Sunday, 11 October 2015

జీవన లాలస-4 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)వ్యాన్గో వేసిన తన తల్లి బొమ్మ

5. వ్యాన్గోలు

థియోడరస్ వ్యాన్గో బ్రెదా స్టేషన్ లో కొడుకును కలుసుకున్నాడు. విన్సెంట్ ను ఇంటికి తీసుకెళ్లడానికి బండికట్టుకుని వచ్చాడు. గంజిపెట్టిన తెల్లచొక్కా, చేతుల్లేని చిన్నకోటు, దానిపైన ఫాదరీల నల్లకోటు వేసుకున్నాడు. వెడల్పాటి నల్ల టై కట్టుకున్నాడు. విన్సెంట్ ఒక్క చూపుతో తండ్రి ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించే రెండు విషయాలను గమనించాడు. కుడి కనురెప్ప ఎడమదానికంటే కాస్త కిందికి దిగి కంటిని బాగా కప్పేస్తోంది. నోటికి ఎడమపక్కన సన్నటి బిరుసైన గీత, కుడిపక్కన మరో సొగసైన పెద్ద గీత ఉన్నాయి. కళ్లు శాంతంగా.. ‘ఇదీ నా తరహా’ అన్నట్టున్నాయి.


థియోడరస్ 
ఫాదర్ థియోడరస్ తలపై చక్కని పట్టుటోపీ పెట్టుకుని ముచ్చటగా ఉంటాడని, అందరికీ మేలు చేస్తుంటాడని జుందర్త్ వాసులు అంటుంటారు. తాను బోధక వృత్తిలో ఎందుకు ఎదగలేకపోయానన్నది అతనికి ఎన్నటికీ అర్థం కాని విషయం. తనను ఆమ్‌స్టర్‌దామ్, హేగ్‌లలోని పెద్ద పెద్ద చర్చీలు పిలిపించుకుని ఉండాల్సిందని అతని భావన. అతడు చూడచక్కని ఫాదర్ అని తోటి బోధకులూ అనేవాళ్లు. థియోడరస్ విద్యావంతుడు, దయాళువు, ఆధ్యాత్మికగుణ సంపన్నుడు. ఈశ్వరసేవలో అలుపెరగని భక్తుడు. ఇన్ని సుగుణాలున్నా పాతికేళ్ల నుంచీ ఆ చిన్న జుందర్త్ పల్లెకొంపలో చిక్కుకుపోయి అనామకంగా మిగిలిపోయాడు. ఆరుగురు వ్యాన్గో అన్నదమ్ముల్లో దేశమంతా ఖ్యాతిలోకి రానిది అతడొక్కడే.

జుందర్త్ లోని చర్చి ఫాదరీ ఇల్లు కలప నిర్మాణం. విన్సెంట్ అక్కడే పుట్టాడు. అది రోడ్డు పక్కనే మార్కెట్ కు, టౌనుహాలుకు దగ్గర్లో ఉంది. వంటగది వెనక తోట ఉంది. అక్కడ కొన్ని తుమ్మచెట్లు, తీరుగా పెంచిన పూలమొక్కలు, వాటి చుట్టూ చిన్నచిన్న బాటలు ఉన్నాయి. తోట వెనక చెట్లమాటున కలపతో కట్టిన చిన్న చర్చి ఉంది. దాని ద్వారానికి ఇరువైపులా రంగుటద్దాల కిటికీలు, లోపల భక్తులు కూర్చుకోవడానికి కొన్ని బల్లలు, చెక్క నేలలో అక్కడక్కడా  చలికాచుకునే చిన్న కుంపట్లు లోపలికి అమర్చి ఉన్నాయి. చిన్న ప్రార్థనా వేదిక, దానికి కాస్త ఎగువన పాత హార్మోనియం ఉన్నాయి. కాల్విన్ బోధనల స్ఫూర్తి, సంస్కరణల ప్రభావమున్న నిరాడంబరమైన ప్రార్థనా మందిరమది.
వ్యాన్గో జన్మించిన జుందర్త్ లోని ఇల్లు(మధ్యలో)

ఆన్నా కార్నీలియా 
విన్సెంట్ తల్లి ఆన్నా కార్నీలియా కిటికీలోంచి రోడ్డుపైకి చూస్తోంది. బండి ఆగగానే తలుపు తీసింది. బిడ్డను ప్రేమతో గుండెలకు హత్తకుంది.  అతడెందుకో కలతపడుతున్నాడని ఆ స్పర్శతోనే తల్లిమనసుకు అర్థమైపోయింది.

‘‘నా బంగారు కొండా, విన్సెంటూ..’’ మెల్లగా గొణుక్కుంది.

ఆమె నీలి, ఆకుపచ్చ వర్ణాల పెద్ద కళ్లు సున్నితంగా ఏదో అడుగుతూ, ఎదుటి మనిషిపైన కఠిన తీర్పులు ఇవ్వకుండా పరిశీలనగా చూస్తుంటాయి. ముక్కుకు ఇరువైపులా కనిపించీ కనిపంచనట్టుండే గీతలు పెదాల కొసల వరకు దిగి, కాలప్రవాహంలో లోతుకు వెళ్లిపోయాయి. అవి మరింత లోతయేకొద్దీ ఆమె ముఖం నవ్వుతున్నట్టు కనిపిస్తుంటుంది. 

థియోడరస్ పనిచేసిన జుందర్త్ చర్చి 
ఆమె హేగ్ లోని కార్బెంటస్ ల ఆడబిడ్డ. తండ్రి విలియానికి రాజుగారి బుక్ బైండర్ గా పేరుంది.. విలియం వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగింది. హాలండ్ తొలి రాజ్యాంగానికి అట్టలు వేసే పని దక్కాక అతని పేరు దేశమంతా తెలిసిపోయింది. అతడు కూతుళ్లను పద్ధతి ప్రకారం పెంచాడు. వాళ్లలో ఒకర్ని విన్సెంట్ పేరే ఉన్న విన్సెంట్ పెత్తండ్రి విన్సెంట్ వ్యాన్గో, మరో కూతుర్ని ప్రముఖ మతబోధకుడు రివరెండ్ స్ట్రీకర్ పెళ్లాడారు.

కార్నీలియా సాధు స్వభావి. లోకంలోని చెడును చూసెరగదు. అసలు అదంటే ఏంటో కూడా ఆమెకు తెలియదు. తెలిసినవల్లా అశక్తత, అనురాగం, కఠోరశ్రమ, బాధలే. థియోడరస్ కూడా అలాంటి వాడే. కానీ అతనికి చెడు గురించి ఆమూలాగ్రం తెలుసు. అతడు దాన్ని కడదాకా చీల్చి చెండాడతాడు.

వ్యాన్గోల ఇంటికి కేంద్రం భోజనాల గదే. భోజనాల తర్వాత గిన్నెలన్నీ తీసేశాక ఖాళీగా మిగిలే పెద్ద బల్ల వాళ్ల జీవిత చక్రానికి ఇరుసు. అక్కడ వేలాడుతున్న స్నేహమయ నూనెదీపం కింద అందరూ చేరి, సాయంత్రాన్ని గడిపేస్తారు. కార్నీలియా విన్సెంట్ గురించి బెంగపడిపోతోంది. అతడు చాలా చిక్కిపోయాడు, ఆందోళనపడుతున్నాడు.

‘‘విన్సెంట్.. ఏంటి నాయనా అదోలా ఉన్నావు? ఏమైనా జరిగిందా?’’ రాత్రి భోజనాల తర్వాత అడిగింది.

విన్సెంట్ బల్లచుట్టూ చూశాడు. చెల్లెళ్లు ఆన్నా, ఎలిజబెత్, విలెమినాలు కూడా అక్కడే ఉన్నారు.

‘‘ఏమీ లేదమ్మా. ఏమీ జరగలేదు.’’

‘‘నీకు లండన్ లో బాగానే ఉందా?’’ తండ్రి అందుకున్నాడు. ‘‘లేకపోతే చెప్పు. పెదనాన్న విన్సెంట్ తో మాట్లాడతా. ప్యారిస్ లో ఏదో ఒక గ్యాలరీకి బదిలీ చేస్తాడు.’’

విన్సెంట్ కు చిర్రెత్తింది. ‘‘వద్దొద్దు. ఆ పని చేయకండి!’’ అరిచినంత పని చేశాడు. ‘‘నేను లండన్ వదలిపెట్టను.. నేను.. ’’ మౌనం దాల్చాడు. ‘‘పెదనాన్న నన్ను బదిలీ చెయ్యాలనుకుంటే ఆ సంగతి ఆయనే చూసుకుంటాడు.’’

‘‘సరే, నీ ఇష్టప్రకారమేకానీ..’’ అన్నాడు తండ్రి.

‘‘ఇదంతా ఆ ముదనష్టపు పిల్ల వల్లే. వీడి ఉత్తరాలు ఎందుకలా తగలడుతున్నాయో ఇప్పుడు అర్థమైంది’’ కార్నీలియా సణుక్కుంది.

విన్సెంట్ కు ఏమీ తోచడం లేదు. జుందర్త్ దగ్గర్లోని గడ్డిబయళ్లలో దేవదారు వనాలున్నాయి. అతడు రోజూ పొలాల వెంట నడుస్తూ, బయళ్లలో అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్న నీటిగుంటల్ని చూస్తూ గడిపేస్తున్నాడు. అతనికిష్టమైన మరో వ్యాపకం డ్రాయింగ్ ఒక్కటే. ఇంటి తోట, గుమ్మంపైని కిటికీలోంచి మధ్యాహ్నాల్లో కనిపించే సంతలు, గుమ్మం తలుపు బొమ్మలను చాలా గీశాడు. ఈ పనిలో పడిపోయి కొన్నిసార్లయినా ఉర్సులాను మరచిపోగలుగుతున్నాడు.

పెద్దకొడుకు తన మార్గాన్ని ఎంచుకోలేదని థియోడరస్ కు ఎప్పుడూ అసంతృప్తే. ఓ రోజు తండ్రీకొడుకులు జబ్బుపడిన ఓ రైతును పరామర్శించడానికి పొరుగూరికి వెళ్లారు. పాయంత్రం బయలు మీదుగా తిరిగొస్తూ బండిలోంచి దిగి కాసేపు నడిచారు. రుధిరభానుడు దేవదారు వృక్షాల వెనక అస్తమిస్తున్నాడు. నీటికుంటల్లో సంధ్యాకాశం ప్రతిఫలిస్తోంది. ఎండుగడ్డి బయలుకు, పచ్చరంగు ఇసుకకు ఒద్దిక కుదిరింది.

‘‘విన్సెంట్! మా నాన్న ఫాదర్. నువ్వూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని నా ఆశ..’’

‘‘నేను గ్యాలరీ పని మారతానని మీకెందుకనిస్తోంది?’’

‘‘ఊరకే అన్నాను. నువ్వొకవేళ మారాలనుకుంటే.. ఆమ్ స్టర్ దామ్ కు వెళ్లి యూనివర్సిటీలో చదువుకోవచ్చు. అక్కడే మీ పెదనాన్న జాన్ ఇంట్లో ఉండొచ్చు. రివరెండ్ స్ట్రీకర్ నీ చదువు సంగతి చూసుకుంటానన్నాడు.’’

‘‘అంటే, గూపిల్స్ గ్యాలరీని వదలిపెట్టమని చెబుతున్నారా?’’
‘‘అయ్యో.. లేదు లేదు. నీకు అక్కడ ఇబ్బందిగా ఉంటేనే. జనం కొన్నిసార్లు మారుతూ ఉండాలి..’’
‘‘నాకు తెలుసు. అయితే గూపిల్స్ నుంచి బయటకొచ్చే ఉద్దేశం మటుకు లేదు.’’
విన్సెంట్ లండన్ వెళ్లే రోజున తల్లిదండ్రులిద్దరూ బ్రెదా స్టేషన్ వరకు తోడుగా వచ్చారు. ‘‘విన్సెంట్, ఉత్తరాలను ఆ చిరునామాకే రాయమంటావా?’’ తల్లి అడిగింది.
‘‘వద్దమ్మా. నేను ఇల్లు మారుతున్నాను.’’
‘‘హమ్మయ్య. ఆ లోయర్ల ఇంట్లోంచి బయటపడుతున్నందుకు సంతోషం. ఆ కుటుంబం నాకెన్నడూ నచ్చలేదు. వాళ్లు చాలా లోగుట్టు మనుషులు.’’
విన్సెంట్ బిగుసుకుపోయాడు. తల్లి అతని భుజంపై ప్రేమగా చెయ్యేసి, భర్తకు వినపడకుండా మెల్లగా అంది, ‘‘బాధపడకు నాయనా! నువ్వు స్థిరపడ్డాక మంచి డచ్చిపిల్లను పెళ్లాడి సుఖంగా ఉందువులే. ఆ ఉర్సులా నీకు తగింది కానేకాదు, ఆమె నీలాంటిది కాదు.’’
తల్లికి ఆ విషయమంతా ఎలా తెలిసిందా అని అతడు నివ్వెరపోయాడు.
6. ‘‘పల్లెటూరి బైతూ!’’

లండన్‌ కు తిరిగి రాగానే కెనింగ్‌స్టన్ న్యూ రోడ్డులోని ఐబీ కాటేజీలో ఇల్లు తీసుకున్నాడు. యజమాని వృద్ధురాలు. రాత్రి ఎనిమిందింటే తలుపేసుకుని నిద్రపోతుంది. ఇంట్లో చీమచిటుక్కుమన్న శబ్దం కూడా వినిపించదు. విన్సెంట్‌కు ప్రతిరాత్రీ యుద్ధమైపోతోంది. నేరుగా లోయర్ల ఇంటికి పరిగెత్తిపోవాలని తపించిపోతాడు. మళ్లీ అంతలోనే గదిలోపలి గొళ్లేనికి తాళమేసుకుని నిద్రపోవాలని కంకణం కట్టుకుంటాడు.  మళ్లీ పావుగంట గడవకముందే ఉర్సులా కోసం దారిలో ప్రత్యక్షమవుతాడు. ఆమె ఇంటికి చేరువకాగానే ఆమె కాంతివలయంలోకి  ప్రవేశించినట్టు భ్రమపడతాడు. ఆమె తలపోతలు, ఆమె ఇంకా దక్కకపోవడం చిత్రహింస అయి కూర్చుంది. అయితే ఐవీ కాటేజీలో కునారిల్లుతూ,  ఆకర్షించే ఆమె వ్యక్తిత్వ ఛాయను చేరుకోకపోవడం వెయ్యి చిత్రహింసల పెట్టు అయిపోయింది.
వేదన అతనిలో చిత్రమైన మార్పులు తీసుకొచ్చింది. ఇతరుల బాధను సానుభూతిలో అర్థం చేసుకోవడం నేర్పింది. లోకంలోని తుచ్ఛమైన, అడ్డదారిన నెగ్గిన ప్రతిదాన్నీ ఏమాత్రం సహించనివాడిగా మార్చింది. గ్యాలరీలో అతనికిప్పుడు విలువ లేదు. కొనుగోలుదార్లు ఓ చిత్రం గురించి తన అభిప్రాయం అడిగితే ఎలాపడితే అలా ముఖమ్మీద కొట్టినట్టు చెబుతున్నాడు. దాంతో వాళ్లు అసలేమీ కొనకుండానే వెళ్లిపోతున్నారు.   బాధను అభివ్యక్తం చేసిన కళాకారులు చిత్రాల్లో మాత్రమే అతనికి వాస్తవికతా, ఉద్వేగగాఢతా కనిపిస్తున్నాయి.
అక్టోబర్‌లో ఓ రోజు మధ్యాహ్నం పూట ఒక లావుపాటి ఇల్లాలు తన కొత్త ఇంటి అలంకరణకు చిత్రాల కోసం వచ్చింది. ఎత్తయిన లేసు కాలరు పెట్టుకుని, రొమ్ముల్ని ఎగదన్నే జాకెట్టు, నల్లకోటు వేసుకుంది. గుండ్రటి మఖ్మల్ టోపీపై నీలిరంగు ఈకె పెట్టుకుంది. ఆమెకు ప్రింట్లు చూపే పని తగలక తగలక విన్సెంట్‌కే తగిలింది.
‘‘మీ దగ్గరున్న వాటన్నింటిలోకెల్లా మంచివి కావాలి. ఖరీదు ఎంతైనా ఫర్వాలేదు. కొలతలు చెబుతాను; హాల్లో ఒక్కోటీ యాభై అడుగుల పొడవున్న రెండు గోడలున్నాయి. ఒక గోడకు రెండు కిటికీలు, వాటి మధ్యదూరం..’’
విన్సెంట్.. రెంబ్రాంట్ రేఖాచిత్రాల నకళ్లను, టర్నర్ వేసిన వెనిస్ జలదృశ్యం పెయింటింగు అద్భుతమైన నకలును,  థైమారిస్ చిత్రాల లితోగ్రాఫులను,  కోరో,  డాబినీ చిత్రాల మ్యూజియం ఫొటోలను మరెన్నింటినో వరసబెట్టి చూపాడు. ఆమె వాటిలో పరమచెత్త చిత్రాలను పట్టుపట్టినట్లు ఏరుకుంది. మంచివాటిని తృణీకరించడంలో తన కళాభిరుచిని చాటుకుంది. అతడు ఉత్తమం అనుకున్న అనుకున్న చిత్రాలను కనీసం కన్నెత్తి కూడా చూడకుండా పక్కన పడేసింది. ఆపసోపాల కదలికలు, అపరిణత అభిరుచితో ఆమె విన్సెంట్‌కు మధ్యతరగతి భావదారిద్ర్యానికి, భోగలాలసతకు అసలు సిసలైన ప్రతీకలా కనిపించింది.
‘‘నేను చాలా మంచివాటినే తీసుకున్నాను కదూ!’’ అంది ఆమె ఆత్మసంతృప్తితో.
‘‘మీరు కళ్లు మూసుకుని ఎంచుకున్నా వీటికంటే చెత్తవాటిని తీసుకుని ఉండరు’’ అన్నాడు అతడు వెటకారంగా.  
ఆమె కోపంతో ఊగిపోతూ లేచింది. మఖ్మల్ గౌను ఓవైపు వెళ్లింది. రొమ్ముదగ్గరి నుంచి మెడ దాకా రక్తనాళం ఉబ్బింది.
‘‘ఎందుకు, ఎందుకలా వాగావ్? నువ్వో పల్లెటూరి బైతువి..’’ గట్టిగా అరిచి విసావిసా వెళ్లిపోయింది. ఆ విసురుకు టోపీమీదున్న పొడవాటి ఈకె ఊగిసలాడింది.
మేనేజర్ ఓబాక్ కోపంతో రేగిపోయాడు. ‘‘విన్సెంట్, నీకేమన్నా పిచ్చిపట్టిందా? ఈ వారంలోకెల్లా పెద్ద బేరాన్ని నోటి దురుసుతో చెడగొట్టావు, ఆమెను అవమానించవు.’’
‘‘ఓబాక్ గారూ, మీరు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతారా?’’
‘‘ప్రశ్నా? సరే, ఏంటది? నేనూ నిన్ను అడగాల్సినవి చాలానే ఉన్నాయి.’’
విన్సెంట్ ఆమె ఏరుకున్న ప్రింట్లను పక్కకు నెట్టి, రెండు చేతులతో బల్ల అంచులు పట్టుకున్నాడు.  
‘‘ఒక మనిషి తన విలువైన జీవితాన్ని ఇలా చెత్త బొమ్మల్ని వచ్చిన ప్రతి మూర్ఖుడికీ అంటగడుతూ వ్యర్థపుచ్చడాన్ని ఎలా సమర్థించుకోగలడు?’
ఓబాక్ జవాబివ్వలేదు. కానీ హెచ్చరించాడు. ‘‘ఈ వ్యవహరం ఇలాగే సాగితే నిన్ను మరో గ్యాలరీకి పంపమని నీ పెదనాన్నకు చెబుతా. నా వ్యాపారాన్ని చేజేతులా చెడగొట్టుకోను.’’
విన్సెంట్ ఇక చాలు అన్నట్టు చెయ్యి ఊపుతూ.. బుసకొడుతున్నఓబాక్ పక్కకు వచ్చాడు.
‘‘చెత్త సరుకమ్మి అంత భారీ లాభాలు గుంజడం న్యాయమా అండి? ఇక్కడికొచ్చే స్తోమతగల ధనవంతులు ఎందుకు ఒక్క మంచి చిత్రాన్ని కూడా చూడలేకపోతున్నారు? వాళ్ల డబ్బు వాళ్ల వివేకాన్ని మొద్దుబార్చిందా? సత్కళను ఆస్వాదించగల పేదల వద్ద ఒక్క ప్రింటును కొనుక్కునేందుకు కూడా డబ్బులేదెందుకు?’’
ఓబాక్ విన్సెంట్‌వైపు విస్తుబోయి చూశాడు. ‘‘ఏమిటిదంతా? సోషలిజమా?’’ అన్నాడు.  
విన్సెంట్ ఇంటికొచ్చి, రేనాన్ పుస్తకం తీసుకుని బల్లముందు కూర్చున్నాడు. గుర్తుపెట్టిన పేజీ తెరిచి చదివాడు. ‘‘మనిషి ఈ లోకంలో సరిగ్గా మెలగాలంటే అంతరంగంలోమరణించాలి. మనిషి ఈ లోకానికి వచ్చింది సంతోషంగా, నిజాయతీగా ఉండడానికి మాత్రమే కాదు. ఉదాత్తమైన మానవతా కార్యాలను నెరవేర్చి,  ఔన్నత్యాన్నిఅందుకుని, అందరి అస్తిత్వాలనూ కబళిస్తున్న నీచత్వాన్నిఅధిగమించడానికి..’’
లండన్ లోని ఉర్సులా ఇల్లు(కొత్తరూపు)

క్రిస్మస్‌కు వారం ముందే లోయర్లు అందమైన క్రిస్మస్ చెట్టును కిటికీ వద్ద ఉంచారు. రెండు రోజుల తర్వాత విన్సెంట్ ఆ ఇళ్లంతా వెలుగులు చిందడమూ, ఇరుపొరుగువాళ్లు ఇంట్లోకీ బయటికీ రావడమూ చూశాడు. లోపలినుంచి నవ్వులూ వినిపించావు. లోయర్లు క్రిస్మస్ విందు ఇస్తున్నారు. అతడు ఇంటికి పరిగెత్తి ఆదరబాదరాగా గడ్డం గీసుకుని, మంచి చొక్కా వేసుకుని, టై కట్టుకుని మళ్లీ ఉరుకుల పరుగులపైన క్లేప్‌హామ్‌కొచ్చాడు. అలుపు తీర్చుకోవడానికి మెట్ల కింద కాసేపు నిల్చున్నాడు.   
క్రిస్మస్ కరుణా, క్షమాగుణాల చేతన అక్కడ వెల్లివిరుస్తోంది. అతడు మెట్లెక్కి గబగబా తలుపు తట్టాడు. హాల్లోంచి తెలిసిన అడుగుల సవ్వడి వినిపించింది. సుపరిచిత కంఠం అక్కడున్నవాళ్లకు ఏదో బదులిస్తోంది. తలుపు తెరచుకుంది. దీపకాంతి అతని ముఖంపై  ప్రసరించింది. ఉర్సులాను చూశాడు. ఆమె చేతుల్లేని ఆకుపచ్చ బుట్టగౌనులో ఉంది. రొమ్ముల దగ్గర పెద్ద లేసు, రిబ్బన్లు అలంకరించుకుంది. ఆమెను అంత అందంగా అతడెన్నడూ చూడలేదు.  
‘‘ఉర్సులా!’’
ఆమె ఛీత్కారంగా ముఖం పెట్టుకుంది. అదివరకు తోటలో ఆమె అతనికేం చెప్పిందో అవన్నీ ఆ ముఖంలో మళ్లీ వ్యక్తమయ్యాయి.  
‘‘వెళ్లిపో!’’ ఆమె కసిరి దబ్బున తలుపేసుకుంది.
మరుసటి రోజు ఉదయమే అతడు ఓడలో హాలండ్‌కు పయనమయ్యాడు.  
గూపిల్స్ గ్యాలరీలు క్రిస్మస్ రోజుల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. విన్సెంట్ అనుమతి తీసుకోకుండా సెలవుపై వెళ్లాడని ఓబాక్ విన్సెంట్ పెదనాన్నకు ఫిర్యాదు చేస్తూ జాబు రాశాడు. విన్సెంట్‌ను ప్యారిస్‌లోని ప్రధాన గ్యాలరీకి బదిలీ చేయాలని ఆ పెదనాన్న నిర్ణయించుకున్నాడు.  
అయితే తానిక గ్యాలరీల్లోనే పని చేయని విన్సెంట్ ఖరాఖండిగా చెప్పేశాడు. పెత్తండ్రి ఖిన్నుడయ్యాడు. తమ్ముడి కొడుకు విషయంలో ఇక చేతులు కడిగేసుకుంటానని చెప్పాడు. అయితే తన నామధేయుడికి బతుకుతెరువు చూపేందుకు సెలవుల తర్వాత ఆ చేతులు కడుక్కోవడం ఆపేసి, అతణ్ని దోర్ ద్రెక్ లోని బ్లసీ బ్రామ్ పుస్తక దుకాణంలో గుమాస్తాగా చేర్పించాడు. ఇద్దరి మధ్యా అదే చిట్టచివరి వ్యవహారమైపోయింది.
విన్సెంట్ దోర్ ద్రెక్ లో నాలుగు నెలలు ఉన్నాడు. తృప్తీ లేదు, అసంతృప్తీ లేదు. పనిలో ఎత్తుపల్లాలూ లేవు. కేవలం అక్కడ ఉన్నాడంతే. ఓ శనివారం రాత్రి ఉన్నట్టుండి ఆఖరి రైల్లో ఊడెన్‌బాష్ కు వెళ్లి, అక్కణ్నుంచి జుందర్త్ కు కాలినడక బయల్దేరాడు. గడ్డిమైదానం శీతలంగా ఉంది. ఘాటు పరిమళాలతో  రాత్రి మనోహరంగా ఉంది. విస్తారమైన దేవదారువనాలను, పొడవాటి గడ్డిపొదలను అంత చీకట్లోనూ అతడు గుర్తుపట్టాడు. అవి తండ్రి గదిలోని బాద్మర్ చిత్రంలో మాదిరి ఉన్నాయి. ఆకాశం మబ్బుపట్టి ఉన్నా, మబ్బుల్లోంచి నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి.  తెల్లవారడానికి  చాలా ముందే ఇంటికొచ్చాడు. దూరంగా జొన్న చేలల్లోంచి భరద్వాజ పక్షుల పాటలు వినిపిస్తున్నాయి.  
అతడు కష్టాల్లో ఉన్నాడని తల్లిదండ్రులకు మరింత బాగా అర్థమైంది. వేసవి ముగియగానే థియోడరస్ కుటుంబం ఎతన్ కు బదిలీ అయింది. ఆ చిన్న పట్టణం థియోడరస్ తొలిసారి ఫాదర్‌గా పనిచేసిన ఊరికి దగ్గర్లోనే ఉంది. ఎతన్‌లో తవిసె చెట్లు బారులు తీరిన విశాలమైన కూడళ్లు, ఉద్యానవనాలు ఉన్నాయి. ఊరి నుంచి బ్రెదా నగరానికి రైలు ఉంది. ఎతన్‌కు బదిలీతో తన హోదా కాస్త పెరిగనట్టేనని అనుకున్నాడు థియోడరస్.  
శిశిరం మొదలైంది. ఉర్సులా విషయంలో తాడోపేడో తేల్చుకోవాలనుకున్నాడు విన్సెంట్. ఆమెకింకా పెళ్లికాలేదు.
‘‘ఈ అంగళ్ల వ్యవహారం నీకు సరిపడదు విన్సెంట్. నీ హృదయం ఈశ్వరసేవవైపు మళ్లుతోంది’’ అన్నాడు తండ్రి ఓ రోజు.
‘‘నాకు తెలుసు నాన్నా..’’
‘‘అయితే చదువుకోడానికి ఆమ్‌స్టర్ దామ్ కు వెళ్లొచ్చుకదా!’’
‘‘నాకిష్టమే.. కానీ..’’
‘‘అదిగో.. నీ మనసు ఇంకా ఊగిసలాడుతూనే ఉంది.’’
‘‘ఔను. ఇప్పుడు విడమరచి చెప్పలేను. కాస్త గడువివ్వండి.’’
పెదనాన్న జాన్ ఎతన్ కు వచ్చాడు. ‘‘విన్సెంట్! మా ఇంట్లో ఓ గది ఖాళీగానే ఉంది.  అందులో ఉందువుగాని’’ భరోసా ఇచ్చాడు.
‘‘నీకు మంచి గురువును కుదురుస్తానని రివరెండ్ స్ట్రీకర్ కూడా ఉత్తరం రాశార్రా అబ్బాయ్..’’ తల్లి అందుకుంది.
ర్సులా నుంచి వ్యథాకానుకను అందుకోగానే లోకంలో అందరూ వదిలేసినవన్నీ అతని సొంతమవుతున్నాయి. మతబోధనలో ఉత్తమ శిక్షణ ఆమ్‌స్టర్‌దామ్ యూనివర్సిటీలోనే దొరుకుంతుందని అతనికి తెలుసు. వాన్గో,  స్ట్రీకర్ల కుటుంబాలు తనను అక్కున చేర్చుకుని.. డబ్బూ, పుస్తకాలూ అందించి, ప్రోత్సహిస్తాయి కూడా. కానీ తను గతాన్ని పూర్తిగా మరచిపోలేదు. ఉర్సులాకు ఇంకా పెళ్లికాలేదు, ఇంగ్లండ్‌లోనే ఉంది.  తాను హాలండ్‌లో ఉండిపోవడంతో ఆమె సంగతులు తెలియడం లేదు. కొన్ని ఆంగ్ల వార్తాపత్రికలు తెప్పించుకుని,  కనిపించిన ఉద్యోగ ప్రకటనకల్లా దరఖాస్తు చేశాడు. చివరకు రామ్స్ గేట్‌లో బడిపంతుల ఉద్యోగం దొరికింది. తీరపట్టణమైన రామ్స్ గేట్ కు  లండన్ నుంచి రైల్లో నాలుగన్నర గంట ప్రయాణం.  
(మళ్లీ రేపు..)
No comments:

Post a Comment