Tuesday, 13 October 2015

జీవన లాలస-6 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)

బోరినాజ్ అధ్యాయం 

విన్సెంట్ వేసిన ఆమ్ స్టర్ దామ్ రేవు చిత్రం 


 1.ఆమ్ స్టర్ దామ్
విన్సెంట్ పెదనాన్న జొహానెస్ 
డచ్చినౌకాదళ అత్యున్నతాధికారి వైస్ అడ్మిరల్ జొహానెస్ వ్యాన్గో ప్రభుత్వం తనకు అద్దెలేకుండా ఇచ్చిన సువిశాలమైన ఇంటి ముందు వరండాలో నిల్చుని ఎదురుచూస్తున్నాడు. ఆ ఇల్లు నేవీ యార్డు వెనకతట్టు ఉంది. తమ్ముడి కొడుకును హుందాగా ఆహ్వానించేందుకు దళపతి దుస్తులు వేసుకుని, భుజాలపై సరిగె కుచ్చులు తగిలించుకున్నాడు జాన్. పెద్ద గడ్డం,  కనుబొమలను కలుసుకుంటున్న బలమైన పొడవాటి ముక్కుతో వ్యాన్గో వంశ ప్రతీకలా ఉన్నాడు. 
‘‘నువ్వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది విన్సెంట్. ఇల్లంతా బోసిగా, ప్రశాంతంగా ఉంది చూడు, పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు కదా..’’ అన్నాడు పెదనాన్న.
ఇద్దరూ వెడల్పాటి మెట్లెక్కి మేడమీదికి వెళ్లారు. జొహానెస్న్ గది తలుపు తీయగా విన్సెంట్ లోనికెళ్లి బ్యాగు కింద పెట్టాడు. పెద్ద కిటికీలోంచి నేవీ యార్డు కనిపిస్తోంది. జొహానెస్ మంచంలో కూర్చున్నాడు. దర్పం లేకుండా మామూలుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
‘‘నువ్వు మతవిద్య చదవాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందబ్బాయ్. వ్యాన్గోల వంశంలో ఎవరో ఒకరు ఎప్పుడూ ఈశ్వరసేవ చేస్తుంటారు..’’
విన్సెంట్ పైపు అందుకుని పొగాకును జాగ్రత్తగా కూరాడు. ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాల్సినప్పుడు అతడలా చేస్తుంటాడు. ‘‘పెదనాన్నా.. నాకు ఇవాంజెలిస్టును కావాలని ఉంది. ఆ సంగతి మీకూ తెలుసు. నేను బోధన మాత్రమే కాదు, పని కూడా చేస్తాను.‘‘
‘‘వద్దు, విన్సెంట్. ఇవాంజెలిస్టులకు అక్షరమ్ముక్కరాదు. వాళ్లు బోధించే కూలగూరగంప మతమేంటో ఆ దేవుడికే తెలియాలి. వ్యాన్గో మతబోధకులందరూ పట్టభద్రులు. ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు సామాన్లు సర్దుకుని,  భోజనాని కూర్చోవాలి. ఎనిమిదింటికి.’’
జాన్ వెళ్లిపోయాడు. విన్సెంట్ ముఖంలో విచారం అలముకుంది. చుట్టూ చూశాడు. పడక పెద్దగా, సౌకర్యంగా ఉంది. బీరువా కూడా పెద్దదే. స్టూలు నున్నగా అందంగా ఉంది. అయినా తనకేదో ఇబ్బందిగా, కొత్తవాళ్ల ముందున్నట్టు ఉంది. చప్పున టోపీ పెట్టుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు. వేగంగా నడుస్తూ బజార్లో ఓ యూదు నడుపుతున్న పుస్తకాల కొట్టు ముందు వాలాడు. పెద్ద పెట్టెలో అందమైన ప్రింట్లు(పోస్టర్ల వంటి చిత్రాలు) ఉన్నాయి. విన్సెంట్ వెతికివెతికి పదమూడింటిని కొన్నాడు. ప్రింట్ల కట్టను చంకలోపెట్టుకుని రేవు వెంబడి ఘాటైన తారు వాసన పీలుస్తూ ఇంటికి చేరుకున్నాడు.  
గోడలకు అతికించిన మఖ్మల్ గుడ్డలకు ప్రింట్లను గుచ్చుతుండగా రివరెండ్ స్ట్రీకర్ లోనికొచ్చాడు. స్ట్రీకర్ భార్యా, విన్సెంట్ తల్లీ అక్కాచెల్లెళ్లు. స్ట్రీకర్ ఆమ్‌స్టర్‌దామ్‌లో పేరున్న మతబోధకుడు, పండితుడు. ఖరీదైన నల్లకోటులో వచ్చాడు. పలకరింపులయ్యాయి.
రివరెండ్ స్ట్రీకర్ 

‘‘ప్రాచీన భాషల్లో పండితుడైన మెండెస్ కోస్తా నీకు లాటిన్, గ్రీకు నేర్పేందుకు ఏర్పాట్లు చేశాను. ఆయన ఇల్లు యూదుల బస్తీలో ఉంది. సోమవారం మధ్యాహ్నం మూడింటికి అక్కడే తొలిపాఠం. నువ్వు ఆదివారం భోజనానికి మా ఇంటికి రావాలి. మీ పిన్నీ, అమ్మాయి కే నీ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు.‘‘
‘‘సంతోషంగా వస్తాను. ఎన్నింటికి రమ్మంటారు?’’
‘‘మధ్యాహ్నం నా ప్రార్థన అయ్యాక..’’
‘‘ఇంట్లో వాళ్లను అడిగినట్టు చెప్పండి.’’
స్ట్రీకర్ టోపీ, బ్యాగు తీసుకుని రేపు కలుద్దామని వెళ్లిపోయాడు.2. కే
స్ట్రీకర్ అమ్‌స్టర్‌దామ్ కులీనుల వీధుల్లో ఒకటైన కీజర్‌గ్రాస్త్ లో ఉంటున్నాడు. ఓడరేవుకు దక్షిణం వైపు నుంచి మొదలయ్యే కాలువ ఆ వీధిని చుడుతూ ఉత్తరంవైపు వెళ్లి మళ్లీ రేవును తాకుతోంది. కాలువ నీళ్లు తేటగా ఉన్నాయి.  అయితే అదే కాలువ పేదల బస్తీల్లో శతాబ్దాల తరబడి పేరుకుపోయిన గుర్రపుడెక్క, నానా రకాల మార్మికపు పాచితో కుళ్లిపోతుంటుంది.
కీజర్‌గ్రాస్త్ ఇళ్లు పక్కా ఫ్లెమిష్ వాస్తుశైలివి. తక్కువ వెడల్పుతో పొడవుగా బలంగా, ముచ్చటైన సైనికుల్లా పక్కపక్కనే బారులు తీరి ఉన్నాయి.
విన్సెంట్ ఆదివారం చర్చిలో స్ట్రీకర్ బోధన విని, ఆయన ఇంటికి అనుకున్న సమయానికంటే  చాలా ముందుగానే బయల్దేరాడు. బూడిదరంగు మేఘాలను చండమార్తాండుడు చెదరగొడుతున్నాడు. విన్సెంట్ మెల్లగా నడుస్తూ, కాలువలో నీటివాలుకు ఎదురుగా వెళ్తున్న పడవలను చూస్తున్నాడు. అవి పెద్ద ఇసుక పడవలు. లోతైన అరలతో, పొడవుగా ఉన్నాయి.  ఏళ్లతరబడి నీళ్లలో ఉండడంతో నల్లబారాయి. ఒకదానిపై ముందుకొస నుంచి వెనకకొస దాకా తాళ్లపై బట్టలు ఆరేశారు. ఆ పడవ మనిషి బురదనీటిలో చెమడోటోతూ తెడ్డేస్తున్నాడు. భార్య పడవ చివర్లో కూర్చుని చిన్న తెడ్డేస్తూ సాయపడుతోంది. పిల్లలు కుక్కతో అడుకుంటూ మాటిమాటికీ లోపలి అరలోకి దూరుతున్నారు.
స్ట్రీకర్ ది మూడంతస్తుల కోసు కప్పు ఇల్లు. గచ్చుతో పుష్పాకృతులను తీర్చిదిద్దారు. ద్వారంపై ఉన్న అటకగది కిటికీలోంచి దండెను వేలాడదీసి దాని చివర ఒక ఇనుప కొక్కేన్ని తగిలించారు.  
విన్సెంట్ పిన్ని విలెమినా
పిన్ని విలెమినా విన్సెంట్‌ను ఆహ్వానించి భోజనాల గదిలోకి తీసుకెళ్లింది. ఆరీ షెఫర్ వేసిన ప్రొటెంస్టంటు సంస్కర్త కాల్విన్ చిత్రం గోడకు వేలాడుతోంది. అలమారాలో వెండిపాత్రలు మెరిసిపోతున్నాయి. గోడలకు ముదురురంగు చెక్క పలకలు అతికించారు.
విన్సెంట్‌ అక్కడి మసక్కి అవాటుడుతుండగా నీడల్లోంచి పొడవాటి బక్కపల్చని యువతి వచ్చి ఆప్యాయంగా పలకలరించింది.
‘‘నేనెవరో నీకు తెలియపోవచ్చు. నేను నీ దాయాదురాలిని, కేను.’’
విన్సెంట్ ఆమె చేయి అందుకున్నాడు. చాలా నెలల తర్వాత మృదువైన, నునువెచ్చని యువతి దేహస్పర్శ.
‘‘మనమెప్పుడూ కలుసుకోలేదు. నాకు ఇరవై ఆరేళ్లొచ్చినా మనం ఇంతవరకూ కలుసుకోకపోవడం చిత్రంగా లేదూ? నీ వయసు కూడా..’’ ఆత్మీయంగా అంటోంది.
విన్సెంట్ బదులివ్వడం మరచిపోయి ఆమెకేసి మౌనంగా చూస్తుండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, మందబుద్ధిని కప్పిపుచ్చుకునే కంగారులో,
‘‘ఇరవై నాలుగు. నీకంటే చిన్న’’ అని అరిచినట్టు చెప్పాడు.
‘‘అవును. మనం కలుసుకోకపోవడంలో వింతేమీ లేదు. నువ్వెప్పుడూ ఆమ్‌స్టర్‌దామ్‌కు రాలేదు, నేనూ బ్రాబంత్ కు రాలేదు. అయ్యో, నా మతిమండా.. నువ్వింకా నిల్చునే ఉన్నావు, కూర్చో.!’’  
అతడు కూర్చున్నాడు. తనను పల్లెటూరిబైతు నుంచి హఠాత్తుగా మహానాగరికుడిగా మార్చిన వింత ప్రవర్తన,  తొట్రుపాటుతో పెదవి విప్పాడు.
‘‘అమ్మకు నిన్ను చూడాలని కోరిక. బ్రాబంత్ నీకు బాగా నచ్చుతుంది. అక్కడి పల్లెలు చాలా బావుంటాయి.’’
‘‘తెలుసు. రమ్మని పెద్దమ్మ చాలాసార్లు రాసింది. త్వరలోనే కచ్చితంగా వస్తాను.’’
‘‘వస్తానూ కాదు, వచ్చి తీరాలి.’’
ఆ యథాలాపపు కబుర్లకు అతని మనసులో ప్రాధాన్యం లేదు. సుదీర్ఘ బ్రహచర్యంతో విసుగెత్తిపోయిన అతని మనసు ఆమె సౌందర్యాన్ని తనివితీరా అభిషేకిస్తోంది.  
కొడుకుతో కే 
కే రూపురేఖలు డచ్చి యువతుల మాదిరే  కొట్టొచ్చినట్టు ఉన్నాయి. కాకపోతే అందమైన కొలతల కోసం కాస్త చెక్కేసినట్టు కనిపిస్తాయి. కురులు మొక్కజొన్న కంకిలా పచ్చగానూ కాకుండా,  డచ్చి ఆడవాళ్ల కురుల్లా ఎర్రగానూ కాకుండా,  ఆ రెండూ కలసిన వర్ణంలో చిత్రంగా ఉన్నాయి. ఒక వర్ణజ్వాల, మరో వర్ణజ్వాలో కలసిపోయనట్టు. ఆమె అసూర్యంపశ్య. గడ్డం మీది తెల్లనిఛాయ ఎర్రటి బుగ్గలపైకి పాకి,  డచ్చి చిత్రకారుడికి కళానైపుణ్యాన్ని గుర్తుకు తెస్తుంది. ముదురు నీలివన్నె కళ్లు జీవితానందంతో నృత్యం చేస్తున్నాయి. నిండైన పెదాలు కాస్త తెరచుకుని ఆహ్వనిస్తున్నట్టు ఉన్నాయి.  
కే విన్సెంట్ మౌనాన్ని గమనించి, ‘‘ఎమిటో ఆలోచిస్తున్నావు? పరధ్యానమా?’’ అంది.
‘‘రెంబ్రాంత్ నిన్ను చిత్రించడానికి తెగ సంబరపడిపోయి ఉండేవాడు కదా అని ఆలోచిస్తున్నాను.’’
ఆమె మధురంగా నవ్వింది.
‘‘రెంబ్రాంత్‌కు ఆ అనకారి బామ్మల బొమ్మలు వెయ్యడమంటేనే ఇష్టం కదా!’’
‘‘అలా అనకు. అతడు అందమైన ముసమ్మల బొమ్మలు వేశాడు. వాళ్లు పేదరాళ్లు, దుఃఖితులు. కానీ, దుఃఖంతోనే వాళ్లు ప్రాణవంతులయ్యారు.’’
కే విన్సెంట్ ను ఇప్పుడు తొలిసారి నిజంగా చూసింది. అతడు ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు యథాలాపంగా చూసింది. పెద్ద తలకాయ, ఎర్రటి పీచుజట్టును మాత్రమే గమనించింది. కానీ ఇప్పుడు అతని పెద్ద నోటిని, లోతైన మండేకళ్లను, వ్యాన్గోల తీరైన నుదురును, పొడుచుకొచ్చిన బలమైన గడ్డాన్ని దర్శించింది.

‘‘నా మూర్ఖత్వానికి క్షమించు’’ మెల్లగా అంది కే. ‘‘రెంబ్రాంత్ గురించి నువ్వేమంటున్నావో నాకర్థమైంది. ముఖంలో వేదనా, ఓటమీ గూడుకట్టుకున్న ఆ బాధామయులను చిత్రించేటప్పుడు అతడు సౌందర్యపు అసలు సారాన్ని గ్రహించాడు కదూ!’’
ఇంతలో స్ట్రీకర్ హాల్లోకి వస్తూ, ‘‘ఏంటి పిల్లలూ.. చాలా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు?’’ అని అడిగాడు.
‘‘మేం బాగా కలిసిపోయాం నాన్నా. ఇంత మంచి బంధువు ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు మీరు?‘‘
గదిలోకి మరో యువకుడు వచ్చాడు. సన్నగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. ముఖంలో చిర్నవ్వు. కే కుర్చీలోంచి లేచి అతణ్ని ముద్దాడింది.
‘‘ఇతను మా దాయాది విన్సెంట్. విన్సెంట్, ఇతను నా భర్త వోస్’’ కే పరిచయం చేసింది.
లోపలికెళ్లి రెండేళ్ల పిల్లాడిని ఎత్తుకొచ్చింది. వాడు రేగిన జుట్టుతో చలగ్గా చూస్తున్నాడు. కళ్లు అచ్చం వాళ్ల మ్మ కళ్లలా నీలం రంగువి. కే వాడిని కిందికి దించింది. వోస్ భార్య, కొడుకు భుజాలపై చేతులు వేశాడు.
‘‘విన్సెంట్, నా పక్కన కూర్చోరాదూ!’’ పిన్ని విలెమినా అంది.
కే విన్సెంట్ కు ఎదురుగా.. భర్తకు, తండ్రికి మధ్యలో కూర్చుంది. భర్త వచ్చాక ఆమె దాయాది సంగతే మరచిపోయింది. బుగ్గలు మరింత ఎరుపెక్కాయి. భర్త తన చెవిలో ఏదో గుసగుసగా చెప్పగానే, చప్పున అతని ఎదపై వాలి ముద్దుపెట్టుకుంది.
ఆ దంపతుల ప్రేమోధృత కెరటాలు విన్సెంట్‌ను ముప్పిరిగొన్నాయి. లండన్ లో లోయర్ల ఇంట ఆ విషాద ఆదివారం తర్వాత.. తొలిసారిగా ఏవేవో రహస్యమయ మూలాల నుంచి ఉర్సులా కోసం పురావ్యథ పెల్లుబికి, అతని మనోదేహాల ప్రాకారాలను ముంచెత్తింది. కళ్లెదుటి ఆ అనురాగపూరిత చిన్న కుటుంబం అతనికి తాను ప్రేమదాహంతో నెలల తరబడి అల్లాడిపోతున్న సంగతిని, ఆ దాహం అంత సులువుగా నశించేది కాదన్న సంగతిని ఎరుకకు తెచ్చింది.
(మళ్లీ రేపు..


No comments:

Post a Comment