Saturday, 10 October 2015

జీవన లాలస-1 (వ్యాన్గో జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్)


ఇర్వింగ్ స్టోన్

తెలుగు: పి.మోహన్

విన్సెంట్ వ్యాన్గో(1853-1890) కళాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన దేహాన్ని, ఆత్మను కళకు అర్పించి కళాయోధుడు. కళలోనే కాదు, జీవితంలోనూ అతనిది అంతర్ బహిర్ యుద్ధారావం. తను నమ్మిన విలువల కోసం, తను కలలు గన్న రంగుల లోకం కోసం తనను తాను దగ్ధం చేసుకున్న వెర్రివాడు. కల్మషం లేని కళ కోసమే కాకుండా మలినం లేని లోకం కోసం అతడు పడ్డ తపన ఒక వర్ణ మహాకావ్యం.
అతడు నడిచిన ముళ్లదారులను, పూలదారులను ఎంతో ఆర్తితో, ఉద్వేగంతో కళ్లకు కట్టిన నవల ఇర్వింగ్ స్టోన్ రాసిన ‘లస్ట్ ఫర్ లైఫ్’(జీవన లాలాస). 1934లో వెలువడిన ఈ నవల అప్పట్నుంచి అటు సాధారణ పాఠకులకు, ఇటు కళాభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది.
పదిహేనేళ్లుగా నా ఆలోచనల్లో ఒక భాగమైపోయిన ఈ నవల తెలుగులోకి అనువదించాలని ఎన్నోసార్లు అనుకుని, సాధ్యం కాదేమోనని మానేశాను. కానీ అది నన్ను వదల్లేదు. ఇక తప్పదని మొదలెట్టి, చిత్తు ప్రతి పూర్తి చేశాను. మిత్రులతో పంచుకోవడానికి బయటికి తీశాను. కళాసాహితి బ్లాగులో దీన్ని సచిత్రంగా క్రమం తప్పకుండా అందిస్తాను. మిత్రులకు నచ్చితే పదిమందికి పరిచయం చెయ్యండి. మీరు ఆదరిస్తారనే నమ్మకంతో..  లండన్
1.బాలల దేవత

‘‘వాన్గో గారూ! బాగా తెల్లారిపోయిందండోయ్,  ఇక లేవాలి.’’
విన్సెంట్ మెలకువగా నిద్రపోతూనే ఉర్సులా పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
‘‘నేనెప్పుడో లేచానండోయ్’’ అన్నాడు మెత్తగా.
ఆమె నవ్వింది.
‘‘లేదు, మీరు ఇప్పుడే లేచారు!’’ అంటూ వెళ్లిపోయింది. మెట్లు దిగి వంటగదిలోకి వెళ్తున్నట్టు అడుగుల సవ్వడితో తెలిసిపోయిందతనికి.
విన్సెంట్ చేతుల్ని వీపు వెనకాల మంచానికి ఆనించి హుప్ అంటూ ఒక్క ఉదుటున పడక దిగాడు. అతని భుజాలు, ఛాతీ విశాలంగా, చేతులు లావుగా, బలంగా ఉన్నాయి. బట్టలు వేసుకుని, జగ్గులోంచి చల్లనీరు తీసుకుని గడ్డం గీసుకోవడానికి సిద్ధమయ్యాడు.
విన్సెంట్‌కు రోజూ గడ్డం తీసుకోవడమంటే చాలా ఇష్టం. తొలుత కుడిచెంపపై నుంచి కిందికి నోటి కొసదాకా, తర్వాత పైపెదవి కుడివైపు, ఎడమవైపు, రాయిలాంటి గుండ్రటి పెద్ద గడ్డం కిందికి చురకత్తి సాగిపోయింది.
విన్సెంట్ గడ్డం తీసుకున్నాక బల్లపై ఉన్న బ్రాబంత్ గడ్డి, ఓక్ ఆకుల గుత్తిపై ముఖం ఉంచి గాఢంగా ఆఘ్రాణించాడు. వాటిని అతని తమ్ముడు థియో.. జుందర్త్ బయళ్ల నుంచి సేకరించి లండన్‌కు పంపాడు. హాలండ్ పరిమళాల ఆస్వాదనతో విన్సెంట్ దినచర్య అలా మొదలైంది.  
‘‘వాన్గో గారూ!’’ ఉర్సులా మళ్లీ తలుపు తట్టింది. ‘‘పోస్ట్ మేన్ ఈ ఉత్తరాన్ని ఇప్పుడే ఇచ్చిపోయాడు’’ అంటూ ఓ ఉత్తరం ఇచ్చి వెళ్లిపోయింది.
విన్సెంట్ కవరు చించి అమ్మ చేతిరాత గుర్తుపట్టాడు. ‘‘ప్రియమైన విన్సెంట్‌కు, మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయునది..’’
అతని ముఖంలో నీడ కదలాడింది. గూపుల్స్ గ్యాలరీలో విశ్రాంతి సమయంలో చదువుకోవచ్చనుకుంటూ జాబును ప్యాంటు జేబులో కుక్కుకున్నాడు.  చిక్కటి, పొడవైన, పసుప్పచ్చ ఛాయల ఎర్ర జుట్టును వెనక్కి దువ్వుకున్నాడు. ఇస్త్రీ చేసిన తెల్లచొక్కా వేసుకుని, పొడవాటి టై కట్టుకుని అల్పాహారానికి కిందికి దిగాడు. ఉర్సులా నవ్వు కోసం కూడా.
ర్సులా లోయరూ,  వితంతువైన ఆమె తల్లీ ఆ ఇంటి వెనకాల పెరట్లోని గదిలో బడి నడుపుతున్నారు. ఉర్సులా తండ్రి ఫ్రాన్స్ లో మతబోధకుడిగా పనిచేశాడు. ఉర్సులాకు పంతొమ్మిదేళ్లు. కాస్త పొట్టి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. పెద్దకళ్లు, కోమలైన గుండ్రటి ముఖం, కాంతులీనే దేహచ్ఛాయతో ముచ్చటగా ఉంటుంది. ఆమె అందమైన ముఖంపై తారాడే నవ్వును చూడ్డమంటే విన్సెంట్‌కు చాలా ఇష్టం. ఆ నవ్వు ఇంద్రధనుస్సులా కాంతులు చిందిస్తూ ఉంటుంది.
ర్సులా విన్సెంట్‌కు ఒద్దికగా, చకచకా వడ్డిస్తూ ప్రేమగా మాట్లాడుతోంది. అతనికి ఇరవై ఒకటో ఏడు నడుస్తోంది. తొలిసారి ప్రేమలో పడ్డాడు. జీవితం ఇప్పుడే మొదలైంది. తాను మిగతా జీవితమంతానూ ఇలాగే ఉర్సులా ఎదుట కూర్చుని భోంచేయగలిగితే అదృష్టవంతుణ్నే అనుకున్నాడు.
విన్సెంట్ 20ల తొలినాళ్లలో
ఉర్సులా(అసలు పేరు ఈజినీ)
ర్సులా ఓ పళ్లెంలో మాంసం ముక్కలు, గుడ్డు, కప్పు బ్లాక్ టీ పెట్టి, అతని పక్కనున్న కుర్చీలో కూర్చుంది. చేతుల్ని తల వెనక్కి పోనిచ్చి గోధుమరంగు కురుల్ని సుతిమెత్తగా ఒత్తుకుంది. అతనివైపు నవ్వుతూ చూస్తూ.. ఉప్పు, మిరియాల పొడి, వెన్న, కాల్చిన బ్రెడ్డు ముక్కలను ఒకొటొకటే త్వరత్వరగా అందించింది.
‘‘మీరు తెచ్చిన సంపెంగ మొక్క కాస్త పెరిగిందండోయ్! గ్యాలరీకి వెళ్లే ముందు ఓసారి చూస్తారా?’’  ఊరకే నాలుకతో పెదాలు తడుపుకుంటూ అడిగింది.   
‘‘ఓ..అలాగే! ఎక్కడుందో చూపిస్తారా మరి?’’
‘‘ఏం తమాషా మనిషి ఈయన? ఆ మొక్కను తానే స్వయంగా నాటాడు. ఇప్పుడేవెూ అదెక్కడుందో తెలియదంటున్నాడు!’’ అలవాటు ప్రకారం మెల్లగా గొణిగింది ఉర్సులా.
విన్సెంట్ గబగబా టీ తాగాడు. అతని ధోరణి అతని స్ఫురద్రూపం మాదిరే కాస్త తీవ్రంగా ఉంటుంది. ఉర్సులాకు ఏమని బదులివ్వాలో తోచలేదు. ఇద్దరూ పెరట్లోకి వెళ్లారు. అది ఏప్రిల్ మాసం. ఉదయం చల్లగా ఉన్నా, యాపిల్ చెట్లు మాత్రం అప్పటికే పుష్పించాయి. ఇంటికి, బడికి మధ్య చిన్న తోట ఉంది. విన్సెంట్ కొన్నాళ్ల కిందటే అక్కడ కొన్ని పూల పూలమొక్కలు నాటాడు. సంపెంగ మొక్క నేలను తొలుచుకుంటూ బయటకొస్తోంది. ఇద్దరూ దానికి చెరోవైపూ కూర్చున్నారు. ఒకరి తల ఒకరికి తగులుతోంది. ఉర్సులా సహజగంధ శిరోజాలు ఒత్తుగా ఉన్నాయి.  
‘‘ఉర్సులా గారూ!’’
‘‘ఊ..?’’  ఆమె కాస్త వెనక్కి కదిలింది. ఏమిటన్నట్టు అతనివైపు నవ్వుతూ చూసింది.
‘‘నేను.. నేను.. ఏమిటంటే..’’
‘‘ఏంటి బాబూ.. చెప్పాలనుకుంటున్నారు?’’ ఆమె పైకి లేచింది. అతడూ ఆమె వెనకే బడి దాకా వెళ్లాడు.
‘‘పిల్లలు బడికొచ్చే వేళయింది. మీకు గ్యాలరీకి ఆలస్యం కావడం లేదూ?’’
‘‘సమయముంది లెండి. నేను నడుస్తూ ముప్పావుగంటలో స్ట్రాండ్ కు వెళ్లగలను.’’
ఆమె ఇంకేమీ చెప్పలేక, రెండు చేతుల్నీ తల వెనక్కి తీసుకుని గాలికి తూలుతున్న వెంట్రుకలను పట్టుకుంది. ఆమె దేహపు ఒంపుసొంపులు ఆమె ఒడ్డూ పొడవుకు అతికినట్టు సరిపోయాయి.   
‘‘మా బడికి మీరిస్తానన్న ఆ బ్రాబంత్ చిత్రం సంగతి ఏం చేశారు?’’ ఆమె అడిగింది.
‘‘సీజర్ డి కాక్ స్కెచ్చుల్లో ఒకదాని నకలును ప్యారిస్ కు పంపాను. అతడు దాపై సంతకం చేసి మీకు పంపుతాన్నాడు.’’
‘‘అబ్బ ఎంత మంచిమాట చెప్పారు.. చాలా సంతోషం!’’ ఆమె సంబరంతో చప్పట్లు కొట్టింది. వెనక్కి ఓ గెంతు గెంతి మళ్లి ముందుకొచ్చి.. ‘‘మీరు కొన్నిసార్లు భలేగా నచ్చేస్తారండీ’’ అంది.
అతన్ని నిండుగా నవ్వుతూ చూసి అక్కణ్నుంచి వెళ్లబోయింది. విన్సెంట్ ఆమె చేయి పట్టుకున్నాడు. ‘‘నిన్న రాత్రి పడుకోబోయేముందు మీకో పేరు పెట్టాలని ఆలోచించాను. మిమ్మల్ని ‘బాలల దేవత అని పిలుస్తాను.’’
ర్సులా తల వెనక్కి వాల్చి కిలకిలా నవ్వింది.
‘‘బాలల దేవత! చాలా బావుందే. ఈ మాట మా అమ్మకు ఇప్పుడే చెప్పేయాలి!’’  అంటూ చేయి విడిపించుకుని, అతణ్ని వెనకవైపు నుంచి ఓరగా చూస్తూ ఇంట్లోకి పరిగెత్తింది.

2. గూపుల్స్ కంపెనీ
విన్సెంట్ టోపీ పెట్టుకుని, గ్లౌజులు తీసుకుని  క్లేప్‌హామ్ రోడ్డులోకొచ్చాడు. అక్కణ్నుంచి లండన్ నడిబొడ్డు దాకా ఇళ్లు అక్కడొకటి, ఇక్కడొకటి ఉన్నాయి.  ప్రతి ఇంటి పెరట్లోనూ రంగురంగుల వాసనపూలు విరగబూశాయి.
ఎనిమిదింబావైంది. గూపుల్స్ గ్యాలరీకి వెళ్లాల్సింది తొమ్మిదింటికి. అతడు చాలా వేగంగా నడుస్తున్నాడు. దూరం తరుగుతున్న కొద్దీ ఇళ్లు పెరుగుతున్నాయి. బతుకు తెరువుకోసం పనులకు వెళ్తున్నవాళ్లు కూడా చాలా మంది తగులుతున్నారు. వాళ్లపై అతనికి స్నేహభావం పొంగుకొచ్చింది.  ప్రేమలో పడితే ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్లకూ తెలుసు మరి.
అతడు థేమ్స్ నది గట్టు మీదుగా సాగి వెస్ట్ మినిస్టర్ వంతెన దాటాడు. వెస్ట్ మినిస్టర్ ఆబీ, పార్లమెంటు భవనాలను దాటి స్ట్రాండ్‌లోకొచ్చాడు. సౌతాంప్టన్ వీధిలోని గూపుల్స్ కంపెనీ లండన్ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. ఆ కంపెనీ కళాకారుల నుంచి చిత్రపటాలను కొని అమ్ముతుంటుంది. వాటిని అచ్చేస్తుంటుంది.
విన్సెంట్ మందపాటి తివాచీలు, ఖరీదైన పరదాలతో తీర్చిదిద్దిన ప్రధాన దుకాణం గుండా లోనికి వెళ్తూ ఓ వర్ణచిత్రాన్ని చూశాడు.  డ్రాగన్‌లాంటి ఆరు గజాల పొడువున్న ఓ జంతువూ, దానిపైన ఓ మనిషీ ఉన్నాడందులో. సైతాన్ ను చంపుతున్న మైఖేల్ దేవదూత చిత్రమది.

‘‘మీకో బంగీ వచ్చింది. లితోగ్రాఫుల టేబుల్‌పై ఉంది’’  ఓ గుమాస్తా విన్సెంట్‌కు చెప్పాడు.  
ప్రధాన దుకాణంలో మిలైస్, బోటోన్, టర్నర్ ల తైలవర్ణ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఆ హాలు వెనక ఉన్న రెండో దుకాణంలో ఎచ్చింగులు, లితోగ్రాఫులు అమ్ముతున్నారు. దాని పక్కనున్న మూడో దుకాణమే అసలైన దుకాణంలా కనిపిస్తోంది. అమ్మకాల్లో చాలా భాగం అక్కడే సాగుతున్నాయి.
నిన్న సాయంత్రం ఆఖరుగా బొమ్మలు కొన్న ఆడమనిషి విన్సెంట్‌కు గుర్తుకొచ్చింది. చిన్నగా నవ్వుకున్నాడు.
‘‘ఈ కుక్క బొమ్మ నాకేం నచ్చలేదు హ్యారీ!  నీకెలా అనిపిస్తోంది? కుక్క గత వేసవిలో బ్రైటన్‌లో నన్ను కరిచిన కుక్కలా ఉంది’’ అందామె తన భర్తతో.
‘‘చూడు సోదరా.. ఈ కుక్క మాకు అంత అవసరమంటావా? ఇవి మా ఆవిణ్ని ఠారెత్తిస్తాయి సుమా’’ భర్త విన్సెంట్‌తో అన్నాడు.
తాను అమ్మేదంతా చెత్త సరుకని విన్సెంట్‌కు తెలుసు. చాలామందికి తాము కొనే వాటి గురించి బొత్తిగా తెలియదు. నాసిరకం చిత్రానికి భారీ సొమ్ము చెల్లిస్తారు. అతడేం చేయగలడు? ప్రింట్లను ఎక్కువ అమ్మడమే అతని పనాయె.  
విన్సెంట్ ప్యారిస్ లోని గూపుల్స్ కార్యాలయం నుంచి వచ్చిన బంగీ విప్పాడు. అందులో సీజర్ డి కాక్ పంపిన ప్రింట్ ఉంది. కాక్ దానిపై ‘విన్సెంట్ కు,  ఉర్సులా లోయర్‌కు ప్రేమతో. నా నేస్తాల నేస్తాలు నాకూ నేస్తాలే!’ అని రాశాడు.
‘‘దీన్ని ఈ రాత్రి తనకిచ్చేటప్పుడు అడిగేస్తాను’’ విన్సెంట్ మనసులో అనుకున్నాడు. ‘‘రెండు నెలల్లో నాకు ఇరవై రెండేళ్లొస్తాయి. ఇప్పుడు నెలకు ఐదు పౌండ్లు సంపాదిస్తున్నాను. ఇక ఆలస్యం చెయ్యొద్దు.’’
వెనక గదిలో కాలం వేగంగా గడిచిపోయింది. విన్సెంట్  రోజుకు సగటున యాభై ఫొటోగ్రాఫులు అమ్ముతాడు.  తైలవర్ణ చిత్రాలు, ఎచ్చింగుల వ్యాపారంపైనా ఆసక్తి ఉంది. కంపెనీకి మరింత డబ్బొచ్చే పనిచేయడమంటే సంతోషం కూడా. తోటి గుమస్తాలంటే ఇష్టం. వాళ్లకూ అతడంటే ఇష్టం. యూరప్ సంగతులపై గంటలతరబడి కబుర్లు చెప్పుకుంటారు.
అతడు ఇదివరకు పరమ ముభావంగా ఉండేవాడు. ఎవరితోనూ స్నేహం చేసేవాడు కాదు. వింత మనిషి అని జనం అనుకునేవాళ్లు. కాని, ఉర్సులా అతణ్ని పూర్తిగా మార్చేసింది. కలివిడిగా, అందరూ ఇష్టపడేలా తీర్చిదిద్దింది. అతణ్ని అతని ఒంటరి లోకం నుంచి బయటకు రప్పించింది. అనుదిన జీవితంలోని మామూలు వ్యాపకాల్లో దాగిన మంచితనాన్ని చూడ్డానికి చేయూతనిచ్చింది.
సాయంత్రం ఆరు గంటలకు దుకాణం కట్టేశారు. విన్సెంట్ వెళ్లిపోతుండగా దుకాణం మేనేజర్ ఓబాక్ ఆపాడు. ‘‘మీ పెదనాన్న నువ్వెలా పనిచేస్తున్నావో చెప్పమని జాబు రాశారు. చాలా బాగా పనిచేస్తున్నామని రాశాను.’’
‘‘అదంతా మీ మంచితనమండీ.’’
‘‘దానికేంలే. నీ వేసవి సెలవుల తర్వాత నిన్ను ఆ వెనక గది నుంచి ఎచ్చింగులు, లితోగ్రాఫుల గదిలోకి మార్చాలనకుంటున్నాను.’’
‘‘ఈ స్థితిలో నాకది పెద్ద మేలవుతుంది. నేను త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాను..’’
‘‘అవునా? అయితే మరి పెద్ద విశేషమే. ఇంతకూ పెళ్లెప్పుడోయ్?’’
‘‘బహుశా, ఈ వేసవిలోనే.’’ నిజానికతడు పెళ్లి తారీఖు గురించి ఇప్పటిదాకా ఆలోచించనేలేదు.
‘‘సరే అబ్బాయ్, చాలా సంతోషం! ఈ ఏడాది మొదట్లోనే కదా నీ జీతం పెరిగింది. పెళ్లి తర్వాత మరోసారి ఖాయంగా పెంచేస్తాం.’’
(సశేషం)


2 comments: