Saturday, 10 October 2015

జీవన లాలాస-2 (వ్యాన్గో జీవితనవల లస్ట్ ఫర్ లైఫ్)3. ప్రేమను పుట్టించే ప్రేమ


‘‘మీరు తెమ్మన్న ఆ చిత్రం ఇప్పుడే తీసుకొస్తాను’’ విన్సెంట్ రాత్రి భోజనం ముగిశాక అన్నాడు కుర్చీలోంచి లేస్తూ.
‘‘ఆ చిత్రకారుడు నాకేమన్నా రాశాడా?’’ ఆశగా అడిగింది ఉర్సులా. ఆమె ఎంబ్రాయిడరీ వేసిన చక్కని పాచిరంగు దుస్తుల్లో ఉంది.
‘ఆ.. రాశాడు. మీరు దీపం పట్టుకొస్తే బళ్లో ఆ బొమ్మను తగిలిస్తా.’’
ఆమె పెదాల్ని ముద్దొచ్చేలా బిగించి, ఓరగా అతనివైపు చూసింది. ‘‘అమ్మకు సాయం చెయ్యాలి. ఓ అరగంట ఆగి వెళ్దామా?’’ అంది.
విన్సెంట్ సరేనంటూ మేడమీది తన గదిలోకి వెళ్లాడు. టేబుల్ పై మోచేతులానించి అద్దంలో చూసుకున్నాడు. తన రూపురేఖల గురించి అతడు ఇదివరకు పట్టించుకోలేదు; హాలండ్ లో అలాంటి వాటికి ప్రాధాన్యం లేదు. ఇంగ్లిష్ వాళ్లతో పోలిస్తే తన తలా, ముఖమూ పెద్దవిగా ఉన్నట్టు అతనికి అనిపించింది. కళ్లు రాతిపలకలోని నెర్రెల్లో ఉన్నట్టు లోపలికి ఉన్నాయి. ముక్కు ఎత్తుగా, పెద్దగా, పొడుగ్గా ఉంది. నుదురు ఎత్తుగా, విశాలంగా గుమ్మటంలా ఉంది. దవళ్లు కూడా పెద్దగా, బలంగా.. మెడ కాస్త పొట్టిగా, లావుగా ఉన్నాయి. గడ్డం విశాలంగా డచ్చి మూర్తిమత్వానికి సజీవ తార్కాణంలా ఉంది.   
విన్సెంట్ అద్దం ముందు నుంచి లేచి, మంచం అంచున కూర్చున్నాడు. అతడు గట్టి కట్టుబాట్ల కుటుంబంలో పెరిగాడు. ఇది వరకు ఎవర్నీ ప్రేమించలేదు. ఏ ఆడపిల్ల వంకా కనీసం కన్నెత్తి చూసిందీ లేదు, మాట్లాడిందీ లేదు. ఉర్సులాపై అతని ప్రేమలో మోహం, కాంక్ష లేవు. అతడు ఉట్టి భావుకుడు, తొలి వలపులో చిక్కుకున్నాడు.
వాచీ చూసుకున్నాడు. ఐదు నిమిషాలే గడిచాయి. మిగిలిన పాతిక నిమిషాలూ పాతిక యుగాలుగా అనిపించాయి. తల్లి రాసిన ఉత్తరంలోపాటు వచ్చిన తమ్ముడి జాబు తీసుకుని మళ్లీ చదువుకున్నాడు. థియో.. విన్సెంట్ కంటే నాలుగేళ్లు చిన్న. విన్సెంట్ హేగ్ లోని గూపుల్స్ గ్యాలరీ నుంచి లండన్ కు బదిలీ అయ్యాక అక్కడ అతని స్థానంలో పనిచేస్తున్నాడు. అన్నదమ్ములకు బాల్యం నుంచీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ల నాన్న థియోడరస్, పెదనాన్న విన్సెంట్ ల మాదిరి.
విన్సెంట్ ఓ పుస్తకాన్ని ఒత్తుకు పెట్టుకుని, తమ్ముడికి బదులు రాశాడు. థేమ్స్ గట్టున గీసిన స్కెచ్చులను సొరుగులోంచి తీశాడు. వాటిని, జాబును, జాక్ వేసిన ‘ఖడ్గధారిణి’ పెయింటింగు ఫొటోగ్రాఫును తమ్ముడికి పంపాల్సిన కవరులో పెట్టాడు.

జాక్ వేసిన ‘ఖడ్గధారిణి’
ప్రియురాలు గుర్తుకొచ్చి కెవ్వుమన్నాడు. ‘‘అయ్యో, ఆమె సంగతే మర్చిపోయానే’’ అనుకుంటూ వాచీ చూసుకున్నాడు. అప్పటికే పావుంగంట ఆలస్యమైంది. దువ్వెన దొరకబుచ్చుకుని గబగబగా తల దువ్వుకున్నాడు. సీజర్ డి కాక్ చిత్రాన్ని తీసుకుని కిందికి దిగాడు.

‘‘ఈ పాటికి మీరు నన్ను మరచిపోయే ఉంటారనుకున్నా..’’ అంది ఉర్సులా అతడు హాల్లోకి రాగానే.
ఆమె బడి పిల్లల కోసం కాగితాలతో బొమ్మలు చేస్తోంది.
‘‘ఏదీ ఆ చిత్రాన్ని తెచ్చారా? చూపండి’’ ఆత్రంగా అడిగింది.
‘‘గోడకు తగిలించాక చూద్దురుగాని, లాంతరు సిద్ధం చేశారా?’’
‘‘అది అమ్మ దగ్గరుంది.’’
విన్సెంట్ వంటగదిలోకి వెళ్లి లాంతరు పట్టుకొచ్చాడు. ఉర్సులా నీలిరంగు శాలువా అతనిచేతికిచ్చి తన భుజాలకు చుట్టమంది. ఆ మెత్తటి శాలువా స్పర్శకు అతని మనసు పులకించింది. తోటలో యాపిల్ పూల పరిమళం అలుముకుంది. చీకట్లో దారి కనిపించడం లేదు. ఆమె అతని నల్లటి గరుకు కోటును చెయ్యి వద్ద మునివేళ్లతో పట్టుకుంది. దారి సరిగ్గా కనిపించక తడబడి అతని చెయ్యిని మరింత గట్టిగా పట్టుకుంది. దానికే తెగ సిగ్గుపడిపోయి భళ్లున నవ్వింది. తడిబడినందుకు ఎందుకంత పెద్ద నవ్వొచ్చిందో అతనికి అర్థం కాలేదు. కానీ నవ్వుతో తుళ్లిపోతున్న ఆమె దేహాన్ని ఆ మసక చీకట్లో చూడాలన్న బలమైన కోరిక పుట్టింది. ఉర్సులా జాగ్రత్తగా బడిలోకి వెళ్లడానికి వీలుగా తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఆమె లోనికెళ్తుండగా ఆమె నున్నటి ముఖం అతని ముఖాన్ని తాకింది. ఆమె అతని కళ్లలోకి లోతుగా చూసింది. అతని ప్రశ్నకు అడగకుండానే సమాధానం చెప్పేటట్టుగా కనిపించింది ఆమె ఆ క్షణంలో.
విన్సెంట్ దీపాన్ని బల్లపై ఉంచి, ‘‘ఈ చిత్రాన్ని ఎక్కడ తగిలించమంటారు?’’ అని అడిగాడు.
‘‘నా బల్లకు పైగా. ఏం బావుండదా?’’
గదిలో పదిహేను చిన్న కుర్చీలు, బల్లలు ఉన్నాయి. ఆ గదిని ఇదివరకు వేసవిలో వాడేవాళ్లు. గది చివర్లో చిన్న అరుగుపై ఉర్సులా బల్ల ఉంది. ఇద్దరూ పక్కపక్కనే నిల్చుని చిత్రాన్ని ఎక్కడ తగిలిస్తే బావుంటుందా అని ఆలోచించారు. విన్సెంట్ కు గాబరాగా ఉంది. వాల్ పేపరుకు పిన్నులు గుచ్చుతుంటే అవి గుచ్చినంత వేగంగా కింద పడిపోతున్నాయి.
ఆమె తియ్యగా నవ్వి, ఆత్మీయంగా ‘‘ఒయ్ మొద్దూ! ఇక్కడ దిగడం లేదు, నేను ప్రయత్నిస్తాను’’ అంది.
ఆమె రెండు చేతులూ పైకెత్తి పిన్నులు గుచ్చుతోంది. ఒళ్లంతా చురుగ్గా, సొగసుగా కదులుతోంది. ఆ దీపపు మందకాంతిలో ఆమెను చటుక్కున చేతుల్లోకి తీసుకుని, ఒక్క కౌగిలింతతో  ఆ డొంకతిరుగుడు వ్యవహారానికి ముగింపు పలకాలనుకున్నాడు అతడు. ఉర్సులా చీకట్లో అతనికి చాలాసార్లు తగిలినా, కౌగిలికి అనువుగా మాత్రం రాలేదు. చిత్రంలో డికాక్ రాసిన వాక్యాన్ని ఆమె చదవడానికి వీలుగా విన్సెంట్  దీపాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఆమె చదివేసి కేరింతలు కొడుతూ వెనక్కి నడిచింది. అతనికి అందనంత దూరానికి వెళ్లింది.
సీజర్ డి కాక్ వేసిన ఓ చిత్రం
‘‘అయితే, ఆయనా నా నేస్తమయ్యాడన్నమాట. ఒక కళాకారుడి గురించి తెలుసుకోవాలని నాకు ఒకటే ఆరాటం’’ అంది.
ప్రేమ ప్రస్తావన తేవడానికి వీలుగా ముందు ఏదో ముచ్చట పెట్టేందుకు ప్రయత్నించాడు విన్సెంట్. ఉర్సులా సగం నీడలో అతని వైపు చూసింది. దీపకాంతిలో ఆమె కళ్లు తళుక్కుమంటున్నాయి. ఆమె గుండ్రటి ముఖాకృతి నీడ తేలింది. ఆమె తెల్లని, సుతిమెత్తని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఎర్రటి తడి పెదాలను చూడగానే అతనిలో మాటలకందని భావం కదలాడింది.
కాసేపు అనువైన మౌనం ఆవరించింది. ఆమె తనకు చేరువవుతున్నట్టు, తన అక్కర్లేని మాటలు వినడానికి నిరీక్షిస్తున్నట్టు అతనికి అనిపించింది. పలుమార్లు పెదవులు తడుపుకున్నాడు. ఉర్సులా అతని కళ్లలోకి చూసి ఏదో అర్థమై చప్పున తలుపు వద్దకు పరిగెత్తింది.
అవకాశం తప్పిపోతుందనే భయంతో అతడూ ఆమె వెనకే పరిగెత్తాడు. ఆమె యాపిల్ చెట్టు కింద కాసేపు ఆగింది.
‘‘ఉర్సులా.. దయచేసి..’’
ఆమె అతనికేసి చూసింది. కాస్త వణుకుతోంది. నిశీథిలోంచి శీతల నక్షత్రాలు తొంగి చూశాయి. అతడు లాంతరును బడిలోనే వదిలేసి వచ్చాడు. వంటగది కిటికీలోంచి మాత్రమే వెలుతురు పడుతోంది. ఉర్సులా కేశపరిమళం అతని ముక్కుపుటాలను గుప్పున తాకుతోంది. ఆమె పట్టు శాలువాను దగ్గరికి లాక్కుని చేతులు కట్టుకుంది.
‘‘మీకు చలేస్తోంది..’’ అన్నాడు.
‘‘ఔను. లోనికెళ్దామా?’’
‘‘వద్దు! నేను.. ’’ అతడు ఆమె దారికడ్డంగా నిలిచాడు.
ఆమె గడ్డాన్ని వెచ్చని శాలువాలో జొనుపుకుంటూ అతనికేసి పెద్దకళ్లతో ఆశ్చర్యంగా చూసింది.
‘‘ఏంటంటీ? మీ ధోరణి నాకేమీ అర్థం కావడం లేదు.’’
‘‘మీతో కొంచెం మాట్లాడాలి, అంతే.  నేను.. ఏంటంటే?’’
‘‘దయచేసి ఇప్పుడొద్దు. నాకు చలేస్తోంది.’’
‘‘లేదు. మీకు తెలియాలి. నాకు ఈ రోజే కాస్త పై ఉద్యోగం వచ్చింది. లితోగ్రాపుల దుకాణానికి మారుతున్నా. ఈ ఏడాదిలో నాజీతం మళ్లీ పెరగనుంది.’’
‘‘మీరు చెప్పాల్సిందేదో నాన్చకుండా చెప్పండి..’’
ఆ కంఠంలో విసుగు ధ్వనించింది  ప్రేమార్థికి. తన చేతగానితనానికి తననే తిట్టుకున్నాడు. ఉద్వేగం చప్పున చల్లారింది. ప్రశాంతంగా ఉండిపోయాండు. మాటలు కూడబలుక్కుని గొంతు విప్పాడు.
‘‘ఏమీ లేదు, మీకు ఇదివరకు తెలిసిందే. ఆ సంగతే చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. మీరు నా భార్య అయితే సంతోషిస్తాను.’’
ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతడు గమనించాడు. ఆమెను చేతుల్లోకి తీసేసుకుంటానేమో అని అనుకున్నాడు.
‘‘మీకు భార్యనవ్వాలా?’’ ఆమె గట్టిగా అరిచింది. ‘‘అది అసాధ్యం.’’
విన్సెంట్ ఆమెను కన్నార్పకుండా చూశాడు. ఆమె కూడా ఆ చీకట్లో అతని కళ్లను స్పష్టంగా చూసింది.
‘‘మీకు భార్యను కాలేను. మీకు నా విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాకు గత ఏడాది నిశ్చితార్థం అయింది.’’
అతడు దిగాలు పడిపోయాడు. అక్కడ ఎంతసేపు ఉన్నాడో, ఏం ఆలోచించాడో అతనికే తెలియకపోయింది.  
‘‘ఎవరితో?’’ గొంతు పెగల్చుకుని దైన్యంగా అడిగాడు.
‘‘అయ్యో, మీరెప్పుడూ ఆయణ్ని కలుసుకోలేదా? మీరు రాకముందు మీ గదిలోనే ఉండేవాడు. మీకు తెలిసే ఉంటుందనుకున్నాను.’’
‘‘నాకెలా తెలుస్తుంది?’’
ఆమె ఇక మాట్లాడలేదు. కాళ్ల మునివేళ్లపై నిల్చుని వంటగదివైపు చూసింది. ‘‘.. ఈ విషయం మీకు ఇదివరకే ఎవరైనా చెప్పేసే ఉంటారని అనుకున్నాను’’ అంది.
‘‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం తెలిసీ, ఏడాదిగా ఈ సంగతి నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు?’’ అతని మాటల్లో బెరుకు, తడబాటు పోయాయి.
‘‘మీరు నన్ను ప్రేమించడం నా తప్పా? నేను మీతో కేవలం స్నేహం మాత్రమే కోరుకున్నాను.’’
‘‘నేనిక్కడికొచ్చాక అతడెన్నడైనా మిమ్మల్ని కలిశాడా?’’
‘‘లేదు. అతడు వేల్స్ లో ఉంటున్నాడు. ఈ వేసవి సెలవులను నాతో గడిపేందుకు ఇక్కడికొస్తున్నాడు.’’
‘‘అంటే, ఏడాదిగా మీరు అతణ్ని చూడలేదు! కనక అతణ్ని మరచిపోయి, ఇప్పుడు నన్ను ప్రేమించండి.’’
అతనిలో వివేకం పూర్తిగా నశించింది. ఆమెను గట్టిగా వాటేసుకుని, బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆమె పెదాల తడిని, నోటి మాధుర్యాన్ని, శిరోజాల పరిమళాన్ని చవిచూశాడు. అతనిలో ప్రేమావేశం పోటెత్తింది.
‘‘ఉర్సులా, అతణ్ని ప్రేమించకు! నేను చచ్చినా నిన్ను వదలిపెట్టను. నిన్ను పెళ్లాడతా. నువ్వు లేకుంటే బతకలేను. నువ్వు అతణ్ని మరచిపోయి, నన్ను పెళ్లాడేదాకా ఊరుకునే ప్రసక్తే లేదు.’’
‘‘నీతో పెళ్లా?’’ అమె బిగ్గరగా అరిచింది. ‘‘నన్ను ప్రేమించిన మగాడినల్లా నేను పెళ్లాడాలా? చాలు. నన్నొదిలిపెడతావా? లేకపోతే సాయం కోసం అరవమంటావా?’’
ఆమె అతని పట్టు విడిపించుకుని, గసపోసుకుంటూ చీకటి బాటలో పరిగెత్తింది. అతడు తన వెనకాలే వస్తున్నట్టు అతని అడుగుల శబ్దంతో పసిగట్టి, చివ్వున అతని వైపు తిరిగి,
‘‘ఛీ.. మూర్ఖుడా!’’ అని సన్నని గొంతుకతో కసిరింది. కానీ అది అతనికి పెద్ద అరుపులా వినిపించింది.
(సశేషం)

No comments:

Post a Comment