Saturday, 17 October 2015

జీవన లాలస-9 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)
7. సువార్తికుల కళాశాల
వ్యాన్గో వేసిన బైబిల్ చిత్రం 

మతబోధకులు వాన్ డెన్ బ్రింక్, డి జోంగ్, పీటర్సన్ లు నడుపుతున్న బెల్జియం క్రైస్తవ ప్రచార సంఘం బ్రస్సెల్స్ లో సువార్తికుల శిక్షణా కళాశాలను ప్రారంభిస్తోంది. శిక్షణ ఉచితం. భోజనానికి, బసకు కాస్త డబ్బు చెల్లిస్తే చాలు. విన్సెంట్ ఓ చర్చిలో ఆ బోధకులను కలుసుకుని కళాశాలలో చేరిపోయాడు.

‘‘మూడు నెలల తర్వాత నిన్నుబెల్జియంలో ఏదో ఒక చోట బోధకుడిగా నియమిస్తాం’’ చెప్పాడు రివరెండ్ పీటర్సన్.
‘‘అర్హత సాధిస్తేనే సుమా’’ గట్టిగా అన్నాడు రెవరెండ్ జోంగ్. అతడు యవ్వనంలో కార్మికుడు. కోతయంత్రం పనిలో  బొటనవేలు పోగొట్టుకుని మతప్రచారంలోకి దిగాడు. 
‘‘ఇవాంజెలిస్టులకు జనాన్ని ఆకట్టుకునే చక్కని ప్రసంగాలు ఇవ్వడం తెలిసి ఉండాలి’’ రివరెండ్ బ్రింక్ అందుకున్నాడు.
పీటర్సన్ విన్సెంట్‌తో కలసి చర్చి బయటకొచ్చాడు. ఎండలో మెరిసిపోతున్న బ్రస్సెల్స్ వీధుల్లోకి అడుగుపెడుతుండగా ఆ పెద్దాయన విన్సెంట్ చేతిని పుత్రవాత్సల్యంతో పుచ్చుకున్నాడు.   
‘‘నువ్వు మాతో కలసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబూ. బెల్జియంలో మనకు చేయాల్సినంత పనుంది. నీ ఉత్సాహం చూస్తుంటే ఆ పనికి నువ్వు నువ్వు పూర్తిగా సమర్థుడివేనని అనిపిస్తోంది.’’
విన్సెంట్‌ మనసు ఉత్తేజితమైంది. అది సూర్యతాపం ఫలితవెూ, ఊహించని రీతిగా ఆ పెద్దాయన చూపిన వాత్సల్య ఫలితమో తెలియలేదు.  ఐదారంతస్తుల భవనాలున్న వీధిలోంచి వెళ్తున్నారు. పీటర్సన్‌కు బదులివ్వడానికి విన్సెంట్ మాటల కోసం గింజుకుంటున్నాడు.
‘‘మా ఇంటికెళ్లే మలుపు ఇదే. ఇదిగో నా చిరునామా కార్డు. సాయంకాలం ఖాళీ దొరికితే మా ఇంటికి రా. నీతో  మాట్లడాలని ముచ్చటగా ఉంది‘‘ అన్నాడు పెద్దాయన.
కళాశాలలో విన్సెంట్‌తో కలిపి ముగ్గురే విద్యార్థులు. వాళ్లకు పాఠాలు నేర్పి, వాళ్లపై అజమాయిషి చెయ్యాల్సిన బాధ్యత మాస్టర్ బాక్మాది. పొట్టిగా, సన్నగా ఉంటాడు. ముఖం అణిగిపోయినట్టు ఉంటుంది. కళ్ల పక్క నుంచి మొదలైన గీతలు ముక్కును, పెదాలను తాకకుండా గడ్డం వరకు దిగిపోయాయి.  
విన్సెంట్ సహాధ్యాయులు పంతొమ్మిదేళ్ల వయసున్న పల్లెటూరి కుర్రాళ్లు. విన్సెంట్ కు త్వరలోనే నేస్తాలయ్యారు. అయితే స్నేహం బలపడేకొద్దీ అతణ్ని ఎగతాళి చెయ్యడమూ ఎక్కువైంది.
విన్సెంట్ ఓ బలహీన క్షణంలో, ‘‘నా ఆశయం విధేయత, నన్ను నేను సమర్పించుకోవడం’ అన్నాడు. అది వాళ్లకు అసులైంది. అతడు ఫ్రెంచి మతబోధనలకు గుర్తుకు తెచ్చుకోవడానికో, పాఠాలను అర్థం చేసుకోవడానికో యాతన పడుతూ ఉంటే వాళ్లు, ‘‘ఏం విన్సెంట్, నిన్ను నువ్వు సమర్పించేసుకుంటున్నవా?’’ అని వెక్కిరించేవాళ్లు. దీనికంటే బోక్మాతో వ్యవహారం మరింత కష్టమయ్యేది. శిష్యులను మంచి వక్తలుగా తయారుచెయ్యాలని బాక్మా ఆరాటం. వాళ్లు రేపు తరగతిలో మాట్లాడేందుకు ముందురోజు రాత్రే ఉపన్యాసం రాయాలి. ఆ ఇద్దరు కుర్రాళ్లు ఏ అలవోకగా నాలుగు పసలేని మాటలు రాసుకొచ్చి దడదడా వల్లించేవాళ్లు. విన్సెంట్ మాత్రం  నెమ్మదిగా, ప్రతి వాక్యంలో తన హృదయాన్ని నింపి రాసేవాడు. ప్రతి పదంతో తాదాత్మ్యం చెందేవాడు. అయితే తరగతిలో మాత్రం చెప్పడానికి లేవగానే మాటలు అంత సులువుగా పెగిలేవి కావు.  
‘‘సరిగ్గా మాట్లాడ్డం కూడా రాకపోతే ఇవాంజెలిస్టువెలా కాగలవు విన్సెంట్?’’ బాక్మా కించపరచేవాడు.
ఆశు ఉపన్యాసాల విషయంలో ఇద్దరికీ మరింత చెడింది. వాటిని అసలివ్వనని విన్సెంట్ కరాఖండిగా చెప్పేశాడు. తన ప్రసంగాలు అర్థవంతంగా ఉండేందుకు ప్రతి పదాన్నీకష్టంతో, కచ్చితమైన ఫ్రెంచి పదాలతో రాస్తూ రాత్రి బాగా పొద్దుపోయేవరకు మేల్కొనేవాడు. పొద్దున తరగతిలో మిగతా ఇద్దరు యువకు తమ ప్రసంగాలను ఒకసారి అలా చూసుకుని, క్రీస్తు గురించి, కైవల్యం గురించి గలగలా మాట్లాడేసేవాళ్లే. బాగా చెప్పారంటూ బోక్మా తలూపేవాడు. తర్వాత విన్సెంట్ వంతు వచ్చేంది. అతడు ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టేవాడు.
బాక్మా అసలు వినను కూడా వినేవాడు కాదు. పైగా, ‘‘ఆమ్‌స్టర్‌దామ్‌లో నువ్వు నేర్చుకుంది ఇదేనా? నా విద్యార్థులు ఇలా కాదు. ఆశుప్రసంగాలతో అలవోకగా జనాన్ని కట్టిపడేస్తారు. నా దగ్గర పాఠాలు నేర్చుకుని వెళ్లిన వాళ్లందరికీ  ఆ విద్య కొట్టినపిండి..’’ అని అవమానించేవాడు.
విన్సెంట్ బాగా ప్రసంగించేందుకు ప్రయత్నించేవాడు. కానీ వాక్యాలు క్రమంలో వచ్చేవి కావు. అతని తిప్పలు చూసి సహాధ్యాయులు నవ్వేవాళ్లు, బోక్మా వాళ్లకు జతయ్యేవాడు. ఆమ్‌స్టర్‌దామ్‌లో ఏడాది చదువు అతణ్నిఅప్పటికే పీల్చిపిప్పి చేసింది.
‘‘బాక్మా గారూ! నేను ప్రసంగాలు బాగా ఇవ్వగలను అని తేల్చుకున్నాకే ఇస్తాను లెండి. నా ప్రసంగాలు బాగానే ఉన్నాయని నాకు తెలుసు. మీతో అనసరంగా మాటలు పడను’’ అన్నాడు ఓసారి విన్సెంట్.
గురువుకు మండిపోయింది. ‘‘లేదు. నువ్వు నేను చెప్పినట్లు వినాలి. లేకపోతే నా తరగతికి రానివ్వను’’ అని హెచ్చరించాడు.   
యుద్ధం బహిరంగమైంది. విన్సెంట్ ఒక ప్రసంగాన్ని ఒకటికి నాలుగుసార్లు తిరగ రాస్తున్నాడు. నిద్రాహారాలు తగ్గాయి. కృశించిపోయాడు.
నవంబర్‌లో బోధకుల సంఘం నియామకాలు చేస్తూ విన్సెంట్‌ను కూడా చర్చికి పిలిపించింది. చివరకు కష్టాలన్నీతొలగిపోయాయన్న సంతృప్తితో అతని హృదయం భారమైంది. విన్సెంట్ వచ్చేసరికి సహాధ్యాయులు అప్పటికే అక్కడ ఉన్నారు. విన్సెంట్ వస్తుండగా పీటర్సన్ గమనించలేదు కానీ బాక్మా మాత్రం అదోలా చూశాడు. శిక్షణను చక్కగా పూర్తిచేసుకున్నందుకు ఆ ఇద్దరు యువకలను రివరెండ్ జోంగ్ అభినందించాడు. ఒకరిని హూగ్‌స్రేటన్ లో, మరొకరిని ఎతిచోవ్‌లో బోధకులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందించాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని గదికి వెళ్లిపోయారు.
వ్యాన్గో స్వీయచిత్రం
‘‘వ్యాన్గో! నువ్వు దేవుడి వాక్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఇంకా సంసిద్ధంగా లేవని సంఘం భావిస్తోంది. నీకు నియాకమం లేదు. ఇలా అంటున్నందుకు విచారంగా ఉంది’’ రివరెండ్ జోంగ్ అన్నాడు.
విన్సెంట్ చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు. చివరకు తేరుకుని, ‘‘నా పనిలో లోపాలేంటి?’’ అని అడిగాడు.  
‘‘నువ్వు అధికారులను ధిక్కరించావు. మా చర్చి తొలి నిబంధన నిరపేక్ష విధేయత. అంతేకాకుండా నువ్వు ఆశు ప్రసంగాల్లో ఉత్తీర్ణుడివి కాలేకపోయావు. బోధించడానికి నువ్వు సమర్థుడివి కావని బాక్మా అభిప్రాయం.’’
విన్సెంట్ రివరెండ్ పీటర్సన్ వైపు చూశాడు. కానీ అతడు కిటీకీలోంచి బయటకు చూస్తున్నాడు. ‘‘సరే, మరిప్పుడు నేనేం చెయ్యాలి?’’ విన్సెంట్ జనాంతికంగా అన్నాడు.
‘‘నీకిష్టమైతే మరో ఆరు నెలలు శిక్షణ తీసుకోవచ్చు. బహుశా అది పూర్తయ్యాక..’’ రివెండ్ బ్రింక్ సూచించాడు.
విన్సెంట్ తన ముతక బూట్లవంక చూస్తుండిపోయాడు. వాటి తోలు పిగిలిపోయింది. తానిక చెప్పాల్సిందేమీ లేదని మౌనంగా బయటికొచ్చాడు.
వీధుల గుండా గబగబా నడుస్తున్నాడు. అగమ్యగోచరంగా సాగుతున్నాడు. కాలువ వెంబడి ఉన్న కర్మాగారాల మీదుగా సాగాడు. పొలిమేర దాటేసి, నిర్మానుష్య మైదానంలోకి అడుగుపెట్టాడు. అక్కడంతా బావురుమంటోంది.  బతుకంగా బండకష్టంతో గడిపి, చావుకు సిద్ధంగా ఉన్న బక్కపల్చని తెల్లని ముసలి గుర్రం అక్కడ నిలబడి ఉంది. నేలపై ఓ పుర్రె పడుంది. దూరంగా.. గుర్రాల తోళ్లు తీసే మనిషి గుడిసె దగ్గర్లో ఓ గుర్రపు అస్థిపంజరం ఉంది.
విన్సెంట్ గుండు బరువును దించుకోవడానికి పైపుకోసం తడుముకున్నాడు. అగ్గిపుల్లతో పొగాకు మండించాడు. నోరంతా చేదైంది. మైదానంలోని ఓ మొద్దుపై కూర్చున్నాడు. ముసలి గుర్రం అతని దగ్గరికొచ్చి మూతిని అతని వీపుకేసి రుద్దింది. విన్సెంట్ వెనుదిరిగి ఆ బక్కజీవం మెడపై దెబ్బేసి అవతలకు తరిమాడు.
కొంత సమయం గడిచాక అతని మనసు మళ్లీ దేవుడిపైకి మళ్లింది. సాంత్వన పొందాడు. ‘‘జీసస్ తుపానులో సైతం ప్రశాంతచిత్తుడు. దేవుడు నన్ను శపించలేదు కనక నేను ఒంటరి వాణ్ని కాను. ఏదో ఒకరోజు, ఏదో రకంగా నేను ఈశ్వర సేవామార్గాన్ని కనుక్కొంటాను’’ మెల్లగా గొణుక్కున్నాడు.
గదికి తిరిగొచ్చేసరికి పీటర్సన్ తనకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. భోజనానికి రావాలంటూ తనింటికి తీసుకెళ్లాడు.
ఇద్దరూ రోడ్డెక్కారు. భోజనాల కోసం ఇళ్లకు వెళ్లే కార్మికులతో వీధులు బిలబిలమంటున్నాయి. పీటర్సన్ ఏమీ జరగనట్టు మామూలుగానే మాట్లాడుతున్నాడు. విన్సెంట్ శ్రద్ధగా వింటున్నాడు. ఇల్లొచ్చింది. స్టూడియోగా మార్చిన ముందుగదిలోకి విన్సెంట్‌ను తీసుకెళ్లాడు పెద్దాయన. గోడకు నాలుగు నీటిరంగుల చిత్రాలు, ఓ మూల ఈజిల్(పెయింటింగు వెయ్యడానికి ఊతంగా వాడే స్టాండు)ఉన్నాయి.  
‘‘ఓహ్.. మీరు బొమ్మలేస్తారా, నాకు తెలియదే.’’ అతిథిలో ఆశ్చర్యం.
పీటర్సన్ కాస్త ఇబ్బందిపడ్డాడు. ‘‘ఏదో, ఆసక్తి అంతే. ఖాళీగా ఉన్నడు ఆటవిడుపుగా వేస్తుంటాను’’ అన్నాడు.
భోజనానికి కూర్చున్నారు. పీటర్సన్ పదిహేళ్ల కూతురూ కూర్చుంది. ఆమె సిగ్గరి. ఒక్కసారి కూడా పళ్లెం పైనుంచి చూపు తిప్పలేదు.  పీటర్సన్ పొంతనలేని విషయాలేవో చెబుతున్నాడు. విన్సెంట్ తిన్నానంటే తిన్నట్టు తింటున్నాడు.
ఉన్నట్టుండి అతని మనసు పీటర్సన్ చెబుతున్న విషయానికి అతుక్కుపోయింది. అసలు ఆ విషయం ఎందుకొచ్చిందో అర్థం కాలేదు.
‘‘బోరినాజ్ బొగ్గుగనుల ప్రాంతం. అందరూ గనుల్లోకి వెళ్తారు. ప్రమాదాలకు లెక్కే ఉండదు. అయినా పని మానరు. చాలీ చాలని కూలి.. తిండికి బట్టకే సరిపోదు. గుడిసెలు రేపోమాపో కూలిపోయేలా ఉంటాయి. పెళ్లాంపిల్లలు ఎప్పుడూ ఆకలి, చలి, జ్వరాలతో బాధపడుతుంటారు.’
ఆ సంగతులన్నీ తనకెందుకు చెబుతున్నాడో విన్సెంట్‌కు అర్థం కావడం లేదు. ‘‘ఇంతకూ బోరినాజ్ ఎక్కడుంది.’’
‘‘దక్షిణ బెల్జియంలో, వెూన్స్ కు దగ్గర. ఇటీవల కొన్నాళ్లు అక్కడుండి వచ్చాను. మతబోధకుడు, అతని ఓదార్పూ అవసరమున్నవాళ్ల ఈ లోకంలో ఎవరైనా ఉన్నారూ అంటే అది ఒక్క బొరైన్లు మాత్రమే.’
విన్సెంట్‌కు పొరపోయింది. ఫోర్కును కిందపెట్టేశాడు. పీటర్సన్ ఎందుకు తనను ఏడిపిస్తున్నాడు?
‘‘విన్సెంట్... నువ్వెందుకు బోరినాజ్‌ పోకూడదు? నీకు బోధించాలనే ఉత్సాహం, శక్తీ ఉన్నాయి. నువ్వక్కడ బాగా బోధించగలవు.’’
‘‘కానీ ఎలా? సంఘం.. 
‘‘నాకు తెలుసు. మీ నాన్నకు అన్నీ వివరిస్తూ ఉత్తరం రాశాను. ఆయన జాబు ఈ మధ్యాహ్నమే వచ్చింది. నేను నీకు నియామకం ఇప్పించేంతవరకు నువ్వు బోరినాజ్ లో ఉండేందుకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తానని రాశారు.’’
విన్సెంట్ పట్టలేని సంతోషంతో చప్పన లేచాడు. ’’అంటే.. మీరు నన్ను బోధకుడిగా నియమిస్తారా?’’
‘‘అవును. అయితే నాక్కాస్త గడువు కావాలి. నవ్వు బాగా పని చేస్తున్నావని తెలిస్తే సంఘం మనసు మర్చుకుంటుంది. అలా కాకపోయినా ఫర్లేదు. ఈ నడుమ జోంగ్, బ్రింక్‌లు ఏదో పనిబడి నా దగ్గరికి వస్తారు, వాళ్ల పని చేసిపెట్టినందుకు ప్రతిఫలంగా నీ నియాకం.. అదీ విషయం. ఈ దేశ నిరుపేదలకు నీలాంటి వాళ్ల అవసరం చాలా ఉంది విన్సెంట్. నిన్నువాళ్ల దగ్గరికి పంపే మార్గమేదైనా న్యాయమే. దేవుడే నా తీర్పరి.’’

(మళ్లీ రేపు)

No comments:

Post a Comment