Saturday, 21 November 2015

జీవన లాలస15(వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)విన్సెంట్ స్వీయచిత్రం


16. దేవుడి నిర్గమనం

సమ్మె కట్టిన కార్మికులు మర్నాడు పొద్దున విన్సెంట్ దగ్గరికొచ్చారు. ‘‘అయ్యోరా! జాక్ వెర్నీ పోయాడు. ఇక మీరే మాకు దిక్కు. మేమేం చెయ్యాలో చెప్పండి. ఇట్టా చావుకోసం ఎదురుచూస్తూ ఉండలేం. మేమేం కోరుకుంటున్నామో కంపెనీ వాళ్లకు చెప్పి ఒప్పించండి. తర్వాత మీరేం చెప్పినా వింటాం. పనిలోకి వెళ్లమంటే వెళ్తాం, ఆకలితో చావమంటే అలాగే మాడి చస్తాం! మీ మాట తప్ప మరొకరి మాట వినే ప్రసక్తేలేదు’’ అన్నారు.
చార్బానేజెస్ కంపెనీ కార్యాలయం శవం లేచిన ఇల్లులా ఉంది. విన్సెంట్ వచ్చినందుకు మేనేజర్ సంతోషపడ్డాడు. అతను చెప్పిందంతా సానుభూతితో విన్నాడు. ‘‘నాకు తెలుసండి. కూలిన బావిలోని శవాల దగ్గరి వరకు బోరు తవ్వలేదని పనోళ్లు మాపైన మండిపడుతున్నారు. ఆ బావిని తిరిగి తెరవొద్దని కంపెనీ నిర్ణయించింది. తవ్వకానికి కంపెనీ డబ్బులివ్వదు. అంతవరకు తవ్వాలంటే నెల పడుతుంది. తవ్వినా ఏమిటి ప్రయోజనం? ఆ శవాలను ఒక గుంతలోంచి తీసి మరో గుంతలో పడెయ్యడం తప్ప!’’
‘‘శవాల సంగతి సరే, మరి బతికున్నవాళ్ల సంగతేంటి? గని పరిస్థితిని మెరుగుపర్చడానికి ఏమీ చెయ్యరా? వాళ్లు రోజూ దినదినగండమన్నట్టు పని చెయ్యాల్సిందేనా?’’
‘‘తప్పదు. వాళ్లలా పని చెయ్యాల్సిందే! భద్రతా పరికరాలు కొనడానికి కంపెనీ వద్ద డబ్బు లేదు. ఈ పోరాటంలో కార్మికులు ఎన్నడూ గెలవలేరు. ఉక్కుగోళ్ల రాకాసి చట్టాలు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే, మరో పెను ముప్పు కూడా పొంచి ఉంది. వారంలోగా కార్మికులు తిరిగి పనిలోకి రాకుంటే మార్కాస్ గనులను శాశ్వతంగా మూసేస్తారు. తర్వాత వాళ్లకు దేవుడే దిక్కు.’’ 
విన్సెంట్ ఓటమి భారంతో కుంగిపోయి పాము మెలికల్లా సాగిన పొడవాటి బాట వెంట పల్లె ముఖం పట్టాడు. ‘‘బహుశా దేవుడికే తెలియాలి.. లేకపోతే అతనికీ తెలియదేమో!’’ తనలో తను నిష్టూరపడ్డాడు. 
కార్మికులను తను ఏరకంగానూ ఆదుకోలేడని తేలిపోయింది. ప్రాణం నిలబెట్టుకోడానికి పిడికెడు తిండి కోసం రోజుకు పదమూడు గంటలపాటు ఆ చీకటి కూపాల్లోకి తిరిగి వెళ్లాలని తను వాళ్లకు చెప్పాలి. వాళ్లకు తను ఏ సాయమూ చెయ్యలేకపోయాడు. తనే కాదు, దేవుడూ చెయ్యలేపోయాడు. వాళ్ల హృదయాలకు దైవ సందేశాన్ని చేరవెయ్యడానికి తను బోరినాజ్ వచ్చాడు.  కానీ ఆ అభాగ్యుల పరమశత్రువు గనుల యజమానులు కారని, సాక్షాత్తూ సర్వశక్తిసంపన్నుడైన ఆ భగవంతుడేనన్న కఠోరవాస్తవం తెలిశాక తనిక ఏం చెప్పగలడు? ఏం చెయ్యగలడు? తిరిగి పనిలోకి వెళ్లి బానిసల్లా బతకమని తను వాళ్లకు చెప్పిన మరుక్షణం వాళ్లలో తనకు పూచికపుల్ల విలువ ఉండదు. బోధకుల సంఘం ఒప్పుకున్నా సరే తనిక ఎన్నడూ బోధన చెయ్యలేడు, ఇప్పుడు బైబిల్ సువార్తతో వాళ్లకు ఒరిగేదేముంది కనక?  ఆ దీనుల మొర ఆలకించలేని బండరాయి అయ్యాడు దేవుడు. ఆ రాయికి తను జీవం పొయ్యలేడు.
విన్సెంట్ వేసిన బాట, విల్లో చెట్టు మొద్దు
 
చాలా కాలంగా ఎరిగి వున్న ఒక విషయం అతనికి ఉన్నట్టుండి గుర్తుకొచ్చింది. ఈ దేవుడి కథలూ, సందేశాలూ అన్నీ కుంటిసాకులు. భయవిహ్వలుడైన ఒంటరి మనిషి శీతలతిమిరంలో, అనంతనిశీథిలో ఊరట కోసం తనకు తాను చెప్పుకునే పచ్చిఅబద్ధాలు. దేవుడు లేడు. లేనే లేడు. ఉన్నదంతా మహాసంక్షోభం.. దుఃఖభాజనమైన యాతనామయ సంక్షోభం.
17. పతనం

కార్మికులు తిరిగి పనిలోకి వెళ్లారు. బ్రస్సెల్స్ లోని ఇవాంజిలికల్ రెవరెండ్ల ద్వారా కొడుకు విషయం తెలుసుకున్న థియోడరస్ వ్యాన్గో.. ఇంటికి రమ్మని ఉత్తరం రాశాడు. డబ్బూ పంపాడు. కాని విన్సెంట్ డెనిస్ ఇంటికెళ్లాడు. సదనాన్ని మూసేసి అక్కడి చిత్రాలన్నింటిని డెనిస్ ఇంట్లోని తన గదిలో అతికించుకున్నాడు.
తను మళ్లీ ఓడిపోయాడు. మళ్లీ బేరీజు వేసుకోవాలి. ఏమని వేసుకోవాలి? ఉద్యోగం లేదు, డబ్బూ లేదు; జబ్బుపడ్డాడు, శక్తి లేదు; ఆలోచనలు, ఆశయాలు, ఆశలు, ఆదర్శాలు ఏమ లేవు. అసలు బతుక్కి ఒక ఆలంబనే లేదు. తనకిప్పుడు ఇరవయ్యారేళ్లు. ఆరు అపజయాలు మూటగట్టుకున్నాడు. కొత్త జీవితాన్ని మొదలెట్టే ధైర్యం లేదు. 
విన్సెంట్ అద్దంలో చూసుకున్నాడు. ఎర్రగడ్డం ఉంగరాలు తిరిగి ముఖాన్ని కప్పేసింది. జుట్టు పల్చబడింది. నిండుగా, అందంగా ఉండిన పెద్ద నోరు కిందికి జారికి రేఖమాత్రంగా మిగిలిపోయింది. కళ్లు అగాథాల్లోకి జారిపోయాయి. ఒకప్పటి నిండైన విన్సెంట్ వ్యాన్గో విగ్రహం పూర్తిగా శుష్కించి, చల్లబడిపోయి లోలోపలే అంతరించిపోయింది.
విన్సెంట్ డెనిస్ భార్యను అడిగి సబ్బు తీసుకున్నాడు. నీటి తొట్టిలో నిల్చుని ఆపాదమస్తకం చూసుకుంటూ స్నానం చేశాడు. బలమైన భారీదేహం కృశించిపోయింది. స్నానం తర్వాత శుభ్రంగా గడ్డం గీసుకున్నాడు. ముఖంలోంచి ఆ వింత ఎముకలు ఎప్పుడు బయటికొచ్చాయా అని ఆశ్చర్యపోయాడు. తలను చాలా కాలం విరామం తర్వాత ఇదివరకట్లాగే వెనక్కి దువ్వుకున్నాడు. డెనిస్ భార్య తన భర్త బట్టల్ని ఇచ్చింది. వాటిని వేసుకుని కమ్మని వాసనలొస్తున్న వంటిగదిలోకి అడుగుపెట్టాడు, ఆ దంపతులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. గని ప్రమాదం తర్వాత తొలిసారి కాస్త మంచితిండి నోట్లో పడింది. నిర్వేదంతో అసలు తిండితినడం అవసరమా అనిపించింది. భోంచేస్తుంటే చెత్తనములుతున్నట్టు అనినిపించింది. 
తనను మతబోధన నుంచి తప్పించారని విన్సెంట్ కార్మికులకు చెప్పలేదు. అసలు వాళ్లు అతనితో ఆ మాటే ఎత్తలేదు. మతబోధన విషయమే పట్టించుకోలేదు. విన్సెంట్ వాళ్లతో మాట్లాడ్డం మానేశాడు. దారిలో కనిపిస్తే మర్యాదకని పలకరించి తన దారిన తాను పోతున్నాడు. వాళ్ల పూరిళ్లలోకి వెళ్లడం లేదు, వాళ్ల బతుకులతో, బాధలతో మమేకం కావడం లేదు. వాళ్లు కూడా విషయాన్ని మౌనంగా అర్థం చేసుకుని అతనితో ముచ్చటించడం మానేశారు. అతని ధోరణి అంతేనేమోనని అనుకున్నారు తప్పిస్తే అతనిలో వచ్చిన మార్పును ఏమాత్రం నిందించలేదు. రోజులు భారంగా కదలిపోతున్నాయి.
దాయాదురాలు కే వోస్ భర్త హఠాత్తుగా చనిపోయాడని ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది. ఆ సంగతి పట్టించుకోలేతదడు. అతని హృదయం దేన్నీ ఇముడ్చుకోనంత నిరామయంగా ఉంది మరి.
కొన్ని వారాలు గడిచాయి. తినడం, నిద్రపోవడం, నిరామయంగా కూర్చోవడం తప్ప మరేమీ చెయ్యడం లేదు. జ్వరం తగ్గింది. నెమ్మదిగా శక్తి వస్తోంది. బరువూ పెరుగుతున్నాడు. అయితే కళ్లు మాత్రం గాజుకళ్లుపడ్డాయి. వేసవి మొదలైంది. నల్లమైదానాలు, పొగ్గొట్టాలు, నుసిదిబ్బలు సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. విన్సెంట్ తరచూ పల్లెపట్టుకేసి నడుస్తున్నాడు. కానీ అది ఆరోగ్యం కోసమూ కాదు, షికారూ కాదు. తను వేటిగుండా వెళ్తున్నదీ, ఎక్కడికి వెళ్లున్నదీ అతని తెలియదు. పడుకోవడం, కూర్చోవడం, నిల్చోవడం వల్ల కలసిన బడలికను తీర్చుకోవడానికి అలా వెళ్తున్నాడంతే. నడిచినడిచి అలసిపోతే ఓ చోట కూర్చుకుంటున్నాడు, పడుకుంటున్నాడు. లేకపోతే శిల దిగొగ్గినట్లు ఊరకే అలా నిల్చుండిపోతున్నాడు.
తండ్రి పంపిన డబ్బు ఖర్చయిపోగానే పారిస్‌లో ఉంటున్న తమ్ముడు థియో నుంచి ఉత్తరం, డబ్బూ వచ్చాయి. బోరినాజ్ లో సోమరిగా పడుండక, ఏదో గట్టి నిర్ణయం తీసుకుని,  ఆ డబ్బుతో నిలదొక్కుకోవాలని బతిమాలాడు తమ్ముడు. విన్సెంట్ ఆ డబ్బును దెనిస్ భార్యకిచ్చాడు. అతడు బోరినాజ్‌లో ఉండిపోవడానికి కారణం అది నచ్చినందువల్ల కాదు. మరెక్కడికీ వెళ్లలేకే అక్కడుంటున్నాడు. వెళ్లిపోవడానికి సమయం పడుతుంది.
తనకు దేవుడు లుప్తమయ్యాడు. అసలు తనకు తనే లేడు. ఇప్పడు అన్నింటికీ మించిన మనిషినీ కోల్పోయాడు. తనకు లోకంలో అన్నింటికంటే ముఖ్యమైన వాణ్ని, తనను అర్థం చేసుకుని, తనపై సానుభూతి చూపే ఒక్కే ఒక్కణ్ని.. తన సోదరుణ్ని కోల్పోయాడు.  తమ్ముడు తనను పరిత్యజించాడు. శీతాకాలంలో అతడు తనకు వారానికి ఒకటి రెండుసార్లు.. ప్రేమానురాగాలూ, కుతూహలమూ నిండిన పేజీలకు పేజీల లేఖలను రాశాడు. ఇప్పుడవి ఆగిపోయాయి. థియోకు కూడా తనపై నమ్మకం పోయింది, ఆశ వదిలేసుకున్నాడు. ఇప్పుడు విన్సెంట్ ఏకాకి. తనను సృజించిన భగవంతుడు కూడా తోడులేని పరమ ఏకాకి, నిర్జన లోకంలో తిరుగుతూ తనింకా అక్కడ ఎందుకున్నాడని బిత్తరపోయే జీవన్మృతుడు.


18. ఒక అల్ప విషయం

వేసవి వెళ్లిపోయి శిశిరం మొదలైంది. ఉన్న కాసింత పచ్చదనమూ కనుమరుగైంది. అయితే విన్సెంట్‌లో ఏదో నూతన జీవశక్తి పురులువిప్పింది. తన జీవితాన్నే దీటుగా ఎదుర్కోలేని అతడు ఇప్పుడు ఇతరుల జీవితాలపైకి మళ్లాడు. తిరిగి పుస్తకాలు పట్టుకున్నాడు. పఠనం అతనికి ఎల్లప్పుడూ ఇష్టమైన వ్యాపకం. ఇతరుల జయాపజయాల, సుఖదుఃఖాల గాథల్లో అతడు తనను వెంటాడుతున్న తన జీవిత వైఫల్యపు రక్కసిబారి నుంచి రక్షణ పొందాడు.  
వాతావరణం బాగున్నప్పుడు మైదానాల్లో వెళ్లి పగలంతా అక్కడే చదువుకుంటున్నాడు. వానపడితే.. గదిలోని చూర్లకిందున్న తన మంచంలో పడుకునో, లేకపోతే డెనిస్ ల వెచ్చని వంటగది గోడపక్కన కుర్చీలోనో కూర్చుని గంటలకొద్దీ చదువుకుంటున్నాడు. గోరంత విజయాన్ని, కొండంత అపజయాన్నీ మూటగట్టుకునే తనలాంటి అతి సామాన్యమానవుల జీవితగాథలతో మమేకమైపోతున్నాడు. వాళ్లు చూపిన బాటలో తన జీవితాన్ని సరైన రీతిలో దర్శించుకోగలుగుతున్నాడు. నెమ్మదిగా అతని మనసులో ఒక నవ్యభావన సుళ్లు తిరగసాగింది. ‘‘నేను పరాజితుణ్ని, పరాజితుణ్ని’’ అనే నిరాశ స్థానంలో, ‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేది తగింది? ఈ ప్రపంచంలో నాకు సరైన స్థానమేది?’’ అనే ఆరాటం  మొదలైంది. తను చదివే ప్రతి పుస్తకంలోనూ తన జీవిత మార్గాన్ని నిర్దేశించే దిక్సూచి కోసం తపనతో అన్వేషిస్తున్నాడు.
తను ఎందుకూ పనికిరాడని తిడుతూ ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. సోమరిగా తిరుగుతూ, సభ్యతాసంస్కారాలను, సంఘపు కట్టబాట్లను అతిక్రమిస్తున్నావంటూ తండ్రి నిందిస్తున్నాడు. మళ్లీ నీ కాళ్లపై నువ్వు నిలబడి, సమాజానికి నీ వంతు ఉపకారం ఎప్పుడు చేస్తావని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం విన్సెంట్ కూడా ఎదురుచూస్తున్నాడు. దొరికితే అతనికీ సంతోషమే. 
విన్సెంట్ బొమ్మకట్టిన ఒక అభాగ్యుడి ‘వేదన’
అతనికి చివరకు పుస్తక పఠనంతోనూ విసెగెత్తింది. పరాజయం తర్వాత కొన్నాళ్లు అతడు దేన్నీ స్వీకరించనంతటి ఉద్వేగరాహిత్యంలోకి జారిపోయాడు. తర్వాత మనశ్శాంతి కోసం పుస్తకాలు చదివాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ కొన్నినెలలుగా అణచిపెట్టుకున్న తీవ్ర వేదన ఇప్పుడు కట్టలు తెంచుకుని  అతణ్ని దుఃఖంలో ముంచెత్తింది. పుస్తకాలతో సాధించిన మనోస్థిమితం ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యలేకపోయింది.  
అతడు జీవిత పతనావస్థకు చేరాడు. ఆ సంగతి అతనికి ఎరుకే. అయితే తనలో ఎంతో కొంత మంచి ఉందని, తను మరీ అంత మూర్ఖుణ్నీ, వ్యర్థజీవినీ కానని, లోకానికి తను పిసరంతైనా మేలు చేయగలనని అతడు అనుకుంటున్నాడు. మరి ఆ మేలేమిటి? తను వ్యాపారానికి పనికిరాడు. తనకు సరిపోయేది ఏదో దాంట్లో తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లో ప్రయత్నించి ఓడిపోయాడు. కానీ తనెప్పుడూ ఇలా పరాజయానికి, వేదనకు గురికావాల్సినంత శాపగ్రస్తుడా? తన జీవితం పరిసమాప్తమైపోయిందా?
అన్నీ ప్రశ్నలే. సమాధానాల్లేవు. రోజులు దొర్లిపోతున్నాయి. శీతాకాలం ప్రవేశించింది. తండ్రి విసుగెత్తిపోయి డబ్బు పంపడం లేదు. విన్సెంట్ డెనిస్ ల ఇంట్లో భోజనం మానుకుని పిడికెడు బ్రెడ్డుతో కడుపు నింపునింపుకుంటున్నాడు. థియో బాధపడిపోయి కాస్త డబ్బు పంపుతున్నాడు. అతనికీ సహనం నశిస్తే తండ్రి తన బాధ్యత గుర్తెరిగి మళ్లీ కాస్త డబ్బు పంపుతున్నాడు. రివాజుగా మారిన ఆ ఇద్దరిసాయంతో విన్సెంట్ అరకడుపుతో రోజులు నెట్టుకొస్తున్నాడు.
నవంబర్‌లో వాతావరణం తేటగా ఉన్న ఓ రోజున విన్సెంట్ మార్కాస్ గనుల వద్దకు వెళ్లాడు. మనసులో ఏ ఆలోచనలూ లేవు. గోడపక్కనున్న ఓ తుప్పుపట్టిన ఇనుప చక్రమ్మీద కూర్చున్నాడు. గేట్లోంచి ఓ ముసలి కార్మికుడు బయటికొచ్చాడు. తలపైని నల్లనిటోపీ కళ్లను కప్పేస్తోంది. భుజాలు వంగిపోయాయి. చేతులు జేబుల్లో పెట్టుకున్నాడు. మోకాళ్ల చిప్పలు బయటికిపొడుచుకొచ్చాయి. అతని రూపంలో ఏదో మాటలకందనిది విన్సెంట్ ను ఆకర్షించింది. తనకు తెలియకుండానే అలవోకగా జేబులోంచి పెన్సిల్ ముక్కను, ఇంటినుంచి వచ్చిన ఉత్తరాన్ని బయటకి తీశాడు. నల్ల మైదానంలోంచి వెళ్తున్న ఆ శల్యావశిష్టుని రూపాన్ని కవరు వెనకవైపు వేగంగా గీశాడు.
తర్వాత ఆ కవర్ లో తండ్రి పంపిన ఉత్తరాన్ని తీసి చదివాడు. ఒకే ఒక ముక్క రాసి ఉంది. కాసేపయ్యాక గేటుగుండా మరో కార్మికుడు బయటికొచ్చాడు. పదిహేడేళ్ల కుర్రాడు. పొడవుగా, నిటారుగా ఉన్నాడు. నడుస్తోంటే భుజాలు చూడముచ్చటగా కదులుతున్నాయి. ఎత్తయిన రాతిగోడపక్క నుంచి రైలుపట్టాలవైపు కదలిపోతున్నాడు. విన్సెంట్ అతడు కనుమరుగయ్యేంతవరకు చూసి అతని బొమ్మ గీశాడు. 

(సశేషం)

No comments:

Post a Comment