Wednesday, 28 October 2015

జీవన లాలస13(వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)


13. వ్యాపార సూత్రం


విన్సెంట్ వేసిన కార్మికులు

చార్బానేజెస్ బెల్జిక్ కంపెనీకి వాస్మెస్ చుట్టుపక్కల నాలుగు గనులున్నాయి. కార్మికుల కడగళ్లను చూసి చలించిపోయిన విన్సెంట్ కంపెనీ మేనేజర్ ను ఒకసారి  కలవాలనుకున్నాడు. మేనేజర్ అతడు ఊహించినంత దురాశాపరుడేమీ కాదు. నిక్కచ్చిగా ఉన్నా దయగానూ ఉన్నాడు. కళ్లలో సానుభూతి కనిపిస్తోంది. తనంతట తాను ఎవరినీ బాధపెట్టేరకంగా కనిపించడం లేదు. విన్సెంట్ అతని ముందు కూర్చుని కార్మికుల కష్టాలను ఏకరవు పెట్టాడు.
అతడు శ్రద్ధగా విని, ‘‘నాకంతా తెలుసండి వ్యాన్గోగారూ! అది పాత కథే. మేం భారీ లాభాల కోసమే వాళ్లను ఆకలితో మాడగొట్టి చంపుతున్నామని వాళ్లనుకుంటారు. కానీ అందులో రవంత కూడా నిజం లేదు. నా మాట నమ్మండి. ప్యారిస్ లోని అంతర్జాతీయ గనుల సంఘం తయారు చేసిన పట్టికలు మీకు చూపిస్తా’’ అంటూ ఓ పెద్ద చార్టును టేబుల్ పై పరిచి, అందులో అడుగున ఉన్న నీలిరంగు గీతను చూపించాడు.
‘‘బెల్జియం బొగ్గుగనులు ప్రపంచలోకెల్లా నాసిరకమైనవి. బొగ్గుతీయడమూ చాలా కష్టం. భారీ లాభానికి అమ్మడం కల్లో మాట. పైగా మా నిర్వహణ ఖర్చులు యూరప్ లోని అన్ని గనుల ఖర్చులకంటే ఎక్కువ.  లాభాలు మాత్రం తక్కువ. అయినా, మార్కెట్ లో బొగ్గును మిగతా కంపెనీలు అమ్మే ధరకే అమ్మాలి. రోజూ దివాలా అంచుల్లో ఉంటాం. వింటున్నారా?’’
‘‘ఆ.. చెప్పండి’’
‘‘మేం ఒక వేళ కార్మికులకు ఇంకో ఫ్రాంకు ఎక్కువిస్తే ఉత్పత్తి ఖర్చు మార్కెట్ లో మేమమ్మే బొగ్గు ధరను మించిపోతుంది. తర్వాత కంపెనీని మూసుకోవాల్సి వస్తుంది. అప్పుడిక వాళ్లు నిజంగానే ఆకలితో చచ్చిపోతారు.’’
‘‘మరి, కంపెనీ తనకొచ్చే లాభాల్లో తన వాటా కాస్త తగ్గించుకోవచ్చు కదా? అప్పుడు కార్మికులకు కాసింత మిగులుతుంది.’’
మేనేజర్ విచారంగా తల పంకించాడు. ‘‘సాధ్యం కాదండి. గనుల్ని దేనిపై నడుపుతున్నారో మీకు తెలుసుకదా? పెట్టుబడి! మిగతా అన్ని పరిశ్రమల మాదిరే ఇదీ. పెట్టుబడికి కచ్చితంగా ప్రతిఫలం ముట్టాలి. లేకపోతే మరో చోటికి వెళ్లిపోతుంది. వాటాదారులకు మా కంపెనీ మూడు శాతం డివిండెండు మాత్రమే ఇస్తోంది. అందులో అరశాతం తగ్గినా వాళ్లు వాటా డబ్బులు వెనక్కి తీసుకుంటారు. డబ్బుపోతుంది కనక గనులు మాసుకోవాల్సి వస్తుంది. అప్పుడూ కార్మికులు ఆకలిబారిన పడతారు. కాబట్టి  బోరినాజ్‌లో ఈ దారుణాన్ని సృష్టించింది యజమానులూ కాదు, మేనేజర్లూ కాదు. ఆ పాపమంతా అంత దరిద్రంగా ఉన్న గనులదే. అందుకు దేవుణ్నే నిందించాలి!’’
ఆ దైవదూషణకు విన్సెంట్ దిగ్ర్భాంతి చెంది ఉండాల్సింది. కానీ దాని గురించి ఆలోచించకుండా మేనేజర్ వాదన గురించి ఆలోచించాడు.  
‘‘కనీసం పనిగంటలైనా తగ్గించాలి. రోజుకు గనిలో పదమూడు గంటల పని ఈ ఊరిని మొత్తం చంపిపారేస్తుంది.’’
‘‘అది కూడా సాధ్యం కాదు. తగ్గిస్తే వాళ్లు తెచ్చే బొగ్గు తగ్గుతుంది. వాళ్లకు ఎక్కువ కూలి ఇచ్చినట్టవుతుంది. మా ఖర్చు పెరుగుతుంది.’’
‘‘కానీ ఒక ఒక విషయంలో మాత్రం కచ్చితంగా మార్పు తేవొచ్చు’’
‘‘పని పరిస్థితుల్లోనా?’’
‘‘అవును. కనీసం ప్రమాదాలను, చావులను అయినా తగ్గించాలి.’’
మేనేజర్ తల నెమ్మదిగా అడ్డంగా ఊపాడు. ‘‘లేదండి! అదీ సాధ్యం కాదు. మా కంపెనీ డివిండెట్లు చాలా తక్కువ కనక మార్కెట్లో కొత్త వాటాలు అమ్ముడబోవడం లేదు. భద్రత విషయంలో ఏమైనా చేద్దామంటే లాభాల్లోంచి ఏమీ మిగలడం లేదు. ఇదంతా ఒక దుర్మార్గపు విషవలయం. నేను దాని చుట్టూ వేలసార్లు తిరిగాను. అలా తిరిగీ తిరిగీ పరమ కేథలిక్కు భక్తుణ్నయిన నేను ఇప్పుడు కరడుగట్టిన నాస్తికుణ్ని అయ్యాను. స్వర్గంలోని ఆ దేవుడు బుద్ధిపూర్వకంగా ఎందుకిలాంటి దారుణాన్ని సృష్టించి, ఒక జాతి జనులందర్నీ శతాబ్దాల తరబడి ఒక్కనిమిషం కూడా కనికరం చూపకుండా హీనమైన బానిసత్వంలో పడదోస్తున్నాడో నాకర్థం కావడం లేదు!’’
విన్సెంట్ తానిక చెప్పాల్సిందేమీ లేదని అక్కణ్నంచి లేచి తలదిమ్ముతో ఇంటి దారి పట్టాడు.  14. ‘పెళుసు’


బోరినాజ్ లో ఫిబ్రవరి మాసం మిగతా మాసాలకంటే దుర్భరంగా ఉంటుంది. లోయలోనూ, కొండపైనా తీవ్రమైన  శీతల వాయువులు ఈడ్చికొడుతుంటాయి. వీధుల్లో నడవడమే కష్టం. గుడిసెలకు వెచ్చదనం కోసం మరింత నుసి బొగ్గు అవసరమవుతుంది. కానీ ఆడవాళ్లు భయంకరమైన చల్లగాలులకు జడిసి, దిబ్బల ఛాయలకే వెళ్లరు. వాళ్లకు కొంకర్లు పెట్టి కొరికేసే ఆ చలిపులి నుంచి కాపాడుకోడానికి ముతక గౌన్లు, జాకెట్లు, రుమాళ్లు నూలు సాక్సులే శరణ్యం. వాటితోనే పోరాడాలి.  
ఆరుబయట ఆడుకోవాల్సిన పిల్లలు చలికి భయపడి మంచాలు దిగరు. పొయ్యిలోకి బొగ్గు ఉండదు కనక వేడి ఆహారం ఉండదు. మగవాళ్లు పాతాళ గనుల్లో ఉడికిపోయి బయటకొచ్చిన మరుక్షణం కోతపెట్టే శీతల నరకంలోకి అడుగుపెడతారు. మంచుకురిసిన మైదానం గుండా, ఒళ్లు గడ్డకట్టించే చలిగాలిలో యాతనపడుతూ ఇళ్లకు చేరతారు. క్షయ, న్యూమోనియాలతో రోజూ ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు. ఆ నెలలో విన్సెంట్ చాలా అత్యక్రియల్లో పాల్గొని ప్రార్థనలు చేశాడు. పిల్లలకు చదువు చెప్పడం మానేసి, శైత్యతాడిత కుటీరాలను ఆదుకోడానికి పగటిపూట మార్కాస్ దిబ్బలో కళ్లుపొడుచుకుని బొగ్గుముక్కలు ఏరుతున్నాడు.  ఇదివరకట్లా ముఖానికి రోజూ అదేపనిగా దుమ్ము పూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. పనివాళ్లలో ఒక పనివాడైపోయాడు. కొత్తవాళ్లెవరైనా ఆ పల్లెకొస్తే అతణ్నీ కర్రెముఖమోడనే పిలుస్తారు.  

ఓరోజు దిబ్బలో గంటలపాటు పైనా కిందా వెతికి సగం సంచికి నుసిబొగ్గు నింపుకున్నాడు. నీలిరంగుకు తిరిగిన చేతుల చర్మం మంచుకమ్మిన సూదంటురాయి తగిలి కోసుకుపోయింది. సాయంత్రం నాలుగింటికి ఏరడం మానేసి, ఏరిన బొగ్గును పంచడానికి పల్లెబాట పట్టాడు. ఆడాళ్లు గనులనుంచి వచ్చే తమ భర్తలకు కాఫీ కాచే సమయమది. విన్సెంట్ మార్కాస్ గని గేటుకు దగ్గరవుతుండగా పనివాళ్లు గుంపులుగుంపులుగా బయటికొస్తున్నారు. కొందరు అతణ్ని గుర్తుపట్టి పలకరించారు. గుర్తుపట్టనివాళ్లు చేతుల్ని జేబుల్లో దాచుకుని, వంగిన భుజాలతో నేలచూపులు చూస్తూ వెళ్లిపోయారు.  
గేటు దగ్గర ఓ ముసలి కార్మికుడు మిగిలిపోయాడు. ఖల్లుఖల్లుమని గుండెలు పగిలేలా దగ్గుతున్నాడు. దగ్గుతో ఒళ్లంతా ఊగిపోతోంది. అడుగుతీసి అడుగు వెయ్యలేకపోతున్నాడు. మోకాళ్లు వణుకుతున్నాయి. మంచు మైదానం నుంచి హోరుమంటూ బలమైన గాలి తగలగానే ఎవరో పిడిగుద్దులు గుద్దినట్టు తూలిపోతున్నాడు. ఒకసారి గాలిదెబ్బకు దబ్బున కిందపడిపోయాడు. కొన్నిక్షణాల తర్వాత ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని గాలిని కాచుకోవడానికి వారగా నడిచాడు. అతని ఒంటిపై గోనెపట్ట ఉంది. అది వాస్మెస్ లోని అంగడి నుంచి తెచ్చుకున్నది. దానిపై ఏవో అక్షరాలున్నాయి. విన్సెంట్ కళ్లు చిట్లించి చదివాడు.. ‘పెళుసు’ అని.
విన్సెంట్ నుసిబొగ్గును పల్లెలో పంచిపెట్టి గుడిసెకు చేరుకున్నాడు. తన బట్టలన్నీ మంచంపై పడేశాడు. ఐదు చొక్కాలు, నాలుగు జతల సాక్సులు, రెండు జతల బూట్లు, ప్యాంటు, రెండు కోట్లు ఉన్నాయి. ఓ చొక్కా, జత సాక్సులను మినహా అన్నింటిని బ్యాగులో కుక్కుకున్నాడు.  
ప్యాంటు, ఓ కోటును ‘పెళుసు’ ముసలతనికి ఇచ్చాడు. చొక్కా, బనీన్లను పిల్లలకు కత్తిరించి కుట్టించమని ఆడవాళ్లకు ఇచ్చాడు. క్షయసోకిన కార్మికులకు సాక్సులను పంచాడు. మరో కోటును ఓ గర్భిణికి ఇచ్చాడు. ఆమె భర్త ఇటీవలే బొగ్గుబావి కూలి చనిపోయాడు. ఇద్దరు పిల్లల్ని సాకేందుకే ఆమె గనిపనికి వెళ్తోంది.  
విన్సెంట్ బాలల సదనాన్ని మూసేశాడు. దాన్ని నడపాలంటే బొగ్గు కావాలి. ఆడవాళ్లు కష్టంతో ఏరి తెచ్చుకునే బొగ్గును ఉత్తిపుణ్యానికి తీసుకోవడం అతనికి ఇష్టం లేదు. చలిగాలిలో, మురికినీళ్లలోంచి అక్కడికి రావాలంటే కాళ్లు పగులుతాయని జనం కూడా భయపడుతున్నారు. విన్సెంట్ పల్లె అంతగా తిరుగుతూ జనానికి చిన్నచిన్న పనులు చేసిపెడుతున్నాడు. అయితే వాటితో సరిపోదని, పూర్తికాలం వాళ్లకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలకు మూతీముక్కూ తుడవడం, బట్టలుతికి పెట్టడం, రోగులకు మందులివ్వడం, జావ కాచివ్వడం వంటి పనుల్లో మునిగిపోయాడు. ఆ పరిచర్యల్లో పడిపోయి తాను మతబోధకుడినన్న సంగతే మరిచిపోయాడు. బైబిల్ చదివే తీరిక లేదు. దేవుని వాక్కు ఆ దీనజనావళికి అందని ద్రాక్షపండైపోయింది.
మార్చిలో చలికాస్త తగ్గింది కానీ జ్వరాలు విజృంభించాయి. విన్సెంట్ ఫిబ్రవరి జీతంలో నలభై ఫ్రాంకులను రోగులకు మందుమాకుల కోసం ఖర్చుచేశాడు. తను కడుపుకట్టుకున్నాడు. తిండిలేక రోజురోజుకూ  శల్యమైపోతున్నాడు. స్వభావసిద్ధమైన ఆందోళనా, గాబరా మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుర్భర శైత్యం అతని శక్తిని హరించింది. జ్వరం తగిలింది. జ్వరంతోనే పల్లెంతా తిరుగుతున్నాడు. కళ్లు లొట్టలుపడి నిప్పుల గుండాల్లా మారాయి. బుగ్గలు పీక్కుపోయి పెద్ద తల కుంచించుకుపోయింది. గడ్డం మాత్రం మరింతగా ముందుకు పొడుచుకొచ్చింది.
డిక్రూక్ పెద్ద కొడుక్కి టైఫాయిడ్ సోకింది. ఎక్కడ పడుకోబెట్టాలో తెలియడం లేదు. ఇంట్లో రెండు మంచాలే ఉన్నాయి; ఒకటి తల్లిదండ్రులకు, మరోటి పిల్లలకు. పెద్దాణ్ని మంచంలో చిన్నపిల్లల పక్కన పడుకోబెడితే వాళ్లకూ జబ్బు సోకుతుంది. చిన్నపిల్లల్ని కింద పడుకోబెడితే చలికి న్యూమోనియా సోకుతుంది. తల్లిదండ్రుల మంచంలో పడుకోబెడదామంటే, వాళ్లు కింద పడుకోవాలి. అలా పడుకుంటే రాత్రంతా చలితో కొయ్యబారి రేపు పనిలోకి వెళ్లలేరు. పరిస్థితి గమనించిన విన్సెంట్ తానేం చెయ్యాలో అర్థమైంది.
‘‘మీరు భోజనానికి ముందు నాకో సాయం చేస్తారా, నా వెంట వస్తారా?’’ అడిగాడు విన్సెంట్ డిక్రూక్ ను ఆ రోజు పనిలోంచి ఇంటికి రాగానే.  డిక్రూక్ అలసిపోయి ఉన్నాడు, తలపై గాయపు అవశేషం జివ్వుమని పీకుతోంది. అయినా విన్సెంట్ ను విషయమేంటని అడక్కుండా అవిటికాలు ఈడ్చుకుంటూ అతని వెనక నడిచాడు. విన్సెంట్ తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. మంచమీదున్న రెండు దుప్పట్లలో ఒకదాన్నికింద పడేశాడు. మంచాన్ని ఓ చివర పట్టుకుని,  ‘ఆ చివర మీరు పట్టుకోండిదీన్ని మీ పెద్దాడి కోసం మీ ఇంటికి పట్టుకెళ్దాం’’ అన్నాడు కార్మికుడితో.
డిక్రూక్ పళ్లు బిగించాడు. ‘‘మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లలో ఒకణ్ని దేవుడు తీసుకెళ్లాలనుకుంటే అలాగే కానియ్యండి. కానీ ఈ మెత్తం పల్లెకు సేవ చెయ్యడానికి ఒక్క వ్యాన్గోనే ఉన్నాడు. అతన్ని బలిపెట్టను’’ అని కాలీడ్చుకుంటూ  పిలుస్తున్నా పలక్కుండా వెళ్లిపోయాడు. కానీ, విన్సెంట్ పట్టువదల్లేదు. మంచాన్ని విడదీసి భుజాలపై పెట్టుకుని డిక్రూక్ ఇంటికెళ్లి మళ్లీ బిగించాడు. డిక్రూకూ, అతని భార్యా ఎండు బ్రెడ్డు, కాఫీతో కడుపు నింపుకుంటూ విన్సెంట్ ను మౌనంగా చూస్తుండిపోయారు. విన్సెంట్ జబ్బు కుర్రాణ్ని తన మంచంపై పడుకోబెట్టి, ఊరటగా తట్టాడు.  
కాసేపయ్యాక డెనిస్ ఇంటికెళ్లాడు. మంచం సంగతి చెప్పేసి, తను పడుకోవడానికి కాసింత ఎండుగడ్డి ఇవ్వమని డెనిస్ భార్యను అడిగాడు. ఆమె నివ్వెరపోయింది.  
‘‘విన్సెంట్, మీరుండిన గది ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మళ్లీ మాతో వచ్చి ఉండండి.’’
‘‘మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ ఉండలేను.’’
‘‘డబ్బు గురించి భయపడుతున్నారు కదూ! ఆ సంగతి వదిలెయ్యండి. మేం ఉన్నంతలో బాగానే బతుకుతున్నాం. మీరు మా తోడబుట్టినవాడిలా మాతోనే ఉండొచ్చు. డబ్బులివ్వక్కర్లేదు. దేవుడి బిడ్డలందరూ తోబుట్టువులని మీరే కదా చెబుతుంటారు!’’
విన్సెంట్ చలితో, ఆకలితో అలమటిస్తున్నాడు. సరైన తిండీ, నిద్రాలేక చిక్కిపోయాడు. కొన్నాళ్లుగా జ్వర ప్రేలాపనలూ మొదలయ్యాయి. ఎడతెరిపిలేని గ్రామస్తుల సామూహిక దుఃఖం అతణ్ని పిచ్చివాణ్ని చేస్తోంది. డెనిస్ ఇంట్లో తనున్న గదిలోని పడక వెచ్చగా, మెత్తగా, శుభ్రంగా ఉంటుంది. అక్కడుండిపోతే డెనిస్ భార్య వేళకు మంచి తిండి పెడుతుంది. జర్వం తగ్గడానికి సేవలు చేస్తుంది, చలిని వదలగొట్టడానికి  బలవర్ధకమై జావలు కాచి పోస్తుంది.. విన్సెంట్ నీరసంతో కింద పడిపోబోతూ అతికష్టమ్మీద నిల్చున్నాడు.
ఇది దేవుడు తనకు పెడుతున్న ఆఖరి పరీక్ష. ఇందులో తను ఓడిపోతే ఇదివరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇప్పుడు పల్లె అంతా దుర్భర కష్టాలతో, దారిద్ర్యంతో అల్లాడుతోంది. తను భీరువైపోయి, సుఖభోగాల కోసం వెంపర్లాడితే పథభ్రష్టుడైపోడా?
విన్సెంట్ అంతర్మథనంలోంచి తేరుకున్నాడు. ‘‘దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడండి. దయచేసి మీ ఆదరణతో నన్ను దారి మళ్లించకండి. నాకు కాసిని గడ్డిపరకలిస్తే చాలు. మరేమిచ్చినా తీసుకోను’’  అన్నాడు డెనిస్ భార్యతో. ఆమె అతని మాట కాదనలేకపోయింది.
విన్సెంట్ గడ్డిని తీసుకెళ్లి తన గుడిసెలో ఓ మూల చెమ్మనేలపై పరచుకుని పడుకున్నాడు. నిండా పల్చని దుప్పటి కప్పుకున్నాడు. రాత్రంతా నిద్రపట్టలేదు. తెల్లారుజామున దగ్గు పట్టుకుంది. జ్వరం పేలిపోతోంది. కళ్లు తిరుగుతున్నాయి. కుంపట్లోకి ఒక్క బొగ్గుముక్కా లేదు. దిబ్బలోంచి పిడికెడు నుసిబొగ్గు తెచ్చుకున్నా పల్లెకు ద్రోహం చేసినట్టేనని దిబ్బకేసే వెళ్లడమే లేదు. అతికష్టమ్మీద ఎండిన బ్రెడ్డును కాసింత నోట్లో వేసుకుని పేదజన గ్రామసేవకు బయల్దేరాడు.

(సశేషం)

No comments:

Post a Comment