Saturday, 20 February 2016

కాండీడ్- చివరి భాగం












26వ అధ్యాయం 


ఒకరోజు సాయంత్రం కాండీడ్, మార్టిన్‌లు సత్రంలో భోజనానికి కూర్చున్నారు. అక్కడ బస చేసిన కొత్తవాళ్లూ బుక్కడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ముఖానికి మసి పూసుకున్న ఓ మనిషి కాండీడ్ దగ్గరికొచ్చి జబ్బ పుచ్చుకుని, ‘మాతో రావడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు.

కాండీడ్ కకంబోను గుర్తుపట్టి నోరెళ్లబెట్టాడు. క్యూనెగొండ్ కూడా కనిపించి ఉంటే మరింత సంతోషించేవాడు. చాన్నాళ్ల తర్వాత కనిపించిన మిత్రణ్ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు.  

‘‘క్యూనెగొండ్ కూడా ఇక్కడే ఉంది కదూ? ఎక్కడుంది? వెంటనే నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్లు’’ అని తొందరపెట్టాడు.

‘‘ఆమె ఇక్కడ లేదు. కాన్‌స్టాంటినోపుల్లో ఉంది.’’ చావుకబురు చల్లగా చెప్పాడు బంటు.

‘‘కాన్‌స్టాంటినోపుల్లోనా? ఎక్కడుంటేనేంలే. చైనాలో ఉన్నా రెక్కలు కట్టుకుని ఆమె ముందు వాలిపోతా. పద పద త్వరగా వెళ్దాం.’’

‘‘ఇప్పుడు కాదులెండి. భోంచేసి వెళ్దాం. ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ చెప్పలేను. నేనిప్పుడు బానిసను. నా యజమాని నాకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్లి భోజనం వడ్డించాలి. మీరింకేమీ మాట్లాడకండి. భోంచేసి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.’’

నమ్మినబంటును చూసినందుకు కాండీడ్ సంతోషించాడు. అయితే అతడు బానిసని తెలిసి తెగ బాధపడ్డాడు. తన ప్రియురాలి ఆచూకీ తెలియడంతో గాల్లో తేలిపోతున్నాడు. ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. అయితే మార్టిన్ మాత్రం నిర్వికారంగా.. అక్కడున్న ఆరుగురు కొత్తవాళ్లను తేరపారా చూస్తూ కూర్చున్నాడు. వాళ్లు జాతర చూడ్డానికి నగరానికొచ్చారు.

భోజనాలు ముగిశాయి. కకంబో ఆ కొత్తవాళ్లలో ఒకడైన తన యజమానితో గుసగుసగా, ‘‘ప్రభువులు తమకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు బయల్దేరొచ్చు. పడవ సిద్ధంగా ఉంది’ అని చెప్పి బయటకి వెళ్లిపోయాడు.

ఆ పూటకూళ్లింట్లో ప్రభువులు అనే మాట వినిపించేసరికి మిగతా అతిథులు విస్తుబోయి నోటమాటరాక ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.  

తర్వాత మరో సేవకుడు కొత్తవాళ్లలోని తన యజమాని చెంతకొచ్చి, ‘‘ప్రభువుల బండి పడువాలో ఉంది. పడవ కూడా సిద్ధం’’ అని చెప్పాడు. ఆ యజమాని సరేనని తల పంకించాడు.  మిగిలిన అతిథులు మళ్లీ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆసక్తి, ఆశ్చర్యం ముప్పిరిగొంటున్నాయి.

ఇంతలో మూడో సేవకుడు తన యజమానితో.. ‘‘ప్రభువులు నా సలహా పాటించాలి. ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేశాను’’ అని బదులు కూడా వినకుండా చప్పున వెళ్లిపోయాడు.


వీళ్లు జాతరలో పగటి వేషాలు వేసేవాళ్లేమో అనుకున్నారు మిగతావాళ్లు.

ఇంతలో నాలుగో సేవకుడు తన యజమాని దగ్గరకొచ్చి.. ‘‘ప్రభువులకు ఎప్పుడిష్టమైతే అప్పుడే వెళ్దాం’’ అని నిర్వికారంగా చెప్పేసి వెళ్లిపోయాడు.

ఐదో సేవకుడు కూడా ఐదో యజమానితో అచ్చం ఇలాగే చెప్పి వెళ్లిపోయాడు.

అయితే ఆరో సేవకుడు మాత్రం తన యజమానితో మిగతా సేవకులకంటే తేడాగా చెప్పాడు.

‘‘ప్రభువులు నా మాట వినాలి. ఇక్కడిక మన పప్పులు ఉడకవు. ఈ రాత్రికే మనల్ని పట్టుకుని ఖైదు చేసిపడేస్తారు. నా దారిన నేను పోతున్నాను. సెలవు’’ అని తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. 


సేవకులందరూ వెళ్లిపోయారు. ఆ ఆరుగురు యజమానులు, కాండీడ్, మార్టిన్‌లు చీమ చిటుక్కుమంటే  వినేపించేంత నిశ్శబ్దంగా ఉండిపోయారు. కాండీడ్ కుతూహలం అణచుకోలేక నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాడు.  

‘‘అయ్యలారా! మీ వ్యవహారం భలే తమాషాగా ఉందే. ఇలాంటిది ఎన్నడూ చూసెరగను. మీరంతా రాజులా? నేనూ, మా మార్టిన్ మాత్రం రాజులం కాము సుమీ’’ అని మాట కదిపాడు.  

కకంబో యజమాని చాలా గంభీరంగా ఇటాలియన్ భాషలో సమాధానమిచ్చాడు.

‘‘నేనేం తమాషా చేయడం లేదు. నా పేరు మూడో అక్మెత్. ఎన్నో ఏళ్లు మహాసుల్తాన్‌గా పరిపాలించాను. నేను నా అన్నను సింహాసనం నుంచి దించేస్తే, నా అన్న కొడుకు నన్ను దించేశాడు. నా వజీర్ల గొంతుకలు కోశారు.  నేనిప్పుడు పాత రాజభవంతిలో రోజులు నెట్టుకొస్తున్నాను. నా ఆయురారోగ్యాల కోసం మహాసుల్తాన్ మహమ్మద్ నా ప్రయాణాలకు అనుమతిస్తుంటాడు. అందుకే వేడుక చూడ్డానికి వెనిస్ కు వచ్చాను.’’

తర్వాత అక్మెత్ పక్కన కూర్చున్న యువకుడు మాట్లాడాడు:

‘‘నా పేరు ఇవాన్. ఒకప్పుడు సువిశాల రష్యా సామ్రాజ్యానికి చక్రవర్తిని. అయితే నేనింకా ఊయల్లో ఉన్నప్పుడే నన్ను సింహాసభ్రష్టుణ్ని చేశారు. నా తల్లిదండ్రులను ఖైదు చేశారు. నేనూ నిర్బంధంలోనే పెరిగాను. అప్పుడప్పుడూ అనుమతి తీసుకుని  నా అంగరక్షకులతో కలసి ఇలా ప్రయాణాలు చేస్తుంటాను. జాతర కోసమే ఇక్కడికొచ్చాను.’’

మూడోవాడు తన విషయం చెప్పాడు:

‘‘నేను ఇంగ్లండ్ రాజు చార్లెస్ ఎడ్వర్డ్ ను. నా తండ్రి నాకిచ్చిన సార్వభౌమాధికారాలను కాపాడుకోవడానికి శాయశక్తులా పోరాడుతున్నాను. నా శత్రువులు నా ఎనిమిది వందలమంది అనుచరుల గుండెకాయలను బతికుండానే పీకేసి వాటితో వాళ్లముఖాలనే చావబాదారు. నన్ను ఖైదు చేశారు. నాలాగే పదవీచ్యుతులైన నా తాతతండ్రులను దర్శించుకుందామని రోమ్‌కు వెళ్తూ దారిలోనే కదా అని జాతర చూడ్డానికి వచ్చాను.’’

నాలుగోవాడు కూడా తన కథేమిటో చెప్పాడు:

‘‘నేను పోలండ్ రాజును. యుద్ధంలో రాజ్యం పోగొట్టుకున్నాను. ఇదివరకు మా నాన్నకూ ఈ యోగం పట్టిందిలెండి. అక్మెత్ సుల్తాన్, ఇవాన్ చక్రవర్తి, చార్లెస్ ఎడ్వర్డ్ ల మాదిరే తలరాత తప్పించుకోలేకపోయాను. జాతర కోసం వచ్చానిక్కడికి...’’

ఐదోవాడు కూడా తన స్థితిగతులు చెప్పాడు:

‘‘నేను కూడా పోలండ్ రాజునే. రెండుసార్లు సింహాసనభ్రష్టుణ్నయ్యాను. అయితే అదృష్టవశాత్తూ విస్తులా తీరంలో నాకో సంస్థానం దక్కింది. అక్కడి సర్మాతియన్ రాజులందరికంటే మెరుగనిపించుకున్నాను. విధిరాత తప్పించకోలేకపోయాను. నేనూ వేడుక చూడ్డానికి వచ్చాను.’’

ఆరోవాడూ తన కథ విఁపించాడు:

‘‘మహాశయులారా! నేను మీ అంత గొప్పణ్ణి కాన్లెండి. అయితే ఒకప్పుడు నేనూ రాజునే. పేరు థియోడర్. నన్ను కార్సికాకు రాజుగా ఎన్నుకున్నారు. గతంలో నన్నందరూ ‘ప్రభువు’ అని అమితగౌరవంతో పిలిచేవాళ్లు. ఇప్పుడు మాత్రం ‘‘అయ్యా, గియ్యా’లతో సరిపెడుతున్నారు. ఇదివరకు నా రాజ్యంలో నా పేరుపైన సొంత నాణేలు చలామణిలో ఉండేవి. ఇప్పుడు నా పేరిట చిల్లిగవ్వ లేదు. ఇదివరకు ఇద్దరు కార్యదర్శులుంటే ఇప్పుడు ఒకే ఒక సేవకుడితో సరిపెట్టుకుంటున్నాను. నేను సింహాసనమ్మీద ఆరేసుకుని కూర్చున్నాను, లండన్ బందిఖానాలో గడ్డిపరుపులపైనా రోజులు నెట్టుకొచ్చాను. మీ మాదిరే జాతరకు వచ్చాను. ఇక్కడా గడ్డిపరుపు యోగం పడుతుందేవెూనని భయంగా ఉంది.’’

థియోడర్ రాజు గాథ విని మిగతా ఐదుగురు రాజులు జాలిపడ్డారు. ఒక్కొక్కరూ ఇరవై సెక్విన్లు అతనికి ఇచ్చారు. కాండీడ్ మాత్రం రెండువేల సెక్విన్ల ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని కానుకగా ఇచ్చాడు. 

‘‘ఇతనెవరబ్బా? చూడ్డానికి అతి సామాన్యునిలా ఉన్నాడు, కానీ మనమిచ్చిన దానికంటే వందింతల ఖరీదైంది ఇచ్చాడు’’ అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు.  

వాళ్లు లేవబోతుండగా యుద్ధాల్లో జమీలు పొగొట్టుకున్న మరో నలుగురు ప్రభువులు సత్రంలోకి వేంచేశారు.  వాళ్లూ జాతరకే వచ్చారు. అయితే కాన్‌స్టాంటినోపుల్‌కు వెళ్లి ఎప్పుడెప్పుడు ప్రియురాలిని చూద్దామా అని తహతహలాడుతున్న కాండీడ్ ఆ కొత్తముఖాలను పట్టించుకోలేదు.







27వ అధ్యాయం 



సుల్తాన్ అక్మెత్‌ను తిరిగి కాన్‌స్టాంటినోపుల్‌కు తీసుకెళ్తున్న టర్కీ ఓడలో కాండీడ్, మార్టిన్‌లను కూడా తీసుకెళ్లేందుకు కకంబో ఆ ఓడ కెప్టెన్ అనుమతి సంపాదించాడు. కాండీడ్, మార్టిన్‌లు ఆ దిక్కుమాలిన అక్మెత్ ప్రభువుకు వంగివంగి కృతజ్ఞతాభివాదం చేసి రేవు వైపు నడిచారు.

‘‘చూశారా! మనం రాజ్యాలు కోల్పోయిన ఆ ఆరుగురు రాజులతో కలసి భోంచేశాం. అందులో ఒకరికి నేను దానం కూడా చేశాను! ఇంతకంటే దౌర్భాగ్యులైన యువరాజులు కూడా ఉన్నారేవెూ. నా మటుకు నేను వంద గొర్రెలే పోగొట్టుకున్నాను. ఇప్పుడు క్యూనెగొండ్ చెంత వాలడానికి ఆఘమేఘాలపైన పోతున్నాను. అంతా మన మంచికేనన్న మా పాంగ్లాస్ మాట అక్షరసత్యమని పదేపదే రుజువు అవుతోంది. అవును, అంతా మనమంచికే’’ అన్నాడు కాండీడ్.

‘‘అలాగే జరగనీ’’ మార్టిన్ ఊకొట్టాడు.

‘‘వెనిస్‌లో మనం చూసిన విడ్డూరం ఇంకెవరైనా చూశారా అంట? ఆరుగురు రాజులు ఒక పూటకూళ్లింట్లో కలిసి భోంచేయడం కనీవినీ ఎరగని వింత’’ గొప్పగా అన్నాడు కాండీడ్.

‘‘కానీ, మనం పడిన పాట్లతో పోలిస్తే అదేమంత పెద్ద వింత? రాజులు సింహాసనభ్రష్టులు కావడం అతి మామూలు విషయం. అలాంటి వాళ్లతో కలిసి భోంచేయడంలో అంత గొప్పేముంది?’’ కుండబద్దలు కొట్టాడు మార్టిన్.

కాండీడ్ ఓడ ఎక్కగానే కకంబోను పక్కకు పిలిచి, ‘‘క్యూనెగొండ్ ఎలా ఉంది ఉది? ఇప్పటికీ ఇదివరకున్నంత అందంగానే ఉందా? నన్నింకా ప్రేమిస్తూనే ఉందా? రోజులు ఎలా వెళ్లదీస్తోంది? నువ్వు ఆమె కోసం కాన్‌స్టాంటినోపుల్‌లో భవనం కొన్నావా?’’ అని ఆత్రమాత్రంగా అడిగాడు.


‘‘అయ్యా.. ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు ఈ నా పాడునోటితో? దారుణం జరిగిపోయింది. క్యూనెగొండ్ అమ్మగారు ఇప్పుడు మార్మోరా సముద్రతీరంలో ఓ రాజుకొంపలో అంట్లు తోముతున్నారు. ఆయనకు ఉన్నవే కొన్ని బొచ్చెలనుకోండి. ఆమె ఇప్పుడు రగోస్కీ అనే ముసలి రాకుమారుని ఇంట్లో దాసి. ఆయనకు టర్కీ మహా సుల్తాన్ రోజుకు మూడు నాణేల చిల్లర పడేస్తాడు. అంతకంటే విషాదమేమంటే క్యూనెగొండ్ అమ్మగారు అందమంతా హరించకుపోయి, చెప్పలేనంత అందవికారంగా తయారయ్యారు.’’

‘‘పోనీలే. నేను గుణవంతుణ్ని కదా. ఆమె అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా సదా ప్రేమించడం నా విధ్యుక్తధర్మం. తెలియక అడుగుతున్నా..ఒక సంగతి చెప్పవోయ్.. ఆమెను తీసుకురావడానికి యాబై, అరవై లక్షలు పట్టుకెళ్లావు కదా, మరెందుకు ఆమెకా దురవస్థ?’’

‘‘అయ్యో.. దేవుడా! ఆ డబ్బు నేనేం కాజేయలేదండి. మీ ఆన ప్రకారం క్యూనెగొండ్ అమ్మగారిని తీసుకొచ్చేందుకు ఆ బ్యానోస్ ఏరీస్ గవర్నర్ డాన్ ఫెర్నాండో డి ఇబారా వై ఫిగయెరా వై మాస్కరేనస్ వై లాంపోర్డో వై సూజాకు ఇరవై లక్షలు సమర్పించుకున్నాను. మిగిలినదాన్ని ఆ ఓడ దొంగల కెప్టెన్ దోచుకున్నాడు. ఇక ఈ ఓడ కెప్టెనొ దొంవెధవ మనల్ని మటపాన్ అగ్రం, మెలో, నికారియా, సవెూస్, పాట్రాస్, దార్డానెల్స్, మార్మోవా, స్కూతారీల.. ఇన్నిచోట్ల తిప్పి చంపాడాయె! క్యూనెగొండ్, ఆ ముసలమ్మ నేనిదివరకు చెప్పిన యువరాజు ఇంట్లో బానిసలు. నేను పదవి ఊడిన రాజు బానిసను’’ వలపోసుకున్నాడు సేవకుడు.  

‘‘అయ్యయ్యో..!ఒకదాని తర్వాత ఒకటి ఎన్నెన్ని దారుణ కష్టాలు! అయితేనేం, నా దగ్గరింకా కొన్ని వజ్రాలు ఉన్నాయిగా. వాటితో క్యూనెగొండ్‌ను విడిపిస్తాను. అయితే ఆమె అంత వికారంగా మారడం మాత్రం బాధాకరం సుమీ’’ చింతించాడు కాండీండ్.

తర్వాత మార్టిన్ వైపు తిరిగి, ‘అక్మెత్, ఇవాన్ చక్రవర్తులు, చార్లెస్ ఎడ్వర్డ్ రాజుల కష్టాలు ఎక్కువా? నా కష్టలు ఎక్కువా చెప్పండి?’’ అని అడిగాడు.

‘‘నేను చెప్పలేను. చెప్పాలంటే మీ హృదయంలోకి తొంగి చూడాలి’’ అన్నాడు పండితుడు.

‘‘మా పాంగ్లాస్ ఇక్కడ  ఉండుంటే చెప్పి ఉండేవాడు లెండి.’’

‘‘కష్టాలను, బాధలను తూచి విలువ కట్టడానికి మీ పాంగ్లాస్ ఏ కొలమానాలను వాడతాడో నాకు తెలియదు. ఎడ్వర్డ్ రాజు, ఇవాన్ చక్రవర్తి, అక్మెత్ సుల్తాన్ల కంటే వందింతలు బాధలు పడేవాళ్లు ఈ భువిలో కోట్లమంది ఉన్నారని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.’’

‘‘ఔనౌను. ఉంటే ఉండొచ్చులే’’ ఊకొట్టాడు కాండీడ్.

అలా ప్రయాణిస్తూ కొన్ని రోజుల తర్వాత బాస్పరస్ చేరుకున్నారు. కాండీడ్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి కకంబోకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించాడు. ఆలస్యం చెయ్యకుండా.. క్యూనెగొండ్ ఎంత వికారంగా ఉన్నాసరే కలుసుకోవడానికి తన జట్టతో కలసి మార్మోవా తీరానికి టర్కీ ఓడలో బయల్దేరాడు.

ఓడ బానిసల వరుసలో ఇద్దరు తెడ్లను వెయ్యలేక వెయ్యలేక వేస్తున్నారు. ఎలాంటి ఆచ్ఛాదనా లేని వాళ్ల వీపులపై ఓడ కెప్టెన్ మాటిమాటికి కొరడాతో చెళ్లున కొడుతున్నాడు. కరుణాంతరంగుడైన కాండీడ్ యథావిధిగా వాళ్లపై జాలితో దగ్గరికి అడుగేశాడు. వాళ్ల ముఖాలు వికృతంగా తయారైనా ఒకడిలో పాంగ్లాస్ పోలికలు, మరొకడిలో క్యూనెగొండ్ సోదరుడైన జెస్యూట్ పోలికలు స్పష్టంగా గోచరించాయి. కాండీడ్ కలవరంతో, దుఃఖంతో మరింత దగ్గరగా వెళ్లి పరీక్షగా చూశాడు.

‘‘పాంగ్లాస్‌ను ఉరితీయడం నేను కళ్లారా చూసిందీ, చిన్నజమీందారును నా ఈ చేతులతో స్వయంగా చంపిందీ నిజం కాకపోతే ఆ తెడ్లు వేసే ఇద్దరూ ముమ్మాటికీ వాళ్లే’’ అన్నాడు సేవకుడితో.

పాంగ్లాస్, చిన్న జమీందారు పేర్లు వినబడగానే ఆ తెడ్లు వేసేవాళ్లిద్దరూ విస్మయంతో గట్టిగా అరిచేసి,  స్థాణువులైపోయి తెడ్లను చప్పున జారవిడిచారు. ఓడ కెప్టెన్ రివ్వున దూసుకెళ్లి వాళ్లను మరింత కోపంతో ఊగిపోతూ కొరడాతో చావగొట్టసాగాడు.




‘‘అపండి కెప్టెన్, ఆపండి! మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తా..’’ అంటూ అడ్డుపోయాడు కాండీడ్.

‘‘ఆరి దేవుడా! ఇతను కాండీడ్’’, అన్నాడో బానిస.

‘‘ఆరి దేవుడా! ఇతను కాండీడ్’’, రెండోవాడూ నోరెళ్లబెట్టాడు.  

‘‘నేను మెలకువలోనే ఉన్నానా, కలగంటున్నానా? అసలు ఓడలోనే ఉన్నానా, గాల్లో తేలుతున్నానా? నేను చంపిన జమీందారుగారి అబ్బాయి ఇతడేనా? ఉరితీస్తుండగా నేను కళ్లారా చూసిన ప్లాంగాస్ ఇతడేనా?’’, అంతకంతకూ నివ్వెరపోతున్నాడు కాండీడ్.

‘‘ఔను! ఔను!’’ ఆ ఇద్దరూ ఒకేసారి బదులిచ్చారు. 

‘‘ఏమిటేమిటీ? మీరు పొద్దస్తమానమూ చెప్పే ఆ గొప్ప తత్వవేత్త ఇతనేనా?’’ మార్టిన్ ఆశ్చర్యం పట్టలేక అడిగా కాండీడ్‌ను.

‘‘‘గొప్ప జమీందార్లలో ఒకరైన థండర్ టెన్ ట్రాంక్ ప్రభువులను, జర్మనీలోకెల్లా గొప్ప తత్వవేత్తయిన పాంగ్లాస్ పండితులను విడుదల చెయఁడానికి మీకెంత కావాలి, ఓడ కెప్టెన్?’’ అడిగాడు కాండీడ్.

‘‘ఓరి క్రైస్తవ కుక్కా.. వీళ్లను విడిపించుకుంటావా? ఈ బానిస క్రైస్తవ కుక్కలు మీ దేశంలో జమీందారులు, తత్వవేత్తలు,ఇంకా అలాంటి గొప్పవాళ్లంటున్నావు కాబట్టి వీళ్లను వదలాలంటే నాకు యాబైవేల సెక్వింగులు ఇవ్వాలి’’, ధర చెప్పాడు కెప్టెన్.

‘‘అంతే తీసుకోండి బాబూ! నన్ను తక్షణం కాన్‌స్టాంటినోపుల్‌కు తిరిగి తీసుకెళ్లండి. అక్కడ నా సొమ్ము అమ్మి మీరడిగినంత డబ్బిచేస్తా.. ఆ కాదు కాదు! మర్చిపోయా,  ముందు నన్ను క్యూనెగొండ్ దొరసానికి దగ్గరికి తీసుకెళ్లండి’’, కాండీడ్ తడబడ్డాడు. కానీ మొదటి మాటలే విన్న కెప్టెన్ ఓడను అప్పటికే కాన్‌స్టాంటినోపుల్‌వైపు తిప్పేశాడు. తెడ్లు వేగంగా వెయ్యండ్రా అంటూ బానిసలను కొరడాతో చావగొట్టాడు. 

కాండీడ్ తేరుకుని చిన్న జమీందారును, పాంగ్లాస్‌ను ఆత్మీయంగా వందసార్లు కౌగిలించుకున్నాడు. 

‘‘మిమ్మల్ని చంపాను కదా, మరి మీరు చావలేదా జమీందారు బాబూ? మమ్మల్ని ఉరితీసినా మీరు మళ్లీ ఎలా బతికారు గురువుగారూ? టర్కీలో ఎలా ఓడ బానిసలయ్యారు?’’ కాండీడ్ ప్రశ్నల వర్షం కురిపించాడు.

‘‘నా చెల్లెలు ఈ దేశంలోనే ఉందా? నిజమేనా?’’ అడిగాడు చిన్న జమీందారు.

అవునన్నాడు కకంబో.

‘‘అయితే, ఇన్నాళ్లకు మళ్లీ మా కాండీడ్‌ను చూశానన్నమాట’’ ఉద్వేగంతో అన్నాడు పాంగ్లాస్.

కాండీడ్ వాళ్లిద్దరికి మార్టిన్, కకంబోలను పరిచయం చేశాడు. అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, మాటల్లో పడిపోయారు. ఓడ వేగంగా రేవుకు తిరిగొచ్చింది. కాండీడ్ ఆ ఊరిలో లక్ష సిక్వింగుల ఖరీదు చేసే వజ్రాన్ని ఓ యూదు వ్యాపారికి యాబై వేల సిక్వింగులకే అమ్మేశాడు. ఆ వజ్రానికి అత్యంత న్యాయమైన ధర చెల్లిస్తున్నానని, ఆ మాట అబ్రహాం పితపై ఒట్టేసి చెబుతున్నానని అన్నాడు ఆ యూదు. ఓడ కెప్టెన్ కు డబ్బులు చెల్లించి చిన్నజమీందారు, పాంగ్లాస్‌ను విడిపించాడు కాండీడ్. పాంగ్లాస్ చలించిపోయి తన విముక్తిప్రదాత కాళ్లను కన్నీటితో అభిషేకించాడు. చిన్న జమీందారు మాత్రం పొగరుతో తల పంకించి కృతజ్ఞతతో సరిపెట్టి, తనకు వీలుకలిగిన వెంటనే ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.

‘‘అయితే మా సోదరి టర్కీలో ఉండడం సంభవమేనా?’’మళ్లీ అనుమానంతో అడిగాడు. 

‘‘అంతకు మించిన సంభవం లేదు మహాప్రభో! ఆమె ట్రాన్సిల్వేనియా యువరాజు ఇంట్లో బొచ్చెలు కడుగుతున్నారిప్పుడు’’ చెప్పాడు కకంబో.

కాండీడ్ మరో ఇద్దరు యూదు వ్యాపారులకు కొన్ని వజ్రాలు అమ్మేశాడు. అందరూ మరో ఓడలో క్యూనెగొండ్‌ను విడిపించుకోవడానికి బయల్దేరారు.









28వ అధ్యాయం 



‘‘తమర్ని నేను కత్తితో పొడిచినందుకు మరోసారి నన్ను క్షమించాలి జెస్యూట్!’’ ప్రాధేయపడ్డాడు కాండీడ్ జమీందారు బాబును.

‘‘సరిసిరి, మనమిక ఆ సంగతి మళ్లీ ఎత్తొద్దు. నేనే కాస్త తొందరపడ్డాన్లే. నేను ఓడ బానిసననెలా అయ్యానని అడిగావు కనక చెబుతా విను. నువ్వు నన్ను పొడిచేసి వెళ్లాక, ఆ గాయాన్ని మఠం వైద్యుడు నయం చేశాడు. ఇంతలో స్పెయిన్ పటాలం నాపై దండెత్తి నన్ను బంధించి బ్యూనోస్ ఏరీస్ జైల్లో పడేసింది. సరిగ్గా అప్పుడే నా చెల్లెలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. నన్ను తిరిగి రోమ్‌కు పంపాలని మా ఫాదర్ల పెద్దను కోరాను. నన్ను కాన్‌స్టాంటినోపుల్లోని ఫ్రెంచి రాయబారికి వ్యక్తిగత పురోహితుడిగా పంపారు. అక్కడ చేరిన వారం తర్వాత సుల్తాన్ సేవకుల్లోని ఓ అందమైన యువకుడు తారసిల్లాడు. అప్పుడు ఎండ చుర్రున మండిపోతోంది. అతడు స్నానం చెయ్యాలనుకున్నాడు. అవకాశం దొరికింది కదా అని నేనూ స్నానమాడాను. ఒక క్రైస్తవుడు ఒక ముస్లింతో కలిసి నగ్నంగా కనిపించడం పెద్ద నేరమట. నాకు ఆ సంగతి తెలియదు. ఓ న్యాయామూర్తి దీనికి శిక్ష కింద నా అరికాళ్లపై వంద కొరడా దెబ్బలు కొట్టించి, ఈ ఓడ బానిసల ముఠా తోయమని ఆదేశించాడు. ఇంతకంటే అన్యాయం మరొకటుంటుందనుకోను. సరేగాని, నా సోదరి ఆ ట్రాన్సిల్వేనియా యువరాజు వంటింట్లో ఎందుకు చాకిరీ చేస్తోందో చెప్పండి?’’ తను పడ్డ పాట్లు వివరించి అడిగాడు చిన్న జమీందారు.  

‘‘పాంగ్లాస్ గారూ! ఈ జన్మలో మిమ్మల్ని మళ్లీ చూడగలనని అసలు అనుకోలేదు..’’ అన్నాడు కాండీడ్.




‘‘నిజమే. నువ్వు నన్ను ఉరితీయడం చూశావు. కానీ నిజానికి పద్ధతి ప్రకారం నన్ను సెగమంటలోనే కాల్చాల్సింది. అప్పుడు జోరున వర్షం కురవడం నీకు గుర్తుందదిగా. ఆ భీకర తుపాన్లో మంట రగిలించడం అసాధ్యమని తోచి ఉరితీశారు, అంతకుమించిన మార్గం మరొకటి లేదు కనక. ఓ శస్త్రచికిత్స వైద్యుడు నా అవయవాలను కోసి పరీక్షించుకోవడానికి నా శరీరాన్ని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాడు. మొదట గొంతు నుంచి బొడ్డు వరకు దారుణమైన గంటు పెట్టాడు. లోకంలో నాకంటే మరెవర్నీ అంత ఘోరంగా ఉరితీసి  ఉండరేమో. నన్ను ఉరితీసిన పవిత్ర మతవిచారణ విభాగాధికారి మనుషులను అద్భుతంగా సజీవదహనం చేయడంతో దిట్టే కానీ ఉరితీసి మాత్రం ఎరగడట. ఉరితాడు వర్షానికి తడిసి ఉండడంతో సరిగ్గా జారక ముడిపడింది. కాబట్టి నన్ను ఉరికంబం నుంచి దించేసరికి ఇంకా ఊపిరితీస్తూనే ఉన్నాను. నేను ఆ వైద్యుడు పెట్టిన గంటు బాధ భరించలేక కెవ్వుమని అరిచేసరికి అతగాడు జడుసుకున్నాడు. తాను కోస్తున్నది దెయ్యాన్ని అనుకుని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకు పరిగెత్తుతూ మెట్లపైన జారిపడ్డాడు. పక్కగదిలోని అతని భార్య ఆ అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చింది. బల్లపైన గంటుతో వెల్లకిలా పడున్న నన్ను చూసి అతని కంటే జడుసుకుని పరిగెత్తిపోతూ అతనిపైన దబ్బున పడిపోయింది. కొంతసేపటికి ఇద్దరూ ఎలాగోలా తేరుకున్నారు. తర్వాత ఆమె అతగాడితో, ‘‘ఇలాంటి అపధర్మం ముండాకొడుకును కోసుకుని పరీక్ష చేయాలన్న బుద్ధి మీకెలా పుట్టింది? వీళ్ల ఒళ్లల్లో దెయ్యాలుంటాయని మీకు తెలియదా! ఆ దెయ్యాన్ని వదలగొట్టడానికి వెంటనే మంత్రగాణ్ని పిలుచుకొస్తానుండండి’’ అని అంది.  నేను గజగజ వణికిపోయాను. ఎలాగోలా కొన ప్రాణాన్ని కూడదీసుకుని, నన్ను కనికరించాలని గట్టిగా రోదిస్తూ మొరపెట్టుకున్నాను. తర్వాత ఆ బుడతకీచు క్షురక వెధవ కాస్త ధైర్యం కూడదీసుకుని గంటును కుట్టేశాడు. వాడి పెళ్లాం కూడా నాకు కాస్త బాగయ్యేవరకు గంజీగట్కా పోస్తూ సేవలు చేసిందిలెండి. పక్షం రోజులకల్లా కోలుకున్నాను. ఆ క్షరక వెధవ వెనిస్ వెళ్తున్న ఓ మాల్టా క్రైస్తవ యోధుడి దగ్గర నాకు నౌకరీ ఇప్పించాడు. నాకు జీతంగీతం ఇచ్చేందుకు ఆ యోధుడి దగ్గర సొమ్మేం లేదని రూఢి అయ్యాక ఆయనకొక నమస్కారం పడేసి, ఓ వెనిస్ వ్యాపారి వద్ద చేరి ఆయనతోపాటు కాన్‌స్టాంటినోపుల్ చేరుకున్నాను..

ఒకరోజు  పరాగ్గా తిరుగుతూ మసీదులోకి వెళ్లాను. అక్కడ ఓ ముసలి మతబోధకుడూ, ప్రార్థన చేస్తున్న ఓ అందమైన యువతీ తప్పమరెవరూ లేరు. ఆమె రొమ్ములు బాగా కనిపించే దుస్తులు వేసుకుంది. రొమ్ముల మధ్య గులాబీలు, తూలిప్‌లు వంటి సుగంధ సౌందర్యపుష్పాల గుత్తి ఉంది. ఆమె దాన్ని జారవిడుచుకుంది. నేను టక్కున దాన్ని అందుకుని యథాస్థానంలో ఉంచాను, ఎంతో ఆరాధనగా. అయితే ఆ సర్దేపనికి నేను చాలా సమయం తీసుకోవడంతో మతబోధకుడు కోపంతో రేగిపోయాడు. నేను క్రైస్తవుణ్నని గ్రహించి సాయం కోసం కేకేలేశాడు. తర్వాత నన్ను పట్టుకెళ్లి న్యాయయూర్తి ముందు దోషిగా నిలబెట్టారు. అతడు శిక్షగా నా అరికాళ్లపై వంద కొరడా దెబ్బలు కొట్టించి, ఓడ బానిసల ముఠాలో చేర్చాని ఆదేశించాడు. మన జమీందారుబాబు తెడ్డేస్తున్న ముఠాలోనే నన్నూ చేర్చారు.  మా ముఠాలో నలుగురు మార్సీల్ కుర్రాళ్లు, ఐదుగురు నేపుల్స్ మతాచార్యులు, ఇద్దరు కర్ఫు సన్యాసులు కూడా ఉన్నారు. ఇలాంటి ఘనకార్యాలు రోజూ జరుగుతూనే ఉంటాయని వాళ్లు చెప్పారు. చిన్న జమీందారు నాకంటే తనేకే ఎక్కువ అన్యాయం జరిగిందని తెగ బాధపడిపోయేవాళ్లు. అయితే, సుల్తాన్ సేవకుడితో కలిసి బిత్తలగా కనిపించడం కంటే ఆడదాని రొమ్ముల్లోంచి జారిపడిన పూలగుత్తిని మళ్లీ అక్కడ సర్దడం పెద్ద ప్రమాదకరమేమీ కాదని, అయినా కఠిన శిక్ష ఎదుర్కొన్నానని నేనూ వాదించేవాణ్ని. ఇలా నిరంతరాయంగా వాదించుకుంటూ రోజుకు ఇరవై కొరడా దెబ్బలు తినేవాళ్లం. విశ్వజనీన ఘటనల సమాహారం మా విముక్తి కోసం
మిమ్మల్ని మా ఓడలోకి తీసుకొచ్చేదాకా ఇలాగే వాదించుకుంటూ దెబ్బలు తినేవాళ్లం’’ ముగించాడు పాంగ్లాస్.

‘‘మరైతే గురువు గారూ! ఈ సంగతి చెప్పండి. మిమ్మల్ని ఉరితీశారు. గంటు పెట్టారు. నిర్దాక్షిణ్యంగా చావబాదారు. ఇప్పుడిలా తెడ్లు వేస్తున్నారు. ఇన్ని జరిగాయి కదా, ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో ప్రతీదీ మన మంచికోసమేనని మీరింకా బలంగా నమ్ముతున్నారా?’’ అడిగాడు కాండీడ్.

‘‘నేను ఇప్పటికీ తత్వవేత్తనే కనక నా అభిప్రాయాలకు కట్టుబడే ఉన్నాను. వాటిని వెనక్కి తీసుకోవడం సమంజసం కాదు. ముఖ్యంగా ఎక్కడా దారితప్పని లైబ్నిజ్ లా(జర్మన్ తత్వవేత్త. అంతా మనమంచికేనని వాదించాడు), విషయాల పొందిక, భౌతిక సూక్ష్మభేదాలతోపాటు పూర్వస్థిరీకృత క్రమబద్ధత అనేది ఈ ప్రపంచంలో అత్యంత సుందరతరమైనది’’ చెప్పుకుపోయాడు పాంగ్లాస్.




29వ అధ్యాయం 


కాండీడ్, చిన్న జమీందారు, పాంగ్లాస్, మార్టిన్, కకంబోలు తమ ఘనకార్యాలను ఒకరికొకరు చెప్పుకున్నారు, ప్రపంచంలో జరగడానికి అవకాశమున్న, అవకాశం లేని ఘటనలు, కార్యకారణాలు, నైతిక, ఐహిక పాపాలు స్వేచ్ఛ, దారిద్ర్యం వంటివాటితోపాటు టర్కీ ఓడ బానిసలకు అప్పుడప్పుడూ దొరికే ఉపశమనాలపైనా చర్చించుకున్నారు. అలా మాట్లడుకుంటూనే ప్రాపంటీస్ తీరంలోని ట్రాన్సిల్వేనియా ముసలిరాకుమారుని పెచ్చులూడిన భవనానికి చేరుకున్నారు. ఇంటిముందర తువ్వాళ్లు ఆరేస్తున్న క్యూనెగొండ్, ముసలమ్మలు తొట్టతొలుత కంటబడ్డారు.

క్యూనెగొండ్ ను చూశాక చిన్న జమీందారు ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నచెలికాడు కూడా భయంతో నాలుగడుగులు వెనక్కి వేశాడు. ఆమె కళ్లు చింతనిప్పుల్లా మండుతున్నాయి. బుగ్గలు పీక్కుపోయాయి. గొంతుపై మడతలు తేలాయి. చేతులు ఎర్రబారి పొలుసులు కట్టాయి. కాండీడ్ వెంటనే తేరుకుని ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె కాండీడ్‌ను, అన్నను కౌగిలించుకుంది. తర్వాత వాళ్లిద్దరూ ముసలమ్మను కౌగిలించుకున్నారు. కాండీడ్ డబ్బు చెల్లించి క్యూనెగొండ్ నూ, ముసలమ్మనూ విడిపించాడు.

అందరం కాస్త కూడదీసుకునేవరకు దగ్గర్లో మడిచెక్క కొనుక్కుని అక్కడ ఉందామని ముసలమ్మ కాండీడ్‌కు సలహా ఇచ్చింది. క్యూనెగొండ్ కు తను అంత వికారంగా ఉన్న సంగతి తెలియదు. ఆ విషయం ఆమెకెవరూ చెప్పలేదాయె. కాండీడ్ తనకిచ్చిన వాగ్దానాలను ఆమె మాటిమాటికీ గట్టిగా గుర్తు చేయడంతో ఆ సద్గుణ సంపన్నుడు నిరాకరించలేకపోయాడు. ఆమెను పెళ్లాడబోతున్నానని జమీందారుబాబుకు చెప్పేశాడు.  

‘‘ఆమె ఆస్తీ అంతస్తూ లేని నిన్ను పెళ్లాడి తన పరువును మంటకలుపుకోవడానికి నేనసలు ఒప్పుకోను. నీ మిడిసిపాటునూ సహించను. అలాంటి హీనమైనపని ఎన్నటికీ జరగానికి వీల్లేదు కాక వీల్లేదు. నువ్వు పెళ్లాడితే నా చెల్లెలి సంతానానికి జర్మనీ కులీన కుంటుంబాల్లో చోటుదక్కదు. ఆమె పవిత్ర రోమన్ సామ్రాజ్యంలోని ఒక గౌరవనీయ జమీందారు పెళ్లాడుతుంది’’ హుంకరించాడు చిన్నజమీందారు.

క్యూనెగొండ్ సోదరుడిని కాళ్లవేళ్లాపడి బతిమాలింది. కన్నీటితో అభిషేకించింది. కానీ అతడు కరగలేదు.

కాండీడ్ రేగిపోయాడు. ‘‘ఓరి అడ్డగాడిదా! నిన్ను డబ్బు కట్టి ఓడ బానిసల ముఠా నుంచి విడిపించింది నేను. నీ చెల్లిని విడిపించిందీ నేనే. ఆమె అంట్లుతోముతూ, వికారంగా, ముసలి మంత్రగత్తెలా తయారైనా..ప్రేమించిన పాపానికి పెళ్లాడ్డానికి ముందుకొస్తొంటే కాదూ, గీదూ అంటూ వెూకాలడ్డుతావా! ఒరే, నాక్కగనక కోపమొస్తే నిన్ను మళ్లీ చంపిపారేస్తా’’ అని ఉగ్రంగా ఉన్నాడు.

‘‘చంపితే చంపగలవేవెూ కానీ నా కంఠంలో ప్రాణముండగా మాత్రం నా చెల్లెల్ని పెళ్లాడ్డం నీ తరం కాదు’’ చిన్న జమీందారు కూడా అంతే ఆవేశంగా అన్నాడు. 






30వ అధ్యాయం 



క్యూనెగొండ్‌ను పెళ్లాడాలని కాండీడ్‌కు అణుమాత్రం ఆశ కూడా లేదు. అయితే చిన్న జమీందారు శ్రుతిమించిన అమర్యాద, అహంకారం అతనిలో పట్టుదల పెంచాయి. ఆమెను పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. పైగా ఆమె కూడా అతణ్ని ఆనాటి బాసలూ, ఊసులూ ఏమయ్యాయని ఒత్తిడి చేస్తోందాయె. కాండీడ్ పాంగ్లాస్, మార్టిన్, కకంబోలతో మాట్లాడాడు. చిన్న జమీందారుకు క్యూనెగొండ్ పై ఎలాంటి హక్కులూ లేవని, సామాజ్య శాసనస్మృతి ప్రకారం ఆమె కాండీడ్‌కు తన వామహస్తాన్ని అందించి నిరభ్యంతరంగా పెళ్లాడొచ్చంటూ బహుచక్కని నివేదికను తయారు చేశాడు పాంగ్లాస్. చిన్న జమీందారును నడి సముద్రంలో తోసిపారేస్తే మంచిదని సలహా ఇచ్చాడు మార్టిన్. కకంబో మాత్రం అతణ్ని మళ్లీ ఆ టర్కీ ఓడ కెప్టెన్ కు అప్పగిస్తే మళ్లీ బానిసల ముఠాలో చేర్చి, వెంటనే రోమ్ ఫాదర్ల పెద్ద చెంతకు తీసుకెళ్తారని సలహా ఇచ్చాడు. కకంబో సలహా నచ్చింది. ముసలమ్మ కూడా మద్దతిచ్చింది. పథకం గురించి క్యూనెగొండ్‌కు ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కాసింత డబ్బుతోనే పథకాన్ని సునాయాసంగా అమలు చేశారు. ఓ జెస్యూట్ ను బురిడీ కొట్టించామని, ఓ జమీందారు పీచాన్ని అణచేశామని సంబరపడ్డారు.  




అన్ని దుర్భర కష్టాల తర్వాత ఎట్టకేలకు తన నెచ్చెలిని పెళ్లాడాడు కాండీడ్. అతని దగ్గర ఎల్డొరాడో నుంచి తెచ్చుకున్నవజ్రాలు ఉన్నాయి కనక భార్య, పాంగ్లాస్, మార్టిన్, కకంబో, ముసలమ్మలతో కలిసి మేరలేని సంతోషంతో జీవిస్తాడని అనుకోవడం సహజమే. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. అతణ్ని యూదు వ్యాపారులు దారుణంగా వెూసగించారు. కాస్త పొలం తప్ప ఏమీ మిగల్లేదు. క్యూనెగొండ్ రోజురోజుకూ మరింత అసహ్యంగా తయారవుతూ చీటికిమాటికి కీచులాడేది. ముసలమ్మ మెత్తబడింది. అయితే కోపం, కీచులాటల్లో క్యూనెగొండ్‌కంటే రాక్షసిలా తయారైంది. కకంబో తోటలో కూరగాయలు పండించి కాన్‌స్టాంటినోపుల్‌కు తీసుకెళ్లి అమ్ముకొచ్చేవాడు. గొడ్డుకష్టంతో అతడూ విసుగెత్తిపోయి తలరాతను తిట్టుకునేవాడు. ఏదో ఒక జర్మన్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రవేత్తగా రాణించలేకపోయానే అని పాంగ్లాస్ వగచేవాడు. మనిషి అనేవాడికి ఎక్కడైనా కష్టాలు తప్పవని నమ్మే మార్టిన్ మాత్రం ఓర్పుతో పనిచేసుకుపోయేవాడు. కాండీడ్, మార్టిన్, పాంగ్లాస్‌లు నైతిక, ప్రాపంచిక విషయాలపై అప్పుడప్పుడూ చర్చించుకునేవాళ్లు. ఇంటి కిటికీలోంచి చూస్తే టర్కీ రాజకీయ నేతలు, సైనిక గవర్నర్లు, న్యాయమూర్తులతో కిక్కిరిసిన పడవలు వాళ్లను ప్రవాసానికి లెమ్‌నాస్, మితిలేన్, ఇర్జేరమ్‌లకు తీసుకెళ్తూ కనిపించేవి. వాళ్ల స్థానాలను భర్తీ చెయ్యడానికి కొత్తవాళ్లను తీసుకొచ్చే పడవలూ కనిపించేవి. తర్వాత కొన్నాళ్లకు వాళ్లూ ప్రవాసానికి తరలిపోతూ కనిపించేవాళ్లు. బరిసెలకు అందంగా గుచ్చిన మనుషుల తలకాయలను రాజాస్థానంలో బహూకరించడానికి తీసుకెళ్లడమూ కనిపించేది. ఇలాంటి దృశ్యాలు కనపడినప్పుడల్లా వాళ్ల చర్చలు పెచ్చరిల్లిపోయేవి. వాదులాటలు లేనప్పుడు విసుగెత్తి కాలం క్షణమొక యుగంగా తోచేది.

అలాంటి ఒకరోజున ములసమ్మ విపరీతంగా విసుగెత్తిపోయి, ‘‘నీగ్రో ఓడదొంగల చేతుల్లో వందసార్లు బలాత్కారానికి గురికావడం, ఒక పిర్ర కోయబడ్డం, బల్గర్ల పటాలంలో కొరడాలతో చావుదెబ్బలు తినడం, బలి జాతరలో కొరడా దెబ్బలు, ఉరితీత, పొట్టకు గంటు, తెడ్లేయడం.. ఇంతెందుకు, ఒకమాటలో చెప్పాలంటే మనం పడిన ఈ అష్టకష్టాలు దారుణమా? లేకపోతే ఇక్కడిలా ఏ పనీపాటా లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం దారుణమా? చెప్పి చావండెహె!’’ అని కసిరింది.

‘‘అబ్బో.. ఇది చాలా చిక్కు ప్రశ్నే’’ అన్నాడు కాండీడ్.

ములసమ్మ విచికిత్సతో వాళ్లలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. మానవుడు నిత్యం బాధలు పడ్డానికో, లేదా విసుగుతో నీరసంగా బతకడానికో పుట్టాడని మార్టిన్ నిర్ధారించాడు. కాండీడ్ ఒప్పుకోలేదు. కానీ సొంతంగానూ ఏమీ చెప్పలేకపోయాడు. పాంగ్లాస్ మాత్రం తను పడ్డ కష్టాలన్నీ దారుణమైనవేనని, జరిగేదంతా మన మంచికేనని ప్రస్తుతానికి ఒప్పుకోకపోతున్నా, ఒకప్పుడు ఒప్పుకున్నాను కనక ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నానని అనేవాడు.



ఒకరోజు మార్టిన్ నిరాశానిరసనల వాదాన్ని రుజువుచేసే సంఘటన జరిగింది. వెంటనే అతడు పాంగ్లాస్‌ను పట్టలేనంత సంతోషంతో కావలించుకున్నాడు. కాండీడ్ మరింత డోలాయమానంలో పడ్డాడు. అసలేం జరిగిందంటే.. పకట్, ఆమె సన్యాసి ప్రియుడు జిరోఫ్లీ కడు హీనస్థితిలో కాండీడ్ ఇంటికొచ్చారు. వెనిస్ లో కాండీడ్ ఇచ్చిన మూడువేల పియస్టర్లను వాళ్లు ఆనాడే మంచినీళ్లలా ఖర్చుపెట్టేశారు. తర్వాత విడిపోయారు,  కలుసుకున్నారు, కాట్లాడుకున్నారు. కారాగారంలోనూ పడ్డారు. తప్పించుకున్నారు. జిరోఫ్లీ ఎట్టకేలకు అనుకోరుకున్నట్టే తురుష్కుడయ్యాడు. పకెట్ ఎక్కడికెళ్లినా పడుపువృత్తి కొనసాగిస్తూనే ఉంది కానీ ఆమె చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.

‘‘మీరు వీళ్లకు బహూకరించిన డబ్బు త్వరగా అయిపోతుందని, వీళ్లను మరింత హీనస్థితిలో పడేస్తుందనీ ఆనాడే ఊహించాను. మీరు లక్షల డబ్బు దుబారా చేశారు. మీరూ, కకంబో వీళ్లకంటే ఏమంత సంతోషంగా లేరు’’, కాండీడ్ తో అన్నాడు మార్టిన్.

పాంగ్లాస్ పకెట్ ను పట్టుకుని ఆక్రోశమూ, కరుణా వెళ్లగక్కాడు, ‘‘అయ్యో, బిడ్డా! దేవుడు ఎట్టకేలకు నిన్ను మా దగ్గరికి పంపాడు. నీ మూలంగా ఒక కన్నూ, ఒక చెవీ, ముక్కుకొనా పోగొట్టుకున్నాను తెలుసా మహాతల్లీ? నీ పరిస్థితీ దారణంగా ఉందే... అబ్బా! ఏం ప్రపంచమిది?’’

పకెట్ రాకతో మళ్లీ పాత చర్చలు మొదలయ్యాయి. వాదోపవాదాలు అదివరకంటే తీవ్రమయ్యాయి.  

వాళ్లింటికి దగ్గర్లోనే ఓ పకీరు ఉండేవాడు. టర్కీలో అతణ్ణి మించిన తత్వవేత్త లేడని ప్రతీతి. అందుకే కాండీడ్ జట్టంతా కట్టగట్టుకుని అనుమానాలు తీర్చుకోవడానికి  పాంగ్లాస్‌ను తమ ప్రతినిధిగా వెంటబెట్టుకుని వెళ్లింది.

‘‘అయ్యా! మేమందరం మిమ్మల్ని ఓ సంగతి అడుగుదామని వచ్చాం. మనిషి వంటి వింత మృగం ఎందుకు సృష్టించబడిందో చెబుతారా?’’ అడిగాడు పాంగ్లాస్.

’’ఆ సంగతి మీకెందుకోయ్? మీకు వేరే పనీపాటా లేదా?’’ అన్నాడు పకీరు.

‘‘అయ్యా! ప్రపంచంలో ఎటుచూసినా చెడే కనిపిస్తోంది.’’

‘‘అయితే ఏంటట? ప్రభువులు ఈజిప్టుకు ఓడను పంపేటప్పుడు అందులో ఎలకలకు సుఖంగా ఉంటుందా అదా అని బుర్రపాడు చేసుకుంటాడా?’ ఎదురు ప్రశ్నించాడు పకీరు.  

‘‘అయితే మరి, మనమేం చెయ్యాలి?’’మళ్లీ అడిగాడు పాంగ్లాస్.


‘‘నోరు మూసుకోవాలి..’’

‘‘కార్యకారణాలు, పుణ్యలోకాలు, చెడుకు మూలాలు, ఆత్మస్వరూపం, పూర్వవ్యవస్థీకృత క్రమబద్ధతలపై మీతో కాస్త చర్చిద్దామని ఎంతో ఆశపడి వచ్చానే..’’

ఈ మాటలు వినీవినగానే పకీరు దబ్బున తలుపు మూసేసుకున్నాడు.  

ఈ సంభాషణ సాగుతుండగా.. కాన్‌స్టాంటినోపుల్‌లో ఇద్దరు మంత్రులను, ఒక న్యాయమూర్తిని పీక పిసికి చంపారని, వాళ్ల నేస్తాలను పొడిచి కడతేర్చారని ఒక వార్త పాకిపోయింది. జనం గంటలకొద్దీ దీనిపై గోలగోలగా మాట్లాడుకున్నారు. కాండీడ్ జట్టు ఇంటికి తిరిగొస్తుండగా దారిలో ఆహ్లాదకర దృశ్యం కనిపించింది. దారిపక్కన ఉన్న పొలంలో నారింజ చెట్ల నీడన ఇంటి గుమ్మం ముందు కూర్చుని స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆనందంగా ఉన్న వృద్ధుడు కనిపించాడు. సిద్ధాంతచర్చల మాదిరే పోసుకోలు కబుర్లన్నా పడిచచ్చే పాంగ్లాస్ అతని దగ్గరికెళ్లి కాన్‌స్టాంటినోపుల్‌లో హతమైన న్యాయమూర్తి పేరేంటని కుతూహలంతో అడిగాడు.

‘‘నాకేం తెలియదు బాబూ! ఒక్క న్యాయమూర్తి పేరుగానీ, ఒక్క మంత్రిపేరుగానీ చెప్పలేను. మీరు చెబుతున్న ఈ సంగతి కూడా అస్సలు తెలియనే తెలియదు. రాజకీయాల్లో తలదూర్చే వాళ్లు చివరకు ఇలాగే హీనంగా అంతమైపోతారనుకుంటా. వాళ్లకా శాస్తి జరగాల్సిందేలే. నామటుకు నేను కాన్‌స్టాంటినోపుల్‌లో ఏం జరుగుతోందో అసలు పట్టించుకోను. నా తోటలో పండించిన వాటిని మాత్రం అక్కడికి అమ్మకానికి పంపుతుంటా. నాకంతే చాలు’’ అన్నాడు ముసలాయన.


తర్వాత ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాడు. అతని ఇద్దరు కొడుకులు, కూతుళ్లు నిమ్మ, నారింజ, అనాస, పిస్తా వంటి పళ్లతో సొంతంగా తయారు చేసిన రకరకాల మధుర పానీయాలను అందించారు. బటేవియా, వెస్టిండీస్‌ల నుంచి వచ్చే కల్తీ కాఫీ కాకుండా స్వచ్ఛమైన వెూచా కాఫీ ఇచ్చారు. తర్వాత పెద్దాయన కూతుళ్లు అతిథుల గడ్డాలకు సుతారంగా అత్తరు పూశారు.

‘‘మీకు పెద్ద భూసంపత్తి ఉందనుకుంటా’’ కాండీడ్ అడిగాడు పెద్దాయనను.

‘‘ఇరవై ఎకరాలే నాయనా. దాన్ని సాగు చెయ్యడానికి నా పిల్లలు సాయం పడతారు. ఈ పని వల్ల విసుగు, దురలవాట్లు, దరిద్రం అనే మూడు అరిష్టాలు మా దరిజేరవు.’’

కాండీడ్ ఇంటికొచ్చాక ఆ ముసలాయన మాటలను పదేపదే తలచుకున్నాడు. పాంగ్లాస్, మార్టిన్‌లతో  ముచ్చటించాడు. ‘‘వెనిస్ లో మనతోపాటు భోంచేసిన ఆ ఆరుగురు రాజులకంటే ఈ ముసలాయనే ఎంతో మెరుగ్గా ఉన్నాడుకదా’’ అని అన్నాడు.

‘‘పెద్దపెద్ద సిరిసంపదలతో ఎప్పుడూ ప్రమాదమే. ఈ సంగతి తత్వవేత్తలందరికీ తెలుసు. మాబ్ రాజు ఎల్గాన్‌ను ఎహూద్ ఖూనీ చేశాడు. అబ్సాలమ్‌ను అతని వారసుడు ఉరితీసి, మూడు ఈటెలతో పొడిచి పొడిచి చంపాడు. జెరోబాం కొడుకైన నదాబ్ రాజును బాషా హతమార్చాడు. ఎలా రాజును జిమ్రీ, జోరామ్‌ను జెహ్రూ, అతాలియాను జెహాయిదాలు చంపారు. జహోయాకిమ్, జెహోయాచిన్, జెదేకియా రాజులు బానిసలయ్యారు. క్రోసస్, అస్తాజెస్, డేరియస్, సిరాకస్ వాడైన డైనసస్, పైరస్, పెర్సియస్, హానిబల్, జగుర్తా, అరోవిస్టస్, సీజర్, పాంపే, నీరో, ఓతో, విటిలస్, ఇంగ్లండ్ రాజులు రెండో రిచర్డ్, మూడో ఎడ్వర్డ్, ఆరో హెన్రీ, మూడో రిచర్డ్, స్కాట్ల రాణి మేరీ, ఒకటో చార్లెస్, ఫ్రాన్స్ రాజులు ముగ్గురు హెన్రీలు, నాలుగో హెన్రీ చక్రవర్తీ.... వీళ్లందరికీ ఏ గతి పట్టిందో తెలుసు కదా?’’ అడిగాడు పాంగ్లాస్.

‘‘మనం తోటెకెళ్లి పని చెయ్యాలని నాకూ తెలుసు’’, అన్నాడు కాండీడ్.

‘‘నువ్వన్నది అక్షరాలా నిజమేన్రా అబ్బాయ్.. మానవుణ్ని ఈడెన్ తోటలో ఉంచింది దాన్ని సేద్యం చేసుకుని, కనిపెట్టుకుని ఉంటాడనే. మనిషి పుట్టింది సోమరిగా బతకడడానికి కాదని చెప్పేందుకే..’’

‘‘వాదులాడకుండా పని చేసుకుందాం. బతుకు బండిని లాగడానికి అదొక్కటే మార్గం...’’

అందరూ ఈ చక్కని జీవన సూత్రాన్ని ఆవెూదించి, ఎవరి శక్తీకొద్దీ వాళ్లు పనిచేయసాగారు. పొలం చిన్నదే అయినా ఫలసాయం దండిగా వచ్చేది. క్యూనెనెగొండ్ వికారంగా ఉన్నా పిండివంటలు మాత్రం పసందుగా చేసేది. పకట్ కుట్టుపనుల్లో ఆరితేరింది. ముసలమ్మ బట్టల సంగతి చూసుకునేది. పని చేయనని ఎవరూ అనేవాళ్లు కాదు. జిరోఫ్లీ వడ్రంగంలో నైపుణ్యం సంపాదించాడు.  పని మహిమతో నిజాయతీపరుడూ అయ్యాడు.

పాంగ్లాస్ అప్పుడప్పుడూ కాండీడ్‌తో ఇలా అంటూ ఉండేవాడు:

‘‘సర్వోత్తమమైన ఈ ప్రపంచంలో పరస్పర సంబంధమున్న ఘటనలు జరుగుతూ ఉంటాయి. క్యూనెగొండ్‌ను ప్రేమించినందుకు నువ్వు ఆ సుందరభవనం నుంచి బూటుకాలితో తన్నితరియేయబడకుండా, మతవిచారణలో చిక్కుకోకుండా, అమెరికాలో కాలినడకన తిరక్కుండా, చిన్నజమీందారును కత్తితో పొడవకుండా, ఎల్డొరాడో గొర్రెలను పోగొట్టుకోకుండా.. ఉండుంటే ఇప్పుడిలా హాయిగా బత్తాయిపళ్లు, పిస్తా గింజలు మింగుతూ ఉండేవాడివా?’’

‘‘అదంతా నిజమేగాని, ముందు మనం వెళ్లి తోటపని చెయ్యాలి’’ అని బదులిస్తుండేవాడు కాండీడ్.

(సమాప్తం)