Thursday, 29 October 2015

జీవన లాలస14(వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)


15. నల్ల ఈజిప్టు

విన్సెంట్ వేసిన ‘బొగ్గు మూటల భారం’ మార్చి భారంగా గడిచి ఏప్రిల్ వచ్చింది. వాతావరణం కాస్త మెరుగుపడింది. చలిగాలులు పోయాయి. అరుణ కిరణాలు వాడిగా సోకుతున్నాయి. మంచు కరడం మొదలై, నల్ల మైదానాల అసలు రంగు బయటపడుతోంది. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. అడవిలో వసంతగానానికి పారితాజాలు పుష్పిస్తున్నాయి. జ్వరాలు పోయాయి. గ్రీష్మాగమనంతో పల్లె ఆడవాళ్లకు బొగ్గు కోసం మళ్లీ మార్కాస్ దిబ్బను అధిరోహించే శక్తి సమకూరింది. కుటీరాల్లో ఉజ్వలాగ్నులు సౌందర్యభరితంగా లేవడంతో పిల్లలు మంచాలు దిగి ఆడుకుంటున్నారు. విన్సెంట్ సదనాన్నితిరిగి తెరిచాడు. బోధనకు పల్లెంతా తరలివచ్చింది. శ్రామికుల విషాదనేత్రాల్లో చిరునగవు మళ్లీ ప్రవేశించింది. చలితో వేలాడిపోయిన ముఖాలు కాస్త పైకి లేచాయి. డిక్రూక్ సదనంలోని కుంపటితో చతుర్లాడుతున్నాడు.
‘‘మంచి రోజులొస్తున్నాయి’’ విన్సెంట్ గురుపీఠంపై నుంచి హర్షోల్లాసంతో అన్నాడు. ‘‘దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు. మీరు సత్యవంతులని తేలింది. మన దారుణ బాధలు తొలిగాయి. పొలాల్లో గింజలు పక్వానికొస్తాయి. మీరు పని ముగించుకుని ఇంటిముంగిట కూర్చున్నప్పుడు సూర్యభగవానుడు తన ఆత్మీయోష్ణంతో మిమ్మల్ని వెచ్చబరుస్తాడు. పిల్లలు పిట్లల్నిఅనుసరిస్తూ, వనాల్లో మృదుఫలాలను ఏరుకుంటారు. మీకు శుభగడియలు రానున్నాయి, కళ్లెత్తి దేవదేవుణ్ణి దర్శించండి. ఆయన దయాసముద్రుడు. మీ విశ్వాసానికి, మీ నిరీక్షణకు తగిన ప్రతిఫలం అందజేస్తాడు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. మంచి రోజులు వస్తున్నాయి.’’
పల్లీయులు బోధకుడు చెప్పినట్టు దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించారు. సదనం పులకించింది. జనం పక్క మనిషితో, ‘‘అయ్యోరు చెప్పింది నిజమే. మన బాధలు పోయాయి. శీతాకాలం ముగిసింది. మంచి రోజులొస్తున్నాయి’’ అంటున్నారు.  
ఓ రోజు విన్సెంట్  పిల్లలతో కలిసి మార్కాస్ దిబ్బలో బొగ్గు ఏరుతున్నాడు. గనుల భవనంలోంచి కొంతమంది కార్మికులు బిలబిలా బయటకొస్తూ అన్ని దిక్కులూ పరిగెత్తడం చూశాడు.  
‘‘ఏం జరిగింది? ఇంకా మూడు గంటలు కాలేదు, సూర్యుడూ నడినెత్తికి రాలేదు, ఎందుకలా బయటికి పరిగెడుతున్నారు?’’
‘‘ఏదో ప్రమాదం జరిగింది!’’ ఓ కుర్రాడు పెద్దగా అన్నాడు. ‘‘ఇదివరకోసారీ ఇట్టాగే పరిగెత్తారు. గనుల్లోపల ఏదో కూలిపోయుంటుంది.’’
అందరూ గబగబా నల్లకొండ దిగారు. ఆ వేగానికి రాళ్లు తగిలి చేతులు దోక్కుపోయాయి. బట్టలు చిరిగిపోయాయి. మార్కాస్ మైదానం చుట్టూ జనం మూగుతున్నారు. పల్లెలోని ప్రతి మూలనుంచి ఆడవాళ్లు పసిబిడ్డల్ని గుండెలకు పొదువుకుని, ఎడబిడ్డల్ని బరబరా లాక్కుంటూ గనివైపు వస్తున్నారు.
విన్సెంట్ గని గేటు దగ్గరికి చేరుకున్నాడు. ‘‘గ్యాస్ పేలింది.. గ్యాస్ పేలింది! కొత్త బావిలో! వాళ్లందరూ చిక్కుకున్నారు’’ కార్మికులు గట్టిగా అరుస్తున్నారు.  
జాక్ వెర్నీబలం కూడదీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. జబ్బుతో మనిషి సగమయ్యాడు. విన్సెంట్ ఆందోళనపడుతూ అతణ్ని పట్టుకుని, ‘‘ఏమైంది? చెప్పండి’’ అని అడిగాడు.  
‘‘డిక్రూక్ బావిలో! ఆ రోజు నీలిదీపాలు చూశారు, గుర్తున్నాయా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను.’’
‘‘ఎంతమంది ఉన్నారక్కడ? వాళ్లను బయటకు తీసుకురాలేమా?’’
‘‘పన్నెండు అరలు. మీరు చూశారు కదా, ఒక్కోదాంట్లో ఆరుగురు.’’
‘‘కాపాడలేమా?’’
‘‘ఏమో! నేను వెంటనే సహాయకుల్ని కిందికి తీసుకుపోవాలి’’
‘‘నేనూ వస్తాను. సాయం చేస్తాను.’’
‘‘వద్దు, అనుభవమున్నవాళ్లు కావాలి’’ అంటూ జాక్ బోను దగ్గరికి పరిగెత్తాడు.
తెల్లగుర్రాన్ని పూన్చిన బండి గేటు దగ్గరికి చేరింది. అది ఇదివరకూ ఎన్నో శవాలను, ఎందర్నో క్షతగాత్రులను లోయలోని పూరిళ్లకు మోసుకెళ్లింది. కొందరు భోరున విలపిస్తున్నారు. పిల్లలూ ఏడుపు లంకించుకున్నారు. మేస్త్రీలు గొంతుచించుకుని అరుస్తూ సహాయకులకు ఆదేశాలిస్తున్నారు.
ఉన్నట్టుండి నిశ్శబ్దం ఆవరించింది. భవనంలోంచి కొంతమంది దుప్పట్లలో ఏవో వెూసుకుంటూ నెమ్మదిగా వస్తున్నారు. కొన్నిక్షణాల మౌనం తర్వాత గుండెలుపగిలే రోదనలు మిన్నంటాయి.
‘‘ఎవరు వాళ్లు? చచ్చిపోయారా, బతికే ఉన్నారా? పేర్లు చెప్పండి, వాళ్లను చూపించండి! మా ఆయన గనిలోనే ఉన్నాడు. నా పిల్లలు కూడా! నా ఇద్దరు బిడ్డలూ ఆ బావిలోనే ఉన్నారు?’’ ఒక అభాగ్యురాలు అడుగుతోంది.
దుప్పట్లు వెూసుకొస్తున్నవాళ్లు గుర్రబ్బండి వద్ద ఆగారు. ‘‘బొగ్గును బయటకు తెస్తున్నవాళ్లలో ముగ్గురిని కాపాడాం. కానీ, అప్పటికే బాగా కాలిపోయారు.’’
‘‘ఎవరు వాళ్లు? మీ పుణ్యముంటుంది, చెప్పండి నాయనా! వాళ్ల ముఖాలు చూపండి. నా బిడ్డ అక్కడే ఉన్నాడు.. నా బిడ్డ, నా బంగారుకొండ!’’
దుప్పట్లు పక్కకు తొలగించారు. తొమ్మిదేళ్ల బాలికలిద్దరు, ఓ పదేళ్ల బాలుడు! ముఖాలు తీవ్రంగా కాలిపోయాయి. ముగ్గురూ స్పృహలో లేరు. తల్లిదండ్రులు, తోబుట్టువులు వాళ్లపై పడిపోయి గొల్లుమన్నారు. బతికారన్న సంతోషమూ ఆ రోదనల్లో ఉంది. ఆ పిల్లల్నిబండిలో చేర్చారు. బండి మైదానం మధ్యలోని బాట గుండా సాగుతోంది. విన్సెంట్ బండి వెనక ఒగరుస్తూ నడుస్తున్నాడు. వెనక.. గనుల వద్ద నుంచి ఏడుపులు, పెడబొబ్బలు పెరుగుతున్నాయి.  వెనుదిరిగి చూశాడు. దిగంతాల్లో నుసిదిబ్బల బారు కనిపించింది.
‘‘నల్ల ఈజిప్టు’’ విన్సెంట్ కంఠంలోంచి ఆక్రోశం బద్దలైంది. ‘‘నల్ల ఈజిప్టు. జనం మళ్లీ బానిసలయ్యారు. దేవుడా? ఎందుకిలా చేస్తున్నావు?’’
పిల్లలు మృత్యువు కోరల్లోకి వెళ్లి వచ్చారు. కాళ్లుచేతులపై, మఖంపై చర్మం, వెంట్రుకలు మాడిపోయాయి. గుర్రబ్బండి గాయపడిన బాలికల్లో ఒక బాలిక ఇంటి దగ్గర ఆగింది. విన్సెంట్ లోనికెళ్లాడు. ఆ పిల్ల తల్లికి దుఃఖంలో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. విన్సెంట్ బాలిక బట్టలు తొలగించి, నూనె తెమ్మని అరిచాడు. ఇంట్లో రవంత నూనే ఉంది. విన్సెంట్ దాన్ని గాయాలపై పూసి, కట్లు కట్టేందుకు గుడ్డలు తెమ్మన్నాడు.
తల్లి స్థాణువై అతనికేసి భయంతో నిలువుగుడ్లేసుకుని చూసింది. అతడు ఆగ్రహంతో, ‘‘వినబడ్డంలేదా, గుడ్డలు! నీకు నీ పిల్ల బతకాలని లేదా?’’ కసిరాడు.
‘‘ఇంట్లో గుడ్డలేమీ లేవండి..’’ అమె వలవలా ఏడ్చింది. ‘‘కొంపలో ఒక్క తెల్లపేలికా లేదు. చలికాలమంతా సరైన బట్టల్లేకుండానే నెట్టుకొచ్చాం..’’
బాలిక బాధతో లుంగలుచుట్టుకుపోతూ మూలుగుతోంది. విన్సెంట్ తన కోటు, చొక్కా విప్పి, బినియన్ను పరపరా పీకేశాడు. బనియన్ను పేలికలు చేసి చిన్నారికి కట్లుకట్టాడు. నూనె డబ్బా తీసుకుని రెండో బాలిక ఇంటికెళ్లాడు. ఆమెకూ కట్లు కట్టాడు. కుర్రాడి చెంతకెళ్లాడు. గుడ్డముక్కలు అయిపోయాయి. పిల్లాడు నరకయాతన పడుతున్నాడు. విన్సెంట్ తన లోదుస్తు తీసి, దాంతో వాడికి కట్లు కట్టాడు. మార్కాస్‌ వైపు పరిగెత్తాడు. దూరాన్నుంచి రోదనలు వినిపిస్తున్నాయి.
కార్మికులు గేటువద్ద గుమికూడారు. గనిలో ఒక పర్యాయం ఒక సహాయక బృందం మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. బావి దారి చాలా ఇరుకు. వాళ్లు తెచ్చే కబురు కోసం బయట జనం నిరీక్షిస్తున్నారు. విన్సెంట్ ఓ సహాయక మేస్త్రీతో మాట్లాడాడు.
‘‘బతికుండే అవకాశముందా?’’
‘‘ఈపాటికి చనిపోయే ఉంటారు. అందరూ బండ కింద పడిపోయారు.’’
‘‘బయటికి తేవాలంటే ఎంతసేపు పడుతుంది?’’
‘‘కొన్ని వారాలు. నెలలు కూడా పట్టొచ్చు.’’
‘‘ఎందుకంత ఆలస్యం..’’
‘‘ఇదివరకు అలాగే జరిగింది..’’
‘‘అయితే వాళ్లు ఇక చనిపోయినట్టేనా?’’
‘‘యాభయ్యేడు మంది. మగవాళ్లూ, ఆడపిల్లలూ కలిపి. వాళ్లనిక ఎప్పటికీ చూడలేం.’’
సహాయక బృందాలు రెండు రోజులు కష్టపడ్డాయి. బావిలో చిక్కుకుపోయిన వాళ్ల భార్యాపిల్లల్ని గని వద్ద నుంచి పంపడం సాధ్యం కాలేదు. చిక్కుకున్నవాళ్లను ఎలాగైనా బయటికి తెస్తామని మగవాళ్లు చెబుతున్నా ఆడవాళ్లు నమ్మడం లేదు. వాళ్ల కోసం ఇరుగుపొరుగు ఆడవాళ్లు కాఫీ, బ్రెడ్డు పట్టుకొచ్చారు. కానీ ఆ శోకమూర్తులు వాటిని ముట్టడం లేదు. నడిరాతిరి గనిలోంచి జాక్ వెర్నీని దుప్పట్లో చుట్టుకుని తీసుకొచ్చారు. అతనికి గనిలోపల మెదడు చిట్లి రక్తస్రావమైంది. మర్నాడు చనిపోయాడు.   
విన్సెంట్ డిక్రూక్ భార్యను బతిమాలి బామాలి పిల్లలతోపాటు అక్కణ్నుంచి ఇంటికి పంపాడు. సహాయక సిబ్బంది పన్నెండు రోజులు అహరహం శ్రమించారు. బొగ్గు తవ్వకం ఆగిపోయింది. కార్మికులకు కూలి పోయింది. డెనిస్ భార్య పల్లె జనానికి అరువుపై బ్రెడ్డు ఇచ్చింది. డబ్బు ఖర్చయిపోయి బేకరీ మూసేసింది. కార్మికులకు కంపెనీ వీసమెత్తు సాయం కూడా చేయలేదు. పన్నెండో రోజు సాయంత్రం సహాయక చర్యలు ఆపేసి, మళ్లీ బొగ్గు తవ్వాలని కార్మికులను ఆదేశించింది. పెటీ వాస్మెస్ ఆకలితో అల్లాడుతోంది. కార్మికులు సమ్మె కట్టారు.
విన్సెంట్‌కు ఏప్రిల్ నెల జీతమొచ్చింది. వాస్మెస్ కు వెళ్లి, మొత్తం యాభై ఫ్రాంకులకూ ఆహారం కొన్నాడు. పెటీ వాస్మెస్ తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టాడు. ఆ తిండితో పల్లెజనం ఆరు రోజులు నెట్టుకొచ్చారు. తర్వాత అడవిలోకి వెళ్లి  పళ్లు, ఆకులలములు తెచ్చుకున్నారు. మగవాళ్లు ఎలకలు, ఉడుములు, పిల్లులు, కుక్కలు, నత్తలు, కప్పల కోసం బాడవల్లో వెతుకుతున్నారు. దహించుకుపోతున్న క్షద్బాధను తీర్చుకోడానికి ఏది దొరికినా వదలడం లేదు. విన్సెంట్ సాయం కోసం బ్రస్సెల్స్ లోని మతబోధకులకు ఉత్తరం రాశాడు, కాని ఎలాంటి సాయమూ అందలేదు. పెటీ వాస్మెస్ పస్తు పడింది.  
గనిలో చనిపోయిన యాభై ఏడుమంది ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చెయ్యాలని జనం విన్సెంట్‌ను కోరారు. వందమంది ఆడామగా, పిల్లాజెల్లలతో విన్సెంట్ పూరిల్లు కిక్కిరిసింది. విన్సెంట్ కొన్నాళ్లుగా కాఫీ, మంచినీళ్లపై నెట్టుకొస్తున్నాడు. నీరసంతో తూలిపోతున్నాడు. నిరాశానిస్పృహలు తిరిగి చెలరేగాయి. ముఖంలో ఎముకలు తేలి, కళ్లు గుంటలు పడ్డాయి. ఎర్రగడ్డం జడలు కట్టింది. ఒంటికి ముతకబట్ట చుట్టుకున్నాడు. విరిగిన వాసానికి వేలాడుతున్న లాంతరు మిణుకుమిణుకుమంటోంది. విన్సెంట్ ఓ మూల గడ్డిపరకలపై పడుకుని ఉన్నాడు. తలకింద ఆసరాగా మోచేయి పెట్టుకున్నాడు. గుడిసె చెక్క పలకలపై, అక్కడున్న వందమంది మూగవేదనాజీవులపై లాంతరు వింత వెలుగునీడలను పరుస్తోంది.  
బోధకుడు పొడిబారిన జ్వరదహిత రుద్ధకంఠంతో ప్రార్థన ఆరంభించాడు. ఆకలి, ఓటములతో కుంగిపోయిన మసిముఖాల శల్యావశిష్టులు అతణ్ని దేవుడిలా చూస్తున్నారు. అసలైన దేవుడు వాళ్లకు బహుదూరం మరి.
బయట కొత్త గొంతులు పెద్దగా వినించాయి. అవి కఠినంగా ఉన్నాయి. ఓ పిల్లాడు తలుపు తెరుచుకుని లోనికొచ్చి, ‘‘విన్సెంట్ అయ్యోరు ఇక్కడే ఉన్నారండి బాబుగోరూ!’’ అన్నాడు.  
విన్సెంట్ ప్రార్థన ఆపేశాడు. జనం తలతిప్పి గుమ్మంవైపు చూశారు. మంచి దుస్తుల్లో ఉన్న ఇద్దరు లోనికొచ్చారు. దీపం ఒక క్షణం పెద్దగా జ్వలించింది. కొత్త ముఖాల్లో భయబీభత్సాలు తొంగిచూశాయి. విన్సెంట్ వాటిని గమనించాడు.
‘‘రండి రండి రెవరెండ్ జోంగ్, రెవరెండ్ బ్రింక్!’’ ఆహ్వానించాడు కూర్చునే. ‘‘మార్కాస్ గనిలో సజీవసమాధి అయిపోయిన యాభై ఏడుమంది కూలీల ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా వీళ్లను ఊరడిస్తూ నాలుగు ముక్కలు చెప్పండి.’’
ఆ ఇద్దరు మతబోధకులు అక్కడి వాతావరణం, విన్సెంట్ రూపురేఖలూ చూసి నిర్విణ్నులయ్యారు.
‘‘ఎంత ఘోరం! ఎంత ఘోరం!’’ జోంగ్ గుండెలు బాదుకున్నాడు.  
‘‘నువ్వేమైనా ఆఫ్రికాలో ఉన్నావనుకుంటున్నావా విన్సెంట్?’’ బ్రింక్ ప్రశ్న.
‘‘ఇతడు ఎంతటి అపరాథం చేశాడో దేవుడికే తెలుసు.’’
‘‘వీళ్లను మళ్లీ  క్రైస్తవుల్ని చెయ్యాలంటే ఏళ్లు పడుతుంది.’’
జోంగ్ బానపొట్టపై చేతులుకట్టుకుని, ‘‘ఇతగాణ్ని బోధకుడిగా నియమించొద్దని ఓo ప్రథమంలోనేనెత్తీనోరూ కొట్టుకుని చెప్పాను...’’ అని అరిచాడు. 
‘‘నాకు తెలుసు.. కానీ ఆ పీటర్సన్ చేశాడిదంతా.. ఇలా జరుగుతుందని ఎవరు కలగన్నారు? సందేహం లేదు, ఈ కుర్రాడు పిచ్చివాడే!’’
‘‘ఇతని వ్యవహారంపైన నాకు మొదట్నుంచీ అనుమానమే. ఇతన్ని నేనెప్పుడూ నమ్మలేదు.’’
రెవరెండ్ జోంగ్ మాట్లాడుతున్న శుద్ధ ఫ్రెంచి.. బొరైన్లకు ఒక్క ముక్కా అర్థం కాలేదు. జ్వరంతో తీసుకుంటున్న విన్సెంట్ కు కాస్త దూరంలో ఉన్న ఆ మతబోధకులు ఏం మాట్లాడుతున్నారో సరిగ్గా అర్థం కావడం లేదు.
స్థూలకాయుడైన జోంగ్ జనం మధ్యలోంచి దారి చేసుకుంటూ విన్సెంట్ దగ్గరికెళ్లి నెమ్మదిగా కటువుగా.. ‘‘ముందు, ఈ మురికి కుక్కల్ని బయటికి పంపు!’’ అన్నాడు.
‘‘కానీ ప్రార్థనలు ఇంకా పూర్తి కాలేదే..’’

‘‘ప్రార్థన సంగతి తర్వాత. ముందు, వాళ్లను ఇళ్లకు పంపెయ్..’’
జనం నెమ్మదిగా లేచి ఒకరి వెనక ఒకరు బయటికెళ్లారు. వాళ్లేకేమీ అర్థం కాలేదు. రెవరెండ్లు విన్సెంట్‌ ను నిలదీశారు. ‘‘ఎందుకిలా పాడైపోతున్నావు? ఈ పూరికొంపలో మతబోధనేమిటి? ఇక్కడ ఏ కొత్త అనాగరిక మతాన్ని మొదలెట్టావు? నీకు సభ్యతా సంస్కారం లేవా? క్రైస్తవ బోధకుడికి ఇది తగిందేనా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మా చర్చి ప్రతిష్టను మంటగలపాలని కంకణం కట్టుకున్నావా?’’
జోంగ్ కాసేపు ఆపి.. పాడబడిన పూరింటిని, విన్సెంట్ పడుకున్న గడ్డిని పరుపును, అతని ఒంటిపైనున్న గొనెపట్టను, గుంటకళ్లను పరికించాడు.  
‘‘మా చర్చి అదృష్టం బాగుండబట్టి నిన్ను తాత్కాలిక బోధకుడిగానే నియమించుకున్నాం. ఇప్పుడది కూడా రద్దయిపోయింది. ఇంకెప్పడూ మా తరఫున బోధన చెయ్యకు. నీ ప్రవర్తన రోత పుట్టిస్తోంది. నీకిక జీతం రాదు. నీ స్థానంలో ఇక్కడికి వెంటనే కొత్త బోధకుణ్ని పంపిస్తాం. నువ్వో ఉన్మాదివి. క్రైస్తవ ధర్మానికి, బెల్జియం ఇవాంజెలికల్ చర్చికి నీలాంటి బద్ధశత్రువు మరొకడు లేడు!’’
దూషణల పర్వం ముగిశాక కాసేపు మౌనం రాజ్యమేలింది. ‘‘సరి. నీవైపు నుంచి తప్పు లేదని ఏమైనా చెప్పుకుంటావా?’’
బ్రస్సెల్‌లో ఆ బోధకులు తనకు నియామకాన్ని నిరాకరించిన రోజు గుర్తుకొచ్చింది విన్సెంట్ కు. ఏమీ బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు.
‘‘ఇక వెళ్దాం పదండి జోంగ్ గారూ! ఇక్కడ మనం చేసేదేమీ లేదు. ఇతనిపై ఆశల్లేవు. వాస్మెస్‌ లో మంచి హోటల్ దొరక్కపోతే ఈ రాత్రికే తిరిగి మోన్స్ వెళ్లిపోదాం’’ అన్నాడు రివరెండ్ బ్రింక్.  

(సశేషం..)

2 comments:

  1. sir please post the remaining parts.we are waiting for it.

    ReplyDelete
    Replies
    1. చాలా థ్యాంక్సండి. కొన్ని వేరే పనుల వల్ల పోస్ట్ చెయ్యలేదు. సారీ..

      Delete