Sunday, 24 January 2016

జీవన లాలస16(వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)19.  ఒకరికొకరు(1వ భాగం)

విన్సెంట్ కు డెనిస్‌ల ఇంట్లో తెల్లకాగితాలు, లావుపాటి పెన్సిల్ దొరికాయి. మార్కాస్‌లో గీసిన రెండు స్కెచ్చులను కాపీ చేయడం మొదలుపెట్టాడు. గీత సరిగ్గా కుదరడం లేదు. అనుకున్నట్టు రావడం లేదు. పెన్సిల్ కంటే రబ్బరే ఎక్కువ వాడాడు. కానీ గీస్తూనే ఉన్నాడు. గదిలో ఆవరించిన చీకటినీ గమనించనంతగా లీనమైపోయాడు. డెనిస్ భార్య తలుపు తట్టేసరికి ఈ లోకంలోకి వచ్చాడు.  
‘‘భోజనం సిద్ధం చేశాను’’ అందామె.
‘‘భోజనమా! వేళ గమనించలేదు. ఇప్పటికే ఆలస్యపోయింది కదూ’’ అన్నాడతడు.
భోజనాల వద్ద భార్యభార్తలతో ఉత్సాహంగా మాట్లాడాడు. అతని కళ్లలో కాంతిచాపం తళుక్కుమంది. వాళ్లూ అతని ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడ్డారు. విన్సెంట్ మనసంతా బొమ్మలపైనే ఉంది. ఏదో కాస్త తిని, ఏమీ అనుకోవద్దంటూ వెంటనే గదిలోకి వెళ్లిపోయాడు. దీపం వెలిగించి, గని దగ్గర వేసిన బొమ్మల్నీ గోడలకు అతికించి, కాస్త దూరంగా వెళ్లి చూశాడు. 
‘‘ఛత్! అసలేం బాగాలేవు. రేపు ఇంకాస్త బాగా వేస్తాను..’’ ముఖం చిట్లిస్తూ తనలో తను అనుకున్నాడు.  
కిరోసిన్ దీపాన్ని మంచం పక్కన పెట్టుకుని పక్క మీదికి చేరాడు. గోడకు అతికించిన ఆ బొమ్మలను అలా చూస్తుూ ఉండిపోయాడు. పక్కనున్న మిగతా  ప్రింట్లవైపూ చూశాడు.  వాటిని ఏడు నెలల కింద బాలల సదనంలోంచి తీసుకొచ్చాక మళ్లీ చూడ్డం ఇదే తొలిసారి. ఇంతకాలం తను బొమ్మల ప్రపంచానికి దూరమయ్యానన్న విషయం గుర్తుకొచ్చింది. రెంబ్రాంత్,  మిలే, జూల్ దూప్రే, డెలక్రా, మ్యారీ.. ఇంకా ఎవరేమిటో తనకు ఒకప్పుడు కొట్టినపిండి. గతంలో తను దాచుకున్న అందమైన ప్రింట్లు, తమ్మునికి, తల్లిదండ్రులకు పంపిన రేఖాచిత్రాలూ గుర్తుకొచ్చాయి. లండన్, ఆమ్ స్టర్ దామ్ మ్యూజియాల్లో చూసిన చక్కని తైలవర్ణచిత్రాలూ మనసులో మెదిలాయి. వాటి  స్మరణలో అతడు తన బాధను పూర్తిగా మరిచిపోయి గాఢమైన ప్రశాంత నిద్రలోకి జారుకున్నాడు. కిరోసిన్ దీపం చిటపట జ్విలించి, నీలిమంట కక్కి ఆరిపోయింది.
తెల్లవారడానికి ముందే, మూడింటికే నిద్రలేచాడు. అలసట మటుమాయమైంది. పెన్సిల్,  కాగితాలు, వంటింట్లోంచి అట్టముక్కా తీసుకుని చీకటి తెరల్లో మార్కాస్‌ గనులవైపు కదిలాడు. నిన్న తుప్పుపట్టిన ఇనుప చక్రంపైనే కూర్చుని, గనుల్లో వచ్చే కార్మికుల కోసం ఎదురు చూడసాగాడు.
ప్రతి కార్మికుడి రూపాన్నీ చిత్రిక పట్టాలన్న తపనతో బొమ్మలను వేగంగా, అస్పష్టంగా గీశాడు.  గంటయ్యాక కార్మికులందరూ గనిలోకి దిగిపోయారు. విన్సెంట్ చేతిలో ముఖాల్లేని ఐదుగురి బొమ్మలు లెక్క తేలారు. వేగంగా నడుస్తూ ఇంటికెళ్లి కాఫీ కప్పు తీసుకుని, తన గదిలోకి దూరాడు. అప్పటికి గదిలో ఉదయకాంతి ప్రసరించింది. ఆ  ఐదు స్కెచ్చులను కాపీ చేశాడు. తనకు బాగా తెలిసిన బొరైన్లను అచ్చుగుద్దినట్టు, వాళ్ల సహజస్వభావం ఉట్టిపడేటట్టు గీయాలనుకున్నాడు. అయితే ఆ వేకువజాము చీకట్లో వాళ్లు చక్రమ్మీద కూర్చున్న తనకు కిందుగా వెళ్లడంతో రూపురేఖలను సరిగ్గా పట్టుకోలేకపోయాడు.

బొమ్మలు కాళ్లు, చేతులు కొలతలు తప్పి వికారంగా వచ్చాయి. రేఖలు విపరీతంగా ఉన్నాయి. అయితే ఆ బొమ్మలు ముమ్మాటికీ బొరైన్ల మాదిరే ఉన్నాయి.  కొంకిరిబింకిరి గీతలు చూసి నవ్వుకున్నాడు. బొమ్మల్ని చించేశాడు. మంచంపై కూర్చుని.. గోడపై తనకెదురుగా ఉన్న అలెబ్  ప్రింట్ ను కాపీ చేయసాగాడు. శీతకాలంలో ఓ వీధిగుండా ముసలావిడ వేడినీళ్లు,  బొగ్గు పట్టుకుపోతున్న చిత్రమది.  ఆమె బొమ్మ కాస్త బాగానే వచ్చిందికానీ.. ఆమెకు, వీధికి, వెనకవైపున్న ఇళ్లకు పొంతన కుదరలేదు. విన్సెంట్ చిత్తుబొమ్మను నలిపేసి మూలకు విసిరికొట్టాడు. మంచలోంచి లేచి, ఈసారి బాస్బామ్ వేసి ఒంటరి చెట్టు చిత్రం ముందు కుర్చీలో కూర్చున్నాడు. ఆ బొమ్మ సాదాసీదా ఉంది. ఒకే ఒక చెట్టు, రేగడి నేల, పైన మబ్బులు ఉన్నాయంతే.  అయితే అన్నీ తీర్చిదిద్దినట్టు ముచ్చటగా ఉన్నాయి. ఏ ఒక్కటీ అనవసరం అనిపించడం లేదు. అలాంటి చిత్రాన్ని వెయ్యాలంటే చాలా కష్టమని విన్సెంట్  కు అర్థమైంది.
కాలప్రవాహంలో మరో ఉదయసంధ్య కదలిపోయింది. విన్సెంట్ కాగితాలన్నింటినీ బొమ్మలతో నింపేశాడు.  తర్వాత  డబ్బుకోసం బ్యాగు, బట్టలు వెతికాడు. రెండు ఫ్రాంకులు దొరికాయి. మంచి కాగితాలు,  వీలైతే ఓ చార్‌కోల్ పుల్ల కొనుక్కోవచ్చని మోన్స్ పట్టణానికి కాలినడక బయల్దేరాడు.  పన్నెండు కిలోమీటర్ల దూరంలోని ఉందా ఊరు. దారిలో గుడిసెల ముందు ఆడవాళ్లు కనిపించారు. వాళ్లను ఉత్తిగా పలకరించి సరిపెట్టుకోకుండా, బావున్నారా అని ఆప్యాయంగానూ అడిగాడు. దారి మధ్యలోని పటరేజ్ ఊళ్లో ఓ బేకరీ కిటికీలోంచి అందమైన యువతి కనిపించింది. కేవలం ఆమెను చూడ్డానికే లోపలికెళ్లి బ్రెడ్డు కొనుక్కున్నాడు.
బాటపక్కని పొలాలు భారీ వర్షం పడడంతో పచ్చగా కళకళలాడుతున్నాయి. ఆకుపచ్చ పెన్సిల్ కొన్నాక మళ్లీ అక్కడికొచ్చి వాటిని గియ్యాలనుకున్నాడు.  మోన్స్ కెళ్లి  నున్నటి పసుప్పచ్చ కాగితాలు, చార్‌కోల్‌ ముక్కలు, లావుపాటి పెన్సిళ్లు కొన్నాడు. దుకాణం ముందు పాత ప్రింట్ల బుట్ట ఉంది. కానీ వాటిని కొనేందుకు తన దగ్గర డబ్బులేదు. అయినా వాటిని తరచితరచి చూశాడు. యజమాని కూడా జత కలిశాడు. ఇద్దరూ మ్యూజియంలో చిత్రాలను చూస్తున్నట్టు ఒక్కో ప్రింటుపైనా సావాసగాళ్లలా కబుర్లు మొదలుపెట్టారు.  
చాలాసేపు చూశాక విన్సెంట్..‘’మీరేమీ అనుకోకండి. వీటిని కొంటానికి నా దగ్గర డబ్బుల్లేవు’’ అన్నాడు ఇబ్బందిపడుతూ. అదేం పెద్ద విషయం కాదన్నట్టు యజమాని భుజలెగరేసి.. ‘ఫర్వాలేదండి. మళ్లీ రండి, డబ్బుల్లేకపోయినా సరే’’ అన్నాడు.  
విన్సెంట్ ఆడుతూపాడుతూ ఇంటిబాట పట్టాడు. క్షితిజరేఖలో అస్తమిస్తున్న లోకబాంధవుడి లేతగులాబీ కిరణాలు మేఘాల అంచులను వెలిగిస్తున్నాయి. దారిమధ్యలోని క్యూస్మెస్ పల్లెలో చిన్నిచిన్న రాతిళ్లు ప్రకృతిలో ఒడిలో సహజంగా ఒదిగిపోవడాన్ని గమనించాడు. మిట్టపైకొస్తూ.. కింద పరచుకున్న విశాలమైన పచ్చికబయళ్లను చూశాడు. గుండె గంతులేస్తోంది. కానీ ఎందుకో తెలియడం లేదు.
మరుసటి రోజు మార్కాస్ వెనక ఉన్న దిబ్బకు వెళ్లాడు. నడుం వంచి బొగ్గులేరుతున్న ఆడపిల్లల, ఇల్లాళ్ల బొమ్మలు గీశాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చి భోంచేశాక, మళ్లీ ఏదో చప్పున తట్టింది.
‘‘మీరు బల్లదగ్గర్నుంచి కదలకండి. నేనిప్పుడే వస్తా’’ అన్నాడు డెనిస్ దంపతులతో.
గదిలోకి పరిగెత్తి.. అట్ట, కాగితం, చారకోల్ పట్టుకొచ్చాడు. తన ఆశ్రయదాతల రూపాలను చకచకా కాగితంపైన ఆవిష్కరించాడు. డెనిస్ భార్య, ఆ బొమ్మలను చూసి, ‘‘అయితే మీరు, బొమ్మలువేసేవాళ్లా’’ అని విస్మయంతో గట్టిగానే అడిగేసింది.
విన్సెంట్ ఇబ్బందిపడిపోయాడు. ‘‘లేదండి,  ఏదో సరదాకి.’’
‘‘కానీ నా బొమ్మ చాలా బావుంది. దాదాపు నా మాదిరే ఉంది.’’
‘‘దాదాపే. కానీ పూర్తిగా మీలా లేదు..’’ విన్సెంట్ నవ్వుతూ అన్నాడు.
అతడు తనేం చేస్తున్నదీ ఇంటికి రాయలేదు. చెబితే,  ‘అయ్యో.. మన విన్సెంట్ మళ్లీ ఏదో వెర్రిలో పడ్డాడు. అతడు ఇక బాగుపడేదెప్పుడు?’ అని వగరుస్తారు.
ఈ కొత్త వ్యాపకం ఆసక్తికరంగా ఉంది. అది పూర్తిగా తన పని. కానీ తన బొమ్మల గురించి తను ఏమీ చెప్పలేడూ రాయలేడూ. వాటిపై ఒక నిర్మోహం కలిగింది. కొత్తవాళ్లకు చూపొద్దనుకున్నాడు. వాటినిండా లోపాలే ఉన్నప్పటికీ అవి బలంగా, గహనంగా, స్వచ్ఛంగా ఉన్నాయి.  


అతడు మళ్లీ కార్మికుల ఇళ్లలోకి ప్రవేశించాడు. అయితే ఈసారి చేతిలో బైబిల్ తో కాకుండా, కాగితాలు, పెన్సిల్ తో వచ్చాడు. కార్మికులు అతని రాకతో పొంగిపోయారు. విన్సెంట్ నేలపై ఆడుకుంటున్న పిల్లలను, కుంపట్లో బొగ్గులేస్తున్న ఆడవాళ్లను, పనుల్లో అలసిపోయాక సాయంత్రం భోంచేస్తున్న ఇంటిల్లిపాదినీ రేఖల్లోకి తీసుకొచ్చాడు. ఎత్తయిన పొగ్గొట్టాల మార్కాస్ గనులను, నల్లబారిన మైదాలను, లోయ వెంబడి సాగిన అడవులను, పటరేజ్ చుట్టుపక్కల పొలాలు దున్నే కర్షకులను గీశాడు. బయట వాతావరణం బాగోలేకపోతే గదిలోనే కూర్చుని గోడలపైని ప్రింట్లను, నిన్న గీసుకున్న చిత్తు బొమ్మలను కాపీ చేస్తున్నాడు. పక్కమీదికి చేరాక, ఆ రోజు వేసిన ఒకటి రెండు బొమ్మలు మరీ అంత తీసికట్టుగా ఏమీ లేవని అనుకుంటున్నాడు. మళ్లీ పొద్దున లేవగానే తాను సృజన మైకంలో పడిపోయానని, తన బొమ్మలు పరమ చెత్తగా ఉన్నాయని విసిరి పడేస్తున్నాడు.  
బొమ్మల వ్యాపకంలో పడిపోయి తన లోపలి వేదనా తరంగాలను గట్టిగా అణచేసుకున్నాడు. సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాడు. తను తనకాళ్లపైన నిలబడకుండా తండ్రి, తమ్ముడు పంపుతున్న డబ్బులపై బతకడం సిగ్గుచేటని తెలిసినా, అదేమంత పెద్దవిషయం కాదని, బొమ్మల్లో మునిగిపోయాడు.


(సశేషం)

No comments:

Post a Comment