Sunday, 11 October 2015

జీవన లాలస-3 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)4. ఆ సంగతి ఇక మరచిపోదామా?


రుసటి రోజు పొద్దున అతణ్ని ఎవరూ పిలవలేదు. పక్కలోంచి నీరసంగా లేచాడు. గడ్డం గీసుకున్నాడు కానీ, అక్కడక్కడా వెంట్రుకలు మిగిలిపోయే ఉన్నాయి.  అల్పాహారం వద్ద ఉర్సులా కనిపించలేదు. గ్యాలరీ బాటపట్టాడు. దారిలో నిన్న పొద్దున కనిపించిన వాళ్లే మళ్లీ కనిపించారు కానీ, నిన్నట్లా లేరు. శ్రమనిష్ఫలమైన పనుల కోసం హడావుడిగా వెళ్తున్న ఏకాకుల్లా కనిపించారు.
అతడు విరగబూసిన పూలను చూడ్డంలేదు. దారిపక్కన బారులు తీరిన చెస్ట్ నట్ చెట్లనూ చూడ్డం లేదు. సూర్యుడు నిన్నటికంటే తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు. అతడా సంగతి గమనించలేదు.
దుకాణంలో ఆ రోజు ఇంగ్ వేసిన వీనస్ చిత్రం రంగుల కాపీలను పాతిక వరకు అమ్మాడు. అలాంటి బొమ్మల్లో గూపిల్స్ కంపెనీకి బాగా లాభాలొస్తాయి. కానీ అతనికి ఆసక్తి పోయింది. కొనుగోలుదారులతో అసహనంగా ప్రవర్తించాడు. వాళ్లకు మంచి బొమ్మలకు, చెత్త బొమ్మలకు తేడా తెలియదు; పైగా కృతకమైన, పనికిమాలిన బొమ్మలను ఎంచుకోవడంలో సిద్ధహస్తులు కూడా.
తోటి గుమాస్తాలు విన్సెంట్ ను కులాసా మనిషి అని ఎన్నడూ అనుకోలేదు. అయితే అతడు సంతోషంగా, కలివిడిగా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
‘‘మన ఘనమైన వ్యాన్గో కుంటుంబ వారసుడు ఈ రోజు ఎందుకో చాలా ఆందోళనపడుతున్నాడు, గమనించావా? కారణమేమై ఉంటుందంటావ్?’’ ఓ గుమాస్తా తోటి గుమాస్తాతో అన్నాడు.
‘‘లేచిన వేళ బాగోలేదనుకుంటా.’’
‘‘ఆందోళన పడడూ మరి.. ఈయన పెదనాన్న విన్సెంట్ వ్యాన్గోకు ప్యారిస్, బ్రస్సెల్స్, హేగ్, ఆమ్‌స్టర్‌దామ్లలోని గూపిల్స్ గ్యాలరీల్లో సగం వాటా ఉంది. ఆ ముసలాయన జబ్బుపడ్డాడు. పిల్లల్లేరు. వ్యాపార వాటాల్లో సగం ఈయనకు ఇచ్చిపోతాడని అంటున్నారు.’’
‘‘అదృష్టం అంటే అదీ.’’
‘‘విషయం ఇంకా ఉంది. ఈయన మరో పెదనాన్న హెండ్రిక్ వ్యాన్గోకు కూడా బ్రస్సెల్స్ లో, ఆమ్‌స్టర్‌దామ్ లలో పెద్ద పెద్ద ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. మరో పెదనాన్న కార్నీలియస్ హాలండ్ లో పెద్ద కంపెనీకి అధిపతి. అందుకే వీళ్లది యూరప్ లో అతిపెద్ద కళావ్యాపారుల కుటుంబమైంది. ఆ పక్క గదిలోని ఈ మన ఎర్రజుట్టు మిత్రుడు ఏదో ఒక రోజు యూరప్ కళాప్రపంచాన్ని ఏలడం ఖాయం.’’
విన్సెంట్ ఆ రోజు రాత్రి భోజనానికి లోయర్ల ఇంట్లోకి అడుగుపెడుతుండగా, తల్లీకూతుళ్లిద్దరూ గొంతు తగ్గించి మాట్లాడుకుంటూ కనిపించారు. అతడు రాగానే చప్పున మాటలాపేశారు. ఉర్సులా వంటగదిలోకి దూరిపోయింది. పెద్దావిడ పలకరించింది. ఆమె కళ్లలో ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి.
విన్సెంట్ టేబుల్ వద్ద ఒక్కడే భోంచేశాడు. ఉర్సులా కొట్టిన దెబ్బ అతణ్ని దిగ్ర్భాంతుణ్ని చేసింది కాని, ఓడించలేకపోయింది. అతడు తిరస్కారాన్ని అంత సులభంగా స్వీకరించే రకం కాదు. ఉర్సులా మనసంతా నిండిపోయి అక్కడున్న ఆ వేల్స్ మనిషిని తరిమికొడతాడు.
వారం తర్వాత ఉర్సులా ఒక్కటే అతని కంటబడింది. మాట్లాడాల్సింది చాలా ఉంది. ఆ వారమంతా అతడు సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు. వివేకరాహిత్యంతో ఆందోళనా, బలహీనతా కమ్ముకున్నాయి.  ఆ వారమంతా గ్యాలరీలో అతని అమ్మకాలు బాగా తగ్గాయి. కళ్లలో ప్రాణవంతమైన హరితం మాయమై, కోతపెట్టే నీలివర్ణం వచ్చి చేరింది. మాట్లాడాలంటే.. ఇదివరకెన్నడూ లేనట్టు పదాలను కూడదీసుకోవాల్సి వస్తోంది.
విన్సెంట్ ఆదివారం భోజనమయ్యాక ఉర్సులా వెంట తోటలోకి చేరాడు.  
‘‘మిమ్మల్ని ఆ రాత్రి భయపెట్టి ఉంటే క్షమించండి.’’
ఆమె అతనివైపు దిగ్గున చూసింది, తన వెనకాలే ఎప్పుడొచ్చాడా అని విస్తుపోతూ.
‘‘అయ్యో. అదేమంత పెద్ద విషయం కాదులెండి. ఆ సంగతి ఇక మరచిపోదాం.., సరేనా?’’
‘‘మీతో దురుసుగా ప్రవర్తించాను. ఆ విషయం మరచిపోదామనే అనుకుంటున్నాను. కానీ నేను చెప్పింది మాత్రం ముమ్మాటికీ నిజం.’’
ఆమెవైపు ఓ అడుగు ముందుకు వేశాడు. ఆమె దూరంగా వెళ్లిపోయింది.
‘‘మళ్లీ దాని గురించేనా? దాన్ని మొత్తం నా మనసులోంచి తుడిచిపారేశాను.’’ ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది. అతడు వెంటపడ్డాడు.
‘‘లేదు. నేను ఆ విషయం మళ్లీ మాట్లాడి తీరాలి. మిమ్మల్ని నేనెంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియదు. ఈ వారమంతా నాలో నేను ఎంత కుమిలిపోయానో తెలియదు. ఎందుకు నన్ను తప్పించుకుని పారిపోతున్నారు?’’
ఆమె వినిపించుకోలేదు. ‘‘లోనికెళ్దామా? అమ్మ ఎవరికోసమో ఎదురు చూస్తోంది’’ అంది.
‘‘మీరు ఆ మనిషిని ప్రేమించడం నిజం కాదు. అదే నిజమైతే అది మీ కళ్లలో నాకు తప్పక కనిపించేది.’’
‘‘మీతో మాట్లాడే తీరికా, ఓపికా నాకు లేవు. మీరు సెలవులపై ఊరికి ఎప్పుడు వెళ్తున్నారు?’’
అతడు గుటకలు మింగి, ‘‘జూలైలో’’ అన్నాడు.
ఉర్సులా లోయర్ అమ్మ
ఉర్సులా లోయర్
‘‘సంతోషం. ఆయన సెలవులను నాతో గడిపేందుకు జూలైలోనే ఇక్కడికి వస్తున్నారు. మీ గది మాక్కావాలి.’’
‘‘మిమ్మల్ని అతనికి ఎన్నటికీ దక్కనివ్వను ఉర్సులా..’’
‘‘మీరిలా మాట్లాడ్డం మానేయాలి. లేకపోతే మా ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటుంది అమ్మ.’’
ఆమె మనసు మార్చడానికి అతడు రెండు నెలలు శతవిధాలా ప్రయత్నించాడు. అతనిలో పూర్వలక్షణాలన్నీ తిరిగి పొడసూపాయి. ఉంటే ఉర్సులాతో, లేకపోతే ఒంటరిగా ఉండిపోవాలనుకుంటున్నాడు తన వేదన ఎవరికీ తెలియొద్దని. దుకాణంలో ఊరికే చిరాకు పడిపోతున్నాడు. ఉర్సులా ప్రేమతో మేల్కొన్న అతని ప్రపంచం అంతే త్వరగా సుషుప్తిలోకి జారి పోయింది. ఇదివరకు జుందర్త్ లో విచారంతో, చిరచిరలాడిన పిల్లాడిలా మారిపోయాడు.
జాలై సెలవులొచ్చాయి. రెండు వారాలు లండన్ కు దూరంగా ఉండడానికి మనసొప్పలేదు. తను ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఆమె తనను తప్ప మరొకర్ని ప్రేమించదని అతనికి గట్టి నమ్మకం.
అతడు ఇంట్లోకి వెళ్లాడు. హాల్లో తల్లీకూతుళ్లు కూర్చుని ఉన్నారు. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
‘‘లోయర్ గారూ, నేను ఓ బ్యాగు మాత్రమే తీసుకెళ్తున్నాను. మిగతా సామాన్లన్నీ గదిలోనే ఉన్నాయి. వచ్చే రెండు వారాల అద్దె కూడా ఇప్పుడే తీసుకోండి’’ అన్నాడు ఉర్సులా తల్లితో.
‘‘లేదండి. మీరు మా సామాన్లన్నీ తీసుకెళ్లడం మంచిది.’’
‘‘ఏం? ఎందుకు?’’
‘‘వచ్చే వారం నుంచి మీ గదిని వేరొకళ్లకు అద్దెకిచ్చాం. మీరు మరోచోటికి వెళ్తే బావుంటుందని మేం అనుకుంటున్నాం’’
‘‘మేం?’’
ఉర్సులాను కనుకొసల్లోంచి చూశాడు. ఆ చూపులో  ప్రశ్న తప్ప మరెలాంటి భావమూ లేదు.
‘‘అవును.. మేమే! మా కాబోయే అల్లుడు మిమ్మల్ని ఇక్కణ్నుంచి పంపించేయాలని ఉత్తరం రాశాడు. మీరిక ఎన్నడూ ఈ ఛాయలకు రాకపోవడం మంచిది.’’
                                                                                                      (మళ్లీ రేపు..)

No comments:

Post a Comment