Monday, 26 October 2015

జీవన లాలస12(వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)

12. మార్కాస్


విన్సెంట్ వేసిన బొగ్గుగనుల చిత్రం 


విన్సెంట్ మర్నాడు తెల్లారుజామున రెండున్నరకే లేచి, వంటగదిలోకెళ్లి ఎండిన బ్రెడ్డు ముక్కను నోట్లో కుక్కుకున్నాడు. పావుగంట తర్వాత ఇంటి ముందు జాక్ ను కలుసుకున్నాడు. రాత్రి నుంచి భారీగా మంచు కురుస్తోంది. చీకటికి తోడు మంచువల్ల మార్కాస్ వెళ్లే దారి సరిగ్గా కనిపించడం లేదు. మైదానం మీదుగా గనుల్లోకి వెళ్తుండగా కార్మికులు కనిపించారు. పుట్టలోకి వెళ్లే నల్లచీమల్లా నలుదిక్కుల నుంచి బిలబిలమంటూ గనుల్లోకి వెళ్తున్నారు. చలి కొంకర్లు పెడుతోంది. శ్రామికులు పల్చని నల్లకోట్లలో ముఖాలు దాచుకున్నారు. వెచ్చదనం కోసం చేతుల్ని ఛాతీలకేసి గట్టిగా చుట్టుకున్నారు.
జాక్ విన్సెంట్‌ను తొలుత ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడి అలమారాల్లో కిరోసిన్ దీపాలు వేలాడుతున్నాయి.  ఒక్కోదానిపై ఒక్కో అంకె ఉంది. ‘‘గనిలో ఏదైనా ప్రమాదం జరిగితే, గల్లంతయ్యే దీపాల్ని బట్టి ఏ మనిషి చిక్కుకుపోయాడో గుర్తిస్తారన్నమాట’’ వివరించాడు జాక్.
కార్మికులు ఎవరి దీపాన్ని వాళ్లందుకుని త్వరత్వరగా మంచుకరిగిన యార్డు మీదుగా గనుల్లోకి వెళ్తున్నారు. గనులపైనున్న ఓ భవనంలో లిఫ్టును పోలిన బోను ఉంది. విన్సెంట్, జాక్‌ లు పనివాళ్లలో కలిసిపోయారు. గనిలోకి వెళ్లే బోనులో మొత్తం ఆరు అరలు ఒకదానిపైన ఒకటున్నాయి. ఒక్కోదాంట్లో బొగ్గును పైకి తీసుకొచ్చే బండి కూడా ఉంది. ఒక్కో అరలో ఇద్దరు మాత్రమే పడతారు. బోను కిందికెళ్లేటప్పుడు వీపుల్ని బాగా వంచి కూర్చోవాల్సినంత సుఖంగా ఉంటాయవి! కానీ ఒక్కోదాంట్లో ఐదుగురు ఇరుక్కుని బొగ్గులమూటల్లా కిందికి జారిపోతున్నారు. జాక్ మేస్త్రీ కనక పై అరలోకి అతడూ, అతని సహాయకుడూ, విన్సెంట్ మాత్రమే వెళ్లి, బాగా వంగి కూర్చున్నారు. మడమలు అర జాలీకి తలుగుతున్నాయి. తలలు పైనున్న ఇనుప తాళ్లకు ఒరుసుకుంటున్నాయి.  
‘‘చేతుల్ని బాగా దగ్గరికి పెట్టుకోండి. గోడలకు తగిలితే పచ్చడైపోతాయి’’ హెచ్చరించాడు జాక్.
సిగ్నల్ ఇవ్వగానే బోను గనిలోకి దిగింది. రాతి గోడలకూ, బోనుకూ మధ్య అంగళానికి మించి దూరం లేదు.  తన కింద అరమైలు లోతు చీకటి గుయ్యారం ఉందని, జరగరానిది జరిగితే చావడం ఖాయమన్న ఆలోచనతో విన్సెంట్ ఒళ్లు గగుర్పొడించింది. చీకటి సొరంగంలోంచి తెలియని అఖాతంలోకి జారుతున్నప్పుడు కలిగే ఆ భయవిహ్వలం అది. అలాంటి అతనికి ఇదివరకెన్నడూ కలగలేదు. నిజానికి తనంతగా భయపడాల్సిందేమీ లేదని అతనికి తెలుసు. ఆ బోను వల్ల రెండు నెలలుగా ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అయినా భయం పోలేదు. కిరోసిన్ దీపాల గుడ్డివెలుగు అతనికి రవంత భరోసా కూడా ఇవ్వలేకపోతోంది.
విన్సెంట్ తనకు భయంగా ఉందని జాక్ తో అన్నాడు. జాక్ సానుభూతిగా నవ్వి, ‘‘ప్రతి కార్మికుడికీ మీలాగే అనిపిస్తుంది’’ అన్నాడు.
‘‘వీళ్లకు ఇది అలవాటైపోయినట్టుంది!’’
‘‘లేదు, లేదు. ఈ ప్రాణభీతి చచ్చేంతవరకూ ఉంటుంది.’’
‘‘మరి మీకు..?’’
‘‘పైకి బావున్నా, లోపల మీలాగే వణికిపోతున్నా.. ముప్పై మూడేళ్ల నుంచి ఇలా దిగుతూనే ఉన్నాకూడా..’’
బోను సగం దారిలో.. మూడువందల యాభై మీటర్ల వద్ద కొంతసేపు ఆగి మళ్లీకి కిందికి దిగింది. సొరంగం పక్కన అక్కడక్కడా నీళ్లు కారుతుండడం చూసి విన్సెంట్ మళ్లీ వణికాడు. పైకి చూడగా, ఉదయకాంతి చిన్న నక్షత్రంలా గోచరించింది. ఆరువందల యాభై అడుగుల వద్ద ముగ్గురూ అరలోంచి బయటకు దిగారు. బోను మళ్లీ బావిలోకి వెళ్లే బొక్కెనలా సర్రున కిందికి జారిపోయింది. పెద్ద సొరంగంలో అడుగుపెట్టినట్టు విన్సెంట్‌కు అర్థమైంది. అక్కడ రాళ్లూ, మట్టీ మధ్య బొగ్గు బళ్లను తీసుకెళ్లే పట్టాలు ఉన్నాయి. ఆ భూగర్భ తాపంలో అగ్నిగుండంలోకి వెళ్తున్నట్టు అనిపించింది విన్సెంట్ కు. అయితే దారి చాలా చల్లగానే ఉంది.
బోనులో బొగ్గుగనిలోకి దిగుతున్న కార్మికులు 
‘‘ఫర్వాలేదు. మరీ అంత కష్టంగా లేదు!’’ అన్నాడు జాక్ తో.
‘‘అవును. ఇక్కడెవరూ పనిచేయరు. ఇక్కడున్న బొగ్గును ఎప్పుడో తవ్వేశారు. ఇక్కడికి పైనుంచి కాస్త గాలొస్తుంది. కిందిబావుల్లోని వాళ్లకు నరకమే.’’
సొరంగంలో పావుమైలు నడిచాక, జాక్ వెనుదిరిగి, ‘‘ఇక్కణ్నుంచి చాలా నెమ్మదిగా రావాలి. ఏమాత్రం పట్టుజారినా చచ్చిపోతాం’’ అని హెచ్చరించి, క్షణంలో కనుమరుగయ్యాడు. విన్సెంట్ తడబడుతూ ముందుకు అడుగేశాడు. నేలపై మనిషిపట్టేంత కంత కనిపించింది. అక్కడున్న నిచ్చెన కోసం తడుముకున్నాడు. మొదటి ఐదు అడగులు కాస్త సులువుగా దిగాడు. మధ్యలోకి వెళ్లగానే మనిషి పూర్తిగా వెనక్కి తిరిగి దిగాల్సి వచ్చింది.  రాళ్ల మధ్యలోంచి నీళ్లు ఉబుకుతూ ధారలు కడుతున్నాయి. నిచ్చెనమెట్లపై బురద అంటుకుపోతోంది. తలపై నీటిబొట్లు పడుతున్నాయి.
మొత్తానికి అందరూ అడుగు భాగానికి చేరి, పొడవైన సొరంగంలో వెూకాళ్లపై పాకుతూ బొగ్గుతవ్వుతున్న అరల్లోకి చేరుకున్నారు. చిన్నచిన్న అరలు వరసగా ఉన్నాయి. పైనుంచి రాళ్లు జారిపడకుండా దుంగలను ఆసరాగా నిలబెట్టారు. ఒక్కో అరలో ఐదుగురు పని చేస్తున్నారు. ఇద్దరు గడ్డపార్లతో బొగ్గు తవ్వుతోంటే, మూడో మూడో మనిషి వాళ్ల కాళ్లకిందనుంచి దాన్ని పక్కకు తీస్తున్నాడు. నాలుగో మనిషి ఆ బొగ్గును చిన్నచిన్న బళ్లలో వేస్తున్నాడు. ఐదో మనిషి ఆడమనిషి. ఆమె ఆ బళ్లను పట్టాలపైకి లాగుతోంది. 
వాళ్లంతా కంపుగొడుతున్న నల్లని ముతక నారబట్టలు వేసుకున్నారు. బొగ్గుతోడుతున్న మగపిల్లలకు మొలగుడ్డ తప్ప ఒంటిపై మరే బట్టా లేదు. దాంతో ఒళ్లంతా మసిబారింది. మూడడుగుల వెడల్పున్న బిలంలో అమ్మాయిలు బళ్లు లాగుతున్నారు. అరల్లోంచి ఉప్పునీటి ధారలు ఆరిపోతూ స్ఫటికశిలల్లా మారిపోతున్నాయి. అక్కడక్కడా చిన్నచిన్న దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. చమురు ఆదా చెయ్యడానికి వాటి వత్తుల్ని బాగా తగ్గించారు. బయటి గాలి లోపలికి రావడానికి, లోపలి గాలి బయటికి పోవడానికి అవకాశమే లేదు. లోపలంతా బొగ్గుధూళి ఆవరించి గాలి జాడే లేకుండా పోయింది. పాతాళ సహజోష్ణంలో శ్రమజీవులు నల్లటిచెమట ధారలతో ముద్దయిపోయారు. విన్సెంట్ అరలు చూస్తూ ముందుకు పోతున్నాడు. ముందున్న అరల్లో కార్మికులు నిల్చొనే పనిచేస్తున్నారు. అయితే తర్వాత పోయే కొద్దీ అరల ఎత్తు అంతకంతకూ తగ్గుతోంది. పనివాళ్లు నేలపై వెల్లకిలా పడుకుని పంటిబిగువునా గడ్డపారలతో పొడుస్తూ బొగ్గు తవ్వుతున్నారు. పొద్దెక్కే కొద్దీ ఆ కష్టజీవుల దేహాలు కక్కుతున్న వేడితో అరలు మరింతగా మండిపోతున్నాయి.  గాలిలో దుమ్మూ మందంగా అలముకుంటోంది. అక్కడి అభాగ్యులు ఆ ఉష్ణాన్ని, గరళపు గాలినే ఎగశ్వాసతో లోనికి తీసుకుంటున్నారు.
‘‘వీళ్లకు రోజు దక్కేది రెండున్నర ఫ్రాంకుల కూలి.. అది కూడా వీళ్లు తెచ్చే బొగ్గు నాణ్యంగా ఉందని చెక్ పోస్ట్ లో తనిఖీదారు నిర్ధారిస్తేనే. ఐదేళ్లకిందట మూడు ఫ్రాంకులు ఇచ్చేవాళ్లు. అప్పట్నుంచి ఏటికేడు కూలి తగ్గిస్తున్నారు’’ జాక్ చెప్పాడు.   
కార్మికులకు, మృత్యువుకు మధ్య నిల్చున్న దుంగలను తనిఖీ చేశాడు.  
‘‘ఇవి బలంగా లేవు. ఇలాగైతే కప్పు కూలడం ఖాయం’’ అన్నాడు బొగ్గు తవ్వుతున్న ఒకతను.
ఆ మాటతో అక్కడి పనిచేస్తున్నవాళ్ల నాయకుడికి ఒళ్లు మండిపోయింది. నోటికొచ్చిన బూతులు తిట్టాడు.
‘‘కంపెనీ డబ్బుచ్చినప్పుడు గట్టివి నిలబెడతాంలే! దుంగల పనిలోబడితే ఇంక బొగ్గెప్పుడు తవ్వి చచ్చేది? ఇంట్లో ఆకలితో మాడి చచ్చినట్టు ఇక్కడా ఈ బండలకింద పడి చచ్చిపోదాంలే’’ అని అరిచాడు. ఆ మాటల వేగానికి  విన్సెంట్ కు అతడేమంటున్నాడో సరిగ్గా అర్థం కాలేదు.   
చివరి అర తర్వాత కూడా మరో నేలమాళిగ ఉంది. లోపలికి దిగేందుకు నిచ్చెన కూడా లేదు. పైనుంచి మట్టి జారి లోపలున్నవాళ్లు చావకుండా ఉండేందుకు మధ్య మధ్యన మొద్దులు వేశారు.
విన్సెంట్ చేతిలోని లాంతరు తీసుకుని తన బెల్టుకు తగిలించుకున్నాడు జాక్.
‘‘మెల్లగా దిగండి. నా తలపైన కాలు పెట్టేరు, జారిపడి చస్తాను!’’ అన్నాడు.
ఇద్దరూ ఆ చీకటి బిలంలో చేతుల్ని గోడలకు ఊతంగా ఆనిస్తూ ఒక్కో అడుగూ వేస్తూ ఐదు మీటర్లు దిగారు. పట్టుకోసం ఎక్కడైనా మొద్దు దొరుకుతుందేమోనని తడుముకున్నారు.
ఆ గొయ్యి కింద మరో గొయ్యి కనిపించింది. అక్కడ అరల్లేవు. కార్మికులు మోకాళ్లపై కూర్చుని గోడల మూలలోంచి బొగ్గు తవ్వుతున్నారు. వాళ్ల వీపులు కప్పుకు తగులుతున్నాయి. ఆ ప్రాంతం కొలిమి గుండంలా ఉంది. కార్మికులు భయకంపిత జంతువుల్లా ఎగశ్వాసలు తీస్తున్నారు. నాలుకలు పొడిబారి బయటకొచ్చాయి. నగ్నదేహాలు మురికితో మట్టిగొట్టుకుపోయాయి. విన్సెంట్ పనేమీ చెయ్యకున్నా పైనున్న అరలే చల్లగా, అనువుగా ఉన్నాయనిపించింది. దుర్భరమైన ఆ వేడి, దుమ్ములో ఇంకొక్క క్షణం ఉండలేననుకున్నాడు. పనివాళ్లు రక్తమాంసాలను ఆవిరిచేసుకుంటూ తవ్వుతున్నారు. వాళ్ల కష్టం విన్సెంట్ పనికి వెయ్యింతలు ఎక్కువ. అయినా ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. తీసుకుంటే తగినంత బొగ్గు తవ్వలేరు. తవ్వకపోతే యాబైసెంట్ల రోజుకూలి దక్కదు.
బొగ్గు తవ్వుతున్న తేనెపట్టు రంధ్రాల్లాంటి బొరియల దారిలో విన్సెట్, జాక్‌లు వెూకాళ్లమీద పాకుతూ వెళ్లారు.   ఇరుకు పట్టాలపై నుంచి వస్తున్న బళ్లకు దారి ఇచ్చేటప్పుడు గోడలకు బల్లుల్లా అతుక్కుపోయారు. ఆ దారి.. పైనున్న దారికంటే ఇరుగ్గా ఉంది. బళ్లు లాగుతున్న ఆడపిల్లలకు పట్టుమని పదేళ్లు లేవు. బళ్లేమో వాళ్లకంటే భారీగా ఉన్నాయి. వాటిని లాగేందుకు ఆ చిన్నారులు యుద్ధమే చేస్తున్నారు. దారి చివర ఏటవాలు లోహపు గొట్టం  ఉంది. బళ్లను తీగల సాయంతో ఆ గొట్టంలో పంపి, కిందిబావుల్లోని బొగ్గును పైకి తెస్తారు.
‘‘విన్సెంట్! మిమ్మల్నిప్పుడు  ఏడువందల మీటర్ల దిగువనున్న ఆఖరి బావిలోకి తీసుకెళ్తాను. లోకంలో ఎక్కడా లేనిదాన్ని మీరిక్కడ చూస్తారు’’ అన్నాడు జాక్.
లోహపు గొట్టంలో ఇద్దరూ ముప్పై మీటర్లు నడిచాక పట్టాలున్న వెడల్పాటి సొరంగం కనిపించింది. అందులో అరమైలు దూరం నడిచారు. సొరంగం చివరున్న గట్టు ఎక్కి మరో కంతంలోకి పాకి, అవతల కొత్తగా తవ్వుతున్న బావిలోకి చేరుకున్నారు.  
‘‘ఇది కొత్త బావి. ప్రపంచంలోని బొగ్గుగనుల్లో ఇదే అత్యంత దుస్తరమైంది’’ అన్నాడు మేస్త్రీ. అక్కడ పన్నెండు చిన్నచిన్న చీకటి కంతలున్నాయి. జాక్ ఓ కంతలోకి దూరి, తనను అనుసరించాలన్నాడు. అది అడుగున్నర ఎత్తు, రెండున్నర అడుగులతో విన్సెంట్ భుజాలు పట్టేంతే ఉంది. అతడు లోనికి దూరి, కాళ్లుచేతులను ముందుకూ, వెనక్కీ పోనిస్తూ పాములా పొట్టతో పాకాడు. జాక్ మూడు అంగుళాల దూరంలోనే ఉన్నా, కటిక చీకట్లో అతని బూట్లు కనిపించడం లేదు. తాజా గాలి ఊసే లేదు. అయితే పైనున్న కొలిమికంటే చల్లగానే ఉంది.
సొరంగం చివరకొచ్చేసరి గోళాకారపు కప్పున్న చోటు కనిపించింది. అక్కడ ఒక్క మనిషే నిల్చోగలడు. విన్సెంట్ కు ఆ అంధకారంలో తొలుత ఏమీ కనిపించలేదు. నెమ్మదిగా చూడగా, గోడవెంబడి నాలుగు చిన్నచిన్న నీలిరంగు దీపాలు గోచరించాయి. అతడు చెమటతో ముద్దయిపోయాడు. నుదిటిపైనుంచి దుమ్ము నిండిన చెమట కళ్లలో పడుతోంది. దాంతో అవి అందమైన మృగనయనల్లా ఉన్నాయి. పాకుతూ రావడంతో ఊపిరందక ఇబ్బందిపడుతున్నాడు. గాలి అందుతుందని కాసేపు నిల్చున్నాడు. కానీ భయంకరమైన అగ్ని.. ద్రవాగ్ని అతని శ్వాసకోశాల్లోకి దూరి దగ్ధం చేసి, ఉక్కిరిబిక్కిరి చేసింది. మార్కాస్ లోకెల్లా దారుణమైన ఆ భూగర్భజ్వాలాకుహరం మధ్యయుగాల చిత్రహింసల చెరసాలను తలపిస్తోంది.  
‘‘రండి రండి.. విన్సెంట్ గారూ! మేం మా యాభై సెంట్ల దినకూలిని ఎట్టా సంపాదిస్తున్నామో చూడాలని వచ్చారా? రండి రండి..’’ పరిచిత కంఠం ఆహ్వానించింది.  
జాక్ వెంటనే వెళ్లి అక్కడి లాంతర్లను తనిఖీ చేశాడు. అవి గాలి అందక నీలికాంతితో కొడిగడుతున్నాయి.
‘‘జాక్ ఇక్కడికి రాకుండా ఉండాల్సింది! ఈ గొయ్యిలోకొస్తే అతని మెదడురక్తం చిట్లిపోతుంది. తర్వాత మేం ఇక్కణ్నుంచి పైకి మోసుకెళ్లాల్సి ఉంటుంది’’ విన్సెంట్ తో గుసగుసగా అన్నాడు డిక్రూక్. చీకట్లో అతని కళ్లు వింతగా మెరుస్తున్నాయి.
‘‘డిక్రూక్! ఈ లాంతర్లు పొద్దుణ్నంచీ ఇలాగే మండుతున్నాయా?’’ అడిగాడు జాక్.
‘‘అవును. ఈ గొయ్యిలో రోజురోజుకూ వేడి గ్యాసు పెరిగిపోతోంది. ఒక్కసారి పేలిపోతే మా కష్టాన్నీ తీరిపోతాయి’’ నిర్లక్ష్యంగా అన్నాడు డిక్రూక్.  
లస్ట్ ఫర్ లైఫ్ సినిమాలో కార్మికులతో విన్సెంట్(కిర్క్ డగ్లస్)
‘‘గత ఆదివారమే కదా, ఇక్కణ్నుంచి గ్యాసును బయటికి పంపారు.’’
‘‘పంపారు. అది మళ్లీ వచ్చింది’’ డిక్రూక్ నెత్తిపై ఎర్రతోలును ఏదో తెలియని ఆనందంతో గోక్కుంటూ అన్నాడు.
‘‘అయితే ఈ వారంలో ఒకరోజు ఆపేసి ఆపేయండి. మేం శుభ్రం చేస్తాం!’’
కార్మికులు గయ్యిమన్నారు. ‘‘మా పిల్లలకు తిండిలేదు. ఒక రోజు పనిపోతే బతకడం కష్టం. అంతగా అయితే మా పని అయిపోయి, మేం వెళ్లిపోయాక శుభ్రం చేసుకోండి. మేమూ కడుపుకింత తినాలి కదా’’ అని అరిచారు.
‘‘సరిసరి..’’ అంటూ నవ్వాడు డిక్రూక్. ‘‘ఈ గనులు నన్ను మాత్రం చంపలేవు. చంపాలని చూసి ఓడిపోయాయి. నేను ముసలివాణ్నయి మంచంలోనే పోతాను. తిండి సంగతి ఎత్తారు కాదా? ఇప్పుడు వేళ ఎంతైందేమిటి?’’ అని అడిగాడు.
జాక్ గడియారాన్ని నీటి ఓ లాంతరు దగ్గరుంచి ‘‘తొమ్మిది!’’ అన్నాడు.
చెమటోడుస్తున్న కార్మికులు పని ఆపేసి, గోడలకు ఆనుకుని కూర్చుని సద్దిమూటలు విప్పారు. పై బావిలో చల్లగా ఉంటుంది కనక అక్కడికెళ్లి తినొచ్చు. కానీ తినడానికి పదిహేను నిమిషాలే గడువు. పైకెళ్లి రావడానికి సరిపోతుంది. అందుకే ఆ అగ్నిగుండంలోనే భోంచేస్తున్నారు.  బిరుసెక్కిన బ్రెడ్డుముక్కలను పులిసిన జున్నుతో కలిపి ఆవురావురుమని తింటున్నారు. చేతులమీది నుంచి కారుతున్న నల్లటి స్వేదం తెల్లటి బ్రెడ్డుముక్కలను తడిపేస్తోంది. అందరి దగ్గరా సీసాల్లో గోర్వెచ్చని కాఫీ ఉంది. బ్రెడ్డును కాఫీలో అద్దుకుంటూ తింటున్నారు. ఆ అంధకారకూపాల్లో రోజుకు పదమూడు గంటల గొడ్డుకష్టానికి ప్రతిఫలం ఆ రవంత బ్రెడ్డు, కాఫీ, పులిసిన జున్నే!
విన్సెంట్ గనుల్లోకి దిగి అరుగంటలైంది. గాలి అందకా, ఆ ఉక్కకూ ఉక్కిరిబిక్కిరై నీరసపడిపోయాడు. ఆ చిత్రహింసల కొలిమిలో ఇంక ఉండలేననుకున్నాడు. ‘‘ఇక వెళ్దాం!’’ అని జాక్ అనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.  
‘‘డిక్రూక్! ఆ పాడు గ్యాసు ఎక్కువైతే నీ మనుషుల్ని బయటికి తీసుకురా..’’  అంటూ వెనుదిరిగాడు జాక్.  
డిక్రూక్ వెటకారంగా నవ్వి, ‘‘అంటే, మేం బొగ్గు తీసుకురాకున్నా, కంపెనీ మాకు యాబై సెంట్లు ఇస్తుందా ఏమిటి?’’ అన్నాడు.
ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఆ విషయం డిక్రూక్‌కూ తెలుసు, జాక్‌కూ తెలసు. జాక్ ఏం చెప్పాలో తోచక భుజాలెగరేశాడు. పొట్టపై పాకుతూ మళ్లీ కంతలో దూరాడు. నల్లచెమట కమ్మిన కళ్లలో విన్సెంట్ గుడ్డిగా అనుసరించాడు.
తర్వాత అరగంట నడిచాక.. బొగ్గునూ, మనుషులనూ పైకి తీసుకెళ్లే బోను దగ్గరికి చేరుకున్నారు. జాక్ అక్కడ గుర్రాలు కట్టేసిన అర దగ్గరికెళ్లి నల్లటి కఫాన్ని ఉమ్మేశాడు.
బోనులో కూర్చుని పైకెళ్తుండగా విన్సెంట్ జాక్‌ను అడిగాడు. ‘‘చెప్పండి, జాక్! మీరు ఇంకా ఈ గనుల్లోకి ఎందుకెళ్తున్నారు? ఇంకెక్కడికైనా వెళ్లి మరో పనిచేసుకోవచ్చుగా?’’
‘‘మా బంగారుకొండా! చెయ్యడానికి మాకింకే పనీ లేదయ్యా. ఎక్కడికైనా పోదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ మొత్తం బోరినాజ్‌లో పది ఫ్రాంకులు వెనకేసుకున్న పనోడు ఒక్కడూ లేడు. ఒకవేళ బయటికి వెళ్లగలిగినా వెళ్లలేం కూడానూ. నావికుడికి సముద్రంలో తన పడవకు పొంచి ఉండే ప్రమాదాలేంటో బాగా తెలుసు. అయినా ఒడ్డుకు రాగానే అతని మనసు సముద్రంపైకే మళ్లుతుంది. మేమూ అంతే, మాకు మా గనులంటే ప్రేమ. పైనుండడానికి బదులు కిందే ఉండిపోతాం. మేం కోరేదల్లా ఒకటే, ఈ ప్రాణాన్ని నిలుపుకోడానికి తగినంత కూలి, సరైన పనిగంటలూ, ప్రమాదాలు జరక్కుండా కాసింతఏర్పాటు.’’
బోను పైకి చేరుకుంది. విన్సెంట్ మందసూర్యకాంతిలో మెరుస్తున్న హిమావృత ప్రాంగణాన్ని దాటాడు. కార్మికులు ముఖాలు కడుక్కునే గదిలోకెళ్లి అద్దంలో ముఖం చూసుకున్నాడు. ముఖమంతా తారులాంటి మసి పేరుకుపోయింది. కడుక్కోకుండానే బయటికొచ్చి మైదానంలో వేగంగా నడవసాగాడు. గనుల దర్శనం అతణ్ని భౌతికంగానే కాకుండా, మానసికంగానూ కుంగదీసింది. అర్ధచేతనలో గుండెల నిండా తాజా గాలి శ్వాసిస్తూ సాగుతున్నాడు. తనకు పిచ్చెత్తలేదు కదా? పీడకలలు రాలేదు కదా? అని భ్రాంతిపడుతున్నాడు. అవును ఇదంతా భ్రమే! దయామయుడైన భగవంతుడు తన బిడ్డలను ఈ హీనమైన బానిసత్వంలో పడదోయడు! అవును, తాను గనుల్లో చూసిందంతా పగటికలే!
విన్సెంట్ డెనిస్ ఇల్లు దాటాడు. తనకు తెలియకుండానే లోయలోని మురికి గజిబిజి సందుల్లో సాగుతూ డిక్రూక్ ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు. కాసేపయ్యాక డిక్రూక్ ఆరేళ్ల కొడుకు తలుపు తీశాడు. వాడి ముఖం రక్తంలేక పాలిపోయింది. వయసుకు తగ్గ ఎత్తూ లేడు. కానీ తండ్రి పోరాట లక్షణమేదో వాడిలోనూ ఉంది. మరో రెండేళ్లుపోయాక వాడూ ప్రతిరోజూ తెల్లారిమూడింటికి నిద్రలేచి మార్కాస్‌లోకి దిగుతాడు, బళ్లలోకి బొగ్గును తోడతాడు.  
‘‘అమ్మ బొగ్గుకోసం దిబ్బకెళ్లిందండి. మీరలా కూర్చోండి! నేను పిల్లలను చూసుకుంటున్నాను..’’ అన్నాడు వాడు కాస్త పెద్దగొంతుకతో అరిందాలా.
చిన్నపిల్లలు నేలపై అడుకుంటున్నారు. దేహాలు చలితో నీలం రంగుకు తిరిగాయి. ఒంటిపైన చిన్నచిన్న చొక్కాలు మాత్రమే ఉన్నాయి. పెద్ద పిల్లాడు కుంపట్లో నుసిబొగ్గు వేశాడు. ఆ వేడి ఏమాత్రం సరిపోవడం లేదు. విన్సెంట్ విషాదం మూర్తీభవించిన ఆ పసికందులను చూసి చలించిపోయాడు. వాళ్లను ఎత్తుకుని పక్కపై పడుకోబెట్టి, గొంతువరకు దుప్పటికప్పాడు. ఆ వ్యథావశిష్టుల జీర్ణకుటీరానికి తను ఎందుకొచ్చాడో తనకే తెలియదు. తాను ఆ కుటుంబాన్ని ఏదోరకంగా ఆదుకోవాలి, వాళ్లతో ఏదో మాట్లాడాలి, వాళ్ల కష్టాలేంటో తను ఎరుగుదునని వాళ్లు తెలుసుకునేలా చెయ్యాలి.
డిక్రూక్ భార్య ఒళ్లంతా బొగ్గుదుమ్ముతో వచ్చింది. మసిబారిన విన్సెంట్‌ను ఆమె తొలుత గుర్తుపట్టలేకపోయింది. గుర్తించగానే పరుగున అల్మారా వద్దకెళ్లి కాఫీపొడి తీసుకుని పొయ్యపైన కాఫీ పెట్టింది. కాఫీ నల్లగా కషాయంలా, గోర్వెచ్చగా ఉంది. విన్సెంట్ ఆమె సంతోషం కోసం అలాగే తాగేశాడు.
‘‘దిబ్బలో కళ్లుపొడుచుకున్నా బొగ్గు దొరకడం లేదండి. కంపెనీ వాళ్లు నలుసుల్నికూడా వదిలేయడం లేదు. ఈ పిల్లల్ని కాస్త వెచ్చగా ఎలా ఉంచేది? వీళ్లకు బట్లల్లేవు. ఆ అంగీలు, గోనెసంచుల్తోనే నెట్టుకొట్టుకొస్తున్నా. గోనెపట్టల్తో వాళ్ల చర్మం రాసుకుపోయి పుండ్లు పడుతోంది. బయట తిప్పకుండా వాళ్లను పొద్దస్తమానం ఇలా మంచంలోనే పడుకోబెడితే ఎట్లా పెరిగి పెద్దవాళ్లవుతారు?’’
విన్సెంట్ చలించిపోయాడు. కన్నీళ్లు పొంగాయి.  ఏమీ బదులివ్వలేకపోయాడు. అతడు ఇదివరకెన్నడూ అలాంటి దైన్యాన్ని చూడలేదు. ఆ పిల్లలు అలా గడ్డకట్టుకుపోయి చచ్చిపోతుంటే తన ప్రార్థలు, సువార్తలతో ఆమెకేం ఒరుగుతుందని తొలిసారి సంశయంలో పడ్డాడు. ఇన్ని బాధల నడుమ ఏ దేవుడెక్కడ? ఏం చేస్తున్నాడు? విన్సెంట్ తన జేబిలోని కాసిని ఫ్రాంకులను ఆమె చేతికిచ్చి, పిల్లలకు ఉన్ని నిక్కర్లు కొనమన్నాడు.  
ఆ చిరుసాయం వ్యర్థమని అతనికి తెలుసు. బోరినాజ్‌లో చలితో వణికిపోతున్న పిల్లలు వందలమంది  ఉన్నారు. డిక్రూక్ పిల్లలు ఆ ఉన్ని నిక్కర్లు చిరిగిపోగానే మళ్లీ చలితో  గడ్డకట్టుకుపోతారు.  
విన్సెంట్ కొండ ఎక్కి డెనిస్ ఇల్లు చేరుకున్నాడు. బేకరీ గది వెచ్చగా, సుఖంగా ఉంది. డెనిస్ భార్య అతనికి చేతులు కడుక్కోడానికి నీళ్లు కాచింది. నిన్నరాత్రి మిగిలిపోయిన కుందేలు పులుసును వేడిచేసి వడ్డించింది. అతడు బాగా అలసిపోయాడని, మనసు బాగోలేదని గమనించి కాస్త శక్తి కోసం బ్రెడ్డుపై కాస్త వెన్న రాసింది.  
విన్సెంట్ భోంచేసి గదిలోకెళ్లాడు. కడుపు నిండుగా, వెచ్చగా ఉంది. పక్క పెద్దగా, మెత్తగా.. దుప్పట్లూ, దిండూ మల్లెపువ్వుల్లా తెల్లగా, శుభ్రంగా ఉన్నాయి. గోడలకు విఖ్యాతకళాకారుల చిత్రాలు అందం తెస్తున్నాయి.  
విన్సెంట్ బీరువా తెరిచి చొక్కాలు,  లోదుస్తులు, సాక్సులు చూశాడు. బట్టల గూట్లోని ఓవర్‌కోటు, చొక్కా, ప్యాంట్లు, రెండు అదనపు బూట్ల జతలను పరికించాడు. మొత్తానికి తను అబద్ధాలకోరునని, పిరికిపందనని అనిపించింది. తను పేదరికం గొప్పదని కార్మికుల ముందు ఊదరగొట్టాడు. కానీ తను మాత్రం సుఖంగా, డాబుగా జీవిస్తున్నాడు. తనిది ఆత్మవంచన. తనవి పొల్లుమాటలు. తన మతం వ్యర్థం. ఉత్తి కాలక్షేప వ్యవహారం. కార్మికులు తనను బోరినాజ్ నుంచి తరిమికొట్టాలి! తను వాళ్ల బాధలు పంచుకుంటున్నట్టు నటించాడు. కానీ తన వద్ద వెచ్చని బట్టలున్నాయి,  పడుకోవడానికి చక్కని పక్క ఉంది. వాళ్లు ఒక వారమంతా కలిపి తినే తిండికంటే ఎక్కువ తిండి తను ఒకపూటే మెక్కుతున్నాడు. పైగా ఈ సుఖాలు అనుభవించడానికి తను ఎలాంటి పనీ చెయ్యడం లేదు. తను వాళ్లకు కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు. మంచివాణ్నని నమ్మించాడు. బొరైన్లు ఇకపై తన మాటల్ని నమ్మకూడదు, తన బోధనకు రాకూడదు, తన బాటలో నడవకూడదు. తన విలాసజీవితం తన వాక్కులను అసత్యం చేసింది. తను మళ్లీ ఓడిపోయాడు. గతంలో ఎన్నడూ ఓడిపోనంత ఘోరంగా ఓడిపోయాడు. 
ఇప్పుడు తన ముందు రెండే రెండు దారులున్నాయి. కార్మికులు తాను కపటి, పిరికిపంద అని తెలుసుకోకముందే నిశిరాతిరి ఎవరికంటా పడకుండా బోరినాజ్ నుంచి పారిపోవడం. లేకపోతే ఈ రోజు గనిలో తన కళ్లు తెరిపించిన అనుభవజ్ఞానంతో అసలైన ఈశ్వర సేవకుడిగా మారిపోవడం.
విన్సెంట్ బీరువాలోని బట్టల్నింటిని విసురుగా తీసి బ్యాగులో కుక్కాడు. ప్యాంట్లు, చొక్కాలు, బూట్లు, పుస్తకాలు,  ప్రింట్లు అన్నీ అందులో వేశాడు. బ్యాగును కాసేపలా కుర్చీలో ఉంచాడు. తర్వాత విల్లు విడిచిన బాణంలా ఇంట్లోంచి బయటకు ఉరికాడు.
లోయ అడుగున చిన్న వాగు ఉంది. దానికి అవతలివైపు నుంచి కొండమీదికి దేవదారు వనం విస్తరించింది.  చెట్లమధ్య అక్కడక్కడా కొన్ని గుడిసెలు విసిరేనట్టు ఉన్నాయి. విన్సెంట్ వాళ్లనూ వీళ్లనూ అడిగి ఓ ఖాళీ గుడిసె కనుక్కుకున్నాడు. ఏటవాలు స్థలంలో ఉన్న ఆ గుడిసె చాలా పెద్దదే. కానీ ఒక్క కిటికీ కూడా లేదు. ఏళ్లతరబడి వాడకపోవడంతో మట్టినేల అడుక్కుపోయింది. ఎగువవైపున్న చెక్కపలకల కింద మంచు కరిగి మడుగులు కడుతోంది. చెక్కపలకల మధ్యలోని ఖాళీల్లోంచి దుర్భరమైన చల్లగాలి పంజాలు విసురుతోంది.
‘‘గుడిసె ఎవరిది?’’ తనకు తోడుగా వచ్చిన మహిళను అడిగాడు విన్సెంట్.
‘‘వాస్మెస్ లోని వ్యాపారిది.’’
‘‘అద్దె ఎంత?’’
‘‘నెలకు ఐదు ఫ్రాంకులు’’
‘‘బాగుంది, తీసుకుంటా.’’
‘‘కానీ, మీరు ఇందులో ఉండలేరండి!’’
‘‘ఏం, ఎందుకండలేను?’
‘‘ఇది పూర్తిగా పాడైపోయింది. మా గుడిసెకంటే ఘోరంగా ఉంది. ఈ మొత్తం పల్లెలో దీనంతటి దరిద్రపు కొంప ఇంకొకటి లేదు.’’
‘‘నాకు కావాల్సిందీ ఇలాంటిదే.’’
విన్సెంట్ గుడిసెను చూసుకుని మళ్లీ డెనిస్ ఇంటి దారి పట్టాడు. కల్లోలిత హృదయంలో నెమ్మదిగా శాంతి నెలకొంటోంది. అతడు బయటికొచ్చినప్పుడు డెనిస్ భార్య ఏదో పనిపై అతని గదిలోకి వెళ్లి, ప్రయాణానికి సిద్ధం చేసిన బ్యాగును చూసింది. విన్సెంట్ రాగానే విషయం అడిగింది.
‘‘ఏమైందండీ? ఎందుకింత హఠాత్తుగా హాలండ్ వెళ్తున్నారు?’’
‘‘నేనెక్కడికీ వెళ్లడం లేదండి! బోరినాజ్ కు మకాం మార్చాను. ఇకమీదట అక్కడే ఉంటాను’’
‘‘కానీ, అక్కడెందుకు?’’
విన్సెంట్ వివరించాడు. అంతా విని ఆమె నెమ్మదిగా అంది, ‘‘దయచేసి నా మాట వినండి విన్సెంట్!  మీరలా బతకలేరు. మీకు అలవాటు లేదు. ఏసుక్రీస్తు నాటి నుంచి కాలం చాలా మారిపోయింది. మనం వీలైనంత బాగా బతకాలి. మీరు మంచిమనిషి అని జనానికి తెలుసు. మీ బోధనతో మీరెలాంటి వాళ్లో అర్థం చేసుకున్నారు.’’
విన్సెంట్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వాస్మెస్‌కు వెళ్లి వ్యాపారిని కలిసి గుడిసెను అద్దెకు తీసుకున్నాడు. వెంటనే అందులోకి మారిపోయాడు. తర్వాత కొన్నిరోజులకే తొలి జీతం యాబై ప్రాంకులకు చెక్కు వచ్చింది. ఓ మంచం, పాత కుంపటి కొన్నాడు. నెలకు సరిపోయే బ్రెడ్డు, పుల్ల జున్ను, కాఫీకి కావలసిన డబ్బులు మిగిలాయి. గుడిసె ఎగువవైపు చెక్కపలకల కింది నీళ్లు లోనికి రాకుండా మన్నుమెత్తాడు. పలకల మధ్య ఖాళీల్లో గోనెసంచుల ముక్కలను కూరాడు. అతడిప్పుడు అచ్చం గని కార్మికుల గుడిసెల్లాంటి గుడిసెలో ఉంటున్నాడు. వాళ్లు తినే తిండే తింటూ, వాళ్లు పడుకునే మంచంలాంటి మంచంలోనే పడుకుంటున్నాడు. వాళ్లలో ఒకడైపోయాడు. వాళ్ల చెంతకు దైవసందేశాన్ని తీసుకెళ్లే అర్హత సంపాదించాడు.


(సశేషం)

No comments:

Post a Comment