Monday, 12 October 2015

జీవన లాలస-5 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)విన్సెంట్  స్వీయ చిత్రం 
7. రామ్స్ గేటూ, ఐజల్ వర్తూ..

చుట్టూ ఇనుప కంచె ఉన్న సువిశాల పచ్చిక మైదానం మధ్యలో ఉంది స్టోక్స్ బడి. అందులో పది నుంచి పద్నాలుగేళ్ల వయసున్న ఇరవై నాలుగుమంది పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఫ్రెంచి, జర్మన్, డచ్చి భాషలు నేర్పడం, బడి వదిలాక వాళ్లపై ఓ కన్నేసి ఉంచడం, శనివారం వారాంతపు స్నానాల్లో సాయపడ్డం విన్సెంట్ పని.  ఫ్రతిఫలం భోజనం, బస. జీతం సున్నా.
రామ్స్ గేట్ విచారగ్రస్త ప్రాంతం. అతని మానసిక స్థితికి అతికినట్టు సరిపోయింది. అనుకోకుండా ఆత్మీయుడిలా తన బాధను వర్ధిల్లజేసుకోడానికి అక్కడికొచ్చాడు, ఉర్సులాను ఆలోచనల్లో నిరంతరం దగ్గరుంచుకుంటూనే.  తను తాను వలచిన మనిషి చెంతలేనప్పుడు ఎక్కుడున్నా ఒకటేగా. తనకూ, ఉర్సులా తన మనోదేహాల్లో నింపిన భారమైన సంతుష్టికీ మధ్య ఎవరూ అడ్డురాకూడదనే అతని కోరిక.
‘‘నాకు కొంత డబ్బిస్తారా? కాస్త పొగాకు, బట్టలు కొనుక్కోవాలి’’ విన్సెంట్ ఓ రోజు స్టోక్స్ ను అడిగాడు.
‘‘ఇవ్వను, ఇచ్చే ప్రసక్తే లేదు. నేను టీచర్లకు తిండి, బస మాత్రమే ఇస్తాను. వాటికే వాళ్లను తెచ్చుకోగలను’’ తేల్చేశాడు స్టోక్స్.


ఐజల్ వర్త్ లో వ్యాన్గో నివసించన ఇల్లు
విన్సెంట్ రామ్స్ గేట్ కు వచ్చాక తొలి శనివారం ఉదయమే లండన్ కు బయల్దేరాడు. సుదూరపు నడక. సాయంత్రం దాకా ఒకటే ఉక్క పోసింది. కాంటర్బరీ చేరుకున్నాక, మధ్యయుగాల నాటి చర్చి చుట్టూ ఉన్న పురాతన వృక్షాల నీడలో కాసేపు సేదదీరాడు. మళ్లీ కొంతదూరం నడిచి ఓ చిన్న చెరువు పక్కన తవిసె చెట్ల కిందికి చేరాడు. వేకువజామున నాలుగు గంటలదాకా నిద్రపోయాడు. పక్షులు కువకువమంటూ లేపాయి. మధ్యాహ్నానికి చాతామ్ చేరాడు. దూరంగా వరదలో మునిగిన బయళ్లకు ఆవల థేమ్స్ నది నౌకలతో నిండుగా కనిపించింది. సాయంత్రం అవుతుండగా తనకు చిరపరిచితమై లండన్ శివార్లకు చేరుకున్నాడు. అలసటగా ఉన్నా వేగంగా నడుస్తూ లోయర్ల ఇంటివైపు సాగాడు. తనను ఇంగ్లండ్‌కు రప్పించిన ఉర్సులా సమాగమకాంక్ష ఆమె ఇల్లు అల్లంత దూరంలో ఉండగానే ఉధృతమైంది. ఆమె ఇంగ్లండ్‌ సీమలో ఉన్నంతవరకు తనదే, ఆమెను తను గాఢంగా ప్రేమిస్తున్నాడు.
విన్సెంట్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఓ చెట్టుకు అనుకున్నాడు. విశుద్ధ భావ ప్రపంచానికి ఆవల మాత్రమే ఉండే వ్యథ అతనిలో దట్టంగా గూడుకట్టుకుంది. కాసేపు గడిచాక లోయర్ల ఇంట్లో దీపాలు ఆరిపోయాయి. ఉర్సులా పడగ్గది దీపమూ కొడిగట్టింది. ఇల్లంతా కటిక చీకటి.
విన్సెంట్ విసవిసా నడుస్తూ క్లేప్‌హామ్ నుంచి బయటపడ్డాడు. ఆ ఇల్లు కనుమరుగు కాగానే, ఆమె మళ్లీ తనకు దక్కకుండా పోయిందని కలతపడ్డాడు.
ర్సులాను తను పెళ్లాడితే ఆమె ఇక ఏమాత్రం ధనిక కళావ్యాపారి భార్యగా ఉండదని అతని ఊహ. ఆమె విశ్వాసపాత్రురాలూ, గుణవంతురాలూ అయిన ఓ మతబోధకుడి భార్యలా, మురికివాడల్లో తనతో కలసి పేదలకు సేవచేసే దయామయిలా ఉంటుందని ఊహించుకున్నాడు.
ప్రతి వారాంతం లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అలా వెళ్తే సోమవారం ఉదయానికల్లా తిరిగి బడికి చేరుకోవడం సాధ్యం కాదు. కొన్నిసార్లు శుక్ర, శనివారాల్లో రాత్రుళ్లంతా నడిచి వెళ్తున్నాడు; ఆదివారం చర్చికి వెళ్లడానికి ఇంటినుంచి బయటికొచ్చే తన ప్రియురాలిని చూసే ఉత్తిపుణ్యానికి. లండన్‌లో తిండికి,  బసకు తన దగ్గర చిల్లిగవ్వ లేదు. శీతాకాలం మొదలవగానే జలుబుతో బాధపడ్డాడు. సోమవారపు  ఉదయాల్లో లండన్ నుంచి రామ్స్ గేట్ కు తిరిగొచ్చాక వణుకు, అలసట, ఆకలితో పడిపోతున్నాడు. కోలుకోవడానికి మళ్లీ వారం పడుతోంది.
కొన్ని నెలల తర్వాత ఐజల్‌వర్త్ లోని నైష్టిక మెథడిస్టు పాఠశాలలో కాస్త మంచి ఉద్యోగం దొరికింది. బడి యజమాని ఫాదర్ జోన్స్. చాలా ఊళ్లకు ఫాదర్. విన్సెంట్‌ను తొలుత ఉపాధ్యాయునిగా తీసుకుని, కొన్నాళ్ల తర్వాత ఓ పల్లెకు చిన్న బోధకుడిగా పంపాడు.
విన్సెంట్ ఊహలు మళ్లీ మారిపోయాయి. ఉర్సులా ఇప్పుడు మురికివాడల్లో పనిచేసే మతబోధకుడి భార్య కాదు, తన తండ్రికి సాయం చేస్తున్న తన తల్లిలాంటి ఓ పల్లెటూరి ఫాదర్ ఇల్లాలు. సంకుచిత గూపిల్స్ వ్యాపార జీవితాన్ని వదిలి మానవతాధర్మం కోసం పనిచేస్తున్న తనను ఆమె మెచ్చుకోలుతో, సంతోషంతో చూస్తున్నట్లు ఊహించుకున్నాడు.   
లండన్ లోని వైట్ చాపెల్ మురికివాడ
ర్సులా పెళ్లిరోజు దగ్గర్లోనే ఉందన్నవాస్తవాన్ని అతడు నమ్మలేకపోతున్నాడు. వేల్స్ లోని ఆమె వరుడు ఒక పచ్చి అబద్ధం. ఆమె తనను తిరస్కరించడానికి కారణం తన తప్పిదమే. దాన్ని తానే సరిదిద్దగలడు. భగవవంతుడి సేవకు మించిన గొప్పది ఈ లోకంలో ఏముంది?

జోన్స్ బడి పిల్లలు లండన్ నుంచి వచ్చిన నిరుపేదలు. జోన్స్ వాళ్ల తల్లిదండ్రుల చిరుమానాలు ఇచ్చి బడి జీతాలు వసూలు చేసుకు రమ్మని విన్సెంట్‌ను కాలినడకన లండన్‌కు పంపాడు. ఆ పేదలు వైట్‌చాపెల్ నడిబొడ్డు ఉన్నారు.  వీధులు కంపుకొడుతున్నాయి. పెద్దపెద్ద కుటుంబాలు బోసిపోయిన గదుల్లో కిక్కిరిసి ఉన్నాయి. అందరి కళ్లలో ఆకలి రోగాలు తాండవిస్తున్నాయి. కొందరు మగవాళ్లు రోగిష్టి పశువుల మాంసాన్ని అమ్ముతున్నారు. దాన్ని చట్టబద్ధ దుకాణాల్లో అమ్మడం నిషిద్ధం. విన్సెంట్ గత గమ్యాలకు వెళ్లాడు. ఆ కుటుంబాలు కుళ్లు మాంసం, రొట్టె పొళ్లు, గంజీగటకతో కడుపు నింపుకుంటూ, చివికిదుప్పట్లలో వణుకుతూ కనిపించాయి. అతడు వాళ్ల కష్టాల, కన్నీళ్ల గాథను పొద్దుగూకేంతవరకు విన్నాడు.  
దారిలో ఉర్సులా ఇల్లు చూసే భాగ్యం దక్కుతుంది కనక అతనికి లండన్ ప్రయాణం నచ్చింది. అయితే వైట్‌చాపెల్ మురికికూపాలు అతని మనసులోంచి ఆ ప్రియురాలిని దూరంగా గెంటిపారేశాయి. ఆమె ఇంటి సంగతే మరచిపోయి, ఉత్తిచేతులతో తిరిగి ఐజలర్ వర్త్ కు చేరుకున్నాడు.
ఓ గురువారం సాయంత్రం ప్రార్థన సమయంలో జోన్స్ విన్సెంట్ తో.. ‘‘విన్సెంట్, బాగా అలసిపోయాను. నువ్వు మతప్రసంగాలు రాస్తున్నావు కదా? ఏదీ, మచ్చుకు ఒకటి వినిపించు. నువ్వెలాంటి బోధకుడివి అవుతావో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది’’ అన్నాడు.  
విన్సెంట్ గురుపీఠం ఎక్కాడు. ముఖం సిగ్గుతో ఎర్రబడింది. చేతులు వణుకుతున్నాయి. గొంతు బొంగురుపోయి, మాట తడబడింది. ముత్యాల కోవలా రాసుకున్న చక్కటి వాక్యాలను స్మృతిపథంలోంచి ఏరుకున్నాడు. అయితే తన ఆత్మ.. వికారపు హావభావాల్లో, విరిగిన మాటల్లో బద్దలైపోయినట్లు అతనికి అనిపించింది.  
‘‘చాలా బాగా చెప్పావు విన్సెంట్! నిన్నువచ్చేవారం రిచ్మండ్‌కు పంపుతాను’’ అన్నాడు పెద్దాయన.
శరత్కాలపు ఆకాశం తేటగా ఉంది. ఐజల్‌వర్త్ నుంచి థేమ్స్ తీరమ్మీదుగా రిచ్మండ్ వరకూ హాయిగొలిపే నడక. నీలాకాశమూ, పండుటాకుల చెస్ట్‌నట్ మహావృక్షాలూ నీటిలో ప్రతిఫలిస్తున్నాయి. డచ్చి యువకుడి మతబోధనలు బాగున్నాయని రిచ్మండ్ వాసులు జోన్స్ కు ఉత్తరం రాయడంతో, ఆ దొడ్డమనిషి విన్సెంట్‌కు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు. తన ఇలాకాలోని టర్న్ హామ్ చర్చికి వందలాది మంది వస్తుంటారు కనక, వాళ్లకు మతవిషయాల్లో పట్టింపు కనక.. విన్సెంట్ అక్కడ చక్కని ప్రసంగం  చేస్తే, ఇక ఏ చర్చి బోధకపీఠం అధిరోహించేందుకైనా అర్హుడే అని అనుకున్నాడు.
విన్సెంట్ బైబిల్‌ పాతనిబంధనలోని కీర్తనల గ్రంథం నుంచి ‘‘ప్రభూ!  నేను ఈ లోకానికి కొత్త. నీ ఆదేశాలను నాకు మరగుపరచకు’’ అనే వచనాన్ని తన ఉపన్యాసానికి ఆధారంగా తీసుకున్నాడు.  నెమ్మదిగా, త్సాహంగా బోధించాడు. అతని యవ్వనం, తేజస్సు, బలమైన చేతులు, పెద్ద తల, తీక్షణమైన చూపులు భక్తులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చక్కగా బోధించావంటూ చాలామంది దగ్గరికొచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అతడు చకితుడవుతూ వాళ్లతో కరస్పర్శ చేసి చిన్నగా నవ్వాడు. అందరూ వెళ్లాక, ఉద్వేగంతో వెనక తలుపుగుండా బయటపడి లండన్ దారి పట్టాడు.  
ఉన్నట్టుండి తుపాను విరుచుకుపడింది. టోపీ, కోటు చర్చిలో మరచిపోయి వచ్చాడు. థేమ్స్ నదీ జలాలు తీరం వెంబడి పసుప్పచ్చగా ఉన్నాయి. దిగంతంలో కాంతిరేఖ పరచుకుంది. దానిపై నునున్న కరిమబ్బుల్లోంచి కుండపోత వాన కురుస్తోంది. అతడు తడిచి ముద్దయ్యాడు. అయినా మహావేగంతో సాగిపోతున్నాడు. ఎట్టేకేలకు తను విజయం సాధించాడు. తనేమిటో తెలుసుకున్నాడు. విజయఫలాన్ని సాధించాడు. దాన్ని ఉర్సులా పాదాల చెంత ఉంచి ఆమెతో కలసి పంచుకోవాలి. 
జోరువాన దుమ్మూధూళిని అణగదొక్కేస్తోంది. బాట పక్కని పొదలు ఊగిపోతున్నాయి. దగ్గర్లో ఓ పట్టణం కనిపిస్తోంది. చర్చీల గోపురాలు, గాలిమరల రెక్కలు,  గోథిక్ వాస్తు ఇళ్ల కప్పులతో ఆ ఊరు జర్మన్ చిత్రకారుడు డ్యూరర్ వేసిన రేఖా చిత్రాన్ని తలపిస్తోంది.  
లండన్ పయనం యుద్ధంలా సాగుతోంది. ముఖంపై నుంచి వర్షపు నీరు ధారలు కడుతూ కిందకి దిగి బూట్లను తడిపేస్తోంది. సాయంకాలానికి లోయర్ల ఇంటి ముంగిటికి చేరుకున్నాడు. చీకటి కమ్ముకుంది.  ఇంట్లోంచి వయొలిన్ సంగీతం శ్రావ్యంగా వినిపిస్తోంది. ఏం జరుగుతోందని విస్తుపోయాడు. ప్రతి గదిలోనూ దీపం వెలుగుతోంది. హాల్లో అతిథులు నాట్యం చేస్తున్నారు. ఇంటి ముందు నిలిచిన వాననీటి తెరలపై జట్కాబళ్లు ఆగి ఉన్నాయి. ఓ బండివాడు వానకు తడవకుండా పెద్ద గొడుకేసుకుని బండిపై కూర్చుని ఉన్నాడు.
‘‘ఏం జరుగుతోందిక్కడ?’’ విన్సెంట్ అడిగాడు.
‘‘పెళ్లనుకుంటాను బాబయ్యా..’’
విన్సెంట్ బడికి జారగిలబడి నిల్చున్నాడు. వాననీరు తలలోంచి ముఖంపైకి ధారలుగా దూకుతోంది. కాసేపయ్యాక ఇంటి తలుపు తెరుచుకుంది. ఉర్సులా.. సన్నగా, పొడుగ్గా ఉన్న యువకుడితో కలసి ప్రత్యక్షమైంది. ఇంట్లోంచి జనం నవ్వుతూ తుళ్లుతూ వధూవరులపై అక్షింతలు వేస్తూ వసారాలోకి వచ్చారు. 
విన్సెంట్ బండి వెనక చీకట్లో తచ్చాడుతున్నాడు. ఉర్సులా తన వరుడితో కలసి అదే బండి ఎక్కింది.  బండివాడు గుర్రాలను కొరడాతో చెళ్లుమనిపించాడు. బండి నెమ్మదిగా కదిలింది. విన్సెంట్ ముందుకు నడిచి బండి కిటికీలోంచి లోపలికి చూశాడు. ఉర్సులా తన భర్త బాహువుల్లో బందీ అయిపోయింది. ఇద్దరి పెదాలు ముడేసుకున్నాయి. బండి వెళ్లిపోయింది.
విన్సెంట్‌లో ప్రాణాధారమేదో పుట్టుక్కుమని తెగిపోయింది. పూర్తిగా తెగిపోయింది. భ్రమ భళ్లున బద్దలైంది. ఇదంతా ఇంత సులువుగా జరుగుతుందని అతనికి తెలియకపోయింది.
ఫెళ్లుమని కొడుతున్న వర్షంలో తిరిగి ఐజల్‌ వర్త్ చేరుకున్నాడు. సామాన్లు తీసుకుని ఇంగ్లండ్ నుంచి బయటపడ్డాడు శాశ్వతంగా.

                                                                                                           (మళ్లీ రేపు)

7 comments:

 1. మొదటి సారి మొదటి విడత మాత్రమే చదివాను. ఇప్పుడు మిగిలిన నాలుగు భాగాలూ చదివాను. అక్కడక్కడ కొన్ని వాక్యాలు... వాటి తెలుగేతర సంస్కృతి కారణంగా.... తెలీ లేదు.

  అన్నిభాగాల్నీ ఇష్టంగా చదివాను. ఈ చివరిది (ఐదవది) మరీనూ.

  ‘సెయిలర్ ఆన్ ది హార్స్ బ్యాక్’ అని జాక్ లండన్ జీవిత కథ కూడా రాశాడు ఇర్వింగ్ స్టోన్. అది చదువుతూ ఎట్టా లోలోవూగిపోయానో, ఇది చదువుతూ కూడా అట్టాగే. ముఖ్యంగా ఈ ఐదో భాగం. కన్నీరు లేదు. కొంచెం కన్నీరు వూరితే బాగుణ్ను అనిపించేంత సత్యమైన వ్యథకు గురి చేసింది ఈ బతుకు డ్రామా. థాంక్స్ ఫార్ ఎ బ్యూటిఫుల్ ఈవెనింగ్ మోహన్.

  ReplyDelete
  Replies
  1. చెప్పలేనన్ని ధన్యవాదాలు మళ్లీ..

   Delete
 2. అద్భుతం..అధునాతనం అవసరం.అపురూపమైన కవితను వెలికితీసి పంచినందుకు ధన్యవాదాలు మోహన్ గారూ!

  ReplyDelete
 3. ఈ వ్యాఖ్య వట్టికోట వారి కవితను గురించి

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు హనుమంతరావు గారు. నేటి తరం పాఠకులకు తెలియాల్సిన చాలా అపురూపమైన సంగతులు పాత పత్రికల్లో చాలా ఉన్నాయి.నాకు కళలు.. ముఖ్యంగా చిత్రకళ అంటే ఇష్టం కనక పాతవి సేకరిస్తున్నాను.

   Delete
 4. విన్ సెంటు విఫల ప్రేమ మీ తెలుగు తర్జుమాలో చాలా ఉదాత్తంగా సాగింది మోహన్ గారూ!చాలా మంచి బ్లాగు.I'm falling in love with this!

  ReplyDelete
 5. ధన్యవాదాలండి.

  ReplyDelete