Thursday, 15 October 2015

జీవన లాలస-7 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)
3. ‘పనికిమాలిన బోధకుడిలా మాట్లాడకు’


వ్యాన్గో స్వీయచిత్రం 


విన్సెంట్ రోజూ సూర్యోదయానికి ముందే లేచి  బైబిల్ చదువుతున్నాడు. ఉదయభానుడు ఐదు గంటలకు  పైకి రాగానే కిటికీ వద్ద నిల్చుని నేవీ యార్డును, గేట్ల గుండా చీమలబారుల్లా వచ్చే కార్మికులను చూస్తున్నాడు.  అప్పటికి జీదర్ జీ అఖాతంలో చిన్నచిన్న పొగ ఓడలు ఓడలు వస్తూ పోతూ ఉంటాయి. దూరంగా వైయ్  గ్రామం దగ్గర వేగంగా వెళ్లే  పడవల  గోధుమరంగు తెరచాపలూ కనిపిస్తుంటాయి.  
సూర్యుడు పూర్తిగా ఉదయించి, పొగమంచును తుడిచి పెట్టేశాక విన్సెంట్ కిటికీ పక్క నుంచి కదులుతాడు. బ్రెడ్డుముక్క, గ్లాసు బీరుతో అల్పాహారం ముగించి కుర్చీలో కూలబడి ఏడు గంటలపాటు గ్రీకు, లాటిన్లతో కుస్తీపడతాడు. నాలుగైదు గంటలు ఏకాగ్రతతో చదివాక తల భారమవుతుంది. బుర్ర పనిచేయదు. ఇన్నేళ్ల మనోవ్యథ తర్వాత తను చదువును సజావుగా పూర్తి చేయగలనా అని సందేహం పీడిస్తుంది. లోకసాక్షి మధ్యాహ్నం తర్వాత దిక్చక్రం ఆవలిపైపుకు జారేంతవరకు పాఠాలను బుర్రలోకి తోసుకుంటాడు. అప్పటికి మెందెస్ కోస్తా వద్ద పాఠానికి వెళ్లే సమయమవుతుంది. వూడెజిద్స్ చర్చి ఉన్నబీతెన్కాంట్ రోడ్డు, పాత దక్షిణాది చర్చిల మీదుగా.. కొలుములు, పీపాల కర్మాగారాలు, లితోగ్రాఫుల దుకాణాలుండే వంకర సందుగొందుల గుండా యూదుల బస్తీకి వెళ్తాడు.
రూయ్ పెరే‘క్రీస్తు మార్గానుసరణ 
మెందెస్ను చూస్తే విన్సెంట్కు రూయ్ పెరే వేసిన ‘క్రీస్తు మార్గానుసరణ చిత్రం గుర్తుకొస్తుంది. లోతైన కళ్లు, ఆధ్యాత్మికత ఉట్టిపడే చిన్న ముఖం, పాతకాలం యూదు మతగురువుల కొనదేలిన మెత్తటి గుబురు గడ్డంతో యూదు రూపానికి ప్రతినిధిలా ఉంటాడు మెందెస్. మధ్యాహ్నం యూదుల బస్తీ ఉక్కగా ఉంటుంది. గ్రీక్, లాటిన్లతో ఏడు గంటల కుస్తీ,  మరికొన్ని గంటలు డచ్చి చరిత్ర, వ్యాకరణంతో అలసిపోయాక విన్సెంట్  మెందెస్ వద్ద ఉన్న లితోగ్రాఫుల గురించి ముచ్చటిస్తాడు.  
మారిస్ వేసిన క్రీస్తు బాప్తీస్మం లితోగ్రాఫును ఓ రోజు గురువు దగ్గరికి పట్టుకొచ్చాడు శిష్యుడు. మెందెస్ దాన్ని తన బక్కపల్చని వేళ్లతో పట్టుకుని ఎత్తైన గవాక్షంలోంచి వస్తున్న వెలుగులో పరిశీలించాడు. ‘‘చాలా బావుంది. విశ్వజనీన ధర్మపు చిదాత్మ ఏదో ఇందులో ఉంది’’ బొంగురు గొంతుకతో మెల్లగా అన్నాడు.
ఆ మాటతో విన్సెంట్ కు పాఠాల అలసట క్షణంలో మాయమైంది. మారిస్ కళానైపుణ్యం గురించి వైనవైనాలుగా వర్ణించడం మొదలుపెట్టాడు. మెందెస్ కు దిక్కుతోచక బుర్ర గోక్కున్నాడు. విన్సెంట్ కు గ్రీకు, లాటిన్ నేర్పాలని కదా స్ట్రీకర్ అతనికి భారీ మొత్తంలో డబ్బిస్తోంది!
‘‘విన్సెంట్.. నువ్వు చెప్పేది నిజమే. మారిస్ చిత్రాలు చాలా బావుంటాయి. అయితే మనకు సమయం పెద్దగా లేదు. ఇక పాఠం మొదలెడదామా?’’
విన్సెంట్కు అర్థమైంది. అలా  మెందెస్ వద్ద  రోజూ రెండు గంటల పాఠం ముగిశాక ఇంటిదారి పడతాడు. కట్టెలు కొట్టేవాళ్ల, వడ్రంగుల, కళాసీలకు భోజం అమ్మేవాళ్ల ఇళ్ల ముందుగా వెళ్తాడు. చోట నేలమాలిగలో చీకటి గుయ్యారంలాంటి మద్యం నిల్వ దుకాణం తలుగుతుంది. దీపాలు పట్టుకున్న హమాలీలు లోనికీ బయటికీ బిలబిలా వెళ్తుంటారు.
పెదనాన్న జొహానెస్ వారం పాటు పనిపై ఏదో ఊరికెళ్లాడు. ఇంట్లో విన్సెంట్ ఒక్కడే ఉన్నాడు. అతనికేమీ తోదని కే భర్తతో కలసి ఓ రోజు అక్కడికొచ్చి మధ్యాహ్నం భోజనానికి తమ ఇంటికి రావాలని చెప్పింది.  
‘‘జాన్ గారు వచ్చేంతవరకు నువ్వు రోజూ రాత్రి భోజనానికి మా ఇంటికే రావాలి. అలాగే ప్రతి ఆదివారమూ ప్రార్థన తర్వాతా భోజనానికీ మా ఇంటికే రావాలని అమ్మ గట్టిగా చెప్పిది’’ అంది కే.  
రోజు స్ట్రీకర్ ఇంట్లో భోజనాలు ముగిశాక పేకాట మొదలైంది. విన్సెంట్కు ఆడ్డం రాదు కనక ఓ మూల కూర్చుని అగస్త్ గ్రూసన్ రాసిన క్రూసేడ్ల చరిత్ర పుస్తకం చదువుకుంటున్నాడు. అక్కడి నుంచి కే బాగా కనిపిస్తోంది. చురుగ్గా కదులుతూ, కవ్వింపు నవ్వులు రువ్వుతోంది. ఆమె ఆట ఆపి అతని చెంతకొచ్చింది, ‘‘ఏం చదువుతున్నావు విన్సెంట్?’’ అంటూ.
అతడు చెప్పాడు. ‘‘ఇది చాలా మంచి పుస్తకం. అచ్చం థై మారిస్ కళాహృదయంతో రాసిందని బల్లగుద్ది చెప్పగలను’’ మాటలో ఉద్వేగం.
ఆమె నవ్వి, ‘‘ఎలా?’’ అని అడిగింది. అతడు తరచూ ఇలాంటి చిత్రమైన విషయాలు చెబుతుంటాడని.
‘‘ఇది చదువు. మారిస్ వేసిన కేన్వాస్ గుర్తుకు రాకపోతే అడుగు. కొండపై పాత కోటను, సంజెవేళలో ఆకురాలు అడవిని, ముందుపక్క రేగడి పొలాలను, తెల్లగుర్రానికి నాగలికట్టి దున్నుతున్నరైతునూ రచయిత వర్ణిస్తున్నాడు.’’
కే చదువుతుండగా విన్సెంట్ ఆమె కోసం కుర్చీ పట్టుకొచ్చాడు. ఆమె అతణ్ని సాలోచనగా చూసింది. కళ్లు మరింత నీలమయ్యాయి.
‘‘అవును, ఈ వర్ణన అచ్చం మారిస్ చిత్రంలాగే ఉంది. రచయితా, చిత్రకారుడూ ఒకే భావాన్ని వ్యక్తం చేయడానికి తమతమ సామగ్రిని వాడుకున్నారు.’’
విన్సెంట్ చప్పున ఆమె చేతుల్లోంచి పుస్తకం అందుకుని, గబబగా ఓ పేజీ వెతికి ఓ వాక్యం చూపాడు.
‘‘ఇది నేరుగా మిషెల్ నుంచి, కార్లయిల్ నుంచి తీసుకున్నాడు.’’
‘‘విన్సెంట్, నువ్వు బడికెళ్లింది తక్కువే అయినా చాలా విషయాలు తెలుసుకున్నావు సుమా. పండితునివైపోయావు. ఇప్పుడూ పిచ్చిగా పుస్తకాలు చదువుతున్నావా?’’
‘‘లేదు. చదవాలని ఉన్నా చదవలేను. నాకు వాటి అవసరం ఎంతమాత్రమూ  లేదు. నాకు కావలసిన సర్వస్వం క్రీస్తు వాక్యంలోనే ఉన్నాయి. అది మిగతా పుస్తకాలకంటే పరిపూర్ణమైందీ, సుందరమైందీ...’’
కే నివ్వెరపోయింది.
‘‘విన్సెంట్ ఏంటీ మాటలు? నువ్వు నువ్వేనా?’’
విన్సెంట్ కూడా ఆమెను విస్మయంతో చూశాడు.
‘‘నువ్వు ఇలా పనికిమాలిన పల్లెటూరి బోధకుడిలా మాట్లాడుతున్నప్పటికంటే..  క్రూసేడ్ల చరిత్ర పుస్తకంలో మారిస్ను దర్శించినప్పుడే ఎంతో బావున్నావు కే.. అలాంటి తుచ్ఛ విషయాలపైన మనసుపెట్టొద్దని భగవంతుడు చెప్పినప్పటికీ’’ అన్నాడు కోపంగా.  
ఇంతలో కే భర్త వోస్ అటు వచ్చి, ‘‘కే, నీ వంతు పేకముక్క వెయ్యాలి’’ అని అన్నాడు.
నిప్పుకణికల్లా మండుతున్న విన్సెంట్ కళ్ల వంక కే ఒక క్షణం చూసి, భర్త చెయ్యి అందుకుని వెళ్లి ఆటకు కూర్చుంది.


4. లాటినూ, గ్రీకూ

జీవిత సూత్రాల గురించి తనతో చర్చించడమంటే విన్సెంట్ కు ఎంతో ఇష్టమని మెండెస్ కు  అర్థమైంది. అందుకే పాఠం అయిపోయాక ఏదో ఒక మిషతో అతనికి తోడుగా నగరంవైపు తనూ కొంత దూరం వస్తున్నాడు.
ఓ రోజు అతడు విన్సెంట్ ను ఆసక్తిగొలిసే నగరశివారు గుండా తీసుకెళ్లాడు. అది ఓ పార్కు నుంచి రైల్వే స్టేషన్ వరకు విస్తరించిన ప్రాంతం. కోతమిల్లులు, ఇళ్లముందు పెరళ్లున్న కార్మికుల గుడిసెలు, జనసమ్మర్దంతో బిలబిలమంటోంది. బస్తీ మధ్య నుంచి చిన్నిచిన్న కాలువలు పోతున్నాయి.
మెండెస్ కోస్తా
‘‘ఇలాంటి బస్తీలో బోధకుడిగా పనిచేయడం చాలా బావుంటుంది’’ శిష్యుడు అన్నాడు.
‘‘అవును. దేవుడి అవసరం, మతం అవసరం ఆ ఎగువ ఊళ్లోని మన స్నేహితులకంటే వీళ్లకే ఎక్కువ’’ మెందెస్ పైపులో పొగాకు నింపుకుని, పొగాకు సంచిని విన్సెంట్ కు ఇస్తూ బదులిచ్చాడు.
జపాన్ వంతెనలా విల్లులా వంగిన వంతెన దాటుతున్నారు.
విన్సెంట్ ఆగిపోయాడు, ‘‘అంటే, మీరనేది..?’’ అంటూ.
‘‘అవును విన్సెంట్. ఈ కష్టజీవుల బతుకులు దుర్భరం. రోగమొస్తే డాక్టరు దగ్గరికెళ్లడానికి డబ్బులుండవు. రేపటి తిండిని ఈ రోజు కష్టంతో సంపాయించుకోవాలి. అది బండ కష్టం. ఇక ఇళ్లు.. నువ్వే చూశావుగా ఎంత చిన్నవో, ఎంత పేదవో. వీళ్లకెప్పుడూ దేనికీ కొరతే. బతుకుతో ఎప్పుడూ యుద్ధమే. కాసింత ఊరట కోసం వీళ్లకు దైవచింతన కావాలి.’’
విన్సెంట్ పైపు వెలిగించుకుని అగ్గిపుల్లను వంతెన కింది కాలువలో పడేశాడు. ‘‘మరి ఆ ఎగువ ఊళ్లోని వాళ్ల సంగతి?’’
‘‘వాళ్లకు మంచిబట్టలు, భద్రమైన ఉద్యోగాలు, ఇబ్బందులొస్తే ఎదుర్కోవడానికి బోల్డంత డబ్బు ఉన్నాయి. వాళ్ల  వాళ్ల దృష్టిలో దేవుడి రూపం వేరు. అతడు భాగ్యశాలి, బహు దొడ్డమనిషి. తన సృష్టించిన లోకం చూడముచ్చటగా సాగుతోందని అమితానందం పొందుతుంటాడు.’’
‘‘మొత్తానికి వాళ్లు ఒట్టి పనికిమాలినవాళ్లు.’’
‘‘లేదు బాబూ, నేనలా అనలేదు.’’
‘‘మీరనలేదు, నేనన్నాను.’’
విన్సెంట్ రాత్రి తన గ్రీకు పుస్తకాన్నింటిని ముందు పరచుకున్నాడు. గోడకేసి తదేకంగా చాలాసేపు చూస్తుండిపోయాడు. లండన్ మురికివాడలు, అక్కడి జనాల దుర్భర దారిద్ర్యం, ఈతిబాధలు గుర్తుకొచ్చాయి. అలాంటి వాళ్లను ఆదుకోవడానికి ఇవాంజెలిస్టు కావాలన్నఆశయం ఉధృతమవుతోంది. ఆలోచన స్ట్రీకర్ చర్చిపైకి మళ్లింది. అక్కడికొచ్చే వాళ్లందరూ ధనవంతులు. జీవితసుఖాలను సులువుగా చవిచూడగల సమర్థులు.  స్ట్రీకర్ బోధనలు చక్కగా  ఉంటాయి, ఊరటనిస్తాయి. కానీ అక్కడికొచ్చేవాళ్లలో ఊరట ఎవడిక్కావాలి?
విన్సెంట్ ఆమ్స్టర్దామ్కొచ్చి ఆరు నెలలైంది.  చివరకు అతనికి ఒక విషయం మెల్లగా అర్థం అవుతోంది. సహజ ప్రతిభకు కఠినశ్రమ సరితూగదని. భాషాశాస్త్ర పుస్తకాలను పక్కన పడేపి, ఆల్జీబ్రా పుస్తకాలను తెరిచాడు. అర్ధరాత్రి గడుస్తుండగా జాన్ లోకొచ్చాడు.
‘‘విన్సెంట్ ఇంకా పడుకోలేదా? దీపం చూసి వచ్చి వచ్చాను. నువ్వు రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు యార్డులో తిరుగుతుండగా చూశానని కాపలావాడు చెప్పాడు. నువ్వు రోజుకెన్ని గంటలు చదువుతున్నావు?’’
‘‘ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు.’’
‘‘ఇరవై!’’ జొహానెస్ తలాడించాడు నమ్మలేనట్టు. వ్యాన్గో కుటుంబం మనుషులు ఓడిపోవడమన్న ఊహే అతనికి జీర్ణం కాదు.
‘‘అన్ని గంటలు చదవక్కర్లేదు.’’
‘‘కానీ, నా పని త్వరగా పూర్తవాలి, పెదనాన్నా.’’
పెద్దాయన కనుబొమలు పైకి లేచాయి. ‘‘నీ మాట కాదనడం లేదు. కానీ నీ బాగోగులు చూసుకుంటానని నీ తల్లిదండ్రులకు మాట ఇచ్చాను. చదివింది చాలు, ఇక పడుకో. ఇకపై ఇప్పుడూ ఇలా అర్ధరాత్రి, అపరాత్రి వరకు చదవకు.’’
విన్సెంట్ పుస్తకాలు మూసేశాడు. అతనికి నిద్ర అక్కర్లేదు. ప్రేమా, దయా, సుఖమూ అక్కర్లేదు. కావాల్సిందల్లా గ్రీకు, లాటిన్, అల్జీబ్రా, వ్యాకరణం నేర్చుకోవడమే.. పరీక్షల్లో గట్కెక్కి, యూనివర్సిటీలో చేరి, మతబోధకుడు కావడానికి; లోకంలో అసలైన దైవకార్యాన్ని నెరవేర్చడానికి.


(మళ్లీ రేపు..)No comments:

Post a Comment