Thursday, 22 October 2015

జీవన లాలస-11(వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)


బొగ్గు మూటలను మోసుకెళ్తూ.. (విన్సెంట్ పెయింటింగ్)10. విజయం

విన్సెంట్ గని కార్మికులను కలుసుకున్నాక వాళ్లేంటో అర్థమైంది. కల్మషం లేని మనుషులని, సున్నిత హృదయులని, చదువురాకపోయినా తెలివితేటలు పుష్కలమని. వాళ్లు ధైర్యవంతులు, తమ పనేదో తాము నిజాయతీగా చేసుకుపోతారు. అందరూ బక్కచిక్కి అలసటగా, నిస్సత్తువగా కనిపిస్తున్నారు. జ్వరాలతో ముఖాలు పాలిపోయాయి. వాళ్లు సూర్యుణ్ని చూసేది ఆదివారాలు మాత్రమే. అందుకే చర్మం కాంతిలేక వడలిపోయింది. ఒళ్లంతా ఆవగింజల్లాంటి చిన్నచిన్న మచ్చలున్నాయి. లోతైన కళ్లలో విషాదం గూడుకట్టుని ఉంది. తిరగబడ్డం చేతకాని పీడితుల కళ్లవి.
అయినా వాళ్లు విన్సెంట్ కు ఆకర్షణీయంగా కనిపించారు. వాళ్లు తన దేశంలోని బ్రాంబంత్, ఎతన్ వాసుల మాదిరే సాదాసీదా మనుషులు, మంచివాళ్లు. బోరినాజ్ కు తనదైన ఒక వ్యక్తిత్వం ఉందని, అక్కడి విశేషాలు తనతో సంభాషిస్తున్నాయని అతనికి అనిపించడంతో ఆ ప్రాంతం దుఃఖభాజనమన్న భావనా తొలగిపోయింది.
కొన్ని రోజుల తర్వాత విన్సెంట్ డెనిస్ బేకరీ వెనక ఉన్న పాత షెడ్డులో తొలి మతబోధన చేశాడు. ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేసి, జనం కూర్చుకోవడానికి బెంచీలు తెచ్చి వేశాడు. అరువుకు కిరోసిన్ దీపం తెచ్చాడు. మసిముఖాల కార్మికులు సాయంత్రం ఐదింటికి కుటుంబసమేతంగా వచ్చారు. చలిని తట్టుకోవడానికి మెడకు పొడవాటి స్కార్ఫులు చుట్టుకుని, చిన్నచిన్న టోపీలు పెట్టుకున్నారు. కిరోసిన్ దీపపు గుడ్డి వెలుతురులో ముడుచుకు కూర్చుని వెచ్చదనం కోసం చేతుల్నిచంకల్లో పెట్టుకున్నారు. బైబిల్‌లో నిమగ్నమైపోయిన విన్సెంట్‌ను తదేకంగా చూస్తూ, అతని మాటలను శ్రద్ధగా వింటున్నారు.
విన్సెంట్ తొలిబోధనకు తగిన వాక్యాన్ని ఎంచుకోవడానికి తిప్పలుపడ్డాడు.  చివరకు అపొస్తలుల కార్యాల్లోని  16:9 వచనాన్ని తీసుకున్నాడు. ‘‘అప్పడు మాసిడోనియా దేశస్తుడొకడు నిల్చుని.. మాకు సాయం చేయడానికి మాసిడోనియాకు రండి అని తనను వేడుకుంటున్నట్టు రాత్రి పాల్ కు కల వచ్చింది’’ అనే వాక్యమది.
‘‘మిత్రులారా! మనం ఆ మాసిడోసియన్నుఒక కార్మిడని అనుకోవాలి. ముఖంలో బాధారేఖలు, వేదన, అలసట గూడుకట్టుకుని ఉన్నవాడని అనుకోవాలి. అతనిది శాశ్వతమైన ఆత్మ కనక సౌందర్యానికి, ఆకర్షణకు కొదవ లేదు. దేవుడి వాక్యాన్ని నశింపజేయనివ్వని ఆహారమే అతనికి కావాలి. మనిషి క్రీస్తుమార్గంలో నడుస్తూ అత్యాశ, ఆడంబరాలకు పోకుండా వినయవిధేయలతో నడవాలని దేవుడి కోరిక. అలా అతడు తీర్పు రోజున స్వర్గసామ్రాజ్యంలో ప్రవేశించి, శాంతిపొందాలని ఆయన ఆశ’’ విన్సెంట్ బోధన అలా సాగింది.
పెటీ వాస్మెస్ లో చాలా మంది జబ్బుపడ్డారు. విన్సెంట్ వైద్యుడన్నట్టు రోజూ వాళ్ల దగ్గరికెళ్లి పాలో, బ్రెడ్డో, మేజోళ్లో, దుప్పటో ఏది వీలైతే అది ఇస్తున్నాడు. గుడిసెల్లో విషజ్వరాలు చెలరేగాయి. జ్వరాలతో జనానికి పిచ్చెత్తింది. పీడకలలు, ప్రేలాపనలతో వెర్రెత్తిపోతున్నారు. రోజురోజుకూ రోగులు పెరుగుతున్నారు.
పెటీ వాస్మెస్ జనమంతా విన్సెంట్ ను ప్రేమగా బాబూగారూ అని పిలుస్తున్నారు, లోపల బెరుకు పూర్తిగా పోకున్నా. ఆ పల్లెలో అతడు తిండి పెట్టని, అతని సాంత్వన పొందని, అతడు దేవుడి వెలుగును తీసుకెళ్లని గుడిసె లేకుండా పోయింది. అతనితో సేవలు చేయించుకోని రోగులు, అతనితో కలసి ప్రార్థనలు చేయని వేదనాజీవులు లేకుండా పోయారు. క్రిస్మస్ కు చాలా రోజుల ముందు అతడు మార్కాస్ దగ్గర్లో ఖాళీగా ఉన్న గుర్రాల పాకను చూశాడు. అందులో వందమంది కూర్చోవచ్చు. అక్కడ మతబోధన ప్రారంభించారు. పాక చిత్తడిగా, బోసిగా ఉంది. అయినా జనం కిక్కిరిసిపోయారు. యువబోధకుడు చెబుతున్న ఆధ్యాత్మిక కథలను విన్నారు. విన్సెంట్ బోరినాజ్‌కు వచ్చి గట్టిగా నెల గడవకున్నా జనం బతుకులు తను వచ్చినప్పటికంటే రోజురోజుకూ దిగజారిపోతోతున్నాయని అర్థమైంది. ఆ విషాదం మధ్యే, ఆ బోసిపోయిన గుడ్డివెలుగు పాకలోనే చలికి వణుకుతున్న బడుగు జనావళి చెంతకు అతడు క్రీస్తును తీసుకెళ్లగలిగాడు. దేవుడి రాజ్యం వస్తుందని చెబుతూ హృదయాలను ఊరట పరచాడు.
విన్సెంట్ కు ఇప్పడు ఒకే సమస్య ఉంది. జీవిక కోసం తండ్రి పంపే డబ్బులపై ఆధారపడ్డం ఇబ్బంది పెడతోంది. తన నామమాత్రం ఖర్చులకు కావాలసిన డబ్బును సంపాదించుకునే రోజు త్వరగా రావాలని దేవుణ్ని వేడుకుంటున్నాడు.
పెటీ వాస్మెస్ లో వాతావరణం దుర్భంగా మారిపోయింది. అంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. కుండపోత వానలతో బాటలు వాగులయ్యాయి. గుడిసెల్లోపలి నేలలు బురదగుంటల్లా మారాయి. కొత్త సంవత్సరం తొలి రోజున డెనిస్ వాస్మెస్ పట్టణానికి వెళ్లి, విన్సెంట్‌కు వచ్చిన ఉత్తరం తెచ్చిచ్చాడు. కవరు ఎడమపక్కన రివరెండ్ పీటర్సన్ పేరుంది. విన్సెంట్ ఉద్వేగంతో గదికి పరుగుతీశాడు. కప్పుపైన దడదడమని కురుస్తున్న వాన చప్పుడు అతనికి వినిపించడం లేదు. వణుకుతున్న వేళ్లతో కవరు చించి ఉత్తరం చదివాడు.
‘ప్రియమైన విన్సెంట్‌కు,
బోధకుల సంఘం నవ్వు బాగా పనిచేస్తున్నావని తెలుసుకుంది. నిన్ను జనవరి ఒకటి నుంచి ఆరునెలలపాటు తాత్కాలిక బోధకుడిగా నియమించింది. జూన్ ఆఖరికి అన్నీ సవ్యంగా సాగితే నిన్ను శాశ్వత బోధకుడిగా నియమిస్తారు. అంతవరకు నీకు నెలకు యాభై ఫ్రాంకుల జీతం అందుతుంది. తరచూ ఉత్తరాలు రాస్తూ వుండు. సదా భగవంతుణ్ని సేవించు..  
ప్రేమతో,
పీటర్సన్.’’
విన్సెంట్ విజయోత్సాహంతో పొంగిపోయాడు. ఉత్తరాన్ని గట్టిగా పట్టుకుని ఎగిరి పక్కపై పడిపోయాడు. చివరికి తను గెలిచాడు! తనకొక పని దొరికింది! తన కర్తవ్య నిర్వహణకు మార్గం దొరికింది. తను ఇన్నాళ్లూ కోరుకున్నది ఇదే. ఇప్పుడు తనకు నెలకు యాభై ఫ్రాంకులొస్తాయి. తన తిండి, బస ఖర్చులకంటే చాలా ఎక్కువ. తనకాళ్లపై తాను నిలబడొచ్చు.  
విన్సెంట్ తన విజయగాథను వివరిస్తూ తండ్రికి ఉద్వేగపూర్వక ఉత్తరం రాశాడు. తనకు ఇక డబ్బుపంపక్కర్లేదని, తానే కుటుంబాన్నిఆదుకుంటానని, ఇంటి గౌరవం కాపాడతానని రాశాడు. ఉత్తరం ముగించేసరికి సంధ్య చీకటి కమ్ముకుంది. మార్కాస్‌ గగనతలంపై ఉరుములు, మెరుపులతో జోరువాన కురుస్తోంది. విన్సెంట్ ఇంట్లోంచి కదిలి పట్టలేని సంబరంలో వర్షంలోకి అడగుపెట్టాడు.  
డెనిస్ భార్య వెనక నుంచి ‘‘ఏమండోయ్! ఇంత వానలో ఎక్కడికెళ్తున్నారు? కోటూ, టోపీ తీసుకోకుండానే పోతున్నారే!అని అరుస్తోంది.
విన్సెంట్ పట్టించుకోకుడా ముందుకు సాగాడు. దగ్గర్లోని పెద్ద దిబ్బపైకి ఉరికాడు. అక్కణ్నుంచి సవిశాల బోరినాజ్ కనిపిస్తోంది. పొగ్గొట్టాలు, బొగ్గుదిబ్బలు, కార్మికుల కుటీరాలు, పుట్టలోంచి వస్తున్న చీమల్లా గనుల్లోంచి బిలబిలా వస్తున్న నల్లముఖాల శ్రామికులు కనిపిస్తున్నారు. దూరంగా మసకలో దేవదారు వనం, వాటి మధ్య వెల్లవేసిన చిన్న గుడిసెలు, చర్చి గోపురం, పాత పిండిమర పరచుకున్నాయి. అంతటా పల్చని పొగమంచు ఆవరించింది. మేఘాల నీడలు నేలపై ఆవిష్కరిస్తున్న చీకటివెలుగుల సయ్యాటలో ప్రకృతి సోయగాలు పోతోంది. ఆ సౌందర్యార్ణవంలో అతని కళ్లుముందు మిషెల్, రూయిస్‌దేల్‌ల ప్రకృతివర్ణచిత్రాలు కదలాడాయి.
.   


11. నల్లదిబ్బ


విన్సెంట్ ఇప్పుడు అధికారికంగా ఇవాంజెలిస్టు అయ్యాడు. మతబోధనకు ఏర్పాట్లు చేసుకోవాలి. జాన్ వెర్నీ సాయంతో వెతికి వెతికి ఓ చోటు ఎంచుకున్నాడు. లోయకు చాలా దిగువన దేవదారు వనం మధ్యలో బాట పక్కన ఓ పెద్దగది దొరికింది. దానికి బాలలసదనం అని పేరు. ఒకప్పుడు అందులో కార్మికుల పిల్లలకు నాట్యం నేర్పేవాళ్లు. విన్సెంట్ కొన్ని చిత్రాలను గోడలకు అంటించాడు. గదికి కళ వచ్చింది. అక్కడ రోజూ మధ్యాహ్నం చిన్నపిల్లలను పోగేసుకుని, వాళ్లకు చదవడం, రాయడం నేర్పుతున్నాడు. చిన్నచిన్న బైబిల్ కథలూ చెబుతున్నాడు. ఆ పసికూనలకు అక్షరాల ముఖం చూడ్డం అదే తొలిసారి.
గది చల్లగా ఉంది. వెచ్చబెట్టుకోవాలి. ‘‘కుంపట్లోకి బొగ్గెక్కడ దొరుకుతుంది?. పిల్లల్ని కాస్త వెచ్చగా ఉంచాలి. బొగ్గుంటే రాత్రిపూట ఇంకాసేపు బోధన చెయ్యొచ్చు’’ అన్నాడు విన్సెంట్ జాక్ వెర్నీతో.
లస్ట్ ఫర్ లైఫ్ సినిమాలో బొగ్గు ఏరుతున్న విన్సెంట్(కిర్క్ డగ్లస్)
జాక్ ఓ క్షణం ఆలోచించి, ‘‘రేపు మధ్యాహ్నం ఇక్కడే ఉండండి. బొగ్గు కోసం వెళ్దాం’’ అన్నాడు.  
మర్నాడు విన్సెంట్ అక్కడికొచ్చేసరికి కార్మికుల భార్యలు, కూతుళ్లు అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. నల్లజాకెట్లు, నల్లగౌన్లు వేసుకుని, తలకు నీలిరంగు రుమాళ్లు కట్టుకున్నారు. అందరి చేతుల్లోనూ సంచులున్నాయి.  
‘‘పంతులుగారూ! మీ కోసం సంచి తెచ్చాను. మీరూ బొగ్గు నింపుకోవాలి’’ అంది వెర్నీ చిన్నకూతురు.  
అందరూ గుడిసెల మధ్యనుంచి సందుల గుండా సాగారు. కొండ ఎగువనున్న డెనిస్ బేకరీ దాటారు. మార్కాస్ మైదానం, గనుల మీదుగా సాగి, వాటి వెనకాలనున్ననుసిదిబ్బకు చేరుకున్నారు. చీమల్లా బిలబిలమంటూ ఒక్కోవైపు నుంచి దిబ్బను ఎక్కసాగారు.
‘‘బొగ్గు దొరకాలంటే బాగాపైకి పోవాల్సిందేనండి. చాలా ఏళ్లనుంచి కిందున్నబొగ్గునంతా మేం తీసేసుకుంటున్నాం కదా. నా వెంట రండి, బొగ్గెక్కడ దొరుకుద్దో చూపిస్తాను..’’ అంది జాక్ భార్య.  
ఆమె జింకపిల్లలా చకచకా దిబ్బ ఎక్కుతోంది. విన్సెంట్ కు చేతకావడం లేదు. కాళ్లు జారిపోతున్నాయి.  వెూకాళ్లపైనా, మోచేతులపైనా పాక్కుంటూ కష్టంతో పైకెళ్లాడు. జాక్ భార్య ఓ చోట వెూకాళ్లపై కూర్చుని విన్సెంట్ సరదాగా ఏడిపిస్తూ ఓ మట్టిబెడ్డను అతనిపైపు విసిరింది. ఆమె ఉత్సాహంగా ఉంది. బుగ్గల్లో యవ్వనపు ఎరుపు ఉంది. ఆమె ఎప్పుడూ గనిపనిలోకి వెళ్లలేదు మరి.
‘‘విన్సెంట్!  త్వరగా రండి, లేకపోతే వెనకబడిపోతారు. తర్వాత మీకేమీ దొరకదు..’’ అందామె. బొగ్గు ఏరుకురావడం ఆమెకు ఏదో విహారయాత్రకు వచ్చినట్టు ఉంది. జాక్ మేస్త్రీ కనక కంపెనీ అతనికి నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకే అమ్ముతుంది.   
వాళ్లు దిబ్బపైకి వెళ్లలేకపోతున్నారు. అక్కడ చిన్నచిన్న బళ్లు బొగ్గునుసిని రెండువైపుల నుంచీ దిబ్బమీద పోస్తున్నాయి. దిబ్బ కొనభాగంలో బొగ్గు ఏరడం సులువేమీ కాదు. నుసిని చేతుల్లోకి తీసుకుని, వేళ్ల సందుల్లోంచి రాళ్లను, మట్టిని ఎలా కిందికి వదలాలో, బొగ్గును వేరు చెయ్యాలో జాక్ భార్య విన్సెంట్ కు చూపింది.  ఆ దిబ్బల్లో కంపెనీ వదిలేసే బొగ్గు పిసరంతే. మార్కెట్‌లో అమ్ముడవని బొగ్గులాంటి రాతిముక్కల్నే వదిలేస్తుంది. ఆడవాళ్లు వాటినే మహాప్రసాదం అనుకుని వెతికి వెతికి ఏరుకుంటారు. వాన, మంచు వల్ల దిబ్బ తడిగా ఉంది. విన్సెంట్‌కు ఏరడం చేతకాక చేతులు కోసుకోపాయాయి. అయినా ఎలాగోలా తన కంటికి బొగ్గులా కనిపించిన మన్నూమశానంతో సంచిచిన పావు భాగం నింపుకున్నాడు. అప్పటికి ఆడవాళ్ల సంచులు పూర్తిగా నిండిపోయాయి.  
ఆడవాళ్లందరూ సంచులను బాలల సదనం వద్ద పడేసి, వంట కోసం గబగబా ఇళ్లకు పరుగులుతీశారు. రాత్రి కటుంబాలతో కలిసి ప్రార్థనలకు వస్తామని హామీ ఇచ్చి మరీ వెళ్లారు. తమింటికి భోజానానికి రావాలని జాక్ భార్య పిలిచింది. అతడు సంతోషంగా ఒప్పుకున్నాడు.
వెర్నీది రెండు గదుల ఇల్లు. ఒకదాంట్లో పొయ్యి, వంటసామాన్లు, బట్టల్లాంటివి; మరొకదాంట్లో పక్కలు ఉన్నాయి. వెర్నీ స్థితిగతులు మిగతావాళ్లకన్నా కాస్త మేలే అయినా ఇంట్లో సబ్బు మాత్రం కనిపించలేదు. బొరైన్లకు సబ్బు అందని ద్రాక్షపండని విన్సెంట్‌కు ఇదివరకే ఎవరో చెప్పారు. బొరైన్ మగపిల్లాడు బొగ్గుబావిలో దిగడం, ఆడపిల్ల నుసిదిబ్బ ఎక్కడం మొదలైనప్పట్నుంచి చచ్చేంతవరకు వాళ్ల ముఖాలపై బొగ్గుమసి అలాగే ఉండిపోతుంది.
విన్సెంట్ చేతులు కడుక్కోవడానికి ఇంటి ఇల్లాలు చిన్నగిన్నెలో నీటిని తెచ్చింది. చేతుల్ని రుద్దిరుద్ది కడుకున్నాడు. మసి పూర్తిగా పోయిందో లేదో తెలీదు. కానీ భోజనానికి ఆమె ఎదురుగా కూర్చున్నప్పుడు ఆమె ముఖంలో బొగ్గుమరకలు చూశాక తన ముఖమూ ఆమె ముఖంలాగే ఉంటుందని అర్థమైంది. ఆమె భోజనం ముగిసేవరకు గలగలా మాట్లాడూతూనే ఉంది.  
‘‘విన్సెంట్! మీరిక్కడికొచ్చి రెణ్నెళ్లయింది. అయినా బోరినాజ్ గురించి మీకేమీ తెలియదనుకుంటా?’’ అన్నాడు జాక్. 
‘‘అవునండి. నిజంగానే ఏమీ తెలియదు. ఈ జనాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాను..’’
‘‘నేనంటున్నది దాని గురించి కాదు..’’ వెర్నీ ముక్కులోంచి పొడవాటి వెంట్రుకను పీక్కుని దానివైపు ఆసక్తిగా చూస్తూ అన్నాడు. ‘‘మీరు నేలపైని మా బతుకును మాత్రమే చూశారు. అదేమంత పట్టించుకోవాల్సింది కాదు. మేం కేవలం పడుకోవడానికే ఇళ్లకొస్తాం, అంతే. మీకు మా అసలు బతుకేంటో తెలియాలంటే గనిలోకి దిగాలి. తెల్లారుజామున మూడింటి నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకు ఎలా రెక్కలు ముక్కలు చేసుకుంటామో చూసి తీరాలి’’ అన్నాడు.  
‘‘నేనూ అందుకోసమే ఎదురు చూస్తున్నాను. కానీ కంపెనీ అందుకు ఒప్పుకుంటుందా?’’
‘‘మీరు దిగేందుకు అనుమతివ్వాలని ఇదివరకే అడిగాను’’ జాక్ నోట్లో చెక్కర పలుకు వేసుకుని, మసిలాంటి చేదుకాఫీ తాగుతూ చెప్పాడు. ‘‘నేను రేపు తనిఖీకి మార్కాస్‌లోకి దిగుతున్నా. తెల్లారుజామున రెండూముప్పావుకు మీరు డెనిస్ ఇంటిముందు ఉండండి. మిమ్మల్ని తీసుకెళ్తా’’ అన్నాడు.  
భోజనాలు ముగిశాయి. విన్సెంట్ ను వదలిపెట్టడానికి వెర్నభార్యాపిల్లలతో కలిసి సదనం వరకు తోడుగా వచ్చాడు. ఇంట్లో కులాసాగా కనిపించిన జాక్ దారిలో మాత్రం విపరీతమైన దగ్గుతో కువ్వయిపోయాడు. సదనంలోకి రాకుండానే ఇంటికెళ్లిపోయాడు. విన్సెంట్ సదనంలోకి అడుగుపెట్టగానే హెన్రీ డిక్రూక్ కనిపించాడు. చచ్చుకాలిని ఈడుస్తూ కుంపటితో తిప్పలు పడుతున్నాడు.
‘‘దండాలండి, అయవోరా!’’ చిన్నముఖంలో చాటంత నవ్వుతో పలకరించాడు డిక్రూక్. ‘‘ఈ కుంపట్ని రగిలించే మొనగాణ్ని ఈ ఊరిలో నానొక్కణ్నే బాబూ! నాకు దీని యవ్వారమేందో బాగా తెలుసు. ఇది మాచెడ్డది లెండి. కానీ దీని పప్పులు నా దగ్గర ఉడకవు.’’
సంచులన్నీ కుమ్మరించారు. కాస్త బొగ్గే తేలింది. డిక్రూక్ దాంతోటే కుంపటి వెలిగించాడు. గదిలో వెచ్చదనం నిండింది. డిక్రూక్ ఉత్సాహంగా కాలీడ్చుకుంటూ తిరుగుతుండడంతో, నెత్తిమీది ఎర్రమచ్చలోకి మరింత రక్తం చేసి అది బీట్ రూట్ ముక్కల్లా ఎర్రబడింది.   
డెనిస్ దంపతులు విన్సెంట్ చెల్లెళ్లతో.. 
చర్చిలా మారిన ఆ సదనంలో విన్సెంట్ తొలిబోధన వినేందుకు ఆ రాత్రి పెటీ వాస్మెస్ అంతా కదలి వచ్చింది. బెంచీలు నిండిపోగానే, ఇరుగు పొరుగువాళ్లు తమ ఇళ్లలోని పట్టెలూ, కుర్చీలూ తెచ్చివేశారు. మూడు వందలమందికిపైగా కిక్కిరిసిపోయారు. ఆ మధ్యాహ్నం కార్మికుల భార్యలు చూపిన ఔదార్యం, ఎట్టకేలకు తన సొంత ప్రార్థనామందిరంలో బోధించగలుతున్నాననే సంతోషంతో అతడు ఎంతో శ్రద్ధగా బోధించాడు. తన ఉపశమన వాక్యాలతో బొరైన్ల వదనాల్లోంచి విచారం పోయిందనుకున్నాడు.
‘‘మనం ఈ లోకానికి అతిథులుగా వచ్చామనే చక్కని మాటొకటి ఉంది. కానీ మనం ఏకాకులం కాము సుమా. దేవుడు మనతో ఉన్నాడు. మనం యాత్రికులం, మన జీవితం భువి నుంచి దివికి సాగే సుదీర్ఘ ప్రస్థానం. సంతోషం కంటే దుఃఖమే నయం. సంతోషంలోననూ హృదయం విచారంగా ఉంటుంది. వేడుకలు జరిగే ఇంటికి వెళ్లేకంటే శోకాల ఇంటికెళ్లడం మేలు. దుఃఖంతో మనసు తేటపడుతుంది.. క్రీస్తును నమ్మినవాళ్లకు ఎలాంటి బాధలూ ఉండవు. కోరికలు దరిజేరవు. నిరంతరం పునర్జీవిస్తూ, నిరంతరం చీకట్లోంచి వెలుగులోకి ప్రవేశిస్తూ ఉంటారు. తండ్రీ..! మమ్మల్ని చెడుకు దూరంగా ఉంచమని నిన్ను ప్రార్థిస్తున్నాం. మాకు దరిద్రమూ వద్దు, ధనమూ వద్దు ప్రభూ. మాకు తగిన ఆహారాన్ని ఇవ్వు. తథాస్తు..’
డిక్రూక్ భార్య అందరికంటే ముందుగా విన్సెంట్ చెంతకు వెళ్లింది. ఆమె కళ్లు సజలమయ్యాయి. ఉద్వోగంతో పెదవులు వణుకుతున్నాయి. ‘‘ఫాదర్! నా బతుకు దుర్భరం. నేను దేవుణ్ని ఎన్నడో వదిలేశాను. కానీ మీరు తిరిగి అతణ్ని నా చెంతచేర్చారు. కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు’’ అంది.
అందరూ వెళ్లిపోయాక విన్సెంట్ సదనానికి తాళం వేసి, ఆలోచనల ముసురుతో ఇంటిదారి పట్టాడు. ఆ రాత్రి బోధన, జనం స్పందన చూశాక బొరైన్లలో తనంటే బిడియం పోయి, తనపై నమ్మకం కుదిరిందని అర్థమైంది.  వాళ్లు తనను ఈశ్వరసేవకుడిగా పూర్తిగా అంగీకరించారు. ఎందువల్ల? ఈ మార్పుకు కారణేంటి? తను కొత్త చర్చి ఏర్పాటు చేసుకున్నందువల్ల అయితే కాదు; వీళ్లు అలాంటి వాటిని పట్టించుకోరు. మరి తను అధికారికంగా మతబోధకుడు అయినందువల్లనా? కాదు. తన నియామకం గురించి వీళ్లకు చెప్పనేలేదు. మరి, చక్కగా బోధించినందువల్లా? మరైతే ఇదివరకు పూరిగుడిసెట్లో, గుర్రాల పాకలోనూ ఇలాంటి బోధనలు చేశాడు కదా?
డెనిస్ దంపతులు అప్పటికే వంటగది పక్కనున్న కంతలాంటి గదిలో నిద్రకు జారుకున్నారు. బేకరిలోంచి  మధురమైన తాజా బ్రెడ్డు పరిమళం ఇంకా వస్తోంది. విన్సెంట్ వంటగదిలోని చిన్నబావిలోంచి నీళ్లు చేదుకుని గిన్నెలో పోసుకుని గదిలోకి వెళ్లాడు. గోడకు అద్దం తగిలించి ముఖం చూసుకున్నాడు. తన ఊహ నిజమే; జాక్ ఇంట్లో ముఖం కడుక్కున్నప్పుడు బొగ్గుమసి పూర్తిగా పోలేదు. కనురెప్పలు, చెంపలు ఇంకా నల్లగానే ఉన్నాయి. మసిముఖంతో చర్చిలో తను ఎలా బోధించిందీ, ఆ స్థితిలో తనను తండ్రి, స్ట్రీకర్‌లు చూసి ఉంటే ఎలా ఉండేదీ అన్న ఆలోచనలతో నవ్వొచ్చింది.  బ్రస్సెల్స్ నుంచి తెచ్చుకున్న సబ్బు అందుకున్నాడు. నురగ తీసి, ముఖానికి పట్టించుకోబోతుండగా హఠాత్తుగా ఏదో ఆలోచన తోసుకొచ్చింది. చేతులు స్తంభించిపోయాయి. అద్దంలో మరోసారి దీక్షగా చూసుకున్నాడు. దిబ్బలో అంటుకున్న బొగ్గునుసి నుదుటి రేఖల్లోనూ, కనురెప్పలపైనా, చెంపలపైనా, గడ్డంపైనా అలాగే ఉండిపోయంది.  
‘‘బహుశా ఇందుకే కావచ్చు, వాళ్లు నన్ను ఒప్పుకుంది. ఎట్టేకేలకు నేనూ వాళ్లలో ఒకణ్నయ్యాను.’’
చేతుల్లోని సబ్బునరగను గిన్నెలోనే కడిగేసుకుని, ముఖాన్ని ఏమాత్రం తాకకుండా అలాగే పక్కపైకి చేరుకున్నాడు. తర్వాత బోరినాజ్‌లో ఉన్నన్నాళ్లూ అందరిలా కనిపించడానికి రోజూ ఇంత బొగ్గునుసి తీసుకుని ముఖానికి పూసుకోవడం రోజువారీ పనైపోయింది.


(సశేషం)

.2 comments:

  1. వారిలో కలిసి ఉండాలంటే వారిలాగే ఉండాలి అప్పుడే అంగీకరిస్తారు ..జీవన సత్యమిది . బావుంది మోహన్ గారు ... ఇలా మాచేత చదివించే ప్రయత్నం చేస్తూ ... ఉన్నందుకు మీ కృషికి చాలా చాలా ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి వనజగారు. బాగా చెప్పారు. మన రాజకీయ నాయకులు, ఎన్జీఓలు పట్టించుకోనిది ఇదే. ఈ మధ్య ఒక సంఘసేవకుడి ఫొటో చూశాను. అనాథలకు పాతబట్టలు పంచుతున్నాడు, కాని తనేమో నాలుగైదు వేల ఖరీదైన జీన్సు ప్యాంటు, టీషర్లు, ఖరీదైన గాగుల్స్ పెట్టుకున్నాడు...

      Delete