Sunday, 18 October 2015

జీవన లాలస-10 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)


8. కర్రెముఖాలు

బోరినాజ్ బొగ్గు గనులు

రైలు దక్షిణాదిలోకి అడుగుపెడుతుండగా దిగంతాల్లో కొండల బారు కనిపించింది. అంతటా సమతలంగా ఉండే ఫ్లాండర్స్ నేలతో మొహం మొత్తిన విన్సెంట్‌కు వాటిని చూడగానే హాయిగా అనిపించింది. ఆసక్తీ పుట్టింది. ఒక్కో కొండా దేనికదే ప్రత్యేకం అన్నట్టు పైకి ఎగబాకి రకరకాల ఎత్తుల్లో ఉన్నాయి.
వింతైన ఆ పిరమిడ్లను కిటికీలోంచి తలబయటపెట్టి చూస్తూ.. ‘‘నల్ల ఈజిప్టు’’ అని గొణుక్కున్నాడు. అవేంటని పక్కనున్న ప్రయాణికుణ్ని అడిగాడు.
‘‘బొగ్గు గనుల్లోలంచి బొగ్గుతోపాటు బయటకు తెచ్చిన వ్యర్థాల దిబ్బలవి. ఓ దిబ్బపై చిన్న తోపుడుబండి కనిపిస్తోంది చూశారా? దాన్నలా చూస్తూ ఉండండి.’’
చూస్తూ ఉండగానే ఆ బండి ఒక పక్కకు ఒరిగి అందులోంచి నల్లదుమ్ములాంటిది దిబ్బపైన పడిపోయింది. ‘‘అదీ విషయం! ఆ దిబ్బలు అలా పెరుగుతుంటాయి. పాతికేళ్ల నుంచి అలా పెరగడం చూస్తూనే ఉన్నా’’ ప్రయాణికుడు వివరించాడు.
రైలు వాస్మెస్ లో ఆగింది. విన్సెంట్ చెంగున దిగాడు. వాస్మెస్ నిస్తేజపు లోయ మధ్యలో ఉంది. సూర్యుడు రోగిష్టిలా ఐమూలలో పడున్నాడు. విన్సెంట్ చుట్టుపక్కల దట్టమైన బొగ్గు నుసి ఆవరించింది. వాస్మెస్ అంతా కలిపి కొండపక్కని రెండు మురికి వంకర వీధులే. అన్నీఇటుక ఇళ్లే. ఎగువకు వెళ్లేకొద్దీ ఇళ్లు తగ్గి పెటీ వాస్మెస్ పల్లె మొదలవుతుంది.
విన్సెంట్ పొడవాటి కొండ పక్క నుంచి నడుస్తున్నాడు. ఆ పల్లె ఎందుకంత బోసిగా ఉందో అతనికి అర్థం కావడం లేదు. ఎక్కడా నరమానవుడు కనిపించడం లేదు. అరుదుగా ఎక్కడో ఓ ఆడమనిషి గుమ్మంలో నీరసంతో, ముభావంగా నిల్చుని కనిపిస్తోంది.  
పెటీ వాస్మెస్ గని కార్మికుల పల్లె. కొండ ఎగువన కుడి పక్కని ఇటుక ఇల్లొకటే దాని భాగ్యమంతా. అది బ్రెడ్డు అమ్మే జీన్ బాప్టిస్ట్ డెనిస్ ఇల్లు. విన్సెట్ వస్తోంది అక్కడికే. తమ ఊరికొచ్చే ఇవాంజెలిస్టుకు భోజనమూ, బసా కల్పిస్తానని డెనిస్ రివరెండ్ పీటర్సన్‌కు ఉత్తరం రాశాడు.  
డెనిస్ భార్య అతిథిని సాదరంగా ఆహ్వానించింది. బ్రెడ్లు పొంగుతున్న కమ్మని వాసన ఆవరించిన బేకరీ మీదుగా లోనికి తీసుకెళ్లి, ఇంటికప్పు చూర్ల కిందున్న చిన్ని గది చూపింది. అక్కడి కిటికీలోంచి పెటీ వాస్మెస్ బాగా కనిపిస్తోంది. గది వెనక వాసాలు అడ్డదిడ్డంగా కిందికి దిగాయి. గది నేలను ఇంటి ఇల్లాలు తన లావుపాటి బలమైన చేతులతో తోమి అద్దంలా ఉంచింది. విన్సెంట్ కు గది నచ్చింది. చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది. సామాన్లను సర్దుకోకుండానే గబగబా చెక్కమెట్లు దిగి వంటగదిలోకెళ్లి, తాను బయటికెళ్తున్నానని ఇంటావిడకు చెప్పాడు. 
‘‘భోజనం సంగతి మరచిపొయ్యేరు, మేం ఐదింటికల్లా భోంచేస్తాం’’ ఆమె గుర్తుచేసింది.
విన్సెంట్‌కు ఆమె తెగనచ్చేసింది. ఆమె దేన్నయినాసరే బుర్ర చించుకోకుండానే అర్థం చేసుకోగదలని అనిపించింది. ‘‘అలాగేనండి. ఓసారి ఊరిని అలా చూసొస్తా’ అన్నాడు.
‘‘ఈ సాయంత్రం మా ఇంటికి ఓ మిత్రుడు వస్తున్నాడు. మీరు అతణ్ని కచ్చితంగా కలవాలి. అతడు మార్కాస్‌ గనిలో మేస్త్రీ. మీరేం చెయ్యాలో బాగా చెబుతాడు.’’

వ్యాన్గో బస చేసిన డెనిస్ ఇల్లు

మంచు దట్టంగా కురుస్తోంది. విన్సెంట్ బాట పట్టాడు. గనుల పొగ్గొట్టాల్లోంచి వస్తున్న పొగ పెరళ్లను, పొలాలను నల్లబారుస్తోంది. డెనిస్ ఇంటికి తూర్పువైపు లోయలో కార్మికుల గుడిసెలు, పడమటివైపు విశాలమైన మైదానంలో నల్లదిబ్బలు, మార్కాస్ గనులు ఉన్నాయి. పల్లెజనమంతా ఆ గనుల్లోకి దిగుతుంటారు. మైదానం మధ్యలోంచి పల్లపు బాట వెళ్తోంది. దాని పక్కన ముళ్లపొదలు ఉన్నాయి. బుడిపెలు తిరిగిన చెట్ల మొదళ్లలోని వేళ్లు బాట మధ్యలోకి చొచ్చుకెళ్లాయి.  
చార్బోబోనాజ్ బెల్జిక్ కంపెనీకి ఉన్న ఏడు గనులల్లో మార్కాస్ ఒకటి. మిగతా వాటికంటే పాతదీ, బోరినాజ్ గనుల్లోకెల్లా ప్రమాదకరమైందీ. వందలమందిని పొట్టనబెట్టుకుంది. వాళ్లంతా బావుల్లోకి దిగుతూనే, ఎక్కుతూనో, విషవాయువుల్లోనో, పేలుళ్లలోనే, వరదల్లోనో, పాత సొరంగాల కూలడంతోనో చచ్చిపోయారు. గనుల పైన రెండు చిన్న ఇటుక భవనాలు ఉన్నాయి. అందులోని యంత్రాల సాయంతో బావుల్లోంచి బొగ్గును పైకి తీసి, అక్కడే నాణ్యతను బట్టి వేరుచేసి బళ్లకెత్తుతారు. పొడవాటి ఇటుక చిమ్నీలు రోజంతా చుట్టుపక్కల పరిసరాలపై కారునలుపు పొగను ఎగజిమ్ముతుంటాయి. మార్కాస్ చట్టుపక్కలా నిరుపేద కార్మికుల గుడిసెల ఉన్నాయి. వాటిమధ్య ఎండిపోయి, పొగతో నల్లబారిన చెట్లు, ముళ్లకంపల దళ్లు, పేడదిబ్బలు, బూడిద కుప్పలు, పనికిరాని బొగ్గుట్టలు, ఎత్తులో వాటన్నింటిని అధిగమిస్తూ పెద్ద నల్లదిబ్బా పరచుకుని ఉన్నాయి. మొత్తంగా అదో చింతాక్రాంత ప్రాంతం. విన్సెంట్ కు ప్రథమ దర్శనంలోనే ప్రతి ఒక్కటీ పాడిబడిపోయి బావురుమంటూ కనిపించింది.
‘‘దీన్ని నల్లదేశం అనడంతో వింతేమీ లేదు’’ మెల్లిగా అనుకున్నాడు.
విన్సెంట్ కాసేపక్కడ నిల్చున్నాక గేటుగుండా కార్మికులు బయటకు రాసాగారు. అందరూ చిరిగిన ముతక బట్టలతో, తలపై తోలు టోపీలతో ఉన్నారు. ఆడవాళ్ల బట్టలూ మగాళ్ల బట్టల్లాగే ఉన్నాయి.  అందరూ పొగ్గొట్టాలు తుడిచేవాళ్లలా ఆపాదమస్తకం మసిబారారు. బొగ్గు ధూళితో నలుపెక్కిన ముఖాల్లోంచి తెల్లటికళ్లు కొట్టొచ్చినట్టున్నాయి. వాళ్లను కర్రెముఖాలని ఊరకే అనలేదు. పొద్దున్నుంచీ భూమిలోపల చీకట్లో చెమటోడ్చి రావడంతో కళ్లు ఆ మధ్యాహ్నపు మందసూర్యకాంతిని కూడా తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి. కళ్లు చిట్లిస్తూ, తమలో తాము అస్పష్టంగా మాట్లాడుకుంటూ గబగబా గేటుదాటి వచ్చారు. ఆ బక్కప్రాణుల భుజాలు శ్రమభారంతో వంగిపోయి ఉన్నాయి.  
రైలు దిగి వచ్చేటప్పుడు ఆ పల్లె ఎందుకంత నిర్జనంగా కనిపించిందో అతనికిప్పుడు అర్థమైంది. అసలైన పెటీ వాస్మెస్ లోయలోని గుడిసెల గుంపు కాదు.. నేలకు ఏడు వందల అడుగుల కింద, జనమంతా పగలంతా శ్రమించే పాతాళ పద్మవ్యూహం.10. కార్మికుడి గుడిసె

‘‘జాక్ వెర్నీ కష్టపడి పైకొచ్చాడు. అయినా తోటి కార్మికులటే చాలా ప్రేమగా ఉంటాడు’’ భోజనాల వద్ద డెనిస్ భార్య అంది.
‘‘అంటే, పైకొచ్చిన వాళ్లందరూ పనివాళ్లతో స్నేహంగా ఉండరనా?’’ విన్సెంట్ సందేహం.
‘‘ఉండరు. వాళ్లు పెటీ వాస్మెస్ నుంచి వాస్మెస్‌కు బదిలీ కాగానే పూర్తిగా మారిపోతారు. డబ్బు కోసం యజమానులవైపు తిరుగుతారు. తామూ ఒకప్పుడు గనుల్లో పనిచేశామన్న సంగతే మరిచిపోతారు. అయితే జాక్ మాత్రం నిజాయతీపరుడు. నమ్మకస్తుడు. సమ్మెలప్పుడు కార్మికులు ఈయన మాట తప్ప ఇంకెవరి మాటా వినరు. కానీ పాపం, దురదృష్టవంతుడు, అట్టే కాలం బతకడు.’’
‘‘ఏం, ఏమైంది?’’
వ్యాన్గో తొలినాళ్లలో వేసిన గనికార్మికుల చిత్రం  
‘‘ఏముందీ.. మామూలే! ఊపిరితిత్తుల రోగం. గనుల్లోకి దిగిన వాళ్లందరికీ వస్తుంది. జాక్ ఈ చలికాలం గడిచే వరకు ఉండడం కష్టమే.’’
జాక్ వెర్నీ కాస్త ఆలస్యంగా వచ్చాడు. పొట్టిగా ఉన్నాడు, భుజాలు వంగాయి. కళ్లలో బొరైన్ల తాలూకు విచారం. ముక్కుపుటాల్లోంచి, కనుబొమల చివర్ల నుంచి, చెవుల్లోంచి వెంట్రుకలు పొడుచుకొచ్చాయి. తలేవెూ బట్టతల. 
విన్సెంట్ కార్మికులకు బోధకుడిగా వచ్చాడని తెలియగానే వెర్నీ పెద్ద నిట్టూర్పు విడిచాడు.
‘‘అయ్యా! మాకు సాయం చేయడానికి ఎంతో మంది ప్రయత్నిచారు. కానీ మా బతుకులు మాత్రం పిసరంత కూడా మారలేదు.’’
‘‘బోరినాజ్ పరిస్థితులు అంత హీనమా?’’ బోధకుడు అడిగాడు.
జాక్ కాసేపు మౌనంగా ఉండిపోయి, పెదవి విప్పాడు. ‘‘నామటుకైతే అలా లేవు. మా అమ్మ నాకు నాలుగు అక్షరమ్ముక్కలు నేర్పింది. మేస్త్రీనయ్యాను. వాస్మెస్‌కు వెళ్లే దిగువదారిలో చిన్న ఇల్లుంది. తిండికి ఇబ్బంది లేదు. ఇంకా ఏదో కావాలన్న ఆరాటమూ లేదు..’’
దగ్గు తీవ్రంగా పొడుచుకొచ్చి మాటలాపేశాడు. దగ్గుతో గుండెలు పగిలిపోతాయోనని విన్సెంట్ కు అనిపించింది. జాక్ గుమ్మం వద్దకెళ్లి రోడ్డుపై ఉమ్మేసి, తిరిగి ఆ వెచ్చని వంటగదిలోకొచ్చి కూర్చున్నాడు. ముక్కులోని, చెవుల్లోని వెంట్రుకలను, కొనబొమల వెంట్రుకలను మెల్లిగా పీక్కుంటూ ఉండిపోయాడు.
‘‘చూడండి విన్సెంట్! నేను మస్త్రీని అయ్యేనాటికే నాకు ఇరవైతొమ్మిదేళ్లు గడిచిపోయాయి. అప్పటికే ఊపిరితిత్తులు పాడయ్యాయి. అయినా కొన్నేళ్లుగా అంత ఇబ్బందేమీ లేదు. కానీ గనోళ్లు మాత్రం..’’ అంటూ డెనిస్ భార్య వైపు చూసి,
‘‘విన్సెంట్ గార్ని హెన్రీ డిక్రూక్ ఇంటికి తీసుకెళ్లనా?’’ అని అడిగాడు.
‘‘తీసికెళ్లండి! నిజాలు తెలియనివ్వండి’’ అందామె.
జాక్ విన్సెంట్ వైపు తిరిగి, క్షమాపణ స్వరంతో, ‘‘అయ్యా! నేను ఎంతైనా మేస్త్రీని. యాజమాన్యానికి కాస్త విశ్వాసంగా పడుండాలి. హెన్రీ అయితే మీకన్నీ విడమరచి చెబుతాడు’’ అన్నాడు.  
ఆ రోజు రాత్రి కోతపెట్టే చలిలో విన్సెంట్ జాక్ వెంట గని కార్మికులున్న లోయలోకి వెళ్లాడు. అన్నీ చెక్కలపకలతో చేసిన గుడిసెలు. కొండ వాలులో అడ్దదిడ్డంగా ఉన్నాయి. మురిగ్గా, పద్మవ్యూహంలా ఉన్న సందుల్లోంచి తెలిసిన మనిషి మాత్రమే దారి కనుక్కోగలడు. విన్సెంట్ జాక్ వెనక తడబడుతూ నడుస్తున్నాడు. రాళ్లపై, మొద్దులపై, చెత్తకుప్పలపై పడిపోతున్నాడు. లోయలో సగం కిందికి దిగి డిక్రూక్  పూరిగుడిసె చేరుకున్నారు. చిన్న కిటికీలోంచి వెలుతురు పడుతోంది. డిక్రూక్ భార్య తలుపు తీసింది.  
గుడిసె మిగతా గుడిసెల్లాంటిదే. ఒంటిగది, మట్టినేల, బోదకప్పు. గాలి లోపలికి చొరబడకుండా చెక్కపలకల సందుల్లో గోనెసంచులు కుక్కారు. మూలల్లోని రెండు మంచాలపై ముగ్గురు పిల్లలు నిద్రపోతున్నారు.  
ఒక పొయ్యి, టేబుల్, బెంచీలు, కుర్చీ, గోడకు తగిలించిన అలమారలో కొన్ని గిన్నెలే ఆ ఇంటి భోగభాగ్యాలు. మిగతా బొరైన్ల మాదిరే డిక్రూక్ కూడా పుణ్యానికో అమావాస్యకో కాస్త మాంసం కోసం ఒక మేకను, కొన్ని కుందేళ్లను సాకుతున్నాడు. పిల్లల మంచం కింద మేక నిద్రపోతోంది. కుందేళ్లు పొయ్యి వెనక గడ్డిలో ముడుచుకుని పడుకున్నాయి.
డిక్రూక్ భార్య ఇద్దర్నీ లోనికి ఆహ్వానించింది. ఆమె డిక్రూక్ ను పెళ్లాడకముందే అతనితో కలసి చాలా ఏళ్లు గనుల్లో పనిచేసింది. బొగ్గుబళ్లను పట్టాలపైకి లాగేది. ఒంటి జీవశక్తి మొత్తం హరించుకుపోయి, మనిషంతా పీక్కుపోయి ఇరవై ఆరేళ్లకే ముసలిదానిలా కనిపిస్తోంది. పొయ్యికి ఆనుకుని కుర్చీలో కూర్చున్నడిక్రూక్ జాక్ లోనికి అడగుపెట్టగానే చప్పున లేచి, ‘‘రారా వెర్నీ. ఇన్నాళ్లకైనా వచ్చావు. సంతోషం. నీ మిత్రుడికీ స్వాగతం’’ అన్నాడు.  
బోరినాజ్‌ గనులు చంపలేని ఒకే ఒక్కణ్నని డిక్రూక్ బడాయి పోతుంటాడు. ‘‘నేను చస్తే ముసలిముప్పులో మంచంలోనే చస్తాను. అంతేకాని గనులు నన్ను చంపలేవు. చంపనివ్వను’’ అంటుంటాడు.  
డిక్రూక్ నెత్తిపై కుడివైపు చాలాభాగంలో చర్మం దోక్కుపోయి వెంట్రుకల మధ్య మచ్చలా మారి ఎర్రగా మెరుస్తోంది. అది గని ప్రమాదం అందించిన కానుక. ఓ రోజు అతడు బోనులో బొగ్గుబావిలోకి దిగుతుండగా, బోను పట్టుతప్పి బండరాయిలా సర్రున పడిపోయింది. ఇరవై తొమ్మిది మంది సహ కార్మికులు చచ్చిపోయారు. బావిలో ఊతంగా పెట్టిన దూలాలు జాక్ పైన కూలడంతో ఓ కాలు నాలుగు చోట్ల విరిగిపోయింది. ఐదు రోజులు అక్కడే ఇరుక్కుపోయి, తర్వాత కాలీడ్చుకుంటూ బయటపడ్డాడు. మరోసారి గనిపేలుడులో అమాంతంగా ఎగిరిపడి బొగ్గుబండికి గుద్దుకున్నాడు. మూడు పక్కటెముకలు చిట్లిపోయాయి. అవి తిరిగి యథాస్థానానికి రాకపోవడంతో అతని నల్లముతకచొక్కా ఉబ్బుగా పైకి లేచి ఉంటుంది. కానీ అతడు వెన్నూచూపని యోధుడు. ఏదీ అతణ్ని అంతమొందించలేకపోయింది. అతడు కంపెనీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటాడు కనక ఎప్పుడూ ప్రమాదకరమైన బావుల్లోకే పంపుతుంటారు. అక్కణ్నుంచి బొగ్గు తీసుకురావడం చాలా కష్టం. నరకయాతన. పని ఎంత దుర్భరమైతే అంతగా కంపెనీపై నిప్పులు చెరుగుతాడు. శత్రులువ అతనికి తెలియకున్నా, అతడు చూడకున్నానిత్యం అతని ఎదురుగానే ఉంటాడు. లావుపాటి గడ్డం మధ్యలో చిన్న సొట్టతో డిక్రూక్ ముఖం చిన్నగా, అణచినట్టు ఉంటుంది.   
‘‘వ్యాన్గో గారూ! మీరు రావాల్సిన చోటికే వచ్చారు. మేం పశువులకంటే హీనంగా బతుకుతున్నాం. తెల్లారుజామున మూడింటికి గనుల్లోకి దిగుతాం. మధ్యలో తిండికి పావుగంట తప్పితే, సాయంత్రం నాలుగింటివరకు గొడ్డులా కష్టపడతాం. బావుల్లో కటిక చీకటి, భరించరాని వేడి. తట్టుకోలేక బట్టలు విప్పేస్తాం. గాలిలో నుసీ, నానా విషవాయువులూ ఉంటాయి కనక ఊరిపి కూడా సరిగ్గా తీసుకోలేం. బొగ్గు తవ్వాక నిల్చోడానికి కూడా స్థలం ఉండదు, వెూకాళ్లపై కూర్చుని పనిచేస్తుంటాం ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులోనే గనుల్లోకి దిగుతాం. ఆడంగులూ అంతే. ఇరవై ఏళ్లొచ్చేసరికి జొరాలూ, దగ్గూ, ఆయాసాలూ. పేలుళ్లలో, బావుల్లో చావకపోతే(తలపై ఎర్ర మచ్చ చూపుతూ), మహా అయితే నలబై ఏళ్ల వరకు బండిలాగి తర్వాత క్షయతో పోతాం! ఏం వెర్నీ, అబద్ధం చెబుతున్నానా?’’ అన్నాడు డెక్రూక్.
అతడు బోరినాజ్ యాసలో ఆవేశంతో మాట్లాడ్డంతో విన్సెంట్‌ అర్థం చేసుకోవడానికి తిప్పలుపడ్డాడు. డిక్రూక్ కళ్లు నల్లగా, ఉగ్రంగా ఉన్నా గడ్డం మధ్య సొట్టతో ముఖం కాస్త తమాషాగా కనిపిస్తోంది.  
‘‘లేదు మిత్రమా, నిజాలే చెబుతున్నావు’’ జాక్ బదులిచ్చాడు.  
డిక్రూక్ భార్య మూలనున్న మంచంపై కూర్చుంది. కిరోసిన్ దీపపు గుడ్డివెలుగులో ఆమె సగం వెలుతురులో, సగం చీకట్లో కనిపిస్తోంది. భర్త చెప్పే ఆ సంగతులు అప్పటికే వెయ్యిసార్లు విని ఉన్నామళ్లీ వింటోంది. బొగ్గు బళ్ల లాగుడు, మూడు కాన్పులు, చివికిన గుడిసెలో చలికాలాలు ఆమెను పీల్చిపిప్పి చేశాయి. డిక్రూక్ అవిటి కాలిని ఈడస్తూ విన్సెంట్ దగ్గరికొచ్చాడు.  
‘‘ఇంత గొడ్డుకష్టానికి మాకు దక్కుతున్నదేమిటి? జానెడు పూరి గుడిసె, చావకుండా ఉండడానికి పిడికెడు తిండి. మరి ఆ తినేదేమిటి? బ్రెడ్డూ, పులుపెక్కిన జున్నుముక్కా, పాల్లేని కాఫీ. యాడాదికో, రెండేళ్లకో కాసిని మాంసం ముక్కలూ! కంపెనీ ఒక రోజు కూలిలో యాభై సెంటైమ్‌లు కోసేస్తే ఆకలితో మాడిచస్తాం. అప్పుడిక బొగ్గు తేలేం. అందుకే కంపెనీ కూలి తగ్గించదు. అంతేకాని మాపై జాలీదయా ఏమీ లేవు. మా బతుకు దినదినగండం. రోగమొస్తే చేతిలో పైసా ఉండదు, కుక్కచావు చస్తాం. మా పెళ్లాంపిల్లలు ఇరుగుపొరుగువాళ్ల  దయాదాక్షిణ్యాలతో బతుకీడుస్తారు. ఎనిమిదేళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు.. ముప్పై రెండేళ్లు ఆ నల్లకూపాల్లో, తర్వాత  అదిగో ఆ బాటపక్క కొండలోని వల్లకాటికి చేరుకుని అన్నీ శాశ్వతంగా మరచిపోతాం.’’


(సశేషం)

No comments:

Post a Comment