Friday, 16 October 2015

జీవన లాలస-8 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)

5. మెందెస్ కోస్తా


విన్సెంట్ వ్యాన్గో వేసిన ఆమ్ స్టర్ దామ్ చిత్రం 


విన్సెంట్ ఆమ్‌స్టర్‌దామ్‌కొచ్చి ఏడాది గడచింది. అతనికి తను చదువును గట్టెక్కలేనని అర్థమవుతోంది. అది వాస్తవాన్ని అంగీకరించడం కాదు, ఓటమిని నిజాయతీగా ఒప్పుకోవడం. అది కేవలం తన ప్రయత్నలోపానికి, అశక్తతకు మాత్రమే సంబంధించిన సమస్య అయితే అంతగా ఆందోళనపడేవాడు కాదు. కానీ తనను వేధిస్తున్నది అంతకంటే తీవ్రమైన మీమాంస. తాను స్ట్రీకర్ లా పండితుడు, ఉన్నతహోదా గల మతబోధకుడు కావాలని ఆశడుతున్నాడా? బీదసాదలకు, రోగులకు సేవ చెయ్యాలన్న తన ఆదర్శం తను ఇలా వ్యాకరణ, గణిత సూత్రాలతో మరో ఐదేళ్లు కుస్తీ పడితే నెరవేరుతుందా?
మే నెలలో ఓ రోజు మధ్యాహ్నం పాఠం అయిపోయాక, ‘‘కోస్తా గారూ, కాస్త తీరిక చేసుకుని నాతోపాటు కాస్త దూరం అలా రాగలరా?’’ అడిగాడు విన్సెంట్.
విన్సెంట్‌లో రేగుతున్న అంతర్మథనం మెందెస్ కు తెలుసు. అందుకే అతనంటే సానుభూతి. శిష్యుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.  
‘‘దానికేం, పద వెళ్దాం. నేనూ కాస్త నడుద్దామనుకున్నాను. వానలు పోయాక వాతావరణం తేటగా ఉంది. నీతో నడవడం సంతోషమే.’ అన్నాడు గురువు. శాలువాను మెడకు రెండుమూడు చుట్లు చుట్టుకుని, నల్లకోటు తొడుక్కున్నాడు. ఇద్దరూ రోడ్డెక్కారు. మూడు శతాబ్దాలకు ముందు హేతువాది బరూక్ స్పినోజానాను బహిష్కరించిన యూదు కోవెల పక్క నుంచి, తర్వాత కాస్త దూరంలో జీస్ త్రాత్ లోని రెంబ్రాంత్ ఇంటి ముంగిట నుంచి నడుస్తున్నారు.
‘‘ఇతడు పేదరికం, పరాభవాల నడుమ నలిగి చనిపోయాడు’’ రెంబ్రాంత్ ఇల్లు దాటుతూ అన్నాడు మెందెస్ రెంబ్రాంత్ ను ఉద్దేశించి.
విన్సెంట్ దిగ్గున గురువుకేసి చూశాడు.  సమస్యను ప్రస్తావించేలోపే దాని మూలంలోకి చొచ్చుకెళ్లి, పరిశీలిస్తాడు మెందెస్. తిరిగి స్పందించేటప్పడు ఏ మాత్రం తొందరపడడు. కానీ, జాన్, స్ట్రీకర్ల మాటలు గోడకు కొట్టిన బంతుల్లా అవును, కాదు అనే జవాబులతో వేగంగా తిరొగొస్తాయి. మెందెస్ ఒక విషయాన్ని తన తోతైన జ్ఞానపరిణత తటాకంలో ముంచి బయటకు తీసుకొస్తాడు.
‘‘కానీ, రెంబ్రాంత్ అంసతృప్తితో చనిపోలేదు’’ విన్సెంట్ తల పంకించాడు.
‘‘అవును. అతడు తనను తాను పరిపూర్ణంగా వ్యక్తీకరించుకున్నాడు. అతనికి తాను చేసిన పని విలువేమిటో తెలుసు. అతని కాలంలో అలా చేసింది అతడొక్కడే.’’
‘‘మరి, ఆ ఎరుక అతనికి మేలు చేసిందా? ఒకవేళ అతడు పొరబడి ఉంటే? అతణ్నిలోకం విస్మరించడం సమంజసమే అయితే?’
‘‘లోకం ఏమనుకుంటుందనేది ముఖ్యం కాదు. రెంబ్రాంత్ కర్తవ్యం చిత్రాలు వెయ్యడమే. బాగా వేశాడా, వేయలేదా అన్నది ముఖ్యం కాదు; అతణ్ని మనిషినిగా పట్టి నిలిపింది చిత్రకళే. కళాసారపు విలువ కళాకారుడి అభివ్యక్తిలో ఉంటుంది. రెంబ్రాంత్ తన జీవితాశయం ఏదని అనుకున్నాడో, దాన్ని పూర్తిగా నెరవేర్చాడు. జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఒకవేళ అతని కృషి బొట్టు విలువలేనిదే అయినప్పటికి కూడా అది.. అతడు తన కళాభిరుచి వదలుకుని ఆమస్టర్‌దామ్ లోకెల్లా ధనిక వ్యాపారి అవడంకంటే వెయ్యింతలు ఉన్నతమైనదే.
రెంబ్రాంత్ స్వీయచిత్రం 
‘‘అవును..’’
మెందెస్ తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. ‘‘రెంబ్రాంత్ కళ ఈ రోజు ప్రపంచానికి అందిస్తున్న కళానందం అమూల్యం. మరణంతోనే అతని జీవితం పరిపూర్ణమూ, ఫలప్రదమూ అయింది; కష్టాలు కడదాకా వెంటాడినా.  అలా అతని జీవిత పుస్తకం మూతపడింది. కానీ, ఎంత సౌందర్యభరితమైన పుస్తకం అది!’’
ఇద్దరూ వైయ్ దగ్గర ఆగి అక్కడ చెమటచిందిస్తున్న ఇసుక బళ్లవాళ్లను కాసేపు చూశారు. తర్వాత ఐవీ తీగల తోరణాలతో ఉద్యానవనాల్లా ఉన్న సందుల్లోంచి సాగారు.
‘‘మరైతే, ఒక యువకుడికి తను ఎంచుకుంటున్నది సరైందేనని తెలిసేది ఎలా? తను చెయ్యాల్సిన మంచి పనొకంటుందని తెలిశాక, మళ్లీ.. దానికి తను తగనని తేలిపోయాక..’’
మెందెస్ ముఖం కాస్త పైకెత్తాడు. నల్లటి కళ్లు మెరిసిపోతున్నాయి.
‘‘అటు చూడు విన్సెంట్.. సంధ్యాసూర్యుడు బూడిద మేఘాలకు ఎలా అరుణకాంతి అద్దుతున్నాడో..’‘ అన్నాడు కాస్త స్వరం పెంచి.
ఇద్దరూ ఓడరేవుకు చేరుకున్నారు. తెరచాపల కొయ్యలు, గట్టమీది పొడవైన పాతఇళ్ల బారులు, చెట్లు.. సంజెకెంజాయపై పరచుకున్నట్టు ఉన్నాయి. ప్రతిఒక్కటీ జీ అఖాత జలాల్లో ప్రతిఫలిస్తోంది. మెందెస్ మళ్లీ పైపులో పొగాకు నింపకుని సంచిని యువకుడికి అందించాడు.
‘‘నా పొగాకు ఇంకా అయిపోలేందండి.’’
‘‘అవును. తాగుతూనే ఉన్నావు కదూ. గట్టువెంట అలా జబర్గ్ దాకా వెళ్దామా? అక్కడ యూదుల గుడి ఆవరణలో మా వాళ్ల సమాధలున్నాయి. కాసేపక్కడ కూర్చుందాం.’’
ఇద్దరూ ఆత్మీయపూర్వక మౌనంతో నడిచారు. పొగాకు పైపుల్లోంచి వస్తున్న పొగను గాలి వాళ్ల భుజాలమీదికి వలయాలుగా తీసుకెళ్తోంది. ‘‘విన్సెంట్! నువ్వెప్పుడూ దేని గురించీ ముందుగానే కచ్చితమైన నిర్ణయానికి రాకూడదు. నీకు ఏది సరైందని తోస్తే దాన్ని పూర్తి చేసే ధైర్యం, బలం తెచ్చుకోవాలంతే. ఆ పని చెడిపోవచ్చు. కానీ నువ్వు కనీస ప్రయ్నత్నమైనా చెయ్యాలి. అదే ప్రధానం. మన బుద్ధికి మంచిదని అనిపించింది చెయ్యాలి. దాన్ని విలువకట్టే పనిని దేవుడికి వదిలేయాలి. ఏదో ఒక మార్గంలో ఈశ్వరసేవ చెయ్యాలని నీకు ఈ క్షణం గట్టిగా అనిపిస్తే, నీ భవిష్యత్తుకు విశ్వాసమొక్కటే దిక్సూచి. దానిపై భారం వెయ్యడానికి సందేహించకు..’’
‘‘మాటకు, నేను అర్హత సాధించానే అనుకోండి..’’
మెందెస్ కోస్తా
‘‘ఈశ్వరసేవకా?’’ మెందెస్ బిడియపు నవ్వుతో అడిగాడు.
‘‘కాదు, యూనివర్సిటీ తయారుచేసే పండితుడైన మతబోధకుడికి ఉండాల్సిన అర్హతను.’’
మెందెస్ విన్సెంట్ సమస్య గురించి లోతుగా మాట్లాడదల్చుకోలేదు. పైపై విషయాలను మాత్రమే తడిమి, నిర్ణయాన్ని అతనికే వదిలేయాలని అనుకుంటున్నాడు. ఇద్దరూ యూదుగుడి శ్మశానానికి చేరుకున్నారు.  సమాధులపై హిబ్రూ భాషలో శిలాఫలకాలు, బెర్రీ చెట్లు, అక్కడక్కడా ఎత్తుగా పెరిగిన పచ్చని గడ్డితో ఆ ప్రాంతం అతి మామూలుగా ఉంది.  కోస్తా కుటుంబానికి కేటాయించిన స్థలంలోని రాతి బెంచీపై కూర్చున్నారు ఇద్దరూ. విన్సెంట్ పైపు పక్కన పెట్టాడు. ఆ సమయంలో అక్కడికెవరూ రారు. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది.  
‘‘ప్రతి మనిషికీ నైతిక ధృతి అనేదొకటి ఉంటుంది విన్సెంట్. దాన్ని గుర్తిస్తే ఏ పనిచేసినా చక్కగా పూర్తవుతుంది. నువ్వు కళావ్యాపారిగానే ఉండిపోవాలనుకుంటే అది నీకు అందులో విజయం కట్టబెడుతుంది. మతబోధకుడివి కావాలనున్నా అంతే. నువ్వు ఏదో ఒక రోజు నిన్ను నువ్వు పూర్తిగా వ్యక్తీకరించుకుంటావు, నువ్వు దేన్ని ఎంచుకున్నప్పటికీ..’’
‘‘మతబోధక అర్హత సాధించడానికి నేను ఈ ఆమ్‌స్టర్‌దామ్‌లో ఉండకపోతేనేం?’’
‘‘ఆ సంగతి వదిలెయ్. నువ్వు తిరిగి ఇవాంజెలిస్టుగా లండన్‌కు వెళ్లిపో. లేకపోతే ఏదో ఒక కొట్టులో పనిచెయ్యి. అదీ కాకపోతే బ్రాబంత్ వెళ్లి పొలం దున్నుకుని బతుకు. కానీ, నువ్వేం చేసినా బాగా చెయ్యి. నిన్ను ఒక పూర్ణమానవుడిగా తీర్చిదద్దనున్న శక్తి ఎలాంటిదో నాకు తెలుసు, అది బహు దొడ్డది. జీవితంలో నువ్వు ఓడిపోయావని చాలాసార్లు అనుకోవచ్చు. కానీ అంతిమంగా నిన్ను నువ్వు వ్యక్తీకరించుకుంటావు. అది నీ జీవితాన్ని సార్థకం చేస్తుంది.’’
‘‘కృతజ్ఞతలండీ. మీ మాటలు భరోసా ఇస్తాయి..’’
మెందెస్ కాస్త కంపించాడు. రాతిబల్ల చల్లగా ఉంది. సూర్యుడు కడలికి ఆవల ఆస్తమిస్తున్నాడు. మెందెస్ లేచి, ‘‘విన్సెంట్, ఇక వెళ్దామా?’’ అన్నాడు.


6. ఆ మహాశక్తి ఎక్కడిది?

మరుసటి రోజు పొద్దుగూకే వేళ విన్సెంట్ కిటికీలోంచి యార్డును చూస్తూ ఉన్నాడు. చిన్నచిన్న కొమ్మలున్న సరుగుడు చెట్ల గుంపు బూడిదరంగు ఆకాశానికేసి మృదువుగా ఒదిగిపోయింది.  
‘‘చదువులో నేను వెనకబడ్డాను కనక లోకంలో నేనేందుకూ పనికిరాని వాడినా? తోటి మనిషిని ప్రేమించడానికి గ్రీకు, లాటిన్‌లతో పనేంటి?’’ విన్సెంట్ ప్రశ్నించుకున్నాడు.  
పెదానాన్న జొహానెస్ యార్డులో సైనికుల వరసలను తనిఖీ చేస్తున్నాడు. దూరంగా రేవులో తెరచాప కొయ్యలు కనిపిస్తున్నాయి. ‘అట్జే’ మహానౌక  ముందు ఎరుపు, బూడిద, నలుపు రంగుల చిన్నచిన్న సరుకు పడవలు మూగి ఉన్నాయి.  
‘‘నేను చెయ్యాల్సింది అసలైన భగవత్సేవే కానీ ఈ త్రికోణాలు, వృత్తాలు గీయడం కాదు కదా. పెద్ద చర్చీలు కావాలని, చక్కని బోధనలు చెయ్యాలని నేనెన్నడూ కోరుకోలేదు. నేను దీనదుఃఖిత జనావళి మనిషిని. ఈ క్షణమే వాళ్ల సన్నిధిలో ఉంటాను, మరో ఐదేళ్ల తర్వాత కాదు..’ అంతర్మథనం కొలిక్కి వస్తోంది.
ఇంతలో పనిముగిసినట్టు యార్డు గంట వెూగింది. కార్మికులు ప్రవాహంలా గేట్ల వద్దకు పరిగెత్తారు. దీపాలతను యార్డులో లాంతరు వెలిగించి పోయాడు. విన్సెంట్ కిటీకీ పక్కనుంచి కదిలాడు.
తండ్రి, జొహానెస్, స్ట్రీకర్‌లు తన కోసం ఏడాదిగా బెలెడు డబ్బు, సమయం వెచ్చించారు. ఇప్పుడు చదువును మధ్యలోనే వదిలేస్తే అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడతారు.  
తను చిత్తశుద్ధితో కష్టపడ్డాడు. కానీ రోజుకు ఇరవై గంటలకు మించి చదవలేడు. చదువుకు తను కచ్చితంగా పనికిరాడు. చాలా ఆలస్యంగా ప్రారంభించాడు, ఓడిపోయాడు. మరి, ఇవాంజెలిస్టుగా రేపే దేవుని బిడ్డలకు సేవచెయ్యడానికి వెళ్తే అదీ ఓటమే అవుతాందా? తను రోగులను బాగుచేసి, అలసినవాళ్లను ఊరటనచ్చి, పాపుల, అవిశ్వాసుల మనసును దేవుడివైపు మళ్లిస్తే.. అప్పటికీ ఓడిపోయినట్టేనా?
అవుననే అంటారు ఇంట్లో వాళ్లు. తను ఎన్నడూ బాగుపడడని, దేనికీ కొరగాడని, కృతఘ్నుడని, వ్యాన్గో వంశానికి కళంకం అని అంటారు.
‘‘నువ్వేం చేసినా బాగా చెయ్యి. అంతిమంగా నిన్ను నువ్వు వ్యక్తీకరించుకుంటావు. జీవితాన్నిసార్థకం చేసుకుంటావు’’ అని అన్నాడు కదా మెందెస్!  
అన్నీ తెలిసిన కే.. తనలో పొడసూపుతున్న సంకుచిత బోధకుడి లక్షణాలను ఇప్పటికే పసిగట్టింది. సత్యవాక్కు రోజురోజుకూ బలహీనమయ్యే ఆమ్‌స్టర్‌దామ్‌లోనే ఉండిపోతే తనూ అలాంటి బోధకుడే అయిపోతాడు. లోకంలో తనకు తగిన చోటేదో తనకు తెలుసు. అక్కడికెళ్లేందుకు మెందెస్ ధైర్యాన్ని నూరిపోశాడు. తనక్కడికి వెళ్తే తన కుటుంబం తనను నిందిస్తుంది. కాని అది సమస్యే కాదు. ఈశ్వరార్పణ సంకల్పబలం ముందు తన పిలీలిక అస్తిత్వం ఏపాటిది?  
విన్సెంట్ గబగబా బ్యాగు సర్దుకుని పెదనాన్న ఇంట్లోంచి బయటపడ్డాడు, వెళ్లొస్తానని ఒక్కమాట కూడా చెప్పకుండా. 

(మళ్లీ రేపు)

2 comments:

  1. ఈ భాగం చాలా స్పూర్తిగా ఉంది . మెందెస్ కోస్తా నిజమైన గురువు అనిపించారు.

    ReplyDelete
    Replies
    1. అవునండి. కోస్తా మాటల్ని రియల్ విన్సెంట్ తన లేఖల్లో చాలా చోట్ల ప్రస్తావిస్తాడు. మనం చెయ్యాల్సింది చెయ్యాలి, ఫలితాన్ని దేవుడికి వదలాలనన్నది ఒక రకంగా భగవద్గీత చెప్పినట్టు ఉంటుంది కాని, ఇక్కడ జనానికి, చరిత్రకు వదలాలి అని అర్థం చేసుకోవాలేమో. గొప్పకు కాదు కాని, ఈ అనువాదం మొదలెడుతున్నప్పుడు నాకూ విన్సెంట్ మాదిరే బోలెడు సందేహాలు..దీన్ని అనువదించే అర్హత నాకుందా, బాగా చెయ్యగలనా అని. కానీ నేను చెయ్యాల్సింది చేసి వదిలేయాలని అని ఈ ప్రయత్నం. మీరు ఓపిగ్గా చదివి స్పందించినందుకు చెప్పలేనన్ని ధన్యవాదాలు. అనువాదం కొన్నిచోట్ల గొట్టుగా అవుతున్నట్టు, ఉంది. సరిచేసుకుంటాను. మీకు ఇలాంటివి కనిపిస్తే కూడా చెప్పండి.

      Delete