం చేయాలని నేనూ ఆశిస్తున్నా. కానీ అది చాలా అనుమానంగానే తోస్తోంది నాకు..’’

‘‘అబ్బ! మీరెంత నిరాశావాదులండి!’’

‘‘నాకు జీవితమంటే ఏమిటో తెలుసు కనక.’’

‘‘ఆ పడవలు నడిపే వాళ్లను చూశారా! ఎంత సంతోషంగా పాటలు పాడుకుంటున్నారో..’’

‘‘అంతేగాని, ఇంటిదగ్గర పెళ్లాంపిల్లలతో వాళ్లు పడే అగచాట్లను మీరు చూడలేదు. పీత కష్టాలు పీతవి. అయితే వెనిస్ ప్రధానాధికారితో పోలిస్తే వీళ్లే మేలంటాను. కానీ ఏమంత పెద్ద తేడా లేదనుకో’’ ఆ సంగతి అంతటితో ముగించాడు మార్టిన్.

‘‘నగర పాలకసంఘ సభ్యుడు పొకోక్యురంటీ గురించి జనం బాగా చెప్పుకుంటున్నారు. బ్రెంతాలోని తన అందమైన భవంతికొచ్చే విదేశీయులను బాగా ఆదరిస్తాడని, ఆయన అసలు బాధ అంటే ఏమిటో ఎరగడని అంటున్నారు..’’ చెప్పాడు కాండీడ్.

‘‘ఈ ఇలలో అలాంటి అరుదైన జీవిని చూస్తే పరమానందమే కదూ..’’

మర్నాడు తమకు దర్శనమివ్వాలని కోరుతూ కాండీడ్ పొకోక్యురంటీకి వెంటనే కబురు పంపాడు.



25వ అధ్యాయం

కాండీడ్, మార్టిన్‌లు పడవలో బ్రెంతా చేరుకుని పొకోక్యురంటీ భవంతికి వెళ్లారు. తోట మనోహరంగా ఉంది. అక్కడక్కడా పాలరాతి శిల్పాలున్నాయి. భవన వాస్తుశిల్పమూ అద్భుతంగా ఉంది. ఇంటి యజమాని కోటీశ్వరుడు. అరవయ్యేళ్లు. అతిథులను కాస్త అనాసక్తితోనే అయినా వినయంగానే ఆహ్వానించాడు. ఇది కాండీడ్‌కు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే మార్టిన్ మాత్రం పట్టించుకోలేదు.

అభివాదాలు ముగిశాయి. చక్కని దుస్తులు ధరించిన ఇద్దరు అందమైన యువతులు నురగలు కక్కుతున్న  చాక్లెట్ పానీయాన్ని అందించారు. వాళ్ల అందచందాలను, అణకువను కాండీడ్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

‘‘వీళ్లు నాకూ బాగా సరిపొయ్యారు. కొన్నిసార్లు ఈ సేవలతో సరిపుచ్చుకోకుండా వీళ్లతో పడుకుంటూ ఉంటాను కూడా. ఈ పట్టణంలోని ఆడాళ్లతో విసిగివేసారి వీళ్లతో జతకట్టాను. ఈ ఊర్లోని ఆడాళ్లున్నారే.. చాలా తలతిక్క మనుషులు. వాళ్ల వగలు కళ్లుబోతుతనం, కాట్లాటలు, మూర్ఖత్వం, అహంకారం, ఎత్తిపొడుపులతో, వాళ్లను పొగుడుతూ పద్యాలు రాసీ, రాయించీ రోసిపోయాను. అయితే ఇప్పుడు వీళ్లతోనూ నాకు అలాగే విసుగెత్తుతోందనుకోండి ’’ పొకోక్యురంటీ తన కష్టం చెప్పుకున్నాడు.  

అల్పాహారం తర్వాత కాండీడ్ భవనంలోని  పొడవైన చిత్రశాలలో పచార్లు చేశాడు. అక్కడి అందమైన చిత్రపటాలను చూసి అబ్బురపడ్డాడు. మొదటి రెండు చిత్తరువులను వేసింది ఎవరని అడిగాడు.

‘‘రాఫేల్ వేశాడులే. కొన్నేళ్ల కిందట ఒట్టి గొప్ప కోసం బోలెడు డబ్బు తగలేసి కొన్నాను, దండగ. ఇటలీలోని గొప్పచిత్రాల్లో వీటినీ చేర్చారు గానీ ఇవి నాకేమాత్రం ఆనందాన్ని ఇవ్వలా. రంగులు మరీ గాఢంగా ఉన్నాయి.  మనుషుల చిత్రణా తూకం లేక తేలిపోయింది. బట్టలు అసలు బట్టల్లానే లేవు. ఇంతెందుకుగ్గాని ఒక్కమాటలో చెప్పాలంటే, వాటిలో ప్రకృతి అనుసరణ గుండుసున్నా. ప్రకృతిని ఉన్నదున్నట్టు ప్రతిబింబించే చిత్రాలనే నేను ఇష్టపడతాను. అయితే అలాంటివెక్కడా లేవులెండి. నా దగ్గర చాలా వర్ణచిత్రాలున్నాయి కానీ నేనిప్పుడు వాటినసలు చూడ్డమే లేదు..’ కళాభిరుచిని వివరించాడు యజమాని.  

భోజనాల వేళ అయ్యేదాకా కచేరీ ఏర్పాటు చేయించాడు. ఆ సంగీతానికి కాండీడ్ తెగ పరవశించిపోయాడు.

‘‘ఈ రొద మహా అయితే ఓ అరగంట మాత్రమే వినోదాన్ని ఇస్తుంది. అంతకు మించి సాగితే భరించనలవి కాదు. అయితే ఆ సంగతి ఒక్కడూ ధైర్యంగా చెప్పిచావడు. ఈ రోజుల్లో సంగీతమంటే జటిలమైన వాటిని ప్రదర్శించడమేనని అనుకుంటున్నారు వెర్రిజనం. కానీ జటిలమైనవేవీ సంతోషాన్నివ్వలేవు. విపరీతంగా లేకుండా, విసుగెత్తి చంపకుండా ఉంటే నృత్యరూపకాలను మాత్రం మెచ్చుకుంటా. నటి గాత్రసామర్థ్యాన్ని ఊరంతా చాటడానికి హాస్యాస్పదమైన రెండు పాటలను సందర్భశుద్ధిలేని సన్నివేశాలతో దట్టించిన విషాదాంతాలను చూడ్డానికి జనం ఎగబడితే ఎగబడొచ్చు గాక. కానీ నేను వాటిని అసలు లెక్క చేయను. ఒక కొజ్జా సీజర్ వేషవెూ, కేటో వేషవెూ వేసి పిచ్చిగంతులు వేస్తూ కర్ణకఠోరంగా పాడుతూ ఉంటే ఆనందించేవాళ్లు ఉంటే ఉండొచ్చు.  అలాంటి వాళ్లు ఆ ఆనందాంబుధిలోనే మునిగి చావనీ. నేటి ఇటలీ వైభవాన్ని ఘనంగా చాటుతూ, మహారాజపోషణ అందుకుంటున్న అలాంటి చెత్త వినోదాలకు వెళ్లడం నామటుకు నేను ఎన్నడో మానుకున్నాను.. ’’ విసుగ్గా చెప్పాడు పొకోక్యురంటీ.  

కాండీడ్ అతని వాదన ఒప్పుకోకుడా కాస్త తెలివిగా వాదించాడు. కానీ మార్టిన్ మాత్రం అతడు చెప్పింది ముమ్మాటికీ నిజమని ఒప్పుకున్నాడు.  

తర్వాత సుష్టుగా భోంచేసి గ్రంథాలయంలోకి వెళ్లారు. చూడముచ్చటగా అలంకరించిన హోమర్ గ్రంథాన్ని చూసి కాండీడ్ ఆ ఇంటి యజమాని అభిరుచిని మెచ్చుకున్నాడు.  

‘‘జర్మనీలోకెల్లా గొప్ప తత్వవేత్త అయిన మా పాంగ్లాస్ గురువుగారు ఈ పుస్తకం చదివే ఉత్తేజితుడయ్యాడు’’ అన్నాడు.

‘‘నేను మాత్రం కాలేదు! హోమర్ పుస్తకాలు ఆనందమిస్తాయని ఒకప్పుడు నేను కూడా ఒప్పుకున్నా. అయితే ఒకటి తర్వాత ఒకటి సాగే ఆ రొడ్డకొట్టుడు యుద్ధాలు, ఎటూ తేల్చుకోక సతమతమయ్యే దేవుళ్లు, యుద్ధానికి కారణమైన హెలెన్‌కు కథలో ప్రాధాన్యం లేకపోవడం, ట్రాయ్‌ నగరాన్ని నిర్విరామంగా ముట్టడించినా పట్టుకోలేకపోవడం చెడ్డ విసుగు పుట్టిస్తాయి. నా మాదిరే మీరూ విసిగిపోయారా అని కొంతమంది పండితులను అడిగి చూశాను. వాళ్లంతా నిజాయితీగా ఆ పుస్తకాన్ని ఎప్పుడో మూలన పడేశామని, కేవలం పురాతన అవశేషంగా, తుప్పుపట్టిన చెల్లని నాణెంలా గ్రంథాలయంలో తప్పనిసరిగా ఉంచుకోవాల్సి వచ్చిందని వాపోయారు’’ పొకోక్యురంటీ చెప్పాడు.

‘‘అయ్యా! మరి వర్జిల్ గురించి మీ అభిప్రాయమూ అదేనా?’’

‘‘ఆ. ఈనీడ్‌లోని రెండు, నాలుగు, ఆరో అధ్యాయాలు చాలా బావుంటాయి. అయితే మహాభక్తుడు ఈనీయస్, వీరుడు క్లాన్తస్, అతని నమ్మినబంటు అకాటెస్, కుర్రకుంక ఆస్కానియస్, చేవచచ్చిన లాటినస్ మహారాజు మొరటుమనిషి అమతా, దద్దమ్మ లవీనియా.. ఇంతకంటే వెగటు పుట్టించి విసుగెత్తి చంపేవేమీ లేవు అందులో.. తాసోవి, నిద్రపట్టించే అరియస్టోల కథలు పుస్తకాలు బావుంటాయి.’’

‘‘మరైతే, మీకు హోరేస్ పుస్తకాలు బాగా నచ్చుతాయనుకుంటా..’’

‘‘మనిషికి పనికొచ్చే నీతిసూత్రాలు చాలా ఉన్నాయి. వాటిని శక్తిమంతమైన పద్యాలుగా అల్లడం వల్ల బాగా గుర్తుంటాయి. అయితే బ్రుందూసియానికి అతని ప్రయాణం, ఆ ముదనష్టపు విందు వర్ణన, అల్లరి విద్యార్థుల కొట్లాటా.. వాళ్ల పేర్లేమిటీ? బూతుకూతల రూపీలియస్ కూ, మరొకడికి మధ్య కదూ.. వీటిని నేను పట్టించుకోను. ముసలమ్మలను, మంత్రగత్తెలను తిడుతూ రాసిన పద్యాలను తీవ్ర అసంతృప్తితో చదివాను. తనను గొప్ప కవుల సరసన చేరిస్తే తన పొడవాటి తలకాయతో తారామండలాన్ని అందుకుంటానని అతడు తన సావాసగాడైన మీసీనస్‌తో చెప్పడంలో ఏమంత గొప్ప ఉందో నా చచ్చుబుర్రకు అర్థమై చావలేదు. గొప్ప గ్రంథాలుగా పేరువెూసిన వాటిలోని ప్రతిదాన్నీ మూర్ఖులే మెచ్చుకుంటారు. నేను మాత్రం నా సంతోషం కోసమే చదువుతాను, నా అభిరుచికి తగ్గవాటినే హర్షిస్తాను..’’


కాండీడ్ తెగ ఆశ్చర్యపోయాడు. అతని పెంపకం స్వయం నిర్ణయాలు తీసుకునే విధంగా సాగలేదు మరి. మార్టిన్ మాత్రం తమ ఆతిథేయి ఆలోచనా విధానం సహేతుకంగా ఉందనుకున్నాడు.   

‘‘ఇక్కడ సిసిరో పుస్తకముందే. ఇతడు చాలా గొప్పవాడు. ఇతని పుస్తకాలు మీకు విసుగెత్తించవనుకుంటా..’’  కాండీడ్ మళ్లీ కెలికాడు.

‘‘వాటిని నేనసలు చదివి చచ్చిందే లేదు. అతడు రబీరియస్ కోసం వాదిస్తే నాకేం, క్లూన్తియస్ కోసం వాదిస్తే నాకేం? విచారించేందుకు నాకొచ్చిన ఫిర్యాదులే నాకు గంపెడున్నాయి. అతని తాత్విక రచనలు మాత్రం బావుంటాయి. అయితే ప్రతి విషయంలోనూ అతనికే అనుమానముందని తెలుసుకున్నాక ఇక నేను చదవడమెందుకు? ఆ మాత్రం అనుమానాలు నాకూ తెలుసు. అజ్ఞానం సంపాదించుకోవడానికి మరొకడి సాయం నాకక్కర్లేదు..’’ 

‘‘శాస్త్రీయవిజ్ఞాన సంస్థ వాళ్ల చర్చల సంపుటాలు ఎనబై ఉన్నాయి.  వీటిలో కొన్నయినా ఆసక్తికరంగా ఉంటాయి’’ ఈసారి మార్టిన్ అడిగాడు.

‘‘ఉంటే ఉంటాయేమో.. అయితే ఈ గందరగోళం రచయితల్లో ఒక్కడు కూడా గుండుసూదులు తయారు చెయ్యడం ఎలా? అనే విషయం తప్ప కొత్తదేదీ కనిపెట్టలేదు. అన్నింటా చెత్త తాత్విక సిద్ధాంతాలే’’ తేల్చేశాడు పొకోక్యురంటీ.

‘‘ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచి నాటకాలు చాలా ఉన్నాయే..’’ సంబరంతో అన్నాడు కాండీడ్.

‘‘ఉండడానికైతే మూడు వేలు ఉన్నాయి. కానీ, మంచివి ముప్పై కూడా లేవు. ఆ సిద్ధాంత చర్చల  పుస్తకాల మాదిరే వీటిలోనూ సెనెకా పుస్తకంలోని ఒక్క పుటకు సాటివచ్చేదేదీ లేదు. ఇక ఆ తలగడల్లాంటి మతధర్మశాస్త్ర  గ్రంథాలున్నాయే. నేనే కాదు మరెవడూ తెరచిచూసిన పాపాన పోలేదు..’’

మార్టిన్ కొన్ని అరల నిండా ఉన్న ఇంగ్లిష్ పుస్తకాలు చూసి.. ‘‘స్వతంత్రేచ్ఛతో రాసిన ఈ పుస్తకాలు రిపబ్లికన్లకు బాగా నచ్చుతాయనుకుంటా’’ అన్నాడు.

‘‘ఆ. అందరూ తమ భావాలను రాయడం ఎంతో బావుంటుంది. ఇది మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకత కూడా. అయితే ఇటలీలో మాత్రం మేం ఏది ఆలోచిస్తున్నామో అది రాయం. సీజర్ల, ఆంటోనీల దేశంలో బతుకుతున్న వాళ్లం.. మతాచార్యుల అనుమతి లేకుండా కనీసం ఆలోచించడానికి కూడా ధైర్యం  చేయలేం. పార్టీతత్వంతో కలుషితం కాకుండా ఉంటే ఆంగ్ల మహారచయితలకు స్ఫూర్తినిస్తున్న స్వతంత్రేచ్ఛ ఎంతో హర్షణీయం.’’

కాండీడ్ మిల్టన్ పుస్తకాలు చూసి అతణ్నయినా గొప్ప రచయిత అని ఒప్పుకుంటా అని అడిగాడు.

‘‘మిల్టన్నా! ఆదికాండం తొలి అధ్యాయంపై  వ్యాఖ్యానం రాయడానికి  దరిద్రపుగొట్టు మాటలతో పది సంపుటాలను చెడగొట్టిన ఆ అనాగరికుణ్నా? గ్రీకులను గుడ్డిగా అనుకరించి, సృష్టి పుట్టుక కథను భ్రష్టు పట్టించాడు. వెూజెస్ ఒక మాటతో విశ్వాన్ని సృష్టిస్తే, ఇతగాడు మెస్సయాతో స్వర్గంలోని అల్మారాలోంచి రెండు కంపాసులు తీయించి వాటితో తన పథకాన్ని గీస్తున్నట్టు చిత్రిస్తాడా? నరకం, సైతాన్  పై తాసో భావాలను కూడా వెధవ చెడగొట్టాడు. హవ్వ.. లూసిఫర్‌ను బోదురుకప్పలా, మరుగుజ్జుగా చిత్రీకరిస్తాడా? అతణ్ని చెప్పిందే చెప్పే వాగుడుకాయలా, ధర్మశాస్త్ర చర్చకారుడిగా చూపుతాడా? ఇతనికి పరిహాసాన్ని అనుకరించడమూ చేతకాదు.  అరియస్టో తమాషాగా చిత్రించిన తుపాకుల్లోని ఔచిత్యాన్ని పట్టించుకోకుండా వాటిని అనుకరించి స్వర్గంలో దెయ్యాలతో ఫిరంగులను కాల్పిస్తాడా? ఇలాంటి అతిశయోక్తులను ఇటలీలో నేనే కాదు ఎవడూ హర్షించడు. పాపానికి, మృత్యువు పెళ్లి చేసి, పాపానికి పాములు పుట్టినట్లు చూపుతాడా? కాస్త సున్నితమైన మనసూ, అభిరుచీ ఉన్నవాడు వీటిని చదివితే జబ్బుపడ్డం ఖాయం. ఇక వైద్యశాలపై అతని చాంతాడంత వర్ణన సమాధి గుంతలు తవ్వుకునేవాడికి నచ్చుతుంది. గందరగోళంగా, విసుగ్గా, రోతగా ఉండే ఆ పద్యాన్ని అచ్చేసినప్పుడే జనం చీదరించుకున్నారు. దానిపై అతని దేశీయులు తొలుత ఏమనుకున్నారో ఇప్పుడు నేనూ అదే అనుకుంటున్నా. నేను ఏమనుకుంటానో అదే చెబుతాను. ఎదుటివాళ్లు ఏకీభవిస్తారా
, వ్యతిరేకిస్తారా అని అసలు లెక్క చేయను.’’

హోమర్, మిల్టన్‌లకు వీరాభిమాని అయిన కాండీడ్ ఈ మాటలతో విలవిల్లాడిపోయాడు.

‘‘ఈయనకు మన జర్మన్ కవులంటే కూడా మంటేనేవెూ’’ గుససగుగా అన్నాడు మార్టిన్‌తో.

‘‘అందులో పెద్ద ప్రమాదమేమీ లేదులెండి’’ బదులిచ్చాడు మార్టిన్.

‘‘ఎంత గొప్పవాడు..ఎంత విజ్ఞాని! ఇతనికి ఏదీ తృప్తి కలిగించదు..’’ గొణిగాడు కాండీడ్.

పుస్తకాలను చూశాక తోటలోకి వెళ్లారు. కాండీడ్ తోట అందానికి పరవశుడై పొగడ్తలు కురిపించసాగాడు.

‘‘ఇంత దరిద్రంగా ఉండే తోటను ఎక్కడా చూడలేదు. ఇక్కడున్నవన్నీ పనికిరానివే. రేపు ఇంతకంటే గొప్ప తోట వేయిస్తా..’’ అన్నాడు యజమాని.. కాండీడ్ ను నీరుగారస్తూ.

తర్వాత అతిథులు పొకోక్యురంటీ వద్ద సెలవు పుచ్చుకున్నారు.  

‘‘ఇతడు తన సర్వస్వానికి అతీతంగా ఉన్నాడు కనక లోకంలో ఇతడే అత్యంత సంతోషి అని మీరు ఒప్పుకు తీరాలి’’ గదమాయించాడు కాండీడ్.. మార్టిన్ను.

‘‘అతడు తనకున్న ప్రతిదానిపైనా అసంతృప్తిగా ఉండడం మీరు గమనించలేదా? ప్లాటో ఏనాడో చెప్పాడు కదా.. అన్ని తిళ్లనూ నిరాకరించే కడుపు మంచి కడుపు కాదని..’’

‘‘ప్రతిదాన్నీ విమర్శించడంతో, ఇతరులు హర్షించే వాటిలోని లోపాలను ఎత్తిచూపడంలో ఆనందం లేదంటారా?’’

‘‘అసంతృప్తిలో కూడా సంతృప్తి ఉందనేనా మీరంటున్నది?’’

‘‘ఏదైతేనేంలెండి. క్యూనెగొండ్‌ను చూశానంటే నా అంత సంతోషించేవాడు మరొకడు ఉండడు.’’

‘‘ఆశించడంలో ఆపాయం ఉండదులెండి.’’


అయితే రోజులూ, వారాలూ గడుస్తున్నా కకంబో రాలేదు. కాండీడ్ కు దిగులు ఎక్కువైంది.  తన సాయం పొందిన పకెటూ, ఆమె సన్యాసి ప్రియుడూ కృతజ్ఞతలు చెప్పడానికి కూడా రాలేదన్న సంగతినీ మర్చిపోయాడు ఆ విరహ వేదనలో.

(సశేషం)